కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనమెలా కనికరం చూపిస్తూ ఉండవచ్చు?

మనమెలా కనికరం చూపిస్తూ ఉండవచ్చు?

మనమెలా కనికరం చూపిస్తూ ఉండవచ్చు?

“అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” —గలతీయులు 6:10.

ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో మాట్లాడుతూ ఆయననిలా అడిగాడు: “నా పొరుగువాడెవడు”? ఆయనకు జవాబిస్తూ యేసు ఈ క్రింది ఉపమానం చెప్పాడు: “ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూళ్లవానికిచ్చి—ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను.” తర్వాత, యేసు తన శ్రోతను ఇలా అడిగాడు: “దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది”? అందుకా మనుష్యుడు, “అతనిమీద జాలిపడినవాడే అనెను.”—లూకా 10:25, 29-36.

2 గాయపడిన వ్యక్తిపట్ల సమరయుడు చూపించిన శ్రద్ధ నిజమైన కనికరం అంటే ఏమిటో ఎంత స్పష్టంగా ఉదాహరిస్తుందో కదా! జాలి లేదా కనికరంతో ఆ సమరయుడు గాయపడిన వ్యక్తికి ఉపశమనం కలిగించే చర్య చేపట్టాడు. అంతేకాక, అవసరంలోవున్న ఆ వ్యక్తి సమరయునికి అపరిచితుడు. జాతి, మత లేదా సాంస్కృతిక ప్రతిబంధకాలు కనికరాన్ని అడ్డుకోలేదు. మంచి పొరుగువాడైన సమరయుని గురించిన ఉపమానం చెప్పిన తర్వాత, యేసు తన శ్రోతకు ఈ సలహా ఇచ్చాడు: “నీవును వెళ్లి ఆలాగు చేయుము.” (లూకా 10:37) మనమా ఉపదేశాన్ని లక్ష్యపెట్టి ఇతరులపట్ల కనికరం చూపించేందుకు కృషి చేయవచ్చు. కానీ ఎలా చేయాలి? మన దైనందిన జీవితంలో ఏయే విధాలుగా మనం కనికరం చూపిస్తూ ఉండవచ్చు?

‘ఒక సహోదరుడు దిగంబరిగా ఉంటే’

3 “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (గలతీయులు 6:10) కాబట్టి మొదట మనం, విశ్వాసగృహానికి చేరినవారిపట్ల ఎలా విస్తారంగా కనికరం చూపించగలమో పరిశీలిద్దాం.

4 శిష్యుడైన యాకోబు నిజక్రైస్తవులు పరస్పరం కనికరం చూపించుకోవాలని ప్రోత్సహిస్తూ ఇలా వ్రాశాడు: “కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును.” (యాకోబు 2:13) ఈ ప్రేరేపిత వాక్యాల సందర్భం, మనం కనికరం చూపించగల కొన్ని మార్గాల గురించి మనకు చెబుతుంది. ఉదాహరణకు, యాకోబు 1:27లో మనమిలా చదువుతాం: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.” యాకోబు 2:15, 16 ఇలా చెబుతోంది: “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక—సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?”

5 ఇతరులపట్ల శ్రద్ధ కలిగివుండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం సత్యమతంలో ఒక భాగం. మన ఆరాధనా విధానం ప్రకారం, ఇతరులపట్ల మనకున్న శ్రద్ధను చూపించాలంటే వారికంతా మంచే జరుగుతుందని నోటిమాటగా చెప్పడం మాత్రమే సరిపోదు. బదులుగా, వాత్సల్యపూరిత కనికరం ఎంతో అవసరంలో ఉన్నవారిపట్ల మనమేదైనా చేయడానికి మనల్ని పురికొల్పుతుంది. (1 యోహాను 3:17, 18) అవును, మనం కనికరంతో చేయాల్సిన అనేకపనుల్లో రోగికి వంటచేసి పెట్టడం, వృద్ధులకు ఇంటిపనుల్లో సహాయం చేయడం, అవసరమైనప్పుడు క్రైస్తవ కూటాలకు తీసుకెళ్లి, తీసుకురావడం, సహాయం అవసరమైనవారి విషయంలో పిసినారితనం చూపించకుండా ఉండడం ఉన్నాయి.—ద్వితీయోపదేశకాండము 15:7-10.

6 వస్తుపరంగా సహాయం చేయడంకన్నా విస్తరిస్తున్న క్రైస్తవ సంఘ సభ్యులకు ఆధ్యాత్మిక తోడ్పాటునివ్వడం మరింత ప్రాముఖ్యం. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి” అని మనకు ఉద్బోధించబడింది. (1 థెస్సలొనీకయులు 5:14) “వృద్ధస్త్రీలు . . . మంచి ఉపదేశము చేయువా[రిగా]” ఉండాలని ప్రోత్సహించబడ్డారు. (తీతు 2:3) క్రైస్తవ పైవిచారణకర్తల గురించి బైబిలు ఇలా చెబుతోంది: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును.”—యెషయా 32:2.

7 విధవరాండ్రపట్ల, అనాథలపట్ల, సహాయం, ప్రోత్సాహం అవసరమున్న వారిపట్ల శ్రద్ధ చూపించడానికి తోడుగా మొదటి శతాబ్దపు సంఘాలు కొన్నిసార్లు ఇతర ప్రాంతాల్లోని విశ్వాసులకు సహాయపడేలా అవసరమైనవి సరఫరాచేశారు. ఉదాహరణకు, ప్రవక్తయైన అగబు “భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని” ప్రవచించినప్పుడు, సిరియాలోని అంతియొకయలోవున్న శిష్యుల్లో ప్రతి ఒక్కరూ “తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.” ఈ సహాయం “బర్నబా సౌలు అను వారిచేత” అక్కడి పెద్దలకు పంపించబడింది. (అపొస్తలుల కార్యములు 11:28-30) మరి నేటి విషయమేమిటి? తుఫానులు, భూకంపాలు లేదా సునామీల వంటి ప్రకృతి విపత్తుల తాకిడికి గురైన సహోదరులకు సహాయపడేందుకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” తరగతి సహాయ కమిటీలను ఏర్పాటుచేసింది. (మత్తయి 24:45) ఈ ఏర్పాటుకు సహకరిస్తూ స్వచ్ఛంద విరాళంగా మన సమయాన్ని, సామర్థ్యాన్ని, వనరుల్ని వెచ్చించడం మనం కనికరం చూపించేందుకు చక్కని మార్గం.

“మీరు పక్షపాతము గలవారైతే”

8 కనికరానికి, ప్రేమకు సంబంధించిన ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞకు’ విరుద్ధంగా పనిచేసే లక్షణం గురించి హెచ్చరిస్తూ యాకోబు ఇలా వ్రాశాడు: “మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.” (యాకోబు 2:8, 9) సంపన్నులపట్ల లేదా పరపతిగలవారిపట్ల అనుచిత గౌరవం చూపించడం మనం “దరిద్రుల మొఱ్ఱకు” తక్కువగా స్పందించేలా చేయవచ్చు. (సామెతలు 21:13) పక్షపాతం కనికర స్వభావాన్ని అణచివేస్తుంది. ఇతరులతో నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా మనం కనికరం చూపిస్తాం.

9 నిష్పక్షపాతంగా ఉండడమంటే మనమెన్నటికీ ఎవరిపట్లా ప్రత్యేక శ్రద్ధ చూపించకూడదని అర్థమా? కానేకాదు. తన జత పనివాడైన ఎపఫ్రొదితును గురించి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “అట్టివారిని ఘనపరచుడి.” ఎందుకు? “నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పనినిమిత్తము చావునకు సిద్ధమైయుండెను.” (ఫిలిప్పీయులు 2:25, 29, 30) ఎపఫ్రొదితు నమ్మకంగా చేసిన సేవ గుర్తింపదగినది. అంతేకాక, 1 తిమోతి 5:17లో మనమిలా చదువుతాం: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.” చక్కని ఆధ్యాత్మిక లక్షణాలు కూడా ప్రశంసార్హమైనవి. ఆ విధమైన శ్రద్ధ చూపించడం పక్షపాతం కాదు.

‘పైనుండివచ్చు జ్ఞానము కనికరముతో నిండుకొనినది’

10 నాలుకను గురించి యాకోబు ఇలా చెప్పాడు: “అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును.” ఈ సందర్భంలో యాకోబు ఇంకా ఇలా అంటున్నాడు: “మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.”—యాకోబు 3:8-10ఎ, 14-17.

11 కాబట్టి, మనం మన నాలుకను ఉపయోగించే విధం మనకు ‘కనికరము నిండిన’ జ్ఞానమున్నదో లేదో సూచిస్తుంది. మత్సరము లేదా వివాదం కారణంగా మనం అతిశయపడితే, అబద్ధాలాడితే లేదా హానికరమైన చాడీలు వ్యాపింపజేస్తే మనగురించి మనమేమి బయల్పర్చుకుంటాం? కీర్తన 94:4 ఇలా చెబుతోంది: “దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.” హానికరమైన మాటలు నిర్దోషుల మంచి పేరును ఎంత త్వరగా పాడుచేస్తాయో కదా! (కీర్తన 64:2-4) అంతేకాక, ‘అబద్ధాలాడే కూటసాక్షి’ కలిగించగల హాని గురించి ఆలోచించండి. (సామెతలు 14:5; 1 రాజులు 21:7-13) నాలుకను దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడిన తర్వాత యాకోబు ఇలా చెబుతున్నాడు: “నా సహోదరులారా, యీలాగుండకూడదు.” (యాకోబు 3:10బి) నిజమైన కనికరం, మన నాలుకను పవిత్రమైన, సమాధానకరమైన, వివేకయుక్తమైన రీతిలో ఉపయోగించడాన్ని కోరుతుంది. యేసు ఇలా అన్నాడు: “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.” (మత్తయి 12:36) మన నాలుకను ఉపయోగించే విషయంలో మనం కనికరంతో ఉండడమెంత ప్రాముఖ్యమో కదా!

‘మనుష్యుల అపరాధములు క్షమించండి’

12 రాజైన తన యజమానికి పదివేల తలాంతులు (ఆరుకోట్ల దేనారములు) అచ్చియున్న దాసుని గురించిన యేసు ఉపమానం కనికరం చూపించవలసిన మరో విధానాన్ని వివరిస్తోంది. ఆ అప్పు తీర్చేందుకు ఎలాంటి ఆధారమూలేని ఆ దాసుడు తనను కరుణించమని యజమానిని వేడుకున్నాడు. ఆ దాసుని యజమానుడు “కనికరపడి” అతని అప్పును క్షమించాడు. కానీ ఆ దాసుడు బయటకు వెళ్లి కేవలం నూరు దేనారములు తనకు అచ్చివున్న తోటి దాసుణ్ణి చూసి అతణ్ణి కనికరించకుండా చెరసాలలో వేయించాడు. జరిగింది తెలుసుకున్న యజమాని తాను క్షమించిన దాసుణ్ణి పిలిపించి అతనితో, “చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని” అన్నాడు. ఆ తర్వాత ఆ యజమాని అతణ్ణి చెరసాల అధికారులకు అప్పగించాడు. ఆ ఉపమానాన్ని ముగిస్తూ యేసు ఇలా అన్నాడు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.”—మత్తయి 18:23-35.

13 కనికరంలో క్షమించేందుకు సిద్ధంగా ఉండడం ఇమిడివుందని పైన ప్రస్తావించబడిన ఉపమానం ఎంత శక్తివంతంగా చూపిస్తుందో కదా! యెహోవా విస్తారమైన మన పాపరుణాన్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా ‘మనుష్యుల అపరాధములను క్షమించవద్దా’? (మత్తయి 6:14, 15) యేసు కనికరంలేని ఆ దాసుని గురించిన ఉపమానం చెప్పడానికి ముందు, పేతురు ఆయనను ఇలా అడిగాడు: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” దానికి యేసు, “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను” అని జవాబిచ్చాడు. (మత్తయి 18:21, 22) అవును, కనికరంగల వ్యక్తి “డెబ్బది ఏళ్ల మారులమట్టుకు” అంటే అపరిమితంగా క్షమించేందుకు సిద్ధంగా ఉంటాడు.

14 కనికరం చూపించడానికి మరో విధానాన్ని వివరిస్తూ కొండమీది ప్రసంగంలో యేసు ఇలా అన్నాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును . . . నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి—నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?” (మత్తయి 7:1-4) కాబట్టి, ఇతరులకు తీర్పుతీర్చేవారిగా లేదా అతిగా విమర్శించేవారిగా ఉండకుండా వారి బలహీనతలను సహించడం ద్వారా మనం ప్రతీరోజూ కనికరం చూపించవచ్చు.

‘అందరికీ మేలుచేయండి’

15 బైబిలు పుస్తకమైన యాకోబు విశ్వాసులమధ్య కనికరాన్ని నొక్కిచెబుతోంది, అంటే కనికరం చూపించడం క్రైస్తవ సంఘంలోని వారికి మాత్రమే పరిమితమని దానర్థం కాదు. “యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి” అని కీర్తన 145:9 చెబుతోంది. “దేవునిపోలి నడుచుకొనుడి,” ‘అందరికీ మేలు చేయండి’ అని మనం పురికొల్పబడుతున్నాం. (ఎఫెసీయులు 5:1; గలతీయులు 6:10) మనం “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను” ప్రేమించకపోయినా, లోకప్రజల అవసరాలపట్ల ఉదాసీనంగా ఉండము.—1 యోహాను 2:15.

16 క్రైస్తవులుగా మనం, “అనూహ్యంగా” జరిగే సంఘటనలకు బలైనవారికి లేదా కష్టతరమైన పరిస్థితుల్లోవున్న వారికి చేతనైనంత సహాయం చేసేందుకు వెనకాడం. (ప్రసంగి 9:11, NW) అయితే, మనమేమి చేయగలం, ఎంత చేయగలమనే దానిని పరిస్థితులు నిర్దేశిస్తాయి. (సామెతలు 3:27) ఇతరులకు వస్తుపరంగా సహాయం చేసేటప్పుడు మనం మేలనుకుని చేసేది వారిలో సోమరితనాన్ని ప్రోత్సహించేదిగా ఉండకుండా జాగ్రత్తపడతాం. (సామెతలు 20:1, 4; 2 థెస్సలొనీకయులు 3:10-12) కాబట్టి, నిజంగా కనికరం చూపించే వ్యక్తి కరుణాభరిత వాత్సల్య భావాలతో లేదా సహేతుకమైన సానుభూతితో స్పందిస్తాడు.

17 క్రైస్తవ సంఘం వెలుపలివారికి కనికరం చూపించడానికి ఉత్తమ మార్గం వారితో బైబిలు సత్యాన్ని పంచుకోవడమే. ఎందుకు? ఎందుకంటే మానవజాతిలో అధికశాతం నేడు ఆధ్యాత్మిక అంధకారంలో తడవులాడుతున్నారు. వారికెదురయ్యే సమస్యలతో వ్యవహరించే మార్గం లేకపోవడం లేదా భవిష్యత్తు విషయంలో ఏ నిరీక్షణా లేకపోవడం మూలంగా చాలామంది ‘కాపరిలేని గొఱ్ఱెలవలే విసికి చెదరియున్నారు.’ (మత్తయి 9:36) దేవుని వాక్య సందేశం, జీవన సమస్యలను తాళుకునేందుకు వారికి సహాయంచేస్తూ, వారి ‘పాదములకు దీపముగా’ ఉండగలదు. అలాగే ఉజ్వల నిరీక్షణకు ఆధారాన్నిస్తూ దేవుని భవిష్యత్‌ సంకల్పాన్ని గురించి ప్రవచించడంలో బైబిలు వారి ‘త్రోవకు వెలుగుగా’ కూడా ఉండగలదు. (కీర్తన 119:105) అద్భుతమైన సత్య సందేశం ఎంతో అవసరమైన వారికి దానిని చెప్పడం ఎంతటి ఆధిక్యతో కదా! మహా“శ్రమ” విరుచుకుపడబోతోంది కాబట్టి, రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులను చేసేపనిలో మనం ఉత్సాహంగా భాగం వహించాల్సిన సమయం ఇదే. (మత్తయి 24:3-8, 21, 22, 36-41; 28:19, 20) కనికరం చూపించడంలో ఇంతకన్నా ప్రాముఖ్యమైన పని మరేదీ లేదు.

“మీకు కలిగినవి” ఇవ్వండి

18 “మీకు కలిగినవి ధర్మము చేయుడి” అని యేసు చెప్పాడు. (లూకా 11:41) ఏదైనా ధర్మకార్యం నిజంగా కనికరంతో చేసినదిగా ఉండాలంటే, ఆ ధర్మకార్యం ప్రేమతో, నిండుమనసుతో, మనస్ఫూర్తిగా చేసేదై ఉండాలి. (2 కొరింథీయులు 9:7) కఠినత్వం, స్వార్థం, ఇతరుల బాధలను సమస్యలను పట్టించుకోకపోవడం సర్వసాధారణంగావున్న లోకంలో అలాంటి కనికరాన్ని చూపించడం ఎంత సేదదీర్పుగా ఉంటుందో కదా!

19 కాబట్టి మనం మన జీవితాల్లో మరింత కనికరం చూపించేందుకు కృషిచేద్దాం. మనమెంత కనికరం చూపిస్తామో, అంత ఎక్కువగా మనం దేవునిలా ఉంటాం. ఇది మనం నిజంగా అర్థవంతమైన, సంతృప్తిదాయకమైన జీవితం జీవించేందుకు సహాయం చేస్తుంది.—మత్తయి 5:7.

మీరేమి తెలుసుకున్నారు?

• తోటి విశ్వాసులపట్ల కనికరం చూపించడం ప్రత్యేకంగా ఎందుకు ప్రాముఖ్యం?

• క్రైస్తవ సంఘంలో మనమెలా కనికరం చూపించవచ్చు?

• సంఘం వెలుపలివారికి మేలు చేసేందుకు మనమెలా కృషిచేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మంచి పొరుగువాడైన సమరయుని ఉపమానం కనికరం గురించి మనకేమి బోధిస్తోంది?

3, 4. ప్రత్యేకంగా, క్రైస్తవ సంఘంలో కనికరం చూపించేందుకు మనమెందుకు శ్రద్ధ కలిగివుండాలి?

5, 6. స్థానిక సంఘ సహవాసంలో కనికరంతో మనమెలా అనేక పనులు చేయవచ్చు?

7. కనికరం చూపించడం గురించి సిరియాలోని అంతియొకయలోవున్న శిష్యులనుండి మనమేమి నేర్చుకుంటాం?

8. పక్షపాతం కనికరానికి విరుద్ధంగా ఎలా పనిచేస్తుంది?

9. అర్హులైనవారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఎందుకు తప్పుకాదు?

10. మనమెందుకు మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి?

11. మన నాలుకను ఉపయోగించే విషయంలో మనమెలా కనికరం చూపించవచ్చు?

12, 13. (ఎ) తన యజమానికి చాలామొత్తం డబ్బు అచ్చియున్న దాసుని ఉపమానం నుండి కనికరం గురించి మనమేమి నేర్చుకుంటాం? (బి) “డెబ్బది ఏళ్ల మారులమట్టుకు” మన సహోదరుణ్ణి క్షమించడం అంటే అర్థమేమిటి?

14. మత్తయి 7:1-4 ప్రకారం, మనం ప్రతీరోజూ కనికరం ఎలా చూపించవచ్చు?

15. కనికరం చూపించడం తోటి విశ్వాసులకు మాత్రమే ఎందుకు పరిమితం కాదు?

16. ఇతరులపట్ల మనం కనికరం చూపించే విధానాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

17. క్రైస్తవ సంఘం వెలుపలివారికి కనికరం చూపించడానికి ఉత్తమ మార్గమేమిటి?

18, 19. మనం మన జీవితాల్లో మరింత కనికరాన్ని చూపించేలా ఎందుకు కృషిచేయాలి?

[26వ పేజీలోని చిత్రం]

సమరయుడు కనికరంతో చర్యతీసుకున్నాడు

[27వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు కనికరంతో అనేక పనులుచేస్తారు

[30వ పేజీలోని చిత్రం]

సంఘం వెలుపలివారిపట్ల కనికరం చూపించడానికి ఉత్తమ మార్గం వారితో బైబిలు సత్యాన్ని పంచుకోవడమే