కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి పోర్చుగీస్‌ బైబిలును పట్టుదలతో అనువదించిన వ్యక్తి

మొదటి పోర్చుగీస్‌ బైబిలును పట్టుదలతో అనువదించిన వ్యక్తి

మొదటి పోర్చుగీస్‌ బైబిలును పట్టుదలతో అనువదించిన వ్యక్తి

“పట్టుదలతో ముందుకుసాగేవారెవరో, వారే నెగ్గుతారు.” ఈ సూక్తి 17వ శతాబ్దానికి చెందిన మతసంబంధ కరపత్రపు ముఖపత్రంపై కనిపిస్తుంది, దానిని జ్వాన్‌ ఫెరేరా డి ఆల్మేడా రాశాడు. బైబిలును పోర్చుగీస్‌ భాషలోకి అనువదించి, దానిని ప్రచురించడానికి తన జీవితాన్నే అంకితం చేసిన ఆ వ్యక్తిని మరే మాటలు అంత చక్కగా వర్ణించలేవు!

ఆల్మేడా 1628లో, ఉత్తర పోర్చుగల్‌లోని టోరీ డి టవారిస్‌ అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆల్మేడాను వాళ్ల బాబాయి పోర్చుగల్‌కు రాజధాని అయిన లిస్బన్‌కి తీసుకెళ్లి పెంచాడు. వాళ్ల బాబాయి ఒక క్రైస్తవ సన్యాసి. సంప్రదాయం ప్రకారం, మతగురువుగా చేయబడడానికి ముందు ఆల్మేడా మంచి విద్యాభ్యాసాన్ని పొందాడు, అది ఆయన చిన్న వయసులోనే భాషా సంబంధంగా అసాధారణ కౌశలాన్ని సంపాదించుకునేందుకు సహాయం చేసింది.

అయితే, ఆయన పోర్చుగల్‌లోనే ఉండిపోయుంటే, బైబిలును అనువదించడానికి బహుశా తన నైపుణ్యాలను ఉపయోగించివుండేవాడు కాదు. స్థానిక భాషల్లో బైబిళ్లు అందుబాటులోకి రావడంతో ఉత్తర, మధ్య ఐరోపాల్లో మత సంస్కరణోద్యమం వెల్లువెత్తింది, అయితే పోర్చుగల్‌ మాత్రం క్యాథలిక్‌ న్యాయసభ అధికార కాడినుండి బయటపడలేకపోయింది. ఒక వ్యక్తి దగ్గర స్థానిక భాషలో బైబిలు ఉంటే చాలు, ఆయన ఖచ్చితంగా క్రైస్తవమత న్యాయసభ ఎదుట విచారణకు నిలబడాల్సివచ్చేది. *

బహుశా ఆ కట్టుదిట్టమైన వాతావరణాన్ని తప్పించుకోవాలనే కోరికతోనే ఆల్మేడా 14 ఏళ్ల వయసులో నెదర్లాండ్స్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి, ఆయన బటావియా (ఇప్పుడు జకర్తా), ఇండోనేషియా మీదుగా ఆసియాకు ప్రయాణమయ్యాడు. అప్పట్లో జకర్తా ఆగ్నేయ ఆసియాలో ఉన్న డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకు కార్యనిర్వహణా కేంద్రంగా ఉండేది.

యువ అనువాదకుడు

ఆసియాకు ఇక చేరుకుంటాడనగా ఆల్మేడా జీవితం గొప్ప మలుపు తిరిగింది. బటావియా, పశ్చిమ మలేషియాలోని మలక్కాల మధ్య (ఇప్పుడు మెలాకా), ఓడలో ప్రయాణిస్తుండగా, ఆయనకు స్పానిష్‌ భాషలో డిఫరెన్షీయాస్‌ డి లా క్రిస్టియన్‌డాడ్‌ (క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్న విబేధాలు) అనే ప్రొటస్టెంట్ల కరపత్రం ఒకటి కంటపడింది. దానిలో అబద్ధ మత సిద్ధాంతాలు ఖండించబడ్డాయనే విషయమేకాక, అందులోని మరో వాక్యం ఆల్మేడా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది, అందులో ఇలా ఉంది: “చర్చిలో ఎవరికీ తెలియని భాషను ఉపయోగిస్తే, దాన్ని దేవుని మహిమ కోసం ఉపయోగించినా అర్థం తెలియని శ్రోతలకు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.”​—⁠1 కొరింథీయులు 14:⁠9.

ఆల్మేడాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది: మతంలోని తప్పులను బయటపెట్టాలంటే బైబిలును అందరికీ అర్థమయ్యేలా చెయ్యాలి. మలక్కాకు చేరుకున్న తర్వాత ఆయన డచ్‌ రిఫార్మ్‌డ్‌ మతంలోకి (సంస్కరణ జరిగిన చర్చికి) మారి, వెంటనే సువార్త పుస్తకాల్లోని భాగాలను స్పానిష్‌ భాష నుండి పోర్చుగీస్‌ భాషలోకి అనువదించి, వాటిని “నిజంగా సత్యం తెలుసుకోవాలన్న ఆసక్తిగలవారికి” పంచిపెట్టడం ఆరంభించాడు. *

రెండు సంవత్సరాల తర్వాత, ఆల్మేడా క్రైస్తవ గ్రీకు లేఖనాలన్నింటినీ లాటిన్‌ వల్గేట్‌ నుండి అనువదించడమనే బృహత్కార్యాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని ఆయన ఒక సంవత్సరంలోపే పూర్తి చేశాడు, పదహారేళ్ల ఒక అబ్బాయి దాన్ని పూర్తి చేయడమనేది చాలా అసాధారణమైన విషయం! దాన్ని ప్రచురించడానికి, ఆయన ఎంతో ధైర్యంగా బటావియాలో ఉన్న అప్పటి డచ్‌ గవర్నర్‌ జనరల్‌కు పంపించాడు. బటావియాలోని రిఫార్మ్‌డ్‌ చర్చి ఆ రాతప్రతుల్ని ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపింది. కానీ ఆ పని అప్పగించబడిన వృద్ధ మతనాయకుడు చనిపోవడంతో ఆల్మేడా చేతిరాత ప్రతులు కనబడకుండా పోయాయి.

సిలోన్‌లోని (ఇప్పుడు శ్రీలంక) రిఫార్మ్‌డ్‌ సంఘం 1651లో తన అనువాదపు ప్రతిని ఇవ్వమని కోరినప్పుడే తన చేతిరాత ప్రతులు చర్చిలో భద్రపర్చబడిన స్థలంనుండి అదృశ్యమైపోయాయని ఆయనకు తెలిసింది. ఆయన నిరాశ చెందకుండా బహుశా తాను ముందు చిత్తుగా రాసిన ప్రతిని ఎలాగో సంపాదించి, మరుసటి సంవత్సరంలోపు సువార్త పుస్తకాలను, అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని సవరించి పూర్తిచేశాడు. దానికి ప్రతిఫలంగా బటావియాలోని మతనాయకుల కార్యనిర్వాహక సభ ఆయనకు 30 గిల్డర్లు ఇచ్చింది. “ఆయన చేసిన పనికి ఆ సొమ్ము చాలా తక్కువ” అని ఆల్మేడాతో పనిచేసిన ఒక వ్యక్తి రాశాడు.

ఆల్మేడాకు అంతగా గుర్తింపు లభించకపోయినా ఆయన తన పనిని నిర్విరామంగా కొనసాగించి, తాను సవరించిన క్రొత్త నిబంధన అంతటినీ 1654లో రిఫార్మ్‌డ్‌ సంఘానికి సమర్పించాడు. మరొకసారి దానిని ఒక పుస్తకంగా ప్రచురించాలనే ప్రస్తావన వచ్చినా, కొన్ని చర్చిల్లో ఉపయోగించడం కోసం కొన్ని రాతప్రతులను సిద్ధం చేయడం మినహా ఇంకేమీ చేయబడలేదు.

న్యాయసభచేత ఖండించబడడం

ఆ తర్వాత పది సంవత్సరాలు ఆల్మేడా రిఫార్మ్‌డ్‌ చర్చిలో పాదిరీగా, మిషనరీగా సేవచేస్తూ గడిపాడు. ఆయన 1656లో ఆ నియామకాలను పొందిన తర్వాత మొదట సిలోన్‌లో సేవ చేశాడు, అక్కడ ఒక సందర్భంలో ఏనుగు కాళ్లక్రింద పడబోయి తృటిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన తొలి మిషనరీల్లో ఆయన కూడా ఉన్నాడు.

ప్రొటస్టెంటుగా మారిన ఆయన వేరే దేశాల్లో మిషనరీగా సేవచేసేవాడు. అందుకే ఆయన వెళ్లిన చోటల్లా పోర్చుగీస్‌ మాట్లాడే సమాజాలవాళ్లు ఆయనను మతభ్రష్టునిగా, ద్రోహిగా చూసేవారు. అంతేకాక ఆయన మతనాయకుల అనైతికతను బాహాటంగా ఖండించి, చర్చి సిద్ధాంతాల్లోని లోపాలను బహిర్గతం చేయడంవల్ల కూడా తరచూ క్యాథలిక్‌ మిషనరీలతో తగవులకు దిగాల్సివచ్చేది. భారతదేశంలో ఉన్న గోవాలోని మతనాయకుల న్యాయసభ ఆల్మేడాను, క్యాథలిక్‌ మతవిరోధిగా ముద్రవేస్తూ 1661లో మరణదండన విధించడంతో ఆ తగవులు చరమాంకానికి చేరుకున్నాయి. ఆయన లేని సమయంలో ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆల్మేడాకున్న వాదించే తత్వం గురించి బహుశా ఆందోళన చెందిన డచ్‌ గవర్నర్‌ జరనర్‌ వెంటనే ఆయనను బటావియాకు పిలిపించుకున్నాడు.

ఆల్మేడా మిషనరీగా ఎంతో ఉత్సాహంతో సేవచేసినా, బైబిలును పోర్చుగీస్‌ భాషలోకి అనువదించాల్సిన అవసరాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. సామాన్య ప్రజలకేకాక మతనాయకులకు కూడా బైబిలు గురించి అంతగా తెలియదని స్పష్టంగా కనిపించడమేకాక, అందువల్ల ఎదురైన పర్యవసానాలను చూసినప్పుడు ఆయన అభీష్టం మరింత బలపడింది. ఆల్మేడా 1668లో రాసిన మతసంబంధ కరపత్రంలోని ముందుమాటలో తన పాఠకులకు ఇలా తెలియజేశాడు: “మీకింతవరకూ ఎవరూ ఇవ్వని గొప్ప బహుమానాన్ని, అత్యంత విలువైన నిధిని అంటే మీ స్వంత భాషలో పూర్తి బైబిలును త్వరలోనే మీకివ్వాలని . . . నేను ఆశిస్తున్నాను.”

ఆల్మేడాకు, సవరింపుల కమిటీకి మధ్య విబేధాలు

ఆల్మేడా 1676లో క్రొత్త నిబంధనను సవరించడం కోసం చివరి చేతిరాత ప్రతిని బటావియాలోని చర్చి కార్యనిర్వాహక సభకు సమర్పించాడు. మొదటినుండే ఆల్మేడాకు, సవరించేవారికి మధ్య బేధాభిప్రాయాలు ఉండేవి. ఆల్మేడాతోపాటు పనిచేసిన డచ్‌ భాష మాట్లాడే కొందరికి కొన్ని వాక్యాల భావంలోని, శైలిలోని సూక్ష్మమైన బేధాలను అర్థం చేసుకోవడం కష్టమనిపించి ఉండవచ్చు అని జీవితచరిత్ర రాసిన జె. ఎల్‌. స్వెలెన్‌గ్రెబెల్‌ వివరించాడు. పదాల ఎంపిక విషయంలో కూడా వాదోపవాదాలు జరిగేవి. బైబిల్లో స్థానికంగా ఉపయోగించబడే పోర్చుగీస్‌ను ఉపయోగించాలా లేక అనేకులకు అర్థంకాని మెరుగుపర్చిన పోర్చుగీస్‌ను ఉపయోగించాలా అనే సమస్య తలెత్తింది. అంతేకాక, ఆ పనిని పూర్తి చేయడం విషయంలో ఆల్మేడా చూపిన ఉత్సాహం కూడా తరచూ తగవులకు దారితీసింది.

బహుశా సవరించేవారి బేధాభిప్రాయాలవల్లనో లేక వారు అంతగా ఆసక్తి కనపర్చకపోవడం వల్లనో ఆ పని చాలా నెమ్మదిగా సాగింది. నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా, సవరించేవారు ఇంకా లూకా పుస్తకంలోని ప్రారంభ అధ్యాయాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆ జాప్యాన్ని భరించలేకపోయిన ఆల్మేడా, సవరించేవారికి తెలియకుండానే తన రాతప్రతుల్లో ఒకదాన్ని ప్రచురించడానికి నెదర్లాండ్స్‌కు పంపాడు.

మతనాయకుల కార్యనిర్వాహక సభ, అది ముద్రించబడకుండా ఆపడానికి విశ్వప్రయత్నం చేసినా ఆయన అనువదించిన క్రొత్త నిబంధన 1681లో ఆమ్‌స్టర్‌డామ్‌లో ముద్రించబడడం ప్రారంభమై, దాని తొలి ప్రతులు ఆ తర్వాతి సంవత్సరమే బటావియాకు చేరుకున్నాయి. అయితే, నెదర్లాండ్స్‌లోని సవరించేవారు తన అనువాదంలో అక్కడక్కడా మార్పులు చేశారని చూసినప్పుడు ఆల్మేడా ఎంతగా నిరాశ చెందివుంటాడో ఊహించండి! పోర్చుగీస్‌ భాష తెలియని కారణంగా వారు “పరిశుద్ధాత్మ యొక్క భావాన్ని మార్చేసేలా అసంబద్ధంగా, సత్యానికి విరుద్ధంగా అనువదించిన పదాలను” దానిలో ప్రవేశపెట్టారని ఆల్మేడా గ్రహించాడు.

డచ్‌ ప్రభుత్వం కూడా అసంతృప్తి చెంది, ప్రతులన్నింటిని సమూలంగా నాశనం చేయాల్సిందిగా ఆజ్ఞ జారీచేసింది. అయితే, ఘోరమైన తప్పులను చేతితో సరిదిద్దే షరతుపై కొన్ని ప్రతులనైనా నాశనం చేయకుండా ఉంచాలని ఆల్మేడా అధికారుల్ని ఒప్పించగలిగాడు. సవరించబడిన ప్రతిని తయారుచేసేంతవరకు అవి ఉపయోగించబడవచ్చనే ఆలోచనతో ఆయనలా చేశాడు.

బటావియాలోని సవరించేవారు మళ్లీ కలిసి క్రైస్తవ గ్రీకు లేఖనాల పనిని కొనసాగించడమేకాక ఆల్మేడా హెబ్రీ లేఖనాల అనువాదాన్ని పూర్తి చేసి ఇస్తుండగా వాటిని కూడా సిద్ధం చేశారు. ఆల్మేడా అసహనం హద్దుమీరుతుందనే భయంతో ఆయన సంతకమున్న ఆఖరు పుటలను చర్చిలో భద్రపర్చాలని కార్యనిర్వాహక సభ నిర్ణయించింది. అయితే, ఆల్మేడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించివుంటాడని వేరే చెప్పనవసరం లేదు.

అప్పటికి దశాబ్దాలుగా పడుతున్న ప్రయాస, ఉష్ణమండల వాతావరణంలోని కష్టతరమైన జీవితం ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. దానివల్ల ఆయన 1689లో చర్చి కార్యకలాపాలను విరమించుకుని హెబ్రీ లేఖనాలను అనువదించే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. విచారకరంగా, ఆయన యెహెజ్కేలులోని ఆఖరి అధ్యాయాన్ని అనువదిస్తుండగా 1691లో తుది శ్వాస విడిచాడు.

తన మరణానికి కొంతకాలం ముందు పూర్తి చేసిన క్రొత్త నిబంధన యొక్క రెండవ ప్రతి 1693లో ముద్రించబడింది. అయితే, అసమర్థులైన సవరించేవారు మరొకసారి దానిని పాడుచేశారు. ఎ బిబ్లియా ఎమ్‌ పోర్చుగల్‌ (పోర్చుగీస్‌ భాషలో బైబిలు) అనే తన పుస్తకంలో జి. ఎల్‌. సాంటోస్‌ ఫెరీరా ఇలా వ్యాఖ్యానించాడు: “సవరించేవారు . . . ఆల్మేడా చేసిన అత్యున్నతమైన అనువాదంలో పెద్దపెద్ద మార్పులు చేశారు, మొదటి ప్రతిని సవరించినవారు మార్చకుండా వదిలేసిన ఉన్నతమైన అనువాదాన్ని వీరు అర్థవిహీనం చేసి, కలుషితం చేశారు.”

పోర్చుగీస్‌ భాషలో బైబిలు పూర్తికావడం

ఆల్మేడా మరణించడంతో, బటావియాలో పోర్చుగీస్‌ భాషా బైబిలును సవరించి, ప్రచురించాలన్న స్ఫూర్తి కరువైంది. లండన్‌కు చెందిన సొసైటీ ఫర్‌ ప్రొమోటింగ్‌ క్రిస్టియన్‌ నాలెడ్జ్‌ అనే సంస్థ, దక్షిణ భారతదేశంలో ఉన్న ట్రాంకీబార్‌లో సేవచేస్తున్న డానిష్‌ మిషనరీల కోరిక మేరకు 1711లో ఆల్మేడా అనువదించిన క్రొత్త నిబంధన యొక్క మూడవ ప్రతిని ప్రచురించడానికి ఆర్థిక మద్దతునిచ్చింది.

ఆ సంస్థ దానిని ట్రాంకీబార్‌లో ముద్రించాలనుకుంది. కానీ ముద్రణా సామగ్రితో, కొన్ని పోర్చుగీస్‌ భాషా బైబిళ్లతో భారతదేశానికి బయలుదేరిన ఓడ ఫ్రాన్స్‌కు చెందిన బందిపోట్ల చేతికి చిక్కింది, వారు ఆ ఓడను దోచుకుని చివరకు బ్రెజిల్‌లోని రియోడిజనీరో నౌకాశ్రయంలో వదిలేశారు. సాంటోస్‌ ఫెరీరా ఇలా రాశాడు: “ఏదో కారణంగా వదిలివేయబడిన ముద్రణా సామగ్రివున్న డబ్బాలు అనూహ్యంగా ఓడలోని సామాన్ల గదిలో అలాగే పదిలంగా ఉన్నాయి, వాటిని అదే ఓడలో ట్రాంకీబార్‌కు తీసుకెళ్లడం జరిగింది.” ఆల్మేడా అనువదించిన మిగతా బైబిలు పుస్తకాల్ని డానిష్‌ మిషనరీలు జాగ్రత్తగా సవరించి, ప్రచురించారు. పోర్చుగీస్‌ భాషలో బైబిలు యొక్క సంపూర్ణ సంపుటి 1751లో అంటే ఆల్మేడా బైబిలును అనువదించడం ప్రారంభించిన దాదాపు 110 సంవత్సరాల తర్వాత ముద్రించబడింది.

అనాదిగా నిలిచిన వారసత్వ సంపద

ఆల్మేడా చాలా చిన్న వయసునుండే, సామాన్య ప్రజలు తమ స్వంత భాషలో సత్యాన్ని గ్రహించగలిగేలా బైబిలు పోర్చుగీస్‌ భాషలో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాడు. తన లక్ష్యసాధనలో ఆయనకు క్యాథలిక్‌ చర్చి నుండి వ్యతిరేకత ఎదురైనా, సమకాలీనుల ఉదాసీనతను ఎదుర్కోవాల్సి వచ్చినా, సవరింపుల విషయంలో అంతులేదన్నట్లుగా సమస్యలు ఎదురైనా, చివరకు తన ఆరోగ్యం క్షీణించినా జీవిత కాలమంతా ఎంతో పట్టుదలతో కృషి చేశాడు. ఆయన పట్టుదలకు ప్రతిఫలం లభించింది.

ఆల్మేడా సువార్తను ప్రకటించిన పోర్చుగీస్‌ సమాజాలు నేటికి తరిగిపోయి, కనుమరుగైపోయాయి. అయితే బైబిలు మాత్రం పదిలంగా ఉంది. బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ, అమెరికన్‌ బైబిల్‌ సొసైటీ అనే సంస్థలు 19వ శతాబ్దంలో ఆల్మేడా అనువదించిన పోర్చుగీస్‌ భాషా బైబిళ్లను బ్రెజిల్‌లోని తీరప్రాంతపు నగరాల్లో వేల సంఖ్యలో పంచిపెట్టాయి. తత్ఫలితంగా, ఆయన అనువదించిన అసలు ప్రతినుండి ముద్రించబడిన బైబిళ్లు ప్రపంచంలోని పోర్చుగీస్‌ మాట్లాడే దేశాల్లో నేటికీ అత్యంత ప్రజాదరణ పొంది, ఎక్కువగా పంచిపెట్టబడుతున్నాయి.

ఆల్మేడాలాంటి ప్రాచీన బైబిలు అనువాదకులకు మనం రుణపడివున్నాం అనడంలో సందేహం లేదు. కానీ మనకు విషయాలను బయల్పర్చాలనుకునే దేవునిపట్ల అంటే, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్న” యెహోవాపట్ల మనం మరింత కృతజ్ఞతతో ఉండాలి. (1 తిమోతి 2:​3, 4) నిజానికి, ఆయనే తన వాక్యాన్ని సంరక్షించి, మన ప్రయోజనార్థం అందుబాటులో ఉండేలా చేశాడు. మనం అన్నివేళలా దానిని విలువైనదిగా ఎంచి, మన పరలోకపు తండ్రి ఇచ్చిన “అత్యంత విలువైన నిధిని” శ్రద్ధగా అధ్యయనం చేయుదుము గాక!

[అధస్సూచీలు]

^ పేరా 4 క్యాథలిక్‌ చర్చీ 1650 తర్వాత, ఇండెక్స్‌ ఆఫ్‌ ఫోర్బిడన్‌ బుక్స్‌ను జారీ చేయడం ద్వారా స్థానిక భాషల్లో బైబిళ్ల వాడకంపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, ఆ ఏర్పాటు “తర్వాతి 200 సంవత్సరాల వరకు క్యాథలిక్‌ బైబిళ్ల అనువాదపు పనిని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది.”

^ పేరా 8 ఆల్మేడా బైబిళ్ల ప్రాచీన ప్రతులు ఆయనను ఆల్మేడా పాడ్రీ (ఫాదర్‌) అని పేర్కొనడంతో ఆయన క్యాథలిక్‌ పాదిరీగా సేవచేసేవాడని కొందరు అనుకున్నారు. అయితే ఆల్మేడా బైబిల్‌ యొక్క డచ్‌ సంపాదకులు, పాదిరీ అనే బిరుదు పాస్టరుకు లేదా మతనాయకునికి ఇవ్వబడుతుందని ఊహించి ఈ పదాన్ని పొరపాటున ఉపయోగించారు.

[21వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుని పేరు

హీబ్రూ టెట్రాగ్రమాటన్‌ను లేక నాలుగు అక్షరాలను అనువదించడానికి ఆల్మేడా దేవుని పేరును ఉపయోగించడమనేది అనువాదకునిగా ఆయన యథార్థతకు ఒక మంచి ఉదాహరణ.

[చిత్రసౌజన్యం]

Cortesia da Biblioteca da Igreja de Santa Catarina (Igreja dos Paulistas)

[18వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

అట్లాంటిక్‌ మహాసముద్రం

పోర్చుగల్‌

లిస్బన్‌

టోరీ డి టవారిస్‌

[18వ పేజీలోని చిత్రం]

17వ శతాబ్దంలో బటావియా

[చిత్రసౌజన్యం]

From Oud en Nieuw Oost-Indiën, Franciscus Valentijn, 1724

[18, 19వ పేజీలోని చిత్రం]

1681లో మొదటిసారిగా ప్రచురించబడిన పోర్చుగీస్‌ క్రొత్త నిబంధన ముఖపత్రం

[చిత్రసౌజన్యం]

Courtesy Biblioteca Nacional, Portugal