మీరు ‘దేవునియెడల ధనవంతులై’ ఉన్నారా?
మీరు ‘దేవునియెడల ధనవంతులై’ ఉన్నారా?
“దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”—లూకా 12:21.
నిధి అన్వేషణ అనేది పిల్లలు ఇష్టపడే ఆట మాత్రమే కాదు; అది వివిధ కాలాల్లో, అనేక సమకాలీన సమాజాల్లో పదేపదే వేయబడుతున్న నిజజీవిత నాటకం కూడా. ఉదాహరణకు, 19వ శతాబ్దపు గోల్డ్‌రష్ (ధనార్జన కోసం బంగారు గనులున్న ప్రాంతాలకు వలసవెళ్లడం) కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా అమెరికాలకు సుదూర ప్రాంతాలనుండి ప్రజలు తరలివెళ్లారు, వారు ఐశ్వర్యాన్వేషణలో తమ ఇంటిని, ప్రియమైనవారిని వదిలి పరిచయంలేని ప్రాంతాలకు, కొన్నిసార్లు తమను ఆదరించని దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడ్డారు. అవును చాలామంది, తాము కోరుకున్న సంపదను సంపాదించుకునేందుకు తీవ్ర సాహసాలు, అపరిమితమైన త్యాగాలు చేసేందుకు వెనుకాడరు.
2 నేడు చాలామంది అక్షరార్థ నిధి అన్వేషణలో భాగం వహించకపోయినా, జీవనాధారంకోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో అది సవాలుగా, కష్టంగా, భారంగా ఉండవచ్చు. మరి విశేషమైన విషయాలను నిర్లక్ష్యం చేసేంతగా లేదా చివరకు మర్చిపోయేంతగా ఆహారం, బట్టలు, ఇల్లు వంటివాటితో తలమునకలైపోవడం సులభం. (రోమీయులు 14:17) ఈ మానవ స్వభావాన్ని చక్కగా వర్ణించిన దృష్టాంతాన్ని లేదా ఉపమానాన్ని యేసు చెప్పాడు. అది లూకా 12:16-21లో ఉంది.
3 మనం ముందరి ఆర్టికల్‌లో సవివరంగా పరిశీలించిన, లోభత్వం విషయంలో జాగ్రత్తగా ఉండమని మాట్లాడిన సందర్భంలోనే యేసు ఈ దృష్టాంతం చెప్పాడు. లోభత్వాన్ని గురించి హెచ్చరించిన తర్వాత యేసు, అప్పటికే సమృద్ధిగా నిండివున్న కొట్లతో తృప్తిపడక, మరింత ఆస్తిని సమకూర్చుకునేందుకు వాటిని పడగొట్టించి ఇంకా పెద్ద కొట్లను నిర్మించుకున్న ఒక ధనవంతుని గురించి మాట్లాడాడు. తను సేదదీరేందుకు, సుఖంగా బ్రతికేందుకు సిద్ధంగా ఉన్నట్లు అతను ఆలోచిస్తుండగా, దేవుడు అతనితో అతని ప్రాణం పోనున్నదనీ, అతడు సంపాదించుకున్న ఆస్తి మొత్తం వేరొకరికి పోతుందని అన్నాడు. ఆ పిమ్మట యేసు తన దృష్టాంతాన్ని ఈ మాటలతో ముగించాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.” లూకా 12:21) ఈ ఉపమానం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? ఆ పాఠాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు?
(సమస్య ఎదురైన వ్యక్తి
4 యేసు చెప్పిన దృష్టాంతం చాలామందికి సుపరిచితమైనదే. యేసు ఆ కథను కేవలం ఇలా చెప్పి పరిచయం చేయడాన్ని మనం గమనిస్తాం: “ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.” ఆ వ్యక్తి తన ధనాన్ని మోసకరంగా లేదా చట్టవిరుద్ధంగా సమకూర్చుకున్నాడని యేసు చెప్పలేదు. మరోరకంగా చెప్పాలంటే, అతనొక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడలేదు. వాస్తవానికి, యేసు చెప్పినట్లుగా ఆ దృష్టాంతంలో చిత్రీకరించబడిన వ్యక్తి కష్టపడి పనిచేశాడని అనుకోవడం సముచితం. కనీసం ఆ వ్యక్తి బహుశా తన కుటుంబ సంక్షేమాన్ని మనసులో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళికతో, పొదుపుచేశాడని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లోకరీత్యా ఆలోచిస్తే అతడు కష్టపడి పనిచేస్తూ తన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నెరవేర్చిన వ్యక్తికి ప్రతీకగా ఉన్నాడని చెప్పవచ్చు.
5 ఏదేమైనా, యేసు ఉపమానంలో ఆ వ్యక్తి ధనవంతుడని చెప్పాడు, అంటే ఆ వ్యక్తికి అప్పటికే వస్తుసంపద సమృద్ధిగా ఉందని అర్థం. అయితే యేసు వివరించినట్లుగా ఆ ధనవంతునికి ఒక సమస్య ఉంది. అతని పొలంలో ఆయన ఆశించినదానికన్నా, అతనికి అవసరమైన లేదా దాచుకోగలిగిన దానికన్నా సమృద్ధిగా పండింది. అతనేమి చేసి ఉండాల్సింది?
6 నేడు యెహోవా సేవకులు చాలామంది ఆ ధనవంతునికి ఎదురైనలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. నిజ క్రైస్తవులు నిజాయితీతో, శ్రద్ధగా, మనఃపూర్వకంగా పనిచేసేవారిగా ఉండేందుకు కృషిచేస్తారు. (కొలొస్సయులు 3:22, 23) వారు ఉద్యోగం చేస్తున్నా లేక సొంత వ్యాపారమున్నా తరచూ తాముచేసే పనిలో వారు విజయం సాధించడమే కాక, అతిశయిస్తారు కూడా. పదోన్నతులు లేదా క్రొత్త అవకాశాలు లభించినప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి వారికి ఎదురౌతుంది. పదోన్నతిని అంగీకరించాలా లేదా ఎక్కువ డబ్బు సంపాదించాలా? అదే విధంగా, యువ సాక్షులు చాలామంది పాఠశాలలో మంచి మార్కులు సంపాదిస్తుండవచ్చు. ఫలితంగా, వారికి బహుమతులు లేదా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నతవిద్య కోసం ఉపకార వేతనాలు ఇవ్వజూపవచ్చు. అందరిలాగే వారుకూడా ముందుకెళ్లి ఇవ్వజూపింది అంగీకరించాలా?
7 యేసు దృష్టాంతానికి తిరిగివస్తే, తన పొలం సమృద్ధిగా పండి, ఆ పంట నిల్వజేసే స్థలం తనదగ్గర లేనప్పుడు ఆ ధనవంతుడు ఏమిచేశాడు? అదనపు ధాన్యాన్ని, ఆస్తిని నిల్వజేసేందుకు అతను తన దగ్గరున్న కొట్లను పడగొట్టించి, వాటికన్నా పెద్దవి నిర్మించేందుకు నిర్ణయించుకున్నాడు. ఆ పథకం స్పష్టంగా అతనికెంత సురక్షిత భావాన్ని, తృప్తిని ఇచ్చిందంటే, అతనిలా అనుకున్నాడు: “నా ప్రాణముతో—ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును.”—లూకా 12:19.
ఎందుకు ‘వెర్రివాడు’?
8 కానీ యేసు చెప్పినట్లుగా ఆ ధనవంతుని పథకం కేవలం కృత్రిమ సురక్షిత భావాన్నిచ్చింది. అది ఆచరణాత్మకంగా కనిపించి ఉండవచ్చు, కానీ అందులో ఒక లూకా 12:15) ఆ రాత్రే అకస్మాత్తుగా ఆ వ్యక్తి సమకూర్చుకున్నదంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది ఎందుకంటే దేవుడు అతనితో ఇలా అన్నాడు, “వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగును.”—లూకా 12:20.
ప్రాముఖ్యమైన అంశం అంటే దేవుని చిత్తం చేర్చబడలేదు. ఆ వ్యక్తి కేవలం తనగురించే అంటే తానెలా సేదదీరవచ్చు, తినవచ్చు, త్రాగవచ్చు, సుఖించవచ్చు అనే ఆలోచించాడు. “విస్తారమైన ఆస్తి” ఉంది కాబట్టి, తాను “అనేక సంవత్సరములు” నిశ్చింతగా ఉంటానని కూడా అనుకున్నాడు, కానీ విచారకరంగా అలా జరగలేదు. యేసు అంతకుముందు చెప్పినట్లుగా “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.” (9 ఇప్పుడు మనం యేసు ఉపమానంలోని కీలకాంశానికి వస్తున్నాం. దేవుడు ఆ వ్యక్తిని వెర్రివాడు అన్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకుపద రూపాలు “ఎల్లప్పుడూ అవగాహనా లోపాన్ని సూచిస్తాయి” అని ఎక్జిజిటికల్ డిక్షనరీ ఆఫ్ ద న్యూ టెస్ట్‌మెంట్ వివరిస్తోంది. ఈ ఉపమానంలో “ధనవంతుని భావి ప్రణాళికల అర్థరాహిత్యాన్ని” బహిర్గతం చేసేందుకు దేవుడే ఆ మాటను ఉపయోగిస్తున్నట్లు సూచించబడిందని ఆ నిఘంటువు చెబుతోంది. ఆ పదం తెలివిలేని వ్యక్తిని కాదుగానీ “దేవునిపై ఆధారపడవలసిన అవసరతను నిరాకరించే వ్యక్తిని” సూచిస్తోంది. యేసు ఆ ధనవంతుని వర్ణించిన తీరు ఆయన ఆ తర్వాత మొదటి శతాబ్దంలో ఆసియా మైనరులోవున్న లవొదికయ సంఘంలోని క్రైస్తవులకు చెప్పిన ఈ మాటలను గుర్తుచేస్తోంది: “నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక—నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.”—ప్రకటన 3:17.
10 మనమా పాఠాన్ని ధ్యానించడం మంచిది. మనమా ఉపమానంలోని వ్యక్తిలా అంటే “ఆస్తి” సమకూర్చుకునేందుకు కష్టపడి పనిచేసినా “అనేక సంవత్సరముల” ఉత్తరాపేక్షను పొందేందుకు అవసరమైనది చేయని వ్యక్తిలా ఉండే అవకాశముందా? (యోహాను 3:16; 17:3) బైబిలు ఇలా చెబుతోంది: “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు,” “ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును.” (సామెతలు 11:4, 28) కాబట్టి యేసు ఆ ఉపమానానికి ఈ చివరి హెచ్చరికను జోడించాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”—లూకా 12:21.
11 “ఆలాగుననే” అని యేసు చెప్పినప్పుడు, తమ జీవితాన్ని అంటే తమ నిరీక్షణను, తమ భద్రతను కేవలం వస్తుసంపదపై నిర్మించుకునేవారికి కూడా దృష్టాంతంలోని ధనవంతునికి సంభవించినదే సంభవిస్తుందని ఆయన సూచిస్తున్నాడు. ‘తనకోసం సమకూర్చుకోవడం’ తప్పుకాదుగానీ “దేవునియెడల ధనవంతుడుకాక” పోవడమే తప్పు. శిష్యుడైన యాకోబు కూడా అలాంటి హెచ్చరికనే ఇస్తూ ఇలా వ్రాశాడు: “నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు.” వారేమి చేయాలి? “ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.” (యాకోబు 4:13-15) ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా లేక అతనికెంత వస్తుసంపదవున్నా ఆ వ్యక్తి దేవునియెడల ధనవంతుడుకాకపోతే అదంతా వ్యర్థమే. అయితే దేవునియెడల ధనవంతులుగా ఉండడమంటే అర్థమేమిటి?
దేవునియెడల ధనవంతులుగా ఉండడం
12 యేసు మాటలు, దేవునియెడల ధనవంతులుగా ఉండడం, తనకొరకే సమకూర్చుకోవడానికి లేదా వస్తుసంపదతో ధనవంతుడు కావడానికి పూర్తి భిన్నంగా ఉంది. కాబట్టి మన జీవితంలో వస్తుసంపదను సమకూర్చుకోవడం లేదా మనకున్న వాటిని ఆనందిస్తూ ఉండడం ముఖ్యచింతగా ఉండకూడదని యేసు చెబుతున్నాడు. బదులుగా, మనం యెహోవాతో మన సంబంధాన్ని వృద్ధిచేసుకునే లేదా బలపర్చుకునే రీతిలో మన వనరుల్ని ఉపయోగించాలి. అలాచేస్తే మనం నిశ్చయంగా దేవునియెడల ధనవంతులుగా ఉంటాం. ఎందుకు? ఎందుకంటే అది ఆయననుండి లభించే అనేక ఆశీర్వాదాలకు ద్వారం తెరుస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు.”—సామెతలు 10:22.
13 యెహోవా తన ప్రజలకు ఆశీర్వాదాలు అనుగ్రహించినప్పుడు, ఆయన వారికెల్లప్పుడూ శ్రేష్ఠమైనవే అనుగ్రహిస్తాడు. (యాకోబు 1:17) ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం “పాలు తేనెలు ప్రవహించు దేశము.” ఐగుప్తు దేశం కూడా అలాగే వర్ణించబడినా, యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం కనీసం ఒక విషయంలో విభిన్నంగా ఉంది. “అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము” అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. వేరేమాటల్లో చెప్పాలంటే, యెహోవా వారిపట్ల శ్రద్ధ చూపిస్తాడు కాబట్టి వారు వర్ధిల్లుతారు. ఇశ్రాయేలీయులు యెహోవాయెడల నమ్మకంగా ఉన్నంతకాలం ఆయన వారినాశీర్వదించాడు, ఆ విధంగా వారు తమ చుట్టూవున్న జనాంగాలకన్నా స్పష్టంగా ఎంతో ఉన్నతమైనదిగావున్న జీవనవిధానాన్ని ఆనందించారు. అవును, యెహోవా ఆశీర్వాదమే ‘ఐశ్వర్యమిస్తుంది.’—సంఖ్యాకాండము 16:13; ద్వితీయోపదేశకాండము 4:5-8; 11:8-15.
14 “దేవునియెడల ధనవంతుడు” అనే పదబంధం “దేవుని విషయంలో ధనవంతుడు” (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) లేదా ‘దేవుని దృష్టిలో భాగ్యవంతుడు’ (పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము) అని కూడా అనువదించబడింది. వస్తుపరంగా సంపన్నులుగా ఉన్నవారు సాధారణంగా ఇతరుల దృష్టిలో తామెలా ఉన్నామనే దానిగురించి చింతిస్తారు. ఇది తరచూ వారి జీవనశైలిలో ప్రతిబింబిస్తుంది. ప్రజల్ని వారు “జీవపుడంబము” అని బైబిలు పిలిచే దానితో ముగ్ధుల్ని చేయాలని కోరుకుంటారు. (1 యోహాను 2:16) దానికి భిన్నంగా దేవునియెడల ధనవంతులుగా ఉండేవారు దేవుని ఆమోదాన్ని, అనుగ్రహాన్ని, సమృద్ధిగా దేవుని కృపను పొందడమేకాక, ఆయనతో వ్యక్తిగత ఆప్యాయతానుబంధాన్ని కలిగివుంటారు. అలాంటి ప్రశస్తమైన స్థితిలో ఉండడం నిశ్చయంగా ఏ వస్తుసంపద ఇచ్చేదానికన్నా మిన్నగా క్షేమంగా, భద్రంగా ఉన్నామనే భావాన్నిస్తుంది. (యెషయా 40:11) అయితే మనముందున్న ప్రశ్నేమిటంటే, దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండేందుకు మనమేమి చేయాలి?
దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడం
15 యేసు దృష్టాంతంలోని వ్యక్తి తనను సంపన్నునిగా చేసుకునేందుకు ప్రణాళిక వేసుకొని కష్టపడి పనిచేశాడు, అందుకే అతడు వెర్రివాడు అని పిలవబడ్డాడు. కాబట్టి దేవునియెడల ధనవంతులుగా ఉండాలంటే మనం దేవుని దృష్టిలో నిజంగా విలువైన, యోగ్యమైన కార్యకలాపాల్లో పూర్తిగా భాగం వహించేందుకు కృషిచేయాలి. వాటిలో యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞవుంది: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” (మత్తయి 28:19) సొంత జీవన పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు కాదుగానీ, రాజ్య ప్రకటనాపనికి, శిష్యులను చేసే పనికి మన సమయాన్ని, శక్తిని, సామర్థ్యాలను ఉపయోగించడాన్ని పెట్టుబడి పెట్టడంతో పోల్చవచ్చు. ఈ క్రింది అనుభవాలు చూపిస్తున్నట్లుగా, అలాచేసినవారు ప్రత్యుపకారంగా చక్కని ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందారు.—సామెతలు 19:17.
16 ఆసియాలోని ఒక దేశంలో నివసిస్తున్న ఒక క్రైస్తవుని విషయం పరిశీలించండి. కంప్యూటర్ టెక్నీషియన్‌గా ఆయనకు మంచి జీతం వచ్చే ఉద్యోగముంది. అయితే ఆయన ఉద్యోగం ఆయన సమయాన్నంతా హరించివేయడమేకాక, ఆధ్యాత్మికంగా బలహీనమయ్యాననే భావాన్ని ఆయనలో కలిగించింది. చివరకు ఆయన తన ఉద్యోగంలో ఇంకా పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళడానికి ప్రయత్నించే బదులు ఆ ఉద్యోగం మానేసి, తన ఆధ్యాత్మిక అవసరాలపట్ల, బాధ్యతలపట్ల శ్రద్ధచూపగలిగేలా మరింత సమయం లభించడం కోసం ఐస్‌క్రీమ్ తయారుచేసి దానిని వీధుల్లో అమ్మే వ్యాపారం మొదలుపెట్టాడు. ఆయన మాజీ సహోద్యోగులు ఆయనను గేలిచేశారు, కానీ ఫలితమేమిటి? “నిజానికి నేను కంప్యూటర్లతో పనిచేసినప్పటికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాను. నా మునుపటి ఉద్యోగంలోవున్న ఒత్తిడి, ఆందోళన లేకపోవడంతో నేను చాలా సంతోషించాను. మరి ముఖ్యంగా, నేనిప్పుడు యెహోవాకు మరింత చేరువైనట్లు భావిస్తున్నాను” అని చెప్పాడు. ఆ మార్పు ఈ క్రైస్తవుడు పూర్తికాల పరిచర్య ప్రారంభించేందుకు తోడ్పడడమే కాక, ఆయన ప్రస్తుతం తన దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు. అవును యెహోవా ఆశీర్వాదము ‘ఐశ్వర్యమిస్తుంది.’
17 మరో ఉదాహరణ, విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చే కుటుంబంలో పెరిగిన స్త్రీకి సంబంధించినది. ఆమె ఫ్రాన్స్, మెక్సికో, స్విట్జర్లాండ్‌లలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకునే ఆశతో ఉంది. “అపజయమే నాకు తెలియదు; నాకెంతో గౌరవం, ప్రత్యేక అవకాశాలు లభించాయి, కానీ నా హృదయంలో శూన్యభావం, తీవ్ర అసంతృప్తి ఉండేవి” అని ఆమె చెప్పింది. తర్వాత ఆమె యెహోవా గురించి తెలుసుకుంది. ఆమె ఇలా చెబుతోంది: “నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తుండగా, యెహోవాను సంతోషపెట్టాలనే, ఆయన నాకిచ్చిన దానిలో కొంతైనా ఆయనకు తిరిగి ఇవ్వాలనే కోరిక నేను వెళ్లాల్సిన మార్గాన్ని అంటే పూర్తికాలం ఆయనను సేవించడమనే మార్గాన్ని స్పష్టంగా చూసేందుకు నాకు సహాయం చేసింది.” ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అనతి కాలంలోనే బాప్తిస్మం తీసుకుంది. గత 20 సంవత్సరాలుగా ఆమె సంతోషంగా పూర్తికాల పరిచర్యలో కొనసాగుతోంది. “నేను నా సామర్థ్యాలను వ్యర్థం చేసుకున్నానని కొందరనుకుంటారు, అయితే వారు నేను సంతోషంగా ఉన్నానని గుర్తిస్తూ, నేను నా జీవితంలో పాటిస్తున్న సూత్రాలను మెచ్చుకుంటారు. యెహోవా ఆమోదం నాపై ఉండేలా వినయంగా ఉండడానికి నాకు సహాయం చేయమని నేను ప్రతీరోజు ఆయనకు ప్రార్థిస్తున్నాను” అని ఆమె వివరిస్తోంది.
18 అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలుకు భవిష్యత్తులో చక్కని ఉపాధి లభించే అవకాశం ఉంది. కానీ ఆయన ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:7, 8) పౌలుకు, తాను క్రీస్తు ద్వారా పొందిన ఐశ్వర్యము ఈ లోకం అందించగల దేనికన్నా శ్రేష్ఠమైనది. అదే విధంగా, ప్రసిద్ధి కావాలనే స్వార్థపూరిత ఆశలను త్యజించి దైవభక్తిగల మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం కూడా దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఆనందించవచ్చు. దేవుని వాక్యం మనకిలా అభయమిస్తోంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.”—సామెతలు 22:4.
మీరు వివరించగలరా?
• యేసు దృష్టాంతంలోని వ్యక్తికి ఏ సమస్యవుంది?
• ఉపమానంలోని వ్యక్తి ఎందుకు వెర్రివాడు అని పిలవబడ్డాడు?
• దేవునియెడల ధనవంతులై ఉండడమంటే అర్థమేమిటి?
• మనమెలా దేవునియెడల ధనవంతులం కావచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) ప్రజలు దేనికోసం గొప్ప త్యాగాలు చేయడానికి వెనకాడడం లేదు? (బి) క్రైస్తవులు ఎలాంటి సవాలును, ప్రమాదాన్ని ఎదుర్కోవాలి?
3. లూకా 12:16-21లో వ్రాయబడిన యేసు దృష్టాంతాన్ని క్లుప్తంగా వివరించండి.
4. యేసు ఉపమానంలో చిత్రీకరించబడిన వ్యక్తి ఎలాంటి వ్యక్తని చెప్పవచ్చు?
5. యేసు ఉపమానంలోని వ్యక్తికి ఏ సమస్య ఎదురైంది?
6. నేడు దేవుని సేవకులు చాలామంది ఎలాంటి నిర్ణయాలను ఎదుర్కొంటున్నారు?
7. యేసు ఉపమానంలోని వ్యక్తి తన సమస్యనెలా పరిష్కరించుకున్నాడు?
8. యేసు ఉపమానంలోని వ్యక్తి ఏ ప్రాముఖ్యమైన అంశాన్ని నిర్లక్ష్యం చేశాడు?
9. ఉపమానంలోని వ్యక్తి ఎందుకు వెర్రివాడని పిలవబడ్డాడు?
10. “ఆస్తి” ఉండడం ఎందుకు “అనేక సంవత్సరములకు” హామీనివ్వదు?
11. ఒకవ్యక్తి తన నిరీక్షణను, భద్రతను వస్తుసంపదపై నిర్మించుకోవడం ఎందుకు వ్యర్థం?
12. ఏమిచేయడం మనల్ని దేవునియెడల ధనవంతుల్ని చేస్తుంది?
13. యెహోవా ఆశీర్వాదం ఎలా ‘ఐశ్వర్యమిస్తుంది’?
14. దేవునియెడల ధనవంతులుగా ఉండేవారు ఏమి అనుభవిస్తారు?
15. దేవునియెడల ధనవంతులుగా ఉండేందుకు మనమేమి చేయాలి?
16, 17. ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో ధనవంతుణ్ణిచేసే జీవనవిధానాన్ని చూపించేందుకు ఏ అనుభవాలను మీరు వివరించగలరు?
18. పౌలులాగే మనం కూడా దేవునియెడల ఎలా ధనవంతులమై ఉండవచ్చు?
[26వ పేజీలోని చిత్రం]
ధనవంతుడు ఎందుకు వెర్రివాడని పిలవబడ్డాడు?
[27వ పేజీలోని చిత్రం]
ముందుకెళ్లే అవకాశాలు నిజమైన పరీక్షగా ఎలా మారవచ్చు?
[28, 29వ పేజీలోని చిత్రం]
“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును”