కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్యాయాన్ని మీరు సహించగలరు!

అన్యాయాన్ని మీరు సహించగలరు!

అన్యాయాన్ని మీరు సహించగలరు!

తమ జీవితంలో ఏదో ఒక రకమైన అన్యాయాన్ని ఎదుర్కోనివారు ఎవరున్నారు? కొన్ని అన్యాయాలు కేవలం అనుకున్నవీ లేదా ఊహించుకున్నవీ కావచ్చు గానీ మరికొన్ని అన్యాయాలు ఎంతో వాస్తవమైనవి.

మనకు అన్యాయం జరిగినప్పుడల్లా మనం కొంత మనోవేదనకు గురౌతాం, ఆధ్యాత్మిక హానికి కూడా లోనుకావచ్చు. పరిస్థితిని సరిదిద్దాలని మనమెంతో కోరుకోవచ్చు. ఎందుకు? మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు “న్యాయవంతుడు” కాబట్టి ఆయన మానవులను న్యాయాన్యాయాల గురించిన బలమైన విచక్షణతో సృష్టించాడు. (ద్వితీయోపదేశకాండము 32:4; ఆదికాండము 1:26) అయితే, న్యాయం జరగడంలేదని స్పష్టంగా గ్రహించే పరిస్థితులు మనకు ఎదురుకావచ్చు. జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఒకసారి ఇలా చెప్పాడు: “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.” (ప్రసంగి 4:1) అలాంటప్పుడు, మనం అన్యాయాన్ని ఎలా సహించగలం?

నిజానికి అన్యాయం అంటే ఏమిటి?

న్యాయ ప్రమాణాలను ఉల్లంఘించే పరిస్థితి లేదా అలవాటే అన్యాయం. మానవులకు న్యాయ ప్రమాణం ఏమిటి? స్పష్టంగా, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే విషయంలో ప్రమాణాలను ఏర్పర్చే హక్కు నీతిమంతుడైన, మార్పులేని మన సృష్టికర్తకు ఉంది. ఆయన దృక్కోణంలో “జీవాధారములగు కట్టడలను” అనుసరించడంలో అన్యాయం లేదా “పాపము జరిగింపక” పోవడం ఇమిడివుంది. (యెహెజ్కేలు 33:15) అందుకే, యెహోవా మొదటి మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయనలో మనస్సాక్షి అంటే మంచిచెడులను వివేచించేందుకు సహాయం చేయగల అంతరాత్మను ఉంచాడు. (రోమీయులు 2:14, 15) అంతేకాక, యెహోవా తన వాక్యమైన బైబిల్లో ఏది న్యాయమో, ఏది అన్యాయమో వివరించాడు.

మనకు అన్యాయం జరిగిందని మనకనిపిస్తే అప్పుడేమిటి? అన్యాయం నిజంగా జరిగిందో లేదో గ్రహించడానికి మనం ఆ విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించడం మంచిది. ఉదాహరణకు, హీబ్రూ ప్రవక్త యోనా ఎదుర్కొన్న పరిస్థితినే తీసుకోండి. నీనెవె పట్టణస్థులు ఎదుర్కోనున్న విపత్తు గురించి వారికి చెప్పమని యెహోవా ఆయనకు ఆజ్ఞాపించాడు. మొదట్లో, యోనా తన నియామకాన్ని నిర్వర్తించకుండా పారిపోయాడు. అయితే చివరకు, ఆయన నీనెవె పట్టణానికి వెళ్లి రాబోయే నాశనం గురించి ఆ పట్టణవాసులను హెచ్చరించాడు. వారు అనుకూలంగా ప్రతిస్పందించినప్పుడు యెహోవా ఆ పట్టణాన్ని, దాని నివాసులను కాపాడాలని అనుకున్నాడు. యోనాకు ఎలా అనిపించింది? “యోనా దీనిచూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొన్నాడు.” (యోనా 4:1) యెహోవా చేసింది ఘోరమైన అన్యాయమని ఆయన అనుకున్నాడు.

హృదయాలను చదవగల, “నీతిని, న్యాయమును ప్రేమించే” యెహోవా తప్పుచేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. (కీర్తన 33:5) యెహోవా నిర్ణయించిన విధానం పరిపూర్ణ న్యాయానికి అనుగుణంగా ఉందని మాత్రమే యోనా తెలుసుకోవాలి. మనకు అన్యాయం జరిగిందని మనకు అనిపించినప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, “ఈ విషయాన్ని యెహోవా భిన్నంగా దృష్టిస్తాడా?”

అన్యాయానికి గురికావడం

అన్యాయానికి గురైన వారి గురించిన అనేక ఉదాహరణలను బైబిలు వివరిస్తోంది. తమకెదురైన క్లిష్టసమస్యలను వారు ఎలా ఎదుర్కొన్నారో పరిశీలించడం ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. అసూయపరులైన సహోదరుల ద్వారా ఐగుప్తులో దాసత్వంలోకి అమ్మబడిన యోసేపును పరిశీలించండి. ఐగుప్తులో యోసేపు యజమాని భార్య ఆయనను వలలో వేసుకునేందుకు ప్రయత్నించింది, ఆమె ప్రతిపాదనను ఆయన తిరస్కరించినప్పుడు యోసేపు లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆయనమీద అబద్ధారోపణలు చేసింది. ఆ కారణంగా, యోసేపు చెరసాలకు వెళ్లాల్సివచ్చింది. అయినా, ఆయన విశ్వాసం ఆయనకు వేయబడిన సంకెళ్లకన్నా బలంగా ఉంది. అన్యాయం తన ఆధ్యాత్మికతను లేదా యెహోవామీద తనకున్న విశ్వాసాన్ని బలహీనపర్చడానికి ఆయన అనుమతించలేదు.—ఆదికాండము 37:18-28; 39:4-20; కీర్తన 105:17-19.

అన్యాయాన్ని ఎదుర్కొన్న మరో వ్యక్తి నాబోతు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య యెజెబెలు చేసిన ఘోరమైన అన్యాయానికి ఆయన బలయ్యాడు. ఆ రాజు తనభవనం ప్రక్కనున్న నాబోతు పిత్రార్జిత స్థలాన్ని లేదా స్వాస్థ్యాన్ని ఆశించాడు. అయితే ఇశ్రాయేలీయుడు తన స్వాస్థ్యాన్ని శాశ్వతంగా వదులుకోకూడదు కాబట్టి రాజు ఆ స్థలాన్ని కొంటానని చేసిన ప్రతిపాదనను ఆయన త్రోసిపుచ్చాడు. (లేవీయకాండము 25:23) అప్పుడు ఆహాబు దుష్ట భార్య అబద్ధ సాక్షులను ఏర్పరచుకుంది, నాబోతు దేవుణ్ణి, రాజును దూషించాడని వాళ్ళు ఆరోపించారు. అందువల్ల, నాబోతు, ఆయన కుమారులు చంపబడ్డారు. ప్రజలు తనను చంపడానికి రాళ్లు ఏరుతున్నప్పుడు నాబోతుకు ఎలా అనిపించివుండవచ్చో ఊహించండి!—1 రాజులు 21:1-14; 2 రాజులు 9:26.

క్రీస్తుయేసుకు జరిగిన అన్యాయాలతో పోలిస్తే పైన పేర్కొనబడిన వృత్తాంతాలు వెలవెలపోతాయి. అబద్ధం, చట్టవిరుద్ధమైన న్యాయవిచారణ ఆధారంగా ఆయనకు మరణశిక్ష విధించబడింది. తాను సత్యమని గ్రహించినదానిని సమర్థించే నైతిక బలం న్యాయపీఠంమీద కూర్చున్న రోమా అధిపతికి లేకపోయింది. (యోహాను 18:38-40) అవును, ఇప్పటివరకు ఎవరికీ జరగనంత అన్యాయాన్ని సాతాను క్రీస్తుయేసుకు చేశాడు!

ఈ ఉదాహరణలు, అన్యాయం విషయంలో యెహోవా ఉదాసీనంగా వ్యవహరిస్తాడని చూపిస్తున్నాయా? లేదు! యెహోవా వాటిని కేవలం మానవ దృక్పథంతోనే చూడలేదు. (యెషయా 55:8, 9) యోసేపు దాసత్వానికి అమ్మివేయబడ్డాడు కాబట్టే ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. తన కుటుంబంమీద ప్రభావం చూపించిన గొప్ప క్షామం విరుచుకుపడడానికి ముందే ఆయన ఐగుప్తు ఆహార సరఫరా అధికారి అయ్యాడు. ఒకసారి ఆలోచించండి, యెహోవా అన్యాయాన్ని అనుమతించివుండకపోతే యోసేపు చెరసాలలో ఉండేవాడు కాదు. తోటి ఖైదీలిద్దరికి వచ్చిన కలల భావాలను ఆయన అక్కడే వివరించాడు, వారిలో ఒకరు యోసేపు గురించి ఫరోకు చెప్పారు, అది ఆయన ఆహార సరఫరా అధికారి కావడానికి దారితీసింది.—ఆదికాండము 40:1; 41:9-14; 45:4-8.

నాబోతు విషయమేమిటి? ఇక్కడ కూడా, యెహోవా దృక్కోణంతో విషయాన్ని చూడడానికి ప్రయత్నించండి. నాబోతు శవం నేలమీద పడివున్నప్పుడు కూడా, మృతులను పునరుత్థానం చేయగల యెహోవా దృష్టిలో ఆయన సజీవంగానే ఉన్నాడు. (1 రాజులు 21:19; లూకా 20:37, 38) యెహోవా తనను పునరుత్థానం చేసేంతవరకు నాబోతు వేచివుండాలి, మరణించినవారు ఏమీ ఎరుగరు కాబట్టి ఆ కాలవ్యవధి క్షణకాలమే ఉన్నట్లు అనిపిస్తుంది. (ప్రసంగి 9:5) అంతేకాక, ఆహాబుకు, ఆయన కుటుంబానికి తీర్పుతీర్చడం ద్వారా యెహోవా నాబోతు విషయంలో పగతీర్చుకున్నాడు.—2 రాజులు 9:21, 24, 26, 35, 36; 10:1-11; యోహాను 5:28, 29.

యేసు గురించి పరిశీలిస్తే, ఆయన మరణించాడు. కానీ దేవుడు ఆయనను పునరుత్థానం చేసి ‘సమస్తమైన ఆధిపత్యముకంటె అధికారముకంటె శక్తికంటె ప్రభుత్వముకంటె హెచ్చైన’ స్థానానికి హెచ్చించాడు. (ఎఫెసీయులు 1:20, 21) సాతాను క్రీస్తుయేసుకు కలుగజేసిన అన్యాయం, యెహోవా తన కుమారుణ్ణి ఆశీర్వదించడాన్ని ఆపలేకపోయింది. చట్టవిరుద్ధంగా తనను బంధించడమనే అన్యాయాన్ని ఆపడం యెహోవా చిత్తమే అయితే, ఆయన అలా వెంటనే చేయగలడని యేసు నమ్మాడు. లేఖనాలను నెరవేర్చడానికి, ఎలాంటి అన్యాయాన్నైనా సరిచేయడానికి యెహోవాకు తగిన సమయం ఉందని కూడా క్రీస్తుకు తెలుసు.

నిజమే, సాతాను, అతని ప్రతినిధులు నీతిమంతులకు అన్యాయం చేశారు, అయితే యెహోవా చివరకు పరిస్థితిని సరిదిద్ది శాశ్వతంగా అన్యాయాన్ని తీసివేశాడు లేదా తీసివేస్తాడు. కాబట్టి అన్యాయం సరిదిద్దబడాలంటే మనం దేవుని కోసం వేచివుండాలి.—ద్వితీయోపదేశకాండము 25:16; రోమీయులు 12:17-19.

యెహోవా అన్యాయాన్ని అనుమతించడానికిగల కారణం

ఒక పరిస్థితిని సరిదిద్దకపోవడానికి యెహోవాకు కారణాలు కూడా ఉండవచ్చు. మన క్రైస్తవ శిక్షణలో భాగంగా, మనం అన్యాయాన్ని ఎదుర్కొనేలా ఆయన అనుమతించవచ్చు. నిజమే, ‘దేవుడు కీడువిషయంలో ఎవనిని శోధించడు.’ (యాకోబు 1:13) అయినా, తన జోక్యం లేకుండా ఒక పరిస్థితి ఉత్పన్నంకావడానికి అనుమతించి, అలాంటి శిక్షణకు ప్రతిస్పందించేవారిని ఆయన బలపర్చగలడు. బైబిలు మనకిలా హామీనిస్తుంది: “కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.”—1 పేతురు 5:10.

అంతేకాక, ఒక అన్యాయాన్ని యెహోవా అనుమతించడం తప్పిదస్థులు పశ్చాత్తాపపడేందుకు సమయాన్నిస్తుంది. యేసు చంపబడిన కేవలం కొద్ది వారాల తర్వాత, పేతురు హెచ్చరికను విన్న కొంతమంది యూదులు “హృదయములో నొచ్చుకొన్నారు.” వారు దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు.—అపొస్తలుల కార్యములు 2:36-42.

నిజమే, అన్యాయం చేసేవారందరూ పశ్చాత్తాపపడరు. కొంతమంది తీవ్రమైన అన్యాయకృత్యాలు చేయడానికి ఇతరుల మూలంగా పురికొల్పబడతారు. అయినా సామెతలు 29:1 ఇలా చెబుతోంది: “ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.” నిజానికి, అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవారి విషయంలో యెహోవా చివరకు జోక్యం చేసుకొని వారు ఉనికిలో లేకుండా చేస్తాడు.—ప్రసంగి 8:11-13.

అన్యాయం నుండి తేరుకోవడానికి ఎంత సమయం పట్టినా, మనం తేరుకోవడానికి మనకెలా సహాయం చేయాలో యెహోవాకు తెలుసని మనం నమ్మవచ్చు. ఈ దుష్టవిధానంలో మనం ఎదుర్కొన్న ఎలాంటి అన్యాయాన్నైనా ఆయన ఖచ్చితంగా సరిచేస్తాడు. అంతేకాక, ఆయన మనకు “నీతి నివసించు” నూతనలోకంలో నిత్యజీవమనే చివరి ప్రతిఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.—2 పేతురు 3:13.

[16, 17వ పేజీలోని చిత్రం]

ఘోరమైన అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు నాబోతుకు ఎలా అనిపించివుండవచ్చు?