కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక తల్లి విశ్వాసం దుఃఖాన్ని అధిగమించేలా చేసింది

ఒక తల్లి విశ్వాసం దుఃఖాన్ని అధిగమించేలా చేసింది

ఒక తల్లి విశ్వాసం దుఃఖాన్ని అధిగమించేలా చేసింది

“మీరు ఈ ఉత్తరం చదువుతున్నారంటే, నేను ఆపరేషన్‌ సమయంలో నా తుదిశ్వాస విడిచాననీ, నేనిక మీ మధ్య లేననీ అర్థం.”

పై మాటలు ఒక క్రైస్తవ తల్లి అయిన కార్మెన్‌ తన ముగ్గురు కూతుళ్ళకు రాసిన ఉత్తరంలోనివి. ఆ ముగ్గురి వయసు 25, 19, 16. విషాదకరంగా, శస్త్రచికిత్స విఫలమవడంతో ఆమె మరణించింది.

ముగ్గురు కూతుళ్ళను అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఒంటరి వాళ్ళను చేయడం ఎవరి హృదయాన్నైనా కలచివేస్తుంది. అయితే, ఆ తల్లికి యెహోవాపై, ఆయన వాగ్దానాలపై ఉన్న దృఢ విశ్వాసం ఆమెకు మానసిక ప్రశాంతతనిచ్చి, దుఃఖాన్ని అధిగమించేలా చేసిందనే విషయం ఆత్మీయత ఉట్టిపడే ఆమె ఉత్తరంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె తన కూతుళ్ళకు ఏమి రాసిందో గమనించండి.

“ముందుగా నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, మీరంటే నాకు ఎనలేని మమకారం . . . ఆణిముత్యాల్లాంటి మీరు నా పిల్లలైనందుకు నేనెంతో గర్విస్తున్నాను.”

“దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం వచ్చేంతవరకు మీతోనే ఉంటే బాగుంటుందని నేనెంతో కోరుకున్నాను, . . . కానీ అలా జరగడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పటివరకు మీరు ఉన్నట్లుగానే ఇకముందు కూడా విశ్వాసంగా ఉండగలిగేలా మీకు సహాయం చేయమని నేను దేవునికి ప్రార్థించాను. మనం కలిసి ఎన్నో కష్టాలను సహించాం, యెహోవా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. . . . కాబట్టి ఆయన తన సంస్థ ద్వారా ఇచ్చే నిర్దేశంపై నమ్మకముంచండి, సంఘానికి, పెద్దలకు సహకరిస్తూ ఉండండి. సాధ్యమైనప్పుడల్లా ప్రకటిస్తూ ఉండండి, సహోదర సహోదరీలందరినీ ప్రేమించండి.”

“మన ఈ ఎడబాటు తాత్కాలికమైనదే . . . నేను చేసిన తప్పులన్నింటికి, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోనందుకు లేదా నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పనందుకు నన్ను క్షమించండి . . . మీలో ప్రతీ ఒక్కరికీ మీ సొంత అవసరాలు ఉన్నాయని నాకు తెలుసు. మీకన్నా ఎక్కువగా ఆ విషయం యెహోవాకు తెలుసు, ఆయన మీ అవసరాలన్నీ తీరుస్తాడు, మీరు ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ సహించినందుకు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.”

“నూతనలోకంలో జీవితాన్ని ఆనందించడమనే మీ గురిని మరచిపోకండి. దానిని చేరుకోవడానికి కృషి చేస్తూనే ఉండండి. మీరు చివరివరకు విశ్వాసాన్ని పదిలంగా ఉంచుకునేలా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి, బలపరచాలని నేను కోరుకుంటున్నాను. . . . పిల్లలూ, నేను లేనని మీరేం బాధపడకండి. మీరంటే నాకెంతో ఇష్టం.”

ఎవరికైనా ఎప్పుడైనా విషాదం ఎదురుకావచ్చు. ‘అనూహ్యంగా, కాలవశము చేత’ కొన్ని సంఘటనలు సంభవిస్తాయని ప్రాచీన రాజైన సొలొమోను రాశాడు. (ప్రసం. 9:11, NW) అయితే, దేవునిపై దృఢ విశ్వాసం ఉన్నవారు అపొస్తలుడైన పౌలుకున్న నమ్మకాన్నే కలిగివుంటారు. ఆయనిలా అన్నాడు: “మరణమైనను జీవమైనను . . . సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవు.”—రోమీయులు 8:38, 39; హెబ్రీయులు 6:10.