కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుష్టత్వం కొనసాగడానికిగల కారణం

దుష్టత్వం కొనసాగడానికిగల కారణం

దుష్టత్వం కొనసాగడానికిగల కారణం

“యెహోవా [దేవుడు] తన మార్గములన్నిటిలో నీతిగలవాడు” అని బైబిలు చెబుతోంది. (కీర్తన 145:17; ప్రకటన 15:3) ఆయన గురించి మోషే ప్రవక్త ఇలా అన్నాడు: “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) “ఆయన [యెహోవా] ఎంతో జాలియు కనికరమును గలవాడు” అని యాకోబు 5:11 చెబుతోంది. కాబట్టి దేవుడు దుష్టత్వానికి కారకుడు కాదు, కాలేడు.

శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) యెహోవా దేవుడు మనలోని చెడు కోరికల్ని ఉపయోగించి మనల్ని శోధించడు, చెడుక్రియలు చేసేలా మనల్ని పురికొల్పడు. మరి దుష్టత్వానికి, అది కలిగించే బాధలకు ఎవరు బాధ్యులు?

దుష్టత్వానికి ఎవరు బాధ్యులు?

దుష్టత్వానికి కొంతమేరకు మానవులే బాధ్యులని బైబిలు రచయితయైన యాకోబు అంటున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” (యాకోబు 1:14, 15) మనుష్యులు తమలోని అనుచిత కోరికల అనుసారంగా ప్రవర్తించవచ్చు. మానవునికి వారసత్వంగా సంక్రమించిన పాపం గురించి కూడా ఆలోచించండి. పాపానికున్న శక్తి మనలోవున్న తప్పుడు కోరికలను పెంచి, చెడు పర్యవసానాలకు దారితీస్తుంది. (రోమీయులు 7:21-23) అవును, వారసత్వంగా సంక్రమించిన పాపం మానవజాతిని ‘ఏలుతోంది,’ అది మానవులకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టే దుష్టకార్యాలకు వారిని బానిసలను చేసింది. (రోమీయులు 5:21) అంతేకాదు, ఇతరులు కూడా కీడు చేసేలా దుష్టులు వారిని పురికొల్పగలరు.—సామెతలు 1:10-16.

కానీ అపవాదియైన సాతానే దుష్టత్వానికి ప్రధాన కారకుడు. ఈ లోకంలో దుష్టత్వాన్ని ప్రారంభించింది అతడే. యేసుక్రీస్తు సాతానును ‘దుష్టుడు’ అనీ, ఈ ‘లోకానికి’ అంటే అవినీతి నిండిన ఈ మానవ సమాజానికి ‘అధికారి’ అని పిలిచాడు. యెహోవా దేవుని మంచి మార్గాల్లో నడవకుండా చేసే సాతాను శోధనకు లొంగిపోవడం ద్వారా మానవజాతిలో అధికభాగం అతడికి లోబడుతున్నారు. (మత్తయి 6:13; యోహాను 14:30; 1 యోహాను 2:15-17) “లోకమంతయు దుష్టుని యందున్నది” అని 1 యోహాను 5:19 చెబుతోంది. నిజానికి, సాతాను అతడి దూతలు “సర్వలోకమును మోసపుచ్చుచు” కేవలం ‘శ్రమనే’ కలుగజేస్తున్నారు. (ప్రకటన 12:9, 12) కాబట్టి, దుష్టత్వానికి ఖచ్చితంగా అపవాదియగు సాతానే కారణం.

వేదనకు, కష్టాలకు మరో కారణాన్ని వెల్లడిస్తూ, ప్రసంగి 9:11, NW ఇలా చెబుతోంది: ‘కాలవశము చేత, అనూహ్యంగా జరిగేవి మనకందరికి కలుగుతాయి.’ ఒక గోపురం కూలినప్పుడు దాని క్రింద పడి 18 మంది చనిపోయిన దుర్ఘటన గురించి యేసుక్రీస్తు ప్రస్తావించాడు. (లూకా 13:4) వారు ఆ సమయంలో, ఆ స్థలంలో ప్రమాదం జరుగుతుందని తెలియక ఆ సమయంలో ఆ స్థలంలో ఉండడంవల్ల మరణించారు. నేడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి మీద అక్కడున్న ఒక ఎత్తయిన భవనం నుండి ఇటుక జారిపడి ఆయనకు దెబ్బలు తగలవచ్చు. దానికి దేవుడు బాధ్యుడా? కాదు. అది ఎవరి ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగింది. ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలైనా, లేదా కుటుంబ శిరస్సు హఠాత్తుగా మరణించి భార్యాపిల్లలు అనాథలైనా కూడా దానికి దేవుడు బాధ్యుడు కాదు.

కాబట్టి దుష్టత్వానికి గానీ, బాధలకు గానీ దేవుడు బాధ్యుడు కాదనేది స్పష్టం. బదులుగా, దుష్టత్వాన్ని తీసివేసి, దానికి కారకులైనవారిని నాశనం చేయాలనేదే యెహోవా సంకల్పం. (సామెతలు 2:22) నిజానికి ఆయన అంతకన్నా ఎక్కువే చేస్తాడు. క్రీస్తు ద్వారా “అపవాది యొక్క క్రియలను లయపరచ”డమే దేవుని సంకల్పమని లేఖనాలు బయల్పరుస్తున్నాయి. (1 యోహాను 3:8) దురాశ, ద్వేషం, దుష్టకార్యాలపై ఆధారపడివున్న నేటి లోకవిధానం అప్పుడిక ఉండదు. దేవుడు “[అందరి] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసి,” బాధలు లేకుండా చేస్తాడు. (ప్రకటన 21:4) కానీ మీరిలా అడగవచ్చు: ‘దేవుడు అలా ఇదివరకే ఎందుకు చేయలేదు? దుష్టత్వం మన కాలం వరకు కొనసాగేందుకు ఆయన ఎందుకు అనుమతించాడు?’ ఆ ప్రశ్నకు జవాబులోని ఒక కీలకమైన విషయం, ఆదాముహవ్వలను గురించిన బైబిలు వృత్తాంతంలో కనిపిస్తుంది.

ప్రాముఖ్యమైన ఒక వివాదాంశం లేవదీయబడింది

మన కాలం వరకు దుష్టత్వం కొనసాగేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడనే విషయం, మానవ చరిత్రారంభంలో జరిగిన సంఘటనలతో ముడిపడివుంది. అప్పుడు జరిగిన ఒక సంఘటనలో సృష్టికర్త గురించి ఒక ప్రాముఖ్యమైన వివాదాంశం లేవదీయబడింది, ఆ వివాదాంశం అంత త్వరగా, సులభంగా తీర్చగలిగేది కాదు. అసలు ఏమి జరిగిందో మనం పరిశీలిద్దాం.

యెహోవా దేవుడు మొదటి స్త్రీపురుషులను పరిపూర్ణులుగా సృష్టించి వారికి పరదైసును నివాసస్థలంగా ఇచ్చాడు. వారు జంతువులకు భిన్నంగా ఉండేలా వారికొక వరం ఇవ్వబడింది, అదే స్వేచ్ఛాచిత్తం. (ఆదికాండము 1:28; 2:15, 19) మంచిచెడులను నిర్ణయించుకునే సామర్థ్యంతో సృష్టించబడిన ఆదాముహవ్వలు వివేచనతో, తమ సృష్టికర్తను ప్రేమించి, సేవించి, విధేయులవ్వాలని కోరుకోవచ్చు. లేదా దేవుని నిర్దేశాన్ని కాదని ఉద్దేశపూర్వకంగా ఆయనకు అవిధేయత చూపించవచ్చు.

ఆదాముహవ్వలకు తనపట్ల ఉన్న ప్రేమను ప్రదర్శించేందుకు వారికి ఒక అవకాశాన్నివ్వడానికి సత్యదేవుడు వారిపై ఒక నిషేధం పెట్టాడు. ఆయన ఆదాముకిలా ఆజ్ఞాపించాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఆదాముహవ్వలు తమ ప్రయోజనార్థమేకాక తమ తర్వాతి తరాలవారి ప్రయోజనార్థం కూడా దేవుని ఆమోదాన్ని పొందుతూ ఉండాలంటే వారు ఆ చెట్టు పండును తినకూడదు. వారలా తినకుండా ఉంటారా?

తర్వాత ఏమి జరిగిందో బైబిలు చెబుతోంది. అపవాదియైన సాతాను సర్పాన్ని పావుగా ఉపయోగించుకుని హవ్వ దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” దేవుని ఆజ్ఞ ఏమిటో హవ్వ చెప్పినప్పుడు సాతాను ఆమెతో ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” ఆ మాటల ప్రభావంతో హవ్వ కన్నులకు ఆ పండు ఎంత అందంగా కనిపించిందంటే, “ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తి[న్నది].” ఆ తర్వాత ఆమె “తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను” అని ఆ వృత్తాంతం చెబుతోంది. (ఆదికాండము 3:1-6) అలా ఆదాముహవ్వలు తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేసి, దేవునికి అవిధేయత చూపించడం ద్వారా పాపం చేశారు.

దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మీరు చూడగలుగుతున్నారా? దేవుడు ఆదాముతో చెప్పినదానికి పూర్తిగా భిన్నమైనదాన్ని అపవాది చెప్పాడు. సాతాను మాటల్లో, ఆదాముహవ్వలు మంచిచెడులను నిర్ణయించుకోవడానికి వారికి యెహోవా సహాయం అవసరం లేదనే ఆంతర్యం ఉంది. కాబట్టి సాతాను లేవదీసిన ఆ వివాదాంశం, మానవులపై పరిపాలన చేసేందుకు యెహోవాకున్న న్యాయబద్ధమైన హక్కు విషయంలో సందేహాలు రేపింది. కాబట్టి, యెహోవాకు సర్వాధిపత్యం వహించే హక్కుందా లేదా అనే అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని సాతాను లేవదీశాడు. సత్యదేవుడు ఆ వివాదాంశాన్ని ఎలా తీర్చాడు?

తగినంత సమయం అవసరం

తిరుగుబాటుదారులైన ఆ ముగ్గురిని అంటే సాతానును, ఆదామును, హవ్వను నాశనం చేసే శక్తి యెహోవాకు ఉంది. వారికన్నా దేవుడు ఎంతో శక్తిమంతుడనే విషయంలో సందేహమే లేదు. అయితే సాతాను దేవుని శక్తిని సవాలు చేయలేదు. బదులుగా యెహోవా పరిపాలనా హక్కును సవాలు చేశాడు. ఆ వివాదాంశంలో స్వేచ్ఛాచిత్తంవున్న వారందరూ అంటే అటు దేవదూతలు, ఇటు మానవులు ఇమిడివున్నారు. స్వేచ్ఛాచిత్తం అనే వరాన్ని సరిగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని అంటే దానిని దేవుడు ఏర్పర్చిన భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాల పరిధిలోనే ఉపయోగించుకోవాలని వారు అర్థం చేసుకోవాలి. అలా చేయని పక్షంలో, ఒక వ్యక్తి గురుత్వాకర్షణ శక్తిని పట్టించుకోకుండా ఎత్తైన భవనం మీది నుండి క్రిందికి దూకినప్పుడు ఎలాగైతే ఆయనకు తీవ్ర గాయాలవుతాయో అలాగే, స్వేచ్ఛాచిత్తాన్ని దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉపయోగించుకోకపోతే దుష్పరిణామాలే ఎదురౌతాయి. (గలతీయులు 6:7, 8) దేవుని అధికారాన్ని కాదని తమ స్వంత జీవనవిధానాన్ని ఎంచుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురౌతాయో తెలుసుకోవడం ద్వారా దేవదూతలు, మానవులు ప్రయోజనం పొందవచ్చు. కానీ దానికి సమయం అవసరం.

కొన్ని వివాదాంశాలను తీర్చడానికి సమయం అవసరమనే విషయాన్ని ఇలా ఉదాహరించవచ్చు: ఎవరు బలవంతులో తేల్చుకోవడానికి ఒక తండ్రి మరో తండ్రిని పోటీకి పిలిచాడనుకోండి. ఆ వివాదాంశాన్ని తేల్చడానికి ఎంతో సమయం పట్టదు. రాళ్ళు ఎత్తడం ద్వారా ఎవరి బలమెంతో చూపించవచ్చు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ బరువున్న రాయిని ఎత్తితే వారే బలవంతులని తేలిపోతుంది. కానీ ఏ తండ్రి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నాడు, ఆ తండ్రిని ఆయన పిల్లలు కూడా ప్రేమిస్తున్నారా లేదా అనేవి వివాదాంశంలో ఇమిడివున్నాయనుకోండి. లేక ఏ తండ్రి తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడనేది తేలాలంటే ఎలా? వారి బలాన్నిబట్టో లేక వారి మాటలను బట్టో ఒక నిర్ణయానికి రాలేం. దానికి తగినంత సమయం గడవడం అవసరం, జాగ్రత్తగా పరిశీలించడం అవసరం, ఆ వివాదాంశాన్ని తీర్చడానికి సరైన ముగింపుకు రావడం కూడా అవసరమే.

సమయం గడవడం ద్వారా రుజువైనదేమిటి?

సాతాను దేవుని పరిపాలనా హక్కును సవాలు చేసినప్పటినుండి ఇప్పటికి దాదాపు 6,000 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి గడిచిన సమయం ఏమి రుజువుచేసింది? సాతాను దేవునిపై వేసిన నిందకు సంబంధించిన రెండు అంశాలను పరిశీలించండి. సాతాను హవ్వతో ధైర్యంగా, “మీరు చావనే చావరు” అని చెప్పాడు. (ఆదికాండము 3:4) ఆదాముహవ్వలు నిషేధించబడిన ఆ పండును తింటే చనిపోరని చెప్పడం ద్వారా సాతాను నిజానికి యెహోవా అబద్ధికుడని అంటున్నాడు. అదెంత ఘోరమైన నిందో కదా! ఒకవేళ దేవుడు ఆ విషయంలో అబద్ధం చెప్పివుంటే, వేరే విషయాల్లో మనం ఆయనను ఎలా నమ్మవచ్చు? అయితే, గడిచిన సమయం ఏమని రుజువుచేసింది?

ఆదాముహవ్వలు అనారోగ్యానికి గురై, బాధలు అనుభవించి, వృద్ధులై, చివరకు మరణించారు. “ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 3:19; 5:5) విచారకరంగా ఆదాము ఎదుర్కొన్న చెడు పరిణామాలన్నీ ఆయన నుండి మానవజాతికంతటికి సంక్రమించాయి. (రోమీయులు 5:12) గడిచిన సమయం సాతాను “అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు” అని, యెహోవా ‘సత్యదేవుడు’ అని రుజువుచేసింది.—యోహాను 8:44; కీర్తన 31:5.

సాతాను హవ్వతో ఇలా కూడా అన్నాడు: “మీరు [నిషేధించబడిన చెట్టు ఫలములను] తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు [ఆదాముహవ్వలు] మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” (ఆదికాండము 3:5) ఆ మోసపూరిత మాటలతో సాతాను, మానవుల్లో తమను తామే పరిపాలించుకోవాలనే భ్రమ పుట్టించాడు. వారిని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో సాతాను, వారు దేవుని నిర్దేశాన్ని అంగీకరించకపోతేనే మెరుగైన జీవితం గడపగలరని పరోక్షంగా చెప్పాడు. అది నిజమని రుజువైందా?

చరిత్రంతటిలో సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. మానవులు సాధ్యమైనన్ని రకాల ప్రభుత్వాలను ప్రయత్నించి చూశారు. అయితే, ప్రతీసారి మానవజాతి ఘోరమైన పర్యవసానాల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని ఒక బైబిలు రచయిత 3,000 సంవత్సరాల క్రితం జ్ఞానయుక్తమైన ముగింపుకే వచ్చాడు. (ప్రసంగి 8:9) “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని” యిర్మీయా ప్రవక్త వ్రాశాడు. (యిర్మీయా 10:23) ఇటీవల సంవత్సరాల్లో సాధించబడిన వైజ్ఞానిక, సాంకేతిక పురోభివృద్ధి కూడా ఆ వాక్యాల సత్యసంధతను మార్చలేకపోయింది. గడిచిన సమయం ఆ మాటలు నిజమేనని రుజువుచేసింది.

మీరేమి చేస్తారు?

యెహోవా దేవుడు అనుమతించిన సమయం, ఆయన సర్వాధిపత్యపు హక్కు విషయంలో సాతాను సవాలు తప్పని నిరూపించింది. యెహోవా దేవుడే ఈ విశ్వానికి ఏకైక సర్వాధిపతి. ఆయనకు తన సృష్టిని పరిపాలించే హక్కుంది, ఆయన పరిపాలనా విధానం అత్యుత్తమమైనది. దేవుని పరిపాలనను నేరుగా చవిచూసిన దేవదూతలు ఆ విషయాన్నే అంగీకరిస్తూ ఇలా ప్రకటిస్తున్నారు: “ప్రభువా [యెహోవా], మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”—ప్రకటన 4:10, 11.

దేవుని సర్వాధిపత్యం గురించి మీ అభిప్రాయమేమిటి? మిమ్మల్ని పరిపాలించేందుకు దేవుడు అర్హుడని మీరు ఒప్పుకుంటారా? అలాగైతే, మీరు యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించాలి. ఆయన వాక్యమైన బైబిల్లోని అద్భుతమైన సత్యాలను, ఉపదేశాన్ని మీ జీవితంలోని అన్ని రంగాల్లో అన్వయించుకోవడం ద్వారా మీరలా చేయవచ్చు. “దేవుడు ప్రేమాస్వరూపి,” ఆయన తన సృష్టిపట్ల తనకున్న ప్రేమ మూలంగానే ఆజ్ఞలను, నియమాలను ఇచ్చాడు. (1 యోహాను 4:8) మనకు ఏది మంచిదో అది యెహోవా ఎన్నడూ మనకు దక్కకుండా చేయడు. కాబట్టి మీరు బైబిల్లోని ఈ సలహాను పాటించవచ్చు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.

[7వ పేజీలోని చిత్రం]

మీరు బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, దానిలోని విషయాలను మీ జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా దేవుని పరిపాలనను ఎంపికచేసుకోవచ్చు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Jeroen Oerlemans/Panos Pictures