కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

హవ్వతో మాట్లాడిన సర్పానికి కాళ్ళు ఉండేవా?

ఆదికాండము 3:14లో నమోదు చేయబడినట్లుగా, యెహోవా దేవుడు ఏదెను తోటలో హవ్వను మోసం చేసిన సర్పంతో ఇలా అన్నాడు: “నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.” హవ్వను ప్రలోభపెట్టడానికి ఉపయోగించబడిన సర్పానికి అంతకుముందు కాళ్ళు ఉండేవనిగానీ, ఆ తర్వాత అది వాటిని కోల్పోయిందనిగానీ బైబిల్లో ఖచ్చితంగా పేర్కొనబడలేదు. ఆదికాండము 3:14లోని మాటలనుబట్టి కొంతమంది అలా అనుకున్నా, సర్పం శపించబడడానికి ముందు దానికి కాళ్ళుండేవనే ముగింపుకు మనం రానవసరం లేదు. ఎందుకు?

ఎందుకంటే, యెహోవా నిజానికి, ఆ అల్పప్రాణిని తప్పుడు ఉద్దేశాలతో వాడుకున్న అదృశ్య ఆత్మప్రాణియైన సాతానుకే తీర్పు తీర్చాడు. సాతానును బైబిలు, “అబద్ధమునకు జనకుడు,” “ఆదిసర్పము” అని వర్ణిస్తోంది. ఈ రెండు పదబంధాలు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేలా హవ్వను ప్రలోభపెట్టేందుకు సాతాను దృశ్య జంతువును అంటే సర్పాన్ని తన సాధనంగా ఉపయోగించుకున్నాడనే విషయాన్ని సూచిస్తున్నాయి.​—⁠యోహాను 8:⁠44; ప్రకటన 20:⁠2.

దేవుడు సర్పాలను సృష్టించాడు, సాతాను హవ్వను మోసగించకముందే ఆదాము వాటికి ఆ పేరునిచ్చాడు. హవ్వతో మాట్లాడిన వివేచనలేని ఆ సర్పం ఆమెను మోసగించలేదు. తనను ఉపయోగించుకునేది సాతానేనని ఆ సర్పానికి తెలిసుండకపోవచ్చు, అంతేకాదు దానికి, అవిధేయత చూపించిన ఇరుపక్షాలను దేవుడు ఎందుకు శపించాడో కూడా అర్థమైయుండకపోవచ్చు.

దేవుడు ఆ సర్పం కడుపుతో ప్రాకుతూ మన్ను తింటుందని ఎందుకు శపించాడు? సర్పం స్వాభావికంగానే మన్ను తింటున్నట్లుగా దాని నాలుకను ఆడిస్తూ, కడుపుతో ప్రాకడం సాతాను హీనస్థితికి దిగజారడాన్ని సరిగానే సూచిస్తుంది. అంతకుముందు దేవుని దూతగా ఉన్నతస్థితిలో ఉన్న అతడు, ఆ తర్వాత పాతాళలోకము అని బైబిలు వర్ణిస్తున్న హీనస్థితికి త్రోసివేయబడ్డాడు.​—⁠2 పేతురు 2:4.

అంతేకాక, అక్షరార్థమైన సర్పము మానవుని మడిమెను ఎలా గాయపరుస్తుందో, అలాగే హీనస్థితికి దిగజారిన సాతాను దేవుని ‘సంతానమును’ ‘మడిమె మీద కొడతాడు.’ (ఆదికాండము 3:⁠15) ఆ సంతానముయొక్క ప్రాథమిక భాగం యేసుక్రీస్తే అని రుజువయ్యింది, ఆయన సాతాను అనుచరుల చేతుల్లో తాత్కాలికంగా బాధననుభవించాడు. కానీ క్రీస్తు, పునరుత్థానం చేయబడిన ఆయన అభిషిక్త అనుచరులు చివరకు సూచనార్థక సర్పం తలను శాశ్వతంగా చితగ్గొడతారు. (రోమీయుల 16:20) కాబట్టి దేవుడు, దృశ్య సర్పాన్ని శపించడం, అదృశ్య “ఆది సర్పము”గావున్న అపవాదియైన సాతాను హీనస్థితికి దిగజారడాన్ని, చివరకు నాశనం చేయబడడాన్ని సరిగానే చిత్రీకరిస్తుంది.