కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ఆత్మ జీవిస్తూనే ఉంటుందా?

మీ ఆత్మ జీవిస్తూనే ఉంటుందా?

మీ ఆత్మ జీవిస్తూనే ఉంటుందా?

మనలో కేవలం రక్తమాంసాలే ఉన్నాయా? లేక మన శరీరంలో సహజంగా ఉండాల్సిన వాటికి మించి మరింకేదైనా ఉందా? మన జీవితం కేవలం నీటి బుడగలాంటిదేనా? లేక మనం మరణించిన తర్వాత మనలోని అదృశ్య భాగమేదైనా జీవిస్తూనే ఉంటుందా?

మరణాంతర జీవితం గురించి ప్రపంచంలోని మతాలు ఎన్నో గందరగోళమైన నమ్మకాలను ప్రవేశపెట్టినా, వ్యక్తిలో అమర్త్యమైనది ఏదో ఉందనీ, అది మరణం తర్వాత జీవిస్తూనే ఉంటుందనే విషయంలో మాత్రం మతాలన్నీ ఏకాభిప్రాయాన్ని కలిగివున్నాయి. మనిషి చనిపోయిన తర్వాత జీవిస్తూనే ఉండే ఆ “ఏదో” అనేదే ఆత్మ అని చాలామంది నమ్ముతారు. మరి మీరేమి నమ్ముతారు? మన శరీరంలో రక్తమాంసాలతోపాటు ఆత్మ కూడా ఉందంటారా? అసలు ఆత్మ అంటే ఏమిటి? బ్రతికివున్న వ్యక్తిలో ఆత్మ ఉంటుందా, చనిపోయిన తర్వాత అది ఆయనలో నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? అదే నిజమైతే, దానికేమి జరుగుతుంది?

‘ఆత్మలేని శరీరం నిర్జీవమైనది’

బైబిల్లో “ఆత్మ” అని అనువదించబడిన హెబ్రీ, గ్రీకు పదాలకు ప్రాథమికంగా “శ్వాస” లేదా “గాలి” అనే అర్థాలున్నాయి. అయితే, “ఆత్మ” అనే పదానికున్న అర్థం శ్వాస ప్రక్రియను మాత్రమే సూచించట్లేదు. ఉదాహరణకు బైబిలు ఇలా చెబుతోంది: ‘ఆత్మలేని శరీరం నిర్జీవమైనది.’ (యాకోబు 2:⁠26, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌) కాబట్టి, ఆత్మ శరీరానికి జీవాన్నిస్తుంది. అది శరీరానికి జీవాన్నిచ్చే శక్తి.

ఒక వ్యక్తి శ్వాసించడం ఆపేసిన వెంటనే ఏమి జరుగుతుందో గమనించినప్పుడు, ఆ జీవశక్తి కేవలం ఊపిరితిత్తుల్లోకి వెళ్లివచ్చే శ్వాస లేదా గాలి మాత్రమే కాదని స్పష్టమౌతుంది. ఆయన శ్వాసించడం ఆపేసిన కొన్ని నిమిషాల తర్వాత కూడా, ఆయన తిరిగి శ్వాసించేలా చేసే మానవ ప్రయత్నాలు ఫలించవచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆయన శరీర కణాల్లో జీవశక్తి ఇంకా ఉంటుంది. కానీ శరీర కణాల్లో జీవశక్తి నశించిపోయినప్పుడు ఆ వ్యక్తిని మళ్లీ శ్వాసింపజేయడం అసాధ్యం. ఎంత శ్వాస లేదా గాలి అందించినా నిర్జీవకణాలు తిరిగి జీవం పోసుకోలేవు. కాబట్టి ఆత్మ అనేది శరీరంలోని కణాలను, ఆ వ్యక్తిని సజీవంగా ఉంచే జీవశక్తి. ఆ జీవశక్తి గర్భధారణ జరిగినప్పుడు తల్లిదండ్రుల నుండి వారి పిల్లలకు లభిస్తుంది, అది శ్వాస పీల్చుకునే ప్రక్రియ ద్వారా నిలిచివుంటుంది.​—⁠యోబు 34:​14, 15.

ప్రతీ వ్యక్తిలో తనదైన ప్రత్యేక ఆత్మ ఉంటుందా? లేక అందరిలోనూ ఉండే జీవశక్తి ఒకటేనా? ఆ ప్రశ్నలకు బైబిలు స్పష్టమైన సమాధానాలు ఇస్తోంది. సకల ప్రాణుల్లోనూ ఒకే ఆత్మ ఉంటుందని చూపిస్తూ రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ఊపిరి [‘ఆత్మ,’ అధస్సూచి] మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా? అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి. మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” (ప్రసంగి 3:​19-21, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌) అవును జంతువుల్లో, మనుష్యుల్లో ఒకే ఆత్మ లేదా జీవశక్తి ఉంది.

శరీరంలోని ఆత్మను, ఒక ఉపకరణం పనిచేయడానికి వాడే విద్యుచ్ఛక్తితో పోల్చవచ్చు. ఒక ఉపకరణం లేదా యంత్రం ఏ పని చేసేందుకు తయారుచేయబడింది అనేదాన్నిబట్టి దాని గుండా ప్రవహించే అదృశ్య విద్యుచ్ఛక్తి వేర్వేరు పనులను నిర్వర్తించగలదు. ఉదాహరణకు విద్యుచ్ఛక్తి ఒక బల్బును వెలిగించగలదు, ఫ్యాను తిరిగేలా చేయగలదు, రేడియో, టీవీ, లేదా కంప్యూటరు పనిచేసేలా చేయగలదు. అయితే, అది ఏ ఉపకరణాన్నైతే పనిచేసేలా చేస్తుందో దాని రూపాన్ని మాత్రం ధరించదు. విద్యుచ్ఛక్తి కేవలం శక్తిగానే ఉంటుంది. ఆత్మ లేదా జీవశక్తి విషయంలో కూడా అంతే. ఆత్మ, అది జీవాన్నిచ్చే శరీరపు రూపాన్ని సంతరించుకోదు. దానికి వ్యక్తిత్వంగానీ ఆలోచనా సామర్థ్యాలుగానీ లేవు, అది కేవలం ఒక శక్తి మాత్రమే. మానవులకు, జంతువులకు ఒకే ఆత్మ ఉంది. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన ఆత్మ వేరే ఏదో లోకంలో ప్రత్యేకప్రాణిగా లేక ఆత్మప్రాణిగా జీవించదు.

మరణించినప్పుడు ఆత్మకు ఏమి జరుగుతుంది?

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ‘మట్టిలో నుంచి పుట్టిన శరీరం మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసిపోతుంది. దేవుని దగ్గర్నుంచి వచ్చిన ఆత్మ తిరిగి ఆ దేవుని దగ్గరికే పోతుంది’ అని ప్రసంగి 12:​7, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌ చెబుతోంది. అయితే, శరీరం నుండి వేరైన ఆత్మ అక్షరార్థంగా అంతరిక్షం గుండా ప్రయాణించి దేవుని దగ్గరకు చేరుకుంటుందని దానర్థం కాదు. ఉదాహరణకు, యెహోవా తన ప్రవక్తయైన మలాకీ ద్వారా అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఏమి చెప్పాడో గమనించండి: “మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.” (మలాకీ 3:⁠7) ఇశ్రాయేలీయులు యెహోవా ‘తట్టు తిరగాలి’ అంటే, వారు తమ తప్పుడు మార్గాన్ని వదిలి, దేవుని నీతియుక్తమైన నియమాల ప్రకారం జీవించాలి. యెహోవా ఇశ్రాయేలీయుల ‘తట్టు తిరగడం’ అంటే ఆయన తన ప్రజలపట్ల తిరిగి తన అనుగ్రహం చూపిస్తాడని అర్థం. ఈ రెండు సందర్భాల్లోను అక్షరార్థంగా ఒకవైపు నుండి మరోవైపుకు తిరగడం అవసరం లేదు. ‘తిరగడంలో’ వైఖరిని మార్చుకోవడం మాత్రమే ఇమిడివుంది. కాబట్టి ‘తిరగడం’ అనే పదాన్ని బైబిలు ఉపయోగించిన తీరును గమనిస్తే, ఆ పదం అన్ని సందర్భాల్లో అక్షరార్థంగా ఒక స్థలం నుండి మరో స్థలానికి వెళ్ళడాన్ని సూచించట్లేదని తెలుస్తుంది.

అదే విధంగా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ‘ఆత్మ తిరిగి ఆ దేవుని దగ్గరికే పోతుంది,’ అంటే ఆ వ్యక్తిలోని ఆత్మ లేదా జీవశక్తి నశించిన తర్వాత, మొదట దానిని అనుగ్రహించిన సత్య దేవుడు మాత్రమే తిరిగి దానిని ఇవ్వగలడని అర్థం. అంటే, ఆ వ్యక్తి భవిష్యత్‌ నిరీక్షణేదైనా సరే అది పూర్తిగా దేవుని చేతుల్లోనే ఉందని దానర్థం.

ఉదాహరణకు, యేసుక్రీస్తు మరణం గురించి లూకా సువార్త ఏమి చెబుతోందో గమనించండి. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “యేసు గొప్ప శబ్దముతో కేకవేసి​—⁠తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.” (లూకా 23:​46) యేసు చనిపోయి, ఆయనలోని ఆత్మ లేదా జీవశక్తి నశించిపోయినప్పుడు, ఆయన పరలోకంలోని తన తండ్రివద్దకు వెళ్ళలేదు. నిజానికి యేసు చనిపోయి, మూడవ రోజున పునరుత్థానం చేయబడేంతవరకు సమాధిలోనే ఉన్నాడు, అంటే ఆయనెక్కడా ఉనికిలోనే లేడు. (ప్రసంగి 9:​5, 10) తాను పునరుత్థానమైన తర్వాత కూడా యేసు వెంటనే పరలోకానికి ఆరోహణమవలేదు. బదులుగా ఆయన “నలువది దినములవరకు” తన శిష్యులకు “తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను,” ఆ తర్వాతే “ఆయన ఆరోహణమాయెను.” (అపొస్తలుల కార్యములు 1:​3, 9) యేసు మరణించడానికి ముందు, యెహోవా తనను పునరుత్థానం చేయగలడనే పూర్తి నమ్మకంతో ‘తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించాడు.’

ఆత్మ అంటే ఏమిటి?

ఆత్మ అంటే ఏమిటో బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. మానవుడు సజీవంగా ఉండడానికి అవసరమైన జీవశక్తే ఆత్మ. ఆ జీవశక్తిని సజీవంగా ఉంచడానికి శ్వాస లేదా గాలి అవసరం. కాబట్టి మానవుల్లో ఉండే ఏదీ మరణం తర్వాత జీవిస్తూ ఉండదు.

మృతులకు భవిష్యత్‌ జీవితం గురించిన ఏ నిరీక్షణైనా పునరుత్థానంపై లేదా తిరిగి లేపబడడంపై ఆధారపడివుంది. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28, 29) మృతులకు, పునరుత్థానం గూర్చిన ఖచ్చితమైన వాగ్దానమే నిజమైన నిరీక్షణకు ఆధారం కానీ అమర్త్యమైన ఆత్మ గురించిన బోధ కాదు.

పునరుత్థానం అంటే ఏమిటి, మానవజాతికి అది ఎందుకంత ప్రాముఖ్యం అనే విషయాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం పొందడం ఎంత అవసరమో కదా! అంతేకాక దేవుని గురించిన, క్రీస్తు గురించిన జ్ఞానాన్ని పొందడం కూడా అంతే అవసరం. (యోహాను 17:⁠3) మీరు దేవుని గురించి, ఆయన కుమారుని గురించేకాక, దేవుని వాగ్దానాల గురించిన జ్ఞానాన్ని అధికం చేసుకునేలా బైబిలు అధ్యయనం చేయడానికి మీకు సహాయపడేందుకు మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు. సాక్షులను సంప్రదించాలని లేదా ఈ పత్రిక ప్రచారకులకు రాయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం.

[4వ పేజీలోని చిత్రాలు]

సకల ప్రాణుల్లోని ఆత్మ ఒక్కటే

[చిత్రసౌజన్యం]

మేక: CNPC​​—⁠Centro Nacional de Pesquisa de Caprinos (Sobral, CE, Brasil)