కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుము”

“నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుము”

“నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుము”

యేసు ఒక గ్రుడ్డివాని కన్నులకు బురద పూసిన తర్వాత ఆయనతో ఇలా చెప్పాడు: “నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుము.” ఆ వ్యక్తి యేసు చెప్పినట్టు చేసి, “చూపు గలవాడై వచ్చెను.” (యోహాను 9:​6, 7) ఆ సిలోయము కోనేరు ఎక్కడ ఉండేది? ఇటీవల జరిగిన పురావస్తుశాస్త్ర పరిశోధనలో అది ఎక్కడుండేదనే విషయానికి సంబంధించిన కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

యెరూషలేములో, సిలోయము కోనేరుగా పిలవబడిన ఒక స్థలం యోహాను 9:7లో ప్రస్తావించబడిన అసలు కోనేరే అని నమ్ముతూ ఎంతోమంది పర్యాటకులు దానిని సందర్శించారు. ఈ స్థలం హిజ్కియా నీటి సొరంగం చివరన ఉంది, 530 మీటర్ల పొడవున్న ఆ సొరంగం సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది. అయితే ఆ కోనేరు మాత్రం సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందింది. బైజాంటియమ్‌ “క్రైస్తవులు,” యోహాను సువార్తలో పేర్కొనబడిన కోనేరు బహుశా ఆ సొరంగం చివర్లో ఉంటుందనుకొని తప్పుగా ఊహించి దాన్ని అక్కడ నిర్మించారు.

అయితే, 2004లో పురావస్తుశాస్త్రజ్ఞులు ఒక కోనేరును కనుగొన్నారు. యేసు భూమ్మీద జీవించినప్పుడు ఉనికిలో ఉన్న సిలోయము కోనేరుగా దాన్ని నిర్ధారించారు. అది బైజాంటియమ్‌ క్రైస్తవులు సిలోయము కోనేరని పొరబడిన స్థలానికి ఆగ్నేయ దిశలో, సుమారు 100 మీటర్ల దూరంలో ఉంది. వారు దాన్నెలా కనుగొన్నారు? యెరూషలేము నగర అధికారులు ఆ ప్రాంతంలోని ఒక డ్రైనేజీ పైపును బాగుచేయాల్సి రావడంతో వారు పెద్ద పెద్ద యంత్రాలతో పనివాళ్ళను అక్కడికి పంపారు. అక్కడికి దగ్గరలోనే పనిచేస్తున్న ఒక పురావస్తుశాస్త్రజ్ఞుడు, వారు నేలను త్రవ్వుతుండగా రెండు మెట్లు బయటపడడాన్ని గమనించాడు. అక్కడితో త్రవ్వకపు పనిని ఆపేశారు. ఇశ్రాయేలీ ఆంటిక్విటీస్‌ అథారిటీ (ప్రాచీన కాలపు అవశేషాలను పరిశోధించే అధికారులు) ఆ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపేందుకు అనుమతినిచ్చింది. త్రవ్వకాల్లో ఇప్పటికే, దాదాపు 70 మీటర్ల పొడవున్న కోనేరు ఒకవైపు భాగం బయటపడింది.

త్రవ్వకాల్లో దొరికిన కొన్ని నాణేలు, యూదులు రోముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరాల్లో ఉపయోగించబడినవి. ఆ తిరుగుబాటు సా.శ. 66, సా.శ 70ల మధ్య జరిగింది. రోమన్లు యెరూషలేమును సా.శ. 70లో నాశనం చేసేంతవరకు ఆ కోనేరు ఉపయోగించబడిందని దానిలో దొరికిన నాణేలు రుజువుచేస్తున్నాయి. బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్వ్యూ అనే పత్రిక ఈ ముగింపుకొచ్చింది: “కాబట్టి, ఆ కోనేరు తిరుగుబాటు ముగిసేంతవరకు ఉపయోగించబడింది, ఆ తర్వాత అది ఉపయోగించబడలేదు. యెరూషలేములో అత్యంత పల్లంగా ఉండే ఈ ప్రాంతంలో బైజాంటియమ్‌ కాలంవరకు ఎవరూ నివసించలేదు. ప్రతీ సంవత్సరం శీతాకాలంలో పడే వర్షాల వల్ల కోనేరులో పొరలుపొరలుగా మట్టి పేరుకుపోయేది. రోమన్లు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత ఆ కోనేరు ఇక శుభ్రంచేయబడలేదు. శతాబ్దాలు గడుస్తుండగా ఆ కోనేరులో మట్టి మందంగా పేరుకుపోవడంవల్ల క్రమంగా అది కనుమరుగైపోయింది. ఆ కోనేరులో కొన్నిచోట్ల దాదాపు 3మీటర్ల లోతు మట్టి పేరుకుపోయినట్లు పురావస్తుశాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

సిలోయము కోనేరు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి శ్రద్ధగల బైబిలు విద్యార్థులు ఎందుకు ఆసక్తి కనబరుస్తారు? ఎందుకంటే దాని గురించి తెలుసుకోవడం మొదటి శతాబ్దపు యెరూషలేము నైసర్గిక వివరాలను బాగా అర్థం చేసుకోవడానికి ఎంతో సహాయం చేస్తుంది, ఆ ప్రాంతం యేసు జీవితం గురించి, పరిచర్య గురించి సువార్త పుస్తకాల్లో రాయబడిన వృత్తాంతాల్లో ఎన్నోసార్లు ప్రస్తావించబడింది.

[7వ పేజీలోని చిత్రం]

కొత్తగా కనుగొనబడిన సిలోయము కోనేరు

[చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com