కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు—I

యెహోవా వాక్యము సజీవమైనది

యెహెజ్కేలు గ్రంథములోని ముఖ్యాంశాలు​—⁠I

అది సా.శ.పూ. 613వ సంవత్సరం. ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేముమీదకు రాబోయే నాశనం గురించి, యూదా దేశంమీదకు రాబోయే వినాశనం గురించి యూదాలో ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పటికే చాలామంది యూదులను చెరగా తీసుకొనివెళ్లాడు. వారిలో యౌవనస్థుడైన దానియేలుతోపాటు, ఆయన ముగ్గురు సహచరులున్నారు, వారు కల్దీయుల రాజు ఆస్థానంలో పనిచేస్తున్నారు. చెరలోవున్న చాలామంది యూదులు “కల్దీయుల దేశమందున్న” కెబారు నదీ ప్రదేశంలో నివసిస్తున్నారు. (యెహెజ్కేలు 1:​1-3) యెహోవా ఆ చెరలోవున్నవారికి సందేశాన్నిచ్చేవాడు లేకుండా వారిని విడిచిపెట్టలేదు. ఆయన 30 ఏళ్ల యెహెజ్కేలును ప్రవక్తగా నియమించాడు.

యెహెజ్కేలు గ్రంథం సా.శ.పూ. 591లో పూర్తిచేయబడింది, అది 22 ఏళ్లలో జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. యెహెజ్కేలు అత్యంత జాగ్రత్తగా, ప్రామాణికంగా తన గ్రంథాన్ని రాశాడు. సంవత్సరంతోపాటు తేదీని, నెలను కూడా స్పష్టంగా పేర్కొంటూ ఆయన ప్రవచించిన తేదీలను నమోదు చేశాడు. యెహెజ్కేలు సందేశంలోని మొదటి భాగం, యెరూషలేము పతనం, నాశనం గురించి వివరిస్తుంది. రెండవ భాగంలో, చుట్టుప్రక్కలనున్న జనాంగాలకు వ్యతిరేకంగా ప్రకటనలున్నాయి, చివరి భాగం యెహోవా ఆరాధన పునరుద్ధరణ గురించి వివరిస్తుంది. ఈ ఆర్టికల్‌, యెహెజ్కేలు 1:​1-24:⁠27 వచనాల్లో ఉన్న ముఖ్యాంశాలను వివరిస్తూ యెరూషలేము ఎదుర్కొనే పరిస్థితులకు సంబంధించిన దర్శనాలు, ప్రవచనాలు, మూకాభినయ (మూగగా నటించే) ప్రదర్శనల గురించి వివరిస్తోంది.

“ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను”

(యెహెజ్కేలు 1:1-19:​14)

యెహెజ్కేలు, యెహోవా సింహాసనానికి సంబంధించిన భక్తిపూర్వక భయాన్ని కలిగించే దర్శనం ఇవ్వబడిన తర్వాత తన నియామకాన్ని పొందాడు. “ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము” అని యెహోవా ఆయనకు ఆజ్ఞాపించాడు. (యెహెజ్కేలు 3:​17) యెరూషలేము ముట్టడి గురించి, దాని పర్యవసానాల గురించి ప్రవచించడానికి రెండు మూకాభినయ ప్రదర్శనలను చూపించమని ఆయన ఆజ్ఞాపించబడ్డాడు. యూదా దేశాన్ని ప్రస్తావిస్తూ యెహోవా యెహెజ్కేలు ద్వారా ఇలా ప్రకటించాడు: “ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసెదను.” (యెహెజ్కేలు 6:⁠3) ఆ దేశ నివాసులకు ఆయన ఇలా చెప్పాడు: “మీమీదికి దుర్దినము వచ్చుచున్నది.”​—⁠యెహెజ్కేలు 7:⁠7.

సా.శ.పూ. 612లో, ఒక దర్శనంలో యెహెజ్కేలు యెరూషలేముకు కొనిపోబడతాడు. అక్కడ ఆయన దేవుని ఆలయంలో ఎంతటి హేయకృత్యాలను చూస్తున్నాడో కదా! యెహోవా ఆ మతభ్రష్ఠులమీద తన కోపాన్ని వ్యక్తం చేయడానికి తన తీర్పును అమలుచేసే పరలోక సైన్యాలను (“ఆరుగురు మనుష్యులు” సూచించినవారిని) పంపించినప్పుడు తమ ‘లలాటముమీద గుర్తు’ పొందినవారు మాత్రమే దానిని తప్పించుకుంటారు. (యెహెజ్కేలు 9:​2-6) అయితే, మొదటిగా నాశనానికి సంబంధించిన తీక్షణమైన దేవుని సందేశపు ‘నిప్పులు’ పట్టణంమీద చల్లబడాలి. (యెహెజ్కేలు 10:⁠2) ‘యెహోవా దుష్టుల ప్రవర్తన చొప్పున వారికి ఫలమిచ్చినా’ చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులను తిరిగి సమకూరుస్తానని వాగ్దానం చేశాడు.​—⁠యెహెజ్కేలు 11:​17-21.

దేవుని ఆత్మ యెహెజ్కేలును కల్దీయుల దేశానికి తిరిగి తీసుకువస్తుంది. ఒక ప్రదర్శన సిద్కియా రాజు, ప్రజలు యెరూషలేము నుండి పారిపోవడాన్ని వర్ణించింది. అబద్ధ ప్రవక్తలు, ప్రవక్త్రినులు ఖండించబడ్డారు. విగ్రహారాధకులు తిరస్కరించబడ్డారు. యూదా పనికిరాని ద్రాక్షవల్లితో పోల్చబడింది. పక్షిరాజు, ద్రాక్షవల్లి విప్పుడు కథ, యెరూషలేము ఐగుప్తును సహాయం కోరడంవల్ల కలిగే తీవ్ర పర్యవసానాలను చూపిస్తుంది. ‘యెహోవా పైనున్న శాఖలలో లేతదానిని త్రుంచి అత్యున్నత పర్వతంమీద నాటుతాడు’ అనే వాగ్దానంతో ఆ విప్పుడు కథ ముగుస్తుంది. (యెహెజ్కేలు 17:​22) అయితే యూదాలో పరిపాలించడానికి ‘రాజ దండము’ ఉండదు.​—⁠యెహెజ్కేలు 19:​13.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​4-28​—⁠పరలోక రథం దేనిని సూచిస్తుంది? ఆ రథం నమ్మకమైన ఆత్మప్రాణులతో కూడిన యెహోవా పరలోక సంస్థను సూచిస్తుంది. ఆ సంస్థకు యెహోవా పరిశుద్ధాత్మ శక్తినిస్తుంది. యెహోవాకు ప్రతీకగావున్న రథ సారథి మహిమ వర్ణనాతీతం. ఆయన ప్రశాంతత అద్భుతమైన ఇంద్రధనుస్సుతో ఉదాహరించబడింది.

1:​5-11​—⁠ఆ నాలుగు జీవులు ఎవరు? రథానికి సంబంధించి యెహెజ్కేలుకు కలిగిన రెండవ దర్శనంలో ఆ నాలుగు జీవులు కెరూబులని ఆయన తెలియజేస్తున్నాడు. (యెహెజ్కేలు 10:​1-11; 11:​22) ఆ తర్వాత యెహెజ్కేలు, ఎద్దుముఖాన్ని “కెరూబుముఖము” అని అంటున్నాడు. (యెహెజ్కేలు 10:​14) ఎద్దు శక్తికీ, బలానికీ చిహ్నం, అంతేకాక కెరూబులు శక్తివంతమైన ఆత్మప్రాణులు కాబట్టి, ఆయనలా వర్ణించడం సముచితమే.

2:⁠5​—⁠యెహెజ్కేలు పదేపదే “నరపుత్రుడా” అని ఎందుకు సంబోధించబడ్డాడు? ఆయన మానవుడని యెహెజ్కేలుకు గుర్తుచేసేందుకు ఆ ప్రవక్తను యెహోవా ఆ విధంగా సంబోధించాడు, అది మానవ సందేశకునికీ ఆ సందేశాన్నిచ్చిన దేవునికీ మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని నొక్కిచెబుతుంది. సువార్తల్లో దాదాపు 80సార్లు యేసుక్రీస్తు కూడా అలాగే సంబోధించబడ్డాడు, దేవుని కుమారుడు మానవునిగానే వచ్చాడు గానీ అవతారపురుషునిగా రాలేదని అది స్పష్టంగా చూపిస్తుంది.

2:9-3:⁠3​—⁠మహా విలాపమును, మనోదుఃఖము కలిగించే విషయాలున్న గ్రంథపుచుట్ట యెహెజ్కేలుకు మధురముగా ఉన్నట్లు ఎందుకనిపించింది? యెహెజ్కేలుకు, తన నియామకంపట్ల ఉన్న దృక్పథం కారణంగా ఆ గ్రంథపుచుట్ట మధురంగా ఉన్నట్లు అనిపించింది. ప్రవక్తగా యెహోవాను సేవించే ఆధిక్యతపట్ల ఆయన కృతజ్ఞత కనబరిచాడు.

4:​1-17​—⁠యెరూషలేముమీదకు రాబోయే ముట్టడిని వర్ణించే దృశ్యాన్ని యెహెజ్కేలు నిజంగా ప్రదర్శించాడా? యెహెజ్కేలు వంటచెరుకు మార్చమని విన్నవించడం, యెహోవా ఆ విన్నపాన్ని మన్నించడం, ప్రవక్త నిజంగా ఆ దృశ్యాన్ని ప్రదర్శించాడని తెలియజేస్తుంది. పది గోత్రాల రాజ్యపువారి 390 ఏళ్ల దోషాన్ని, అంటే సా.శ.పూ. 997వ సంవత్సరం మొదలుకొని సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనమయ్యేంతవరకు చేసిన దోషాన్ని ప్రదర్శించడానికి ఆయన ఎడమవైపు పడుకున్నాడు. యూదావారి 40 ఏళ్ల దోషాన్ని అంటే యిర్మీయా ప్రవక్తగా నియమించబడిన సా.శ.పూ. 647 నుండి సా.శ.పూ. 607వరకు వారు చేసిన దోషాన్ని ప్రదర్శించడానికి కుడివైపు పడుకున్నాడు. ఆ 430 రోజులు యెహెజ్కేలు ఆహారం, నీళ్లు కొద్దిగానే తీసుకున్నాడు, అలా చేయడం ద్వారా యెరూషలేముమీద ముట్టడి జరిగినప్పుడు ఆయన ప్రవచనాత్మకంగా కరువు ఉంటుందని సూచించాడు.

5:​1-3​—⁠యెహెజ్కేలు, గాలికి ఎగిరిపోవడానికి విడిచిపెట్టిన వెంట్రుకల్లో కొన్నింటిని తీసుకొని తన చెంగున కట్టుకోవడంలోని ప్రాముఖ్యత ఏమిటి? 70 ఏళ్ల నిస్సహాయస్థితి తర్వాత తిరిగి సత్యారాధన చేపట్టేందుకు శేషించబడినవారు యూదాకు తిరిగి వస్తారని తెలియజేయడానికి ఆయనలా చేశాడు.​—⁠యెహెజ్కేలు 11:​17-20.

17:​1-24​—⁠రెండు గొప్ప పక్షిరాజులు ఎవరిని సూచిస్తున్నాయి, దేవదారు వృక్షపు లేతకొమ్మల చిగుళ్లు ఎలా త్రుంచబడ్డాయి, యెహోవా తొలగించి నాటే ‘లేత కొమ్మ’ అంటే ఎవరు? ఆ రెండు గొప్ప పక్షిరాజులు బబులోను, ఐగుప్తు పరిపాలకులను సూచిస్తున్నాయి. మొదటి పక్షిరాజు దేవదారు వృక్షపు పైకొమ్మ దగ్గరికి వస్తుంది, అంటే దావీదు రాజవంశపు ప్రభుత్వ పరిపాలకుని దగ్గరికి వస్తుంది. యూదా రాజైన యెహోయాకీను స్థానంలో సిద్కియాను రాజుగా చేయడం ద్వారా అది లేతకొమ్మల చిగుళ్లను త్రుంచేస్తుంది. సిద్కియా విశ్వాసపాత్రునిగా ఉంటానని ప్రమాణం చేసినప్పటికీ, మరో పక్షిరాజైన ఐగుప్తు పరిపాలకుని సహాయం కోరతాడు, అయితే దానివల్ల ప్రయోజనం లేదు. ఆయన చెరగా కొనిపోబడి, బబులోనులో మరణించాలి. యెహోవా ‘లేత కొమ్మ’ అయిన మెస్సీయ రాజును కూడా త్రుంచేస్తాడు. ఆయన “అత్యున్నత పర్వతముమీద” అంటే పరలోక సీయోను పర్వతంమీద నాటబడతాడు, ఆయన అక్కడ “శ్రేష్ఠమైన దేవదారు చెట్టు”గా అంటే భూమ్మీద నిజమైన ఆశీర్వాదాలు తీసుకువచ్చే వ్యక్తిగా తయారౌతాడు.​—⁠ప్రకటన 14:⁠1.

మనకు పాఠాలు:

2:​5-8; 3:​8, 9, 18-21. మనం దుష్టులకు భయపడకూడదు, అలాగే దేవుని సందేశంలో వారికి హెచ్చరిక ఉంది కాబట్టి, దానిని వారికి ప్రకటించడానికి వెనుకాడకూడదు. మనం ఉదాసీనతను లేక వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు మనం వజ్రమంత గట్టిగా లేక దృఢంగా ఉండాలి. అయితే మనం కఠినస్థులుగా, మొద్దుబారినవారిగా లేక నిర్దయులుగా మారకుండా జాగ్రత్తపడాలి. యేసు ఎవరికైతే ప్రకటించాడో వారిపట్ల కనికరం చూపించాడు, మనం కూడా ఇతరులకు ప్రకటించడానికి కనికరంతో కదిలించబడాలి.​—⁠మత్తయి 9:​36.

3:​15. యెహెజ్కేలు నియామకం పొందిన తర్వాత, తాను ప్రకటించబోయే సందేశాన్ని ధ్యానిస్తూ ‘ఏడు దినాలు ఏమియు చెప్పక కదలక’ తేలాబీబులో నివసించాడు. లోతైన ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకునేలా జాగ్రత్తగా అధ్యయనం చేసి, ధ్యానించడానికి మనం కూడా సమయం తీసుకోవద్దా?

4:1-5:⁠4. రెండు ప్రవచనాత్మక మూకాభినయ ప్రదర్శనలను చూపించడానికి యెహెజ్కేలుకు వినయం, ధైర్యం అవసరమైంది. దేవుడిచ్చే ఎలాంటి నియామకాన్నైనా నెరవేర్చడానికి మనకు కూడా వినయం, ధైర్యం అవసరం.

7:​4, 9; 8:​18; 9:​5, 10. దేవుని ప్రతికూల తీర్పును పొందేవారిపట్ల మనం కటాక్షం లేక కనికరం చూపించాల్సిన అవసరంలేదు.

7:​19. ఈ విధానంమీద యెహోవా తన తీర్పును అమలుచేసినప్పుడు డబ్బుకు ఎలాంటి విలువా ఉండదు.

8:​5-18. మతభ్రష్టత ఆధ్యాత్మికంగా ప్రాణాంతకమైనది. “భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును.” (సామెతలు 11:⁠9) మనం మతభ్రష్టులు చెప్పేది వినాలనే ఆలోచన కూడా రాకుండా చూసుకోవడం జ్ఞానయుక్తం.

9:​3-6. మనం ‘మహాశ్రమలను’ తప్పించుకోవాలంటే, బాప్తిస్మం తీసుకున్న దేవుని సమర్పిత సేవకులమనే గుర్తును, మనకు క్రైస్తవ వ్యక్తిత్వం ఉందనే గుర్తును సంపాదించుకోవడం చాలా అవసరం. (మత్తయి 24:​21) లేఖకుని సిరాబుడ్డి కట్టుకున్న వ్యక్తి ద్వారా సూచించబడే అభిషిక్త క్రైస్తవులు, గుర్తు వేసే పనిలో అంటే, రాజ్య ప్రకటనాపని, శిష్యులను చేసే పనిలో నాయకత్వం వహిస్తున్నారు. మనం మన గుర్తును కాపాడుకోవాలంటే, వారికి ఈ పనిలో ఉత్సాహంగా సహాయం చేయాలి.

12:​26-28. యెహెజ్కేలు తన సందేశాన్ని అపహసించేవారికి కూడా ఇలా చెప్పాలి: ‘ఇకను ఆలస్యములేక [యెహోవా] చెప్పిన మాటలన్నియు జరుగును.’ యెహోవా ఈ విధానాన్ని అంతం చేసేముందు, ఇతరులు ఆయనపట్ల విశ్వాసముంచేలా సహాయం చేయడానికి మనం శాయశక్తులా కృషిచేయాలి.

14:​12-23. రక్షణ పొందడం మన వ్యక్తిగత బాధ్యత. ఇతరులు దానిని మనకోసం సంపాదించిపెట్టలేరు.​—⁠రోమీయులు 14:​11.

18:​1-29. మన క్రియల పర్యవసానాల విషయంలో మనమే బాధ్యులం.

“దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును”

(యెహెజ్కేలు 20:1-24:​27)

చెరలోవున్న ఏడవ సంవత్సరంలో, అంటే సా.శ.పూ. 611లో ఇశ్రాయేలు పెద్దలు “యెహోవా యొద్ద విచారణచేయుటకై” యెహెజ్కేలు దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు గురించిన దీర్ఘ చరిత్రను, తమకు వ్యతిరేకంగా ‘యెహోవా ఖడ్గాన్ని దూస్తాడు’ అనే హెచ్చరికను వారు విన్నారు. (యెహెజ్కేలు 20:⁠1; 21:⁠3) ఇశ్రాయేలీయుల అధిపతిని (సిద్కియా) సంబోధిస్తూ యెహోవా ఇలా అన్నాడు: “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త [యేసుక్రీస్తు] వచ్చు వరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.”​—⁠యెహెజ్కేలు 21:​26, 27.

యెరూషలేముమీద నిందమోపబడింది. ఒహొలా (ఇశ్రాయేలు), ఒహొలీబా (యూదా) అపరాధం బయల్పరచబడింది. ఒహొలా అప్పటికే ‘విటకాండ్రకు, అష్షూరువారికి’ అప్పగించబడింది. (యెహెజ్కేలు 23:⁠9) ఒహొలీబా వినాశనం కూడా సమీపించింది. సా.శ.పూ. 609లో, 18 నెలల యెరూషలేము ముట్టడి ప్రారంభమైంది. ఆ నగరం చివరకు నాశనమైనప్పుడు యూదులు తమ దుఃఖాన్ని వ్యక్తం చేయలేనంత దిగ్భ్రాంతికి గురయ్యారు. “తప్పించుకొని వచ్చిన వాని” నుండి ఆ నగర నాశనం గురించిన వార్త వినేంతవరకు దేవుని సందేశాన్ని బబులోను చెరలోవున్నవారితో యెహెజ్కేలు చెప్పకూడదు.​—⁠యెహెజ్కేలు 24:​26-27.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

21:⁠3​—⁠యెహోవా ఒరదూసే “ఖడ్గము” ఏమిటి? యెరూషలేముమీద, యూదామీద తన తీర్పును అమలుచేయడానికి యెహోవా ఉపయోగించే “ఖడ్గము” బబులోను రాజైన నెబుకద్నెజరు, ఆయన సైన్యమని స్పష్టమౌతుంది. దానిలో దేవుని పరలోక సంస్థకు సంబంధించిన బలాఢ్యులైన ఆత్మప్రాణులతో కూడిన భాగం కూడా చేరివుండవచ్చు.

24:​6-14​—⁠కుండకు పట్టిన మష్టు దేనిని సూచిస్తుంది? ముట్టడిలో ఉన్న యెరూషలేము వంటకు వాడే కుండతో పోల్చబడింది. ఆ నగరంలో ఉన్న నైతిక మలినాన్ని అంటే ఆ నగరంలో జరుగుతున్న అపవిత్రత, దుష్కామ ప్రవర్తన, రక్తపాతం వంటి క్రియలను ఆ మష్టు సూచిస్తుంది. ఆమె అపవిత్రత ఎంత అధికంగా ఉందంటే వట్టిచట్టిని లేక ఖాళీ కుండను బొగ్గులమీద పెట్టి ఎంతో వేడిచేసినా ఆ మష్టుపోదు.

మనకు పాఠాలు:

20:​1, 49. ఇశ్రాయేలు పెద్దలు ప్రతిస్పందించిన తీరు, వారు యెహెజ్కేలు చెప్పిన విషయాలను సంశయించారని చూపిస్తుంది. దైవిక హెచ్చరికలపట్ల మనం ఎన్నడూ సంశయాత్మక ధోరణిని పెంపొందించుకోకుండా ఉందుము గాక.

21:​18-22. నెబుకద్నెజరు శకునం చూసినా, ఆ అన్య పాలకుడు యెరూషలేముపై దాడి చేసేలా యెహోవాయే చూశాడు. యెహోవా తీర్పులను అమలుచేసేవారు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడంలో దయ్యాలు కూడా ఆటంకం కలిగించలేవని అది చూపిస్తుంది.

22:​6-16. యెహోవా కొండెములు చెప్పడాన్ని, దుష్కామ ప్రవర్తనను, అధికార దుర్వినియోగాన్ని, లంచం పుచ్చుకోవడాన్ని అసహ్యించుకుంటాడు. అలాంటి తప్పులు చేయకూడదనే దృఢనిశ్చయంతో మనం ఉండాలి.

23:​5-49. రాజకీయ సంబంధాలు ఏర్పరచుకోవడం ఇశ్రాయేలు, యూదా దేశాలు తమ మిత్ర రాజ్యాల అబద్ధారాధనను స్వీకరించడానికి దారితీసింది. మన విశ్వాసాన్ని నాశనం చేయగల లౌకిక సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం.​—⁠యాకోబు 4:⁠4.

సజీవమైన, బలముగల సందేశం

బైబిలు పుస్తకమైన యెహెజ్కేలులోని మొదటి 24 అధ్యాయాల నుండి మనం ఎన్ని చక్కని పాఠాలు నేర్చుకుంటామో కదా! అక్కడ పేర్కొనబడిన సూత్రాలు, ఎలాంటి పరిస్థితులు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేందుకు నడిపిస్తాయో, మనం ఆయన దయను ఎలా పొందవచ్చో, మనం దుష్టులను ఎందుకు హెచ్చరించాలో తెలియజేస్తాయి. యెరూషలేము నాశనం గురించిన ప్రవచనం, ‘తన ప్రజలకు క్రొత్త సంగతులను పుట్టకమునుపే తెలియజేసే’ దేవునిగా యెహోవాను స్పష్టంగా వర్ణిస్తుంది.​—⁠యెషయా 42:⁠9.

యెహెజ్కేలు 17:​22-24 మరియు 21:​26, 27 వంటి వచనాల్లోని ప్రవచనాలు పరలోకంలో మెస్సీయ రాజ్యం స్థాపించబడడాన్ని సూచిస్తుంది. అతి త్వరలో ఆ పరిపాలనవల్ల దేవుని చిత్తం భూమ్మీద నెరవేరుతుంది. (మత్తయి 6:​9, 10) మనం రాజ్యాశీర్వాదాల కోసం బలమైన విశ్వాసంతో, నమ్మకంతో ఎదురుచూడవచ్చు. అవును, “దేవుని వాక్యము సజీవమై బలముగలది.”​—⁠హెబ్రీయులు 4:​12.

[12వ పేజీలోని చిత్రం]

పరలోక రథం దేనిని సూచిస్తుంది?

[14వ పేజీలోని చిత్రం]

ప్రకటనాపనిలో ఉత్సాహంగా పాల్గొనడం మన ‘గుర్తును’ కాపాడుకోవడానికి మనకు సహాయం చేస్తుంది