కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ఆధ్యాత్మికతను ఎలా సంపాదించుకోవచ్చు?

నిజమైన ఆధ్యాత్మికతను ఎలా సంపాదించుకోవచ్చు?

నిజమైన ఆధ్యాత్మికతను ఎలా సంపాదించుకోవచ్చు?

“శ రీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 8:5, 6) ఈ మాటల ద్వారా అపొస్తలుడు, ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం వ్యక్తిగత ఎంపిక లేక భావన మాత్రమే కాదని సూచిస్తున్నాడు. వాస్తవానికి అది జీవన్మరణాలకు సంబంధించిన విషయం. అయితే ఆధ్యాత్మిక వ్యక్తి ఏ భావంలో ‘జీవాన్ని, సమాధానాన్ని’ పొందుతాడు? బైబిలు ప్రకారంగా, అలాంటి వ్యక్తి ఇప్పుడు మనశ్శాంతిని, దేవునితో సమాధానాన్ని అనుభవిస్తాడు, భవిష్యత్తులో నిత్యజీవాన్ని ప్రతిఫలంగా పొందుతాడు. (రోమీయులు 6:23; ఫిలిప్పీయులు 4:7) అందుకే యేసు, ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’ అని పేర్కొన్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు!—మత్తయి 5:3, NW.

మీరు ఈ పత్రికను చదువుతున్నారూ అంటే, మీకు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది, అలా ఆసక్తి కలిగివుండడం జ్ఞానయుక్తమైనదే. అయితే ఈ విషయంపై ఎన్నో భిన్నమైన దృక్కోణాలున్నాయి కాబట్టి మీరు ఇలా అనుకుంటుండవచ్చు: ‘నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?’

“క్రీస్తు మనస్సు”

అపొస్తలుడైన పౌలు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలిగివుండడంలోని ప్రాముఖ్యతను, ప్రయోజనాలను సూచించడమే గాక, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటనే దాని గురించి ఎన్నో విషయాలను చెప్పాడు. ప్రాచీన కొరింథు నగరంలోని క్రైస్తవులకు పౌలు, ప్రకృతి సంబంధియైన మనుష్యునికి, అంటే శారీరక కోరికలనుబట్టి ప్రవర్తించే వ్యక్తికీ, ఆత్మసంబంధియైన వ్యక్తికి అంటే ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా పరిగణించే వ్యక్తికీ మధ్య ఉన్న తేడాను వివరించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి.” మరోవైపు, ఆత్మ సంబంధియైన వ్యక్తి “క్రీస్తు మనస్సు” కలిగి ఉంటాడని పౌలు వివరించాడు.—1 కొరింథీయులు 2:14-16.

ప్రాథమికంగా “క్రీస్తు మనస్సు” కలిగివుండడమంటే ‘క్రీస్తుయేసునకు కలిగిన మనస్సునే’ కలిగివుండడమని అర్థం. (రోమీయులు 15:5; ఫిలిప్పీయులు 2:5) వేరే మాటల్లో చెప్పాలంటే, యేసులా ఆలోచించే, ఆయన అడుగుజాడలను అనుసరించే వ్యక్తే ఆధ్యాత్మిక వ్యక్తి. (1 పేతురు 2:21; 4:1) ఒక వ్యక్తి మనస్సు క్రీస్తు మనస్సును ఎంతగా పోలి ఉంటే, ఆయన ఆధ్యాత్మికత అంత బలంగా ఉంటుంది, ఆయన ‘జీవాన్ని, సమాధానాన్ని’ సంపాదించుకోవడానికి అంత సమీపంలో ఉంటాడు.—రోమీయులు 13:14.

‘క్రీస్తు మనస్సును’ ఎలా తెలుసుకోవాలి?

అయితే క్రీస్తు మనస్సును కలిగివుండాలంటే, ముందు మనం ఆయన మనస్సును, అంటే ఆయన ఎలా ఆలోచిస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి, ఆధ్యాత్మికతను వృద్ధి చేసుకోవడానికి తీసుకోవాల్సిన మొదటి చర్య ఏమిటంటే, యేసు ఆలోచనా విధానాన్ని తెలుసుకోవడం. అయితే 2,000 సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన వ్యక్తి మనస్సును ఎలా తెలుసుకోవచ్చు? ఉదాహరణకు, మీ దేశ చరిత్రకు సంబంధించిన వ్యక్తుల గురించి మీరెలా తెలుసుకున్నారు? బహుశా వారి గురించి చదవడం ద్వారా తెలుసుకుని ఉంటారు. అలాగే, యేసు లిఖిత చరిత్రను చదవడం క్రీస్తు మనస్సును తెలుసుకోవడానికున్న ఒక ప్రాముఖ్యమైన మార్గం.—యోహాను 17:3.

యేసును గురించి వ్రాయబడిన స్పష్టమైన చారిత్రక వృత్తాంతాలు నాలుగున్నాయి, అవి మత్తయి, మార్కు, లూకా, యోహాను వ్రాసిన సువార్తలు. ఈ వృత్తాంతాలను జాగ్రత్తగా చదవడం యేసు ఆలోచనా విధానాన్ని, ఆయన అంతర్గత భావాలను, ఆయన చర్యల వెనకున్న ప్రేరేపణను గ్రహించడానికి మీకు సహాయం చేస్తుంది. యేసు గురించి మీరు చదువుతున్నదాన్ని ధ్యానించడానికి సమయం తీసుకున్నప్పుడు, ఆయన ఎలాంటి వ్యక్తనే దాని గురించి మీ మనస్సులో ఒక ఊహాచిత్రాన్ని ఏర్పర్చుకుంటారు. మిమ్మల్ని మీరు ఇప్పటికే క్రీస్తు అనుచరులుగా పరిగణించుకుంటున్నా, అలా చదవడం, ధ్యానించడం మీరు “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడానికి [‘పొందుతూ ఉండడానికి,’ NW]” మీకు సహాయం చేస్తాయి.—2 పేతురు 3:18.

ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని, యేసును అంతటి ఆధ్యాత్మిక వ్యక్తిగా చేసిందేమిటో తెలుసుకోవడానికి సువార్తల్లోని కొన్ని భాగాలను మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత, ఆయన ఉంచిన మాదిరిని మీరు ఎలా అనుకరించవచ్చో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.—యోహాను 13:15.

ఆధ్యాత్మికత, “ఆత్మ ఫలం”

యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయనపై కుమ్మరించబడిందని, ఆయన ‘పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడని’ సువార్త రచయిత లూకా పేర్కొన్నాడు. (లూకా 3:21, 22; 4:1) ఆ తర్వాత యేసు, దేవుని “పరిశుద్ధాత్మ” ద్వారా నిర్దేశించబడడంలోని ప్రాముఖ్యతను తన అనుచరులకు నొక్కిచెప్పాడు. (ఆదికాండము 1:2; లూకా 11:9-13) అది ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే క్రీస్తు మనస్సును పోలి ఉండేలా ఒక వ్యక్తి మనస్సును మార్చే శక్తి దేవుని ఆత్మకు ఉంది. (రోమీయులు 12:1, 2) ఒక వ్యక్తి, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలను అలవర్చుకునేలా పరిశుద్ధాత్మ చేయగలదు. “ఆత్మ ఫలం” అని బైబిలు పిలుస్తున్న ఈ లక్షణాలున్న వ్యక్తే నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి అని చెప్పవచ్చు. (గలతీయులు 5:22, 23) క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని ఆత్మచే నిర్దేశించబడే వ్యక్తే ఆధ్యాత్మిక వ్యక్తి.

యేసు తన పరిచర్య అంతటిలో ఆత్మ ఫలాన్ని కనబర్చాడు. ప్రేమ, కనికరం, మంచితనం వంటి లక్షణాలు, సమాజంలో అల్పులుగా పరిగణించబడుతున్న వారితో ఆయన వ్యవహరించిన విధానంలో ప్రత్యేకంగా కనిపించాయి. (మత్తయి 9:36) ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను వర్ణించిన ఒక సంఘటనను గమనించండి. మనమిలా చదువుతాం: “[యేసు] మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను.” యేసు శిష్యులు కూడా ఆ వ్యక్తిని గమనించారు, అయితే వారు అతనిని ఒక పాపిగా దృష్టించారు. వారు “ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?” అని అడిగారు. ఆ వ్యక్తి పొరుగువారు కూడా అతనిని గమనించారు, అయితే వారు అతనిని ఒక భిక్షగాడిగానే దృష్టించారు. వారు ఇలా అన్నారు: “వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా?” అయితే, యేసు మాత్రం ఆ గ్రుడ్డివాడిని సహాయం అవసరమైన ఒక వ్యక్తిగా దృష్టించాడు. ఆయన ఆ గ్రుడ్డివాడితో మాట్లాడి అతనిని స్వస్థపర్చాడు.—యోహాను 9:1-8.

ఈ సంఘటన క్రీస్తు మనస్సు గురించి మీకేమి చెబుతోంది? మొదటగా, యేసు అల్పులైన వారిని చిన్నచూపు చూడలేదుగానీ వారిపట్ల ఆయన ఎంతో కనికరం చూపించాడు. రెండవదిగా, ఇతరులకు సహాయం చేయడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. యేసు ఉంచిన ఈ మాదిరిని మీరు అనుసరిస్తున్నారని అనుకుంటున్నారా? ప్రజలు తమ జీవితాలను మెరుగుపర్చుకొని తమ భవిష్యత్తును ఉజ్వలం చేసుకునేందుకు అవసరమైన సహాయాన్ని వారికి అందజేస్తూ, మీరు వారిని యేసు దృష్టిస్తున్నట్లు దృష్టిస్తున్నారా? లేక, మీరు ఘనులను ఆదరిస్తూ అల్పులైనవారిని నిర్లక్ష్యం చేస్తారా? మీరు ప్రజలను యేసు దృష్టించినట్లు దృష్టిస్తే, యేసు మాదిరిని మీరు అనుసరిస్తున్నట్లే.—కీర్తన 72:12-14.

ఆధ్యాత్మికత, ప్రార్థన

యేసు తరచూ దేవునికి ప్రార్థించేవాడని సువార్త వృత్తాంతాలు చూపిస్తున్నాయి. (మార్కు 1:35; లూకా 5:16; 22:41) యేసు భూమిపై తన పరిచర్యా కాలంలో ప్రార్థన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాడు. శిష్యుడైన మత్తయి ఇలా వ్రాశాడు: “[యేసు] ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పో[యెను].” (మత్తయి 14:23) యేసు తన పరలోకపు తండ్రికి ప్రార్థిస్తూ ప్రశాంతంగా గడిపిన అలాంటి సమయాలవల్ల బలపర్చబడ్డాడు. (మత్తయి 26:36-44) అలాగే నేడు, నిజమైన ఆధ్యాత్మికత గలవారు దేవునికి ప్రార్థించడానికి అవకాశాల కోసం చూస్తారు, ఆ ప్రార్థన సృష్టికర్తతో తమ సంబంధాన్ని బలపర్చడమేగాక తమ ఆలోచనా విధానంలో మరింతగా క్రీస్తును పోలి ఉండడానికి దోహదపడుతుందని వాళ్ళకు తెలుసు.

యేసు ప్రార్థనలో తరచూ అనేక గంటలు గడిపేవాడు. (యోహాను 17:1-26) ఉదాహరణకు, యేసు తన అపొస్తలులుగా 12 మందిని ఎంపిక చేసుకునే ముందు, “ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.” (లూకా 6:12) నిజమైన ఆధ్యాత్మికత గలవారు రాత్రంతా ప్రార్థనలో గడపకపోయినా, యేసు మాదిరిని అనుసరిస్తారు. వారు, జీవితంలో గంభీరమైన నిర్ణయాలు తీసుకునే ముందు, తమ ఆధ్యాత్మికతను మెరుగుపరిచే ఎంపికలు చేసుకోవడంలో పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని కోరుతూ దేవునికి ప్రార్థించేందుకు తగినంత సమయాన్ని కేటాయిస్తారు.

మనం మన ప్రార్థనల్లో అనుకరించాల్సిన నిజాయితీని కూడా యేసు తన ప్రార్థనల్లో చూపించాడు. యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి ప్రార్థించిన విధానం గురించి లూకా ఏమి వ్రాశాడో గమనించండి. “ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:44) యేసు అంతకుముందు కూడా ఆతురముగా ప్రార్థించాడు, కానీ తన భూ జీవితంలోని అత్యంత తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో, ఆయన “మరింత ఆతురముగా” ప్రార్థించాడు, ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. (హెబ్రీయులు 5:7) నిజమైన ఆధ్యాత్మికత గలవారు యేసు మాదిరిని అనుసరిస్తారు. వారు ప్రాముఖ్యంగా తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ కోసం, నడిపింపు కోసం, మద్దతు కోసం “మరింత ఆతురముగా” ప్రార్థిస్తారు.

స్పష్టంగా, యేసు ప్రార్థనాపరుడు కాబట్టి, ఈ విషయంలో ఆయన శిష్యులు ఆయనను అనుకరించాలని కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి, వారాయనను ఇలా అడిగారు: ‘ప్రభువా, మాకు ప్రార్థనచేయడం నేర్పించు.’ (లూకా 11:1) అలాగే నేడు, ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా పరిగణించేవారు, దేవుని పరిశుద్ధాత్మచే నిర్దేశించబడాలని కోరుకునేవారు, దేవునికి ప్రార్థించడంలో యేసు మాదిరిని అనుసరిస్తారు. నిజమైన ఆధ్యాత్మికతకు, ప్రార్థనకు దగ్గరి సంబంధం ఉంది.

ఆధ్యాత్మికత, సువార్త ప్రకటన

యేసు ఎంతో రాత్రి వరకు చాలామంది రోగగ్రస్థులను స్వస్థపర్చిన వృత్తాంతం మార్కు సువార్తలో మనం చూస్తాం. మరునాడు ఉదయాన్నే ఆయన ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన అపొస్తలులు వచ్చి చాలామంది బహుశా స్వస్థత పొందడానికి, ఆయన కోసం చూస్తున్నారని చెప్పారు. అయితే, యేసు వారికిలా చెప్పాడు: “ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి.” దానికి కారణమేమిటో యేసు ఇలా వివరించాడు: “యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితిని.” (మార్కు 1:32-38; లూకా 4:43) ప్రజలను స్వస్థపర్చడం యేసుకు ముఖ్యమైన విషయమే అయినా, దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ఆయన ప్రాథమిక కర్తవ్యం.—మార్కు 1:14, 15.

నేడు కూడా దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెప్పడం క్రీస్తు మనస్సు ఉన్నవారికి ఒక గుర్తింపు చిహ్నంగా ఉంది. యేసు తన అనుచరులుగా ఉండాలనుకునే వారందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) అంతేగాక, యేసు ముందుగానే ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) ప్రకటనా పని పరిశుద్ధాత్మ శక్తితో సాధించబడుతోందని దేవుని వాక్యం సూచిస్తోంది కాబట్టి, ఆ పనిలో అర్థవంతమైన భాగం కలిగి ఉండడం నిజమైన ఆధ్యాత్మికతకు సూచన.—అపొస్తలుల కార్యములు 1:8.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రాజ్య సందేశం ప్రకటించబడాలంటే లక్షలాదిమంది ప్రజలు ఐక్యంగా కృషి చేయాలి. (యోహాను 17:20, 21) ఈ పనిలో పాల్గొనేవారు నిజమైన ఆధ్యాత్మికత కలిగివుండడమే కాక ప్రపంచవ్యాప్తంగా చక్కగా సంస్థీకరించబడి ఉండాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ భూవ్యాప్తంగా రాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రజలను మీరు గుర్తించగలరా?

ఆధ్యాత్మికంగా మీరు ఏ స్థితిలో ఉన్నారు?

నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తిని గుర్తించే ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ ఇంతవరకు పరిశీలించిన వాటినిబట్టి చూస్తే ఆధ్యాత్మికంగా మీరు ఏ స్థితిలో ఉన్నారు? అది తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను దేవుని వాక్యమైన బైబిలును క్రమంగా చదివి, దానిని ధ్యానిస్తున్నానా? నేను నా జీవితంలో ఆత్మ ఫలాన్ని కనబరుస్తున్నానా? నేను క్రమంగా ప్రార్థిస్తున్నానా? ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రజలతో సహవసించాలని నేను కోరుకుంటున్నానా?’

నిజాయితీగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ఆధ్యాత్మికంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి మీకు సహాయం చేయగలదు. మీరు ‘జీవాన్ని, సమాధానాన్ని’ పొందగలిగేలా ఇప్పుడే అవసరమైన చర్యలు తీసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.—రోమీయులు 8:6; మత్తయి 7:13, 14; 2 పేతురు 1:5-11.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ఆధ్యాత్మికతకు గుర్తింపు చిహ్నాలు

◆ దేవుని వాక్యంపట్ల ప్రేమ కలిగివుండడం

◆ ఆత్మ ఫలాన్ని కనబరచడం

◆ క్రమంగా, నిజాయితీగా దేవునికి ప్రార్థించడం

◆ ఇతరులతో రాజ్య సువార్త పంచుకోవడం

[5వ పేజీలోని చిత్రం]

‘క్రీస్తు మనస్సును’ తెలుసుకునేందుకు బైబిలు మీకు సహాయం చేస్తుంది