కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తన పరిమితులను గుర్తించిన బర్జిల్లయి

తన పరిమితులను గుర్తించిన బర్జిల్లయి

తన పరిమితులను గుర్తించిన బర్జిల్లయి

‘నేను నీకు ఎందుకు భారంగా ఉండాలి?’ ఈ మాటలను, 80 ఏళ్ల వృద్ధుడైన బర్జిల్లయి ఇశ్రాయేలు రాజైన దావీదుతో అన్నాడు. బర్జిల్లయికున్న సంపదను బట్టి ఆయన “అధిక ఐశ్వర్యవంతుడు” అని బైబిలు చెబుతోంది. (2 సమూయేలు 19:​32, 35) ఆయన యొర్దాను నదికి తూర్పునున్న గిలాదు అనబడే పర్వతప్రాంతంలో నివసించేవాడు.​—⁠2 సమూయేలు 17:​27; 19:​31.

బర్జిల్లయి ఏ పరిస్థితుల్లో దావీదుతో పై మాటలను అన్నాడు? ఈ వృద్ధుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు?

రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు

దావీదు ప్రమాదంలో ఉన్నాడు. ఆయన కుమారుడైన అబ్షాలోము ‘ఇశ్రాయేలీయులందరినీ తనతట్టు త్రిప్పుకుని’ సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకున్నాడు. తన తండ్రికి నమ్మకంగా ఉన్నవారెవరినైనా ఆయన ప్రాణాలతో వదలడనడంలో సందేహం లేదు. అందుకే దావీదు, ఆయన సేవకులు యెరూషలేము వదిలివెళ్లారు. (2 సమూయేలు 15:​6, 13, 14) దావీదు యెర్దానుకు తూర్పునున్న మహనయీముకు వచ్చినప్పుడు బర్జిల్లయి ఆయనకు సహాయం చేశాడు.

బర్జిల్లయితోపాటు, మరో ఇద్దరు ఉదారంగా దావీదు భౌతిక అవసరాలను తీర్చారు. దావీదు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాడనే విషయాన్ని ఆ ముగ్గురు నమ్మకస్థులు అర్థం చేసుకున్నారని వారు ఆయనతో, ఆయన సహచరులతో పలికిన ఈ మాటలను బట్టి తెలుస్తుంది: “అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురు.” బర్జిల్లయి, షోబీ, మాకీరులు దావీదుకు, ఆయన మనుష్యులకు పరుపులను, గోధుమలను, యవలను, పిండిని, వేపిన గోధుమలను, కాయధాన్యాలను, చిక్కుడు కాయలను, తేనెను, వెన్నను, గొఱ్ఱెలనేకాక ఇతర సామగ్రిని కూడా ఇవ్వడం ద్వారా వారి అవసరాలను తీర్చేందుకు చేయగలినదంతా చేశారు.​—⁠2 సమూయేలు 17:​27-29.

దావీదుకు సహాయం చేయడంవల్ల వారికి ముప్పువాటిల్లుతుంది. న్యాయంగా రాజుగా ఉండాల్సిన దావీదుకు మద్దుతునిచ్చే ఎవరినైనా అబ్షాలోము శిక్షించకుండా వదిలిపెట్టడం అనేది జరగదు. కాబట్టి దావీదుకు నమ్మకంగా ఉండడం ద్వారా బర్జిల్లయి ధైర్యాన్ని ప్రదర్శించాడు.

పరిస్థితులు తారుమారయ్యాయి

కొంతకాలం తర్వాత, అబ్షాలోము తిరుగుబాటు సైన్యాలు దావీదు జనులపై దాడికి దిగాయి. ఎఫ్రాయిము అరణ్యంలో యుద్ధం జరిగింది, ఆ అరణ్యం బహుశా మహనయీముకు సమీపంలో ఉండివుండవచ్చు. అబ్షాలోము సైన్యం ఓడిపోయి, “ఆ రోజు గొప్ప నాశనం జరిగింది.” అబ్షాలోము పారిపోయేందుకు ప్రయత్నించి, చివరకు మరణించాడు.​—⁠2 సమూయేలు 18:​7-15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మరోసారి దావీదు తిరుగులేని రాజవుతాడు. ఆయన అనుచరులు ఇక ఎంతమాత్రం శరణార్థుల్లా జీవించాల్సిన అవసరం లేదు. అంతేకాక వారు దావీదుపట్ల చూపించిన యథార్థత ఆయన వారిని అభిమానించేలా, వారిపట్ల కృతజ్ఞత కలిగివుండేలా చేసింది.

దావీదు యెరూషలేముకి తిరిగి వెళ్లబోతుండగా, “గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించడానికి ఆయనతో కూడ వెళ్లాడు.” ఆ సందర్భంలో దావీదు బర్జిల్లయిను ఇలా ఆహ్వానిస్తాడు: “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలోములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”​—⁠2 సమూయేలు 19:​15, 31, 33, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌.

దావీదు బర్జిల్లయి ఇచ్చిన మద్దతుపట్ల ఎంతో కృతజ్ఞత చూపించాడనంలో సందేహం లేదు. బర్జిల్లయి భౌతికావసరాలను తీర్చడం ద్వారా రుణం తీర్చుకోవాలని మాత్రమే దావీదు ఆ పని చేయాలనుకోలేదని అనిపిస్తోంది. ఎందుకంటే, సంపన్నుడైన బర్జిల్లయికు అలాంటి సహాయం అవసరం లేదు. వృద్ధుడైన బర్జిల్లయిలోని సుగుణాలనుబట్టే ఆయన తన ఆస్థానంలో ఉండాలని దావీదు కోరుకున్నాడు. రాజకొలువులో శాశ్వతమైన స్థానాన్ని పొందడం నిజంగానే ఒక విశేషమైన ఆధిక్యత, అక్కడ రాజుకు స్నేహితునిగా ఆయన గౌరవాన్ని, ప్రయోజనాలను పొందగలిగేవాడు.

వినయం, వాస్తవిక దృష్టి

రాజైన దావీదు ఆహ్వానానికి స్పందిస్తూ బర్జిల్లయి ఇలా అంటాడు: “రాజవగు నీతో కూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును? నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా?” (2 సమూయేలు 19:​34, 35) అలా బర్జిల్లయి రాజు ఆహ్వానాన్ని సున్నితంగానే నిరాకరించి, గొప్ప ఆధిక్యతను వదులుకున్నాడు. కానీ ఆయన ఎందుకలా చేశాడు?

బర్జిల్లయి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం, వృద్ధాప్యం, దానితోపాటు ఎదురయ్యే పరిమితులు కావచ్చు. తాను ఇక ఎంతో కాలం బ్రతకనని ఆయన అనుకునివుండవచ్చు. (కీర్తన 90:​10) దావీదుకు మద్దతునిచ్చేందుకు ఆయన చేయగలిగింది చేశాడు, అయితే వృద్ధాప్యంవల్ల తనకున్న పరిమితులను కూడా గుర్తించాడు. పేరుప్రతిష్ఠల గురించి ఆలోచించి, ఆయన తన సామర్థ్యాలను అవాస్తవిక దృష్టితో అంచనా వేసుకోలేదు. అధికార దాహంగల అబ్షాలోములాకాక బర్జిల్లయి జ్ఞానయుక్తంగా వినయాన్ని ప్రదర్శించాడు.​—⁠సామెతలు 11:⁠2.

ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం, దేవునిచేత నియుక్తుడైన రాజు కార్యకాలాపాలకు తన పరిమితులు ఏమాత్రం అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశం కావచ్చు. బర్జిల్లయి ఇలా అడిగాడు: “నీ దాసుడనగు నేను నా యేలినవాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?” (2 సమూయేలు 19:​35) దావీదుకు ఆయన ఇంకా మద్దతునిస్తున్నా, ఆ బాధ్యతలను తనకన్నా వయసులో చిన్నవాడు మరింత సమర్థవంతంగా నిర్వర్తించగలడని బర్జిల్లయి అనుకునివుండవచ్చు. బహుశా తన స్వంత కుమారుని గురించే మాట్లాడుతూ బర్జిల్లయి ఇలా అన్నాడు: “నీ దాసుడగు కింహాము నా యేలినవాడవును రాజవునగు నీతో కూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుము.” బర్జిల్లయి అలా అన్నందుకు దావీదు నొచ్చుకునే బదులు ఆ సలహాను అంగీకరించాడు. నిజానికి, యొర్దాను నదిని దాటే ముందు ఆయన “బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను.”​—⁠2 సమూయేలు 19:​37-39.

సమతూక దృష్టి అవసరం

బర్జిల్లయి వృత్తాంతం, సమతూక దృష్టిని కలిగివుండాల్సిన అవసరాన్ని మనకు నొక్కిచెబుతోంది. మనం ఏ సేవాధిక్యతను నిరాకరించకూడదు, లేదా ప్రశాంతమైన జీవితం కోసమో లేక బాధ్యతను నిర్వర్తించడానికి అనర్హులమని భావించో సేవాధిక్యతల కోసం అర్హత సంపాదించుకోకుండా ఉండకూడదు. మనం శక్తి కోసం, జ్ఞానం కోసం దేవునిపై ఆధారపడితే ఆయన మనలోని లోపాలను పూరిస్తాడు.​—⁠ఫిలిప్పీయులు 4:​13; యాకోబు 4:​17; 1 పేతురు 4:​11.

అంతేకాక, మనం మన పరిమితులను గుర్తించాలి. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సంబంధించిన అనేక బాధ్యతలతో తీరికలేకుండా ఉండవచ్చు. మరిన్ని బాధ్యతలను స్వీకరిస్తే, తన కుటుంబ అవసరాలను తీర్చడం వంటి లేఖనాధారిత బాధ్యతలను నిర్లక్ష్యం చేసే ప్రమాదముందని ఆయన గ్రహిస్తాడు. అలాంటి సందర్భాల్లో, ఆయన ప్రస్తుతం మరిన్ని బాధ్యతలను స్వీకరించకుండా ఉండడం ఆయన వినయాన్ని, సమతూక దృష్టిని కలిగి ఉన్నాడని చూపించదా?​—⁠1 తిమోతి 3:⁠2, 3; 5:⁠8.

బర్జిల్లయి చక్కని మాదిరిని ఉంచాడు, మనందరం దాని గురించి ధ్యానించాలి. ఆయన నమ్మకస్థునిగా, ధైర్యశాలిగా, ఉదార స్వభావునిగా, వినయస్థునిగా ఉన్నాడు. అన్నింటికి మించి బర్జిల్లయి తన స్వంత ప్రయోజనాలకన్నా దేవుని విషయాలకు ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నాడు.​—⁠మత్తయి 6:​33.

[15వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దావీదుకు సహాయం చేయడానికి 80 ఏళ్ల బర్జిల్లయి బడలికతో కూడిన ప్రయాణం చేశాడు

గిలాదు

రోగెలీము

సుక్కోతు

మహనయీము

యొర్దాను నది

గిల్గాలు

యెరికో

యెరూషలేము

ఎఫ్రాయిము

[15వ పేజీలోని చిత్రం]

20

[15వ పేజీలోని చిత్రం]

20

[15వ పేజీలోని చిత్రం]

[13వ పేజీలోని చిత్రం]

బర్జిల్లయి ఎందుకు దావీదు ఆహ్వానాన్ని నిరాకరించాడు?