కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జాతివివక్షకు పరిష్కారం ఏమిటి?

జాతివివక్షకు పరిష్కారం ఏమిటి?

జాతివివక్షకు పరిష్కారం ఏమిటి?

స్పెయిన్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు రిఫరీ ఆటను నిలిపేశాడు. ఎందుకు? చాలామంది ప్రేక్షకులు కామెరూన్‌ దేశానికి చెందిన ఆటగాణ్ణి దూషించడం మొదలుపెట్టినప్పుడు అతను ఆటస్థలం వదిలి వెళ్ళిపోతానని బెదిరించాడు కాబట్టి, ఆయన ఆటను నిలిపేశాడు. రష్యాలో ఆఫ్రికన్లమీద, ఆసియావారిమీద, లాటిన్‌ అమెరికన్‌ దేశస్థులమీద దౌర్జన్యపూరిత దాడులు సర్వసాధారణమయ్యాయి, అక్కడ 2004లో జాతి విద్వేషానికి సంబంధించిన దాడులు 55 శాతం పెరిగి, 2005లో 394 సంఘటనలు జరిగాయి. బ్రిటన్‌లో, ఒక సర్వేలో పాల్గొన్న ఆసియావారిలో, నల్లజాతివారిలో మూడింట ఒక వంతు మంది, తాము జాతి వివక్ష కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లు భావించారు. ఈ ఉదాహరణలు ప్రపంచవ్యాప్త పోకడను ప్రతిబింబిస్తున్నాయి.

అవమానకరమైన లేక ఆలోచనారహిత మాటలతో మొదలుకొని ఒక జాతిని నిర్మూలించే ప్రయత్నాలను జాతీయ విధానంగా ఏర్పరచుకోవడం వరకు జాతి వివక్షయొక్క తీవ్రత ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు. * జాతి వివక్షకు మూలకారణమేమిటి? మనం దానిని కనబరచకుండా ఎలా ఉండవచ్చు? ఏదో ఒకరోజున, మానవ కుటుంబాలన్నీ శాంతితో కలిసి జీవిస్తాయని ఆశించడం సముచితమేనా? ఈ విషయాల గురించి బైబిలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది.

అణచివేత, ద్వేషం

“నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 8:​21) అందుకే, ఇతరులను అణచివేయడంలో కొందరు ఆనందం పొందుతారు. బైబిలు ఇంకా ఇలా చెబుతోంది: “బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు.”​—⁠ప్రసంగి 4:⁠1.

జాతి విద్వేషం ఎంతోకాలం క్రితం కూడా ఉండేదని బైబిలు చెబుతోంది. ఉదాహరణకు, 3,700 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, ఐగుప్తు ఫరో, హెబ్రీయుడైన యాకోబును, ఆయన పెద్ద కుటుంబాన్ని ఐగుప్తులో స్థిరపడమని ఆహ్వానించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వేరే ఫరో, వలసదారుల ఈ పెద్ద గుంపువల్ల హాని జరుగుతుందని భావించాడు. అందువల్ల, “అతడు తన జనులతో ఇట్లనెను​—⁠ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి. . . . కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమిం[చారు]” అని ఆ వృత్తాంతం చెబుతోంది. (నిర్గమకాండము 1:​9-11) యాకోబు వంశీయులకు పుట్టే మగపిల్లలందరినీ చంపమని కూడా ఆ ఐగుప్తీయులు ఆజ్ఞాపించారు.​—⁠నిర్గమకాండము 1:​15, 16.

మూలకారణమేమిటి?

జాతి వివక్షను వ్యతిరేకించడంలో ప్రపంచ మతాలు అరుదుగా దోహదపడ్డాయి. కొంతమంది అణచివేతను ధైర్యంగా వ్యతిరేకించినా సాధారణంగా మతాలన్నీ అణచివేసేవారికే ఎక్కువగా మద్దతునిచ్చాయి. అమెరికాలో అలాగే జరిగింది, చట్టం మూలంగా, అల్లరిమూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని హతమార్చడం మూలంగా నల్లజాతివారు అణచివేయబడ్డారు, అక్కడ మిశ్రిత వివాహాలమీద ఆంక్షలు విధించే చట్టాలు కూడా 1967వ సంవత్సరం వరకు అమలులో ఉండేవి. దక్షిణాఫ్రికాలో జాతి వెలి విధానం అమలులో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది, వివిధ వర్ణాల ప్రజల మధ్య జరిగే వివాహంమీద నిషేధం విధించడం వంటి చట్టాల ద్వారా అక్కడి అల్పసంఖ్యాకులు పెత్తనం చెలాయించారు. ఈ రెండు సందర్భాల్లోనూ, వివక్షను సమర్థించిన జాతికి చెందిన కొందరు ఎంతో మతనిష్ఠగలవారే.

అయితే, జాతి వివక్షకుగల అంతర్గత కారణాన్ని బైబిలు తెలియజేస్తుంది. కొన్ని జాతులవారు ఇతరులను ఎందుకు అణచివేస్తున్నారో అది వివరిస్తోంది. అదిలా చెబుతోంది: “దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. ఎవడైనను​—⁠నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:​8, 20) జాతి వివక్షకుగల మూలకారణాన్ని ఆ వాక్యం తెలియజేస్తుంది. దానిని కనబరిచేవారు దేవుణ్ణి తెలుసుకోలేదు లేదా ఆయనను ప్రేమించలేదు కాబట్టి తాము మతనిష్ఠగలవారని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అలా ప్రవర్తిస్తారు.

జాతి సామరస్యానికి దేవుని జ్ఞానం ఆధారం

దేవుణ్ణి తెలుసుకోవడంవల్ల, ఆయనను ప్రేమించడంవల్ల జాతి సామరస్యం ఎలా ఏర్పడుతుంది? భిన్నంగా కనిపించే వారికి ప్రజలు హాని తలపెట్టకుండా ఉండేందుకు దోహదపడే ఏ జ్ఞానం దేవుని వాక్యంలో ఉంది? యెహోవా మానవులందరికీ తండ్రి అని బైబిలు తెలియజేస్తుంది. అదిలా చెబుతోంది: “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయన నుండి సమస్తమును కలిగెను.” (1 కొరింథీయులు 8:⁠6) అంతేకాక, అదిలా చెబుతోంది: “ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టిం[చాడు].” (అపొస్తలుల కార్యములు 17:​26) ఆ విధంగా, మనుష్యులందరూ సహోదరులే.

దేవుని నుండి జీవం అనుగ్రహించబడిన కారణంగా జాతులన్నీ గర్వించవచ్చు గానీ అవి తమ పూర్వీకుల గురించి నొచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. బైబిలు రచయిత పౌలు ఇలా రాశాడు: ‘ఒక మనుష్యుని ద్వారా పాపము లోకంలో ప్రవేశించింది.’ కాబట్టి, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:​23; 5:​12) యెహోవా వైవిధ్యంగల దేవుడు, ఏ రెండు ప్రాణులు ఖచ్చితంగా ఒకే విధంగా ఉండవు. అయినా, తాము గొప్పవారమని భావించే విధంగా ఆయన ఏ జాతినీ సృష్టించలేదు. తమ జాతి ఇతర జాతులకన్నా గొప్పదని సర్వత్రా వ్యాపించివున్న భావన, లేఖనాల్లోని వాస్తవాలకు విరుద్ధం. స్పష్టంగా, దేవుని నుండి మనం పొందే జ్ఞానం జాతి సామరస్యాన్ని ప్రోత్సహిస్తోంది.

జనాంగాలన్నింటిపట్ల దేవునికున్న శ్రద్ధ

ఇశ్రాయేలీయులపట్ల అనుగ్రహం చూపించి ఇతర జనాంగాల నుండి వేరుగా ఉండమని వారికి బోధించడం ద్వారా దేవుడు జాతిపట్ల దురభిమానాన్ని ప్రోత్సహించాడేమో అని కొందరు అనుకున్నారు. (నిర్గమకాండము 34:​12) ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రాహాము కనబరిచిన అసాధారణ విశ్వాసం కారణంగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేక స్వాస్థ్యంగా ఒకప్పుడు ఎన్నుకున్నాడు. దేవుడే ప్రాచీన ఇశ్రాయేలును పరిపాలించి, వారి పరిపాలకులను ఎన్నుకున్నాడు, వారికి ఒక నియమావళి కూడా ఇచ్చాడు. ఈ ఏర్పాటును ఇశ్రాయేలీయులు అంగీకరించినప్పుడు, దేవుడు నడిపించే ప్రభుత్వంవల్ల కలిగిన ఫలితాలకూ, వేరేచోట్ల మానవులు నడిపించే ప్రభుత్వంవల్ల కలిగిన ఫలితాలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇతర జనాంగాలు గమనించగలిగాయి. మానవజాతి దేవునితో సత్సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి బలి అర్పించాల్సిన అవసరం ఉందని కూడా అప్పటి ఇశ్రాయేలీయులకు యెహోవా బోధించాడు. కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన విధానం అన్ని జనాంగాలకు ప్రయోజనం చేకూర్చింది. అది ఆయన అబ్రాహాముతో చెప్పినదానికి అనుగుణంగా ఉంది: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.”​—⁠ఆదికాండము 22:​18.

అంతేకాక, యూదులు దేవోక్తులు పొందే ఆధిక్యతను, మెస్సీయ జన్మించే జనాంగంగా ఉండే ఆధిక్యతను పొందారు. అయితే జనాంగాలన్నీ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో అలా చేయబడింది. యూదులకు ఇవ్వబడిన హెబ్రీ లేఖనాల్లో, జాతులన్నీ గొప్ప ఆశీర్వాదాలు పొందే కాలం గురించిన సంతోషకరమైన వివరణ ఉంది: “ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి . . . యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును . . . జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”​—⁠మీకా 4:​2-4.

యేసుక్రీస్తు స్వయంగా యూదులకు బోధించినా, ఆయన కూడా ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:​14) సువార్త వినని జనాంగమంటూ ఏదీ ఉండదు. కాబట్టి, జాతులన్నింటితో నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో యెహోవా పరిపూర్ణ మాదిరినుంచాడు. “దేవుడు పక్షపాతి కాడు . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

దేవుడు ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన నియమాలు కూడా ఆయనకు జనాంగాలన్నింటిపట్ల శ్రద్ధ ఉందని చూపిస్తోంది. దేశంలో నివసిస్తున్న అన్యులపట్ల కేవలం సహనం కనబరిస్తే సరిపోదని ధర్మశాస్త్రం ఎలా ఆజ్ఞాపించిందో గమనించండి, దానిలో ఇలా ఉంది: “మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.” (లేవీయకాండము 19:​34) వలసదారులపట్ల దయతో వ్యవహరించాల్సిందిగా దేవుని అనేక నియమాలు ఇశ్రాయేలీయులకు బోధించాయి. అందుకే, యేసు పితరుడైన బోయజు, అవసరంలోవున్న పరదేశి స్త్రీ పరిగె ఏరుకోవడాన్ని చూసినప్పుడు ఆమె ఏరుకునేలా విస్తారంగా ధాన్యాన్ని విడిచిపెట్టమని కోతపనివారిని ఆదేశించడం ద్వారా తాను దేవుని నుండి నేర్చుకున్న ప్రకారంగా వ్యవహరించాడు.​—⁠రూతు 2:​1, 10, 16.

దయ కనబరచమని యేసు బోధించాడు

యేసు ఇతరులకన్నా అధికంగా దేవుని జ్ఞానం గురించి తెలియజేశాడు. వేరే జాతివారిపట్ల దయతో ఎలా వ్యవహరించాలో ఆయన తన అనుచరులకు చూపించాడు. ఆయన ఒకసారి సమరయ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అనేకమంది యూదులు సమరయులను హీనంగా చూసేవారు కాబట్టి ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. యేసు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె ఎలా నిత్యజీవాన్ని సంపాదించుకోగలదో అర్థంచేసుకోవడానికి దయతో ఆమెకు సహాయం చేశాడు.​—⁠యోహాను 4:​7-14.

స్నేహపూరిత సమరయుని గురించిన ఉపమానాన్ని వివరించడం ద్వారా మనం ఇతర జాతులవారితో ఎలా వ్యవహరించాలో కూడా యేసు బోధించాడు. దొంగల బారిన పడి తీవ్రంగా గాయాలపాలైన యూదుణ్ణి ఆ వ్యక్తి చూస్తాడు. ఆ సమరయుడు వెంటనే ఇలా అనుకొనివుండవచ్చు: ‘నేను ఒక యూదునికి ఎందుకు సహాయం చేయాలి? యూదులు మమ్మల్ని హీనంగా చూస్తారు.’ అయితే ఆ సమరయునికి అపరిచితులపట్ల భిన్న దృక్కోణం ఉన్నట్లు యేసు వివరించాడు. గాయాలపాలైన ఆ యూదుణ్ణి చూసి కూడా ఆయనకు సహాయం చేయకుండా ఇతర ప్రయాణికులు వెళ్లినా, ఆ సమరయుడు “అతనిమీద జాలిపడి” ఎంతో సహాయం చేశాడు. దేవుని అనుగ్రహం పొందాలని కోరుకునేవారు కూడా అలాగే చేయాలని చెప్పడం ద్వారా యేసు ఆ ఉపమానాన్ని ముగించాడు.​—⁠లూకా 10:​30-37.

దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకునేవారు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకొని దేవుడు ప్రజలతో వ్యవహరించే విధానాన్ని అనుకరించాలని అపొస్తలుడైన పౌలు బోధించాడు. పౌలు ఇలా రాశాడు: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని . . . లేదుగాని, . . . వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”​—⁠కొలొస్సయులు 3:​9-14.

దేవుని జ్ఞానం ప్రజల్లో మార్పు తీసుకువస్తుందా?

ప్రజలు యెహోవా దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ఇతర జాతులవారితో వారు వ్యవహరించే విధానం నిజంగా మారుతుందా? ఆసియా దేశం నుండి కెనడాకు వలసవచ్చిన ఒక మహిళ ఉదాహరణను పరిశీలించండి, ఆమె అక్కడ వివక్షకు గురైనప్పుడు బాధపడింది. ఆమె యెహోవాసాక్షులను కలుసుకుంది, వారు ఆమెతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత, ఆమె తన కృతజ్ఞతను తెలియజేస్తూ ఒక ఉత్తరం రాసింది, దానిలో ఆమె ఇలా రాసింది: “మీరు ఎంతో స్నేహభావంగల, దయగల శ్వేతజాతీయులు. మీకూ ఇతర శ్వేతజాతీయులకూ మధ్య నిజంగా వ్యత్యాసం ఉందని నేను గుర్తించినప్పుడు, అలా ఎందుకు ఉందో అని నేను ఆలోచించాను. నేను ఆలోచించి, ఆలోచించి మీరు దేవుని సాక్షులు అనే నిర్ధారణకు వచ్చాను. బైబిల్లో ఏదో ఉంది. నేను మీ కూటాల్లో ఒకే వర్ణంలో ఉన్నవారిని అంటే అద్దంలాంటి స్వచ్ఛమైన హృదయాలుగల ఎంతోమంది శ్వేతజాతీయులను, నల్లజాతి వారిని, గోధుమరంగులో ఉన్నవారిని, పసుపు మేనిఛాయగలవారిని చూశాను. వారిని అంతటి స్నేహపూరితులుగా ఎవరు తయారుచేశారో నాకిప్పుడు తెలిసింది. మీ దేవుడే వారిని అలా చేశాడు.”

దేవుని వాక్యం, “లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండు” కాలం గురించి ప్రవచిస్తోంది. (యెషయా 11:⁠9) ఇప్పుడు కూడా బైబిలు ప్రవచన నెరవేర్పులో భాగంగా, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన లక్షలాదిమందిగల ఒక గొప్ప సమూహం సత్యారాధనలో ఐక్యపర్చబడుతోంది. (ప్రకటన 7:⁠9) ద్వేషం స్థానంలో ప్రేమ నెలకొల్పబడి, అబ్రాహాముకు యెహోవా వెల్లడిచేసిన సంకల్పం త్వరలో నెరవేరే ప్రపంచవ్యాప్త సమాజం కోసం వారు ఎదురుచూస్తున్నారు: “భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడును.”​—⁠అపొస్తలుల కార్యములు 3:​25.

[అధస్సూచి]

^ పేరా 3 “జాతి” అనే పదం, తెగ, దేశం, మతం, భాష లేక సంస్కృతి కారణంగా ఇతరులకు భిన్నంగావున్న జనాభాకు సంబంధించిన విషయాలను వర్ణించేందుకు ఉపయోగించబడుతుంది.

[4, 5వ పేజీలోని చిత్రం]

పరదేశులను ప్రేమించాల్సిందిగా దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు బోధించింది

[5వ పేజీలోని చిత్రం]

స్నేహశీలుడైన సమరయుని ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

[6వ పేజీలోని చిత్రాలు]

తాము గొప్పవారమని భావించేలా దేవుడు ఏ జాతినీ సృష్టించలేదు