మారుతున్న విలువల సంద్రంలో కొట్టుకుపోవడం
మారుతున్న విలువల సంద్రంలో కొట్టుకుపోవడం
ఒక్క సద్గుణవంతుడైనా దొరక్కపోతాడా అని ఆయన పట్టపగలే, చేతిలో ఒక లాంతరు పట్టుకుని పట్టుదలగా వెదుకుతూ తిరిగేవాడనీ, అయినా ఆయన కృషి ఫలించలేదనీ ఒక ప్రఖ్యాత పురాణగాథ చెబుతోంది. ఆయన పేరు డయోజెనిస్, ఆయన సా.శ.పూ. నాల్గవ శతాబ్దంలో ఏథెన్సు నగరంలో జీవించిన ఒక తత్వవేత్త.
ఆ పురాణగాథ నిజమో కాదో ధృవీకరించడం సాధ్యంకాదు. ఒకవేళ డయోజెనిస్ నేడే గనుక బ్రతికుంటే, నైతిక ప్రమాణాలను పాటించే వ్యక్తుల్ని కనుగొనడానికి ఆయన మరింత ప్రయాసపడాల్సి వచ్చేదని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రజలు నిర్దిష్ట నైతిక సూత్రాలను పాటించాలనే విషయాన్ని నేడు చాలామంది నిరాకరిస్తున్నట్లు అనిపిస్తోంది. వ్యక్తిగత జీవితాల్లో, ప్రభుత్వాల్లో, ఉద్యోగాల్లో, క్రీడల్లో, వ్యాపారాల్లో, ఇతర రంగాల్లో చోటుచేసుకుంటున్న అనైతికతను ప్రచారమాధ్యమాలు తరచూ వెలుగులోకి తెస్తూవుంటాయి. మునుపటి తరాలవారు ఎంతో విలువైనవిగా ఎంచిన నైతిక విలువల్లో చాలావాటిపట్ల నేడు ఏ మాత్రం గౌరవం లేకుండా పోయింది. స్థాపించబడిన ప్రమాణాలు నేడు పునఃపరిశీలించబడి, తరచూ తిరస్కరించబడుతున్నాయి. మరికొన్ని నైతిక సూత్రాలు చేతల్లో కాక రాతల్లో మాత్రమే గౌరవించబడుతున్నాయి.
మత సామాజికవేత్త ఆలెన్ వుల్ఫ్ ఇలా అన్నాడు: “అందరికీ ఆమోదయోగ్యమైన నైతిక ప్రమాణాలు పాటించే రోజులు పోయాయి. నైతిక నిర్దేశం కోసం సాంప్రదాయాలపై, వ్యవస్థలపై ఆధారపడకూడదని ప్రజలందరూ ఇప్పుడు అనుకుంటున్నట్లుగా ముందెప్పుడూ అనుకోలేదు.” లాస్ ఎంజిల్స్ టైమ్స్ అనే పత్రిక గత వంద సంతవత్సరాల గురించి వ్రాస్తూ, ప్రపంచంలో దౌర్జన్యం పెచ్చరిల్లిపోవడానికి ప్రజల్లో మతాసక్తి సన్నగిల్లిపోవడం, సార్వత్రిక నైతిక కట్టుబాట్లు పతనమైపోవడం ముఖ్య కారణాలుగా ఉన్నాయని తత్వవేత్తయైన జానతన్ గ్లోవర్ గమనించిన విషయాలపై వ్యాఖ్యానించింది.
అందరికీ ఆమోదయోగ్యమైన విలువల విషయంలో అలాంటి గందరగోళం ఉన్నా కొందరు మాత్రం నైతిక సూత్రావళి కోసం అన్వేషించడం మానుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం, యునెస్కో (అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ) మాజీ డైరెక్టర్ జనరల్ ఫెడెరికొ మేయర్ ఇలా అన్నాడు: “ముందెప్పుడూ లేనివిధంగా, ప్రపంచంలో నేడు నైతిక సూత్రాలు ముఖ్య సమస్యగా మారాయి.” అయితే, ఈ లోకం సరైన నైతిక విలువల్ని స్వీకరించకపోయినంత
మాత్రాన ఇక అనుసరించదగిన, అనుసరించాల్సిన విలువలే లేవని దానర్థం కాదు.కానీ ఏ ప్రమాణాలను అనుసరించాలనే విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయా? ఉండవనేది స్పష్టం. మరి మంచిచెడుల విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విలువలే లేకపోతే మనం విలువల్ని ఎలా అంచనా వేయవచ్చు? ఎవరి పరిస్థితులకు తగ్గట్టుగా వారు విలువల్ని ఏర్పర్చుకోవడం నేడు సర్వసాధారణమైపోయింది. అయితే, అలాంటి వైఖరి లోకంలోని నైతిక పరిస్థితిని ఏమాత్రం మెరుగుపర్చలేదని మీరు గమనించవచ్చు.
పరిస్థితులకు తగ్గట్టుగా విలువల్ని మార్చుకోవడం అనే ఆ తత్వం, 20వ శతాబ్దానికి ముందు ప్రజల్లో “స్థాపించబడిన, వాస్తవికమైన నైతిక సూత్రాలపట్ల ఉన్న వ్యక్తిగత బాధ్యతను, గౌరవాన్ని . . . పూర్తిగా తగ్గించేసింది” అని బ్రిటన్‌కు చెందిన చరిత్రకారుడైన పౌల్ జాన్సన్ బలంగా నమ్ముతున్నాడు.
మరి ‘వాస్తవికమైన నైతిక సూత్రాలను’ కనుగొనడం లేక “సార్వత్రిక నైతిక కట్టుబాట్లను” పాటిస్తూ జీవించడం సాధ్యమేనా? మీ జీవితాలకు స్థిరత్వంతోపాటు భవిష్యత్తుకు ఒక నిరీక్షణను ఇవ్వగల సుస్థిరమైన, శాశ్వతమైన విలువల్ని స్థాపించగల అధికారం ఎవరికైనా ఉందా? తర్వాతి ఆర్టికల్ ఆ ప్రశ్నలకు జవాబులిస్తుంది.