కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి

“మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.”—1 కొరింథీయులు 16:14.

బిడ్డ జన్మించడం జీవితంలోని అత్యంత ఆనందకరమైన సంఘటన అని చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఆలీయా అనే ఓ తల్లి, “అప్పుడే జన్మించిన మా పాపను నేను మొదటిసారి చూసినప్పుడు ఎంతో ఉప్పొంగిపోయాను. మా పాపే అందరికన్నా ముద్దుగా ఉందని నాకనిపించింది” అని చెబుతోంది. అయితే అలాంటి ఆనందకరమైన సందర్భం తల్లిదండ్రులకు చింతను కూడా కలిగించవచ్చు. “జీవిత పరీక్షలకు మా పాపను నేను సరైనవిధంగా సిద్ధం చేయగలనా లేదా అని నేను ఆందోళనపడ్డాను” అని ఆలీయా భర్త అంటున్నాడు. చాలామంది తల్లిదండ్రులకు అలాంటి చింత ఉంటుంది, అంతేకాక, వారు తమ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వాల్సిన అవసరతను కూడా గుర్తిస్తారు. అయితే అలాంటి ప్రేమపూర్వక శిక్షణనివ్వాలని కోరుకునే క్రైస్తవ తల్లిదండ్రులు సవాళ్లనెదుర్కొంటారు. వాటిలో కొన్ని ఏమిటి?

2 మనమిప్పుడు ఈ విధానపు అంత్యదినాల చివర్లో జీవిస్తున్నాం. ప్రవచించబడినట్లే, సమాజంలో ప్రేమరహిత స్వభావం ప్రబలంగావుంది. కుటుంబ సభ్యుల్లో సహితం ‘అనురాగం’ కొరవడడమే కాక, వారు ‘కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా, అజితేంద్రియులుగా, క్రూరులుగా’ తయారయ్యారు. (2 తిమోతి 3:1-5) అలాంటి లక్షణాలను కనబరిచే ప్రజలతో ప్రతీరోజు గడపడం, క్రైస్తవ కుటుంబ సభ్యుల పరస్పర వ్యవహార విధానంపై ప్రభావం చూపించవచ్చు. అంతేకాక, ఆశానిగ్రహం కోల్పోవడం, అనుకోకుండానే హానికరంగా మాట్లాడడం, సరైన వివేచన ఉపయోగించకపోవడం వంటి తమ సొంత వారసత్వ స్వభావంతో తల్లిదండ్రులు పోరాడుతుంటారు.—రోమీయులు 3:23; యాకోబు 3:2, 8, 9.

3 ఈ సవాళ్లున్నా, పిల్లలు ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండేలా తల్లిదండ్రులు వారిని పెంచవచ్చు. ఎలా? “మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి” అనే బైబిలు సలహాను అనుసరించడం ద్వారా అలా చేయవచ్చు. (1 కొరింథీయులు 16:14) అవును, ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైనది.” (కొలొస్సయులు 3:14) కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు వర్ణించిన ప్రేమకు సంబంధించిన మూడు అంశాలను పరిశీలించి, తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణనిస్తుండగా ఈ లక్షణాన్ని వారు అన్వయించుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన మార్గాలను మనం చర్చిద్దాం.—1 కొరింథీయులు 13:4-8.

దీర్ఘశాంతం చూపించాలి

4 పౌలు ఇలా వ్రాశాడు: ‘ప్రేమ దీర్ఘశాంతం చూపించును.’ (1 కొరింథీయులు 13:4, NW) ‘దీర్ఘశాంతం చూపించడం’ అని అనువదించబడిన గ్రీకు పదం ఓపికను, కోపగించడంలో నిదానించడాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులు ఎందుకు దీర్ఘశాంతం చూపించాలి? చాలామంది తల్లిదండ్రులు నిస్సందేహంగా అనేక కారణాల గురించి ఆలోచించవచ్చు. కేవలం కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. పిల్లలు తాము కావాలనుకున్న దానికోసం కేవలం ఒక్కసారి అడిగి ఊరుకోరు. తల్లిదండ్రులు స్థిరంగా దానికి లేదు/వద్దు అని చెప్పినా, చివరకు వారు ఒప్పుకుంటారనే ఆశతో పిల్లవాడు పదేపదే దానికోసం అడగవచ్చు. టీనేజి పిల్లలు తాము చేయాలనుకుంటున్న ఒక పని చేయడానికి తమను అనుమతించాలని కోరుతూ చాలాసేపు వాదించవచ్చు, అది అవివేకమైన పని అని తల్లిదండ్రులకు తెలుసు. (సామెతలు 22:15) మనందరిలాగే పిల్లలు కూడా తాము చేసిన తప్పుల్లో కొన్ని మళ్లీమళ్లీ చేస్తూనే ఉంటారు.—కీర్తన 130:3.

5 తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల దీర్ఘశాంతాన్ని, ఓపికను చూపించేందుకు వారికి ఏమి సహాయం చేయగలదు? రాజైన సొలొమోను ఇలా వ్రాశాడు: “ఒకని సుబుద్ధి [‘వివేచన,’ NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును.” (సామెతలు 19:11) తాముకూడా ఒకప్పుడు ‘పిల్లవానివలే మాటలాడితిమని, పిల్లవానివలే తలంచితిమని, పిల్లవానివలే యోచించితిమని’ గుర్తు తెచ్చుకోవడం ద్వారా తమ పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు. (1 కొరింథీయులు 13:11) తల్లిదండ్రులారా, చిన్నతనంలో మీరు కోరింది ఇవ్వాలని మీ తల్లిని లేదా తండ్రిని పోరుపెట్టడం గుర్తు చేసుకోగలరా? టీనేజి పిల్లవానిగా, మీరెప్పుడైనా మీ తల్లిదండ్రులు మీ భావాలను లేదా సమస్యలను ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదన్నట్లు తలంచారా? అలాగైతే, మీ పిల్లలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, వారికెందుకు తదేకంగా, ఓపికగా మీ నిర్ణయాలను క్రమంగా జ్ఞాపకం చేయాలో మీరు గ్రహించవచ్చు. (కొలొస్సయులు 4:6) యెహోవా తన నియమాలను పిల్లలకు ‘అభ్యసింపజేయాలని’ ఇశ్రాయేలీయులైన తల్లిదండ్రులకు చెప్పాడనేది గమనార్హం. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) ‘అభ్యసింపజేయడం’ అనే హీబ్రూ పదానికి “పునరుక్తించడం,” “మళ్లీమళ్లీ చెప్పడం,” “ముద్రవేయడం” అనే అర్థాలున్నాయి. ఇవి పిల్లవాడు దేవుని నియమాల్ని అన్వయించుకోవడం నేర్చుకునేందుకు, తల్లిదండ్రులు చెప్పిన విషయాల్నే పదేపదే చెప్పాల్సి ఉంటుందని సూచిస్తాయి. జీవితంలో ఇతర పాఠాలను బోధించేందుకు తరచూ అలాంటి పునరుక్తి అవసరమౌతుంది.

6 అయితే దీర్ఘశాంతం చూపించే తల్లిదండ్రులు అతి సౌమ్యతను ప్రదర్శించరు. దేవుని వాక్యమిలా హెచ్చరిస్తోంది: “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” అలా జరగకుండా ఉండాలంటే, ఆ సామెతే ఇలా చెబుతోంది: “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును.” (సామెతలు 29:15) కొన్నిసార్లు, పిల్లలు తమను గద్దించే హక్కు తల్లిదండ్రులకు లేదని భావిస్తారు. అయితే నియమాలు విధించే తల్లిదండ్రుల హక్కు కొంతమేర పిల్లల ఆమోదంపై ఆధారపడి ఉందన్నట్లు క్రైస్తవ కుటుంబాలు ప్రజాతంత్ర విధానంలో నడిపించబడకూడదు. బదులుగా, కుటుంబ పరమాధికారియైన యెహోవా, తమ పిల్లలకు ప్రేమతో శిక్షణనిస్తూ వారిని క్రమశిక్షణలో పెట్టే అధికారాన్ని తల్లిదండ్రులకిచ్చాడు. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 3:15; 6:1-4) నిజానికి, ఈ క్రమశిక్షణకూ, ప్రేమకు సంబంధించి పౌలు పేర్కొన్న మరో అంశానికీ దగ్గరి సంబంధముంది.

ప్రేమతో క్రమశిక్షణలో పెట్టే విధానం

7 “ప్రేమ . . . దయ చూపించును” అని పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 13:4) నిజంగా ప్రేమగల తల్లిదండ్రులు పొందికైన విధంగా తమ పిల్లలను క్రమశిక్షణలో పెడతారు. అలాచేయడంలో వారు యెహోవాను అనుకరిస్తారు. ‘యెహోవా తాను ప్రేమించువానిని క్రమశిక్షణలో పెట్టును’ అని పౌలు వ్రాశాడు. బైబిల్లో పేర్కొనబడిన క్రమశిక్షణ కేవలం దండించడాన్ని సూచించడం లేదని దయచేసి గమనించండి. దానిలో శిక్షణ, విద్య ఉన్నాయనే భావముంది. అలాంటి క్రమశిక్షణ ఉద్దేశమేమిటి? “దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” అని పౌలు చెబుతున్నాడు. (హెబ్రీయులు 12:6, 11, NW) తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని చిత్తానుసారంగా విద్యాబుద్ధులు నేర్పించినప్పుడు, వారు సమాధానకరమైన, యథార్థవంతులైన పెద్దవారిగా తయారయ్యే అవకాశమిస్తారు. పిల్లలు ‘యెహోవా క్రమశిక్షణను’ అంగీకరించినప్పుడు, వారు వెండి బంగారాలకన్నా మరెంతో విలువైన ఆస్తిని అంటే జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, వివేచనను సంపాదించుకుంటారు.—సామెతలు 3:11-18.

8 మరోవైపు, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టకపోవడం వారిలో ప్రేమలేదని చూపిస్తుంది. యెహోవా ప్రేరణతో సొలొమోను ఇలా వ్రాశాడు: “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” (సామెతలు 13:24) పిల్లలను పొందికైన రీతిలో క్రమశిక్షణలో పెట్టకపోతే వారు స్వార్థపరులుగా, అసంతోషంగా ఉంటారు. దీనికి భిన్నంగా, సానుభూతి చూపించినా స్థిరమైన హద్దులు విధించే తల్లిదండ్రులు పెంచిన పిల్లలు తెలివిగల విద్యార్థులుగా, చక్కని సామాజిక నైపుణ్యతలతో, సాధారణంగా సంతోషం గలవారిగా ఉన్నట్లు కనుగొనబడింది. కాబట్టి, తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టే తల్లిదండ్రులు నిశ్చయంగా ప్రేమగలవారే.

9 పిల్లలను దయతో, ప్రేమపూర్వకంగా క్రమశిక్షణలో పెట్టడంలో ఏమి ఇమిడివుంది? పిల్లల నుండి ఖచ్చితంగా ఏమి ఆశించబడుతుందో తల్లిదండ్రులు వారితో చర్చించాలి. ఉదాహరణకు, క్రైస్తవ తల్లిదండ్రులుగల పిల్లలకు వారి చిన్నతనం నుండే ప్రాథమిక బైబిలు సూత్రాలతోపాటు సత్యారాధనకు సంబంధించిన వివిధ అంశాల్లో భాగం వహించడం కూడా నేర్పించబడుతుంది. (నిర్గమకాండము 20:12-17; మత్తయి 22:37-40; 28:19; హెబ్రీయులు 10:24, 25) వీటిలో ఏ మార్పూ చేయడానికి వీలులేదని పిల్లలు తెలుసుకోవాలి.

10 అయితే కొన్నిసార్లు, ఇంట్లో విధించబడే నియమాలు రూపొందిస్తున్నప్పుడు ఆ చర్చలో పిల్లలను కూడా చేర్చాలని తల్లిదండ్రులు కోరుకోవచ్చు. ఇంట్లో విధించబడే నియమాలకు సంబంధించిన చర్చల్లో యౌవనులు కూడా భాగం వహించగలిగితే, వారు ఆ నియమాలకు లోబడేందుకు మరింత మొగ్గు చూపించవచ్చు. ఉదాహరణకు, పిల్లలు ఫలానా సమయానికి ఇంట్లో ఉండాలని తల్లిదండ్రులు నిర్ణయించాలనుకుంటే, పిల్లలు ఇంట్లో ఉండాల్సిన నిర్దిష్టమైన సమయాన్ని వారు ఎంచుకోవచ్చు. లేదా ప్రత్యామ్నాయంగా, పిల్లలకు అనుకూలమైన సమయాన్ని వారినే సూచించమని, ఆ సమయాన్నే వారెందుకు ఇష్టపడుతున్నారో చెప్పేందుకు పిల్లలను అనుమతించవచ్చు. ఆ తర్వాత తల్లిదండ్రులు తామిష్టపడే సమయం చెప్పి అదెందుకు సముచితమైనదని తాము భావిస్తున్నారో వారికి వివరించవచ్చు. సాధారణంగా ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు, ఒకవేళ అలాగే జరిగితే అప్పుడేమిటి? బైబిలు సూత్రాలకు భంగం వాటిల్లకపోతే, తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల అభీష్టం మేరకే సమయాన్ని నిర్ణయించవచ్చు. అంటే తల్లిదండ్రులు తమ అధికారాన్ని కోల్పోయారని అర్థమా?

11 ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు యెహోవా, లోతుతో ఆయన కుటుంబంతో వ్యవహరించినప్పుడు ప్రేమపూర్వకంగా తన అధికారాన్ని ఉపయోగించిన తీరును పరిశీలించండి. లోతును, ఆయన భార్యను, కూతుర్లను సొదొమ వెలుపలికి తీసుకెళ్లిన తర్వాత దేవదూతలు వారితో ఇలా అన్నారు: “నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్ము.” దానికి లోతు, “ప్రభువా ఆలాగు కాదు” అని జవాబిచ్చాడు. లోతు ఆ తర్వాత ఇలా ప్రత్యామ్నాయం సూచించాడు, “ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము.” యెహోవా ఎలా స్పందించాడు? “ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని” అని ఆయనన్నాడు. (ఆదికాండము 19:17-22) యెహోవా తన అధికారాన్ని కోల్పోయాడా? లేదు! అయితే ఆయన లోతు విన్నపాన్ని మన్నించి ఆ విషయంలో ఆయనకు అదనంగా దయచూపించేందుకు ఎంచుకున్నాడు. మీరు తల్లిదండ్రుల్లో ఒకరైతే ఇంట్లో నియమాలు విధించేటప్పుడు మీ పిల్లల విన్నపాలను పరిగణలోకి తీసుకోగల సమయాలున్నాయా?

12 పిల్లలకు నియమాలు విధించడమే కాక, ఆ నియమాలను ఉల్లంఘిస్తే ఇవ్వబడే శిక్షేమిటో కూడా తెలియజేయాలి. పిల్లలతో ఆ శిక్షల గురించి చర్చించి వారు వాటిని అర్థం చేసుకున్న తర్వాతే ఆ నియమాలను అమలుచేయాలి. లభించే శిక్ష గురించి పిల్లలను తదేకంగా హెచ్చరిస్తూ, ఆ శిక్షను అమలు చేయకపోతే తల్లిదండ్రులు ప్రేమ చూపించనట్లే అవుతుంది. “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 8:11) నిజమే, పిల్లలకు అవమానం జరగకుండా ఉండేందుకు తల్లి/తండ్రి అందరిముందు లేదా పిల్లల స్నేహితుల ముందు వారిని శిక్షించకపోవచ్చు. శిక్ష విషయంలో కూడా తల్లి/తండ్రి మాట “అవునంటే” అవును అన్నట్టుగా, “కాదంటే” కాదు అన్నట్టుగా ఉంటాయని తెలుసుకున్నప్పుడు పిల్లలు తాము మరింత సురక్షితంగా ఉన్నట్లు భావిస్తూ, తమ తల్లిదండ్రులపట్ల మరింత గౌరవాన్ని, ప్రేమను వృద్ధిచేసుకుంటారు.—మత్తయి 5:37.

13 శిక్ష ప్రేమపూర్వకంగా ఉండాలంటే, ఆ శిక్షను, దాని తీరును పిల్లలకు తగ్గట్టుగా మలుచుకోవాలి. “క్రమశిక్షణ విషయానికొస్తే మా ఇద్దరి పిల్లలకు తేడావుంది. ఒకరి విషయంలో పనిచేసేది మరొకరి విషయంలో పనిచేయదు” అని పామ్‌ గుర్తు చేసుకుంటోంది. ఆమె భర్త లారీ ఇలా వివరిస్తున్నాడు: “మా పెద్దమ్మాయి తాను చేయాలనుకున్నది చేసి తీరుతుంది, క్రమశిక్షణ తీవ్రంగా ఉన్నప్పుడే స్పందిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ మా చిన్నమ్మాయిని కేవలం గద్దిస్తే చాలు, చివరికి కోపంగా చూసినా చాలు.” అవును, ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతీ ఒక్కరికి ఏ విధమైన క్రమశిక్షణ సరిపోతుందో గ్రహించేందుకు కృషిచేస్తారు.

14 ఈ విషయంలో యెహోవా తల్లిదండ్రులకు మాదిరిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు తన సేవకుల్లో ప్రతీ ఒక్కరి బలాలు, బలహీనతలు తెలుసు. (హెబ్రీయులు 4:13) అంతేకాక, యెహోవా శిక్ష అమలు చేసేటప్పుడు అత్యంత కఠినంగా ఉండడు లేక మరీ చూసీచూడనట్లూ విడిచిపెట్టడు. బదులుగా ఆయన అన్ని సందర్భాల్లో తన ప్రజలను ‘మితముగా శిక్షిస్తాడు.’ (యిర్మీయా 30:11) తల్లిదండ్రులారా, మీ పిల్లల బలాలు, బలహీనతలు మీకు తెలుసా? మీ పిల్లలకు శిక్షణనివ్వడంలో ఆ జ్ఞానాన్ని సమర్థవంతంగా, ప్రేమపూర్వకంగా ఉపయోగించగలుగుతున్నారా? అలాగైతే, మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారని నిరూపిస్తున్నారు.

నిజాయితీగా సంభాషించడాన్ని ప్రోత్సహించండి

15 ప్రేమకున్న మరో అంశం ఏమిటంటే, అది “దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.” (1 కొరింథీయులు 13:6) పిల్లలు సరైనదానిని, సత్యాన్ని ప్రేమించేలా తల్లిదండ్రులు వారికెలా శిక్షణనివ్వవచ్చు? ఒక ప్రాముఖ్యమైన చర్య ఏమిటంటే, పిల్లలు చెప్పేది అంగీకరించడానికి తల్లిదండ్రులకు కష్టమైనా, తమ భావాలను నిజాయితీగా వ్యక్తపర్చమని వారిని ప్రోత్సహించడం. పిల్లలు తమ తలంపులను, భావాలను నీతి ప్రమాణాలకు అనుగుణంగా వ్యక్తపర్చినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారనేది అర్థం చేసుకోదగినదే. అయితే కొన్నిసార్లు, పిల్లల హృదయపూర్వక మాటలు దుర్నీతిపట్ల వారి మొగ్గును వెల్లడిచేయవచ్చు. (ఆదికాండము 8:21) తల్లిదండ్రులు ఎలా స్పందించాలి? అలాంటి తలంపులను వ్యక్తపర్చినందుకు వెంటనే పిల్లలను గద్దించాలని మొదట అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు అలా స్పందిస్తే, త్వరలోనే పిల్లలు తల్లిదండ్రులు వినేందుకు ఇష్టపడతారని తామనుకున్నవి మాత్రమే చెప్పేందుకు నేర్చుకుంటారు. నిజమే, అమర్యాదగా మాట్లాడడాన్ని వెంటనే సరిదిద్దాలి, అయితే పిల్లలకు మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్పించడానికి, వారు ఏమి చెప్పాలో ఆదేశించడానికి మధ్య తేడావుంది.

16 నిజాయితీగా సంభాషించడాన్ని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించవచ్చు? ముందు ప్రస్తావించబడిన ఆలీయా ఇలా చెబుతోంది: “మమ్మల్ని కలతపెట్టే విషయాలను పిల్లలు మాకు చెప్పినప్పుడు అతిగా స్పందించకుండా ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా వారు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాం.” టామ్‌ అనే ఓ తండ్రి ఇలా చెబుతున్నాడు: “మా అమ్మాయి మా ఆలోచనా విధానాన్ని అంగీకరించకపోయినా మనసువిప్పి మాతో మాట్లాడేలా మేము ఆమెను ప్రోత్సహించాం. ఆమెను మాట్లాడనివ్వకుండా ఎల్లప్పుడూ మా ఇష్టాన్నే బలవంతంగా ఆమెపై రుద్దితే, ఆమె విసిగిపోయి తన మనసులో నిజంగా ఏముందో చెప్పకుండా ఉండడం నేర్చుకుంటుందని మేమనుకున్నాం. మరోవైపున, ఆమె చెప్పేది వినడం, మేము చెప్పినప్పుడు వినేందుకు ఆమెను ప్రోత్సహించింది.” పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాల్సిందే. (సామెతలు 6:20) అయితే అరమరికల్లేని సంభాషణ, పిల్లలు తమ తార్కిక సామర్థ్యాన్ని వృద్ధిచేసుకునేలా సహాయపడే అవకాశాన్ని తల్లిదండ్రులకిస్తుంది. నలుగురు పిల్లల తండ్రి విన్సెంట్‌ ఇలా చెబుతున్నాడు: “పిల్లలు స్వయంగా ఏది శ్రేష్ఠమైనదో తెలుసుకోగల్గేలా ఒకానొక పరిస్థితికున్న ప్రయోజనాల గురించి, నష్టాల గురించి మేము తరచూ మాట్లాడతాం. ఆలోచనా సామర్థ్యాన్ని వృద్ధిచేసుకునేందుకు ఇది వారికి సహాయపడింది.”—సామెతలు 1:1-4.

17 నిజమే, పిల్లలను పెంచే విషయంలో ఏ తల్లి/తండ్రి పరిపూర్ణంగా బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోలేరు. అయినప్పటికీ, దీర్ఘశాంతం, దయ, ప్రేమలతో పిల్లలకు శిక్షణనివ్వాలనే మీ ప్రయత్నాలపట్ల వారు ప్రగాఢ కృతజ్ఞతను కలిగివుంటారని మీరు నిశ్చయతతో ఉండవచ్చు. అలా చేయాలనే మీ ప్రయత్నాలను యెహోవా నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. (సామెతలు 3:33) నిజానికి, క్రైస్తవ తల్లిదండ్రులందరూ తాము యెహోవాను ఎంతగా ప్రేమిస్తున్నారో తమ పిల్లలు కూడా యెహోవాను అంతగా ప్రేమించడం నేర్చుకోవాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు ఈ చక్కని లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు? తర్వాతి ఆర్టికల్‌ కొన్ని నిర్దిష్ట విధానాలను చర్చిస్తుంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• తల్లి/తండ్రి వివేచన ప్రదర్శించడం దీర్ఘశాంతం చూపించేందుకు ఎలా సహాయం చేస్తుంది?

• ప్రేమ, క్రమశిక్షణ ఎలా పరస్పర సంబంధం కలిగివున్నాయి?

• తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య నిజాయితీతో కూడిన సంభాషణ ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

1. బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటి భావాలు కలుగుతాయి?

2. తల్లిదండ్రులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు?

3. పిల్లలు ఆనందంగా ఉండేలా తల్లిదండ్రులు వారినెలా పెంచవచ్చు?

4. తల్లిదండ్రులు ఎందుకు దీర్ఘశాంతం చూపించాలి?

5. దీర్ఘశాంతం చూపించేందుకు తల్లిదండ్రులకు ఏది సహాయం చేస్తుంది?

6. దీర్ఘశాంతం చూపించే తల్లిదండ్రులు ఎందుకు అతి సౌమ్యతను ప్రదర్శించరు?

7. ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు క్రమశిక్షణలో పెడతారు, అలాంటి క్రమశిక్షణలో ఏమి ఇమిడివుంది?

8. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టకపోతే ఫలితాలు సాధారణంగా ఎలావుంటాయి?

9. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి నేర్పిస్తారు, ఈ అవసరతల్ని ఎలా దృష్టించాలి?

10, 11. ఇంట్లో ఏవైనా నియమాలు విధించేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల విన్నపాల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవచ్చు?

12. పిల్లలు తాము సురక్షితంగావున్నట్లు భావించేందుకు వారికి ఏమి సహాయం చేస్తుంది?

13, 14. తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణనిచ్చేటప్పుడు యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

15, 16. నిజాయితీగా మాట్లాడేలా తల్లిదండ్రులు తమ పిల్లలనెలా ప్రోత్సహించవచ్చు, ఈ విషయంలో ఏ విధానం ఫలవంతంగా ఉన్నట్లు క్రైస్తవ తల్లిదండ్రులు కనుగొన్నారు?

17. ఏ విషయంలో తల్లిదండ్రులు నిశ్చయతతో ఉండవచ్చు?

[23వ పేజీలోని చిత్రాలు]

తల్లిదండ్రులారా, పిల్లలుగా ఉండడమెలా ఉంటుందో మీరు గుర్తుచేసుకోగలరా?

[24వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలు మీతో నిజాయితీగా, స్వేచ్ఛగా సంభాషించడాన్ని మీరు ప్రోత్సహిస్తారా?