కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు

యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు

యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు

“న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము.”—యెషయా 61:8.

న్యాయం అంటే “నిష్పక్షపాతంగా, సరిసమాన దృష్టితో ఉండడం, నైతికంగా సధర్మమైన, సరైన దానికి పొందికగా ప్రవర్తించడం” అని నిర్వచించబడింది. అన్యాయంలో పక్షపాతం, దురభిమానం, చెడుతనం, ఇతరులకు తగని హాని చేయడం వంటివి ఉంటాయి.

2 దాదాపు 3,500 సంవత్సరాల క్రితం విశ్వసర్వాధిపతియైన యెహోవా గురించి మోషే ఇలా వ్రాశాడు: “ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) ఏడుకన్నా ఎక్కువ శతాబ్దాల తర్వాత, యెషయా ఈ మాటలు వ్రాసేలా దేవుడాయనను ప్రేరేపించాడు: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము.” (యెషయా 61:8) ఆ తర్వాత మొదటి శతాబ్దంలో పౌలు భావావేశంతో ఇలా అన్నాడు: “దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.” (రోమీయులు 9:14) అదే శతాబ్దంలో పేతురు ఇలా ప్రకటించాడు: “దేవుడు పక్షపాతి కాడు. . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35) అవును, “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.”—కీర్తన 37:28; మలాకీ 3:6.

అన్యాయం విస్తరించడం

3 నేడు చాలా అరుదుగా న్యాయం జరుగుతోంది. సమాజంలోని అన్ని రంగాల్లో అంటే ఉద్యోగస్థలంలో, పాఠశాలలో, అధికారులతో వ్యవహరించేటప్పుడు, మరితర విధాలుగా, చివరకు కుటుంబ పరిధిలో కూడా మనం అన్యాయానికి బలికావచ్చు. అయితే అలాంటి అన్యాయాలు క్రొత్తేమీ కాదు. అపవాదియగు సాతానుగా మారిన తిరుగుబాటుదారుడైన ఆత్మప్రాణి ప్రోద్బలానికి గురై మన మొదటి తల్లిదండ్రులు దేవునిపై తిరుగుబాటు చేసి, అక్రమానికి పాల్పడినప్పుడు మానవకుటుంబం అన్యాయాలపాలైంది. యెహోవా తమకిచ్చిన స్వేచ్ఛాచిత్తమనే అద్భుత వరాన్ని ఆదాముహవ్వలు, సాతాను దుర్వినియోగం చేయడం నిశ్చయంగా అన్యాయమే. వారి తప్పుడు క్రియలు మానవ కుటుంబమంతటికీ చెప్పలేనంత బాధను, మరణాన్ని తీసుకొచ్చాయి.—ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12; హెబ్రీయులు 2:14.

4 ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి గత 6,000 సంవత్సరాలుగా అన్యాయం మానవ సమాజంలో భాగంగా ఉంది. అలావుంటుందని ఎదురుచూడవచ్చు, ఎందుకంటే సాతాను ఈ యుగసంబంధ దేవత. (2 కొరింథీయులు 4:4) అతడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, యెహోవాపై కొండెములు చెప్పే విరోధి. (యోహాను 8:44) అతడు ఎల్లప్పుడూ దారుణమైన అన్యాయాలకు ఒడిగడుతూ వచ్చాడు. ఉదాహరణకు, నోవహు కాలంలో జలప్రళయానికి ముందు కొంతమేర సాతాను దుష్ట ప్రభావం కారణంగానే, “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు” దేవుడు గమనించాడు. (ఆదికాండము 6:5) ఆ పరిస్థితే యేసు కాలంలో కూడా ఉంది. ఆయనిలా అన్నాడు: “ఏనాటి కీడు,” అంటే అన్యాయం వంటి బాధాకరమైన సమస్యలు, “ఆనాటికి చాలును.”(మత్తయి 6:34) బైబిలు స్పష్టంగా ఇలా చెబుతోంది: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది.”—రోమీయులు 8:22.

5 అందువల్ల, ఘోర అన్యాయంగా పరిణమించే చెడు సంగతులు మానవ చరిత్రంతటా జరుగుతూవచ్చాయి. ఇప్పుడు పరిస్థితి క్రితమెన్నటికన్నా మరీ దారుణంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ప్రస్తుత భక్తిహీన విధానం చాలా దశాబ్దాలుగా “అంత్యదినములలో” ఉండి అంతానికి సమీపిస్తుండగా అది “అపాయకరమైన కాలములను” అనుభవిస్తోంది. చరిత్రలోని ఈ కాలంలో ప్రజలు “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు . . . కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు[గా]” ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) ఇలాంటి చెడు లక్షణాలు అన్నిరకాల అన్యాయాలకు దారితీస్తాయి.

6 గడిచిన వంద సంవత్సరాలు, క్రితమెన్నడూ లేనంత విస్తృతస్థాయిలో అన్యాయాలను చూశాయి. ఒక కారణమేమిటంటే, ఈ సంవత్సరాల్లో అత్యధిక సంఖ్యలో యుద్ధాలు జరిగాయి. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధంలోనే దాదాపు ఐదు నుండి ఆరు కోట్లమంది వరకు చనిపోయారని, వారిలో ఎక్కువగా పౌరులే అంటే నిర్దోషులైన పురుషులు, స్త్రీలు, పిల్లలే ఉన్నారని కొందరు చరిత్రకారుల అంచనా. ఆ యుద్ధం ముగిసినప్పటి నుండి వివిధ పోరాటాల్లో లక్షలాదిమంది చంపబడ్డారు, మళ్ళీ వారిలో అత్యధికులు పౌరులే. సాతాను అలాంటి అన్యాయాలను పురికొల్పుతాడు, ఎందుకంటే యెహోవా త్వరలోనే తనను పూర్తిగా ఓడిస్తాడని తెలుసుకొని అతడు చాలా క్రోధంతో ఉన్నాడు. బైబిలు ప్రవచనం దాన్నిలా చెబుతోంది: “అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:12.

7 ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం సాలీనా దాదాపు 45 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు వందలకోట్ల మంది తమ జీవితావసరాలు తీరక సతమతమౌతున్నారు, ఆ డబ్బంతటనీ శాంతి క్రియలకు వెచ్చిస్తే అది చేయగలిగే మేలు గురించి ఆలోచించండి. ఇతరులకు సమృద్ధిగా ఉండగా, దాదాపు వందకోట్ల మందికి సరిపడేంత ఆహారం లభించడం లేదు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రతీ సంవత్సరం ఆకలివల్ల దాదాపు 50 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. ఎంత అన్యాయం! అలాగే గర్భస్రావాల మూలంగా చంపబడుతున్న ఎంతోమంది గర్భస్థ శిశువుల గురించి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం నాలుగు నుండి ఆరుకోట్ల గర్భస్రావాలు చేయబడుతున్నాయని అంచనా. ఎంతటి ఘోరాతిఘోరమైన అన్యాయమో కదా!

8 నేడు మానవాళిని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్యలకు మానవ పరిపాలకులు పరిష్కారాలు కనుగొనలేకపోతున్నారు; మానవ ప్రయత్నాలతో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడదు. మన కాలంలో “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని దేవుని వాక్యం ముందే చెప్పింది. (2 తిమోతి 3:13) అన్యాయం దైనందిన జీవితంలో ఎంతగా భాగమైపోయిందంటే, మానవులు దానిని నిర్మూలించలేరు. న్యాయవంతుడైన దేవుడు మాత్రమే దానిని నిర్మూలించగలడు. ఆయన మాత్రమే సాతానును, దయ్యాలను, దుష్ట మానవులను రూపుమాపగలడు.—యిర్మీయా 10:23, 24.

అర్థసహితమైన చింత

9 గతంలో, కొంతమంది బైబిలు రచయితలు సహితం దేవుడు ఈపాటికే మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని నిష్పక్షపాత న్యాయాన్ని, నీతిని ఎందుకు తీసుకురాలేదు అని ఆలోచించారు. ఉదాహరణకు, బైబిలు కాలాల్లోని ఓ వ్యక్తి విషయమే తీసుకోండి. 73వ కీర్తన పైవిలాసంలో ఆసాపు అనే పేరు కనిపిస్తుంది, అది రాజైన దావీదు పరిపాలన కాలంలోవున్న ప్రముఖ లేవీవంశ సంగీతకారుణ్ణి లేదా ఆసాపు వంశంలోని సంగీతకారులను సూచిస్తుండవచ్చు. ఆసాపు, ఆయన వంశస్థులు బహిరంగ ఆరాధనలో ఉపయోగించబడిన అనేక శ్రావ్యమైన గీతాలను కూర్చారు. అయితే ఈ కీర్తన రచయిత తన జీవితంలో ఒకసారి, ఆధ్యాత్మికంగా కృంగిపోయాడు. దుష్టులు వర్ధిల్లడాన్ని, వారు ఎలాంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోకుండా తరచూ తృప్తిగా జీవించడాన్ని ఆయన గమనించాడు.

10 మనమిలా చదువుతాం: “భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.” (కీర్తన 73:2-8) అయితే అలాంటి ప్రతికూల దృక్కోణం తప్పని ఆ బైబిలు రచయిత చివరకు గ్రహించాడు. (కీర్తన 73:15, 16) ఆ కీర్తనకర్త తన ఆలోచనను సరిచేసుకునేందుకు ప్రయత్నించాడు, అయితే మంచివారు తరచూ కష్టాలు అనుభవిస్తుండగా దుష్టులు ఎందుకు శిక్ష తప్పించుకుంటున్నారో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు.

11 చివరకు ఆ ప్రాచీనకాల విశ్వాసి, దుష్టులకు కలిగే పర్యవసానాన్ని అంటే యెహోవా చివరకు పరిస్థితిని చక్కదిద్దుతాడని గ్రహించాడు. (కీర్తన 73:17-19) దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.”—కీర్తన 37:9, 11, 34.

12 రూఢిగా, తాను సరైనదని భావించిన కాలంలో దుష్టత్వాన్ని, దాని సంబంధిత అన్యాయాలను భూమ్మీదనుండి తొలగించాలనేదే యెహోవా సంకల్పం. ఇది యథార్థ క్రైస్తవులు సహితం క్రమంగా తమకుతాము గుర్తుచేసుకోవాల్సిన విషయం. యెహోవా తన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని తొలగించడమే కాక, ఆ చిత్తానికి అనుగుణంగా జీవించేవారికి ప్రతిఫలమిస్తాడు. ‘ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు, తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు. దుష్టులమీద ఆయన ఉరులు, వడగాలి, అగ్నిగంధకములు కురిపించును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు.’—కీర్తన 11:4-7.

న్యాయవంతమైన నూతనలోకం

13 సాతాను అధీనంలోవున్న ఈ అన్యాయపు లోకాన్ని యెహోవా నాశనంచేసి మహిమాన్వితమైన నూతనలోకాన్ని ప్రవేశపెడతాడు. అది దేవుని పరలోక రాజ్యాధీనంలో ఉంటుంది, దానికోసం ప్రార్థించాలనే యేసు తన అనుచరులకు బోధించాడు. దుష్టత్వం, అన్యాయం స్థానంలో నీతిన్యాయాలు చోటుచేసుకుంటాయి, అప్పుడు “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే ప్రార్థనకు పూర్తిభావంలో జవాబు లభిస్తుంది.—మత్తయి 6:9, 10.

14 మనమెలాంటి పరిపాలన కోసం ఆశించవచ్చనే దాని గురించి అంటే యథార్థ హృదయులందరూ ఇప్పుడు కోరుకునే పరిపాలన గురించి బైబిలు మనకు చెబుతోంది. అప్పుడు కీర్తన 145:16 పూర్తిభావంలో నెరవేరుతుంది. అక్కడిలా ఉంది: “నీవు [యెహోవా దేవుడు] నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.” అంతేకాక యెషయా 32:1 ఇలా చెబుతోంది: “ఆలకించుడి, రాజు [పరలోకంలో క్రీస్తుయేసు] నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు [క్రీస్తు భూసంబంధ ప్రతినిధులు] న్యాయమునుబట్టి యేలుదురు.” రాజైన యేసుక్రీస్తు గురించి యెషయా 9:7 ఇలా ప్రవచిస్తోంది: “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” ఆ న్యాయవంతమైన పరిపాలనలోని జీవితాన్ని మీరు ఊహించుకోగలుగుతున్నారా?

15 దేవుని నూతనలోకంలో మనం ప్రసంగి 4:1లోని ఈ మాటలను వ్యక్తపర్చడానికి కారణమే ఉండదు: “పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.” నిజమే, మన అపరిపూర్ణ మనసుతో ఆ నీతియుక్త నూతనలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించడం కష్టమే. చెడుతనం మచ్చుకైనా ఉండదు; బదులుగా ప్రతీరోజు సద్విషయాలతో నిండివుంటుంది. అవును, మనం ఆశించినదానికన్నా మరెంతో మెరుగైన రీతిలో వక్రమైన ప్రతీదానిని యెహోవా సరిదిద్దుతాడు. ఇలా వ్రాసేలా యెహోవా దేవుడు అపొస్తలుడైన పేతురును ప్రేరేపించడం ఎంత సముచితం: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”—2 పేతురు 3:13.

16 అవును, క్రీస్తు అధికారంలోని దేవుని పరలోక ప్రభుత్వమైన ఆ “క్రొత్త ఆకాశము” ఇప్పటికే స్థాపించబడింది. “క్రొత్త భూమి” కేంద్రభాగముగా అంటే సరైన మనోవైఖరిగల ప్రజల క్రొత్త భూసమాజముగా రూపొందేవారు ఈ అంత్యదినములలో సమకూర్చబడుతున్నారు. వారిప్పటికే సుమారు డెబ్భై లక్షలమంది ఉన్నారు, వారు దాదాపు 235 దేశాల్లోని రమారమి లక్ష సంఘాల్లో ఉన్నారు. ఈ లక్షలాదిమంది యెహోవా నీతియుక్తమైన, న్యాయమైన విధానాలను తెలుసుకుంటున్నారు, తత్ఫలితంగా వారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ప్రేమచేత బలపర్చబడిన ఐక్యతను ఆస్వాదిస్తున్నారు. వారి ఐక్యత ప్రపంచ చరిత్రలో అత్యంత పటిష్ఠమైనది, శాశ్వతమైనదే కాక, సాతాను ప్రజలనుభవించే దేనికన్నా సర్వాతిశయమైన ఐక్యతైయుంది. అలాంటి ప్రేమ, ఐక్యతలు నీతిన్యాయాలచే నడిపించబడే రానైయున్న దేవుని నూతనలోకంలోని అద్భుతమైన కాలానికి పూర్వఛాయలుగా ఉన్నాయి.—యెషయా 2:2-4; యోహాను 13:34, 35; కొలొస్సయులు 3:14.

సాతాను దాడి విఫలమౌతుంది

17 సాతాను అతని అనుచరులు యెహోవా ఆరాధకులను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తూ త్వరలోనే వారిపై దాడిచేస్తారు. (యెహెజ్కేలు 38:14-23) ఇది “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అని యేసు చెప్పిన శ్రమలో భాగమై ఉంటుంది. (మత్తయి 24:21) సాతాను దాడి సఫలమౌతుందా? సఫలమవదు. దేవుని వాక్యం మనకిలా అభయమిస్తోంది: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:28, 29.

18 యెహోవా సేవకులపై సాతాను అతని మూకలు చేసే దాడి చివరి దుష్ట క్రియయై ఉంటుంది. జెకర్యా ద్వారా యెహోవా ముందే ఇలాచెప్పాడు: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.’ (జెకర్యా 2:8) అంటే యెహోవా తన కనుగుడ్డును ఎవరో వేలితో పొడుస్తున్నట్లు వెంటనే స్పందించి ఆ దుర్మార్గులను నిర్మూలిస్తాడు. యెహోవా సేవకులు భూమిపై నివసిస్తున్న అత్యంత ప్రేమగల, ఐక్యతగల, శాంతిపరులైన, శాసన బద్ధులైన ప్రజలు. కాబట్టి వారిపై అలాంటి దాడి పూర్తిగా అనుచితమైనది, అన్యాయమైనది. బహుగా “న్యాయమును ప్రేమించు” దేవుడు దానిని సహించడు. ఆయన వారి పక్షాన చర్య తీసుకోవడం మూలంగా ఆయన ప్రజల శత్రువులు శాశ్వతంగా నాశనం చేయబడతారు, న్యాయం జయిస్తుంది, అద్వితీయ సత్యదేవుని ఆరాధకులు రక్షించబడతారు. మన సమీప భవిష్యత్తులో ఎంతటి ఆశ్చర్యకరమైన, ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటుచేసుకోనున్నాయో కదా!—సామెతలు 2:21, 22.

మీరెలా జవాబిస్తారు?

• అన్యాయమెందుకు ఇంత విస్తృతంగా ఉంది?

• భూమ్మీద అన్యాయమనే సమస్యను యెహోవా ఎలా పరిష్కరిస్తాడు?

• న్యాయం జయించడాన్ని గురించిన ఈ అధ్యయనంలో ఏ విషయం మిమ్మల్ని ముగ్ధుల్ని చేసింది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) “న్యాయము,” “అన్యాయము” అనే మాటల అర్థమేమిటి? (బి) యెహోవా గురించి, ఆయన లక్షణమైన న్యాయం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

3. భూమిపై అన్యాయమెలా ఆరంభమైంది?

4. అన్యాయం ఎంతకాలంగా మానవ చరిత్రలో భాగమైవుంది?

5. మనకాలంలో అన్యాయాలు ఎందుకు క్రితమెన్నటికన్నా ఎక్కువగా ఉన్నాయి?

6, 7. ఆధునిక కాలాల్లో ఎలాంటి ఘోరమైన అన్యాయాలు మానవ కుటుంబాన్ని పట్టిపీడించాయి?

8. మానవాళికి ఏ విధంగా మాత్రమే నిష్పక్షపాత న్యాయం జరుగుతుంది?

9, 10. ఆసాపు ఎందుకు నిరాశకు గురయ్యాడు?

11. కీర్తనకర్తయైన ఆసాపు ఏమి అర్థం చేసుకున్నాడు?

12. (ఎ) దుష్టత్వానికి, అన్యాయానికి సంబంధించి యెహోవా సంకల్పమేమిటి? (బి) అన్యాయమనే సమస్యా పరిష్కారం గురించి మీరెలా భావిస్తున్నారు?

13, 14. నూతనలోకంలో నీతిన్యాయాలు ఎందుకుంటాయి?

15. నూతనలోకంలో యెహోవా మానవులకోసం ఏమిచేస్తాడు?

16. “క్రొత్త ఆకాశములు” ఎలా స్థాపించబడ్డాయి, నేడు “క్రొత్త భూమి” ఏ భావంలో సిద్ధపర్చబడుతోంది?

17. యెహోవా ప్రజలపై సాతానుచేసే చివరి దాడి ఎందుకు నిశ్చయంగా విఫలమౌతుంది?

18. (ఎ) తన ప్రజలపై సాతాను చేయబోయే దాడికి దేవుడెలా స్పందిస్తాడు? (బి) న్యాయం జయించడాన్ని గురించిన ఈ బైబిలు ఆధారిత సమాచారాన్ని మీరు పునఃసమీక్షించడం ఎందుకు ప్రయోజనకరమైనది?

[23వ పేజీలోని చిత్రం]

జలప్రళయానికి ముందు చెడుతనం విస్తారంగా ఉంది, అది ఈ “అంత్యదినములలో” పొంగిపొర్లుతోంది

[24, 25వ పేజీలోని చిత్రం]

దేవుని నూతనలోకంలో దుష్టత్వం స్థానే నీతిన్యాయాలు ఉంటాయి