కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సహాయంతో మేము నిరంకుశ పరిపాలనల నుండి కాపాడబడ్డాం

యెహోవా సహాయంతో మేము నిరంకుశ పరిపాలనల నుండి కాపాడబడ్డాం

జీవిత కథ

యెహోవా సహాయంతో మేము నిరంకుశ పరిపాలనల నుండి కాపాడబడ్డాం

హెన్రిక్‌ డోర్నిక్‌ చెప్పినది

నేను 1926లో, క్యాథలిక్‌ మతనిష్ఠగల మా అమ్మానాన్నలకు జన్మించాను. అప్పట్లో వారు దక్షిణ పోలాండ్‌లోని కాటోవైస్‌ దగ్గర్లోవున్న గని పట్టణమైన రూడా స్లాస్కాలో నివసించేవారు. వారు తమ పిల్లలకు అంటే మా పెద్దన్నయ్య బర్నార్డ్‌కు, మా ఇద్దరు చెల్లెళ్ళు రోజా, ఎడీటాలకు, నాకు ప్రార్థించడాన్ని, చర్చీకి హాజరవడాన్ని, పాపాలు ఒప్పుకోవడాన్ని నేర్పించారు.

బైబిలు సత్యం మా ఇంటి తలుపు తట్టడం

1937 జనవరిలో ఒకరోజు నాన్న ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు, అప్పుడు నాకు పది సంవత్సరాలు. ఆయన యెహోవాసాక్షుల నుండి తీసుకున్న మందంగా ఉన్న ఒక పెద్ద పుస్తకాన్ని తనతోపాటు తీసుకొచ్చాడు. ఆయన మాతో ఇలా అన్నాడు: “పిల్లలూ, నేనేమి తీసుకొచ్చానో చూడండి—పరిశుద్ధ గ్రంథం!” అంతకు ముందెప్పుడూ నేను బైబిలును చూడలేదు.

క్యాథలిక్‌ చర్చి రూడా స్లాస్కా మరియు దాని పరిసర ప్రాంతాల ప్రజలపై చాలాకాలంపాటు ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. మతనాయకులు గని యజమానులతో ఎంతో స్నేహంగా ఉండడమేగాక, తమకు గని కార్మికులు, వారి కుటుంబాలు పూర్తిగా లోబడి ఉండాలని అధికారికంగా వారిని అడిగేవారు. గని కార్మికుడు మాస్‌కి లేదా తప్పు ఒప్పుకునేందుకు వెళ్ళడానికి నిరాకరిస్తే, ఆయననొక అవిశ్వాసిగా పరిగణించి, ఆయనను పనిలో నుండి తీసేయాలని నిర్ధారించేవారు. నాన్న యెహోవాసాక్షులతో సహవసిస్తున్నందువల్ల త్వరలోనే ఆయన కూడా అలాంటి బెదిరింపునే ఎదుర్కొన్నాడు. అయితే, మా ఇంటికి ఒక ప్రీస్టు వచ్చినప్పుడు, నాన్న అందరి ముందూ ఆ ప్రీస్టు మత వేషధారణను బయటపెట్టాడు. అవమానం పాలైన ఆ ప్రీస్టు ఇంకా ఎక్కువ ఇబ్బంది వద్దనుకున్నాడు, దానితో నాన్న ఉద్యోగం పోలేదు.

ప్రీస్టుతో జరిగిన ఆ వివాదాన్ని వినడం బైబిలును తెలుసుకోవాలన్న నా నిర్ణయాన్ని బలపర్చింది. నేను క్రమంగా యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టి, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకున్నాను. నాన్న ప్రీస్టుతో మాట్లాడిన కొన్ని నెలల తర్వాత, మేము క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాం, ఆ సమయంలో “ఈయన యెహోనాదాబు వర్గానికి చెందినవాడు” అని నాన్న 30 మంది ఉన్న గుంపుకు పరిచయం చేయబడ్డాడు. ‘యెహోనాదాబు వర్గానికి చెందినవారు’ భూ నిరీక్షణగల క్రైస్తవులనీ, వారి సంఖ్య పెరగాల్సివుందనీ నేను త్వరలోనే తెలుసుకున్నాను. *2 రాజులు 10:15-17.

“బాబూ, బాప్తిస్మమంటే ఏమిటో నీకు తెలుసా?”

సత్యాన్ని అంగీకరించిన తర్వాత నాన్న తాగడం మానేసి, ఒక మంచి భర్తగా, తండ్రిగా మారాడు. అయితే అమ్మ మాత్రం నాన్న మత నమ్మకాలను ఒప్పుకోలేదు, నాన్న గతంలో ఎలా ఉండేవాడో అలాగే ఉండి, ఒక క్యాథలిక్‌గా ఉండిపోతేనే మంచిదని అనేది. అయితే, రెండవ ప్రపంచయుద్ధం మొదలైన తర్వాత, దండెత్తి వచ్చిన జర్మన్లపై పోలాండ్‌ విజయం సాధించాలని ప్రార్థించిన మతనాయకులే ఇప్పుడు హిట్లర్‌ విజయాలకు కృతజ్ఞతా ప్రార్థనలు చేయడాన్ని అమ్మ గమనించింది! తర్వాత, 1941లో యెహోవాను సేవించడంలో అమ్మ మా అందరితో కలిసింది.

దానికి ముందు, దేవునికి చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా తెలియజేయాలనే నా కోరిక గురించి సంఘ పెద్దలకు చెప్పాను, కానీ వారు నేను చాలా చిన్నవాణ్ణని అనుకున్నారు. వారు నన్ను కొంతకాలం ఆగమన్నారు. చివరికి 1940, డిసెంబరు 10న కోన్‌రాట్‌ గ్రాబోవిల్‌ (ఆ తర్వాత కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులో నమ్మకస్థునిగా చనిపోయిన ఒక సహోదరుడు) ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఎవరికీ తెలీకుండా నన్ను ప్రశ్నలు అడిగాడు. ఆయన నన్ను ఐదు ప్రశ్నలడిగి, నేను చెప్పిన సమాధానాలకు సంతృప్తిపడి నాకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన అడిగిన ప్రశ్నల్లో ఒకటి, “బాబూ, బాప్తిస్మమంటే ఏమిటో నీకు తెలుసా?” మరో ప్రశ్న “ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి నీవు హిట్లర్‌పట్ల నమ్మకంగా ఉంటావో లేదా యెహోవాపట్ల నమ్మకంగా ఉంటావో త్వరలోనే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ యెహోవాపట్ల నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకుంటే చనిపోవాల్సి వస్తుందని నీకు తెలుసా?” నేను, ఏమాత్రం సంకోచించకుండా “అవును నాకు తెలుసు” అని జవాబిచ్చాను.

హింస మొదలుకావడం

కోన్‌రాట్‌ గ్రాబోవిల్‌ అలాంటి నిర్దిష్టమైన ప్రశ్నలు ఎందుకు అడిగాడు? జర్మన్‌ సైన్యం 1939లో పోలండ్‌ను ముట్టడించింది, ఆ తర్వాత మా విశ్వాసం, యథార్థత తీవ్రంగా పరీక్షించబడ్డాయి. ప్రతీరోజు క్రైస్తవ సహోదర, సహోదరీలను అరెస్ట్‌ చేశారని, బహిష్కరించారని, జైళ్ళకు లేదా సామూహిక నిర్బంధ శిబిరాలకు పంపించారని విన్నప్పుడు, పరిస్థితులు మరింత కలవరభరితంగా తయారయ్యాయి. త్వరలోనే మేము కూడా అలాంటి పరీక్షలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.

నాజీలు, నలుగురు పిల్లలమైన మాతో సహా యువతరాన్ని నాజీ పరిపాలనలో చురుకైన సభ్యులుగా చేయాలనుకున్నారు. మా అమ్మానాన్న వోల్క్స్‌లిస్ట్‌ (జర్మన్‌ పౌరసత్వాన్ని పొందవలసినవారి లేదా పొందాలనుకుంటున్నవారి లిస్టు) మీద సంతకం చేసేందుకు చాలాసార్లు నిరాకరించారు కాబట్టి, పిల్లలమైన మమ్మల్ని పెంచే న్యాయపరమైన హక్కును వారికి లేకుండా చేశారు. నాన్నను ఆస్క్‌విట్జ్‌లోని సామూహిక నిర్బంధ శిబిరానికి పంపించారు. 1944 ఫిబ్రవరిలో, తమ్ముడిని, నన్ను నైసా దగ్గరున్న గ్రాడ్కో (గ్రోట్కూ)లోని బాలల కారాగారంలో వేశారు, మా చెల్లెళ్ళను ఓపెల్‌ దగ్గరున్న కార్నోవోన్సి (క్లోస్ట్‌బ్రూక్‌)లోని క్యాథలిక్‌ కాన్వెంట్‌కి పంపించారు. “మా తల్లిదండ్రుల మోసపూరితమైన ఉద్దేశాలు” అని అధికారులు పిలిచినవాటిని మేము నిరాకరించేలా చేయాలన్నదే వారి లక్ష్యం. అమ్మ ఇంటిదగ్గర ఒక్కతే ఉంది.

ప్రతీ ఉదయం బాలల కారాగారంలోని ప్రాంగణంలో స్వస్తికా జెండాను ఎగురవేసేవారు, మా కుడిచేయ్యి పైకెత్తి దానికి సెల్యూట్‌ చేస్తూ “హిట్లర్‌కు జయం” అని చెప్పాలని మాకు ఆజ్ఞాపించబడింది. అది విశ్వాసానికి గట్టి పరీక్షే, అయినా బర్నార్డ్‌, నేను రాజీపడకుండా స్థిరంగా ఉన్నాం. దాని ఫలితంగా, “అమర్యాదకరంగా” ప్రవర్తిస్తున్నామని చెప్పి మమ్మల్ని బాగా కొట్టారు. మమ్మల్ని ఒప్పించేందుకు ఆ తర్వాత జరిగిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి, దానితో నాజీ సైనిక దళాలు మాకు ఈ చివరి హెచ్చరిక ఇచ్చాయి: “జర్మన్‌ దేశానికి నమ్మకంగా కట్టుబడి ఉంటామని సంతకం చేసి, వెర్‌మాక్‌లో [జర్మన్‌ సైన్యం] చేరండి, లేకపోతే మిమ్మల్ని సామూహిక నిర్బంధ శిబిరానికి పంపిస్తాం.”

మమ్మల్ని 1944 ఆగస్టులో, సామూహిక నిర్బంధ శిబిరానికి పంపాలని ప్రభుత్వాధికారులు అధికారికంగా సిఫారసు చేస్తూ ఇలా అన్నారు: “వారితో ఏదీ చేయించలేం. తమ మత విశ్వాసం కోసం ప్రాణాలర్పించడం వారికి సంతోషాన్నిస్తుంది. వారి తిరుగుబాటు వైఖరి మొత్తం కారాగారానికే ప్రమాదకరం.” నేను హతసాక్షిని కావాలనుకోకపోయినా, యెహోవాపట్ల యథార్థంగా ఉండేందుకు ధైర్యంగా, గౌరవప్రదంగా బాధలు అనుభవించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. (అపొస్తలుల కార్యములు 5:41) నాకెదురైన బాధలను నేను నా స్వశక్తితో ఎంతమాత్రం తట్టుకోగలిగి ఉండేవాణ్ణి కాదు. మరోవైపు, ఎడతెగక ప్రార్థన చేయడంవల్ల నేను యెహోవాకు దగ్గరయ్యాను, ఆయన నాకు నమ్మకంగా సహాయాన్ని అందించాడు.—హెబ్రీయులు 13:6.

సామూహిక నిర్బంధ శిబిరంలో

త్వరలోనే సిలేషియాలోని గ్రోస్‌-రోజన్‌ సామూహిక నిర్బంధ శిబిరానికి నన్ను తీసికెళ్ళారు. నాకొక ఖైదీ నెంబరును ఇచ్చి, నేనొక యెహోవాసాక్షినని గుర్తిస్తూ ఊదారంగు తిక్రోణపు చిహ్నాన్ని నా జేబుకు కుట్టారు. ఎస్‌.ఎస్‌. గార్డులు నాకొక అవకాశాన్నిచ్చారు. ఒక షరతుపై నన్ను సామూహిక నిర్బంధ శిబిరం నుండి విడుదల చేస్తామని, చివరికి నాజీ సైన్యంపై నన్ను అధికారిగా కూడా చేస్తామని చెప్పారు. “నాజీ పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్న బైబిలు విద్యార్థుల నమ్మకాలను నువ్వు విడిచిపెట్టాలి.” వాళ్ళు అలాంటి ప్రతిపాదన ఇతర ఖైదీలెవ్వరికీ ఇవ్వలేదు. సామూహిక నిర్బంధ శిబిరాల్లో నుండి తప్పించుకునే ఆ అవకాశాన్ని కేవలం యెహోవాసాక్షులకు మాత్రమే ఇచ్చారు. వేలాదిమంది ఇతరుల్లాగే నేను ఆ “ఆధిక్యతను” దృఢంగా తిరస్కరించాను. కాపలాదారులు ఇలా అన్నారు: “శవదహన కొలిమి పొగగొట్టం వైపు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇంకోసారి బాగా ఆలోచించుకోండి లేదా ఆ పొగగొట్టం ద్వారా మాత్రమే మళ్ళీ మీరు స్వతంత్రులవుతారు.” నేను మళ్ళీ గట్టిగా తిరస్కరించాను, ఆ క్షణంలో నేను ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని’ అనుభవించాను.—ఫిలిప్పీయులు 4:6, 7.

నేను శిబిరంలోని ఇతర సాక్షులను కలుసుకోవాలని యెహోవాకు ప్రార్థించాను, యెహోవా దాన్ని సాధ్యం చేశాడు. ఆ తోటి క్రైస్తవుల్లో గూస్టాఫ్‌ బూమర్ట్‌ అనే నమ్మకమైన సహోదరుడు ఒకరు, ఆయన ఆప్యాయతతో, ప్రేమతో నా పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. నిస్సందేహంగా యెహోవా నాకు “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని నిరూపించుకున్నాడు—2 కొరింథీయులు 1:3.

కొన్ని నెలల తర్వాత, రష్యా సైన్యాలు సమీపిస్తూ శిబిరాన్ని వెంటనే ఖాళీ చేయమని నాజీలను బలవంతపెట్టారు. మేము బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, సహోదరులమైన మేము మా ప్రాణాలకు తెగించి, స్త్రీల బారకాసుల వరకు వెళ్ళి, అక్కడున్న దాదాపు 20 మంది ఆధ్యాత్మిక సహోదరీల పరిస్థితిని చూడాలని నిర్ణయించుకున్నాం. వారిలో ఎల్జా ఆప్ట్‌, గెట్రూట్‌ ఓట్‌ కూడా ఉన్నారు. * వారు మమ్మల్ని చూడగానే, పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చారు, మేము ఒకరినొకరం కొద్దిసేపు ప్రోత్సహించుకున్న తర్వాత, వారంతా కలిసి “నమ్మకంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు, ఎన్నడూ అధైర్యపడడు” అనే మాటలున్న రాజ్య గీతాన్ని పాడారు. * మా అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి!

మరో శిబిరానికి

నాజీలు ఖైదీలమైన మమ్మల్ని బొగ్గు తీసుకువెళ్లే ఖాళీ రైలు పెట్టెలు కిక్కిరిసిపోయేలా ఒక్కోదానిలో 100 నుండి 150 మందిని ఎక్కించారు, ఆహారం, నీళ్ళు లేకుండా, మేము మంచులో, వణికించే వర్షంలో ప్రయాణించాం. దాహంతో, జ్వరంతో ఎంతో బాధపడ్డాం. అనారోగ్యంతో ఉన్న, నీరసించిపోయిన ఖైదీలు కుప్పకూలి, చనిపోవడంతో రైలు పెట్టెలు కాస్త ఖాళీ అయ్యాయి. నా కాళ్లు, కీళ్ళు ఎంతగా వాచిపోయాయంటే నేను సరిగ్గా లేచి నిలబడలేకపోయాను. పదిరోజులు ప్రయాణించిన తర్వాత, జీవించివున్న కొద్దిమంది ఖైదీలను, తురింగియా రాష్ట్రంలోని వైమార్‌ నగరానికి దగ్గర్లోవున్న నోర్టూజన్‌ నగరంలోని మిటిల్‌బూడోరా అనే శిక్షా శిబిరానికి తీసుకొచ్చారు. ఆశ్చర్యకరంగా, పీడకలలాంటి ఆ ప్రయాణంలో సహోదరుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు.

ప్రయాణం నుండి నేను తేరుకోవడం ఆరంభించగానే, శిబిరంలో జిగటవిరేచనాల అంటువ్యాధి సోకింది, నాతోపాటు కొంతమంది సహోదరులు అస్వస్థులయ్యారు. శిబిరంలో ఇచ్చే సూపులను కొంతకాలం తాగొద్దనీ, కాల్చిన రొట్టెను మాత్రమే తినమనీ చెప్పారు. నేను అలాగే చేసి, త్వరలోనే కోలుకున్నాను. 1945 మార్చిలో, ఆ సంవత్సరపు వార్షిక వచనం మత్తయి 28:19: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని మేము తెలుసుకున్నాం. స్పష్టంగా, శిబిరాల తలుపులు త్వరలోనే తెరుచుకుంటాయి, సువార్త క్రమంగా ప్రకటించబడుతుంది! రెండవ ప్రపంచయుద్ధం చివరకు హార్‌మెగిద్దోనులో ముగుస్తుందని మేము అనుకున్నాం కాబట్టి అది మమ్మల్ని సంతోషంతో, నిరీక్షణతో నింపింది. ఆ కష్టకాలాల్లో యెహోవా మమ్మల్ని ఎంత అద్భుతంగా బలపరచాడో!

శిబిరాలనుండి విముక్తి

మిత్రదేశాల సైన్యాలు 1945 ఏప్రిల్‌ 1న, ఎస్‌.ఎస్‌. బారాకాసులపై, మా దగ్గర్లోవున్న శిబిరంపై బాంబులు వేశాయి. ఎంతోమంది చనిపోయారు లేదా గాయపడ్డారు. మరుసటి రోజు మాపై బాంబుల దాడి జరిగింది, ఆ దాడి జరుగుతున్నప్పుడు, ఒక శక్తివంతమైన విస్ఫోటం నన్ను గాల్లోకి విసిరేసింది.

సహోదరుల్లో ఒకరైన ఫ్రిట్జ్‌ ఉల్రిక్‌ నాకు సహాయం చేసేందుకు వచ్చాడు. నేను బ్రతికే ఉన్నానన్న ఆశతో రాళ్ళ కుప్పలను పక్కకు తీశాడు. చివరికి, నన్ను కనుక్కొని, ఆ శిథిలాల్లో నుండి బయటకు లాగాడు. నేను స్పృహలోకి వచ్చాక, నా ముఖానికి, నా శరీరానికి బాగా గాయాలయ్యాయని, నేను వినలేకపోతున్నానని నాకు తెలిసింది. విస్ఫోటం ద్వారా ఏర్పడిన శబ్దంవల్ల నా కర్ణభేరి పాడైపోయింది. నా చెవులు చివరకు బాగయ్యేంతవరకు వాటితో నేను చాలా సంవత్సరాలపాటు తీవ్రమైన ఇబ్బందులు పడ్డాను.

వేలాది ఖైదీల్లో కొంతమందే ఆ బాంబుదాడిలో నుండి బ్రతికి బయటపడ్డారు. మన సహోదరుల్లో కొంతమంది చనిపోయారు, వారిలో ప్రియమైన గూస్టాఫ్‌ బూమర్ట్‌ కూడా ఉన్నారు. నాకు తగిలిన గాయాలవల్ల ఇన్‌ఫెక్షనై విపరీతమైన జ్వరం వచ్చింది. త్వరలోనే, మిత్రదేశాలు మమ్మల్ని కనుగొని, విడుదల చేశాయి. ఆ సమయంలో, చనిపోయినవారి శరీరాలు లేదా చంపబడ్డ ఖైదీల శరీరాలు కుళ్ళిపోవడంతో విష జ్వరమనే అంటువ్యాధి సోకింది. అది నాకు కూడా సోకింది. అనారోగ్యంగా ఉన్న మిగతావారితోపాటు నన్ను కూడా ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు, కానీ మాలో ముగ్గురిని మాత్రమే రక్షించగలిగారు! అలాంటి కష్ట సమయాల్లో నమ్మకంగా ఉండేలా యెహోవా నన్ను బలపర్చినందుకు నేనాయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి. యెహోవా నన్ను “గాఢాంధకారపు లోయలో” నుండి కాపాడినందుకు కూడా నేనాయనకు ఎంతో కృతజ్ఞుణ్ణి.—కీర్తన 23:4.

చివరికి ఇంటికి చేరుకోవడం!

జర్మనీ లొంగిపోయాక, నేను వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళతానని అనుకున్నాను, కానీ అది నేను అనుకున్నదానికంటే చాలా కష్టమని వెల్లడైంది. క్యాథలిక్‌ యాక్షన్‌ అనే సంస్థ సభ్యులైన మాజీ ఖైదీల్లో కొందరు నన్ను గుర్తుపట్టారు. వారు “అతణ్ణి చంపండి!” అని గట్టిగా అరుస్తూ, నన్ను కిందపడేసి, నా మీద ఎక్కి తొక్కారు. ఒకతను దగ్గరకొచ్చి, క్రూరమైన ఆ మనుష్యుల నుండి నన్ను కాపాడాడు, నాకు గాయాలై, విష జ్వరంతో నీరసంగా ఉన్నాను కాబట్టి, దాని నుండి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. చివరికి, ఇంటికి వెళ్ళగలిగాను. తిరిగి నా కుటుంబాన్ని కలుసుకున్నందుకు నేనెంతో సంతోషించాను! నా కుటుంబ సభ్యులు నేను చనిపోయానని అనుకున్నారు కాబట్టి వారు నన్ను చూసి ఉప్పొంగిపోయారు.

మేము వెంటనే ప్రకటనా పనిని తిరిగి మొదలుపెట్టాం, యథార్థవంతులైన సత్యాన్వేషకులు అనేకులు అనుకూలంగా ప్రతిస్పందించారు. సంఘాలకు బైబిలు సాహిత్యాలను అందజేసే బాధ్యత నాకు అప్పగించబడింది. ఇతర సహోదరులతో కలిసి, వేమర్‌లో జర్మనీ బ్రాంచి కార్యాలయ ప్రతినిధులను కలిసే ఆధిక్యత నాకు లభించింది, అక్కడ నుండి మేము, రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ముద్రించబడిన మొట్టమొదటి కావలికోట జర్మన్‌ సంచికను పోలాండ్‌కు తీసుకొచ్చాం. అవి వెంటనే తర్జుమా చేయబడ్డాయి, తర్వాత స్టెన్సిల్స్‌ తయారు చేయబడి, కాపీలు ముద్రించబడ్డాయి. లోడ్జ్‌లోని మా కార్యాలయం పోలండ్‌లో జరుగుతున్న పనిని పర్యవేక్షించే బాధ్యతని తీసుకొంది, అప్పటినుండి బైబిలు ఆధారిత సాహిత్యాలు సంఘాలకు క్రమంగా చేరడం ప్రారంభమయ్యింది. నేను ప్రత్యేక పయినీరుగా లేదా పూర్తికాల సువార్తికుడిగా సేవచేయడం మొదలుపెట్టి, సిలేషియాలోని పెద్ద క్షేత్రమంతటా ప్రకటించాను, సిలేషియా చాలావరకు ఆ సమయంలో పోలండ్‌లో భాగంగా ఉంది.

అయితే త్వరలోనే, యెహోవాసాక్షులు మళ్ళీ హింసించబడ్డారు, ఈసారి హింస పోలాండ్‌లో కొత్తగా ఏర్పడిన కమ్యూనిస్ట్‌ పరిపాలన ద్వారా వచ్చింది. నా క్రైస్తవ తటస్థతవల్ల, 1948లో నాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. నేనక్కడ ఉన్నప్పుడు, ఇతర ఖైదీలు అనేకులు దేవునికి సన్నిహితమయ్యేలా వారికి సహాయం చేయగలిగాను. వారిలో ఒకరు సత్యంవైపు స్థిరంగా ఉంటూ, ఆ తర్వాత తనను తాను యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారు.

అమెరికా తరఫున గూఢచారిగా పనిచేస్తున్నాననే ఆరోపణతో 1952లో నన్ను మళ్ళీ జైలుకు పంపించారు! విచారణ కోసం నేను ఎదురుచూస్తుండగా, నన్ను ఒంటరిగా జైల్లో పెట్టి రాత్రనక పగలనక విచారణ చేశారు. అయితే, హింసిస్తున్న వారి చేతుల్లోనుండి మళ్ళీ యెహోవా నన్ను విడిపించాడు, అలాంటి అవమానాన్ని ఆ తర్వాతి సంవత్సరాల్లో మళ్లీ ఎప్పుడూ అనుభవించలేదు.

సహించేందుకు నాకేమి సహాయపడింది?

గత సంవత్సరాలన్నిటిలో పడిన కష్టాలను, ఎదుర్కొన్న పరీక్షలను గుర్తుచేసుకున్నప్పుడు, ప్రోత్సాహానికి కొన్ని ప్రాముఖ్యమైన మూలాలను నేను గుర్తించగలను. అన్నిటికన్నా ముందు, నేను యెహోవా నుండి, ఆయన వాక్యమైన బైబిలు నుండి సహించే శక్తిని పొందాను. ‘సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవునికి’ ఎడతెగక చేసిన తీవ్రమైన అర్థింపులు, ప్రతీరోజు ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడం నేను, అలాగే ఇతరులు ఆధ్యాత్మికంగా సజీవంగా ఉండేందుకు సహాయపడింది. కావలికోట చేవ్రాత ప్రతులు కూడా కావల్సిన ఆధ్యాత్మిక పోషణను అందించాయి. సామూహిక నిర్భంద శిబిరాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా, సుముఖంగా ఉన్న శ్రద్ధ చూపించే తోటి విశ్వాసుల వల్ల నేను ఎంతో బలపర్చబడ్డాను.

యెహోవా నుండి లభించిన మరో ఆశీర్వాదం, నా భార్య మారియ. మేము 1950 అక్టోబరులో వివాహం చేసుకున్నాం, తర్వాత మా అమ్మాయి హలీన పుట్టింది. ఆమె యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించేలా పెరిగి పెద్దదైంది. మేము వివాహం చేసుకున్న 35 సంవత్సరాల తర్వాత మారియ దీర్ఘకాలంపాటు అనారోగ్యంతో పోరాడి, మరణించింది. ఆమె మరణం నాకెంతో దుఃఖాన్ని, బాధను మిగిల్చింది. కొంతకాలం ‘పడద్రోయబడినట్టు’ అనిపించినా నేను ‘నశించిపోలేదు.’ (2 కొరింథీయులు 4:9) ఆ కష్టకాలాల్లో, నా ప్రియమైన కూతురు, ఆమె భర్త, ఆమె పిల్లలు అంటే నా మనువళ్ళు నాకు సహాయం చేశారు, వీరందరూ ఇప్పుడు యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు.

నేను 1990 నుండి పోలాండ్‌లోని బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాను. ప్రతీరోజూ అద్భుతమైన బెతేలు కుటుంబంతో సహవసించడం ఓ గొప్ప ఆశీర్వాదం. కొన్నిసార్లు క్షీణించిపోతున్న నా ఆరోగ్యం, మెల్లిగా గాల్లో తేలే బలహీనమైన డేగలా ఉన్నట్లు నేను భావించేలా చేస్తుంది. అయితే, భవిష్యత్తుపట్ల నాకు నమ్మకముంది, నేటి వరకు “యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను.” (కీర్తన 13:6) సాతాను అణిచివేసే పరిపాలనవల్ల వచ్చిన బాధలన్నిటినీ నా సహాయకుడైన యెహోవా తీసివేసే సమయం కోసం ఎదురుచూస్తున్నాను.

[అధస్సూచీలు]

^ పేరా 8 జనవరి 1, 1998, కావలికోట సంచికలో 13వ పేజీలోని 6వ పేరా చూడండి.

^ పేరా 20 ఎల్జా ఆప్ట్‌ జీవితకథ కోసం ఏప్రిల్‌ 15, 1980 కావలికోటలోని 12-15 పేజీలు చూడండి.

^ పేరా 20 యెహోవాసాక్షులు 1928లో ప్రచురించిన, యెహోవాకు స్తుతిగీతాలు (ఆంగ్లం) అనే పాటల పుస్తకంలో 101వ పాట. ప్రస్తుత పాటల పుస్తకంలో అది 56వ పాట.

[10వ పేజీలోని చిత్రం]

సామూహిక నిర్భంద శిబిరంలో నాకు ఈ నంబరును, ఊదారంగు త్రికోణాన్ని ఇచ్చారు

[12వ పేజీలోని చిత్రం]

నా భార్య మారియతో, 1980లో