కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను సేవించడం అమూల్యమైన ఆధిక్యత

యెహోవాను సేవించడం అమూల్యమైన ఆధిక్యత

జీవిత కథ

యెహోవాను సేవించడం అమూల్యమైన ఆధిక్యత

జీరా స్టైగర్స్‌ చెప్పినది

పూర్తికాల పరిచర్యలో నాకు నమ్మకమైన సహచరునిగా ఉన్న మావారు 1938లో కన్నుమూశారు. దానితో ఒక పసికందును, పదేళ్ల అబ్బాయిని పెంచే బాధ్యత నామీద పడింది. పూర్తికాల పరిచారకురాలిగా సేవచేయాలనే కోరిక నాలో అప్పటికీ బలంగా ఉన్నా, అదెలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమైందో మీకు వివరించే ముందు నా గతజీవితం గురించి కొంత చెప్పనివ్వండి.

నే ను అమెరికాలోని అలబామాలో 1907, జూలై 27న పుట్టాను. నేను పుట్టిన కొంతకాలం తర్వాత మా అమ్మానాన్నలు నన్ను, నా ముగ్గురు తోబుట్టువులను తమతోపాటు జార్జియాకు తీసుకెళ్లారు. కొన్నాళ్ల తర్వాత మేము టెన్నెస్సీకి తరలివెళ్లాం, ఆ తర్వాత ఫ్లోరిడాలోని టాంపా నగరానికి దగ్గర్లోవున్న ప్రాంతానికి వెళ్లాం. 1916లో, నేను అక్కడున్నప్పుడు, శబ్దం కూర్చబడిన “ఫొటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” అనే చిత్ర ప్రదర్శనను చూశాను. అప్పట్లో చిత్ర పరిశ్రమ శైశవ దశలో ఉంది కాబట్టి, ప్రతీ ఒక్కరూ “ఫొటో డ్రామా”ను చూసి ఎంతో ఆనందించారు.

మా అమ్మానాన్నలు కావలికోటతోపాటు, ఇతర బైబిలు ప్రచురణలను ఉత్సాహంగా చదివేవారు. మా నాన్న సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడినా, ఆయన అప్పుడు బైబిలు విద్యార్థులతో చురుకుగా సహవసించలేదు, యెహోవాసాక్షులను అప్పుడలా పిలిచేవారు. అయితే మా అమ్మ మమ్మల్ని కూటాలకు తీసుకువెళ్లేది. నిజానికి, మేము మిచిగాన్‌లోని నైల్స్‌కు తరలివెళ్లిన కొంతకాలం తర్వాత, ఇండియానాలోని సౌత్‌ బెండ్‌లో జరిగే కూటాలకు హాజరుకావడానికి మేము క్రమంగా రైలులో 16 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించేవాళ్లం.

చివరకు, 1924, జూలై 22న యెహోవాకు నేను చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను. కొంతకాలం తర్వాత మా అమ్మ కల్‌పోర్చర్‌గా సేవచేయడానికి కొన్ని సర్దుబాట్లు చేసుకుంది, అప్పట్లో యెహోవాసాక్షుల పూర్తికాల పరిచారకులను అలా పిలిచేవారు. ఆమె, అలాగే ఇతర కల్‌పోర్చర్లు ఉంచిన చక్కని మాదిరి ఆ సేవ చేయాలనే కోరిక నాలో కలిగించింది.

సహచరుణ్ణి కనుగొనడం

ఇండియానాలోని ఇండియానాపోలిస్‌లో, 1925లో జరిగిన పెద్ద సమావేశానికి హాజరవుతున్నప్పుడు చికాగోకు చెందిన జేమ్స్‌ స్టైగర్స్‌ నాకు పరిచయమయ్యాడు. ఆయన ఉత్సాహంగల యెహోవా సేవకుడు అనే అభిప్రాయం నాకు వెంటనే కలిగింది. నేను చికాగోకు 160 కిలోమీటర్ల దూరంలో నివసించేదాన్ని కాబట్టి, మేము ఒకరినొకరం కలుసుకోవడం కష్టమైంది. అప్పట్లో ఆ పెద్ద నగరంలో కేవలం ఒక సంఘమే ఉండేది, రెండవ అంతస్థులోని అద్దెకు తీసుకున్న గదిలో కూటాలు నిర్వహించబడేవి. జేమ్స్‌ నన్ను ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి తరచూ ఉత్తరాలు రాసేవాడు. మా వివాహం 1926 డిసెంబరులో జరిగింది, దాదాపు ఒక ఏడాది తర్వాత మా మొదటి అబ్బాయి ఎడ్డీ పుట్టాడు.

కొంతకాలం తర్వాత జేమ్స్‌ నేను కలిసి పయినీరు సేవ ప్రారంభించాం. మేము మిచిగాన్‌, లౌసీయానా, మిస్సిసిప్పీ, సౌత్‌ డకోటా, అయోవా, నెబ్రాస్కా, కాలిఫోర్నియా, ఇల్లినియస్‌ అనే ఎనిమిది రాష్ట్రాల్లో సేవచేశాం. ఆ సంవత్సరాలు మా జీవితంలో అత్యంత మధురమైన అనుభూతులను మిగిల్చాయి. జేమ్స్‌ అస్వస్థతకు గురైనప్పుడే మా కుటుంబానికి ఆ సంతోషకరమైన రోజులు కొంతకాలం దూరమయ్యాయి.

జేమ్స్‌ అనారోగ్యంవల్ల మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అందువల్ల మా అత్తయ్యతో ఉండడానికి 1936లో చికాగోకు తిరిగివెళ్లాల్సివచ్చింది, ఆమె కూడా ఒక సాక్షి. జేమ్స్‌ ఆరోగ్యం విషమించినప్పుడు మా రెండవ బాబు నా కడుపులో ఉన్నాడు, ఆ సమయంలో రోజుకు ఒక డాలర్‌ జీతం కోసం హోటల్‌లో పనిచేశాను. మా ప్రియమైన అత్తయ్య, మాకు తిండికి కొదువ లేకుండా చూసింది, దానికి ఆమె మా దగ్గర ఒక పైసా కూడా తీసుకునేది కాదు. ఆమె మమ్మల్ని చాలా బాగా చూసుకుంది.

జేమ్స్‌ దాదాపు రెండేళ్లు మెదడువాపు వ్యాధితో బాధపడి మరణించాడు. అది 1938 జూలై నెల. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు వాహనాన్ని నడపలేకపోయేవాడు, ఇంటింటి పరిచర్యలో పాల్గొనలేకపోయేవాడు, అయితే ఇతరులకు ప్రకటించడానికి తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. మా కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి నేను పూర్తికాల పరిచర్యను మానేశాను. నాకు ఎన్నో ఉద్యోగాలు దొరికాయి, కానీ అవన్నీ ఎంతోకాలం నిలవలేదు.

మా అబ్బాయి బాబీ 1938, జూలై 30న పుట్టాడు, వాడు వాళ్ళ నాన్న చనిపోయిన ఎనిమిది రోజులకు పుట్టాడు. అయితే మా అత్తయ్య నన్ను కౌంటీ ఆసుపత్రికి (ప్రభుత్వ ఆసుపత్రి లాంటిది) వెళ్లనివ్వలేదు. బదులుగా మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి, నేను తన డాక్టర్‌ సంరక్షణ పొందేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాక, బిల్లులన్నీ తనే చెల్లించింది, ఆమె కనబరచిన క్రైస్తవ ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞురాలిని.

పూర్తికాల పరిచర్యను తిరిగి చేపట్టడం

బాబీకి రెండేళ్లు పైబడేంతవరకు మేము మా అత్తయ్యతో ఉన్నాం, అప్పటికి ఎడ్డీకి 12 ఏళ్లు. నేను నా క్రొత్త పరిస్థితులతో సర్దుకుపోవాల్సివచ్చినా, యెహోవాకు పూర్తికాల సేవచేయాలనే కోరిక నాలో ఇంకా బలంగానే ఉంది. 1940లో, మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో జరిగిన సమావేశంలో నేను ఒక పయినీరు జంటను కలుసుకున్నాను, సౌత్‌ కరోలినాకు వచ్చి పయినీరు సేవ చేయమని వారు నన్ను ప్రోత్సహించారు. నేను 150 డాలర్లకు 1935 మోడల్‌ పాన్టియక్‌ కారును కొని అక్కడికి తరలివెళ్లేందుకు సిద్ధపడ్డాను. 1941లో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది, అప్పుడు నేను మా ఇద్దరు అబ్బాయిలను తీసుకొని అమెరికాలోని దక్షిణభాగానికి వెళ్లి, అక్కడ పూర్తికాల పరిచర్యను తిరిగి చేపట్టాను.

నేను సౌత్‌ కరోలినాకు తరలివెళ్లినప్పుడు మేము మొదట కామ్‌డెన్‌ నగరానికి వెళ్లాం, అనంతరం లిటిల్‌ రివర్‌ పట్టణానికి, ఆ తర్వాత కాన్వే పట్టణానికి వెళ్లాం. కాన్వేలో నేను ఒక చిన్న ట్రేయిలర్‌ కొన్నాను. దయగల ఒక పెట్రోల్‌ బంకు యజమాని ఆ ట్రేయిలర్‌ను తన పెట్రోలు బంకు దగ్గర పార్కింగ్‌ చేసుకోవడానికి, తన గ్యాస్‌ కనెక్షన్‌ను, కరెంటును వాడుకోవడానికి, చివరకు టాయ్‌లెట్‌ను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతినిచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పెట్రోల్‌ పరిమితంగా దొరికేది కాబట్టి నేను దానిని కొనలేకపోయాను. ఆ కారణంగా నేనొక పాత సైకిల్‌ కొనుక్కున్నాను. ఆ తర్వాత 1943లో మా దగ్గరున్న డబ్బంతా ఖర్చైపోయి ఇక పయినీరు సేవ చేయడం వీలుకాదని అనిపించినప్పుడు, ప్రత్యేక పయినీరుగా సేవచేసే నియామకాన్ని అందుకున్నాను, అలా మా ఖర్చులను భరించేందుకు ప్రతీనెల నాకు అలవెన్సు లభించేది. ఈ సంవత్సరాలన్నింటిలో, యెహోవా నాకెంతో సహాయం చేశాడు!

ఆ కాలంలో కాన్వే పట్టణంలో సాక్షులెవరూ లేరు, తోడులేకుండా పరిచర్యకు వెళ్లడం పిల్లలకూ, నాకూ కష్టమైంది. అందుకే, నేను ప్రత్యేక పయినీరు సహవాసిని కోరుతూ ఒక ఉత్తరం రాశాను, 1944లో ఈదెథ్‌ వాకర్‌ అనే చక్కని పయినీరు సహవాసి నాకు లభించింది. మేము 16 ఏళ్లు ఎన్నో ప్రాంతాల్లో కలిసి సేవచేశాం. ఆ తర్వాత, విచారకరంగా, ఆరోగ్య సమస్య కారణంగా ఆమె ఒహాయోకు తిరిగివెళ్లాల్సివచ్చింది.

మరపురాని ఆశీర్వాదాలు

ఆ సంవత్సరాలు నాకు ఎన్నో మధురస్మృతులను మిగిల్చాయి. క్వానేలో నివసించిన 13 ఏళ్ల ఆల్బర్తాను నేనెప్పటికీ మరచిపోలేను, ఆమె వికలాంగురాలైన తన అమ్మమ్మను, ఇద్దరు తమ్ముళ్ళను చూసుకునేది. నేను ఆమెకు బోధించిన బైబిలు సత్యాలను ఆమె ఎంతో ప్రేమించి, వాటి గురించి ఇతరులకు చెప్పాలనుకునేది. ఆమె కూడా పయినీరు సేవపట్ల ప్రగాఢమైన గౌరవాన్ని పెంచుకొని 1950లో ఉన్నత పాఠశాల పూర్తి చేసుకున్న తర్వాత పయినీరు సేవ ప్రారంభించింది. 57 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, ఆమె ఇప్పటికీ పూర్తికాల పరిచారకురాలిగా సేవచేస్తోంది!

1951లో, ఈదెథ్‌, నేను సౌత్‌ కరోలినాలోని రాక్‌ హిల్‌లో కొంతకాలం సేవచేసే నియామకం పొందాం, అక్కడ చాలా తక్కువమంది సాక్షులు ఉండేవారు. ఆ తర్వాత, జార్జియాలోని ఎల్బార్టన్‌లో మూడేళ్లు సేవచేశాం. అనంతరం సౌత్‌ కరోలినాకు తిరిగివచ్చి, అక్కడ 1954 నుండి 1962 వరకు ఉన్నాను. వోల్హాలా పట్టణంలో బధిరురాలైన నెట్టీ అనే ఒక వృద్ధురాలిని కలిశాను, ఆమె మారుమూల ప్రాంతంలో ఒంటరిగా నివసించేది. బైబిలు అధ్యయనం చేయడానికి ఆమె ప్రచురణ నుండి ఒక పేరా చదివేది, ఆ తర్వాత నేను పేజీ క్రిందిభాగంలోవున్న ఆ పేరా ప్రశ్నను ఆమెకు చూపించేదాన్ని, అప్పుడు ఆమె పేరాలోని జవాబును చూపించేది.

ఆమెకు ఏ విషయమైనా అర్థంకాకపోతే, తన ప్రశ్నను కాగితంమీద రాసేది, నేను దాని క్రింద జవాబు రాసేదాన్ని. కొంతకాలానికి బైబిలు సత్యంపట్ల ఆమె కృతజ్ఞత ఎంతగా పెరిగిందంటే ఆమె సంఘ కూటాలకు హాజరవడమేకాక ఇంటింటి పరిచర్యలో కూడా పాల్గొనడం మొదలుపెట్టింది. ఆమె ఒంటరిగా ప్రకటించేది, అయితే నేనెప్పుడూ ఆమె నుండి మరీ దూరంగా వెళ్ళిపోయేదాన్ని కాదు, నేను సాధారణంగా ఎదురు వీధిలోనే సేవచేస్తూ ఆమెకు కొంత సహాయం అవసరమైతే చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉండేదాన్ని.

నేను వల్హాలాలో ఉన్నప్పుడు నా పాతకారు పనిచేయడం మానేసింది. 100 డాలర్లకు కారు కొనుక్కొనే అవకాశం నాకు దొరికింది కానీ నా దగ్గర డబ్బులేదు. వ్యాపారం చేస్తున్న ఒక సాక్షిని నేను కలుసుకున్నాను, ఆయన నాకు 100 డాలర్లు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తర్వాత, నాకు మా చెల్లి నుండి ఊహించని ఒక ఉత్తరం వచ్చింది, మా నాన్న మరణించిన సమయానికి ఆయన ఖాతాలో కొంత డబ్బు ఉన్నట్లు ఈ మధ్యనే మా తోబుట్టువులు కనుగొన్నారన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. ఆ డబ్బును ఏమి చేయాలో చర్చించి, వారందరూ దానిని నాకు పంపించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. మా నాన్న ఖాతాలో ఉన్న డబ్బు, 100 డాలర్లు!

మా అబ్బాయిలతో కలిసి పయినీరు సేవ చేయడం

ఎడ్డీ, బాబీలు చిన్నప్పుడు ఇంటింటి పరిచర్యకు ఎప్పుడూ నాతోపాటు వచ్చేవారు. ఆ కాలపు ప్రజలు, మాదకద్రవ్యాల సమస్యలను ఎదుర్కోలేదు, అనైతిక ప్రభావాలు ఇప్పుడున్నంత బలంగా ఉండేవి కావు. మా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకొని దానిని ప్రకటనాపనిమీద కేంద్రీకరించడం మూలంగా, యెహోవాను సేవించేలా పిల్లలను పెంచడంలో నేటి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నాకు ఎదురుకాలేదు.

ఎడ్డీ ఎనిమిదవ తరగతి పూర్తయ్యేంతవరకు కామ్‌డెన్‌లోని పాఠశాలకు వెళ్లాడు, దాని తర్వాత నాతోపాటు పయినీరు సేవ చేయాలనుకున్నాడు. మేమిద్దరం కొన్ని ఏళ్లవరకు కలిసి పయినీరు సేవచేసి దానిని ఆస్వాదించాం. ఆ తర్వాత మా అబ్బాయి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేయాలనే కోరిక పెంపొందించుకున్నాడు, ఆయన అక్కడ 1947 నుండి 1957 వరకు సేవచేశాడు. 1958లో, నా మునుపటి బైబిలు విద్యార్థిని అయిన ఆల్బర్తాను వివాహం చేసుకున్నాడు, అలా వారు కలిసి పయినీరు సేవ చేశారు. 2004లో మేము ముగ్గురం పయినీరు సేవ పాఠశాలకు కలిసి హాజరుకావడం ఎంత ఆనందాన్నిచ్చిందో!

చాలా సంవత్సరాల క్రితం, ఒకరోజు చిన్నారి బాబీ, నేను క్రమంగా నిర్వహిస్తున్న బైబిలు అధ్యయనాలకు కారులో వెళ్లేందుకు సరిపోయేంత పెట్రోల్‌ దొరకడానికి నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించడాన్ని వినడం నాకు గుర్తుంది. బాబీ తన జీవితమంతా పరిచర్యపట్ల ప్రేమను కనబరిచాడు, అనేక సంవత్సరాలపాటు పయినీరు పరిచర్యను ఆనందించాడు. విచారకరంగా బాబీ తన కుటుంబంలో కూడా విషాదాన్ని చవిచూశాడు. ఆయన పెళ్లి చేసుకొని కేవలం 22 నెలలు గడచిన తర్వాత 1970లో తన భార్యను కోల్పోయాడు, ఆమె ప్రసవ సమయంలో మరణించింది, అప్పుడే పుట్టిన కవల పిల్లలు కూడా ఆమెతోపాటు మరణించారు. బాబీ, నేనూ ఎప్పుడూ కలిసే ఉన్నాం, మేము ఎంతో సన్నిహిత సంబంధాన్ని ఆనందించాం.

ఇప్పటికీ పయినీరు సేవ చేస్తున్నాను!

1962లో నేను ప్రస్తుతం ఉంటున్న నార్త్‌ కరోలినాలోని లంబర్టన్‌ సంఘానికి నియామకం పొందాను. నేను గత 45 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. నేను 80వ పడిలోకి వచ్చేంతవరకు కారు నడిపించేదాన్ని. ఇప్పుడు మా ఇంటికి దగ్గర్లో నివసిస్తున్న ఒక సాక్షి కుటుంబం నన్ను సంఘ కూటాలకు, ప్రకటనా పనికి తీసుకువెళ్తోంది.

నాకు వాకర్‌, చక్రాల కుర్చీ ఉన్నాయి, నేను ఎలాంటి సహాయం లేకుండా నడవగలను కాబట్టి ఆ రెండింటినీ ఉపయోగించడం లేదు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞురాలిని, ఈ మధ్యనే నా కళ్లు నన్ను కొంత ఇబ్బందిపెడుతున్నాయి. నేను ఎంతో అనారోగ్యంగా ఉంటే తప్ప ఒక్క క్రైస్తవ కూటానికి కూడా ఎన్నడూ వెళ్ళకుండా ఉండను. నేను ఇప్పటికీ అనారోగ్య క్రమ పయినీరుగా సేవచేస్తున్నాను.

డెబ్భైకన్నా ఎక్కువ సంవత్సరాలుగా పయినీరు పరిచర్యలో ఆనందంగా గడిపిన తర్వాత, నా జీవితమంతా యెహోవా నాకు సహాయం చేశాడని హృదయపూర్వకంగా చెప్పగలను. * నేను ఎన్నడూ చాలా తెలివైన వ్యక్తిగా లేదా చాలా వేగంగా పనిచేసే వ్యక్తిగా లేను, అయితే నేను ఏమి చేయగలనో, ఏమి చేయలేనో యెహోవాకు తెలుసు. ఆయనకు సేవచేయడానికి నేను ప్రయత్నిస్తున్నానని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన నన్ను ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆయనకు నేనెంతో కృతజ్ఞురాలిని.

మనం అన్ని విషయాల్లో యెహోవాకు రుణపడివున్నాం కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఆయన సేవచేయడం ప్రాముఖ్యమని నేను భావిస్తున్నాను. నాకు చేతనైనంతవరకు, పయినీరు సేవ తప్ప వేరే పనేది చేయడాన్ని నేను ఎంచుకోను. అది ఎంతటి అద్భుతమైన ఆధిక్యతో! యెహోవా నన్ను నిరంతరం ఉపయోగించుకోవాలన్నదే నా ప్రార్థన.

[అధస్సూచి]

^ పేరా 30 సహోదరి స్టైగర్స్‌ నూరు వసంతాలు పూర్తిచేసుకోవడానికి ఇంకా మూడు నెలలే మిగిలివుండగా తాను భూమ్మీద యెహోవాకు చేస్తున్న సేవను 2007 ఏప్రిల్‌ 20న ముగించింది. ఆమె అనేక సంవత్సరాలు చేసిన నమ్మకమైన సేవనుబట్టి మనం ప్రోత్సహించబడుతున్నాం, ఆమె పరలోక ప్రతిఫలాన్ని పొందడాన్నిబట్టి ఆనందిస్తున్నాం.

[13వ పేజీలోని చిత్రం]

నేనూ మావారు కల్‌పోర్చర్‌ పనిలో ఈ వాహనాన్ని ఉపయోగించాం

[14వ పేజీలోని చిత్రం]

1941లో మా అబ్బాయిలతో

[15వ పేజీలోని చిత్రం]

ఇటీవల ఎడ్డీ, బాబీలతో