కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సౌలు దావీదును అంతకుముందే తన సముఖంలో పనిచేయడానికి నియమించినా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత రాజైన సౌలు దావీదును “చిన్నవాడా, నీవెవని కుమారుడవు” అని ఎందుకు అడిగాడు?—1 సమూయేలు 16:22; 17:58.

సౌలు దావీదును మొదటిసారి కలిసినప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపలేదు కాబట్టి ఆయన దావీదును మర్చిపోయే అవకాశం ఉంది. అయితే, అది నిజం కాకపోవచ్చు ఎందుకంటే, సౌలు రాజు దావీదును ప్రత్యేకంగా పిలిపించాడనీ, అతణ్ణి బహుగా ఇష్టపడి, తన ఆయుధాలను మోసేవానిగా నియమించాడనీ 1 సమూయేలు 16:18-23లోని వృత్తాంతం చెబుతోంది. దావీదు ఎవరో సౌలుకు బాగా తెలిసేవుంటుంది.

1 సమూయేలు 17:12-31, 17:55—18:5 భాగాలను లేఖనాల్లో ఆ తర్వాత చేర్చారని కొందరు బైబిలు విద్వాంసులు భావిస్తున్నారు, ఎందుకంటే ఆ వచనాలు కొన్ని గ్రీకు సెప్టాజింట్‌ ప్రతులలో కనిపించవు, ఇది సా.శ.పూ. రెండవ శతాబ్దంలో పూర్తిచేయబడిన హెబ్రీ లేఖనాల అనువాదం. అయితే, కేవలం సెప్టాజింట్‌ యొక్క ఈ ప్రతుల ఆధారంగా ఆ ముగింపుకు రావడం సమంజసం కాదు ఎందుకంటే ఆ వాక్యాలు హీబ్రూ లేఖనాల ఇతర అధికారిక రాతప్రతుల్లో కనిపిస్తాయి.

సౌలు కేవలం దావీదు తండ్రెవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అబ్నేరును, తర్వాత దావీదును అలా ప్రశ్నించాడని అనిపించడంలేదు. గొల్యాతును ఓడించడంలో అంతటి ధైర్యసాహసాలను, గొప్ప విశ్వాసాన్ని కనబర్చిన దావీదులో అతని వ్యక్తిత్వపు క్రొత్త కోణాన్ని చూసిన సౌలు, అతణ్ణి ఎలాంటి తండ్రి పెంచాడో తెలుసుకోవాలనుకున్నాడు. దావీదు కుటుంబీకులకు కూడా అతనిలో ఉన్న ధైర్యసాహసాలే ఉండవచ్చు కాబట్టి అతని తండ్రియైన యెష్షయిని, ఇతర సభ్యుల్ని తన సైన్యంలో చేర్చుకోవాలనే ఉద్దేశం కూడా సౌలుకు ఉండివుండవచ్చు.

1 సమూయేలు 17:58లో దావీదు తాను “బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని” చెప్పిన సంక్షిప్త జవాబు మాత్రమే ఉన్నా, వారి సంభాషణ ఇంకా కొనసాగేవుంటుందని ఆ తర్వాతి మాటలు సూచిస్తున్నాయి. ఆ మాటలపై వ్యాఖ్యానిస్తూ సి. ఎఫ్‌. కైల్‌, ఎఫ్‌. డెలిట్జ్స్‌ ఇలా అన్నారు: “[1 సమూయేలు 18:1]లోని ‘దావీదు సౌలుతో మాట్లాడడం చాలించినప్పుడు’ అనే పదబంధం మూలంగా, సౌలు దావీదుతో అతని కుటుంబ వ్యవహారాల గురించి చాలాసేపు మాట్లాడి ఉంటాడని స్పష్టమవుతోంది, ఎందుకంటే ఆ పదబంధం సుదీర్ఘమైన సంభాషణ జరిగి ఉంటుందని సూచిస్తోంది.”

కాబట్టి, దీనంతటి నుండి, దావీదు ఎవరో సౌలుకు అంతకుముందే తెలిసినా, “చిన్నవాడా, నీవెవని కుమారుడవు” అని ప్రశ్నించినప్పుడు, ఆయన దావీదు నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాడనే ముగింపుకు మనం రావచ్చు.

[31వ పేజీలోని చిత్రం]

సౌలు దావీదును, “నీవెవని కుమారుడవు” అని ఎందుకు అడిగాడు?