కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రూపకల్పనను చూసి ఆశ్చర్యపోవడమే కాక రూపకర్త గురించి తెలుసుకోండి

రూపకల్పనను చూసి ఆశ్చర్యపోవడమే కాక రూపకర్త గురించి తెలుసుకోండి

రూపకల్పనను చూసి ఆశ్చర్యపోవడమే కాక రూపకర్త గురించి తెలుసుకోండి

ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి అయిన మైకేలేంజెలో గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఆయన స్వహస్తాలతో చేసిన కళాఖండాల్లో ఒకదాన్ని మీరెప్పుడూ చూసుండకపోయినా, ఇటలీ దేశస్థుడైన ఆ మేధావిని “అద్భుతమైన, సాటిలేని కళాకారుడు” అని అభివర్ణించిన ఒక కళా చరిత్రకారునితో మీరు తప్పక ఏకీభవిస్తుండవచ్చు. మైకేలేంజెలో నైపుణ్యాలను ఎవరూ కొట్టిపారేయలేరు. ఆయన కళను మెచ్చుకుంటూ, ఆయనను అసాధారణ కళాకారుడని గుర్తించని వారెవరుంటారు?

ఇప్పుడు, భూమ్మీద మన చుట్టూ వర్ధిల్లుతున్న ప్రాణికోటిలోని అద్భుతమైన సంక్లిష్టత గురించి, వైవిధ్యం గురించి ఆలోచించండి. అందుకే, ద న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక, జీవశాస్త్ర ప్రొఫెసర్‌ ఒకాయన ఇలా చెప్పాడని ఉల్లేఖించింది: “జీవశాస్త్ర అంశాల్లో రూపకల్పనకు సంబంధించిన రుజువులు కనిపిస్తాయి.” ఆయనింకా ఇలా అన్నాడు: “ప్రాణికోటిలో రూపకల్పన మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది.” రూపకల్పనను చూసి ఆశ్చర్యపోతూ రూపకర్తను గుర్తించకపోవడం న్యాయమేనా?

తన చుట్టూ ఉన్నవాటిని జాగ్రత్తగా గమనించే అపొస్తలుడైన పౌలు, “సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించినవాటిని పూజించి వాటి సేవ చేసే” వారి గురించి మాట్లాడాడు. (రోమీయులు 1:25, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) సర్వత్రా వ్యాపించివున్న పరిణామ సిద్ధాంతాలకు ప్రభావితులైన కొందరు, సృష్టిలోని రూపకల్పన ఒక రూపకర్త ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తుందని గుర్తించడానికి నిరాకరిస్తారు లేదా గుర్తించలేకపోతారు. పరిణామ సిద్ధాంతం వాస్తవ విజ్ఞానశాస్త్రాన్ని సరిగ్గా వివరిస్తోందా? వియన్నాకు చెందిన క్రిస్టఫ్‌ స్కోన్బోర్న్‌ అనే క్యాథలిక్‌ ఆర్చ్‌బిషప్‌ ఏ నిర్ధారణకు వచ్చాడో గమనించండి, ఇది ద న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురించబడింది: “జీవశాస్త్రంలో కనిపించే రూపకల్పనకు సంబంధించిన ఎన్నో రుజువులను తిరిస్కరించే లేదా ఉపేక్షించే ఏ సిద్ధాంతమైనా నిరాధారమైన నమ్మకమే గానీ విజ్ఞానశాస్త్రం కాదు.”

విజ్ఞానశాస్త్ర పరిశోధనల అవసరం లేదని దానర్థమా?

అయితే, సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువులున్నాయనే అభిప్రాయాన్ని అంగీకరిస్తే అది “పరిశోధనను కుంటుపరుస్తుంది” అని అనుకునేవారు కూడా ఉన్నారు. న్యూ సైంటిస్ట్‌ పత్రికలోని ఒక ఆర్టికల్‌ అలాంటి భయాలనే వ్యక్తపర్చింది, అది “‘రూపకర్త సృష్టించాడు’ అనే తలంపు అధిగమించలేని అవరోధంగా ఉంటుంది కాబట్టి అనేక క్రొత్త విషయాలను కనుగొనే ప్రక్రియ ఆగిపోతుంది” అని వాదించింది. ఆ భయానికి బలమైన ఆధారముందా? లేనేలేదు. వారి వాదనలు సరైనవి కావు. ఎందుకు?

మన విశ్వం, భూమ్మీది ప్రాణికోటి యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చాయని, ఆ తర్వాత అవి క్రమంగా పరిణామం చెందాయని గ్రుడ్డిగా అంగీకరించడం నిజానికి, అర్థవంతమైన వివరణను కనుగొనడానికి చేసే అన్ని ప్రయత్నాలను విరమించుకోవడంతో సమానమే అవుతుంది. మరోవైపు, మన చుట్టూ ఉన్న సృష్టిని జ్ఞానవంతమైన సృష్టికర్త సృష్టించాడని అంగీకరించడం మనం సృష్టిని పరిశోధించడానికి, భౌతిక విశ్వాన్ని సృష్టించడంలో ఆయన తన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడో పరిశోధించడానికి మనల్ని ప్రోత్సహించగలదు. దీన్ని పరిశీలించండి: కళా చరిత్రకారులు, “మోనాలిసా” చిత్రాన్ని లియోనార్డో డావించి చిత్రించాడని తెలుసుకున్నా, వారాయన నైపుణ్యం గురించి, ఆయన ఉపయోగించిన వస్తువుల గురించి ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాగే, రూపకర్త ఉన్నాడని అంగీకరించడం మనమాయన రూపకల్పనల్లో, సృష్టిలో కనిపించే గుణాల గురించి, వాటిలోని సంక్లిష్టత గురించి పరిశోధించడాన్ని మానుకునేలా చేయకూడదు.

బైబిలు, మరింత పరిశోధనను నిరుత్సాహపరిచే బదులు అది విజ్ఞానశాస్త్ర ప్రశ్నలకే కాక, ఆధ్యాత్మిక ప్రశ్నలకు కూడా సమాధానాలను అన్వేషించమని ప్రోత్సహిస్తోంది. ప్రాచీన రాజైన దావీదు నైపుణ్యవంతంగా సృష్టించబడిన తన భౌతిక శరీర నిర్మాణం గురించి ధ్యానించాడు. అందుకే, ఆయనిలా అన్నాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి . . . నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:14) వాస్తవానికి పితరుడైన యోబును సృష్టికర్త ఇలా ప్రశ్నించాడని బైబిలు చెబుతోంది: “భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా?” (యోబు 38:18) ఆ మాటలు విచారణను, పరిశోధనను చేయవద్దని ఎంతమాత్రం చెప్పడంలేదు. వాస్తవానికి, ఇక్కడ నైపుణ్యవంతుడైన రూపకర్త తాను సృష్టించినవాటిని పరిశోధించమని ఆహ్వానించాడు. యెషయా ప్రవక్త ద్వారా నమోదు చేయబడిన ఈ ఆహ్వానం, మన చుట్టూ ఉన్న సృష్టిని సృష్టించిన వ్యక్తి గురించి మరింత తెలుసుకోమని మనల్ని నిర్దేశిస్తుందనే విషయాన్ని కూడా గమనించండి: “మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను?” నిజానికి, యెషయా 40:26 ఆ తర్వాత, ఐన్‌స్టయిన్‌ ప్రసిద్ధ సమీకరణమైన E=mc2కు (పరమాణు ద్రవ్యరాశిని కాంతి వేగపు వర్గముతో గుణించగా వచ్చే శక్తి విలువ) అనుగుణమైన వాస్తవాన్ని వివరిస్తోంది. విశ్వాన్ని అధికశక్తిగలవాడు, బలాతిశయంగలవాడు సృష్టించాడన్నదే ఆ వాస్తవం.

నిజమే, సృష్టి గురించిన ప్రశ్నలకు జవాబులు ఎప్పుడూ వెంటనే దొరకవు. మన అవగాహనా శక్తులు పరిమితంగా ఉండడం, మనం జీవిస్తున్న లోకం గురించి పూర్తి అవగాహన లేకపోవడం కూడా దానికి కొంతమేరకు కారణం. యోబు దానిని అర్థం చేసుకున్నాడు. అంతరిక్షంలో దృశ్యమైన ఆధారమేమీ లేకుండా మన భూగోళాన్ని వ్రేలాడదీసిన, నీళ్ళతో నిండిన మేఘాలను భూమికిపైగా ఉంచిన సృష్టికర్తను ఆయన స్తుతించాడు. (యోబు 26:7-9) అయినా, అలాంటి అద్భుతాలు “ఆయన కార్యములలో స్వల్పములు” అని యోబు గుర్తించాడు. (యోబు 26:14) యోబు తన చుట్టూవున్న లోకం గురించి మరింత తెలుసుకోవాలని ఖచ్చితంగా కోరుకున్నాడు. అంతేకాక, దావీదు తన పరిమితులను ఒప్పుకుంటూ ఇలా రాశాడు: “ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు.”—కీర్తన 139:6.

సృష్టికర్త ఉనికిని అంగీకరించడం విజ్ఞానశాస్త్ర అభివృద్ధిని అడ్డుకోదు. భౌతిక, ఆధ్యాత్మిక విషయాల గురించి సమగ్రమైన జ్ఞానాన్ని మరింత సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం అపరిమితమైనది, ఆ ప్రయత్నానికి అంతేలేదు. సమగ్రమైన జ్ఞానానికి పేరుపొందిన ఒక ప్రాచీన రాజు వినయంగా ఇలా రాశాడు: “ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.”—ప్రసంగి 3:11.

“విజ్ఞానశాస్త్రం వివరించలేనప్పుడు ప్రస్తావించబడే దేవుడా”?

విజ్ఞానశాస్త్రం స్పష్టంగా వివరించలేనప్పుడు, “విషయాన్ని వివరించడానికి” ఎలాంటి రుజువులు చూపించకుండా దేవుని గురించి ప్రస్తావించడాన్ని కొందరు వ్యతిరేకిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఆ దైవిక రూపకర్త “విజ్ఞానశాస్త్రం వివరించలేనప్పుడు ప్రస్తావించబడే దేవుడు” అవుతున్నాడని, అందుకే, మనుష్యులు సహేతుకంగా, వైజ్ఞానికపరంగా విషయాలను వివరించలేనప్పుడు, “దేవుడు” దానిని సృష్టించాడు అని మాత్రం అంటున్నారని కొందరు వాదిస్తున్నారు. అయితే వివరించలేని అంశాలేమిటి? మనకు కేవలం అల్పమైన, అప్రధానమైన విషయాలే తెలియవా? లేదు, డార్విన్‌ పరిణామ సిద్ధాంతపు హేతుబద్ధతకు సంబంధించి నిజానికి మనకు ఎన్నో విషయాలు తెలియవు. జీవశాస్త్రానికి సంబంధించిన ప్రధానమైన విషయాలను పరిణామ సిద్ధాంతం వివరించలేకపోయింది. సహేతుకంగా చెప్పాలంటే, నిరాధార వాదనలమీద ఆధారపడే పరిణామ సిద్ధాంతవాదులు, చాలా సమర్థవంతంగా, డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ‘విజ్ఞానశాస్త్రం వివరించలేనప్పుడు ప్రస్తావించబడే దేవుని’గా చేసేసుకున్నారు.

బైబిల్లో పేర్కొనబడిన సృష్టికర్త, ‘వివరించలేనప్పుడు ప్రస్తావించబడే దేవుడు’ కాదు. బదులుగా, ఆయన చేసిన కార్యాల్లో సృష్టికి సంబంధించిన అన్ని దశలు, అంశాలు, గుణాలు ఇమిడివున్నాయి. అన్ని విషయాలు ఇమిడివున్న ఆ సృష్టి కార్యాన్ని గురించి కీర్తనకర్త ఇలా నొక్కిచెప్పాడు: “నీయొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము.” (కీర్తన 36:9) ఆయన “ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన” వ్యక్తిగా చక్కగా వర్ణించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 4:24; 14:15; 17:24) మంచి కారణంతోనే, మొదటి శతాబ్దంలోని ఒక బోధకుడు, దేవుడు “సమస్తమును సృష్టిం[చెను]” అని రాశాడు.—ఎఫెసీయులు 3:8.

అంతేకాక, ద్రవ్యరాశిని, శక్తిని నిర్దేశించే భౌతిక నియమాలైన “ఆకాశమండలపు కట్టడలను” దేవుడే స్థాపించాడు, ఆ నియమాలను శాస్త్రజ్ఞులు ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు. (యోబు 38:33) ఆయన రూపకల్పన సంపూర్ణమైనది, అది సంకల్పంతో చేయబడింది. సంభ్రమాశ్చర్యాలను కలిగించే వివిధ రకాల ప్రాణులు నివసించాలనే ఉద్దేశంతో ఆయన భూమిని సృష్టించాడు, ఆ రూపకల్పన ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చింది.

రూపకల్పన మరియు ఇంగితజ్ఞానం

చివరిగా, మనం ఇంగితజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నను పరిశీలిద్దాం. వివిధ విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాల విశ్వసనీయత గురించి వ్యాఖ్యానిస్తూ విజ్ఞానశాస్త్ర రచయిత అయిన జాన్‌ హోర్గన్‌ ఇలా అన్నాడు: “రుజువు స్పష్టంగా లేనప్పుడు, నిర్దేశం కోసం మనం ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించడానికి సిగ్గుపడకూడదు.”

ప్రాణికోటి యాదృచ్ఛికంగా లేదా ప్రకృతి శక్తుల ద్వారానే ఉనిలోకి వచ్చిందని వాదించడంలో నిజంగా అర్థముందా? పరిణామ సిద్ధాంతం సర్వత్రా ప్రసిద్ధిచెందినా, విజ్ఞానశాస్త్రజ్ఞులతోసహా చాలామంది తెలివైనవారికి, జ్ఞానవంతుడైన సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం కుదిరింది. సాధారణ ప్రజానీకం “ప్రాణికోటి రూపొందించబడిందని గట్టిగా, తెలివిగా, నమ్ముతోంది.” ఎందుకు? చాలామంది అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలతో వెంటనే ఏకీభవిస్తారు: “ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును.” (హెబ్రీయులు 3:3) ఆ తర్వాత పౌలు హేతుబద్ధమైన ఈ నిర్ధారణను తెలియజేస్తున్నాడు: “సమస్తమును కట్టినవాడు దేవుడే.” బైబిల్లో పేర్కొన్నట్లు, ఒక ఇంటికి రూపకర్త, నిర్మాణకుడు అవసరమని అంగీకరించి, అదే సమయంలో ఒక సంక్లిష్టమైన జీవకణం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చిందని వాదించడంలో అర్థమే లేదు.

రూపకర్త, సృష్టికర్త ఉనికిని తిరస్కరించేవారి గురించి బైబిలు ఈ విధంగా చెబుతోంది: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.” (కీర్తన 14:1) ఇక్కడ, సృష్టికర్తపట్ల ఇప్పటికీ నమ్మకం కుదరనివారిని కీర్తనకర్త గద్దిస్తున్నాడు. ఒక వ్యక్తి నిష్పక్షపాత ధోరణినిబట్టి కాక వ్యక్తిగత అభిప్రాయాన్నిబట్టి ఒక నిర్ధారణకు రావచ్చు. అయితే, జ్ఞానవంతమైన, వివేచనగల వ్యక్తి సృష్టికర్త ఉనికిని వినయంగా గుర్తిస్తాడు.—యెషయా 45:18.

సర్వోన్నత రూపకర్త ఉన్నాడని చూపించే రుజువులు ఆలోచనాపరులైన చాలామందికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మీరు రూపకర్తను తెలుసుకోవచ్చు

మనం రూపొందించబడ్డామని నమ్ముతున్నట్లైతే, అసలు మనమెందుకు రూపొందించబడ్డాం? మన జీవిత సంకల్పమేమిటి? అలాంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు కేవలం విజ్ఞానశాస్త్రం మాత్రమే ఇవ్వలేకపోతుంది. అయితే ఈ ప్రాథమిక అంశాల మీద నమ్మకం కలుగజేసే, సంతృప్తికరమైన సమాధానాలు అవసరం. ఈ విషయంలో బైబిలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అది యెహోవాను సృష్టికర్తగానే కాక, సంకల్పకర్తగా, ఏది చేసినా సహేతుకమైన కారణాలతో చేసే వ్యక్తిగా వివరిస్తోంది. లేఖనాలు, మానవజాతిపట్ల దేవునికున్న సంకల్పాన్ని వెల్లడిచేస్తూ మనకొక భవిష్యత్తును, నిరీక్షణను ఇస్తున్నాయి.

ఇంతకీ, యెహోవా ఎవరు? ఆయనెలాంటి దేవుడు? నైపుణ్యవంతుడైన మన రూపకర్తను నిజమైన వ్యక్తిగా తెలుసుకోమని యెహోవాసాక్షులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు ఆయన నామం గురించి, ఆయన లక్షణాల గురించి, మానవజాతితో ఆయన వ్యవహరించిన తీరు గురించి తెలుసుకోవచ్చు. మనమాయన అద్భుతమైన రూపకల్పనను చూసి కేవలం ఆశ్చర్యపోవడమే కాక, రూపకర్తగా ఆయనను ఎందుకు మహిమపర్చాలో కూడా మీరు ఆయన వాక్యమైన బైబిలు ద్వారా గ్రహిస్తారు.—కీర్తన 86:12; ప్రకటన 4:10.

[4వ పేజీలోని చిత్రం]

మైకేలేంజెలో

[5వ పేజీలోని చిత్రం]

రూపకర్త ఉన్నాడనే నమ్మకం నిజమైన విజ్ఞానశాస్త్రానికి అనుగుణంగా ఉంది

[6వ పేజీలోని చిత్రం]

సృష్టిలో కనిపించే వైవిధ్యం, ప్రాణులు పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం తెలివైన రూపకల్పనలో వైవిధ్యం ఉందని రుజువు చేస్తున్నాయి

[7వ పేజీలోని చిత్రాలు]

రూపకల్పనకు రూపకర్త అవసరం