కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మీ పిల్లల హృదయాల్లో దేవునిపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేయవచ్చు?

మీరు మీ పిల్లల హృదయాల్లో దేవునిపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేయవచ్చు?

మీరు మీ పిల్లల హృదయాల్లో దేవునిపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేయవచ్చు?

ఈకాలంలో ఒక వ్యక్తి యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకోవడం పెద్ద సవాలే. (కీర్తన 16:8) ప్రవచనాలు తెలియజేస్తున్నట్లుగా మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. అనేకమంది “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమి[స్తున్నారు].” (2 తిమోతి 3:1-5) అవును, నేటి లోకంలో ప్రజలు చాలా అరుదుగా దేవునిపట్ల యథార్థమైన ప్రేమ చూపిస్తున్నారు.

మన పిల్లల హృదయాల్లో దేవునిపట్ల ప్రేమ ఉత్పన్నమవ్వాలంటే మనం దాని కోసం కృషి చేయాలి. వారి హృదయాల్లో యెహోవా దేవునిపట్ల ప్రేమను పెంపొందించాలి. మనం దానిని ఎలా చేయవచ్చు?

మనసువిప్పి మాట్లాడుకోండి

ముందు మన హృదయాలు దేవునిపట్ల ప్రేమతో నిండివుంటేనే మనం మన పిల్లల్లో దేవునిపట్ల ప్రేమను పెంపొందించగలం. (లూకా 6:40) అదే విషయాన్ని చెబుతూ బైబిలు ఇలా అంటోంది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజే[యవలెను].”—ద్వితీయోపదేశకాండము 6:4-7.

మన పిల్లల హృదయాల్లో దేవునిపట్ల ప్రేమను మనం ఎలా వృద్ధిచేయవచ్చు? అలా చేయాలంటే ముందుగా మనం వారి హృదయాల్లో ఏముందో తెలుసుకోవాలి? రెండవదిగా, మన హృదయాల్లో ఏముందో వారికి చెప్పాలి.

యేసుక్రీస్తు తన శిష్యుల్లో ఇద్దరితోపాటు ఎమ్మాయుకు వెళ్ళే త్రోవలో ఉన్నప్పుడు, ఆయన ముందుగా వారికి ఆందోళన కలిగిస్తున్న విషయాలేమిటో చెప్పమని అడిగాడు. వారు చెప్పేది కొద్దిసేపు విన్న తరువాతే యేసు లేఖనాలను వివరించడం ద్వారా వారి ఆలోచనల్ని సరిచేశాడు. ఆ తర్వాత వారిలా అన్నారు: ‘ఆయన మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?’ వారి మధ్య జరిగిన ఆ సంభాషణ మనసువిప్పి మాట్లాడుకోవడానికి ఒక ఉదాహరణ. (లూకా 24:15-32) మనం మన పిల్లల హృదయాల్లో ఏముందో ఎలా తెలుసుకోవచ్చు?

ఎదిగిన లేదా యుక్త వయసుకు చేరుకోబోతూ సంఘంలో మంచి మాదిరినుంచుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో కొందరిని, మనసువిప్పి మాట్లాడుకోవడం గురించి ఇటీవల అడగడం జరిగింది. మెక్సికోలో నివసిస్తున్న గ్లెన్‌కి నలుగురు ఎదిగిన పిల్లలున్నారు. * ఆయనిలా చెబుతున్నాడు: “తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మంచి సంభాషణ ఉండాలంటే దానికి చొరవ తీసుకోవడం అవసరం. మా పిల్లలతో సమయం గడపడానికి నేను, నా భార్య ఏమంత ప్రాముఖ్యంకాని పనులను మానేసేవాళ్లం. మా పిల్లలు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రమంతా వారితో గడిపేవాళ్లం, ఏ విషయాలంటే ఆ విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అలాగే భోజన సమయాల్లో కూడా వాళ్ళ మాటలు వినడం ద్వారా మేము వారి సమస్యలను గుర్తించి, వారిలో ఏదైనా తప్పుంటే తరచూ వారికి తెలియకుండానే సున్నితంగా సరిదిద్దేవాళ్లం.”

మనసువిప్పి మాట్లాడుకోవడంలో మన హృదయంలో ఏముందో వ్యక్తం చేయడం కూడా ఒక భాగమే. యేసు ఇలా అన్నాడు: “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; . . . హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:45) జపాన్‌లో, పూర్తికాల సేవ చేస్తున్న ముగ్గురు పిల్లల తండ్రియైన టోషికీ ఇలా అంటున్నాడు: “నాకు యెహోవాపై విశ్వాసం ఎందుకు ఏర్పడిందో, ఆయన ఉనికిలో ఉన్నాడని నేను మనసారా ఎందుకు నమ్ముతున్నానో చెప్పడమేకాక, బైబిలు సరైనదని, అదే మన జీవితానికి అత్యుత్తమ నిర్దేశాన్నిస్తుందని నా జీవితానుభవం ఎలా రుజువుచేసిందో నేను వారికి ఎన్నోసార్లు చెప్పాను.” మెక్సికోలో నివసించే సిండీ ఇలా అంటోంది: “నా భర్త ఎప్పుడూ పిల్లలతో కలిసి ప్రార్థించేవాడు. ఆయన మనసువిప్పి మాట్లాడడం విన్నప్పుడు యెహోవా కల్పిత దేవుడు కాదని, నిజమైన వ్యక్తని వారికి అర్థమైంది.”

మన మాదిరి చూపించగల శక్తివంతమైన ప్రభావం

మన మాటలకన్నా మన జీవన విధానం ఎంతో ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అది దేవునిపట్ల మనకు ఎంత ప్రేమ ఉందో మన పిల్లలకు చూపిస్తుంది. యేసుక్రీస్తు యెహోవాకు చూపించిన విధేయతను గమనించడం ద్వారా ప్రజలు, ఆయనకు దేవునిపట్ల ఎంత గాఢమైన ప్రేమ ఉందో గ్రహించగలిగారు. “నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను” అని యేసు చెప్పాడు.—యోహాను 14:31.

వేల్స్‌కు చెందిన గారెత్‌ అనే యెహోవాసాక్షి ఇలా అంటున్నాడు: “మనం యెహోవాను ప్రేమిస్తున్నామనీ, ఆయన చిత్తానికి అనుగుణంగానే ప్రతీది చేయడానికి ప్రయత్నిస్తున్నామనీ మన పిల్లలు చూడాలి. ఉదాహరణకు, దేవుడు మనకు చెప్పినవాటిని పాటించడంలో భాగంగా నేను నా తప్పుల్ని ఒప్పుకుంటానని నా పిల్లలకు తెలుసు. ఇప్పుడు నా పిల్లలు అదే చేయడానికి ప్రయత్నిస్తున్నారు.”

ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ ఇలా చెబుతున్నాడు: “మా జీవితాల్లో సత్యం అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉందని మా పిల్లలు చూడాలనుకున్నాం. ఉద్యోగం విషయంలో లేదా వినోదం విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ముందుగా మేము మా క్రైస్తవ బాధ్యతలను అవెలా ప్రభావితం చేస్తాయనేది ఆలోచిస్తాం. మా 19 ఏళ్ల అమ్మాయి సహాయ పయినీరు సేవలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు అలాగే ఆలోచించడం చూసినప్పుడు మాకెంతో సంతోషంగా ఉంటుంది.”

దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మా పిల్లలకు సహాయం చేయడం

మనం అర్థంచేసుకోలేని వ్యక్తులను ప్రేమించలేం, వారిని నమ్మలేం. ఫిలిప్పీలోని క్రైస్తవులు యెహోవాపట్ల తమకున్న ప్రేమను అధికం చేసుకోవాలని అపొస్తలుడైన పౌలు కోరుకున్నప్పుడు ఆయన వారికిలా వ్రాశాడు: “మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:9) పెరూ నివాసియైన ఫాల్కోనీర్యోకు నలుగురు పిల్లలు, ఆయనిలా అంటున్నాడు: “వారితో క్రమంగా బైబిలు చదవడం, అధ్యయనం చేయడం వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. కొన్నిసార్లు నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను, దాంతో దేవునిపట్ల వారికున్న ప్రేమ సన్నగిల్లడాన్ని గమనించాను.” ఆస్ట్రేలియాకు చెందిన గారీ ఇలా చెబుతున్నాడు: “నేను తరచూ మా పిల్లలకు, బైబిలు ప్రవచనాలు నెరవేరుతున్నాయనడానికి రుజువులు చూపిస్తాను. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో కూడా చెబుతాను. కుటుంబపరంగా మేమంతా కలిసి క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం వారి విశ్వాసం బలపడడానికి ఎంతగానో తోడ్పడింది.”

పిల్లలు ప్రశాంతమైన, అనుకూల వాతావరణం ఉంటే సంతోషంగా నేర్చుకుంటారు, అలాంటి వాతావరణంలో జ్ఞానం సంపాదించుకుంటే అది వారి హృదయాన్ని చేరుతుంది. (యాకోబు 3:18) బ్రిటన్‌కు చెందిన షాన్‌, పోలెన్‌ దంపతులకు నలుగురు పిల్లలు, వారిలా అంటున్నారు: “కుటుంబ బైబిలు అధ్యయనం సమయంలో, పిల్లలు కాస్త గోల చేసినా మేము వారిని తిట్టకుండా ఉండేందుకు ప్రయత్నించేవాళ్లం. మా అధ్యయనాన్ని ప్రతీసారి ఒకేలా కాక వినూత్నంగా నిర్వహించేవాళ్లం. కొన్నిసార్లు మా పిల్లలనే ఏదోక అంశాన్ని ఎంచుకోమనేవాళ్లం. యెహోవా సంస్థ తయారుచేసిన వీడియోలను ఉపయోగించేవాళ్లం. కొన్నిసార్లు మేము మధ్యలో చర్చించుకోవడానికి వీలుగా కొన్ని సీన్లను మళ్ళీ చూసేవాళ్లం లేదా కాసేపు దానిని ఆపేవాళ్లం.” బ్రిటన్‌లోనే ఉంటున్న మరో తల్లి కిమ్‌ ఇలా చెబుతోంది: “నా పిల్లల్ని ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడానికి వీలుగా నేను కుటుంబ అధ్యయనం కోసం శ్రద్ధగా సిద్ధపడతాను. అధ్యయనం చేయడం మాకెంతో ఇష్టం. ఆ సమయం ఎంతో సరదాగా గడుస్తుంది.”

సహవాసులను ఎంచుకోవడం

దేవుణ్ణి తమ స్నేహితునిగా చేసుకున్న ప్రజలు తమ చుట్టూ ఉంటే, పిల్లల్లో యెహోవాపట్ల ప్రేమ, సత్యారాధన పట్ల మెప్పుదల అధికమవడం ఎంతో సులభం. మన పిల్లలు ఎవరితో సంభాషిస్తే, ఆడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందో, అలాంటివారితో సహవసించేలా ఏర్పాట్లు చేయడానికి కొంత ప్రయాసపడాల్సి ఉంటుంది. కానీ కృషికి తగ్గ ఫలితాలు తప్పక లభిస్తాయి! అంతేకాక, తమ జీవితాల్లో పూర్తికాల పరిచర్యకు ప్రథమస్థానమిచ్చిన యెహోవాసాక్షులతో మన పిల్లలు కలిసే అవకాశాలను కల్పించడం నిజంగానే ఎంతో ప్రయోజనకరం. దేవుణ్ణి ఉత్సాహంతో ఆరాధించే సేవకులతో సహవసించడం వల్లే అనేకమంది పూర్తికాల సేవను ఎంచుకున్నారు. మిషనరీగా మారిన ఒక సహోదరి ఇలా అంటోంది: “మా తల్లిదండ్రులు ఎన్నో సందర్భాల్లో పయినీర్లను భోజనాలకు పిలిచేవారు. పరిచర్యలో వారెంతో సంతోషాన్ని అనుభవిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయేది, అది చూసినప్పుడు నేను కూడా దేవునికి అలాగే సేవచేయాలని కోరుకునేదాన్ని.”

ఇతరులు మన పిల్లలపై మంచి లేదా చెడు ప్రభావం చూపించగలరన్న మాట నిజమే. కాబట్టి చెడు సహవాసాలవల్ల ఎదురయ్యే ప్రమాదాలు, తల్లిదండ్రులుగా మన నైపుణ్యాలకు ఒక సవాలుగానే ఉంటాయి. (1 కొరింథీయులు 15:33) యెహోవాను ప్రేమించని లేదా ఆయన గురించి తెలియని వారితో సహవసించడం మంచిది కాదని మన యౌవనస్థులకు నేర్పించగలగడం ఒక కళ. (సామెతలు 13:20) ముందు ప్రస్తావించబడిన షాన్‌ ఇలా అంటున్నాడు: “స్కూల్లో తోటి విద్యార్థులతో మంచి సంబంధాలను కలిగివుండాలని మా పిల్లలకు నేర్పించాము కానీ వాటిని సరైన స్థానంలో ఉంచాలని అంటే స్కూలుకే పరిమితం చేయాలని కూడా చెప్పాం. స్కూల్లోని క్రీడా కార్యక్రమాల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనకూడదో మా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాం.”

శిక్షణయొక్క విలువ

మన పిల్లలు తమ నమ్మకాలను ఇతరులకు వివరించేలా వారికి శిక్షణనివ్వడం ద్వారా వారు దేవునిపట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి మనం సహాయం చేస్తాం. అమెరికా నివాసి అయిన మార్క్‌ ఇలా అంటున్నాడు: “చక్కగా తయారై బహిరంగ పరిచర్యకు వెళ్లినప్పుడే కాక ఏ సమయంలోనైనా తమ విశ్వాసాన్ని గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఆనందించవచ్చనే విషయాన్ని మా పిల్లలు తెలుసుకోవాలని అనుకున్నాం. అందుకే మేము విహారయాత్రలకు అంటే పార్కుకో, సముద్రతీరానికో, లేక వనాలకో వెళ్లినప్పుడు మాతోపాటు బైబిళ్లను బైబిలు సాహిత్యాన్ని తీసుకువెళ్లేవాళ్లం. అక్కడ కలిసిన ప్రజలతో మేము నమ్ముతున్న విషయాల గురించి మాట్లాడేవాళ్లం. మాతోపాటు అలా అనియత సాక్ష్యమివ్వడాన్ని మా అబ్బాయిలు ఎంతో ఇష్టపడేవారు. మేము మాట్లాడుతున్నప్పుడు వారు కూడా సంభాషణలో పాల్గొంటూ వాళ్ళ నమ్మకాల గురించి మాట్లాడేవారు.”

అపొస్తలుడైన యోహాను తన వృద్ధాప్యంలో, దేవునిపట్ల తమకున్న ప్రేమను పెంచుకునేలా ఎంతోమందికి సహాయం చేశాడు. వారి గురించి ఆయనిలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 4) మన పిల్లలు తమ హృదయాల్లో దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకునేందుకు మనం సహాయం చేస్తే, యోహాను పొందినలాంటి సంతోషాన్నే మనం కూడా పొందుతాం.

[అధస్సూచి]

^ పేరా 8 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[9వ పేజీలోని చిత్రాలు]

మన నమ్మకాల గురించి మనసువిప్పి మాట్లాడుకోవడానికి చొరవ తీసుకోవడం అవసరం

[10వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలు దేవునిపట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చేసేలా వారికి శిక్షణనివ్వండి

[చిత్రసౌజన్యం]

Courtesy of Green Chimneys Farm