కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆసియా మైనరుకు క్రైస్తవత్వం చేరుకోవడం

ఆసియా మైనరుకు క్రైస్తవత్వం చేరుకోవడం

ఆసియా మైనరుకు క్రైస్తవత్వం చేరుకోవడం

ఆసియా మైనరులో (ముఖ్యంగా ఆధునికదిన టర్కీ), సా.శ. మొదటి శతాబ్దంలో అనేక క్రైస్తవ సంఘాలు వర్ధిల్లాయి. క్రైస్తవ సందేశానికి అనేకమంది యూదులు, అన్యులు స్పందించారు. ఒక బైబిలు నిఘంటువు ఇలా చెబుతోంది: “తొలినాళ్లలో క్రైస్తవ ఉద్యమం సిరియా, పాలస్తీనా ప్రాంతాల్లో తప్ప ఆసియా మైనరులో ఎంతో విస్తృతంగా వ్యాప్తి చెందింది.”

వివిధ మూలాల నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఈ ప్రాంతంలో క్రైస్తవత్వం ఎలా వ్యాప్తి చెందిందో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చో చూద్దాం.

ఆసియా మైనరులో తొలి క్రైస్తవులు

ఆసియా మైనరులో క్రైస్తవత్వం వ్యాప్తిచెందడానికి సంబంధించిన ప్రాముఖ్యమైన మొదటి సంఘటన సా.శ. 33 పెంతెకొస్తునాడు జరిగింది, అప్పుడు డయస్పోరా యూదులు (పాలస్తీనా వెలుపల నివసించిన యూదులు), యూదా మతప్రవిష్టులతోకూడిన అనేక భాషలు మాట్లాడే సమూహం యెరూషలేములో సమకూడింది. అక్కడ సమకూడిన వారికి యేసు అపొస్తలులు సువార్త ప్రకటించారు. ఆసియా మైనరులోని అధికభాగాన్ని ఆక్రమించిన కప్పదొకియ, పొంతు, ఆసియా జిల్లా, * ఫ్రుగియ, పంఫూలియ వంటి ప్రాంతాల నుండి వచ్చిన అనేకమంది అక్కడ సమకూడారని చారిత్రక వృత్తాంతం తెలియజేస్తోంది. దాదాపు 3,000 మంది శ్రోతలు క్రైస్తవ సందేశాన్ని అంగీకరించి బాప్తిస్మం పొందారు. వారు తమ ఇళ్లకు తిరిగివెళ్తున్నప్పుడు తమ క్రొత్త విశ్వాసాన్ని తమతోపాటు తీసుకెళ్లారు.—అపొస్తలుల కార్యములు 2:5-11, 41.

అపొస్తలుడైన పౌలు ఆసియా మైనరులో చేసిన మిషనరీ యాత్రల గురించిన బైబిలు వృత్తాంతంలో మనకు మరికొంత సమాచారం దొరుకుతుంది. దాదాపు సా.శ. 47/48లో తాను చేసిన మొదటి మిషనరీ యాత్రలో పౌలు ఓడ ఎక్కి తన సహచరులతోపాటు కుప్ర నుండి ఆసియా మైనరుకు వెళ్ళి, అక్కడ పంఫూలియలోని పెర్గేలో దిగాడు. దేశం లోపలి భాగంలో ఉన్న పిసిదియలోని అంతియొకయ నగరంలో వారు ప్రకటనా పనిలో సాధించిన ఫలితాలను చూసి యూదులు అసూయపడి వారిని వ్యతిరేకించారు. పౌలు ఆగ్నేయ దిశలో ఈకొనియకు వెళ్లినప్పుడు, ఇతర యూదులు మిషనరీలతో కఠినంగా వ్యవహరించడానికి పన్నాగం పన్నారు. దగ్గర్లోని లుస్త్రలో ఉన్న భావోద్రేకపరులైన స్థానికులు, మొదట్లో పౌలు దేవుడని చాటిచెప్పారు. అయితే వ్యతిరేకిస్తున్న యూదులు అంతియొకయ నుండి, ఈకొనియ నుండి వచ్చిన తర్వాత, అక్కడి జనసమూహం పౌలుమీద రాళ్లు రువ్వి, చనిపోయాడనుకుని ఆయనను వదిలేశారు! ఆ అనుభవం ఎదురైన తర్వాత పౌలు బర్నబా, రోమా పాలిత ప్రాంతమైన గలతీయలోని దెర్బేకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు, ఆ ప్రాంత ప్రజలు లుకయోనియ భాషలో మాట్లాడేవారు. అక్కడ సంఘాలు వ్యవస్థీకరించబడ్డాయి, పెద్దలు నియమించబడ్డారు. అలా సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, దాదాపు 15 ఏళ్ల కాలంలో క్రైస్తవత్వం ఆసియా మైనరులో చక్కగా స్థాపించబడిందని మీరు గ్రహించవచ్చు.—అపొస్తలుల కార్యములు 13:13-14:26.

దాదాపు సా.శ. 49 నుండి 52 మధ్యకాలంలో తాను చేసిన రెండవ మిషనరీ యాత్రలో పౌలు తన సహచరులతోపాటు మొదట భూమార్గంలో లుస్త్రకు వెళ్లాడు, ఆయన కిలికియలోని తన స్వస్థలమైన తార్సు గుండా అక్కడికి వెళ్లి ఉండవచ్చు. లుస్త్రలోని సహోదరులను మళ్లీ కలుసుకొని ఉత్తర దిశగా వెళ్తున్నప్పుడు పౌలు బితూనియ, ఆసియా ప్రాంతాల్లో ‘వాక్యం చెప్పడానికి’ ప్రయత్నించాడు. అయితే, అలా చేయడానికి పరిశుద్ధాత్మ ఆయనను అనుమతించలేదు. ఆ ప్రాంతాల్లో సువార్త తర్వాత ప్రకటించబడుతుంది. బదులుగా, దేవుడు పౌలును ఆసియా మైనరులోని వాయవ్య భాగాల గుండా తీరప్రాంతమైన త్రోయకు నడిపించాడు. ఆ తర్వాత యూరప్‌లో సువార్త ప్రకటించమని పౌలు ఒక దర్శనంలో నిర్దేశించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 16:1-12; 22:3.

దాదాపు సా.శ. 52 నుండి 56లో మధ్యకాలంలో తాను చేసిన మూడవ మిషనరీ యాత్రలో పౌలు మళ్లీ ఆసియా మైనరు గుండా ప్రయాణించి ఆసియాలోని ముఖ్య ఓడరేవు నగరమైన ఎఫెసుకు చేరుకున్నాడు. ఆయన అంతకుముందు తన రెండవ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆ నగరంలో దిగాడు. అక్కడ కొంతమంది క్రైస్తవులు చురుకుగా సేవచేస్తున్నారు, పౌలు, ఆయన సహచరులు దాదాపు మూడు సంవత్సరాలు వారితో కలిసి సేవచేశారు. ఆ సమయంలో వారు ఎన్నో సమస్యలను, అపాయాలను ఎదుర్కొన్నారు, లాభసాటిగావున్న మతసంబంధ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఎఫెసులోని కంసాలులు సృష్టించిన అలజడి వాటిలో ఒకటి.—అపొస్తలుల కార్యములు 18:19-26; 19:1, 8-41; 20:31.

ఎఫెసును కేంద్రంగా చేసుకొని వారు చేసిన మిషనరీ సేవ ఎన్నో చక్కని ఫలితాలనిచ్చిందని స్పష్టమవుతోంది. అపొస్తలుల కార్యములు 19:10 ఇలా చెబుతోంది: “యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.”

ఆసియా మైనరులో ఏర్పడిన పరిణామాలు

పౌలు ఎఫెసులోవున్న చివరి రోజుల్లో కొరింథీయులకు ఇలా రాశాడు: “ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు.” (1 కొరింథీయులు 16:19) పౌలు మనసులో ఏ సంఘాలు ఉన్నాయి? ఆయన మనసులో కొలొస్సయి, లవొదికయ, హియెరాపొలిలోవున్న సంఘాలు ఉండవచ్చు. (కొలొస్సయులు 4:12-16) పాల్‌—హిజ్‌ స్టోరి అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఎఫెసువారు మిషనరీ సేవచేసేందుకు చొరవ చూపించినందువల్లే స్ముర్న, పెర్గము, సార్దీస్‌, ఫిలదెల్ఫియాల్లో సమాజాలు ఏర్పడ్డాయని చెప్పడం సహేతుకంగా అనిపిస్తుంది . . . ఆ పట్టణాలన్నీ ఎఫెసుకు 120 మైళ్ల (192 కిలోమీటర్ల) వ్యాసార్థంలోనే ఉంటూ చక్కని రోడ్లతో అనుసంధానం చేయబడ్డాయి.”

కాబట్టి, సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత దాదాపు 20 ఏళ్లలో ఆసియా మైనరుకు దక్షిణాన, పశ్చిమాన అనేక క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంలోని ఇతర భాగాల విషయమేమిటి?

పేతురు రాసిన పత్రికలను అందుకున్నవారు

అపొస్తలుడైన పేతురు కొన్నేళ్ల తర్వాత అంటే దాదాపు సా.శ. 62 నుండి 64 మధ్యకాలంలో తన మొదటి ప్రేరేపిత పత్రికను రాశాడు. ఆయన దానిని పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియలలోని క్రైస్తవులను సంబోధించి రాశాడు. ఆ ప్రాంతాల పెద్దలు ‘మందను కాయమని’ ప్రోత్సహించబడ్డారు కాబట్టి అక్కడ క్రైస్తవ సంఘాలు ఉండవచ్చని పేతురు రాసిన పత్రిక సూచిస్తోంది. ఈ సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి?—1 పేతురు 1:1; 5:1-3.

పౌలు మునుపు ప్రకటించిన ఆసియా, గలతీయ వంటి కొన్ని ప్రాంతాలవారు పేతురు రాసిన పత్రికలను అందుకున్నారు. అయితే, పౌలు కప్పదొకియలో గానీ, బితూనియలో గానీ సువార్త ప్రకటించలేదు. ఆ ప్రాంతాల్లో క్రైస్తవత్వం ఎలా వ్యాప్తి చెందిందో బైబిలు మనకు తెలియజేయడంలేదు, అయితే సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో ఉండి, ఆ తర్వాత తమ ఇళ్లకు తిరిగొచ్చిన యూదుల ద్వారా లేదా యూదా మత ప్రవిష్టుల ద్వారా అది వ్యాప్తి చెందివుండవచ్చు. ఏదేమైనా, పెంతెకొస్తు పండుగ జరిగిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, పేతురు తన పత్రికలను రాసే సమయానికి, ఒక విద్వాంసుడు వర్ణిస్తున్నట్లుగా సంఘాలు “ఆసియా మైనరు అంతటా వ్యాప్తి” చెందినట్లు స్పష్టమవుతోంది.

ప్రకటనలోని ఏడు సంఘాలు

యూదులు రోమన్లమీద చేసిన తిరుగుబాటు, సా.శ. 70లో యెరూషలేము నాశనం చేయబడడానికి దారితీసింది. కొందరు యూదా క్రైస్తవులు ఆసియా మైనరులో క్రమంగా స్థిరపడివుండవచ్చు. *

సా.శ. మొదటి శతాబ్దాంతానికి, యేసుక్రీస్తు అపొస్తలుడైన యోహాను ద్వారా ఆసియా మైనరులోని ఏడు సంఘాలకు పత్రికలను అందించాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలోని సంఘాలకు రాయబడిన ఈ పత్రికలు, ఆసియా మైనరులోని ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న క్రైస్తవులు ఆ కాలంలో లైంగిక దుర్నీతి, తెగవాదం, మతభ్రష్టత్వం వంటి వివిధ ప్రమాదాలను ఎదుర్కొన్నారని తెలియజేస్తోంది.—ప్రకటన 1:9, 10; 2:14, 15, 20.

వినయంతో చేసిన పూర్ణాత్మ సేవ

మొదటి శతాబ్దపు క్రైస్తవత్వం వ్యాపించడానికి అపొస్తలుల కార్యములో వివరించబడిన సంఘటనలతోపాటు అనేక ఇతర సంఘటనలు కూడా దోహదపడ్డాయనేది స్పష్టం. పేరుపొందిన అపొస్తలులైన పేతురు, పౌలు చేసిన సేవల గురించి అపొస్తలుల కార్యములు వివరిస్తోంది, అయితే మనకు తెలియని ఎంతోమంది ఇతరులు, వేరే ప్రాంతాల్లో ప్రకటనా పనిచేశారు. ఆసియా మైనరులో ఏర్పడిన పరిణామాలు, తొలి క్రైస్తవులు యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞను మనసులో ఉంచుకున్నారని ధృవీకరిస్తున్నాయి: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.”—మత్తయి 28:19, 20.

అదే విధంగా నేడు, కొద్దిమంది యెహోవాసాక్షుల విశ్వాస క్రియలు మాత్రమే అంతర్జాతీయ సహోదరత్వానికి తెలుసు. ఆసియా మైనరుకు చెందిన అనేకమంది మొదటి శతాబ్దపు నమ్మకస్థులైన సువార్తికుల్లాగే నేడు సువార్తను ప్రకటించే చాలామంది గురించి మనకు అంతగా తెలియదు. అయినా, వారు కూడా తీరికలేనంతగా పనిచేస్తూ సంతృప్తినిచ్చే జీవితాన్ని గడుపుతున్నారు, ఇతరులను రక్షించేందుకు తాము విధేయతాపూర్వకంగా తమ సేవలను అందిస్తున్నామని తెలుసుకొని వారెంతో సంతృప్తిని పొందుతున్నారు.—1 తిమోతి 2:3-6.

[అధస్సూచీలు]

^ పేరా 5 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, ఈ ఆర్టికల్‌లో “ఆసియా” అనే పదం ఆసియా మైనరు పశ్చిమ భాగంలోవున్న రోమా పాలిత ప్రాంతాన్ని సూచిస్తుంది గానీ ఆసియా ఖండాన్ని కాదు.

^ పేరా 17 సా.శ. 66కు కొంతకాలం ముందు “హత్యా ప్రయత్నాలవల్ల తరచూ అపాయాన్ని ఎదుర్కొన్న అపొస్తలులు, యూదయ నుండి వెళ్లగొట్టబడ్డారు. అయితే తమ సందేశాన్ని బోధించేందుకు వారు క్రీస్తు శక్తితో అన్ని దేశాలకు వెళ్లారు” అని చరిత్రకారుడు, యుసేబియస్‌ (సా.శ. 260-340) చెబుతున్నాడు.

[11వ పేజీలోని బాక్సు]

బితూనియ, పొంతులలో తొలి క్రైస్తవత్వం

బితూనియ, పొంతు అనే జంట ప్రాంతాలు ఆసియా మైనరులోని నల్లసముద్రం తీర ప్రాంతంలో నెలకొనివున్నాయి. వాటి అధికారుల్లో ఒకరైన ప్లైనీ ద యంగర్‌, రోమా చక్రవర్తి ట్రాజన్‌కు రాసిన ఉత్తరం నుండి ఆ ప్రాంతాల దైనందిన జీవితం గురించి ఎంతో తెలుస్తుంది.

ఈ ప్రాంతంలోని సంఘాలకు పేతురు పత్రికలను పంపించి దాదాపు 50 ఏళ్లు గడిచిన తర్వాత, క్రైస్తవులతో వ్యవహరించాల్సిన విధానం గురించి ప్లైనీ ట్రాజన్‌ను సలహా అడిగాడు. ప్లైనీ ఇలా రాశాడు: “క్రైస్తవులను విచారిస్తున్నప్పుడు నేనెన్నడూ లేను. కాబట్టి, వారిని శిక్షించడానికి ఉపయోగించే ప్రామాణిక పద్ధతి గురించి నాకు తెలియదు. అన్ని వయసులవారు, అంతస్తులవారు, స్త్రీపురుషులనే భేదంలేకుండా అనేకమంది విచారణకు తీసుకురాబడుతున్నారు, ఇదిలా కొనసాగే అవకాశం ఉంది. పట్టణాల్లోనేకాక, గ్రామాల్లో, మారుమూల జిల్లాల్లో కూడా ఈ హేయమైన తెగ పాకింది.”

[9వ పేజీలోని డయాగ్రామ్‌/మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పౌలు యాత్రలు

మొదటి మిషనరీ యాత్ర

కుప్ర

పంఫూలియా

పెర్గే

అంతియొకయ (పిసిదియ)

ఈకొనియ

లుస్త్ర

దెర్బే

రెండవ మిషనరీ యాత్ర

కిలికియ

తార్సు

దెర్బే

లుస్త్ర

ఈకొనియ

అంతియొకయ (పిసిదియ)

ఫ్రుగియ

గలతీయ

త్రోయ

మూడవ మిషనరీ యాత్ర

కిలికియ

తార్సు

దెర్బే

లుస్త్ర

ఈకొనియ

అంతియొకయ (పిసిదియ)

ఎఫెసు

ఆసియా

త్రోయ

[ఏడు సంఘాలు]

పెర్గము

తుయతైర

సార్దీస్‌

స్ముర్న

ఎఫెసు

ఫిలదెల్ఫియ

లవొదికయ

[ఇతర ప్రదేశాలు]

హియెరాపొలి

కొలొస్సయి

లుకియ

బితూనియ

పొంతు

కప్పదొకియ

[9వ పేజీలోని చిత్రం]

అంతియొకయ

[9వ పేజీలోని చిత్రం]

త్రోయ

[చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com

[10వ పేజీలోని చిత్రం]

ఎఫెసులోని రంగస్థలం —అపొస్తలుల కార్యములు 19:29

[10వ పేజీలోని చిత్రం]

పెర్గములో జీయస్‌ బలిపీఠం అడుగుభాగం. ఆ పట్టణంలోని క్రైస్తవులు “సాతాను సింహాసనమున్న స్థలములో” నివసించారు—ప్రకటన 2:13

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.