కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరుగునపడిపోయిన జాన్‌ మిల్టన్‌ పుస్తకం

మరుగునపడిపోయిన జాన్‌ మిల్టన్‌ పుస్తకం

మరుగునపడిపోయిన జాన్‌ మిల్టన్‌ పుస్తకం

జాన్‌ మిల్టన్‌ లోకాన్ని ప్రభావితం చేసినంత గొప్పగా మరే రచయిత చేయలేదు, పేరడైజ్‌ లాస్ట్‌ అనే ఆంగ్ల పురాణగాథను వ్రాసింది ఆయనే. మిల్టన్‌ జీవిత చరిత్రను వ్రాసిన ఒక వ్యక్తి చెబుతున్నట్లుగా, ఆయనను “చాలామంది అభిమానిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు, కానీ ఆయన గురించి తెలియనివారు మాత్రం చాలా తక్కువమంది ఉండవచ్చు.” ఇప్పటికీ ఆంగ్ల సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లుతుందంటే దానికి చాలా వరకు ఆయన రచనలే కారణం.

ఆయన లోకాన్ని అంత గొప్పగా ఎలా ప్రభావితం చేయగలిగాడు? ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌ అనే ఆయన ఆఖరి పుస్తకం వివాదాస్పదంగా మారి, దాదాపు 150 సంవత్సరాలపాటు ప్రచురించబడకుండా ఎందుకు ఆగిపోయింది?

ఆయన జీవితపు తొలినాళ్లు

జాన్‌ మిల్టన్‌ లండన్‌లోని ఒక సంపన్నవంతుల కుటుంబంలో 1608వ సంవత్సరంలో జన్మించాడు. గతాన్ని గుర్తుచేసుకుంటూ మిల్టన్‌ ఇలా అన్నాడు: “మా నాన్న నా చిన్నతనం నుండే సాహిత్యాధ్యయనం చేయడానికి నన్ను సిద్ధం చేశాడు. నాకు సాహిత్యంపట్ల ఎంత మక్కువ ఉండేదంటే పన్నెండేళ్ల వయసునుండి దాదాపు ప్రతీరోజు అర్థరాత్రి దాటేవరకు చదువుతూ ఉండేవాడిని.” ఆయన చదువులో బాగా రాణించి, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుండి 1632లో పట్టా పొందాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చరిత్ర పుస్తకాలు, ప్రాచీన గ్రీసు, రోముల్లో రచించబడిన సాహిత్యాన్ని చదివేవాడు.

మిల్టన్‌కు కవి కావాలనే కోరిక ఉండేది కానీ ఆ సమయంలో, ఇంగ్లాండ్‌లో సంస్కరణోద్యమం జరుగుతోంది. ప్రధానంగా ఆలివర్‌ క్రామ్వెల్‌ ప్రోద్బలంతో పార్లమెంటు ఒక న్యాయస్థానాన్ని ఏర్పర్చింది, అది 1649లో రాజైన ఛార్లెస్‌ Iకి మరణశిక్ష విధించింది. శక్తివంతమైన తన రచనల ద్వారా మిల్టన్‌ ఆ చర్యను సమర్థించి, క్రామ్వెల్‌ ప్రభుత్వానికి ప్రతినిధి అయ్యాడు. నిజానికి జాన్‌ మిల్టన్‌ కవిగా పేరు తెచ్చుకోకముందే రాజకీయాలపై, నైతిక విలువలపై తాను వ్రాసిన కరపత్రాలకు పేరుగాంచాడు.

మళ్లీ అధికారం రాజుల చేతుల్లోకి వచ్చి 1660లో ఛార్లెస్‌ II రాజు అయినప్పుడు, మిల్టన్‌కు క్రామ్వెల్‌తో ముందున్న స్నేహంవల్ల ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడింది. దానితో మిల్టన్‌ కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, అధికార హోదాలోవున్న స్నేహితుల సహాయంతో ప్రాణాన్ని దక్కించుకున్నాడు. ఆ సమయమంతటిలో, మతానికి సంబంధించిన విషయాలపట్ల ఆయనకున్న అమితమైన ఆసక్తి మాత్రం తగ్గలేదు.

“బైబిలు ప్రమాణాలు”

చిన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలపట్ల తనకున్న ఆసక్తిని గురించి వివరిస్తూ మిల్టన్‌ ఇలా వ్రాశాడు: “నేను చిన్నప్పటి నుండే ఆదిమ భాషల్లోని పాత, కొత్త నిబంధనలను శ్రద్ధగా అధ్యయనం చేయడం ప్రారంభించాను.” పరిశుద్ధ లేఖనాలు మాత్రమే నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో సరైన నిర్దేశాన్నివ్వగలవని మిల్టన్‌ నమ్మేవాడు. కానీ తన కాలంలోని ప్రసిద్ధమైన మతసంబంధ పుస్తకాలను అధ్యయనం చేసినప్పుడు ఆయనకు నిరాశే మిగిలింది. “నేను నా ప్రాథమిక నమ్మకాలను లేదా నా రక్షణ నిరీక్షణను ఇలాంటివాటి ఆధారంగా ఏర్పర్చుకోలేను అని నేననుకున్నాను” అని ఆయన ఆ తర్వాత వ్రాశాడు. తన నమ్మకాలు “బైబిలు ప్రమాణాలకు” అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోవాలనే తీర్మానంతో మిల్టన్‌ కొన్ని అంశాల పట్టిక ఒకటి తయారుచేసుకుని, వాటిక్రింద ప్రాముఖ్యమైన లేఖనాలను వ్రాసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన వ్రాసుకున్న పట్టికలోనుండే బైబిలు లేఖనాలను ఉదాహరించేవాడు.

నేడు జాన్‌ మిల్టన్‌ పేరు వినగానే అందరూ ఆయనను పేరడైజ్‌ లాస్ట్‌ను రచించిన కవిగానే గుర్తిస్తారు, అది మానవులు పరిపూర్ణతను ఎలా కోల్పోయారో తెలియజేసే బైబిలు వృత్తాంతంపై ఆధారపడిన కావ్యం. (ఆదికాండము 3వ అధ్యాయం) మొదటిసారిగా 1667లో ప్రచురించబడిన ఈ కావ్యమే ప్రాముఖ్యంగా మిల్టన్‌కు రచయితగా పేరుప్రఖ్యాతలు తెచ్చి, ఆంగ్లేయుల మధ్య ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆ కావ్యాన్నే కొనసాగిస్తూ ఆయన పేరడైజ్‌ రిగెయిన్డ్‌ అనే పుస్తకం వ్రాశాడు. ఆ కావ్యాల్లో మానవుల కోసం దేవుని ఆది సంకల్పం గురించి అంటే మానవులు పరదైసు భూమిపై పరిపూర్ణ జీవితాన్ని నిత్యం ఆనందించాలనే సంకల్పం గురించి, క్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమిపై పరదైసును పునరుద్ధరించే విషయం గురించి తెలియజేయబడింది. ఉదాహరణకు పేరడైజ్‌ లాస్ట్‌లో, క్రీస్తు “తనకు నమ్మకంగా ఉండేవారిని ఆశీర్వదించి, పరలోకంలో లేదా భూమిపై నిత్య సంతోషాన్ని అనుగ్రహించే” సమయం గురించి, “అప్పుడు భూమి అంతా పరదైసుగా అంటే ఏదెను తోటకన్నా ఎంతో సంతోషకరమైన స్థలంగా మారుతుందని, రోజులు మరింత ఉల్లాసకరంగా గడుస్తాయని” ప్రధాన దూతయైన మిఖాయేలు ప్రవచించినట్లు వ్రాయబడివుంది.

ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌

మిల్టన్‌ అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం గురించి, సిద్ధాంతాల గురించి పూర్తిగా వివరించే ఒక పుస్తకం వ్రాయాలనుకున్నాడు. ఆయనకు 1652 కల్లా కంటిచూపు పూర్తిగా పోయినా, 1674లో చనిపోయే వరకు తన సహచరుల సహాయంతో దానికోసం కృషి చేస్తూనేవున్నాడు. మిల్టన్‌ తన ఆఖరి పుస్తకానికి ఎ ట్రియటైస్‌ ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌ కంపైల్డ్‌ ఫ్రమ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ ఎలోన్‌ (పరిశుద్ధ లేఖనాల నుండి మాత్రమే పొందుపర్చబడిన క్రైస్తవ సిద్ధాంతంపై ఒక పుస్తకం) అని పేరు పెట్టాడు. దాని ముందుమాటలో ఆయనిలా వ్రాశాడు: “ఈ విషయంపై పుస్తకాలను వ్రాసిన అనేకమంది రచయితలు, . . . వారు బోధించే విషయాలు ఏ లేఖన భాగాలపై పూర్తిగా ఆధారపడివున్నాయో ఆ అధ్యాయాన్ని, వచనాన్ని మాత్రమే సంక్షిప్తంగా మార్జిన్‌లో పేర్కొనేవారు. దానికి భిన్నంగా నేను సాధ్యమైనంత ఎక్కువగా బైబిల్లోని అన్ని పుస్తకాల నుండి లేఖనాలను పేర్కొనడానికి తాపత్రయపడ్డాను.” మిల్టన్‌ చెప్పినట్లుగానే, ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌లో 9,000కన్నా ఎక్కువసార్లు లేఖనాలు ఉల్లేఖించబడ్డాయి లేదా ప్రస్తావించబడ్డాయి.

మిల్టన్‌ ముందెప్పుడూ తన అభిప్రాయాలను వెల్లడించడానికి సంకోచించకపోయినా ఈ పుస్తకాన్ని మాత్రం ప్రచురించకుండా ఆపేశాడు. ఎందుకు? ఒక కారణమేమిటంటే, అప్పట్లో అందరూ అంగీకరించే చర్చి బోధలకు తన పుస్తకంలోని లేఖనాధారిత వివరణలకు చాలా తేడా ఉందని ఆయనకు తెలుసు. అంతేకాక, రాచరిక పరిపాలన పునఃస్థాపించబడడంతో ఆయనకు ప్రభుత్వం నుండి కూడా మద్దతు లభించలేదు. కాబట్టి ఆయన పరిస్థితులు చక్కబడేవరకు ఆగివుండవచ్చు. ఏదేమైనా, మిల్టన్‌ మరణానంతరం ఆయన కార్యదర్శి ఒకాయన ఆ పుస్తకం యొక్క లాటిన్‌ ప్రతిని ఒక ప్రచురణకర్త దగ్గరకు తీసుకువెళ్లాడు కానీ ఆయన దానిని ప్రచురించడానికి ఒప్పుకోలేదు. విదేశీ వ్యవహారాల మంత్రి ఆ ప్రతిని స్వాధీనం చేసుకుని దానిని ప్రభుత్వ పత్రాలు దాచే స్థలంలో దాచిపెట్టేశాడు. ఆ తర్వాత 150 సంవత్సరాలకు గానీ మిల్టన్‌ వ్రాసిన ఆ పుస్తకం మళ్లీ వెలుగుచూడలేదు.

ప్రఖ్యాత కవి మిల్టన్‌ వ్రాసిన, కాగితంలో చుట్టబడి భద్రపర్చబడిన ఆ పుస్తకం వ్రాతప్రతి చివరకు 1823లో అక్కడ పని చేస్తున్న ఒక గుమస్తా కంటపడింది. అప్పట్లో ఇంగ్లాండ్‌ను పరిపాలిస్తున్న జార్జ్‌ IV దానిని లాటిన్‌ నుండి ఆంగ్లంలోకి అనువదించాలని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆజ్ఞాపించాడు. రెండు సంవత్సరాల తర్వాత దానిని ఆంగ్లంలో ప్రచురించినప్పుడు క్రైస్తవమత ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారి మధ్య, సాహిత్య ప్రియుల మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు మొదలయ్యాయి. ఇంగ్లాండ్‌లో మతసంబంధ విషయాల గురించి వ్రాసే రచయితగా పేరొందిన మిల్టన్‌, అనాదిగా చర్చి నమ్ముతున్న సిద్ధాంతాలను అంత సూటిగా ఖండించాడని నమ్మలేక ఒక బిషప్‌ వెంటనే ఆ పుస్తకం ఆయన వ్రాసింది కాదని ప్రకటించాడు. అలాంటిదేదో జరుగుతుందని ఊహించిన అనువాదకుడు ఆ పుస్తకాన్ని మిల్టనే వ్రాశాడని నిరూపించడానికి ఆ పుస్తకంలో అధస్సూచిలను పెట్టాడు. ఆ అధస్సూచిల్లో ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌కు, పేరడైజ్‌ లాస్ట్‌కు మధ్య ఉన్న సారూప్యాల్లో కనీసం 500 ప్రస్తావించబడ్డాయి. *

మిల్టన్‌ నమ్మకాలు

మిల్టన్‌ కాలం నాటికి ఇంగ్లాండ్‌లోని ప్రజలు ప్రొటస్టెంట్ల సంస్కరణోద్యమాన్ని సమర్థిస్తూ, రోమన్‌ క్యాథలిక్‌ చర్చీ నుండి విడిపోయారు. విశ్వాసానికి, నైతికతకు సంబంధించిన విషయాలపై సాధారణంగా పరిశుద్ధ లేఖనాలు చెప్పేదే ప్రామాణికమైనది కానీ పోప్‌ చెప్పేది కాదని ప్రొటస్టెంట్లు నమ్మేవారు. అయితే ప్రొటస్టెంట్లు బోధించే అనేక బోధలు, ఆచారాలు కూడా లేఖన విరుద్ధమైనవని మిల్టన్‌ ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌లో వ్రాశాడు. ఆయన బైబిలు లేఖనాల ఆధారంగా, మనుష్యులకు స్వేచ్ఛాచిత్తం ఉందనే విషయాన్ని సమర్థిస్తూ విధిరాత అనే కాల్వనిస్టు సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. ఆయన యెహోవా దేవుని పేరును తన రచనల్లో విరివిగా ఉపయోగించి, దానిని గౌరవపూర్వకంగా ఉపయోగించమని ప్రోత్సహించాడు.

ఆత్మ మరణిస్తుందని మిల్టన్‌ లేఖనాధారంగా వాదించాడు. ఆదికాండము 2:7పై వ్యాఖ్యానిస్తూ ఆయనిలా వ్రాశాడు: “మానవుడు ఈ విధంగా సృష్టించబడిన తర్వాత ఆయన గురించి చివరిగా ఇలా చెప్పబడింది: నరుడు జీవాత్మ ఆయెను. . . . మనిషిలో వేర్వేరుగా ఉండే రెండు భాగాలు అంటూ ఏవీ లేవు: సాధారణంగా అందరూ అనుకుంటున్నట్లుగా ఆత్మ, శరీరం అంటూ రెండు వేర్వేరు భాగాలుగా మానవుడు సృష్టించబడలేదు. పూర్తి మనిషే ఆత్మ, ఆత్మే మనిషి.” ఆ తర్వాత మిల్టన్‌ ఇలా ప్రశ్నించాడు: “మనిషి మొత్తం మరణిస్తాడా లేక శరీరం మాత్రమే మరణిస్తుందా?” మనిషి భౌతిక శరీరం మరణించినప్పుడు సజీవంగా ఉండే అమర్త్యమైన, అదృశ్యమైన భాగమేదీ మానవునిలో లేదని మిల్టన్‌ లేఖనాధారితంగా నిరూపించాడు. చనిపోయిన మానవులకు భవిష్యత్తులో పునరుత్థాన నిరీక్షణ ఉందని చూపించడానికి లూకా 20:37, యోహాను 11:25 లాంటి లేఖనాలను కూడా మిల్టన్‌ ఉదాహరించాడు.

ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌ పుస్తకానికి తీవ్ర వ్యతిరేకత ఎందుకు ఎదురైంది? ఒక కారణమేమిటంటే మిల్టన్‌ ఆ పుస్తకంలో, దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రియైన దేవునికంటే తక్కువ స్థానంలో ఉన్నాడని చూపించే స్పష్టమైన శక్తివంతమైన బైబిలు లేఖనాలను రుజువులుగా చూపించాడు. ఆయన యోహాను 17:3 మరియు యోహాను 20:17 లేఖనాలను ఉల్లేఖించిన తర్వాత ఇలా ప్రశ్నించాడు: “తండ్రి క్రీస్తుకు, మనకు దేవుడైతే, అంతేకాక దేవుడు ఒక్కడే ఉంటే, ఆ తండ్రి కాక మరెవరు దేవుడు కాగలరు?”

అంతేకాక మిల్టన్‌ ఇలా కూడా అన్నాడు: “కుమారుడు, ఆయన అపొస్తలులు వారు చెప్పిన, వ్రాసిన ప్రతీ విషయంలో తండ్రే కుమారునికన్నా అన్నింటిలో గొప్పవాడని ఒప్పుకున్నారు.” (యోహాను 14:28) నిజానికి క్రీస్తే మత్తయి 26:39లో ఇలా అన్నాడు: “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము. . . . క్రీస్తు నిజానికి తానే దేవుడైనప్పుడు తనకు తాను ప్రార్థించుకోకుండా తండ్రికే ఎందుకు ప్రార్థించాడు? ఆయనే మానవుడు మరియు సర్వోన్నత దేవుడైతే, తను చేయగల పని కోసం వేరొకరిని ఎందుకు ప్రార్థించాడు? . . . ప్రతీలేఖనంలో కుమారుడు తండ్రినే గౌరవించి, ఘనపర్చినట్లుగా, మనం కూడా చేయాలని ఆయన బోధిస్తున్నాడు.”

మిల్టన్‌లోని లోపాలు

జాన్‌ మిల్టన్‌ సత్యం కోసం అన్వేషించాడు. అయినా మానవ పరిమితుల వల్ల ఆయన అభిప్రాయాల్లో కొన్ని ఆయన జీవితంలోని చేదు అనుభవాల మూలంగా ప్రభావితమయ్యాయి. ఆయన ఓ గొప్ప భూస్వామి కుమార్తెను వివాహం చేసుకున్నాడు, వారి పెళ్లి జరిగిన వెంటనే ఆయన భార్య ఆయనను విడిచి వెళ్ళిపోయి దాదాపు మూడు సంవత్సరాలపాటు తన ఇంట్లోనే ఉండిపోయింది. ఆ కాలంలో మిల్టన్‌ విడాకుల్ని సమర్థిస్తూ కరపత్రాలను వ్రాశాడు. క్రీస్తు చెప్పినట్లుగా వ్యభిచారం ఆధారంగా మాత్రమే విడాకులు తీసుకోవచ్చని కాక అభిప్రాయభేదాల కారణంగా కూడా విడాకులు తీసుకోవచ్చని వాటిలో వ్రాశాడు. (మత్తయి 19:9) ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌లో కూడా ఆయన అదే అభిప్రాయాన్ని సమర్థించాడు.

మిల్టన్‌లో లోపాలున్నా, ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌లో అనేక ప్రాముఖ్యమైన బోధల విషయంలో బైబిలు చెప్పేది ఖచ్చితంగా వెల్లడిచేయబడింది. ఈనాటి వరకు, ఆయన వ్రాసిన ఆ పుస్తకం, పాఠకులు పరిశుద్ధ లేఖనాల సాటిలేని ప్రమాణాలతో తమ నమ్మకాలను పోల్చిచూసుకోవాలని ప్రోత్సహిస్తోంది.

[అధస్సూచి]

^ పేరా 14 యేల్‌ విశ్వవిద్యాలయం 1973లో ముద్రించిన ఆన్‌ క్రిస్టియన్‌ డాక్ట్రిన్‌ యొక్క కొత్త అనువాదం, మిల్టన్‌ వ్రాసిన లాటిన్‌ పుస్తకం నుండి మరింత ఖచ్చితంగా అనువదించబడింది.

[11వ పేజీలోని చిత్రం]

మిల్టన్‌ బైబిల్‌ను ఎంతో శ్రద్ధగా చదివేవాడు

[చిత్రసౌజన్యం]

Courtesy of The Early Modern Web at Oxford

[12వ పేజీలోని చిత్రం]

“పేరడైజ్‌ లాస్ట్‌” అనే కావ్యం మిల్టన్‌కు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది

[చిత్రసౌజన్యం]

Courtesy of The Early Modern Web at Oxford

[12వ పేజీలోని చిత్రం]

మిల్టన్‌ వ్రాసిన ఆఖరి పుస్తకం దాదాపు 150 సంవత్సరాలపాటు మరుగునపడిపోయింది

[చిత్రసౌజన్యం]

Image courtesy of Rare Books and Special Collections, Thomas Cooper Library, University of South Carolina

[11వ పేజీలోని చిత్రసౌజన్యం]

Image courtesy of Rare Books and Special Collections, Thomas Cooper Library, University of South Carolina