కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా, నన్ను పరీక్షించు’

‘యెహోవా, నన్ను పరీక్షించు’

‘యెహోవా, నన్ను పరీక్షించు’

“హృదయ పరిశోధకుడు యెహోవాయే.” (సామెతలు 17:3) ఆ మాటలు మనల్నందరినీ ఎంతో ప్రోత్సహించాలి. ఎందుకు? పై రూపాన్నిబట్టి మాత్రమే ఇతరులను అంచనా వేసే మనుష్యుల్లా కాక మన పరలోక తండ్రి “హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.

నిజానికి, మన లోతైన ఉద్దేశాలను, అంతరంగ దృక్పథాలను మనం కూడా సరిగ్గా అంచనావేసుకోలేం. ఎందుకు? ఎందుకంటే మన “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” అయితే, దేవుడు దానిని గ్రహించగలడు లేదా అర్థం చేసుకోగలడు, ఎందుకంటే ఆయనిలా చెప్పాడు: “నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.” (యిర్మీయా 17:9, 10) అవును, యెహోవా “హృదయమును” అంటే మన అంతరంగ ఉద్దేశాలను అర్థంచేసుకోగలడు, అంతేకాక “అంతరింద్రియములను” అంటే మన లోతైన ఆలోచనలను, భావోద్రేకాలను కూడా అర్థం చేసుకోగలడు.

క్రైస్తవులు ఎందుకు పరీక్షించబడుతున్నారు?

అందుకే, ప్రాచీనకాల దావీదు రాజు దేవుణ్ణి ఇలా అడగడంలో ఆశ్చర్యంలేదు: “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము; నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.” (కీర్తన 26:2) యెహోవా దావీదును పరీక్షిస్తే ఆయన దేనికీ భయపడాల్సిన అవసరంలేని విధంగా ఆయన మాటలు, చేతలు పూర్తిగా నిష్కళంకంగా ఉన్నాయా? లేదు! మనందరిలాగే దావీదు కూడా అపరిపూర్ణుడు, ఆయన దేవుని ప్రమాణాలను పరిపూర్ణంగా అనుసరించలేకపోయాడు. దావీదు తన బలహీనతల కారణంగా ఎన్నో గంభీరమైన తప్పులు చేశాడు, అయితే ఆయన ‘యథార్థహృదయుడై నడుచుకున్నాడు.’ (1 రాజులు 9:4) ఎలా? గద్దింపును స్వీకరించి, తన మార్గాన్ని సరిదిద్దుకోవడం ద్వారా ఆయనలా నడుచుకున్నాడు. ఆ విధంగా తాను యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని చూపించాడు. దేవునిపట్ల ఆయకున్న భక్తి సంపూర్ణమైనది.

నేడు మన విషయమేమిటి? మనం అపరిపూర్ణులమని, మనం మాటల్లో, చేతల్లో తప్పులు చేయొచ్చని యెహోవాకు తెలుసు. అయితే, ఆయన మన భవిష్యత్తును తెలుసుకోగల తన సామర్థ్యాన్ని ఉపయోగించి మన జీవిత గమనాన్ని నిర్ణయించడు. ఆయన మనల్ని నైతిక స్వేచ్ఛగలవారిగా సృష్టించాడు, ఆయన దయాపూర్వకంగా మనకిచ్చిన స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని గౌరవిస్తాడు.

అయినా, యెహోవా కొన్ని విధాలుగా మన ఉద్దేశాలతోపాటు మన అంతరంగ పురుషుణ్ణి కొన్నిసార్లు పరిశోధిస్తాడు. మన హృదయ పరిస్థితిని వెల్లడిచేసే అవకాశాలను మనకు కల్పించడం ద్వారా ఆయన అలా పరిశోధించవచ్చు. ఆయన మన అంతరంగ దృక్పథాలను వెల్లడిచేసే వివిధ పరిస్థితులను లేదా సవాళ్లను కూడా అనుమతించవచ్చు. అది మనకు ఎంత భక్తి, యథార్థత ఉన్నాయో యెహోవాకు కనబరచడానికి అవకాశాన్నిస్తుంది. యెహోవా అనుమతించే అలాంటి పరీక్షలు మన విశ్వాసం ఎలాంటిదో నిరూపించి, మనం ‘సంపూర్ణులుగా, ఏ విషయములోనైనను కొదువలేనివారిగా’ ఉన్నామో లేమో నిర్ధారిస్తాయి.—యాకోబు 1:2-4.

ప్రాచీనకాలంలో జరిగిన విశ్వాస పరీక్ష

తమ విశ్వాసం, ఉద్దేశాలు పరీక్షించబడడం యెహోవా సేవకులకు కొత్తేమీ కాదు. పితరుడైన అబ్రాహాము విషయాన్ని పరిశీలించండి. సత్య “దేవుడు అబ్రాహామును పరిశోధించెను.” (ఆదికాండము 22:1) ఆ మాటలు చెప్పబడినప్పుడు దేవునిపట్ల అబ్రాహాముకు ఉన్న విశ్వాసం అప్పటికే పరీక్షించబడింది. దశాబ్దాల ముందు, వర్ధిల్లుతున్న ఊరు నగరాన్ని వదిలి తన కుటుంబంతోపాటు తనకు తెలియని దేశానికి వెళ్లమని యెహోవా అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 11:31; అపొస్తలుల కార్యములు 7:2-4) బహుశా అబ్రాహాముకు ఊరు నగరంలో సొంత ఇల్లు ఉండవచ్చు, ఆయన ఎన్నో దశాబ్దాలు కనానులో నివసించాడు గానీ అక్కడ ఆయన సొంత ఇల్లును కొనుగోలుచేయలేదు. (హెబ్రీయులు 11:9) అబ్రాహాము తన జీవితాన్ని దేశ సంచారకునిగా గడిపాడు కాబట్టి, ఆయనకు, ఆయన కుటుంబానికి క్షామం నుండి, సాయుధ ముఠాల నుండి, ఆ ప్రాంత అన్య పరిపాలకుల నుండి కొంత ప్రమాదం ఎదురైంది. ఈ సమయమంతటిలో, అబ్రాహాముకు ఎంతో శ్రేష్ఠమైన విశ్వాసమున్నట్లు నిరూపించబడింది.

ఆ తర్వాత యెహోవా అబ్రాహాముకు పెద్ద పరీక్ష పెట్టాడు. ‘నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా అర్పించుము.’ (ఆదికాండము 22:2) అబ్రాహాముకు ఇస్సాకు మామూలు కుమారుడేమీ కాదు. ఆయన అబ్రాహాము, శారాల ఏకైక కుమారుడు. ఆయన వాగ్దాన మూలంగా జన్మించిన కుమారుడు. దేవుని వాగ్దానం ప్రకారం, తన ‘సంతానం’ కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటాడని, అనేకమందికి ఒక ఆశీర్వాదంగా ఉంటాడని అబ్రాహాము ఆశ పెట్టుకున్నది ఇస్సాకు మీదనే. వాస్తవానికి, అబ్రాహాము ఎదురుచూసిన కుమారుడు, దేవుని అద్భుతం ద్వారా జన్మించిన కుమారుడు ఇస్సాకే!—ఆదికాండము 15:2-4, 7.

ఈ ఆజ్ఞను అర్థం చేసుకోవడం అబ్రాహాముకు ఎంత కష్టంగా అనిపించివుండవచ్చో మీరు ఊహించవచ్చు. యెహోవాకు మానవ బలి అవసరమా? అబ్రాహాముకు తన జీవితపు చరమాంకంలో కుమారుణ్ణి కనడంవల్ల కలిగే మాధుర్యాన్ని రుచిచూపించి, ఆ తర్వాత ఆ కుమారుణ్ణే బలి ఇవ్వమని యెహోవా ఎందుకు కోరతాడు? *

ఆ ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు లేకపోయినా, అబ్రాహాము వెంటనే ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు తనకు చెప్పినచోటికి చేరుకునేందుకు ఆయనకు మూడు రోజులు పట్టింది. అక్కడ ఆయన బలిపీఠము కట్టి, వాటిమీద కట్టెలను పేర్చాడు. ఆ తర్వాత ఆయన పరీక్షలోని చివరి ఘట్టానికి చేరుకున్నాడు. అబ్రాహాము కత్తి తీసుకొని తన కుమారుణ్ణి చంపబోతుండగా, యెహోవా ఒక దూత ద్వారా ఆయనను ఆపి ఇలా అన్నాడు: “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నది.” (ఆదికాండము 22:3, 11, 12) ఆ మాటలు విని అబ్రాహాము ఎంతగా సంతోషించివుంటాడో కదా! ఆయన విశ్వాసం గురించి గతంలో యెహోవా వేసిన అంచనా సరైనదే. (ఆదికాండము 15:5, 6) ఆ తర్వాత అబ్రాహాము ఇస్సాకుకు బదులుగా పొట్టేలును బలిచ్చాడు. అప్పుడు యెహోవా, అబ్రాహాము సంతానం గురించిన నిబంధనా వాగ్దానాలను స్థిరపరిచాడు. కాబట్టి, అబ్రాహాము యెహోవా స్నేహితునిగా పేరుపొందాడు.—ఆదికాండము 22:13-18; యాకోబు 2:21-23.

మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది

నేడు దేవుని సేవకులు కూడా పరీక్షలను ఎదుర్కోక తప్పదని మనందరికీ తెలుసు. అయితే మన విషయంలో, యెహోవా చేయమని మనకు ఆజ్ఞాపించే వాటికన్నా ఆయన మనపైకి రావడానికి అనుమతించేవే ఎక్కువగా ఉండవచ్చు.

అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:12) అలాంటి హింస తోటివిద్యార్థులు, స్నేహితులు, బంధువులు, పొరుగువారు, లేదా తప్పుడు సమాచారం పొందిన ప్రభుత్వ అధికారుల నుండి రావచ్చు. అది బూతుల రూపంలో, శారీరక దాడి రూపంలోనే కాక క్రైస్తవుని జీవనోపాధికి ఆటంకం కలిగించే విధంగా కూడా ఉండవచ్చు. నిజక్రైస్తవులు, మానవులకు సాధారణంగా ఎదురయ్యే అనారోగ్యం, నిరాశ, అన్యాయాల వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. అలాంటి పరీక్షలన్నీ ఒక వ్యక్తి విశ్వాసాన్ని పరీక్షిస్తాయి.

అపొస్తలుడైన పేతురు, విశ్వాసం పరీక్షించబడడంవల్ల వచ్చే ప్రయోజనాలను నొక్కిచెప్పాడు: “నానావిధములైన శోధనలచేత . . . మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.” (1 పేతురు 1:6, 7) అవును, పరీక్షలవల్ల వచ్చే ఫలితాలు అగ్ని ద్వారా శుద్ధిచేయబడడంతో పోల్చబడ్డాయి. శుద్ధీకరణ ప్రక్రియ స్వచ్ఛమైనది కనిపించేలా చేసి మాలిన్యాన్ని తీసివేస్తుంది. మనం పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మన విశ్వాసానికి సంబంధించి అలాంటి శుద్ధీకరణ ప్రక్రియే జరుగుతుంది.

ఉదాహరణకు, ఒక దుర్ఘటనవల్ల లేదా ప్రకృతి విపత్తువల్ల మనం కష్టాలు ఎదుర్కోవచ్చు. అయినా, నిజమైన విశ్వాసంగలవారు ఎక్కువగా ఆందోళన చెందరు. వారు యెహోవా ఇచ్చిన ఈ హామీ నుండి ఓదార్పు పొందుతారు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5) తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో వారు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూనే ఉంటారు. వారి విశ్వాసం, కష్ట సమయాల్లో వారికి బలాన్నిచ్చి, అనవసరంగా ఆందోళన చెందడం ద్వారా తమ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసుకోకుండా ఉండేందుకు దోహదపడుతుంది.

పరీక్షలు మన విశ్వాసంలోని బలహీనతలను వెల్లడిచేయడం కూడా మనకు ప్రయోజనకరమైనదే. అయితే, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మనం గుర్తిస్తేనే ప్రయోజనం చేకూరుతుంది. ఒక వ్యక్తి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను నా విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి నేను మరింత సమయం తీసుకోవాల్సిన అవసరముందా? తోటి విశ్వాసులతో కూటాలకు హాజరవడానికి చేయబడిన ఏర్పాట్లను నేను పూర్తిగా వినియోగించుకున్నానా? నా చింతలను యెహోవా దేవునికి ప్రార్థనలో తెలియజేయాల్సింది పోయి నేను నా స్వశక్తిని నమ్ముకుంటున్నానా?’ అయితే, అలాంటి స్వీయ పరిశీలన కేవలం ప్రారంభం మాత్రమే.

విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ‘నిర్మలమైన వాక్యమను పాల విషయంలో అపేక్షను’ లేదా కోరికను కనబరిచి ఆధ్యాత్మిక ఆకలిని పెంచుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. (1 పేతురు 2:1; హెబ్రీయులు 5:12-14) మనం కీర్తనకర్త వివరించిన ఈ వ్యక్తిలా ఉండడానికి కృషిచేయాలి: “[అతడు] యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు[ను].”—కీర్తన 1:2.

అలా చేయాలంటే కేవలం బైబిలు చదివితే సరిపోదు. దేవుని వాక్యం మనకు బోధిస్తున్నదాన్ని గురించి ఆలోచించి దానిలో ఇవ్వబడిన హెచ్చరికను అన్వయించుకోవడం ప్రాముఖ్యం. (యాకోబు 1:22-25) అలా చేస్తే దేవునిపట్ల మనకున్న ప్రేమ పెరిగి, మన ప్రార్థనలు మరింత నిర్దిష్టంగా, వ్యక్తిగతంగా ఉండడమే కాక, ఆయనపట్ల మన విశ్వాసం కూడా మరింత బలపడుతుంది.

పరీక్షించబడిన విశ్వాసానికున్న విలువ

దేవుని ఆమోదాన్ని సంపాదించుకోవడానికి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమని గుర్తించడం దానిని బలపర్చుకోవడానికి మనల్ని ఎంతగానో పురికొల్పుతుంది. బైబిలు మనకిలా గుర్తుచేస్తోంది: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” (హెబ్రీయులు 11:6) కాబట్టి, మన భావాలు యేసును ఇలా వేడుకున్న వ్యక్తిలా ఉండాలి: “నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుము.”—మార్కు 9:24.

మన విశ్వాస పరీక్షలు ఇతరులకు కూడా సహాయం చేయగలవు. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు తన వాళ్లనెవరినైనా పోగొట్టుకున్నప్పుడు పునరుత్థానానికి సంబంధించిన దేవుని వాగ్దానంపట్ల ఆయకున్న దృఢమైన విశ్వాసం ఆయనకు బలాన్నిస్తుంది. ఆయన బాధపడతాడు గానీ ‘నిరీక్షణలేని ఇతరులవలె దుఃఖపడడు.’ (1 థెస్సలొనీకయులు 4:13, 14) ఒక క్రైస్తవుని విశ్వాసం పరీక్షలను ఎదుర్కొనే శక్తిని ఎలా ఇవ్వగలదో గమనించే ఇతరులు, ఆయన దగ్గర నిజంగా అమూల్యమైనదేదో ఉందని గుర్తించవచ్చు. ఇది, అలాంటి విశ్వాసాన్ని కలిగివుండాలనే కోరిక వారిలో కూడా రగిలించి, దేవుని వాక్యం గురించి తెలుసుకొని యేసుక్రీస్తు శిష్యులయ్యేందుకు వారిని ప్రోత్సహించవచ్చు.

పరీక్షించబడిన విశ్వాసానికి ఎంతో విలువుందని యెహోవాకు తెలుసు. అంతేకాక, మనకు నిజంగా బలానిచ్చేంత శక్తి మన విశ్వాసానికి ఉందో లేదో గ్రహించడానికి విశ్వాస పరీక్షలు మనకు సహాయం చేస్తాయి. అవి మన విశ్వాసంలోని బలహీనతలను మనం గుర్తించి, పరిస్థితులను సరిదిద్దుకోవడానికి దోహదపడతాయి. చివరిగా, మనం పరీక్షలను విజయవంతంగా నెగ్గుకురావడం ఇతరులు యేసు శిష్యులయ్యేందుకు సహాయం చేయవచ్చు. మనం బలమైన విశ్వాసాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా కృషిచేద్దాం, ఆ విశ్వాసం ఒకదాని తర్వాత మరో పరీక్షను ఎదుర్కొని “యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు . . . మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు” విధంగా ఉండేలా చూసుకుందాం.—1 పేతురు 1:7.

[అధస్సూచి]

^ పేరా 11 ఇస్సాకు “బలి”కి ఉన్న సూచనార్థక ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి, కావలికోట, జూలై 1, 1989 (ఆంగ్లం), 22వ పేజీ చూడండి.

[13వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము విశ్వాసక్రియలు ఆయనను యెహోవా స్నేహితునిగా చేశాయి

[15వ పేజీలోని చిత్రాలు]

మన విశ్వాసానికి నిజంగా బలాన్నిచ్చే శక్తివుందని పరీక్షలు నిరూపించగలవు

[12వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the Illustrated Edition of the Holy Scriptures, by Cassell, Petter, & Galpin