కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి

“యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.”—కీర్తన 127:4.

విలుకాడు తన బాణంతో గురిని కొట్టేందుకు సిద్ధపడుతున్నాడు. ఆయనెంతో జాగ్రత్తగా బాణాన్ని వింటితాడుపై సంధించి, తన బలాన్ని కూడదీసుకొని ఆ తాడును లాగుతూ విల్లును వంచుతాడు. అలా వంచిపట్టుకోవడం కష్టంగావున్నా, బాణాన్ని గురిపై ఎక్కుపెట్టేందుకు ఆయన సమయం తీసుకుంటాడు. ఆ తర్వాతే ఆయన బాణం వదులుతాడు! బాణం గురిని తాకుతుందా? ఈ ప్రశ్నకు లభించే జవాబు ఆ విలుకాని ప్రావీణ్యం, గాలివాటం, బాణం ఏ స్థితిలో ఉందనేదానితోపాటు ఇంకా అనేక విషయాలపై ఆధారపడివుంటుంది.

2 రాజైన సొలొమోను పిల్లలను “బలవంతుని చేతిలోని బాణములతో” పోల్చాడు. (కీర్తన 127:4) ఈ ఉదాహరణను ఎలా అన్వయించవచ్చో పరిశీలించండి. ఎక్కుపెట్టిన బాణం విలుకాని విల్లుపై కొద్దిసేపే ఉంటుంది. గురిని కొట్టేందుకు ఆయన దానిని వెంటనే విడిచిపెట్టాలి. అదే విధంగా, తల్లిదండ్రులు తమ పిల్లల్లో యెహోవాపట్ల హృదయపూర్వక ప్రేమను వృద్ధి చేసేందుకు వారికి కొంత సమయమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలే అనిపించే సమయం ముగిసినప్పుడు, పిల్లలు ఎదిగి, ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. (మత్తయి 19:5) వారు గురిని కొడతారా, అంటే పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత కూడా యెహోవాను ప్రేమిస్తూ ఆయనను సేవిస్తారా? దీని జవాబును అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో మూడు తల్లి/తండ్రి ప్రావీణ్యం, పిల్లలు పెంచబడిన వాతావరణం, ‘బాణములు’ లేదా పిల్లలు తాముపొందే శిక్షణకు స్పందించే తీరు. ఈ మూడు అంశాల్లో ఒక్కోదానిని మనం సవివరంగా పరిశీలిద్దాం. మొదట మనం ప్రావీణ్యంగల తల్లి/తండ్రి లక్షణాల్లో కొన్నింటిని పరిశీలిస్తాం.

ప్రావీణ్యంగల తల్లిదండ్రులు మంచిమాదిరిని ఉంచుతారు

3 బోధించినవాటి ప్రకారం ప్రవర్తించడంలో యేసు తల్లిదండ్రులకు మాదిరినుంచాడు. (యోహాను 13:15) మరోవైపు ‘చెబుతారే గానీ చేయని’ పరిసయ్యులను ఆయన ఖండించాడు. (మత్తయి 23:3) యెహోవాను ప్రేమించేలా తమ పిల్లలను పురికొల్పాలంటే తల్లిదండ్రుల మాటలకు, చేతలకు పొంతనవుండాలి. వింటితాడులేని విల్లులా క్రియల్లేని మాటలు నిష్ప్రయోజనం.—1 యోహాను 3:18.

4 తల్లిదండ్రుల మాదిరి ఎందుకంత ప్రాముఖ్యం? యేసు మాదిరిని చూసి పెద్దవారెలా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోగలరో, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల మంచి మాదిరిని అనుసరిస్తూ యెహోవాను ప్రేమించడం నేర్చుకోగలరు. పిల్లల సహవాసులు వారిని ప్రోత్సహించవచ్చు లేదా వారి ‘మంచి నడవడిని చెరపవచ్చు.’ (1 కొరింథీయులు 15:33) పిల్లల జీవితంలో అధికభాగం ముఖ్యంగా తొలిప్రాయపు సంవత్సరాల్లో వారిపై అత్యంత ప్రభావం చూపించగల సహవాసులు అతడి తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు తమనుతాము ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేనెలాంటి సహవాసిని? నా మాదిరి మంచి నడవడిని వృద్ధిచేసుకునేలా మా పిల్లలను ప్రోత్సహిస్తుందా? ప్రార్థన, బైబిలు అధ్యయనం వంటి అతి ప్రాముఖ్యమైన అంశాల్లో నేనెలాంటి మాదిరి ఉంచుతున్నాను?’

ప్రావీణ్యంగల తల్లిదండ్రులు తమ పిల్లలతోపాటు ప్రార్థిస్తారు

5 మీ ప్రార్థనలు వినడం ద్వారా మీ పిల్లలు యెహోవాను గురించి ఎంతో నేర్చుకోవచ్చు. భోజన సమయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడాన్ని, బైబిలు అధ్యయన సమయాల్లో చేయబడిన ప్రార్థనలను వారు విన్నప్పుడు వారెలాంటి నిర్ధారణకు రావచ్చు? మన భౌతికావసరాలను యెహోవా తీరుస్తున్నాడని, అందుకు మనం కృతజ్ఞత చూపించాలని, ఆయనే మనకు ఆధ్యాత్మిక సత్యాలు బోధిస్తున్నాడని వారు బహుశా నేర్చుకుంటారు. ఇవి విలువైన పాఠాలు.—యాకోబు 1:17.

6 అయితే భోజన సమయాల్లో, కుటుంబ బైబిలు అధ్యయన సమయాల్లోనే కాక ఇతర సందర్భాల్లో కూడా మీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ, ఆ ప్రార్థనల్లో మీపై మీ పిల్లలపై ప్రభావం చూపించే ప్రత్యేకాంశాలను ప్రస్తావిస్తే, అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. యెహోవా మీ కుటుంబంలో భాగమని, ఆయన మీపై ప్రగాఢమైన వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తున్నాడని భావించేలా మీ పిల్లలకు సహాయం చేస్తారు. (ఎఫెసీయులు 6:18; 1 పేతురు 5:6, 7) ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “మా అమ్మాయి పుట్టినప్పటి నుండి మేము ఆమెతోపాటు ప్రార్థించాం. ఆమె పెరుగుతుండగా, ఇతరులతో సముచిత సంబంధాల గురించి, ఆమెపై ప్రభావం చూపించిన ఇతర విషయాల గురించి ప్రార్థించాం. ఆమెకు పెళ్లై వెళ్లేంతవరకు మేము ఆమెతోపాటు ప్రార్థించని రోజంటూ లేదు.” మీరు కూడా ప్రతీరోజు మీ పిల్లలతోపాటు ప్రార్థించగలరా? వారు యెహోవాను తమ భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే వ్యక్తిగానే కాక, తమ భావావేశ అవసరాలపట్ల శ్రద్ధచూపించే స్నేహితునిగా దృష్టించేలా వారికి సహాయం చేయగలరా?—ఫిలిప్పీయులు 4:6, 7.

7 మీరు నిర్దిష్టమైన విషయాల గురించి ప్రార్థించాలనుకుంటే మీ పిల్లల జీవితంలో జరుగుతున్న విషయాలేమిటో మీరు తెలుసుకోవాలి. ఇద్దరు పిల్లల్ని పెంచిన ఓ తండ్రి ఇలా వ్యాఖ్యానించాడు: “ప్రతీ వారాంతంలో నన్ను నేను ఈ రెండు ప్రశ్నలు వేసుకునేవాణ్ణి, ‘ఈ వారంలో మా పిల్లలను ఏ అంశాలు కలవరపరచి ఉండవచ్చు? వారి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రయోజనకర అంశాలు చోటుచేసుకున్నాయి?’” తల్లిదండ్రులారా, మిమ్మల్నిమీరలా ప్రశ్నించుకొని, మీరు మీ పిల్లలతోపాటు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో తత్సంబంధ అంశాలను చేర్చగలరా? మీరలా చేసినప్పుడు, ప్రార్థన ఆలకించే యెహోవాకు ప్రార్థించడాన్ని బోధించడమే కాక, ఆయనను ప్రేమించడాన్ని కూడా వారికి నేర్పిస్తారు.—కీర్తన 65:2.

ప్రావీణ్యంగల తల్లిదండ్రులు మంచి అధ్యయన అలవాట్లను ప్రోత్సహిస్తారు

8 బైబిలు అధ్యయనంపట్ల తల్లిదండ్రుల దృక్పథం దేవునితో పిల్లలకున్న సంబంధంపై ఎలా ప్రభావం చూపించగలదు? ఎలాంటి సంబంధమైనా వృద్ధికావాలన్నా, స్థిరంగా ఉండాలన్నా దానిలో ఇమిడివున్న వ్యక్తులు పరస్పరం సంభాషించుకోవడమే కాక, పరస్పరం వినాలి కూడా. యెహోవా చెప్పేది మనం వినే మార్గాల్లో ఒకటి ‘నమ్మకమైన దాసుడు’ అందించే ప్రచురణల సహాయంతో బైబిలును అధ్యయనం చేయడం. (మత్తయి 24:45-47; సామెతలు 4:1, 2) కాబట్టి, యెహోవాతో శాశ్వతమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకునేలా తమ పిల్లలకు సహాయం చేసేందుకు తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని అధ్యయనంచేసే అలవాటును వృద్ధిచేసుకొమ్మని వారిని ప్రోత్సహించాలి.

9 చక్కని అధ్యయన అలవాట్లు వృద్ధిచేసుకునేలా పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? ఈ విషయంలో కూడా తల్లిదండ్రుల మాదిరే ఉత్తమ బోధనగా ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా బైబిలు చదువుతూ, అధ్యయనం చేస్తూ ఆనందించడాన్ని మీ పిల్లలు క్రమంగా చూస్తున్నారా? నిజమే, పిల్లలపట్ల శ్రద్ధ చూపించడంలో పూర్తిగా నిమగ్నమైన మీకు ఇక పఠనానికి, అధ్యయనానికి సమయమెక్కడ దొరుకుతుందని మీరు అనుకుంటుండవచ్చు. కానీ మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను టీవీ చూడడాన్ని మా పిల్లలు క్రమంగా గమనిస్తున్నారా?’ అలాగైతే, వ్యక్తిగత అధ్యయనానికి సంబంధించి వారికి మంచి మాదిరి ఉంచేలా ఆ సమయంలో కొంత సమయాన్ని మీరు దానికి ఉపయోగించగలరా?

10 యెహోవా చెప్పేది వినేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే మరో ఆచరణాత్మక విధానం క్రమంగా కుటుంబమంతా కలిసి బైబిలును చర్చించడం. (యెషయా 30:21) అయితే కొందరు, ‘తల్లిదండ్రులు పిల్లలను క్రమంగా సంఘకూటాలకు తీసుకెళ్తున్నప్పుడు వారికి కుటుంబ అధ్యయనమెందుకు’ అని ఆలోచిస్తారు. దానికి మంచి కారణాలు చాలావున్నాయి. పిల్లలకు బోధించే ప్రాథమిక బాధ్యతను యెహోవా తల్లిదండ్రులకు అప్పగించాడు. (సామెతలు 1:8; ఎఫెసీయులు 6:4) ఆరాధన బహిరంగముగా ఆచరించే లాంఛనప్రాయ వాడుక కాదుగానీ, ఒకరి కుటుంబ జీవితంలో భాగమని కుటుంబ బైబిలు అధ్యయనం పిల్లలకు నేర్పిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 6:6-9.

11 అంతేకాక, చక్కగా నిర్వహించబడే కుటుంబ అధ్యయనం, ఆధ్యాత్మిక, నైతిక విషయాలపట్ల పిల్లల ఆలోచనేమిటో గ్రహించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇస్తుంది. ఉదాహరణకు, పిల్లలు చిన్నవయసులో ఉండగానే తల్లిదండ్రులు గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) వంటి ప్రచురణలు ఉపయోగించవచ్చు. * ఈ బైబిలు అధ్యయన సహాయకంలో దాదాపు అన్ని పేరాల్లో చర్చించబడిన అంశాలపై పిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేలా ప్రశ్నలు అడగబడ్డాయి. తల్లిదండ్రులు ఆ పుస్తకంలో ఇవ్వబడిన లేఖనాలపై తర్కించడం ద్వారా ‘మేలు కీడులను వివేచించేలా’ పిల్లలు తమ జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకునేందుకు సహాయం చేయగల్గుతారు.—హెబ్రీయులు 5:14.

12 మీ పిల్లలు ఎదిగేకొద్దీ వారి అవసరాలకు తగ్గట్టు మీ అధ్యయనాన్ని మలుచుకోండి. పాఠశాలలో జరిగే ఒక డ్యాన్సు కార్యక్రమానికి హాజరవుతామని అడిగిన తమ టీనేజి అమ్మాయిలకు ఒక జంట సహాయం చేసిన తీరును గమనించండి. తండ్రి ఇలా చెబుతున్నాడు: “తర్వాతి కుటుంబ అధ్యయనంలోని ఒక భాగంలో, నేను నా భార్య పిల్లలుగా, పిల్లలు తల్లిదండ్రులుగా నటించాలని మా పిల్లలకు చెప్పాం. వారిద్దరిలో ఎవరో ఒకరు తండ్రిగా లేదా తల్లిగా నటించవచ్చు, అయితే పాఠశాల డ్యాన్సు కార్యక్రమానికి సంబంధించి నిర్దేశమిచ్చేందుకు వారిద్దరూ కలిసి పరిశోధన చేయాలి.” దాని ఫలితమేమిటి? తండ్రి ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఆ డ్యాన్సు కార్యక్రమానికి వెళ్లడం ఎందుకు జ్ఞానయుక్తమైనది కాదో తమ బైబిలు ఆధారిత కారణాలను (పిల్లలుగా నటిస్తున్న) మాకు చెబుతున్నప్పుడు (తల్లిదండ్రులుగా నటిస్తున్న) మా అమ్మాయిలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం చూసి మేమెంతో ఆశ్చర్యపోయాం. అంతేకాక, ఈ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఏమిచేయవచ్చో వారు ప్రతిపాదించిన సూచనలు మమ్మల్ని మరింత ముగ్ధుల్నిచేశాయి. అవి వారి ఆలోచనను, అభిరుచుల్ని మరింత స్పష్టంగా గ్రహించేందుకు మాకు సహాయం చేశాయి.” అవును, కుటుంబ అధ్యయనాన్ని క్రమంగా, కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా నిర్వహించేందుకు పట్టుదల, ఊహాసామర్థ్యం అవసరం, అయితే ఆ కృషికి తగిన ప్రతిఫలాలు లభిస్తాయి.—సామెతలు 23:15.

ప్రశాంత వాతావరణం కల్పించండి

13 విలుకాడు గురిచూసి, నెమ్మదిగా బాణాన్ని విడిచిపెడితే అది గురిని తాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా, తల్లిదండ్రులు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించినప్పుడు పిల్లలు యెహోవాను ప్రేమించడాన్ని నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “శాంతి స్థాపకులు శాంతిని విత్తి నీతి అనే పంటను కోస్తారు” అని యాకోబు వ్రాశాడు. (యాకోబు 3:18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తల్లిదండ్రులు గృహంలో ప్రశాంత వాతావరణాన్ని ఎలా కల్పించవచ్చు? దంపతులు బలమైన వివాహ బంధాన్ని కాపాడుకోవాలి. పరస్పరం ప్రేమించుకునే, గౌరవించుకునే భార్యాభర్తలకు, యెహోవాతోసహా ఇతరులను ప్రేమించి, గౌరవించడాన్ని తమ పిల్లలకు నేర్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (గలతీయులు 6:7; ఎఫెసీయులు 5:33) ప్రేమాగౌరవాలు ప్రశాంతతను పురికొల్పుతాయి. పరస్పరం సమాధానంగావున్న దంపతులు కుటుంబంలో తలెత్తే వివాదాలతో మరింత మెరుగ్గా వ్యవహరించగల్గుతారు.

14 భూమ్మీద ప్రస్తుతం పరిపూర్ణ వివాహాలు లేనట్లే, పరిపూర్ణ కుటుంబాలు లేవు. తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించేటప్పుడు కొన్నిసార్లు ఆత్మ ఫలాలను కనబర్చలేకపోవచ్చు. (గలతీయులు 5:22) అలా జరిగినప్పుడు, తల్లిదండ్రులు ఏమిచేయాలి? వారొకవేళ తమ తప్పును అంగీకరిస్తే దానివల్ల పిల్లల్లో వారిపట్లవున్న గౌరవం తగ్గిపోతుందా? అపొస్తలుడైన పౌలు ఉదాహరణను పరిశీలించండి. ఆయన చాలామందికి ఆధ్యాత్మిక తండ్రిలా ఉన్నాడు. (1 కొరింథీయులు 4:15) అయినా తాను తప్పులు చేశానని ఆయన బహిరంగముగా ఒప్పుకున్నాడు. (రోమీయులు 7:21-25) అయినప్పటికీ, ఆయన వినయం, నిజాయితీ ఆయనపట్ల మన గౌరవాన్ని పెంచిందే గానీ తగ్గించలేదు. పౌలు తాను తప్పులు చేసినా కొరింథు సంఘానికి ధైర్యంగా ఇలా వ్రాయగలిగాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:1) మీరు కూడా మీ తప్పులు అంగీకరించినప్పుడు, మీ పిల్లలు మీ వైఫల్యాలను అంతగా పట్టించుకోకపోవచ్చు.

15 పిల్లలు యెహోవాను ప్రేమించేవారిగా ఎదగడానికి దోహదపడే వాతావరణాన్ని కల్పించేందుకు తల్లిదండ్రులు ఇంకా ఏమిచేయవచ్చు? అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:20, 21) కాబట్టి, తమ క్రైస్తవ సహోదర సహోదరీలను ప్రేమించేందుకు మీ పిల్లలకు తర్ఫీదు ఇస్తున్నప్పుడు, మీరు దేవుణ్ణి ప్రేమించడం వారికి నేర్పిస్తారు. తల్లిదండ్రులు ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘సంఘాన్ని గురించి నేను మాట్లాడేది ప్రోత్సాహకరంగా ఉంటోందా లేక విమర్శనాత్మకంగా ఉంటోందా?’ మనమెలా తెలుసుకోవచ్చు? కూటాల గురించి, సంఘ సభ్యుల గురించి మీ పిల్లలు మాట్లాడే విధానాన్ని జాగ్రత్తగా వినండి. వారి వ్యాఖ్యానాల్లో బహుశా మీ తలంపులు ప్రతిధ్వనిస్తుండవచ్చు.

16 పిల్లలు తమ ఆధ్యాత్మిక సహోదరులను ప్రేమించేలా వారికి సహాయపడేందుకు తల్లిదండ్రులు ఏమిచేయవచ్చు? ఇద్దరు టీనేజి అబ్బాయిల తండ్రి పీటర్‌ ఇలా చెబుతున్నాడు: “మా పిల్లలు ఇంకా చిన్నవయసులో ఉన్నప్పటి నుండే, మాతోపాటు భోజనం చేసేందుకు, ఇంట్లో మాతోపాటు సమయం గడిపేందుకు ఆధ్యాత్మిక పరిణతిగల సహోదర సహోదరీలను మేము క్రమంగా ఆహ్వానించడాన్నిబట్టి మేము చాలా ఆనందించాం. అలా మా అబ్బాయిలు యెహోవాను ప్రేమించేవారి సహవాసంలో ఎదిగారు, వారిప్పుడు దేవుణ్ణి సేవించడాన్ని ఆనందదాయకమైన జీవన విధానంగా పరిగణిస్తున్నారు.” ఐదుగురు అమ్మాయిల తండ్రి డెనీస్‌ ఇలా చెబుతున్నాడు: “సంఘంలోని వృద్ధ పయినీర్లతో స్నేహం చేయమని మేము మా అమ్మాయిలను ప్రోత్సహించాం, అలాగే సాధ్యమైనప్పుడల్లా మేము ప్రాంతీయ పైవిచారణకర్తలకు వారి భార్యలకు ఆతిథ్యమిచ్చాం.” మీరు కూడా సంఘాన్ని మీ కుటుంబంలో ఒక భాగంగా దృష్టించేలా మీ పిల్లలకు సహాయం చేయడంలో చొరవ తీసుకోగలరా?—మార్కు 10:29, 30.

పిల్లల బాధ్యత

17 విలుకాని ఉదాహరణను మళ్లీ ఒకసారి పరిశీలించండి. ఆయనకు నైపుణ్యమున్నా, ఆయన ఉపయోగించే బాణం వంకరగా లేదా మెలికలు తిరిగివుంటే అది గురిని తాకకపోవచ్చు. సూచనార్థకంగా చెప్పాలంటే, తల్లిదండ్రులు పిల్లల తప్పుడు ఆలోచనను సరిదిద్దేందుకు కృషి చేయడం ద్వారా వంకరగావున్న బాణాన్ని సరిచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించవచ్చు. అయితే ఈ లోకం దాని ఇష్టానుసారంగా తమను మలిచేందుకు అనుమతించాలా లేక యెహోవా తమ “త్రోవలను సరాళము” చేసేందుకు అనుమతించాలా అనేది చివరకు పిల్లలే స్వయంగా నిర్ణయించుకోవాలి.—సామెతలు 3:5, 6; రోమీయులు 12:2.

18 తమ పిల్లలను “ప్రభువు [యెహోవా] యొక్క శిక్షలోను బోధలోను” పెంచే బరువైన బాధ్యత తల్లిదండ్రులకున్నా, తామెలాంటి వ్యక్తులుగా ఎదుగుతామనేది చివరకు పిల్లల చేతుల్లోనే ఉంటుంది. (ఎఫెసీయులు 6:4) కాబట్టి పిల్లలారా మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘మా తల్లిదండ్రులిచ్చే ప్రేమపూర్వక శిక్షణను నేను అంగీకరిస్తానా?’ మీరలా అంగీకరిస్తే, మీరు శ్రేష్ఠమైన జీవితాన్ని ఎంచుకుంటారు. మీరు మీ తల్లిదండ్రులను ఎంతో సంతోషపెడతారు. అన్నింటికన్నా మిన్నగా, మీరు యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తారు.—సామెతలు 27:11.

[అధస్సూచి]

^ పేరా 16 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ప్రార్థన, బైబిలు అధ్యయనం విషయంలో తల్లిదండ్రులు ఎలా చక్కని మాదిరి ఉంచవచ్చు?

• తల్లిదండ్రులు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఎలా కల్పించవచ్చు?

• పిల్లలకు ఏమి నిర్ణయించుకునే అవకాశముంది, వారి నిర్ణయం ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. పిల్లలు ఎలా “బలవంతుని చేతిలోని బాణములవంటివారు”?

3. తల్లిదండ్రుల మాటలకు క్రియలకు ఎందుకు పొంతనవుండాలి?

4. తల్లిదండ్రులు తమనుతాము ఏమని ప్రశ్నించుకోవాలి, ఎందుకు?

5. తల్లి/తండ్రి చేసే ప్రార్థన నుండి పిల్లలు ఏమి నేర్చుకోవచ్చు?

6. యెహోవాకు తమపట్ల వ్యక్తిగత శ్రద్ధవుందని భావించేలా తల్లిదండ్రులు పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

7. నిర్దిష్టమైన విషయాల గురించి ప్రార్థించేందుకు తల్లిదండ్రులు ఏమి తెలుసుకోవాలి?

8. దేవుని వాక్య అధ్యయన అలవాటును వృద్ధిచేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలకెందుకు సహాయం చేయాలి?

9. చక్కని అధ్యయన అలవాట్లు వృద్ధిచేసుకునేలా పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

10, 11. తల్లిదండ్రులు ఎందుకు క్రమంగా కుటుంబంలో బైబిలు చర్చలు నిర్వహించాలి?

12. తల్లిదండ్రులు కుటుంబ అధ్యయనాన్ని పిల్లల అవసరాలకు తగినట్లు ఎలా మలచవచ్చు, ఈ విషయంలో ఏది సమర్థవంతంగా ఉన్నట్లు మీరు కనుగొన్నారు?

13, 14. (ఎ) తల్లిదండ్రులు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఎలా కల్పించవచ్చు? (బి) తల్లి లేదా తండ్రి చేసిన తప్పును అంగీకరించినప్పుడు ఎలాంటి ప్రయోజనకర ఫలితం రావచ్చు?

15, 16. తమ క్రైస్తవ సహోదర సహోదరీలను ప్రేమించడంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎందుకు శిక్షణనివ్వాలి, దీనినెలా ఇవ్వవచ్చు?

17. చివరకు పిల్లలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?

18. పిల్లల నిర్ణయం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

[28వ పేజీలోని చిత్రం]

వ్యక్తిగత అధ్యయనంలో మీరు మీ పిల్లవానికి మంచి మాదిరిగా ఉన్నారా?

[29వ పేజీలోని చిత్రం]

ఇంట్లో ప్రశాంత వాతావరణం సంతోషానికి తోడ్పడుతుంది