కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ చేసిన సాహస కృత్యం

ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ చేసిన సాహస కృత్యం

ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ చేసిన సాహస కృత్యం

దాదాపు 300 సంవత్సరాల క్రితం, చరిత్రంతటిలో కేవలం కొంతమంది మాత్రమే ప్రారంభించడానికి సాహసించిన కార్యాన్ని ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ చేపట్టాడు. ఆయన బైబిలును తనకు పరిచయంలేని భాషలో అనువదించాలనుకున్నాడు.

గ్లూక్‌ దాదాపు 1654లో జర్మనీలోని హాల్ట్స్‌ దగ్గర్లోవున్న వెటీన్‌ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. వాళ్ల నాన్న ఒక లూథరన్‌ పాస్టర్‌ కాబట్టి, ఇంట్లోవున్న మతసంబంధ వాతావరణం దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని చిన్నారి గ్లూక్‌లో కలిగించింది. తన 21 ఏళ్ల వయసులో ఆయన జర్మనీలో వేదాంత సంబంధమైన చదువులను పూర్తిచేసి ఇప్పుడు లాట్వియా అని పిలవబడుతున్న దేశానికి తరలివెళ్లాడు. ఆ కాలంలో అనేకమంది స్థానికులు ప్రాథమిక విద్యను కూడా అభ్యసించలేదు, అంతేకాక ఆ భాషలో పుస్తకాలు అంతగా అందుబాటులో లేవు. గ్లూక్‌ ఇలా రాశాడు: “యౌవనస్థునిగా నేను ఈ దేశానికి వచ్చినప్పుడు నేను గమనించిన మొదటి కొరత ఏమిటంటే, లాట్వియన్‌ చర్చికి బైబిలు లేదు . . . ఆ భాషను నేర్చుకొని దానిమీద పట్టుసాధించాలని దేవుని ముందు తీర్మానించుకునేందుకు అది నన్ను ప్రోత్సహించింది.” అప్పుడు ఆయన లాట్వియన్‌ ప్రజలకు తమ భాషలో బైబిలు అందించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు.

అనువాదానికి ఏర్పాట్లు

గ్లూక్‌ స్థిరపడిన ప్రాంతాన్ని అప్పట్లో లివోనియా అని పిలిచేవారు, దానిని స్వీడన్‌ పరిపాలించేది. యోహానస్‌ ఫిశా అనే వ్యక్తి స్వీడన్‌ రాజుకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఆయన దేశంలో విద్యా ప్రమాణాలను పెంచడంతోపాటు లాభాలను కూడా గడించడానికి ఇష్టపడ్డాడు. గ్లూక్‌ లాట్వియన్‌ భాషలోకి బైబిలును అనువదించడం గురించి ఫిశాతో మాట్లాడాడు. రాజధాని నగరమైన రీగాలో ఫిశాకు ఒక ముద్రణాలయం ఉండేది. ఆయన లాట్వియన్‌ భాషా బైబిలును ముద్రిస్తే విద్యను ప్రోత్సహించవచ్చు, అదే సమయంలో, డబ్బు కూడా దండిగా సంపాదించుకోవచ్చు. బైబిలు అనువాదాన్ని ప్రారంభించడానికి అనుమతినివ్వాల్సిందిగా ఫిశా స్వీడన్‌ రాజైన చార్ల్స్‌ XIను కోరాడు. రాజు ఆ పనికి అనుమతినివ్వడంతోపాటు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. అనువాద పనిని ప్రారంభించడాన్ని అనుమతినిస్తూ 1681 ఆగస్టు 31న రాజముద్రగల ధృవీకరణ పత్రం జారీ అయింది.

ఆ మధ్యకాలంలో, అనువాద పని కోసం గ్లూక్‌ సిద్ధపడ్డాడు. ఆయన జర్మనీ దేశస్థుడు కాబట్టి మార్టిన్‌ లూథర్‌ అనువాదాన్ని ఉపయోగించి లాట్వియన్‌ బైబిలును అనువదించగలిగేవాడే. అయితే గ్లూక్‌ వీలైనంత శ్రేష్ఠమైన అనువాదాన్ని తయారుచేయాలనుకున్నాడు, అలా అనువదించాలంటే ఆదిమ హీబ్రూ, గ్రీకు నుండి బైబిలును అనువదించాలనే నిర్ధారణకు వచ్చాడు. గ్లూక్‌కు బైబిలు సంబంధిత భాషతో అంతగా పరిచయం లేదు కాబట్టి ఆయన హీబ్రూ, గ్రీకు భాషల అధ్యయనానికి జర్మనీలోని హామ్‌బర్గ్‌కు వెళ్లాడు. అక్కడున్నప్పుడు ఆయన లాట్వియన్‌ భాషతోపాటు బైబిలు సంబంధిత గ్రీకు భాషను అధ్యయనం చేయడంలో ఆయనకు లివోనియా దేశస్థుడైన యానిస్‌ రాటర్స్‌ అనే పాదిరి సహాయం చేసివుండవచ్చు.

ఏళ్ల తరబడి పని, ఏళ్ల తరబడి నిరీక్షణ

గ్లూక్‌ 1680లో తన భాషా శిక్షణను పూర్తిచేసుకొని లాట్వియాకు తిరిగొచ్చి పాస్టర్‌గా సేవచేయడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే ఆయన తన అనువాదాన్ని ప్రారంభించాడు. ఆయన 1683లో, అలుక్స్నిలోని పెద్ద పారిష్‌కు పాస్టర్‌గా సేవలందించే క్రొత్త నియామకాన్ని పొందాడు, ఆ ప్రాంతం ఆయన బైబిలును అనువదించిన స్థలంగా పేరుపొందింది.

ఆ కాలంలో అనేక బైబిలు సంబంధిత పదాలను, విషయాలను వివరించే పదాలు లాట్వియన్‌ భాషలో లేవు. అందుకే గ్లూక్‌ తన అనువాదంలో కొన్ని జర్మన్‌ పదాలను ఉపయోగించాడు. అయితే దేవుని వాక్యాన్ని లాట్వియన్‌ భాషలోకి అనువదించడానికి ఆయన శాయశక్తులా కృషిచేశాడు, ఆయన అనువాదం శ్రేష్ఠమైనదని కూడా నిపుణులు అంగీకరిస్తారు. గ్లూక్‌ క్రొత్త పదాలను కూడా రూపొందించాడు, ఆయన రూపొందించిన అనేక పదాలు ఇప్పుడు లాట్వియన్‌ భాషలో విరివిగా వాడుకలో ఉన్నాయి. “ఉదాహరణ,” “విందు,” “యోధుడు,” “వేగు చూడడం,” “సాక్ష్యమివ్వడం” వంటి కొన్ని పదాలను వివరించడానికి ఉపయోగించే లాట్వియన్‌ భాషా పదాలు ఆయన రూపొందించినవే.

యోహానస్‌ ఫిశా, అనువాదపు పని ఎలా జరుగుతుందో స్వీడన్‌ రాజుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాడు, గ్లూక్‌ క్రైస్తవ గ్రీకు లేఖనాలను 1683కల్లా పూర్తిచేశాడని వారి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వెల్లడిచేస్తున్నాయి. ఆయన పూర్తి బైబిలును 1689కల్లా పూర్తిచేశాడు, ఆయన తన ఈ సాహసకృత్యాన్ని ఎనిమిది ఏళ్లలోనే పూర్తిచేశాడు. * అనువదించబడిన బైబిలు ముద్రించబడడానికి ఎంతో జాప్యం జరిగింది, అయినా 1694లో ఆయన తన లక్ష్యాన్ని సాధించాడు, లాట్వియన్‌ బైబిలు ప్రజలకు పంచిపెట్టబడడానికి ఆ సంవత్సరంలో ప్రభుత్వం నుండి అనుమతి లభించింది.

కొంతమంది చరిత్రకారులు గ్లూక్‌ బైబిలు అనువాదాన్ని ఆయనే స్వయంగా చేసివుండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఆయన లూథర్‌ అనువాదాన్ని చూసి అప్పటికే లాట్వియన్‌ భాషలోకి తాను అనువదించిన మూలపాఠంలో కొన్ని మార్పులు చేశాడనడంలో సందేహంలేదు. అయితే ఆయన అలా తన అనువాదంలో కొంతభాగాన్నే మార్చాడు. వేరే అనువాదకులు ఎవరైనా ఆయనతోపాటు పనిచేశారా? గ్లూక్‌ అనువాదపు పని చేస్తున్నప్పుడు ఆయనకు ఒక సహాయకుడు ఉండేవాడు, ప్రూఫ్‌రీడింగ్‌ విషయంలో, అనువాద నాణ్యతను పరీక్షించడంలో ఇతరులు కూడా ఆయనకు చేయూతనిచ్చారు. అసలు అనువాదమైతే వారు చేయనట్లు అనిపిస్తుంది. కాబట్టి, దాని అసలు అనువాదకుడు గ్లూక్‌ మాత్రమే అని చెప్పవచ్చు.

లిఖిత లాట్వియన్‌ భాషా వికాసంలో గ్లూక్‌ అనువాదం ఒక మైలురాయి అని చెప్పవచ్చు, అయితే దానివల్ల ఎంతో ప్రాముఖ్యమైన ఫలితం లభించింది. చిట్టచివరికి, లాట్వియన్‌ ప్రజలు దేవుని వాక్యాన్ని తమ మాతృభాషలో చదివి ప్రాణరక్షక బోధలను గ్రహించగలిగారు. ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ తమ కోసం చేసిన కృషిని వారు మరువలేదు. అలుక్స్నివాసులు, 300 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా గ్లైకా ఒజాలై, లేక గ్లూక్‌ ఓక్‌ చెట్లుగా పిలవబడే రెండు ఓక్‌ చెట్లను శ్రద్ధగా చూసుకుంటున్నారు. లాట్వియన్‌ బైబిలుకు జ్ఞాపకార్థంగా గ్లూక్‌ వాటిని నాటాడు. వివిధ బైబిలు అనువాదాలున్న చిన్న మ్యూజియమ్‌ అలుక్స్నిలో ఉంది, వాటితోపాటు మొదటిసారి ముద్రించబడిన గ్లూక్‌ బైబిలు అనువాదం కూడా ఉంది. అలుక్స్ని కోట్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ (వార్తాహర చిహ్నం) బైబిలుతోపాటు గ్లూక్‌ తన అనువాదం పూర్తిచేసిన 1689వ సంవత్సరాన్ని చూపిస్తోంది.

ఆయన చేపట్టిన తర్వాతి పని

గ్లూక్‌ లాట్వియాకు వచ్చిన కొంతకాలానికే రష్యన్‌ భాషను నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ భాషలో బైబిలును అనువదించాలనే తన మరో కోరికను కూడా తీర్చుకుంటున్నట్లు 1699లో రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆయన 1702లో రాసిన ఒక ఉత్తరంలో తాను లాట్వియన్‌ బైబిలును సవరించడం మొదలుపెట్టానని పేర్కొన్నాడు. అయితే బైబిలు అనువాదానికి అనుకూలమైన పరిస్థితులు తెరమరుగవడం మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాలు శాంతిని అనుభవించిన లాట్వియా యుద్ధభూమిగా మారింది. రష్యా సైన్యాలు 1702లో స్వీడన్‌ దేశాన్ని ఓడించి అలుక్స్ని పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గ్లూక్‌ను, ఆయన కుటుంబాన్ని దేశం నుండి బహిష్కరించి రష్యాకు పంపించారు. * ఆ కష్ట కాలాల్లో, గ్లూక్‌ తాను తయారుచేసిన క్రొత్త లాట్వియన్‌ బైబిలు రాతప్రతులను, రష్యన్‌ అనువాదాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన 1705లో మాస్కోలో మరణించాడు.

లాట్వియన్‌, రష్యన్‌ భాషల్లో ఆయన ఆ తర్వాత తయారుచేసిన అనువాదాలు తెరమరుగవడం అపారమైన నష్టమే. అయితే నేటికీ లాట్వియన్‌ బైబిలు చదివే ప్రతి ఒక్కరూ గ్లూక్‌ మొదటి అనువాదం నుండి ప్రయోజనాలు పొందుతున్నారు.

సామాన్య ప్రజలు మాట్లాడే భాషల్లోకి బైబిలును అనువదించే బృహత్‌కార్యాన్ని చేపట్టిన అనేకమందిలో ఆర్న్స్‌ట్‌ గ్లూక్‌ కేవలం ఒక్కడు మాత్రమే. దానివల్ల, భూమ్మీదున్న దాదాపు ప్రతీ భాషా గుంపువారు దేవుని వాక్యాన్ని చదివి దాని అమూల్యమైన సత్యపు జలాలను స్వీకరించగలరు. అవును, 2000 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్న బైబిలు ద్వారా యెహోవా తననుతాను అన్నిరకాల ప్రజలకు బయలుపరచుకుంటూనే ఉన్నాడు.

[అధస్సూచీలు]

^ పేరా 10 ఈ అనువాదాన్ని ఇతర అనువాదాలతో పోల్చి చూస్తే, ఆంగ్లంలో ఉన్న ఆథరైజ్డ్‌ వర్షన్‌, లేక కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ను పూర్తిచేయడానికి 47 మంది విద్వాంసులు ఏడేళ్లు శ్రమించారు.

^ పేరా 14 గ్లూక్‌ మరణానంతరం ఆయన పెంపుడు కూతురు సజీవంగా ఉంది, ఆమె రష్యా చక్రవర్తి అయిన పీటర్‌ ద గ్రేట్‌ను పెళ్లాడింది. ఆ రష్యా చక్రవర్తి 1725లో మరణించినప్పుడు ఆమె రష్యా మహారాణి క్యాథరిన్‌ I అయింది.

[13వ పేజీలోని చిత్రం]

గ్లూక్‌ అనువాదం

[14వ పేజీలోని చిత్రం]

గ్లూక్‌ బైబిలును అనువదించిన పట్టణంలో యెహోవాసాక్షులు బైబిలును బోధిస్తున్నారు