దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడా?
దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడా?
స ర్వోన్నత సృష్టికర్తయైన యెహోవాకు చూసే సామర్థ్యం ఉందా? ఖచ్చితంగా ఉంది! బైబిలు స్పష్టంగా ఇలా తర్కిస్తోంది: “కంటిని నిర్మించినవాడు కానకుండునా?” (కీర్తన 94:9) యెహోవా కనుదృష్టి మానవుల కంటిచూపుకన్నా ఎంతో తీక్షణమైనది. ఆయన మన పై రూపాన్ని చూడడమే కాక మన ‘హృదయాలను పరిశీలన చేయగలడు’ కూడా, ఆయన “హృదయ పరిశోధకుడు.” (సామెతలు 17:3; 21:2) అవును, ఆయనకు మన ఆలోచనలను, ఉద్దేశాలను, అంతర్గత కోరికలను విశ్లేషించే సామర్థ్యం ఉంది.
జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల గురించి యెహోవాకు తెలుసు, అంతేకాదు మనం చేసే విన్నపాలకు ఆయన స్పందిస్తాడు కూడా. కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:15, 18) యెహోవా మన పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడని, మన హృదయపూర్వక ప్రార్థనలను ఆయన వింటాడని తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుందో కదా!
యెహోవా దేవుడు రహస్యంగా చేసే పనులను కూడా గమనిస్తాడు. అవును, “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:13) కాబట్టి, మనం చేసే పనులు మంచివైనా, చెడ్డవైనా దేవుడు వాటన్నింటిని గమనిస్తాడు. (సామెతలు 15:3) ఉదాహరణకు, “నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను” అనీ ఆయన “దేవునితోకూడ నడచినవాడు” అనీ ఆదికాండము 6:8, 9 చెబుతోంది. అవును, నోవహు యెహోవా దేవునికి విధేయుడై, ఆయన నీతి సూత్రాలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఆమోదాన్ని, ఆశీర్వాదాలను పొందాడు. (ఆదికాండము 6:22) దానికి భిన్నంగా, నోవహు కాలంలోని ప్రజలు దౌర్జన్యపరులు, నైతికతలేనివారు. ఇది దేవుని దృష్టికి రాకుండా పోలేదు. “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూ[శాడు].” తగిన సమయంలో యెహోవా దుష్టులను నాశనం చేశాడు గానీ, నోవహును, ఆయన కుటుంబాన్ని మాత్రం రక్షించాడు.—ఆదికాండము 6:5; 7:23.
యెహోవా మిమ్మల్ని ఆమోదయోగ్యులుగా దృష్టిస్తాడా? నిజానికి, “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) త్వరలోనే ఆయన మళ్లీ ఈ భూమ్మీదున్న దుష్టులనందరినీ నాశనం చేసి యథార్థహృదయులను తప్పిస్తాడు.—కీర్తన 37:10, 11.