కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకండి’

‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకండి’

‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకండి’

“ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.”—లూకా 12:15.

చాలామంది డబ్బు, ఆస్తి, హోదా, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, కుటుంబం వంటివాటిని విజయానికి కొలమానంగా లేదా సురక్షితమైన భవిష్యత్తుకు హామీగా పరిగణిస్తారు. పేద, ధనిక దేశాల్లోని అనేకులకున్న శ్రద్ధాసక్తులు, అన్వేషణ అనేవి వస్తుసంపదపై, పురోగతిపై కేంద్రీకరించబడ్డాయని స్పష్టమవుతోంది. మరోవైపు, ఆధ్యాత్మిక విషయాల్లో వారి ఆసక్తి, ఒకవేళ ఏ కాస్తవున్నా, అది త్వరితగతిన క్షీణించిపోతోంది.

2 ఇది ఖచ్చితంగా బైబిలు ముందుగా చెప్పినట్లే ఉంది. అదిలా చెబుతోంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” (2 తిమోతి 3:1-5) నిజ క్రైస్తవులు అనునిత్యం అలాంటి ప్రజలమధ్య నివసించడంవల్ల ఈ విధమైన ఆలోచనకు, జీవనశైలికి తగినట్లే జీవించాలనే నిరంతర ఒత్తిడి క్రింద ఉంటారు. ‘దాని స్వంత మూసలోనికి లాగేందుకు’ ప్రయత్నించే లోక ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మనకేది సహాయం చేయగలదు?—రోమీయులు 12:2, జె. బి. ఫిలిప్స్‌ అనువదించిన ద న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడర్న్‌ ఇంగ్లీష్‌.

3 “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన” యేసుక్రీస్తు ఈ విషయంలో మనకు శక్తివంతమైన పాఠాలు బోధించాడు. (హెబ్రీయులు 12:1) కొన్ని ఆధ్యాత్మిక విషయాల లోతైన అవగాహన గురించి యేసు జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు ఒకవ్యక్తి ఆయన మాటలకు అడ్డుతగిలి, “బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని” వేడుకున్నాడు. దానికి జవాబిస్తూ యేసు ఆ వ్యక్తికి అలాగే అక్కడ వింటున్న వారందరికీ ప్రాముఖ్యమైన ఉపదేశాన్నిచ్చాడు. ఆయన లోభత్వానికి వ్యతిరేకంగా గట్టి హెచ్చరికనిచ్చి, ఆలోచన రేకెత్తించే ఉపమానం ద్వారా ఆ హెచ్చరికను బలోపేతం చేశాడు. ఆ సందర్భంలో యేసు చెప్పినది లక్ష్యపెట్టి, దానిని మన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చో చూసుకోవడం మంచిది.—లూకా 12:13-21.

అనుచిత విన్నపం

4 ఆ వ్యక్తి అలా అడ్డురావడానికి ముందు, యేసు తన శిష్యులతో, అక్కడున్నవారితో వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండడం గురించి, మనుష్యకుమారుణ్ణి ధైర్యంగా ఒప్పుకోవడం గురించి, పరిశుద్ధాత్మ సహాయం పొందడం గురించి మాట్లాడుతున్నాడు. (లూకా 12:1-12) నిశ్చయంగా ఇవి, శిష్యులు గుర్తుంచుకోవల్సిన ప్రాముఖ్యమైన అంశాలు. అయితే అలాంటి ఆలోచన రేకెత్తించే ప్రసంగం మధ్యలో ఆ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డుపడి, వస్తుసంపద విషయంలో కుటుంబ తగాదాలా కనిపిస్తున్న వివాదాన్ని పరిష్కరించమని యేసును అడిగాడు. అయితే ఈ సంఘటన నుండి మనం నేర్చుకోగల ఓ ప్రాముఖ్యమైన పాఠం ఉంది.

5 “ఒక వ్యక్తి మత ప్రబోధాన్ని వింటున్నప్పుడు అతనేమి ఆలోచిస్తాడనేది తరచూ అతని నైతిక స్వభావాన్ని సూచిస్తుంది” అని చెప్పబడింది. యేసు గంభీరమైన ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుండగా, ఆ వ్యక్తి బహుశా తానెలా ఆర్థిక లబ్ది పొందవచ్చనే విషయం గురించి ఆలోచిస్తుండవచ్చు. వారసత్వ సంపదకు సంబంధించిన అతని ఫిర్యాదుకు న్యాయపరమైన కారణముందో లేదో చెప్పబడలేదు. బహుశా ఆ వ్యక్తి యేసుకున్న అధికారాన్నిబట్టి, మానవ వ్యవహారాల్లో జ్ఞానవంతుడైన తీర్పరి అని ఆయనకున్న పేరునుబట్టి స్వప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తుండవచ్చు. (యెషయా 11:3-4; మత్తయి 22:16) కారణమేదైనా, అతనడిగిన ప్రశ్న అతని హృదయంలోని సమస్యను అంటే ఆధ్యాత్మిక విషయాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడాన్ని సూచించింది. మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఇది మంచి కారణం కాదా? ఉదాహరణకు, క్రైస్తవ కూటాల్లో మన మనసు ఎక్కడెక్కడో తిరిగేందుకు లేదా ఆ తర్వాత మనం చేయాలనుకునే విషయాల గురించి ఆలోచించేందుకు అనుమతించడం సులభం. బదులుగా మనం, చెప్పబడుతున్న విషయాలకు అవధానమిస్తూ, మన పరలోక తండ్రియైన యెహోవా దేవునితో, తోటి క్రైస్తవులతో మన సంబంధాన్ని మెరుగుపర్చుకునేలా సమాచారాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకునే మార్గాల గురించి ఆలోచించాలి.—కీర్తన 22:22; మార్కు 4:24.

6 అలా అడిగేందుకు ఆ వ్యక్తిని పురికొల్పినదేమైనా, యేసు అతనడిగినట్లు చేయడానికి నిరాకరించాడు. బదులుగా యేసు, “ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని” అతనితో అన్నాడు. (లూకా 12:14) అలా అనడంలో యేసు ప్రజలకు బాగా తెలిసిన విషయాన్నే సూచిస్తున్నాడు, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం, సరిగ్గా ఇలాంటి విషయాల్లో న్యాయం తీర్చేందుకే పట్టణాల్లో న్యాయాధిపతులు నియమించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 16:18-20; 21:15-17; రూతు 4:1, 2) కానీ యేసు మరి విశేషమైన పనులపట్ల అంటే రాజ్య సత్యం గురించి సాక్ష్యమివ్వడం పట్ల, ప్రజలకు దేవుని చిత్తాన్ని బోధించడం పట్ల శ్రద్ధ కలిగివున్నాడు. (యోహాను 18:37) యేసు మాదిరిని అనుసరిస్తూ, మనం లోకసంబంధ విషయాల్లోపడి దారితప్పే బదులు, సువార్త ప్రకటిస్తూ “సమస్త జనులను శిష్యులనుగా” చేసేందుకు మన సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తాం.—మత్తయి 24:14; 28:19.

లోభత్వం విషయంలో జాగ్రత్తగా ఉండండి

7 యేసు హృదయంలోని లోతైన ఉద్దేశాలను గ్రహించగలడు కాబట్టి, వ్యక్తిగత విషయాల్లో తాను జోక్యం చేసుకోవాలని ఆ వ్యక్తి చేసిన విన్నపంలో మరింత ప్రాముఖ్యమైన అంశం చేరివున్నట్లు ఆయనకు తెలుసు. అందువల్ల, ఆ విన్నపాన్ని త్రోసిపుచ్చే బదులు ఆ విన్నపం వెనకున్న అసలు ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.”—లూకా 12:15.

8 లోభత్వము అంటే సరైన ఉపయోగం, సంకల్పమున్న డబ్బు లేదా కొన్ని వస్తువులు కలిగివుండాలనే కోరిక మాత్రమే కాదు. అది సంపదను లేదా ఆస్తులను లేదా ఇతరుల వస్తుసంపదను ఆశించే మితిమీరిన వాంఛ. దానిలో వస్తువులు కలిగివుండాలనే, వేరొకరికి చెందినవి కావాలనుకునే, తమకు అవసరమున్నా లేకపోయినా, కేవలం తమ దగ్గర ఉండాలనే, ఇతరులపై అది చూపించే ప్రభావాన్ని పట్టించుకోకుండా ఉండే, తీరని ప్రగాఢమైన పేరాశ ఉంది. లోభి తాను కోరుకున్నది తన ఆలోచనపై, క్రియలపై ఎంత బలమైన ప్రభావం చూపించేందుకు అనుమతిస్తాడంటే ప్రాథమికంగా అదే అతని దేవతగా మారుతుంది. అపొస్తలుడైన పౌలు లోభిని దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాని విగ్రహారాధకునితో సమానునిగా పేర్కొనడాన్ని గుర్తుచేసుకోండి.—ఎఫెసీయులు 5:5; కొలొస్సయులు 3:5.

9 ఆసక్తికరమైన విషయమేమిటంటే, యేసు ‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకండి’ అని హెచ్చరించాడు. లోభత్వం అనేక విధాలుగా ఉంటుంది. వాటిలో కొన్నింటిని పేర్కొంటూ పది ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ ఇలా చెబుతోంది: “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.” (నిర్గమకాండము 20:17) ఏదోక రూపంలో లోభత్వం కారణంగా ఘోరమైన పాపంలో పడిపోయిన వ్యక్తుల ఉదాహరణలు బైబిల్లో అనేకం ఉన్నాయి. లోభత్వంతో వేరొకరికి చెందవలసిన అంటే యెహోవాకు మాత్రమే చెందవలసిన మహిమను, ఘనతను, అధికారాన్ని ఆశించిన మొదటి వ్యక్తి సాతాను. (ప్రకటన 4:10) హవ్వ స్వీయనిర్ణయ హక్కును ఆశించింది, ఈ విషయంలో ఆమె మోసగించబడడం మానవజాతిని పాపమరణాల మార్గంలోకి నెట్టివేసింది. (ఆదికాండము 3:4-7) తమకు చెందని దానికోసం ఆశించి, అసంతృప్తితో “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన” దేవదూతలే దయ్యాలయ్యారు. (యూదా 6; ఆదికాండము 6:2) బిలాము, ఆకాను, గేహజీ, యూదా గురించి కూడా ఆలోచించండి. వారు జీవితంలో తమకున్నవాటితో తృప్తిపడకుండా, వస్తుసంపదపట్ల మితిమీరిన తమ వాంఛ తమ బాధ్యతాయుత స్థానాన్ని దుర్వినియోగపరిచేలా చేసేందుకు అనుమతించారు. అది వారిని పతనానికి, నాశనానికి నడిపించింది.

10 లోభాన్ని గురించి హెచ్చరించేటప్పుడు యేసు “జాగ్రత్త” అని చెప్పడం ఎంత యుక్తమో కదా! ఎందుకు? ఎందుకంటే ఇతరుల దురాశను, లోభత్వాన్ని గుర్తించడం ప్రజలకు చాలా సులభం, కానీ దాని విషయంలో తాము దోషులమని వారు ఒప్పుకోవడం అరుదు. అయితే అపొస్తలుడైన పౌలు, “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము” అని సూచిస్తున్నాడు. (1 తిమోతి 6:9, 10) ఆ దురాశ ‘గర్భము ధరించి పాపమును కనును’ అని శిష్యుడైన యాకోబు వివరిస్తున్నాడు. (యాకోబు 1:15) యేసు హెచ్చరికకు అనుగుణంగా, ఇతరులు లోభత్వం కలిగివున్నారో లేదో గమనించడానికి కాదుగానీ, ‘ఏ విధమైన లోభానికి ఎడమివ్వకుండా’ ఉండేలా మన హృదయవాంఛ ఏమిటో పరీక్షించుకునేందుకు మనం ‘జాగ్రత్తపడాలి.’

విస్తారమైన వస్తుసంపదగల జీవితం

11 లోభత్వం విషయంలో మనం జాగ్రత్తగా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. యేసు ఆ తర్వాత ఏమి చెప్పాడో గమనించండి: “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” (లూకా 12:15) వస్తుసంపదలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతున్న మన కాలంలో ఈ మాటలు నిశ్చయంగా శ్రద్ధాపూర్వక పరిశీలనకు అర్హమైనవి, ఎందుకంటే ప్రజలు వస్తుసంపద, ఆర్థిక సుభిక్షిత సంతోషానికి, విజయానికి సమానమని పరిగణిస్తున్నారు. ఆ మాటల ద్వారా యేసు, వస్తుసంపద ఎంత విస్తారంగా ఉన్నా దానివల్ల నిజంగా అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితం లభించదు లేదా అలాంటి జీవితం దానిపై ఆధారపడి ఉండదు అని సూచిస్తున్నాడు.

12 అయితే కొందరు అంగీకరించకపోవచ్చు. వస్తుసంపద జీవితాన్ని మరింత సౌకర్యవంతం, ఆనందమయం చేస్తుందనీ ఆ విధంగా అది ప్రయోజనకరమని వారు తర్కించవచ్చు. అందువల్ల వారు, తాము కోరుకున్న వస్తువుల్ని, ఆధునిక ఉపకరణాల్ని సంపాదించుకునే శక్తినిచ్చే వృత్తులకు తమను అంకితం చేసుకుంటారు. ఇది సౌకర్యవంతమైన జీవితాన్నిస్తుందని వారనుకుంటారు. కానీ వారలా ఆలోచిస్తూ యేసు చెబుతున్న అంశాన్ని గ్రహించడం లేదు.

13 ధనవంతులై ఉండడం తప్పా, ఒప్పా అనే విషయంపై దృష్టి నిలపడానికి బదులు యేసు, ఒక వ్యక్తి ‘కలిమి విస్తరించడంవల్ల’ అంటే అతని దగ్గర అప్పటికేవున్న వస్తుసంపదవల్ల జీవం లభించదని నొక్కిచెబుతున్నాడు. ఈ విషయంలో, జీవించడానికి లేదా మన పోషణార్థం ఎంతో వస్తుసంపద అవసరం లేదని మనందరికీ తెలుసు. కేవలం కొంత ఆహారం, కొన్ని వస్త్రాలు, తలదాచుకునేందుకు కాస్త స్థలం ఉంటే చాలు. ధనికులకు ఇవి సమృద్ధిగావుంటే, పేదలు తమకు అవసరమైనవాటిని సంపాదించుకునేందుకు కాస్త ఎక్కువగా కృషి చేయవలసి ఉండవచ్చు. అయితే ప్రాణం పోయినప్పుడు ధనికులకు పేదలకు తేడావుండదు, అంతా ముగింపుకొస్తుంది. (ప్రసంగి 9:5, 6) కాబట్టి జీవితానికొక అర్థం, విలువా ఉండాలంటే, అది ఒకవ్యక్తి సంపాదించుకునే వస్తువులతో లేదా వస్తుసంపదతో నిండి ఉండాల్సిన అవసరం లేదు, అలా ఉండకూడదు. యేసు ఎలాంటి జీవితం గురించి మాట్లాడుతున్నాడో మనం పరిశీలించినప్పుడు ఈ తలంపు స్పష్టమౌతుంది.

14 ‘ఒక వ్యక్తికున్న విస్తారమైన వస్తుసంపదవల్ల అతనికి జీవం లభించదు’ అని యేసు చెప్పినప్పుడు, లూకా సువార్తలో ‘జీవం’ కోసం అక్కడ ఉపయోగించబడిన పదం (గ్రీకు, జోయి) జీవన విధానాన్ని లేదా శైలిని కాదుగానీ పూర్తిభావంలో జీవాన్నే సూచిస్తుంది. * మనం ధనవంతులమైనా లేక పేదవారమైనా, విలాసవంతంగా జీవిస్తున్నా లేక చాలీచాలని సంపాదనతో భారంగా బ్రతుకు వెళ్లదీస్తున్నా, మనమెంత కాలం జీవిస్తామనేది లేక రేపు మనం బ్రతికివుంటామా అనేది ఎంతమాత్రం మన చేతుల్లో లేదని యేసు చెబుతున్నాడు. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?” (మత్తయి 6:27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యెహోవా మాత్రమే ‘జీవమునకు ఊట’ అని బైబిలు స్పష్టంగా వివరిస్తోంది, ఆయన మాత్రమే నమ్మకస్థులకు పరలోకంలో లేదా భూమ్మీద అనంతమైన ‘వాస్తవమైన జీవాన్ని’ లేదా ‘నిత్యజీవాన్ని’ అనుగ్రహించగలడు.—కీర్తన 36:9; 1 తిమోతి 6:12, 18.

15 జీవాన్ని గురించి ప్రజలు విపరీత దృక్కోణాన్ని కలిగివుండడమెంత సులభమో యేసు మాటలు సూచిస్తున్నాయి. ధనికులైనా, పేదలైనా మానవులందరూ అపరిపూర్ణులే, చివరికి అందరూ అనుభవించేది ఒక్కటే. ప్రాచీనకాలానికి చెందిన మోషే ఇలా అన్నాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము.” (కీర్తన 90:10; యోబు 14:1, 2; 1 పేతురు 1:24) అందుకే దేవునితో మంచి సంబంధాన్ని వృద్ధిచేసుకోని ప్రజలు తరచూ, అపొస్తలుడైన పౌలు సూచించిన “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనేలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకుంటారు. (1 కొరింథీయులు 15:32) జీవితం నీటిబుడగలాంటిదని, అనిశ్చయమనీ గ్రహించి వస్తుసంపదలో భద్రతను, స్థిరత్వాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. కంటికి కనబడే విస్తారమైన వస్తుసంపద ఏదో విధంగా తమ జీవితాన్ని మరింత సురక్షితం చేస్తుందని బహుశా వారు భావిస్తుండవచ్చు. కాబట్టి వారు తప్పుగా ధనం, వస్తుసంపద వంటివి భద్రత, సంతోషాలకు సమానమని భావిస్తూ వాటిని విస్తారంగా కూడబెట్టుకునేందుకు శ్రమిస్తారు.—కీర్తన 49:6, 11, 12.

సురక్షితమైన భవిష్యత్తు

16 నిజమే సమృద్ధిగా ఆహారం, బట్టలు, ఇల్లు, ఇతర సౌకర్యాలున్న ఉన్నత జీవనశైలి మరింత సౌకర్యవంతమైన జీవితానికి దోహదపడవచ్చు లేదా మెరుగైన వైద్యచికిత్స పొందేందుకు తోడ్పడవచ్చు అది ఒక వ్యక్తి జీవితకాలం మరికొన్ని సంవత్సరాలు పెరిగేలా చేయవచ్చు. కానీ అలాంటి జీవితం మరింత అర్థవంతంగా, మరింత సురక్షితంగా ఉంటుందా? జీవితపు నిజ విలువ ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడనే దానినిబట్టి లేదా అతనికి ఎంత వస్తుసంపద ఉంది, ఎంత అనుభవిస్తున్నాడనే దానినిబట్టి ఎంచబడదు. అలాంటి వస్తుసంపదను అతిగా నమ్ముకోవడంలోని ప్రమాదాన్ని అపొస్తలుడైన పౌలు సూచించాడు. తిమోతికి ఆయనిలా వ్రాశాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.”—1 తిమోతి 6:17.

17 ధనాన్ని నమ్ముకోవడం అవివేకం, ఎందుకంటే అది ‘అస్థిరమైనది.’ పితరుడైన యోబు సంపన్నుడు, అయితే విపత్తు విరుచుకుపడ్డప్పుడు సంపద ఆయనను ఆదుకోలేకపోయింది; ఒక్క రాత్రిలోనే అదంతా ఊడ్చుకుపోయింది. ఆయనకు ఎదురైన పరీక్షలు, శ్రమలన్నింటిలో దేవునితో ఆయనకున్న బలమైన సంబంధమే ఆయనను కాపాడింది. (యోబు 1:1, 3, 20-22) అబ్రాహాము సమృద్ధిగావున్న వస్తుసంపద, యెహోవా తనకిచ్చిన కష్టభరితమైన నియామకాన్ని అంగీకరించకుండా అడ్డగించేందుకు అనుమతించలేదు, అందువల్ల ఆయన “అనేక జనములకు తండ్రి” అయ్యేలా ఆశీర్వదించబడ్డాడు. (ఆదికాండము 12:1, 4; 17:4-6) వీరిద్దరి, మరితరుల ఉదాహరణలు మనం అనుకరించడానికి అర్హమైనవి. మనం యౌవనులమైనా, వృద్ధులమైనా మన జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైనదేమిటో, దేనిని మనం నమ్ముకుంటున్నామో తెలుసుకునేందుకు మనల్ని మనం పరీక్షించుకోవాలి.—ఎఫెసీయులు 5:10; ఫిలిప్పీయులు 1:9.

18 లోభత్వం గురించి, జీవం విషయంలో సరైన దృక్కోణం గురించి యేసు మాట్లాడిన కొన్నిమాటలు నిజంగా అర్థవంతమైనవి, ఉపదేశాత్మకమైనవి. అయితే యేసు మనసులో మరిన్ని ఉపదేశాలున్నాయి, ఆయనింకా కొనసాగిస్తూ అతిగా ప్రవర్తించిన ధనవంతుని గురించి ఆలోచన రేకెత్తించే ఉపమానాన్ని లేదా దృష్టాంతాన్ని చెప్పాడు. ఆ ఉపమానం నేటి మన జీవితానికి ఎలా వర్తిస్తుంది, దానినుండి మనమేమి నేర్చుకోవచ్చు? తర్వాతి ఆర్టికల్‌ వీటికి జవాబులిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 19 ‘జీవం’ అని అనువదించబడిన మరో పదం బయోస్‌, దీనినుండే ఇంగ్లీషు పదాలైన “బయోగ్రఫీ,” “బయోలజీ” వంటి పదాలు వచ్చాయి. వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ప్రకారం బయోస్‌, “జీవిత సమయాన్ని లేదా కాలాన్ని,” “జీవన విధానాన్ని,” “జీవనాధారాన్ని” సూచిస్తుంది.

మీ జవాబేమిటి?

• జనసమూహంలోని ఒకవ్యక్తి చేసిన విన్నపాన్ని యేసు త్రోసిపుచ్చడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

• మనమెందుకు లోభత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనమెలా జాగ్రత్తగా ఉండవచ్చు?

• వస్తుసంపదలవల్ల జీవమెందుకు లభించదు?

• జీవితాన్ని నిజంగా విలువైనదిగా, సురక్షితమైనదిగా ఏది చేయగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) నేడు ప్రజల ఆసక్తి, అన్వేషణ గురించి మీరేమి గమనించారు? (బి) అలాంటి దృక్పథాలు మనపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

3. యేసు ఇచ్చిన ఏ ఉపదేశాన్ని మనమిప్పుడు పరిశీలిస్తాం?

4. ఆ వ్యక్తి యేసు మాటలకు అడ్డుతగలడం ఎందుకు అనుచితం?

5. ఆ వ్యక్తి విన్నపం అతని గురించి ఏమి వెల్లడించింది?

6. ఆ వ్యక్తి అడిగినట్లు చేయడానికి యేసు ఎందుకు నిరాకరించాడు?

7. యేసు ఏ విషయాన్ని నిశితంగా గమనించాడు?

8. లోభత్వం అంటే ఏమిటి, అది దేనికి దారితీయగలదు?

9. ఏయే విధాలుగా లోభత్వాన్ని కనబర్చవచ్చు? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.

10. యేసు హెచ్చరించినట్లుగా ఎలా ‘మనం జాగ్రత్తపడాలి’?

11, 12. (ఎ) లోభత్వం విషయంలో యేసు ఎలాంటి హెచ్చరికనిచ్చాడు? (బి) యేసు హెచ్చరికను మనమెందుకు లక్ష్యపెట్టాలి?

13. జీవం, వస్తుసంపదల విషయంలో సమతుల్యమైన దృక్కోణమేమిటి?

14. బైబిలు వృత్తాంతంలో కనబడే ‘జీవం’ అనే పదాన్నుండి మనమేమి తెలుసుకోవచ్చు?

15. చాలామంది ఎందుకు వస్తుసంపదనే ఎక్కువ నమ్ముతారు?

16. జీవితపు నిజ విలువ దేనిపై ఆధారపడి ఉండదు?

17, 18. (ఎ) వస్తుసంపదల విషయంలో మనం అనుకరించేందుకు ఎవరి అసాధారణ ఉదాహరణలు తగినవి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో యేసు చెప్పిన ఏ ఉపమానం పరిశీలించబడుతుంది?

[23వ పేజీలోని చిత్రం]

ఒకవ్యక్తి విన్నపాన్ని యేసు ఎందుకు త్రోసిపుచ్చాడు?

[23వ పేజీలోని చిత్రం]

లోభత్వం వినాశనకర ఫలితాలకు దారితీయగలదు

[25వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము వస్తుసంపదలపట్ల సరైన దృక్కోణాన్ని ఎలా కనబర్చాడు?