కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మనకు బోధ కలుగడానికి వ్రాయబడ్డాయి’

‘మనకు బోధ కలుగడానికి వ్రాయబడ్డాయి’

‘మనకు బోధ కలుగడానికి వ్రాయబడ్డాయి’

“పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు.” (ప్రసంగి 12:12) నేడు అందుబాటులోవున్న విస్తృతమైన ముద్రిత సమాచారం, ఆ మాటలు వ్రాయబడినప్పుడు ఎంత నిజమో నేడు కూడా అంతే నిజమని నిరూపిస్తోంది. కానీ, వివేచనగల పాఠకుడు ఏది చదవదగినదో ఎలా నిర్ణయించుకోవచ్చు?

పాఠకుల్లో అనేకులు తాము ఎంచుకున్న పుస్తకాన్ని చదివేముందు, ఆ పుస్తక రచయిత గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటారు. ప్రచురణకర్తలు రచయిత సొంత ఊరి పేరును, అతని చదువుకు సంబంధించిన వివరాలను, ప్రచురించబడిన అతని రచనలను చిన్న పేరాలో పొందుపర్చవచ్చు. రచయిత ఎవరనేది ప్రాముఖ్యం. ఆ విషయం, తొలి శతాబ్దాల్లో, స్త్రీ రచించిన పుస్తకమని పాఠకులు చిన్నచూపు చూడకూడదని రచయిత్రులు మగవారి పేర్లతో రచనలు చేసేవారనే వాస్తవాన్ని బట్టి స్పష్టమవుతోంది.

విచారకరంగా, ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడినట్లుగా, హెబ్రీ లేఖనాలను కొందరు తిరస్కరించడానికి కారణమేమిటంటే, వాటిలో వర్ణించబడిన దేవుడు తన శత్రువులను కనికరం లేకుండా నాశనం చేసే క్రూరమైన దేవుడని వారు నమ్ముతారు. * బైబిలు గ్రంథకర్త గురించి హెబ్రీ లేఖనాలు, క్రైస్తవ గ్రీకు లేఖనాలు స్వయంగా ఏమి చెబుతున్నాయో మనం చూద్దాం.

గ్రంథకర్త గురించి

హెబ్రీ లేఖనాల ప్రకారం, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిలా చెప్పాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:6) దాదాపు 500 సంవత్సరాల తర్వాత బైబిలు రచయిత అయిన యాకోబు దేవుని గురించి ఇలా వ్రాశాడు: “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” (యాకోబు 1:17) అయితే, హెబ్రీ లేఖనాల్లో బయల్పర్చబడిన దేవునికి, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని దేవునికి వ్యత్యాసముందని కొందరెందుకు అనుకుంటున్నారు?

దానికి జవాబేమిటంటే, దేవుని వ్యక్తిత్వానికి సంబంధించిన వివిధ అంశాలు బైబిల్లోని వేర్వేరు భాగాల్లో తెలియజేయబడ్డాయి. ఒక్క ఆదికాండము పుస్తకంలోనే ఆయన ‘తన హృదయములో నొచ్చుకొనేవాడు’ అనీ, ‘ఆకాశమునకు భూమికి సృష్టికర్త’ అనీ, ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు’ అనీ వర్ణించబడ్డాడు. (ఆదికాండము 6:6; 14:22; 18:25) ఈ వేర్వేరు వర్ణనలు ఒకే దేవుణ్ణి సూచిస్తున్నాయా? నిస్సందేహంగా సూచిస్తున్నాయి.

ఉదాహరణకు: స్థానిక న్యాయమూర్తి ఎదుట కోర్టులో హాజరైన ముద్దాయిలకు ఆయన చట్టానికి స్థిరంగా కట్టుబడే వ్యక్తి అని బాగా తెలిసివుండవచ్చు. మరోవైపు, ఆయన పిల్లలకు ఆయన ప్రేమ, ఉదారత కనబర్చే తండ్రిగా తెలిసివుండవచ్చు. ఆయన సన్నిహిత స్నేహితులు ఆయనను హాస్యచతురతవున్న, స్నేహశీలుడిగా దృష్టించవచ్చు. న్యాయమూర్తి, తండ్రి, స్నేహితుడు, ఈ ముగ్గురూ ఒకే వ్యక్తి. అయితే ఆయా పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వంలోని వివిధాంశాలు స్పష్టంగా కనబడతాయి.

అదే విధంగా, హెబ్రీ లేఖనాలు యెహోవాను ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడిగా’ వర్ణిస్తున్నాయి. అయితే, ‘ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడని’ కూడా మనం తెలుసుకుంటాం. (నిర్గమకాండము 34:6, 7) ఆ రెండు అంశాలు దేవుని పేరుకున్న అర్థాన్ని తెలియజేస్తున్నాయి. “యెహోవా” అనే మాటకు అక్షరార్థంగా “తానే కర్త అవుతాడు” అని అర్థం. అంటే, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఏది అవసరమైతే అది అవుతాడు. (నిర్గమకాండము 3:13-15) కాని ఆయన మాత్రం మార్పులేకుండా అదే దేవునిగా ఉంటాడు. యేసు ఇలా చెప్పాడు: ‘మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా.’—మార్కు 12:29.

హెబ్రీ లేఖనాల స్థానంలో వేరేవి వచ్చాయా?

క్రొత్త పరిశోధనలు అందుబాటులోకి వచ్చినప్పుడు లేదా ప్రజల అభిప్రాయం మారినప్పుడు పాఠ్యపుస్తకాలను మార్చడం నేడు క్రొత్తేమీ కాదు. అదే విధంగా, హెబ్రీ లేఖనాల స్థానంలో క్రైస్తవ గ్రీకు లేఖనాలు వచ్చాయా? లేదు.

హెబ్రీ లేఖనాల స్థానంలో తన పరిచర్య వృత్తాంతాలు, తన శిష్యుల వ్రాతలు రావాలని యేసు ఉద్దేశించినట్లయితే, ఆయన దానిని తప్పకుండా తెలియజేసివుండేవాడు. అయితే, యేసు పరలోకానికి ఆరోహణమవడానికి ముందు ఆయన గురించి లూకా వృత్తాంతం ఇలా చెబుతోంది: “మోషేయు [హెబ్రీ లేఖనాల్లోని] సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము [తన శిష్యుల్లో ఇద్దరికి] తెలిపెను.” ఆ తర్వాత యేసు తన నమ్మకమైన అపొస్తలులకు, ఇతరులకు కనిపించాడు. ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “అంతట ఆయన—మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.” (లూకా 24:27, 44) హెబ్రీ లేఖనాలు కాలం చెల్లినవైతే, యేసు తన భూ పరిచర్య ముగింపులో ఇంకా ఎందుకు వాటిలోనుండే ఉల్లేఖిస్తాడు?

క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత యేసు అనుచరులు, ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలను, విలువైన పాఠాలు నేర్పించిన మోషే ధర్మశాస్త్రంలోని సూత్రాలను, క్రైస్తవులు నమ్మకంగా ఉండడాన్ని ప్రోత్సహించే చక్కని మాదిరిగల దేవుని ప్రాచీన సేవకుల వృత్తాంతాలను నొక్కిచెప్పేందుకు హెబ్రీ లేఖనాలను ఉపయోగించడం కొనసాగించారు. (అపొస్తలుల కార్యములు 2:16-21; 1 కొరింథీయులు 9:9, 10; హెబ్రీయులు 11:1-12:1) అపొస్తలుడైన పౌలు, ఇలా వ్రాశాడు: ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది, ప్రయోజనకరమైనది.’ * (2 తిమోతి 3:16) హెబ్రీ లేఖనాలు నేడెలా ప్రయోజనకరంగా ఉన్నాయి?

అనుదిన జీవితానికి సలహాలు

జాతి వివక్ష అనే ప్రస్తుతదిన సమస్యనే పరిశీలించండి. తూర్పు ఐరోపాలోని ఒక నగరంలో, 21 సంవత్సరాల వయసున్న ఇతియోపీయుడైన ఒక వ్యక్తి ఇలా చెబుతున్నాడు: “మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఒక గుంపుగానే వెళ్ళాలి. గుంపుగా ఉంటే వాళ్ళు మా మీద దాడిచేయకపోవచ్చు.” ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “సాయంకాలం 6 దాటితే బయటకు వెళ్ళలేం, ముఖ్యంగా సబ్‌వేలో. ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు మా శరీర రంగునే చూస్తారు.” హెబ్రీ లేఖనాలు ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయా?

ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.” (లేవీయకాండము 19:33, 34) అవును ప్రాచీన ఇశ్రాయేలులో ఆ నియమం ప్రకారం, వలసదారులను లేదా ‘పరదేశులను’ గౌరవించాలి, ఆ నియమం హెబ్రీ లేఖనాల్లో భద్రపర్చబడింది. ఆ ధర్మశాస్త్రంలో నిక్షిప్తం చేయబడిన సూత్రాలు, నేడు జాతి వివక్షవల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని మీరు అంగీకరించరా?

హెబ్రీ లేఖనాలు ఆర్థిక విషయాల్లో వివరణాత్మక సలహాలు ఇవ్వకపోయినా, డబ్బు విషయంలో జ్ఞానయుక్తంగా వ్యవహరించేందుకు ఆచరణాత్మకమైన సలహాలు అందులో ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు సామెతలు 22:7లో మనమిలా చదువుతాం: “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” అవివేకంగా అప్పులుచేసి వస్తువులు కొనడం, ఆర్థిక పతనానికి దారితీస్తుందని ఆర్థిక సలహాదారుల్లో అనేకులు అంగీకరిస్తున్నారు.

అంతేకాక, ఐశ్వర్యాసక్తి నిండిన నేటి లోకంలో సర్వసాధారణంగా జరుగుతున్నట్లుగా, పర్యవసానాలు ఎలా ఉన్నా సంపద కోసం ప్రాకులాడడం గురించి చరిత్రలో అత్యంత సంపన్నవంతుల్లో ఒకరైన సొలొమోను రాజు స్పష్టంగా వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియు వ్యర్థమే.” (ప్రసంగి 5:10) ఎంతటి జ్ఞానయుక్తమైన హెచ్చరికో కదా!

భావి నిరీక్షణ

బైబిలంతటిలో ఒకే ఒక మూలాంశం ఉంది: యేసుక్రీస్తు రాజుగా పరిపాలించే రాజ్యం ద్వారా దేవుడు తన సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చి తన నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు.—దానియేలు 2:44; ప్రకటన 11:15.

మనకు ఓదార్పునిచ్చి, ఆ ఓదార్పుకు మూలమైన యెహోవా దేవునికి మనల్ని సన్నిహితులను చేసే దేవుని రాజ్యంలో జీవితం గురించి హెబ్రీ లేఖనాల ద్వారానే మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు, జంతువులకు మనుష్యులకు మధ్య సమాధానం ఉంటుందని యెషయా ప్రవక్త ప్రవచించాడు: “తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును, చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.” (యెషయా 11:6-8) ఎంతటి ఉజ్జ్వలమైన ఉత్తరాపేక్షో కదా!

జాతి లేదా తెగల మధ్య వివక్ష, తీవ్ర అనారోగ్యం లేదా తమ అదుపులోలేని ఆర్థిక విషయాలు వంటి వాటి మూలంగా బాధ అనుభవిస్తున్నవారి గురించి హెబ్రీ లేఖనాలు ఏమి చెబుతున్నాయి? అవి క్రీస్తుయేసు గురించి ప్రవచనార్థకంగా ఇలా చెబుతున్నాయి: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును.” (కీర్తన 72:12, 13) అలాంటి వాగ్దానాలు ఆచరణాత్మకమైనవి, ఎందుకంటే వాటిపై విశ్వాసముంచేవారు, నిరీక్షణతో, నమ్మకంతో భవిష్యత్తును ఎదుర్కొనేందుకు అవి దోహదపడతాయి.—హెబ్రీయులు 11:6.

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడంటే అందులో ఆశ్చర్యమేమీలేదు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) అవును, హెబ్రీ లేఖనాలు దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో ఇప్పటికీ ప్రాముఖ్యమైన భాగంగానే ఉన్నాయి. అవి నేడు మనకు నిజంగా విలువైనవి. మీరు బైబిలు మొత్తం నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకునేందుకు ప్రయాసపడతారనీ, ఆ విధంగా బైబిలు గ్రంథకర్తయైన యెహోవా దేవునికి సన్నిహితులవుతారనీ మేము ఆశిస్తున్నాం.—కీర్తన 119:111, 112.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఈ ఆర్టికల్‌లో, పాత నిబంధనను హెబ్రీ లేఖనాలు అని పేర్కొంటున్నాం. (6వ పేజీలో ఉన్న “పాత నిబంధనా లేక హెబ్రీ లేఖనాలా?” అనే బాక్సును చూడండి.) అదే విధంగా యెహోవాసాక్షులు, క్రొత్త నిబంధనను సాధారణంగా క్రైస్తవ గ్రీకు లేఖనాలని పేర్కొంటారు.

^ పేరా 13 హెబ్రీ లేఖనాల్లో నేడు ఎంతో విలువైనవిగా పరిగణింపడుతున్న అనేక సూత్రాలున్నాయి. అయితే, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రం క్రింద క్రైస్తవులు లేరన్న విషయాన్ని గమనించాలి.

[6వ పేజీలోని బాక్సు]

పాత నిబంధనా లేక హెబ్రీ లేఖనాలా?

“పాత నిబంధన” అనే మాట 2 కొరింథీయులు 3:14లో కనబడుతుంది. అక్కడ డయాథెకె అనే గ్రీకు పదం “నిబంధన” అని అనువదించబడింది. అయితే, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం వంటి అనేక ఆధునిక అనువాదాలు డయాథెకె అనే పదాన్ని “నిబంధన” అని కాకుండా “ఒడంబడిక” అని అనువదించాయి. ఎందుకు?

నిఘంటుకారుడైన ఎడ్వర్డ్‌ రాబిన్‌సన్‌ ఇలా చెబుతున్నాడు: “పురాతన ఒడంబడిక మోషే వ్రాసిన పుస్తకాల్లో ఉంది కాబట్టి, [డయాథెకె] నిబంధనా గ్రంథానికి, మోషే వ్రాతలకు అంటే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.” 2 కొరింథీయులు 3:14లో అపొస్తలుడైన పౌలు మోషే ధర్మశాస్త్రం గురించి ప్రస్తావించాడు, అది క్రైస్తవ పూర్వపు లేఖనాల్లో ఒక భాగం మాత్రమే.

కాబట్టి పరిశుద్ధ బైబిల్లోని మొదటి 39 పుస్తకాలను ఏమని పిలవవచ్చు? బైబిల్లోని ఈ భాగానికి కాలం చెల్లిందనీ లేదా అది పాతదైపోయిందనీ సూచించే బదులు యేసుక్రీస్తు, ఆయన అనుచరులు ఈ మూలపాఠాలను, ‘లేఖనాలు’ ‘పరిశుద్ధ లేఖనాలు’ అని పేర్కొన్నారు. (మత్తయి 21:41-42; రోమీయులు 1:1-7) కాబట్టి ఈ ప్రేరేపిత మాటలకు అనుగుణంగా యెహోవాసాక్షులు బైబిలులోని ఆ భాగం మొదట అధికశాతం హెబ్రీ భాషలో వ్రాయబడింది కాబట్టి పాత నిబంధనను హెబ్రీ లేఖనాలని పిలుస్తారు. అదే విధంగా క్రొత్త నిబంధన అని పిలవబడే దానిని గ్రీకు లేఖనాలని పిలుస్తారు, ఎందుకంటే బైబిల్లోని ఆ భాగాన్ని వ్రాసేందుకు దేవునిచేత ప్రేరేపించబడిన వారు గ్రీకు భాషను ఉపయోగించారు.

[4వ పేజీలోని చిత్రాలు]

ఒక వ్యక్తి న్యాయానికి కట్టుబడే న్యాయమూర్తిగా, ప్రేమగల తండ్రిగా, స్నేహితుడిగా అందరికీ తెలిసివుండవచ్చు

[5వ పేజీలోని చిత్రం]

యేసు తన పరిచర్యంతటిలో హెబ్రీ లేఖనాలను ఉపయోగించాడు

[7వ పేజీలోని చిత్రాలు]

సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఒక వ్యక్తికి ఏ బైబిలు సూత్రాలు సహాయపడతాయి?