కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూనే’ ఉంటారా?

మీరు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూనే’ ఉంటారా?

మీరు ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూనే’ ఉంటారా?

“ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.”​—⁠గలతీయులు 5:​16.

యెహోవా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేస్తామేమో అనే భయాన్ని తొలగించుకునే మార్గమొకటి ఉంది. అదే అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు చేయడం: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” (గలతీయులు 5:⁠16) దేవుని ఆత్మ మనల్ని నడిపించేందుకు మనం అనుమతించినప్పుడు, మనం అనుచిత శరీరేచ్ఛలకు లొంగిపోము.​—⁠రోమీయులు 8:​2-10.

2 మనం ‘ఆత్మానుసారంగా నడుచుకుంటుండగా,’ దేవుని చురుకైన శక్తి మనల్ని యెహోవాకు లోబడేలా పురికొల్పుతుంది. మన పరిచర్యలో, సంఘంలో, ఇంట్లో, ఇతర ప్రదేశాల్లో మనం దైవిక లక్షణాలను కనబరుస్తాం. వివాహజతతో, మన పిల్లలతో, తోటి విశ్వాసులతో, ఇతరులతో మనం వ్యవహరించే తీరులో ఆత్మ ఫలాలు స్పష్టంగా కనబడతాయి.

3 ‘ఆత్మవిషయంలో దేవునిబట్టి’ జీవించడం, పాపం చేయకుండా ఉండేందుకు మనల్ని బలపరుస్తుంది. (1 పేతురు 4:​1-6) ఆత్మ ప్రభావం మనపై ఉన్నట్లయితే, మనం ఖచ్చితంగా క్షమించరాని పాపం చేయం. అయితే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటూవుంటే మనమింకా ఎలాంటి ప్రయోజనార్థక రీతుల్లో ప్రభావితులమౌతాం?

దేవునికి, క్రీస్తుకు సన్నిహితంగా ఉండండి

4 మనం పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకుంటున్నాం కాబట్టే, మనం దేవునితో, ఆయన కుమారునితో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఆధ్యాత్మిక వరాల గురించి వ్రాస్తూ పౌలు కొరింథులోని తోటి విశ్వాసులకు ఇలా చెప్పాడు: “దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు [ఒకప్పటి విగ్రహారాధకులు] తెలియజేయుచున్నాను.” (1 కొరింథీయులు 12:​1-3) యేసును శపించేందుకు ప్రజలను ప్రేరేపించే ఏ ఆత్మయైనా అది అపవాదియగు సాతాను సంబంధమైనదే. కానీ పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకుంటున్న క్రైస్తవులుగా మనం యెహోవాయే యేసును మృతుల్లోనుండి లేపి సమస్త సృష్టికిపైగా ఆయనను హెచ్చించాడని నమ్ముతున్నాం. (ఫిలిప్పీయులు 2:​5-11) మనం క్రీస్తు విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచడమే కాక, మనపై దేవుడు నియమించిన ప్రభువుగా యేసును అంగీకరిస్తాం.

5 సా.శ. మొదటి శతాబ్దంలో నామకార్థ క్రైస్తవులు కొందరు యేసు శరీరధారియై వచ్చాడని ఒప్పుకోలేదు. (2 యోహాను 7-11) ఆ తప్పుడు దృక్కోణాన్ని అంగీకరించడం కొందరు మెస్సీయయైన యేసు నిజ బోధలను తిరస్కరించేందుకు కారణమైంది. (మార్కు 1:​9-11; యోహాను 1:​1, 14) పరిశుద్ధాత్మానుసారంగా నడుచుకోవడం అలాంటి మతభ్రష్టతకు లోనవకుండా మనల్ని అడ్డగిస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండడం ద్వారా మాత్రమే మనం యెహోవా కృపను అనుభవిస్తూ “సత్యమును అనుసరించి నడుచుకొనుచు” ఉండగలము. (3 యోహాను 3, 4) కాబట్టి మన పరలోక తండ్రితో బలమైన సంబంధాన్ని కాపాడుకునేలా సమస్త మతభ్రష్టతను తిరస్కరించేందుకు బలంగా నిర్ణయించుకుందాం.

6 మతభ్రష్ట విగ్రహారాధనను, విమతాల్ని పౌలు జారత్వం, అపవిత్రత వంటి “శరీరకార్యముల”తో కలిపి పేర్కొన్నాడు. అయితే ఆయనిలా వివరించాడు: “క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.” (గలతీయులు 5:​19-21, 24, 25) ఆత్మానుసారంగా నడుస్తూ జీవించేవారిలో దేవుని చురుకైన శక్తి ఎలాంటి లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది? “ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అని పౌలు వ్రాశాడు. (గలతీయులు 5:​22) ఆత్మఫలాల ఈ అంశాలను మనం పరిశీలిద్దాం.

‘ఒకరినొకరు ప్రేమింపవలెను’

7 ఆత్మ ఫలాల్లో ఒకటైన ప్రేమలో తరచూ ప్రగాఢ అనురాగం, ఇతరులపట్ల నిస్వార్థ శ్రద్ధతోపాటు వారితో సన్నిహిత సంబంధం కలిగివుండడం ఇమిడివుంటుంది. “దేవుడు ప్రేమాస్వరూపి” అనే లేఖనాలు చెబుతున్నాయి, ఎందుకంటే ఆయనలో ఆ లక్షణం మూర్తీభవించివుంది. మానవాళిపట్ల దేవునికి, ఆయన కుమారునికిగల గొప్ప ప్రేమ యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిలో ఉదాహరించబడింది. (1 యోహాను 4:⁠8; యోహాను 3:​16; 15:​13; రోమీయులు 5:⁠8) యేసు అనుచరులుగా మనం పరస్పర ప్రేమనుబట్టి గుర్తించబడుతున్నాం. (యోహాను 13:​34, 35) వాస్తవానికి, ‘ఒకరినొకరు ప్రేమింపవలెను’ అని మనకు ఆజ్ఞాపించబడింది. (1 యోహాను 3:​23) ప్రేమ దీర్ఘకాలము సహించునని, దయ చూపించునని పౌలు చెబుతున్నాడు. అది మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. అది దుర్నీతి విషయమై కాక, సత్యమునందు సంతోషిస్తుంది. ప్రేమ అన్నింటిని తాళుకుంటుంది, నమ్ముతుంది, నిరీక్షిస్తుంది, ఓర్చుకుంటుంది. అంతేకాక, అది శాశ్వతకాలం ఉంటుంది.​—⁠1 కొరింథీయులు 13:​4-8.

8 దేవుని ఆత్మ మనలో ప్రేమను పుట్టించేందుకు మనం అనుమతించినప్పుడు, దేవునితో మన పొరుగువారితో మనకున్న సంబంధాల్లో ఆ లక్షణం ఉంటుంది. (మత్తయి 22:​37-39) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.” (1 యోహాను 3:​14, 15) నరహంతకుడైన ఒక వ్యక్తి ఇశ్రాయేలులోని ఆశ్రయపురంలో సురక్షితంగా ఉండవచ్చు, అయితే అతడికి తాను చంపిన వ్యక్తిపట్ల ద్వేషం లేనప్పుడు మాత్రమే అది సాధ్యం. (ద్వితీయోపదేశకాండము 19:​4, 11-13) మనం పరిశుద్ధాత్మచేత నడిపించబడుతుంటే, మనం దేవునిపట్ల, తోటి ఆరాధకులపట్ల, ఇతరులపట్ల ప్రేమను కనబరుస్తాం.

“యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు”

9 సంతోషమంటే సంపూర్ణ ఆనందం. యెహోవా “సంతోషంగా ఉండే దేవుడు.” (1 తిమోతి 1:​11, NW; కీర్తన 104:​31) కుమారుడు తండ్రి చిత్తం చేసేందుకు సంతోషిస్తాడు. (కీర్తన 40:⁠8; హెబ్రీయులు 10:​7-9) ‘యెహోవాయందు ఆనందించుటవలన మనం బలం పొందుతాం.’​—⁠నెహెమ్యా 8:​10.

10 కష్టాలను, దుఃఖాన్ని లేదా హింసను ఎదుర్కొంటున్నా మనం దేవుని చిత్తం చేసినప్పుడు దేవుడిచ్చే సంతోషం మనకెంతో సంతృప్తిని తీసుకొస్తుంది. “దేవుని గూర్చిన విజ్ఞానము” మనకెంత సంతోషాన్ని తీసుకొస్తుందో కదా! (సామెతలు 2:​1-5) దేవునితో మన సంతోషకరమైన సంబంధం ఖచ్చితమైన జ్ఞానంపై అలాగే దేవుణ్ణి, యేసు విమోచన క్రయధన బలిని విశ్వసించడంపై ఆధారపడి ఉంటుంది. (1 యోహాను 2:​1, 2) ఏకైక నిజ అంతర్జాతీయ సహోదరత్వంలో భాగమైవుండడం సంతోషానికి మరో మూలాధారం. (జెఫన్యా 3:⁠9; హగ్గయి 2:⁠7) మన రాజ్య నిరీక్షణ, సువార్త ప్రకటించే మన గొప్ప ఆధిక్యత మనకు సంతోషం కలిగిస్తున్నాయి. (మత్తయి 6:​9, 10; 24:​14) నిత్యజీవాన్ని గురించిన భావినిరీక్షణ కూడా మనకు సంతోషాన్నిస్తోంది. (యోహాను 17:⁠3) మనకలాంటి అద్భుత నిరీక్షణవుంది కాబట్టి, మనం “నిశ్చయముగా సంతోషింపవలెను.”​—⁠ద్వితీయోపదేశకాండము 16:​15.

సమాధానపరులుగా, దీర్ఘశాంతంగలవారిగా ఉండండి

11 ఆత్మఫలాల మరో అంశమైన సమాధానం, శాంతంగా, నిశ్చింతగా ఉండడాన్ని సూచిస్తుంది. సమాధానమునకు కర్త, మన పరలోకపు తండ్రి మనకిలా హామీ ఇస్తున్నాడు: “యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.” (కీర్తన 29:​11; 1 కొరింథీయులు 14:​33) యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను.” (యోహాను 14:​27) ఆయన శిష్యులకు అదెలా సహాయం చేస్తుంది?

12 యేసు తన శిష్యులకు అనుగ్రహించిన శాంతి వారి హృదయాలను, మనసులను ప్రశాంతంగావుంచి వారిలోని భయాల్ని తొలగించింది. ప్రత్యేకంగా వారు వాగ్దత్త పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ శాంతి అనుభవించారు. (యోహాను 14:​26) ఆత్మ ప్రభావంతోపాటు నేటి మన ప్రార్థనలకు లభించే జవాబులో మనం మన హృదయాలను, మనసులను ప్రశాంతంగావుంచే సాటిలేని “దేవుని సమాధానమును” అనుభవిస్తున్నాం. (ఫిలిప్పీయులు 4:​6, 7) అంతేకాక, తోటి విశ్వాసులతో, ఇతరులతో శాంతియుతంగా, సమాధానకరంగా ఉండేందుకు యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తుంది.​—⁠రోమీయులు 12:​18; 1 థెస్సలొనీకయులు 5:​13.

13 దీర్ఘశాంతం సమాధానంతో ముడిపడివుంది, ఎందుకంటే పరిస్థితి మెరుగౌతుందనే ఆశతోనే మనం రెచ్చగొట్టడాన్ని లేదా తప్పును ఓపికగా సహిస్తాం. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు. (రోమీయులు 9:​22-24) యేసు కూడా ఈ లక్షణాన్ని కనబరుస్తున్నాడు. యేసు కనబర్చిన ఈ లక్షణం నుండి మనం ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే పౌలు ఇలా వ్రాశాడు: “నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.”​—⁠1 తిమోతి 1:​16.

14 ఇతరులు అనాలోచితంగా మాట్లాడినప్పుడు లేదా నిర్దయగా ప్రవర్తించినప్పుడు సహించేందుకు దీర్ఘశాంతమనే ఈ లక్షణం మనకు సహాయం చేస్తుంది. పౌలు తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.” (1 థెస్సలొనీకయులు 5:​14) మనమందరం అపరిపూర్ణులం, తప్పులు చేస్తాం కాబట్టి, ప్రజలతో వ్యవహరించేటప్పుడు మనం తప్పుచేస్తే వారు మనపట్ల ఓర్పును, దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాలని నిశ్చయంగా కోరుకుంటాం. కాబట్టి ‘ఆనందముతోకూడిన దీర్ఘశాంతాన్ని’ కనబర్చేందుకు మనం కృషిచేద్దాం.​—⁠కొలొస్సయులు 1:​9-12.

దయాళుత్వాన్ని, మంచితనాన్ని కనబర్చండి

15 స్నేహపూర్వకమైన, సహాయకరమైన మాటలు, క్రియల ద్వారా ఇతరులపట్ల శ్రద్ధ చూపించినప్పుడు మనం దయను కనబరుస్తాం. యెహోవా దయాళుడు, అలాగే ఆయన కుమారుడు కూడా దయగలవాడే. (కీర్తన 116:⁠5; మత్తయి 9:​36) దేవుని సేవకులు, క్రీస్తు సేవకులు దయగలవారిగా ఉండాలి. (మీకా 6:​8; కొలొస్సయులు 3:​12) దేవునితో వ్యక్తిగత సంబంధం లేనివారిలో కొందరు సహితం “చాలా దయచూపారు.” (అపొస్తలుల కార్యములు 27:⁠3; 28:⁠2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి మనం ‘ఆత్మానుసారముగా నడుచుకుంటే,’ మనం నిశ్చయంగా దయ చూపించవచ్చు.

16 ఎవరైనా బాధపెట్టేవిధంగా మాట్లాడడాన్నిబట్టి లేక నిర్దయగా ప్రవర్తించడాన్నిబట్టి మనకు కోపగించుకునే ఆధారమున్నా మనం దయ చూపించవచ్చు. “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. . . . ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఎఫెసీయులు 4:​26, 27, 32) ముఖ్యంగా కష్టాలు అనుభవిస్తున్నవారిపట్ల దయ చూపించడం యుక్తం. “మంచితనము, నీతి, సత్యమను” మార్గాన్ని విడిచిపెట్టే ప్రమాదంలోవున్న వ్యక్తి బాధపడతాడేమో అని ఆయనకు లేఖనాధార ఉపదేశమివ్వని క్రైస్తవ పెద్ద నిశ్చయంగా దయచూపిస్తున్న వ్యక్తిగా ఉండడు.​—⁠ఎఫెసీయులు 5:⁠9.

17 మంచితనం ఒక సద్గుణం, నైతిక వైశిష్ట్యత లేదా ఉత్తమ గుణం లేదా స్థితి. దేవుడు సంపూర్ణ భావంలో మంచివాడు లేదా ఉత్తముడు. (కీర్తన 25:⁠8; యిర్మీయా 33:​10) యేసు సద్గుణవంతుడే కాక, నైతిక వైశిష్ట్యతగల సౌశీల్యుడు. అయినా, ఆయన “మంచి బోధకుడా” అని పిలవబడినప్పుడు “మంచి” అనే విశిష్ట పదాన్ని అంగీకరించలేదు. (మార్కు 10:​17, 18; ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దీనికి కారణం, మంచితనానికి దేవుడే ఉత్కృష్టమైన మాదిరి అని ఆయన గుర్తించాడని స్పష్టమవుతోంది.

18 వారసత్వంగా వచ్చిన పాపంవల్ల మంచి చేయగల మన సామర్థ్యం అడ్డగించబడుతోంది. (రోమీయులు 5:​12) అయితే, ‘మంచితనమును నేర్పించమని’ దేవునికి ప్రార్థిస్తే మనమా లక్షణాన్ని కనబర్చవచ్చు. (కీర్తన 119:⁠66, NW) రోములోని తోటి విశ్వాసులకు పౌలు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను.” (రోమీయులు 15:​14) క్రైస్తవ పైవిచారణకర్త ‘సద్విషయప్రియునిగా’ అంటే మంచిని ప్రేమించేవాడిగా ఉండాలి. (తీతు 1:​7, 8 అధస్సూచి) మనం దేవుని ఆత్మచేత నడిపించబడితే, మంచివారమనే పేరు సంపాదించుకోవడమే కాక, యెహోవా మనంచేసే “మేలుకై” అంటే మంచినిబట్టి ‘మనల్ని జ్ఞాపకముంచుకుంటాడు.’​—⁠నెహెమ్యా 5:​19; 13:​31.

“నిష్కపటమైన విశ్వాసము”

19 ఆత్మఫలాల్లో మరొక భాగమైన విశ్వాసము “నిరీక్షించబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీయులు 11:⁠1) మనకు విశ్వాసముంటే, యెహోవా వాగ్దానం చేసిన ప్రతీదీ నెరవేరుతుందని నిశ్చయంగా నమ్ముతాం. అదృశ్యమైనవి ఉన్నాయని ఒప్పింపజేసే రుజువు ఎంత బలంగా ఉందంటే విశ్వాసం ఆ రుజువుతో సమానమని చెప్పబడింది. ఉదాహరణకు, సృష్టించబడిన వస్తువులు ఉనికిలో ఉండడం, ఒక సృష్టికర్త ఉన్నాడని మనల్ని ఒప్పిస్తుంది. మనం ఆత్మానుసారంగా నడుస్తుంటే అలాంటి విశ్వాసాన్నే కనబరుస్తాం.

20 కానీ విశ్వాసకొరత “సుళువుగా చిక్కులబెట్టు పాపము.” (హెబ్రీయులు 12:⁠1) శరీరకార్యాలకు, ఐశ్వర్యాసక్తికి, విశ్వాసాన్ని నాశనం చేయగల అబద్ధ బోధలకు దూరంగా ఉండేందుకు మనం దేవుని ఆత్మపై ఆధారపడాలి. (కొలొస్సయులు 2:⁠8; 1 తిమోతి 6:​9, 10; 2 తిమోతి 4:​3-5) దేవుని ఆత్మ యెహోవా ప్రస్తుతకాల సేవకుల్లో, క్రైస్తవపూర్వ కాలాల సాక్షులకు, బైబిల్లో నమోదు చేయబడిన ఇతర వ్యక్తులకు ఉన్నలాంటి విశ్వాసాన్నే కలుగజేస్తుంది. (హెబ్రీయులు 11:​2-40) మన “నిష్కపటమైన విశ్వాసం” ఇతరుల విశ్వాసాన్ని బలపర్చవచ్చు.​—⁠1 తిమోతి 1:⁠5; హెబ్రీయులు 13:⁠7.

సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ప్రదర్శించండి

21 స్వభావంలో, ప్రవర్తనలో ఉన్న మృదుత్వమే సాత్వికం. దేవుని లక్షణాల్లో ఒకటి మృదుస్వభావం. ఈ విషయం మనకు తెలుసు, ఎందుకంటే సాత్వికుడైన యేసు, యెహోవా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (మత్తయి 11:​28-30; యోహాను 1:​18; 5:​19) కాబట్టి దేవుని సేవకులుగా మననుండి ఏమి కోరబడుతోంది?

22 క్రైస్తవులుగా మనం ‘మనుష్యులందరియెడల సాత్వికమును కనుపరచాలని’ ఆశించబడుతోంది. (తీతు 3:​1-2) మనం మన పరిచర్యలో సాత్వికాన్ని కనబరుస్తాం. తప్పిదములో చిక్కుకొనిన క్రైస్తవుణ్ణి “సాత్వికమైన మనస్సుతో” సరిదిద్దాలని ఆధ్యాత్మిక అర్హతగలవారికి ఉపదేశించబడింది. (గలతీయులు 6:⁠1) ‘వినయాన్ని, సాత్వికాన్ని’ కనబర్చడం ద్వారా మనమందరం క్రైస్తవ ఐక్యతకు, సమాధానానికి దోహదపడవచ్చు. (ఎఫెసీయులు 4:​1-3) ఎడతెగక ఆత్మానుసారంగా నడుస్తూ ఆశానిగ్రహం చూపించడం ద్వారా మనం సాత్వికాన్ని ప్రదర్శించవచ్చు.

23 ఆశానిగ్రహం మన తలంపులను, మాటలను, క్రియలను అదుపులో ఉంచుకునేందుకు సహాయం చేస్తుంది. యెరూషలేమును నాశనంచేసిన బబులోనీయులతో వ్యవహరించడంలో యెహోవా తననుతాను ‘అణచుకున్నాడు’ లేదా ఆశానిగ్రహం చూపించాడు. (యెషయా 42:​14) కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఆశానిగ్రహం పాటించడం ద్వారా ఆయన కుమారుడు ‘మనకు మాదిరినుంచాడు.’ అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులకు ‘జ్ఞానమునందు ఆశానిగ్రహమును అమర్చుకొనుడని’ ఉపదేశించాడు.​—⁠1 పేతురు 2:​21-23; 2 పేతురు 1:​5-8.

24 క్రైస్తవ పెద్దలు ఆశానిగ్రహముగలవారై ఉండాలని ఆశించబడుతోంది. (తీతు 1:​7, 8) నిజానికి దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడే వారందరూ ఆశానిగ్రహాన్ని పాటిస్తూ లైంగిక దుర్నీతికి, అసభ్య సంభాషణకు లేదా యెహోవా అనంగీకారాన్ని తీసుకురాగల దేనికైనా దూరంగా ఉండవచ్చు. దేవుని ఆత్మ మనలో ఆశానిగ్రహాన్ని పెంపొందింపజేసేందుకు మనం అనుమతించినప్పుడు మన దైవిక సంభాషణ మరియు ప్రవర్తన ద్వారా అది ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది.

ఆత్మానుసారంగా నడుస్తూ ఉండండి

25 మనం ఆత్మానుసారంగా నడుస్తుంటే, మనం ఉత్సాహవంతులైన రాజ్య ప్రచారకులుగా ఉంటాం. (అపొస్తలుల కార్యములు 18:​24-26) మనం ఆహ్లాదకరమైన సహవాసులుగా ఉంటాం, ప్రత్యేకంగా దైవభక్తిగల ప్రజలు మనతో సహవసించేందుకు ఆనందిస్తారు. మనం పరిశుద్ధాత్మచేత నడిపించబడుతుండగా తోటి యెహోవా ఆరాధకులకు ఆధ్యాత్మిక ప్రోత్సాహమిచ్చే ఆధారంగా కూడా మనముంటాం. (ఫిలిప్పీయులు 2:​1-4) క్రైస్తవులందరూ కోరుకునేది అలావుండాలనే కాదా?

26 సాతాను ఆధీనంలోవున్న ఈ లోకంలో ఆత్మానుసారంగా నడుచుకోవడం సులభం కాదు. (1 యోహాను 5:​19) అయినప్పటికీ, నేడు లక్షలాదిమంది అలా నడుచుకుంటున్నారు. మన పూర్ణహృదయంతో మనం యెహోవాపై విశ్వాసం ఉంచితే, మన ప్రస్తుత జీవితాన్ని ఆనందించడమే కాక, పరిశుద్ధాత్మను ప్రేమతో అనుగ్రహించే దేవుని నీతిమార్గాల్లో నిత్యమూ నడుస్తూనే ఉండగలుగుతాం.​—⁠కీర్తన 128:⁠1; సామెతలు 3:​5, 6.

మీ జవాబేమిటి?

• ‘ఆత్మానుసారంగా నడుచుకోవడం’ దేవునితో, ఆయన కుమారునితో మన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

• పరిశుద్ధాత్మ ఫలాల్లో ఏ లక్షణాలున్నాయి?

• దేవుని ఆత్మ ఫలాలను ప్రదర్శించే కొన్నిమార్గాలు ఏవి?

• ఆత్మానుసారంగా నడుచుకోవడం మన ప్రస్తుత జీవితాన్ని, మన భావి ఉత్తరాపేక్షలను ఎలా ప్రభావితం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఆత్మకు విరుద్ధంగా పాపం చేస్తామేమో అనే భయాన్ని ఎలా తొలగించుకోవచ్చు?

2, 3. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటూవుంటే, మనమెలా ప్రయోజనం పొందుతాం?

4, 5. ఆత్మానుసారంగా నడుచుకోవడం యేసును గురించిన మన దృక్కోణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

6. ఆత్మానుసారంగా నడుచుకునేవారిలో దేవుని ఆత్మ ఏ ఫలాలను ఉత్పన్నం చేస్తుంది?

7. ప్రేమ అంటే ఏమిటి, దాని లక్షణాలు కొన్నియేమిటి?

8. యెహోవా తోటి ఆరాధకులపట్ల మనమెందుకు ప్రేమను కనబర్చాలి?

9, 10. సంతోషమంటే ఏమిటి, సంతోషంగా ఉండేందుకు కొన్ని కారణాలేమిటి?

11, 12. (ఎ) సమాధానాన్ని మీరెలా నిర్వచిస్తారు? (బి) దైవిక సమాధానం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

13, 14. దీర్ఘశాంతమంటే ఏమిటి, దానిని మనమెందుకు కనబర్చాలి?

15. దయకు నిర్వచనం చెప్పండి, దానికి సంబంధించిన ఉదాహరణలు పేర్కొనండి.

16. దయ చూపించేలా మనల్ని పురికొల్పవలసిన కొన్ని పరిస్థితులు ఏమిటి?

17, 18. మంచితనమెలా నిర్వచించబడింది, మన జీవితాల్లో ఈ లక్షణమెలాంటి పాత్ర పోషించాలి?

19. హెబ్రీయులు 11:⁠1కి అనుగుణంగా విశ్వాసాన్ని నిర్వచించండి.

20. “సుళువుగా చిక్కులబెట్టు పాపము” ఏది, దానికి, శరీరకార్యాలకు మనమెలా దూరంగా ఉండవచ్చు?

21, 22. సాత్వికం ఎలా నిర్వచించబడింది, మనం దానినెందుకు కనబర్చాలి?

23, 24. ఆశానిగ్రహమంటే ఏమిటి, అది మనకెలా సహాయం చేస్తుంది?

25, 26. ఆత్మానుసారంగా నడుచుకోవడం మన ప్రస్తుత సంబంధాలను, భావి ఉత్తరాపేక్షలను ఎలా ప్రభావితం చేస్తుంది?

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా పరిశుద్ధాత్మ మన తోటి విశ్వాసులపట్ల ప్రేమను పురికొల్పుతుంది

[24వ పేజీలోని చిత్రం]

సహాయకరమైన మాటల ద్వారా, చేతల ద్వారా దయ చూపించండి