కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడ్డాం’

మనం ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడ్డాం’

మనం ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడ్డాం’

“నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.”​—⁠కీర్తన 139:14.

ఈ ప్రకృతిసిద్ధ ప్రపంచం అద్భుతమైన సృష్టికార్యాలతో నిండివుంది. ఇవన్నీ ఎలావచ్చాయి? దీనికి జ్ఞానియైన సృష్టికర్త ప్రస్తావన లేకుండానే జవాబు కనుగొనవచ్చని కొందరు నమ్ముతారు. అకారణంగా సృష్టికర్తను విస్మరించడం ప్రకృతిని అర్థం చేసుకునే మన సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని మరికొందరు నమ్ముతారు. భూమ్మీది జీవరాశులు ఎంతో సంక్లిష్టమైనవని, అవి విభిన్న రకాలుగా ఉన్నాయని వారు నమ్ముతారు. అంతేకాక అవి అకస్మాత్తుగా ఉద్భవించాయనడం ఊహాతీతమని కూడా మీరు అనవచ్చు. కొందరు శాస్త్రజ్ఞులతోసహా అనేకులకు అందుబాటులోవున్న ఈ రుజువులు, ఈ విశ్వానికి జ్ఞానియైన, శక్తిమంతుడైన, శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడని చూపిస్తున్నాయి. *

2 అద్భుతమైన సృష్టికార్యాల విషయంలో వాటిని చేసిన సృష్టికర్త స్తుతిపాత్రుడని నమ్మినవారిలో ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ఒకరు. నేటి విజ్ఞానశాస్త్ర శకానికి చాలాకాలం క్రితమే దావీదు జీవించినా తనచుట్టూ దేవుని అద్భుతమైన సృష్టికార్యాల ఉదాహరణలున్నట్లు ఆయన గ్రహించాడు. దేవుని సృజనాత్మక శక్తిపట్ల అత్యంత భక్తిపూర్వక భయంతో ఉండేందుకు దావీదుకు తన శరీరాన్ని పరిశీలించుకోవడం సరిపోతుంది. ఆయనిలా వ్రాశాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.”​—⁠కీర్తన 139:​14.

3 హృదయపూర్వక ధ్యానం ద్వారా దావీదు ఈ గట్టి నమ్మకాన్ని పొందాడు. మానవుల ఆవిర్భావం విషయంలో నేటి పాఠశాల కోర్సులు, సమాచార మాధ్యమాలు విశ్వాసాన్ని నాశనంచేసే సిద్ధాంతాలతో నిండిపోయాయి. దావీదులాంటి విశ్వాసం మనకూ ఉండాలంటే మనం కూడా హృదయపూర్వకంగా ధ్యానించాలి. ప్రత్యేకంగా సృష్టికర్త ఉనికి, ఆయన పాత్ర వంటి ప్రాథమిక అంశాల్లో ఇతరులను మనకోసం ఆలోచించేందుకు అనుమతించడం ప్రమాదకరం.

4 అంతేకాక, యెహోవా కార్యాలను ధ్యానించడం ఆయనపట్ల మనకున్న ప్రేమను, కృతజ్ఞతాభావాన్ని పెంచి, భవిష్యత్తు విషయంలో ఆయన చేసిన వాగ్దానాలపట్ల మనకు నమ్మకాన్నిస్తుంది. అది తిరిగి, మనం యెహోవాను మరింత ఎక్కువగా తెలుసుకొని ఆయనను సేవించేలా మనల్ని పురికొల్పగలదు. కాబట్టి మనం ‘కలుగజేయబడిన విధము ఆశ్చర్యకరమనే’ దావీదు నిర్ధారణను ఆధునిక విజ్ఞానశాస్త్రం ఎలా ధ్రువీకరించిందో పరిశీలిద్దాం.

అద్భుతమైన మన శరీరాభివృద్ధి

5“నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.” (కీర్తన 139:​13) మనమందరం మన తల్లి గర్భంలో ఈ వ్యాకం చివరనున్న విరామచిహ్నంకన్నా చిన్నగావుండే ఏకైక జీవకణంగా మన ఉనికిని ఆరంభించాం. ఆ సూక్ష్మకణం ఎంత సంక్లిష్టంగా ఉందంటే దానిని చిన్నసైజు రసాయన ప్రయోగశాల అని పిలవొచ్చు! అది వేగంగా వృద్ధిచెందుతుంది. గర్భస్థ శిశువుగావున్న మీకు రెండునెలలు నిండేసరికే మీ ముఖ్యావయవాలు రూపుదిద్దుకున్నాయి. వాటిలో మీ అంతరింద్రియాలు లేదా మూత్రపిండాలు కూడా ఉన్నాయి. మీరు జన్మించేసరికి మీ మూత్రపిండాలు మీ రక్తాన్ని వడగట్టేందుకు అంటే ప్రయోజనకర పదార్థాలు నష్టపోకుండా చూస్తూ విషపదార్థాల్ని, అదనపు నీటిని తొలగించేందుకు సిద్ధంగావుంటాయి. మీ మూత్రపిండాలు రెండూ ఆరోగ్యంగావుంటే అవి ప్రతీ 45 నిమిషాలకు మీ రక్తంలోని నీటిని శుభ్రంగా వడగడతాయి. వయోజనుల్లో దాదాపు 5 లీటర్ల నీరు ఉంటుంది!

6 మూత్రపిండాలు మీ రక్తంలోని ఖనిజ పరిమాణాన్నే కాక, దానిలోని ఆమ్ల ప్రభావాన్ని, రక్త పీడనాన్ని నియంత్రించడానికి కూడా దోహదపడతాయి. అవి మీ ఎముకలు సరిగా పెరగడానికి, వాటిలో ఎర్రరక్తకణాల ఉత్పత్తిని ఎక్కువచేసే ఎరిత్రోపోయిటిన్‌ అనే హార్మోన్‌ను ఉత్పతి చేయడానికి అవసరమైన డి విటమిన్‌ను వేరే రూపంలోకి మార్చడం వంటి ఇతర ప్రాముఖ్యమైన పనులు ఎన్నో చేస్తాయి. కాబట్టి మూత్రపిండాలు, “నిపుణతగల శరీర రసాయన శాస్త్రవేత్తలు” అని పిలవబడడంలో ఆశ్చర్యం లేదు. *

7“నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగైయుండలేదు.” (కీర్తన 139:​15) మొదటి జీవకణం విభజించబడి, క్రొత్త జీవకణాల విభజన కొనసాగింది. అనతికాలంలోనే ఆ జీవకణాలు వివిధరకాల జీవకణాలుగా లేదా ప్రత్యేక జీవకణాలుగా మారి నాడీకణాలుగా, మాంసకణాలుగా, చర్మకణాలుగా, తదితర జీవకణాలుగా తయారయ్యాయి. ఒకే రకానికి చెందిన జీవకణాలు ఒకదగ్గర సమకూడి కణజాలముగా ఆ తర్వాత అవయవాలుగా రూపొందాయి. ఉదాహరణకు, గర్భధారణ తర్వాత మూడవ వారంలో మీ అస్థిపంజరం రూపుదిద్దుకోవడం ఆరంభిస్తుంది. మీకు ఏడు వారాల వయసు వచ్చేటప్పటికి, కేవలం ఒక అంగుళం పొడవున్న మీ శరీరంలో అప్పటికే ఇంకా గట్టిపడని, లేలేత ఎముకలు మొత్తం 206 ఏర్పడ్డాయి.

8 ఎదుగుదలకు సంబంధించిన ఈ అద్భుతమైన ప్రక్రియ మానవ నేత్రాలకు అదృశ్యంగానే, అంతా భూమిలోవున్న అగాధస్థలాల్లో దాగివున్నట్లుగా మీ తల్లి గర్భంలోనే చోటుచేసుకుంది. అవును, మనమెలా వృద్ధిచెందుతామనే విషయం మానవులకు ఇంకా తెలియదు. ఉదాహరణకు, మీ జీవకణాల్లోని నిర్దిష్టమైన జన్యువులు శరీరంలోని వివిధ భాగాలుగా మారే ప్రక్రియను ఏది చైతన్యవంతం చేసింది? ఎట్టకేలకు విజ్ఞానశాస్త్రం ఆ విషయాన్ని కనుగొనవచ్చు, కానీ దావీదు ఆ తర్వాత చెప్పినట్లు మన సృష్టికర్తయైన యెహోవాకు మాత్రం ఎల్లప్పుడూ సమస్తం తెలుసు.

9“నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.” (కీర్తన 139:​16) మీ మొదటి జీవకణంలో మీ శరీరపు ప్రణాళికంతా నిక్షిప్తమైవుంది. మీరు జన్మించకముందు గర్భంలో తొమ్మిది నెలలపాటు ఎదగడాన్ని, ఆ తర్వాత రెండు దశాబ్దాలపాటు పెద్దవారిగా ఎదగడాన్ని ఈ ప్రణాళికే నిర్దేశించింది. ఈ సమయమంతటిలో మీ శరీరం దశలవారీగా ఎదిగింది, ఆ దశలన్నింటిని ఆ తొలి జీవకణంలో ప్రణాళికాబద్ధం చేయబడిన సమాచారమే నిర్దేశించింది.

10 జీవకణాల గురించి జన్యువుల గురించి దావీదుకు ఎలాంటి పరిజ్ఞానమూ లేదు, ఆయన దగ్గర సూక్ష్మదర్శిని కూడా లేదు. తన శరీరం ఎదగడానికి, ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు ఆయన సరిగా గ్రహించాడు. గర్భస్థ పిండం ఎలా ఎదుగుతుందో దావీదుకు కొంతమేర తెలిసివుండవచ్చు, అందువల్ల ముందస్తు రూపకల్పన, కాలపట్టిక ప్రకారమే ప్రతీ దశ చోటుచేసుకోవాలని ఆయన తర్కించగలిగాడు. ఈ రూపకల్పనను ఆయన కావ్య భాషలో దేవుని “గ్రంథములో లిఖితము లాయెను” అని వర్ణించాడు.

11 మీరు మీ తల్లిదండ్రుల నుండి తాతముత్తాతల నుండి వారసత్వంగా పొందిన లక్షణాలను అంటే మీ ఎత్తును, ముఖరూపాన్ని, కళ్లను, జుట్టురంగును వేలాది ఇతర లక్షణాలను మీ జన్యువులు నిర్ణయిస్తాయనే విషయం నేడు విదితమే. మీ జీవకణాల్లో జన్యువులు వేలసంఖ్యలో ఉండడమేకాక, ప్రతీ జన్యువు DNA (డియోక్సిరైబోన్యూక్లిక్‌ ఆసిడ్‌)తో తయారైన పెద్ద గొలుసులో భాగంగా ఉంటుంది. మీ శరీర నిర్మాణానికి సంబంధించిన నిర్దేశాలు మీ వ్యక్తిగత DNA రసాయన నిర్మాణంలో “లిఖితములై” ఉన్నవి. క్రొత్త జీవకణాలు ఏర్పడేందుకు లేదా పాత జీవకణాల స్థానంలో కొత్తవి వచ్చేందుకు మీ జీవకణాలు విభజించబడిన ప్రతీసారీ మీ DNA ఆ నిర్దేశాలను వాటికి అందజేస్తుంది, అలా మీరు జీవించి ఉండడమే గాక, మీ ప్రాథమిక రూపం కూడా మారకుండా ఉంటుంది. మన పరలోక సృష్టికర్త శక్తికి, జ్ఞానానికి అదెంత అద్భుతమైన ఉదాహరణో కదా!

మన ప్రత్యేకమైన మనసు

12“దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెదననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి.” (కీర్తన 139:​17, 18ఎ) జంతువులు కూడా అద్భుతంగా సృష్టించబడ్డాయి, వాటిలో కొన్నింటికి మానవులకు మించిన కొన్ని గ్రహణశక్తులు, సామర్థ్యాలున్నాయి. కానీ సమస్త జంతువులకు అతీతమైన మానసిక సామర్థ్యాలను దేవుడు మానవులకిచ్చాడు. “మానవులమైన మనం అనేక రీతుల్లో ఇతర ప్రాణుల్లా ఉన్నప్పటికీ, భాషను, ఆలోచనాప్రక్రియను ఉపయోగించే సామర్థ్యం విషయంలో మనం భూమ్మీది జీవరాశుల్లో ప్రత్యేకమైనవారిగా ఉన్నాం. అలాగే మనగురించి అంటే, మన శరీరమెలా నిర్మించబడింది? మనమెలా రూపొందించబడ్డాం? వంటి విషయాలు తెలుసుకోవాలనే కుతూహలాన్ని అధికంగా ప్రదర్శించడంలో కూడా ప్రత్యేకమైనవారిగా ఉన్నాం” అని ఒక విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకం చెబుతోంది. దావీదు కూడా మనలాగే ఈ ప్రశ్నల గురించి ధ్యానించివుండవచ్చు.

13 అత్యంత ప్రాముఖ్యంగా, మనకు దేవుని తలంపులను ధ్యానించే సాటిలేని సామర్థ్యముంది, కానీ జంతువులకు ఆ సామర్థ్యం లేదు. * మనం “దేవుని స్వరూపమందు” సృష్టించబడడమనేది ఈ ప్రత్యేక వరాల్లో ఒకటి. (ఆదికాండము 1:​27) దావీదు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుని ఉనికికి సంబంధించిన రుజువు గురించి, తన చుట్టూవున్న భూమ్మీద ప్రతిబింబించబడిన చక్కని లక్షణాల గురించి ఆయన ధ్యానించాడు. దేవుడు తనగురించి, తన కార్యాల గురించి తెలియజేసిన విషయాలున్న పవిత్ర లేఖనాల తొలి పుస్తకాలు కూడా దావీదు దగ్గరున్నాయి. ఈ ప్రేరేపిత వ్రాతలు దేవుని తలంపులను, వ్యక్తిత్వాన్ని, సంకల్పాన్ని అర్థం చేసుకునేందుకు దావీదుకు సహాయం చేశాయి. లేఖనాలను, సృష్టిని, దేవుడు తనతో వ్యవహరించిన విధానాన్ని ధ్యానించడం తన సృష్టికర్తను స్తుతించేలా దావీదును పురికొల్పింది.

విశ్వాసంలో ఏమి ఇమిడివుంది?

14 సృష్టిని, లేఖనాలను దావీదు ఎక్కువగా ధ్యానించేకొద్ది, దేవుని జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో గ్రహించడం తన అవగాహనకు మించినదిగా ఆయన గుర్తించాడు. (కీర్తన 139:⁠6) మన విషయంలో కూడా అదే నిజం. దేవుని సృష్టి కార్యాలన్నింటిని మనమెన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. (ప్రసంగి 3:​11; 8:​17) అయితే ఏ కాలంలో జీవించినా సత్యాన్వేషకులు రుజువుపై ఆధారపడిన విశ్వాసాన్ని సంపాదించుకునేలా దేవుడు లేఖనాల్లో, ప్రకృతిలో అవసరమైనంత జ్ఞానాన్ని ‘విశదపర్చాడు.’​—⁠రోమీయులు 1:​19, 20; హెబ్రీయులు 11:​1, 3.

15 విశ్వాసం కలిగివుండేందుకు జీవానికి, విశ్వానికి తెలివిగల మూలకర్త ఉండాలని గుర్తించడం మాత్రమే సరిపోదు. దానిలో యెహోవా దేవుణ్ణి ఒక వ్యక్తిగా, మనమాయన గురించి తెలుసుకోవాలని, ఆయనతో మంచి సంబంధం కలిగివుండాలని కోరుకునే వ్యక్తిగా ఆయనను నమ్మడం చేరివుంది. (యాకోబు 4:⁠8) ప్రేమగల తండ్రిపట్ల ఒక వ్యక్తికుండే విశ్వాసం, నమ్మకం గురించి మనం తలంచవచ్చు. సంశయవాది ఒకరు విపత్కర పరిస్థితుల్లో మీ తండ్రి నిజంగా సహాయం చేస్తాడా అని సంశయాన్ని వ్యక్తం చేసినప్పుడు, మీ తండ్రి నమ్మదగినవాడని మీరు ఆ వ్యక్తిని ఒప్పించలేకపోవచ్చు. కానీ అనుభవపూర్వకంగా మీ తండ్రి ప్రేమగలవాడనే రుజువును మీరు సంపాదించుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని నిరాశపర్చడనే నమ్మకంతో మీరుండవచ్చు. అదే విధంగా, లేఖనాల అధ్యయనం, సృష్టిని గురించి ఆలోచించడం, మన ప్రార్థనలకు జవాబివ్వడంలో ఆయన సహాయాన్ని చవిచూడడం ద్వారా యెహోవాను తెలుసుకోవడం ఆయనను నమ్మేందుకు మనల్ని ప్రేరేపిస్తుంది. అది ఆయన గురించి మరింత తెలుసుకోవాలని, నిస్వార్థమైన ప్రేమతో, భక్తితో ఆయనను నిరంతరం స్తుతించాలని మనం కోరుకునేలా చేస్తుంది. అది ఏ వ్యక్తైనా అనుసరించగల అత్యంత విశిష్టమైన సంకల్పం.​—⁠ఎఫెసీయులు 5:​1, 2.

మన సృష్టికర్త నిర్దేశాన్ని అర్థించండి!

16“దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:​23, 24) యెహోవాకు అప్పటికే తన గురించి పూర్తిగా తెలుసని అంటే తాను ఆలోచించిన, చెప్పిన, చేసిన సమస్తం తన సృష్టికర్త తెలుసుకోగలడని దావీదుకు తెలుసు. (కీర్తన 139:​1-12; హెబ్రీయులు 4:​13) పిల్లవాడు తన ప్రేమగల తల్లిదండ్రుల చేతుల్లో భద్రంగా ఉన్నానని భావించినట్లే, దేవునికి తన గురించి అన్నీ తెలుసనే పరిజ్ఞానం దావీదులో సురక్షిత భావాన్ని కలిగించింది. యెహోవాతో ఈ సన్నిహిత సంబంధాన్ని దావీదు అమూల్యంగా పరిగణించడమే కాక, ఆయన కార్యాలను లోతుగా ఆలోచిస్తూ, ఆయనకు ప్రార్థిస్తూ ఆ సంబంధాన్ని కాపాడుకునేందుకు పట్టుదలతో కృషిచేశాడు. వాస్తవానికి, 139వ కీర్తనతోపాటు దావీదు కూర్చిన అనేక కీర్తనలు ప్రాముఖ్యంగా సంగీతానుసారమైన ప్రార్థనలే. అలాగే ధ్యానం, ప్రార్థన మనం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మనకు సహాయం చేయవచ్చు.

17 దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనకు స్వేచ్ఛాచిత్తం అనుగ్రహించబడింది. మనం మేలు కీడులను ఎంచుకోవచ్చు. ఆ స్వేచ్ఛతోపాటు నైతికంగా లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత కూడా మనపైవుంది. దుష్టులతోపాటు లెక్కించబడాలని దావీదు కోరుకోలేదు. (కీర్తన 139:​19-22) దేవునికి బాధ కలిగించే తప్పులు చేయకుండా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి, దావీదు యెహోవా సర్వజ్ఞానాన్ని ధ్యానిస్తూ, తన అంతరంగాన్ని పరీక్షించి, జీవమార్గంలో తనను నడిపించమని దేవుణ్ణి వినయంగా వేడుకున్నాడు. దేవుని నీతియుక్తమైన నైతిక ప్రమాణాలు ప్రతీ ఒక్కరికి అన్వయిస్తాయి; అందువల్ల మనం సరైన ఎంపికలు చేసుకోవాలి. తనకు లోబడమని యెహోవా మనల్నందరినీ కోరుతున్నాడు. అలా లోబడడం మనకాయన అనుగ్రహాన్ని, అనేక ప్రయోజనాల్ని తీసుకొస్తుంది. (యోహాను 12:​50; 1 తిమోతి 4:⁠8) ప్రతీరోజు యెహోవాతో నడవడం, మనకు తీవ్ర సమస్యలున్నా మనశ్శాంతిని పెంపొందించుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.​—⁠ఫిలిప్పీయులు 4:​6, 7.

మన అద్భుత సృష్టికర్తను అనుసరించండి!

18 యౌవనునిగా దావీదు మందలను కాస్తూ తరచూ బయట గడిపేవాడు. గడ్డిమేసేందుకు గొర్రెలు తలలువంచేవి, అయితే ఆయన కన్నులెత్తి ఆకాశంవైపు చూసేవాడు. చీకటిపడుతుండగా దావీదు విశ్వవైభవాన్ని, అది సూచిస్తున్న దానినంతటినీ ధ్యానించాడు. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.” (కీర్తన 19:​1, 2) అన్నింటినీ అంత అద్భుతంగా సృష్టించినవానిని అన్వేషించి, ఆయనను అనుసరించాలనీ దావీదు అర్థం చేసుకున్నాడు. మనం కూడా అలాగే చేయాలి.

19 తన కుమారుడైన సొలొమోను ఆ తర్వాత యౌవనులకిచ్చిన ఈ ఉపదేశానికి దావీదు ఆదర్శంగా నిలిచాడు: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. . . . దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:​2, 13) తాను ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడ్డాను’ అని దావీదు యౌవనంలోనే గ్రహించాడు. ఈ జ్ఞానానికి తగినట్టుగా జీవించడం ఆయన జీవితమంతటిలో ఎన్నో ప్రయోజనాలు తీసుకొచ్చింది. యౌవనులమైనా, వృద్ధులమైనా మన దివ్య సృష్టికర్తను స్తుతిస్తూ, ఆయనను సేవించినప్పుడు మన ప్రస్తుత, భవిష్యత్‌ జీవితం ఆనందమయంగా ఉంటుంది. యెహోవాకు సన్నిహితంగావుంటూ, ఆయన నీతిమార్గాల ప్రకారం జీవించేవారికి బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “యెహోవా యథార్థవంతుడని . . . ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు.” (కీర్తన 92:​14, 15) అలాగే మనకు మన అద్భుతమైన సృష్టికర్త కార్యాలను నిరంతరం అనుభవించే నిరీక్షణ ఉంటుంది.

[అధస్సూచీలు]

^ పేరా 3 యెహోవాసాక్షులు ప్రచురించిన తేజరిల్లు! (ఆంగ్లం) జూన్‌ 22, 2004వ సంచిక చూడండి.

^ పేరా 9 తేజరిల్లు! సెప్టెంబరు 8, 1997వ సంచికలో “మీ మూత్రపిండాలు జీవాన్ని పోషించే ఫిల్టర్‌” అనే ఆర్టికల్‌ కూడా చూడండి.

^ పేరా 17 కీర్తన 139:​18బి లోని దావీదు మాటలు తాను రాత్రి పడుకునేవరకు రోజంతా యెహోవా తలంపులను లెక్కించినా ఉదయం లేచినప్పుడు, ఇంకా లెక్కించాల్సినవి ఎన్నో ఉన్నాయనే అర్థాన్నిస్తున్నట్లు అనిపిస్తోంది.

మీరు వివరించగలరా?

• పిండం ఎదిగే విధానం మనం ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడ్డాం’ అని ఎలా చూపిస్తోంది?

• యెహోవా తలంపులను మనమెందుకు ధ్యానించాలి?

• విశ్వాసం, యెహోవాతో మనకుండే సంబంధంతో ఎలా ముడిపడివుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఆలోచనాపరులైన చాలామంది భూమ్మీది అద్భుతాలకు దేవుణ్ణి ఎందుకు ఘనపరుస్తారు?

2. యెహోవాను స్తుతించేందుకు దావీదును ఏది పురికొల్పింది?

3, 4. మనలో ప్రతీ ఒక్కరం యెహోవా కార్యాలను హృదయపూర్వకంగా ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?

5, 6. (ఎ) మనమందరం మన జీవితాన్నెలా ప్రారంభించాం? (బి) మూత్రపిండాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

7, 8. (ఎ) గర్భస్థ శిశువు తొలి ఎదుగుదలను వివరించండి. (బి) ఎదుగుతున్న శిశువు ఏ విధంగా ‘భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మించబడింది’?

9, 10. గర్భస్థ పిండంయొక్క వివిధ దశల సమాచారం ఎలా దేవుని “గ్రంథములో లిఖితము లాయెను”?

11. మన శరీర లక్షణాలను ఏవి నిర్ణయిస్తాయి?

12. జంతువుల నుండి మానవులను ప్రత్యేకమైనవారిగా చేసేవి ఏమిటి?

13. (ఎ) దావీదు దేవుని తలంపులను ఎలా ధ్యానించగలిగాడు? (బి) దావీదు మాదిరిని మనమెలా అనుసరించవచ్చు?

14. దేవుణ్ణి విశ్వసించేందుకు మనమాయన గురించి పూర్తిగా ఎందుకు తెలుసుకోనవసరం లేదు?

15. విశ్వాసం, దేవునితో మనకుండే సంబంధంతో ఎలా ముడిపడివుందో వివరించండి.

16. యెహోవాతో దావీదుకున్న సన్నిహిత సంబంధం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

17. (ఎ) యెహోవా తన హృదయాన్ని పరీక్షించాలని దావీదు ఎందుకు కోరుకున్నాడు? (బి) మన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించే తీరు మన జీవితాలనెలా ప్రభావితం చేస్తుంది?

18. సృష్టిని ధ్యానించడం నుండి దావీదు ఏ నిర్ధారణకు వచ్చాడు?

19. ‘ఆశ్చర్యకరమైన రీతిలో కలుగజేయబడిన’ కారణాన్నిబట్టి యౌవనులు, వృద్ధులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

[23వ పేజీలోని చిత్రాలు]

ముందుగా నిర్ణయించబడిన రూపకల్పననుసరించే గర్భస్థ శిశువు ఎదుగుతుంది

DNA

[చిత్రసౌజన్యం]

గర్భస్థ పిండం: Lennart Nilsson

[24వ పేజీలోని చిత్రం]

ప్రేమగల తండ్రిని నమ్మే పిల్లవాడిలాగే మనకు యెహోవాపై నమ్మకముంది

[25వ పేజీలోని చిత్రం]

యెహోవా చేతికార్యాలను ధ్యానించడం ఆయనను స్తుతించేందుకు దావీదును ప్రేరేపించింది