కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు”

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు”

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు”

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.”​—⁠రోమీయులు 12:​17.

ఇద్దరు పిల్లల్లో ఒకడు రెండోవాణ్ణి నెడితే వెంటనే వాడుకూడా నెడతాడు. విచారకరంగా, అలాంటి దెబ్బకు దెబ్బ అనే ప్రవర్తన పిల్లలకు మాత్రమే పరిమితం కాదు. చాలామంది పెద్దవాళ్లు కూడా అలాగే చేస్తున్నారు. ఎవరైనా తమను బాధపెడితే, ప్రతీకారం తీర్చుకోవాలనే చూస్తారు. నిజమే, ఎక్కువశాతం పెద్దవాళ్లు అక్షరార్థంగా నెట్టరు, కానీ చాలామంది మోసపూరితమైన పద్ధతుల్లో ప్రతీకారం తీర్చుకుంటారు. బహుశా వారు తమను బాధపెట్టినవారి గురించి హానికరమైన పుకార్లు వ్యాపింపజేయవచ్చు లేదా అతను పైకిరాకుండా చేయడానికి మార్గాలను అన్వేషించవచ్చు. వారు ఏ మార్గాన్ని ఉపయోగించినా, ప్రతీకారం తీర్చుకోవడమే వారి ఉద్దేశం.

2 ప్రతీకారం తీర్చుకోవాలనే భావన బలంగావున్నా, నిజ క్రైస్తవులు ఆ భావనకు లొంగిపోరు. దానికి భిన్నంగా, వారు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాను అనుసరించేందుకు కృషిచేస్తారు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.” (రోమీయులు 12:​17) ఆ ఉన్నత ప్రమాణం ప్రకారం జీవించడానికి మనల్నేది పురికొల్పుతుంది? ప్రత్యేకంగా ఎవరి విషయంలో మనం కీడుకు ప్రతికీడు చేయకూడదు? ప్రతీకారం తీర్చుకోకుండావుంటే మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు పౌలు మాటల సందర్భాన్ని అధ్యయనం చేస్తూ, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడం సరైన, ప్రేమపూర్వకమైన, పాటించగల యోగ్యమైన మార్గమని రోమీయులు 12వ అధ్యాయం ఎలా వివరిస్తోందో చూద్దాం. ఈ మూడు అంశాలను మనం ఒక్కొక్కటి పరిశీలిద్దాం.

‘కాబట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను’

3 క్రైస్తవుని జీవితాన్ని ప్రభావితంచేసే నాలుగు అంశాలను 12వ అధ్యాయం ఆరంభంలో పౌలు వివరిస్తున్నాడు. యెహోవాతో, తోటి విశ్వాసులతో, అవిశ్వాసులతో, ప్రభుత్వాధికారులతో మన సంబంధాన్ని ఆయన వివరిస్తున్నాడు. ‘కాబట్టి సహోదరులారా దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను’ అని చెప్పినప్పుడు పౌలు ప్రతీకారం తీర్చుకునే భావనతోపాటు, చెడు ఆలోచనలకు లోనవకుండా ఉండేందుకు ప్రధాన కారణముందని సూచిస్తున్నాడు. (రోమీయులు 12:⁠1) పౌలు ‘ముందుచెప్పిన విషయాల దృష్ట్యా’ అనే అర్థమున్న “కాబట్టి” అనే పదాన్ని ఉపయోగించాడని గమనించండి. నిజానికి పౌలు ‘నేనిప్పుడు మీకు వివరించిన విషయాల దృష్ట్యా, నేను తర్వాత చెప్పబోయే అంశాలను చేయాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను’ అని చెబుతున్నాడు. రోములోని ఆ క్రైస్తవులకు పౌలు ఏమి వివరించాడు?

4 తన పత్రికలోని మొదటి 11 అధ్యాయాల్లో పౌలు, ఇటు యూదులకు, అటు అన్యులకు దేవుని రాజ్యంలో క్రీస్తుతోడి పరిపాలకులయ్యేందుకు అందుబాటులోవున్న అద్భుతమైన అవకాశాన్ని చర్చించాడు. ఆ భావి నిరీక్షణను అంగీకరించడంలో సహజ ఇశ్రాయేలీయులు విఫలమయ్యారు. (రోమీయులు 11:​13-36) అయితే ఆ సువర్ణావకాశం “దేవుని వాత్సల్యమునుబట్టి” మాత్రమే సాధ్యమయ్యింది. దేవుడు చూపించిన ఈ అపారమైన కృపకు క్రైస్తవులెలా స్పందించాలి? వారి హృదయాలు ప్రగాఢమైన కృతజ్ఞతాభావంతో ఎంతగా నిండాలంటే పౌలు ఆ తర్వాత వ్రాసింది చేయడానికి వారు పురికొల్పబడాలి. ఆయనిలా వ్రాశాడు: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.” (రోమీయులు 12:⁠1) కానీ ఆ క్రైస్తవులు తమను దేవునికి “యాగముగా” ఎలా సమర్పించుకోవచ్చు?

5 పౌలు ఇంకా ఇలా వివరిస్తున్నాడు: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:⁠2) లోక స్వభావం వారి ఆలోచనను మలచేందుకు అనుమతించే బదులు, వారు క్రీస్తు ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తమ మనసు మార్చుకోవాలి. (1 కొరింథీయులు 2:​16; ఫిలిప్పీయులు 2:⁠5) నేడు మనతోసహా నిజ క్రైస్తవులందరి దైనందిన ప్రవర్తనను ఆ సూత్రమే ప్రభావితం చేయాలి.

6రోమీయులు 12:​1, 2లోని పౌలు తర్కం మనకెలా సహాయం చేస్తుంది? రోములోని ఆ ఆత్మాభిషిక్త క్రైస్తవుల్లాగే మనం కూడా, ఎడతెగక దేవుడు మనకందించిన, ఇప్పటికీ మన దైనందిన జీవితంలో అందిస్తున్న వివిధరకాల వాత్సల్యపూరిత వాక్కుల విషయంలో మనకు ప్రగాఢ కృతజ్ఞత ఉంది. కాబట్టి, కృతజ్ఞతాభరిత హృదయం మన పూర్ణ బలంతో, వనరులతో, సామర్థ్యాలతో దేవుణ్ణి సేవించేందుకు మనల్ని పురికొల్పుతుంది. ఆ హృదయపూర్వక అభిలాష లోకస్థుల్లాకాక క్రీస్తులా ఆలోచించడానికి శాయశక్తులా కృషిచేసేందుకు కూడా మనల్ని పురికొల్పుతుంది. క్రీస్తు మనసును కలిగివుండడం ఇతరులతో అంటే ఇటు తోటి విశ్వాసులతో అటు అవిశ్వాసులతో మనమెలా వ్యవహరిస్తామనే దానిపై ప్రభావం చూపిస్తుంది. (గలతీయులు 5:​25) ఉదాహరణకు, మనం క్రీస్తులా ఆలోచించినప్పుడు పగతీర్చుకోవాలనే భావన మన దరికి చేరకుండా చూసుకుంటాం.​—⁠1 పేతురు 2:​21-23.

“మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను”

7 మనం కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటాం, ఎందుకంటే అది సరైన విధానమే కాక, ప్రేమపూర్వకమైన విధానం కూడా. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు, ప్రేమకున్న ఉద్దేశాన్ని ఎలా వివరిస్తున్నాడో గమనించండి. రోమీయులకు వ్రాసిన పత్రికలో దేవుని ప్రేమ గురించి, క్రీస్తు ప్రేమ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు పౌలు చాలాసార్లు, “ప్రేమ” (గ్రీకులో అగాపే) అనే పదాన్ని ఉపయోగించాడు. (రోమీయులు 5:​5, 8; 8:​35, 38) కానీ 12వ అధ్యాయంలో పౌలు తోటి మానవులపట్ల చూపించే ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు అగాపేను మరోవిధంగా ఉపయోగించాడు. ఆత్మ వరాలు వివిధ రకాలని, అవి కొంతమంది విశ్వాసుల్లో ఉన్నాయని వ్రాసిన తర్వాత, క్రైస్తవులందరూ అలవర్చుకోవల్సిన లక్షణాన్ని పౌలు పేర్కొంటున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను.” (రోమీయులు 12:​4-9) ఇతరులపట్ల ప్రేమ చూపించడం నిజ క్రైస్తవుల ప్రధాన గుర్తింపు. (మార్కు 12:​28-31) క్రైస్తవులుగా మనం చూపించే ప్రేమ యథార్థమైనదిగా ఉండేలా చూసుకోవాలని పౌలు మనల్ని వేడుకుంటున్నాడు.

8 అంతేకాక, పౌలు “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి” అని చెబుతూ నిష్కపటమైన ప్రేమనెలా చూపించాలో తెలియజేస్తున్నాడు. (రోమీయులు 12:⁠9) ‘అసహ్యించుకొనుడి,’ ‘హత్తుకొని ఉండుడి’ అనేవి భావగర్భిత పదాలు. ‘అసహ్యించుకొనుడి’ అనే పదాన్ని ‘తీవ్రంగా ద్వేషించండి’ అని అనువదించవచ్చు. కేవలం చెడుతనంవల్ల కలిగే పర్యవసానాల్నే కాక, చెడుతనాన్ని కూడా మనం ద్వేషించాలి. (కీర్తన 97:​10) ‘హత్తుకొని ఉండండి’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదానికి “అంటించు” అనే అక్షరార్థ భావముంది. నిజమైన ప్రేమగల క్రైస్తవుడు మంచితనానికి ఎంత గట్టిగా లేదా సన్నిహితంగా అంటిపెట్టుకొని ఉంటాడంటే అది ఆయన వ్యక్తిత్వంలో విడదీయలేని భాగమౌతుంది.

9 ప్రేమను కనబర్చే ఒక విధానాన్ని పౌలు పదేపదే పేర్కొన్నాడు. ఆయనిలా అన్నాడు: “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.” “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.” “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొన[వద్దు].” “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:​14, 17-19, 21) మనల్ని వ్యతిరేకించే వారితోసహా అవిశ్వాసులతో మనమెలా వ్యవహరించాలనే విషయాన్ని పౌలు మాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

“మిమ్మును హింసించువారిని దీవించుడి”

10 “మిమ్మును హింసించువారిని దీవించుడి” అని పౌలు చేసిన విన్నపాన్ని మనమెలా అనుసరించవచ్చు? (రోమీయులు 12:​14) తన అనుచరులకు యేసు ఇలా చెప్పాడు: “శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్తయి 5:​44; లూకా 6:​27, 28) మనల్ని హింసించేవారిని దీవించే ఒక మార్గం మనం వారికోసం ప్రార్థించడమే, మనల్ని వ్యతిరేకించేవారు తెలియక అలా చేస్తున్నారేమో అని దేవునికి ప్రార్థించినప్పుడు, సత్యాన్ని గ్రహించేలా యెహోవా వారి మనోనేత్రాలను తెరవచ్చు. (2 కొరింథీయులు 4:⁠4) నిజమే, హింసించేవారిని దీవించమని దేవుణ్ణి అడగడం వింతగా అనిపించవచ్చు. కానీ మన ఆలోచనా విధానం ఎంత ఎక్కువగా క్రీస్తు ఆలోచనా విధానాన్ని పోలివుంటే, మనం అంతెక్కువగా మన శత్రువులపట్ల ప్రేమను కనబరచగలుగుతాం. (లూకా 23:​34) అలాంటి ప్రేమ చూపించడంవల్ల ఎలాంటి ఫలితం రావచ్చు?

11 తనను హింసించినవారి కోసం ప్రార్థించిన వ్యక్తుల్లో స్తెఫను ఒకడు, ఆయన ప్రార్థన వ్యర్థం కాలేదు. సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత అనతికాలంలోనే క్రైస్తవ సంఘ వ్యతిరేకులు స్తెఫనును బంధించి యెరూషలేము వెలుపలకు ఈడ్చుకెళ్లి రాళ్లతో కొట్టారు. తాను చనిపోకముందు ఆయన బిగ్గరగా ఇలా ప్రార్థించాడు: “ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుము.” (అపొస్తలుల కార్యములు 7:⁠58-8:⁠1) ఆ రోజు స్తెఫను ఎవరికోసమైతే ప్రార్థించాడో వారిలో ఆయన మరణాన్ని కళ్లారాచూసి దానిని ఆమోదించిన సౌలు ఉన్నాడు. ఆ తర్వాత, పునరుత్థానం చేయబడిన యేసు సౌలుకు కనిపించాడు. ఒకప్పటి ఆ హింసకుడు క్రీస్తు అనుచరుడై, రోమీయులకు పత్రిక వ్రాసిన అపొస్తలుడైన పౌలుగా చివరకు మారాడు. (అపొస్తలుల కార్యములు 26:​12-18) స్తెఫను ప్రార్థనకు అనుగుణంగా యెహోవా పౌలును క్షమించాడని స్పష్టమౌతోంది. (1 తిమోతి 1:​12-16) కాబట్టి, “మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి” అని పౌలు క్రైస్తవులను వేడుకోవడంలో ఆశ్చర్యం లేదు. హింసకు పాల్పడే కొందరు చివరకు దేవుని సేవకులౌతారని ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. అదే విధంగా మన కాలంలో, కొందరు హింసకులు యెహోవా సేవకుల సమాధాన ప్రవర్తననుబట్టి విశ్వాసులయ్యారు.

“సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి”

12 విశ్వాసులతో, అవిశ్వాసులతో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి పౌలు తర్వాత ఇలాంటి హెచ్చరిక ఇచ్చాడు: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.” ఈ మాటకూ ఆయన అంతకుముందు చెప్పిన “చెడ్డదాని నసహ్యించుకొ[నుడి]” అనే మాటకూ సంబంధం ఉంది. వాస్తవానికి, కీడుకు ప్రతి కీడు తలపెట్టే వ్యక్తి, చెడును లేదా కీడును నిజంగా అసహ్యించుకుంటున్నానని ఎలా చెప్పగలడు? అలా కీడు తలపెట్టడం “నిష్కపటమైన” ప్రేమను కలిగివుండడానికి విరుద్ధం. ఆ తర్వాత పౌలు ఇలా అంటున్నాడు: “మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి.” (రోమీయులు 12:​9, 17) ఈ మాటలను మనమెలా అన్వయించుకోవచ్చు?

13 అంతకుముందు తాను కొరింథీయులకు పంపిన పత్రికలో పౌలు అపొస్తలులు ఎదుర్కొన్న హింసను గురించి వ్రాశాడు. ఆయనిలా అన్నాడు: “మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము. . . . నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము; దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము.” (1 కొరింథీయులు 4:​9-13) అదే విధంగా, నేడు ఈ లోక ప్రజలు నిజ క్రైస్తవులను గమనిస్తున్నారు. మనకు అన్యాయం జరుగుతున్నా మనం చేసే సత్క్రియలను మన చుట్టూవున్నవారు గమనించినప్పుడు, వారు మన క్రైస్తవ సందేశానికి మరింత సానుకూలంగా స్పందించేందుకు మొగ్గు చూపించవచ్చు.​—⁠1 పేతురు 2:​12.

14 అయితే మనమెంతమేరకు సమాధానాన్ని పురికొల్పేవారిగా ఉండాలి? మనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. తన క్రైస్తవ సహోదరులకు పౌలు ఇలా చెబుతున్నాడు: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.” (రోమీయులు 12:​18) “శక్యమైతే” “మీ చేతనైనంత మట్టుకు” అనే పదాలు ఇతరులతో సమాధానపడడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని సూచించే విశేషణార్థ పదాలు. ఉదాహరణకు, కేవలం మనుష్యులతో సమాధానాన్ని కాపాడుకునేందుకు దేవుని ఆజ్ఞను మనం ఉల్లంఘించం. (మత్తయి 10:​34-36; హెబ్రీయులు 12:​14) అయితే, నీతి సూత్రాల విషయంలో రాజీపడకుండా మనం “సమస్త మనుష్యులతో” సమాధానముగా ఉండేలా చేయగలిగినదంతా చేస్తాం.

‘మీకు మీరే పగతీర్చుకోవద్దు’

15 మనం ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడానికి పౌలు మరో బలమైన కారణాన్ని ఇస్తున్నాడు; దానిని అనుసరించడం మంచిది. ఆయనిలా చెబుతున్నాడు: “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—⁠పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.” (రోమీయులు 12:​19) పగతీర్చుకునేందుకు ప్రయత్నించే క్రైస్తవుడు అహంకారి అవుతాడు. తానే దేవుని పాత్రను పోషించినవాడౌతాడు. (మత్తయి 7:⁠1) అంతేకాక, పగతీర్చుకోవడానికి స్వయంగా ప్రయత్నించడం ద్వారా, “నేనే ప్రతిఫలము నిత్తును” అని యెహోవా ఇచ్చిన హామీపట్ల అవిశ్వాసాన్ని చూపిస్తున్నవాడౌతాడు. దీనికి భిన్నంగా నిజ క్రైస్తవులు, యెహోవాయే ‘తాను ఏర్పరచుకొనినవారికి న్యాయము తీర్చును’ అని నమ్ముతారు. (లూకా 18:​7, 8; 2 థెస్సలొనీకయులు 1:​6-8) దోషులపై పగతీర్చుకునే పనిని వారు వినయంతో దేవునికే వదిలేస్తారు.​—⁠యిర్మీయా 30:​23, 24; రోమీయులు 1:​18.

16 శత్రువుపై పగతీర్చుకోవడం అతని హృదయాన్ని కఠినపర్చవచ్చు, కానీ శత్రువుపై దయచూపించడం అతని హృదయం మెత్తబడేలా చేయవచ్చు. ఎందుకు? రోములోని క్రైస్తవులకు పౌలు ఏమిచెప్పాడో గమనించండి, ఆయనిలా చెబుతున్నాడు: “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.” (రోమీయులు 12:​20; సామెతలు 25:​21, 22) దీని భావమేమిటి?

17 ‘అతని తలమీద నిప్పులు కుప్పగా పోయడం’ అనేది బైబిలు కాలాల్లో లోహాన్ని కరిగించడానికి ఉపయోగించిన పద్ధతినుండి వచ్చిన అలంకారార్థ పదజాలం. ముడి ఖనిజాన్ని కొలిమిలోవేసి దాని క్రిందాపైనా బొగ్గులు పేరుస్తారు. లోహం కరిగి ముడి ఖనిజంలోని మలినపదార్థాల నుండి వేరయ్యేలా పైన పేర్చబడిన నిప్పులు వేడిని అధికం చేస్తాయి. అదే విధంగా, వ్యతిరేకిస్తున్న వ్యక్తిపట్ల దయాపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా మనం అతని కఠినత్వాన్ని ‘కరిగించి’ అతనిలోని మంచి లక్షణాలను వెలికి తీయవచ్చు. (2 రాజులు 6:​14-23) నిజానికి, క్రైస్తవ సంఘ సభ్యులు చాలామంది, యెహోవా సేవకులు తమపట్ల దయాపూర్వకంగా ప్రవర్తించడాన్నిబట్టే సత్యారాధనవైపు మొదట ఆకర్షించబడ్డారు.

మనమెందుకు పగతీర్చుకోం

18 రోమీయులు 12వ అధ్యాయపు ఈ క్లుప్త పరిశీలనలో, మనం ‘కీడుకు ప్రతికీడు చేయకుండా’ ఉండడానికిగల ప్రాముఖ్యమైన వివిధ కారణాలను చూశాం. మొదటిది, ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడం మనం అనుసరించాల్సిన సరైన విధానం. దేవుడు మనపట్ల చూపించిన వాత్సల్యాన్నిబట్టి యెహోవాకు మనల్ని సమర్పించుకొని, మన శత్రువులను ప్రేమించాలనే ఆజ్ఞతోసహా ఆయన ఆజ్ఞలన్నింటికి లోబడడం సరైనది, సముచితమైనది. రెండవది, కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండడం మనం అనుసరించాల్సిన ప్రేమపూర్వక విధానం. ప్రతీకారం తీర్చుకోకుండా, సమాధానాన్ని పురికొల్పడం ద్వారా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా యెహోవా ఆరాధకులయ్యేలా ప్రేమపూర్వకంగా సహాయం చేసేందుకు ఆశిస్తాం. మూడవది, కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండడం మనం అనుసరించాల్సిన వినయపూర్వక విధానం. మనమే పగతీర్చుకోవడం అహంకారపూరితమైనది, ఎందుకంటే, “పగతీర్చుట నా పని” అని యెహోవా చెబుతున్నాడు. “అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. (సామెతలు 11:⁠2) దోషులపై పగతీర్చుకోవడాన్ని దేవునికి వదిలేయడం మన వినయాన్ని చూపిస్తుంది.

19 పౌలు తన చర్చను, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాడు. ఆయన క్రైస్తవులను ఇలా వేడుకుంటున్నాడు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:​21) నేడు మనమెలాంటి దుష్ట శక్తులను ఎదుర్కొంటున్నాం? మనం వాటినెలా జయించవచ్చు? వీటికి, వీటి సంబంధిత ప్రశ్నలకు జవాబులు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి.

మీరు వివరించగలరా?

• రోమీయులు 12వ అధ్యాయంలో ఏ హెచ్చరిక పదేపదే కనిపిస్తుంది?

• పగతీర్చుకోకుండా ఉండేందుకు మనల్ని ఏది పురికొల్పుతుంది?

• ‘కీడుకు ప్రతికీడు చేయకుండా’ ఉంటే మనకూ ఇతరులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఎలాంటి ప్రవర్తన సర్వసామాన్యంగా కనిపిస్తుంది?

2. (ఎ) ప్రతీకారం తీర్చుకోవాలనే భావనకు నిజ క్రైస్తవులెందుకు లొంగిపోరు? (బి) మనం ఏ ప్రశ్నలను, బైబిల్లోని ఏ అధ్యాయాన్ని పరిశీలిస్తాం?

3, 4. (ఎ) రోమీయులు 12వ అధ్యాయం ఆరంభంలో పౌలు ఏమి చర్చించాడు, “కాబట్టి” అని ఆయన ఉపయోగించిన పదానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది? (బి) రోములోని క్రైస్తవులపై దేవుని వాత్సల్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉంటుంది?

5. (ఎ) ఒక వ్యక్తి తననుతాను దేవునికి “యాగముగా” ఎలా సమర్పించుకోవచ్చు? (బి) క్రైస్తవుని ప్రవర్తనను ఏ సూత్రం ప్రభావితం చేయాలి?

6. రోమీయులు 12:​1, 2లోని పౌలు తర్కం ఆధారంగా పగతీర్చుకోకుండా ఉండేలా మనల్ని ఏది పురికొల్పుతుంది?

7. రోమీయులు 12వ అధ్యాయంలో ఎలాంటి ప్రేమ వివరించబడింది?

8. మనమెలా నిష్కపటమైన ప్రేమను చూపించవచ్చు?

9. పౌలు పదేపదే ఎలాంటి హెచ్చరికనిచ్చాడు?

10. మనల్ని హింసించేవారిని మనమెలా దీవించవచ్చు?

11. (ఎ) స్తెఫను మాదిరినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) పౌలు జీవితం ఉదాహరించినట్లుగా, కొందరి హింసకుల్లో ఎలాంటి మార్పు కలగవచ్చు?

12. రోమీయులు 12:​9, 17లోని హెచ్చరికా మాటలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగివున్నాయి?

13. ‘మనుష్యులందరి దృష్టిలో’ మనమేవిధంగా ప్రవర్తిస్తాం?

14. సమాధానంగా ఉండేందుకు మనమెంతమేరకు కృషిచేయాలి?

15. పగతీర్చుకోకుండా ఉండాలని తెలియజేసే ఏ కారణం రోమీయులు 12:​19లో కనబడుతుంది?

16, 17. (ఎ) ఒక వ్యక్తి తలపై ‘నిప్పులు కుప్పగా పోయడం’ అంటే అర్థమేమిటి? (బి) దయ చూపించడంవల్ల ఒక అవిశ్వాసి హృదయం మెత్తబడడం మీరు వ్యక్తిగతంగా గమనించారా? అలాగైతే, ఒక ఉదాహరణ చెప్పండి.

18. పగతీర్చుకోకుండా ఉండడం ఎందుకు సరైనది, ప్రేమపూర్వకమైనది, వినయపూర్వకమైనది?

19. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడతాయి?

[22వ పేజీలోని బాక్సు]

రోమీయులు 12వ అధ్యాయం, ఒక క్రైస్తవునికి

యెహోవాతో

తోటి విశ్వాసులతో

అవిశ్వాసులతో

ఉండే సంబంధాన్ని వివరిస్తోంది

[23వ పేజీలోని చిత్రం]

పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక క్రైస్తవులకు ఆచరణాత్మక ఉపదేశాన్నిస్తోంది

[25వ పేజీలోని చిత్రం]

శిష్యుడైన స్తెఫను మాదిరినుండి మనమేమి నేర్చుకోవచ్చు