కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“భాషా భేదాలున్నా ప్రేమచేత ఐక్యమయ్యారు”

“భాషా భేదాలున్నా ప్రేమచేత ఐక్యమయ్యారు”

“భాషా భేదాలున్నా ప్రేమచేత ఐక్యమయ్యారు”

విడుదల. విముక్తి. రక్షణ. ఎన్నో శతాబ్దాలుగా ప్రజలు తమ భారాల నుండి చింతల నుండి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నారు. జీవిత సమస్యలను మనమెలా ఎదుర్కోవచ్చు? వాటి నుండి ఎప్పటికైనా విడుదల లభిస్తుందా? లభిస్తే, ఎలా లభిస్తుంది?

యెహోవాసాక్షులు నిర్వహించిన మూడు దినాల జిల్లా సమావేశాల పరంపర దాని గురించే చర్చించింది, ఆ సమావేశాల పరంపర 2006 మే నెలలో ప్రారంభమైంది. ఆ సమావేశాల ముఖ్యాంశం “విడుదల సమీపించింది!”

వాటిలో తొమ్మిది సమావేశాలకు వివిధ దేశాల నుండి వచ్చిన వేలాదిమంది ప్రతినిధులు హాజరయ్యారు. అవి 2006వ సంవత్సరంలోని జూలై, ఆగస్టు నెలల్లో, ఛెక్‌ రిపబ్లిక్‌ రాజధాని అయిన ప్రేగ్‌లో, స్లొవేకియా రాజధాని అయిన బ్రటిస్లావాలో, పోలాండ్‌లోని కోజువ్‌, పోజ్‌నాన్‌ నగరాల్లో, డార్టమండ్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, హంబర్గ్‌, లెయిప్జిగ్‌, మ్యూనిక్‌ అనే ఐదు జర్మన్‌ నగరాల్లో నిర్వహించబడ్డాయి. * ఆ సమావేశాలన్నింటికీ 3,13,000 కన్నా ఎక్కువమంది హాజరయ్యారు.

ఆ సమావేశాల్లో ఎలాంటి వాతావరణం కనిపించింది? ప్రసార మాధ్యమాలు వాటి గురించి ఎలాంటి నివేదికలను ఇచ్చాయి? సమావేశానికి హాజరైనవారికి దానిమీద ఎలాంటి అభిప్రాయం కలిగింది?

సమావేశ సన్నాహాలు

ఆ సమావేశాలు మరువరాని ఆధ్యాత్మిక సందర్భాలుగా నిలుస్తాయని సందర్శకులు, స్థానిక సాక్షులు నమ్మారు కాబట్టి వారు ఎంతో ఉత్సుకతతో వాటికోసం ఎదురుచూశారు. ప్రతినిధుల కోసం తగినన్ని వసతులు కల్పించడం పెద్ద పనే. ఉదాహరణకు, కోజువ్‌ సమావేశంలో, పోలిష్‌ సాక్షులు తూర్పు ఐరోపా నుండి వచ్చిన దాదాపు 13,000 మంది అతిథులను తమ గృహాల్లో ఉంచుకునేందుకు ముందుకువచ్చారు. ఆ సమావేశానికి అమెరికా, అర్మేనియా, ఉజ్‌బెకిస్తాన్‌, ఎస్తోనియా, కజక్‌స్తాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, జార్జియా, టర్క్‌మెనిస్తాన్‌, తజకిస్థాన్‌, బెలారస్‌, మాల్డొవా, యుక్రెయిన్‌, రష్యా, లాట్వియా, లిథువానియా దేశాల నుండి ప్రతినిధి వర్గాలు వచ్చాయి.

చాలామంది ప్రతినిధులు తమ ప్రయాణ సన్నాహాలను ఎన్నో నెలల ముందుగా మొదలుపెట్టాల్సి వచ్చింది. జపాన్‌కి ఈశాన్యం వైపు నెలకొనివున్న కామ్‌చట్కా అనే రష్యా ద్వీపకల్పంలో పూర్తికాల సువార్తికురాలిగా సేవచేస్తున్న టాట్యానా ఒక ఏడాది ముందుగానే ప్రయాణం కోసం డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. ఆమె దాదాపు 10,500 కిలోమీటర్లు ప్రయాణించాల్సివచ్చింది. మొదటిగా, ఆమె ఐదు గంటలు విమానయానం చేసింది, ఆ తర్వాత దాదాపు మూడు రోజులు రైల్లో ప్రయాణించింది, చివరకు బస్సులో 30 గంటలు ప్రయాణించి కోజువ్‌కు చేరుకుంది.

సమావేశానికి ముందు జరిగే పని కోసం వేలాదిమంది స్వచ్ఛంద సేవకులు వచ్చి, స్టేడియంను, దాని పరిసరాలను ఆరాధనకు తగ్గట్లు మార్చారు. (ద్వితీయోపదేశకాండము 23:​14) ఉదాహరణకు, లెయిప్జిగ్‌ నగరంలో స్థానిక సాక్షులు స్టేడియంను చక్కగా శుభ్రం చేశారు, వారు సమావేశం తర్వాత కూడా దానిని శుభ్రం చేస్తామని మాటిచ్చారు. దానివల్ల ఆ స్టేడియం అధికారులు దాని అద్దెకు సంబంధించిన కాంట్రాక్ట్‌లో ఒక నిబంధనను తీసేశారు, ఆ నిబంధన ప్రకారమైతే స్టేడియంను శుభ్రం చేయడానికయ్యే ఖర్చును భరించడానికి అత్యధిక మొత్తం చెల్లించాలి.

ఆహ్వానాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు “విడుదల సమీపించింది!” సమావేశాలకు ఎంతో ప్రచారం చేశాయి. ప్రత్యేక జిల్లా సమావేశాలకు హాజరయ్యేవారు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు సమావేశం గురించి సమావేశపు ముందు రోజు సాయంత్రం చీకటిపడేంతవరకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కనబరిచిన ఉత్సాహంవల్ల మంచి ఫలితాలేవైనా లభించాయా?

బోగ్డన్‌ అనే పోలిష్‌ సాక్షి, సమావేశానికి హాజరవ్వాలనుకున్న ఒక వృద్ధుణ్ణి కలుసుకున్నాడు, తనకువచ్చే కొద్దిపాటి పెన్షన్‌తో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోజువ్‌కు రాలేనని ఆ వృద్ధుడు చెప్పాడు. స్థానిక సంఘం అద్దెకు తీసుకున్న బస్సులో ఒక సీటు ఖాళీగా ఉందని తెలిసింది. బోగ్డన్‌ ఇలా చెబుతున్నాడు: “ఉదయం 5:30కి మేము బయలుదేరే స్థలానికి వస్తే ఉచితంగా తీసుకువెళ్తామని మేము ఆయనకు చెప్పాం.” ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, సమావేశానికి హాజరయ్యాడు. ఆ తర్వాత సహోదరులకు ఉత్తరంలో ఆయనిలా రాశాడు: “ఈ సమావేశానికి హాజరైన తర్వాత ఒక మంచి వ్యక్తిగా మారాలని నిర్ణయించుకున్నాను.”

ప్రేగ్‌లో, బ్రిటన్‌ నుండి వచ్చిన సమావేశ ప్రతినిధులున్న ఒక హోటల్‌లో బసచేసిన ఒక వ్యక్తి ఒకరోజు సాయంత్రం, ఆ రోజు కార్యక్రమాలకు తాను కూడా హాజరైనట్లు సమావేశానికి హాజరైనవారితో చెప్పాడు. సమావేశానికి హాజరవడానికి ఆయనను ఏది ప్రోత్సహించింది? ఆ నగర వీధుల్లో పదిమంది వేర్వేరు ప్రచారకుల నుండి ఆహ్వానపత్రికలను పొందిన తర్వాత సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అనిపించినట్లు ఆయన చెప్పాడు! ఆ కార్యక్రమం ఆయనను ఎంతో ఆకట్టుకుంది, ఆయన ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు.​—⁠1 తిమోతి 2:​3, 4.

బలమైన ఆధ్యాత్మిక కార్యక్రమం

ఆ కార్యక్రమం, వివిధ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చర్చించింది. లేఖనాల నుండి ఇవ్వబడిన సూటియైన సలహా ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో లేక సహించాలో వివరించింది.

వృద్ధాప్యం, అనారోగ్యం, ప్రియమైనవారు చనిపోవడంవంటి వాటితోపాటు, ఇతర వ్యక్తిగత సమస్యలతో సతమతమౌతున్న వారు జీవితాన్ని సరైన దృష్టితో చూడడానికి బైబిలు నుండి ప్రోత్సాహం పొందారు. (కీర్తన 72:​12-14) సంతోషకరమైన వివాహ జీవితాన్ని ఎలా గడపాలి, పిల్లలను విజయవంతంగా ఎలా పెంచాలి అనే అంశాలమీద వివాహిత దంపతులు, తల్లిదండ్రులు బైబిలు ఉపదేశాన్ని విన్నారు. (ప్రసంగి 4:​12; ఎఫెసీయులు 5:​22, 25; కొలొస్సయులు 3:​21) పాఠశాలలో తోటి విద్యార్థుల చెడు ఒత్తిడికి గురైనా తమ ఇంట్లో, సంఘంలో జ్ఞానయుక్తమైన ఉపదేశం పొందే యువ క్రైస్తవులు, తోటివారి నుండి వచ్చే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ‘యౌవనేచ్ఛల నుండి పారిపోవాలి’ అనే అంశాలమీద ఆచరణాత్మక ఉపదేశాన్ని పొందారు.​—⁠2 తిమోతి 2:​22.

నిజమైన అంతర్జాతీయ సహోదరత్వం

యెహోవాసాక్షులు ఎల్లప్పుడూ తమ సమావేశాల్లో ఆచరణాత్మక లేఖనాధార నిర్దేశాన్ని పొందుతారు. (2 తిమోతి 3:​16) అయితే, ఈ సమావేశాలకు అంతర్జాతీయ కళ ఉంది కాబట్టి అవి ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి ప్రత్యేక జిల్లా సమావేశాలన్నిటిలో ఒకే ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక భాషల్లో అందించబడింది. ప్రతీరోజు, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుల ప్రసంగాలు, ఇతర దేశాల నివేదికలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. సమావేశాలకు హాజరైన వివిధ భాషా గుంపుల ప్రయోజనార్థం ఆ ప్రసంగాలు, నివేదికలు అనువదించబడ్డాయి.

ప్రతినిధులు ఇతర దేశాల నుండి వచ్చిన సహోదర సహోదరీలను కలుసుకోవడానికి ఉత్సాహాన్ని కనబరిచారు. “భాషా భేదాలవల్ల ఎలాంటి సమస్యలూ రాలేదు. బదులుగా, అది సమావేశాన్ని ఆనందమయంగా చేసింది. వివిధ సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన అతిథులు వచ్చారు, అయితే ఒకే విశ్వాసం వారిని ఐక్యపరిచింది” అని ఒక ప్రతినిధి చెప్పాడు. మ్యూనిక్‌లో జరిగిన సమావేశానికి హాజరైనవారు తమ అభిప్రాయాన్ని ఇలా చెప్పారు: “భాషా భేదాలున్నా ప్రేమచేత ఐక్యమయ్యాం.” సమావేశానికి హాజరైనవారు ఏ దేశానికి చెందినవారైనా, ఏ భాషవారైనా నిజమైన ఆధ్యాత్మిక స్నేహితులైన సహోదర సహోదరీల మధ్య ఉన్నట్లు భావించారు.​—⁠జెకర్యా 8:​23.

కృతజ్ఞతను వ్యక్తం చేయడం

పోలాండ్‌లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, వాతావరణం ప్రతినిధుల దృక్పథాన్ని, సహనాన్ని పరీక్షించింది. దాదాపు సమావేశపు రోజులన్నీ వర్షం కురవడమే కాక వాతావరణం ఎంతో చల్లగా ఉంది, ఉష్ణోగ్రత దాదాపు 14 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అమెరికాకు చెందిన ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “సమావేశంలో ఇంత ఘోరమైన వాతావరణాన్ని, ఇంత తక్కువ ఉష్ణోగ్రతను నేనిదివరకు ఎన్నడూ చూడలేదు, అదీగాక నాకు కార్యక్రమం అంతగా అర్థంకాలేదు. అయితే ఆశ్చర్యకరమైన అంతర్జాతీయ సమావేశపు వాతావరణం, అద్భుతమైన స్ఫూర్తి, అసాధారణ ఆతిథ్యం వాటన్నిటినీ మరిపించాయి. అది మరపురాని సమావేశం!”

పోలిష్‌ భాషా సమావేశానికి హాజరైనవారికి ఒక మరపురాని అనుభవం ఎదురైంది, ఆ సమావేశంలో లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) పుస్తకం పోలిష్‌ భాషలో విడుదల చేయబడుతున్నట్లు ప్రకటించబడింది, ఆ సమావేశంలో ఉన్న చలిని, వర్షాన్ని భరించినందుకు వారికి అద్భుతమైన బహుమానమే లభించింది. “విడుదల సమీపించింది!” సమావేశాలన్నిటిలో, యెహోవా దినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకం విడుదలైనప్పుడు కూడా సమావేశానికి హాజరైనవారు ఆనందించారు.

ఆ సమావేశానికి హాజరైన అనేకమంది ఇతర కారణాలనుబట్టి కూడా ఆ సమావేశాన్ని గుర్తుంచుకుంటారు. విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులతోపాటు బస్సులో ప్రయాణించడానికి ముందుకు వచ్చిన ఒక ఛెక్‌ సహోదరి ఇలా గుర్తుచేసుకుంటోంది: “మేము వీడ్కోలు చెప్పుకుంటున్నప్పుడు ఒక సహోదరి నన్ను ప్రక్కకు తీసుకువెళ్లి, నన్ను కౌగలించుకొని ఇలా అంది: ‘మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు! మేము కూర్చున్న చోటికే మీరు భోజనం తీసుకువచ్చి త్రాగే నీళ్లు కూడా ఇచ్చారు. మీరు కనబరచిన స్వయంత్యాగ ప్రేమకు ఎన్నో కృతజ్ఞతలు.’” విదేశీ ప్రతినిధులకు మధ్యాహ్నం ఏర్పాటు చేయబడిన భోజనం గురించి ఆమె ప్రస్తావించింది. ఒక సహోదరుడు ఇలా వివరించాడు: “గతంలో మేమెన్నడూ ఇలా చేయలేదు. మేము ప్రతీరోజు దాదాపు 6,500 ఆహార పొట్లాలు అందించాల్సి వచ్చింది. పిల్లలతోపాటు ఎంతోమంది ఈ పనిలో చేయూతనిచ్చేందుకు ముందుకురావడాన్ని గమనించడం చూడముచ్చటగా ఉంది.”

సమావేశం కోసం యుక్రెయిన్‌ నుండి కోజువ్‌కు ప్రయాణం చేసిన ఒక సహోదరి ఇలా చెప్పింది: “మా తోటి విశ్వాసులు కనబరచిన ప్రేమ, శ్రద్ధ, ఉదార స్వభావం మమ్మల్ని ఎంతగానో కదిలించింది. మా కృతజ్ఞతను మేము మాటల్లో చెప్పలేం.” ఫిన్‌లాండ్‌కు చెందిన ఎనిమిదేళ్ల అనైకా పోలాండ్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఇలా రాసింది: “సమావేశం నేను ఊహించగలిగేదానికన్నా ఎంతో బాగుంది. యెహోవా సంస్థలో ఉండడంవల్ల ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు ఉంటారు కాబట్టి దానిలో ఉండడం ఎంతో చక్కని విషయం!”​—⁠కీర్తన 133:⁠1.

సమావేశాలను గమనించినవారి వ్యాఖ్యానాలు

సమావేశం జరిగేముందు, ప్రతినిధుల్లో కొంతమంది చూడదగ్గ ప్రదేశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. బవేరియా దేశపు పల్లె ప్రాంతంలో, సందర్శకులు రాజ్య మందిరాల దగ్గర ఆగారు, అక్కడున్న స్థానిక సాక్షులు వారికి స్వాగతం పలికారు. సహోదరులు కనబరిచిన ఆప్యాయత, ప్రతినిధుల గుంపులోని సాక్షేతర టూర్‌ గైడ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. “మాకూ, టూర్లకు వచ్చే ఇతర గుంపులకూ మధ్య ఎంతో తేడా ఉందని మేము బసచేస్తున్న హోటల్‌కు తిరిగివెళ్తున్నప్పుడు మా టూర్‌ గైడ్‌ చెప్పింది. మేము చక్కగా దుస్తులు ధరించాం, గుంపుకు నాయకత్వం వహిస్తున్నవారికి అందరూ సహకరించారు. తిట్టుకోవడం, గందరగోళం చేయడం వంటివేమీ మా మధ్య లేవు. అపరిచితులు వెంటనే మంచి స్నేహితులుగా ఎలా మారగలరనే ఆశ్చర్యాన్ని ఆమె వ్యక్తం చేసింది” అని ఒక ప్రతినిధి నివేదిస్తున్నాడు.

ప్రేగ్‌ సమావేశంలో వార్తా మాధ్యమాలతో వ్యవహరించే విభాగంలో పనిచేసిన ఒక సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “ఆదివారం ఉదయం, సమావేశ స్థలం దగ్గర నియమించబడిన పోలీసు అధికారి మమ్మల్ని కలుసుకున్నాడు. శాంతి నెలకొని ఉందని తనకు అక్కడ పనేమీ లేదని చెప్పాడు. స్టేడియం చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల్లో కొంతమంది, ఇక్కడ ఎలాంటి కార్యక్రమం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారని కూడా ఆయన చెప్పాడు. యెహోవాసాక్షుల కార్యక్రమం జరుగుతుందని తాను చెప్పినప్పుడు వారు సాధారణంగా భయపడ్డారని ఆయన చెప్పాడు, అప్పుడు ఆ అధికారి వారితో ఇలా అన్నాడు: ‘యెహోవాసాక్షులు ప్రవర్తించినంత చక్కగా ప్రజలు కాస్తలోకాస్తైనా ప్రవర్తిస్తే పోలీసుల అవసరమే ఉండదు.’”

ఇప్పటికే చాలామంది విడుదల పొందారు!

దేవుని వాక్యమైన బైబిలు, సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తూ క్రైస్తవుల మధ్య సమాధానాన్ని, ఐక్యతను నెలకొల్పుతుంది. (రోమీయులు 14:​19; ఎఫెసీయులు 4:​22-24; ఫిలిప్పీయులు 4:⁠7) “విడుదల సమీపించింది!” అనే ప్రత్యేక జిల్లా సమావేశాలు దానిని నిరూపించాయి. ఈ లోకాన్ని పట్టిపీడిస్తున్న అనేక తెగుళ్ల నుండి యెహోవాసాక్షులు ఇప్పటికే విడుదల పొందారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసహనం, దౌర్జన్యం, జాతి విద్వేషం వంటి కొన్ని అంశాలు వారి మధ్య దాదాపు తుడిచేయబడ్డాయి, అంతేకాక ప్రపంచమంతటా అలాంటి సమస్యలు ఉండని కాలం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ఈ సమావేశాలకు హాజరైనవారు వివిధ దేశాలకు, సంస్కృతులకు చెందిన సాక్షుల మధ్య ఉన్న ఐక్యతను వ్యక్తిగతంగా చవిచూశారు. సమావేశాలు ముగిసిన తర్వాత అదెంతో స్పష్టంగా కనిపించింది. అందరూ కరతాళ ధ్వనులు చేశారు, క్రొత్త స్నేహితులను కౌగలించుకున్నారు, చివర్లో ఫొటోలు తీసుకున్నారు. (1 కొరింథీయులు 1:​10; 1 పేతురు 2:​17) ప్రతినిధులు, త్వరలో సమస్యలన్నింటి నుండి, చింతలన్నింటి నుండి విముక్తి పొందుతామనే సంతోషంతో, నమ్మకంతో, దేవుని “జీవవాక్యము” మీద గట్టిపట్టును కాపాడుకోవాలనే పునరుజ్జీవింపజేయబడిన దృఢనిశ్చయంతో తమ ఇళ్లకు, సంఘాలకు తిరిగివెళ్లారు.​—⁠ఫిలిప్పీయులు 2:​15, 16.

[అధస్సూచి]

^ పేరా 4 పోలాండ్‌లోని ఆరు ఇతర సమావేశ స్థలాలతోపాటు స్లొవేకియాలోని ఒక సమావేశ స్థలం అంతర్జాతీయ కార్యక్రమ భాగాల కోసం ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా అనుసంధానం చేయబడ్డాయి.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇరవై ఆరు భాషలవారు ఐక్యతతో మెలిగారు

ఆ తొమ్మిది సమావేశాల్లోనూ కార్యక్రమం స్థానిక భాషలో జరిగింది. జర్మనీలో జరిగిన సమావేశాల్లో 18 ఇతర భాషల్లో ప్రసంగాలు ఇవ్వబడ్డాయి. డార్టమండ్‌ నగరంలో జరిగిన సమావేశంలో అవి అరబిక్‌, పార్శీ, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషల్లో ఇవ్వబడ్డాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆంగ్లం, ఫ్రెంచ్‌, సెర్బియన్‌/క్రోషియన్‌ భాషల్లో; హాంబర్గ్‌లో డచ్‌, డేనిష్‌, తమిళం, స్వీడిష్‌ భాషల్లో ఇవ్వబడ్డాయి. లెయిప్జిగ్‌లో చైనీస్‌, టర్కిష్‌, పోలిష్‌ భాషల్లో; మ్యూనిక్‌లో ఇటాలియన్‌, గ్రీక్‌, జర్మన్‌ సంజ్ఞా భాషల్లో ఇవ్వబడ్డాయి. ప్రేగ్‌ సమావేశంలో ప్రసంగాలన్నీ ఆంగ్లం, జెక్‌, రష్యన్‌ భాషల్లో ఇవ్వబడ్డాయి. బ్రాటిస్లావా సమావేశంలో కార్యక్రమం ఆంగ్లం, స్లోవాక్‌, హంగేరియన్‌ భాషలతోపాటు స్లోవాక్‌ సంజ్ఞా భాషలో జరిగింది. కోజువ్‌ సమావేశంలో పోలిష్‌, పోలిష్‌ సంజ్ఞా భాష, యుక్రేనియన్‌, రష్యన్‌భాషల్లో జరిగింది. పోజ్‌నాన్‌ సమావేశం పోలిష్‌, ఫిన్నిష్‌ భాషల్లో జరిగింది.

మొత్తం ఇరవై ఆరు భాషల్లో కార్యక్రమం జరిగింది! నిజమే, సమావేశానికి హాజరైనవారి మధ్య భాషా భేదాలున్నా వారు ప్రేమచేత ఐక్యమయ్యారు.

[9వ పేజీలోని చిత్రం]

ఫ్రాంక్‌ఫర్ట్‌లోని క్రోషియన్‌ ప్రతినిధులు “నూతనలోక అనువాదము”ను తమ మాతృభాషలో పొంది ఆనందించారు