కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోనాతాను ‘దేవుని సహాయముతో జయించాడు’

యోనాతాను ‘దేవుని సహాయముతో జయించాడు’

యోనాతాను ‘దేవుని సహాయముతో జయించాడు’

ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజుయొక్క కుమారుడు, అజ్ఞాతంలోవున్న ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ రాకుమారుడు ఆయనతో, “నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును” అని చెప్పాడు.—1 సమూయేలు 23:16, 17.

ఆ రాకుమారుని పేరు యోనాతాను, అజ్ఞాతంలోవున్న వ్యక్తి దావీదు. ఒకవేళ యోనాతాను మరణించివుండకపోతే ఆయన దావీదుకు సహకారి అయ్యుండేవాడే!

యోనాతాను, దావీదుల మధ్యవున్న స్నేహం ఎంతో అసాధారణమైనది. నిజానికి యోనాతానే ఒక అసాధారణ వ్యక్తి. ఆయన సమకాలీనులు కూడా అలాగే భావించారు ఎందుకంటే వారు ఆయన గురించి ఇలా అన్నారు: ‘ఆయన దేవుని సహాయముతో జయించాడు.’ (1 సమూయేలు 14:45) వారు ఎందుకలా అన్నారు? యోనాతానులో ఎలాంటి లక్షణాలు ఉండేవి? ఆయన జీవిత కథ ఎందుకు ప్రాముఖ్యమైనది?

ఇశ్రాయేలీయులు ‘ఇరుకునపడ్డారు’

బైబిల్లో యోనాతాను ప్రస్తావన వచ్చేసమయానికి, ఇశ్రాయేలీయులు ‘ఇరుకునపడ్డారు’ అంటే వారు విషమ పరిస్థితుల్లో ఉన్నారు. ఫిలిష్తీయులు ఆ దేశాన్ని ఆక్రమించుకుని, ఇశ్రాయేలీయులు తమను తాము రక్షించుకునే అవకాశం లేకుండా చేశారు.—1 సమూయేలు 13:5, 6, 17-19.

అయితే, యెహోవా మాత్రం తన ప్రజల్ని ఎన్నటికీ ఎడబాయనని చెప్పాడు, యోనాతాను ఆ విషయాన్ని పూర్తిగా నమ్మాడు. ఆయన తండ్రియైన సౌలు గురించి దేవుడు ఇలా చెప్పాడు: ‘ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను ఆయన విడిపించాలి.’ యోనాతాను ఆ మాటలు నమ్మాడు. ఆయుధరహితులైన 1,000 మంది ఇశ్రాయేలీయులతోవెళ్ళి, ఫిలిష్తీయులపై ఆయనప్పటికే విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన ఫిలిష్తీయుల నుండి ఎప్పటికీ ప్రమాదం లేకుండా చేయాలనుకున్నాడు.—1 సమూయేలు 9:16; 12:22; 13:2, 3, 22.

ధైర్యంగా దాడి చేయడం

యోనాతాను మిక్మషు కనుమ దగ్గరున్న ఫిలిష్తీయుల దండును గురిగా పెట్టుకున్నాడు. (1 సమూయేలు 13:23) ఆ దండును చేరుకోవాలంటే ఆయన తన “చేతులతోను కాళ్లతోను” పాకుతూ కొండపైకి ఎక్కాల్సివుంటుంది. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. యోనాతాను తనతోపాటు తన ఆయుధాలను మోసేవానిని మాత్రమే తీసుకుని వెళ్లి దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. వానితో ఆయనిలా అన్నాడు: “యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా?”—1 సమూయేలు 14:6, 13.

ఆ ఇద్దరు ఇశ్రాయేలీయులు యెహోవాను ఒక సూచన ఇవ్వమని అడిగారు. వారిద్దరూ వెళ్ళి దండు కావలివారికి కనబడినప్పుడు, ఫిలిష్తీయులు, “మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడి” అని అంటే వారు ఫిలిష్తీయులపై దాడి చేయకూడదనీ, ఒకవేళ ఆ శత్రువులు “మాయొద్దకు రండి” అని అంటే, యెహోవా యోనాతానుకు, ఆయుధాలు మోసేవానికి విజయం ప్రసాదిస్తాడనీ అర్థం. దేవుడు తనకు సహాయం చేస్తాడని యోనాతాను నమ్మాడు కాబట్టే, పోరాడడానికి దండు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు.—1 సమూయేలు 14:8-10.

కేవలం ఇద్దరు మనుష్యులు ఒక దండంతటినీ ఎలా ఎదుర్కోగలరు? అలా అనుకుంటే, మోయాబుపై దాడిచేయడంలో ఇశ్రాయేలు సైన్యానికి నాయకత్వం వహించినప్పుడు న్యాయాధిపతియైన ఏహూదుకు యెహోవా సహాయం చేయలేదా? కేవలం మునుకోల కఱ్ఱతో 600 మంది ఫిలిష్తీయులను హతము చేసేలా దేవుడు షమ్గరుకు సహాయం చేయలేదా? సమ్సోను ఒంటిచేత్తో ఫిలిష్తీయులను చంపేందుకు యెహోవా ఆయనకు శక్తినివ్వలేదా? అలాగే యెహోవా తనకు కూడా సహాయం చేస్తాడని యోనాతాను నమ్మాడు.—న్యాయాధిపతులు 3:12-31; 15:6-8, 15; 16:29, 30.

ఆ ఇశ్రాయేలీయులిద్దరిని చూడగానే ఫిలిష్తీయులు, “మేము మీకు ఒకటి చూపింతుము రండని” అరిచారు. యోనాతాను, ఆయన ఆయుధాలు మోసేవాడు అక్కడికి వెళ్ళారు. వారు ధైర్యంగా దాడి చేసి దాదాపు 20 మంది శత్రు సైనికులను హతమార్చడంతో దండులో గందరగోళం ఏర్పడింది. బహుశా ఆ ఇద్దరి వెనుక అనేకమంది ఇశ్రాయేలీయుల శూరులు వస్తున్నారని ఫిలిష్తీయులు అనుకొనివుండవచ్చు. ఆ తర్వాత ‘దండులోని జనులందరిలో మహా భయకంపము కలిగెను. నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి’ అని ఆ వృత్తాంతం చెబుతోంది. దేవుడు కలుగజేసిన ఆ భూకంపం వల్ల ఫిలిష్తీయుల దండులోనివారందరూ చెదిరిపోయి “ఒకరినొకరు హతము చేసుకొనిరి.” ఇశ్రాయేలు సైన్యాలు అది చూడగానే ధైర్యం తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఫిలిష్తీయులతో చేయికలిపి ఎఫ్రాయిము మన్యములో దాక్కుని ఉన్న ఇశ్రాయేలీయులు కూడా వెంటరాగా ఇశ్రాయేలు సైన్యాలు “ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచే[సిరి].”—1 సమూయేలు 14:11-23, 31.

ప్రజలు యోనాతానును రక్షించారు

యుద్ధంలో గెలవడానికి ముందే సైనికుల్లో ఎవరైనా ఆహారం తింటే శాపగ్రస్థులౌతారని రాజైన సౌలు అవివేకంగా ప్రమాణం చేయించాడు. ఏదో కారణంగా యోనాతానుకు ఆ విషయం తెలియనందువల్ల ఆయన తన చేతికర్రను తేనెపట్టులో ముంచి కొంత తేనె తిన్నాడు. ఆయన చేసిన దాడిలో చివరి వరకు పోరాడడానికి బహుశా ఆ తేనే శక్తిని ఇచ్చిందనిపిస్తోంది.—1 సమూయేలు 14:24-27.

ఆయన తేనె తిన్నాడన్న విషయం తెలియగానే సౌలు యోనాతాను మరణించాలని ఆజ్ఞాపించాడు. యోనాతాను మరణించడానికి వెనుదీయక, ‘నేను మరణమొందవలసినదే’ అని అన్నాడు. “అయితే జనులు సౌలుతో—ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.”—1 సమూయేలు 14:38-45.

ఆధునిక కాలంలోని దేవుని సేవకులెవరూ అక్షరార్థంగా యుద్ధాల్లో పోరాడరు, కానీ మీ జీవితంలో కూడా విశ్వాసం, ధైర్యం అవసరమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు మీకు సరైనది చేయడం కష్టంగా ఉండవచ్చు. అయితే, యెహోవా మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన నీతియుక్త ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నందుకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా సంస్థలో ఏదైనా ఒక సేవాధిక్యతను స్వీకరించడానికి అంటే పరిచర్యలో మరింత ఎక్కువ చేయడం లేదా కొత్త ఆధిక్యతలను స్వీకరించడం లేదా రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న చోటికి వెళ్లి సేవ చేయడం లాంటి బాధ్యతలు స్వీకరించడానికి మీకు ధైర్యం అవసరం కావచ్చు. ఆ నియామకం పొందడానికి నాకు అర్హత ఉందా అని మీరనుకుంటుండవచ్చు. అయితే, యెహోవా సముచితమని భావించిన రీతిలో మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మీరు ముందుకు రావడమనేది ప్రశంసార్హమైన విషయమని నిశ్చయత కలిగివుండండి. యోనాతాను విషయం గుర్తుతెచ్చుకోండి! ఆయన ‘దేవుని సహాయముతో జయించాడు.’

యోనాతాను, దావీదు

దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాలను ఎగతాళి చేశాడు కానీ దావీదు అతణ్ణి హతమార్చాడు. యోనాతాను దావీదుకన్నా దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడైనా, వారిద్దర్లో ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. * మిక్మషు దగ్గర యోనాతాను చూపించినలాంటి ధైర్యాన్నే దావీదు కూడా చూపించాడు. అన్నింటిని మించి, యెహోవాకున్న రక్షించగల శక్తిని యోనాతాను నమ్మినట్లే దావీదు కూడా నమ్మాడు. అందుకే ఇతర ఇశ్రాయేలీయులు భయంతో వెనక్కి తగ్గినా ఆయన మాత్రం ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్నాడు. కాబట్టి “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.”—1 సమూయేలు 17:1–18:4.

దావీదు వీరత్వం వల్ల సౌలు ఆయనను శత్రువుగా దృష్టించినా, యోనాతాను దావీదు విషయంలో ఏ మాత్రం ఈర్ష్యపడలేదు. ఆయన, దావీదు ప్రాణస్నేహితులయ్యారు, వారి సంభాషణలో యోనాతాను, సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి దావీదు అభిషేకించబడ్డాడని తెలుసుకొనివుండవచ్చు. యోనాతాను దేవుని నిర్ణయాన్ని గౌరవించాడు.

రాజైన సౌలు తన కుమారునితో, సేవకులతో దావీదును చంపే విషయం గురించి మాట్లాడినప్పుడు యోనాతాను దావీదును హెచ్చరించాడు. దావీదు నుండి ఎటువంటి ప్రమాదం లేదని ఆయన సౌలును ఒప్పించాడు. నిజానికి రాజుకు వ్యతిరేకంగా దావీదు ఏ తప్పూ చేయలేదు! గొల్యాతును చంపడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టలేదా? సౌలు అపార్థం చేసుకున్న తన స్నేహితుడైన దావీదు గురించి యోనాతాను వేడుకున్న విధానం సౌలును శాంతింపజేసింది. కానీ, సౌలు మళ్లీ పన్నాగాలు పన్ని దావీదుపై హత్యాప్రయత్నాలు చేయడంతో దావీదు అక్కడినుండి పారిపోవాల్సి వచ్చింది.—1 సమూయేలు 19:1-18.

యోనాతాను విశ్వసనీయంగా దావీదు పక్షాన నిలబడ్డాడు. తర్వాత ఏమి చేయాలో ఆలోచించడానికి ఆ ఇద్దరు స్నేహితులు కలిశారు. తన స్నేహితునికీ, అలాగే తన తండ్రికి కూడా విశ్వసనీయంగా ఉండడానికి ప్రయత్నిస్తూ యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు.” అయితే దావీదు యోనాతానుతో “నాకును మరణమునకును అడుగు మాత్రమున్నది” అని అన్నాడు.—1 సమూయేలు 20:1-3.

అసలు సౌలు ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికిగాను యోనాతాను, దావీదు ఒక ఎత్తువేశారు. ఒకవేళ దావీదు భోజనం బల్లదగ్గర లేకపోవడాన్ని సౌలు గమనించినట్లైతే, దావీదు తన కుటుంబంతో కలిసి బలి అర్పించేందుకు వెళ్లడానికి తన దగ్గర సెలవు తీసుకున్నాడని యోనాతాను సౌలుతో చెప్పాలి. సౌలు కోపోద్రిక్తుడైతే ఆయన దావీదుకు ఏదో కీడు చేయాలనుకుంటున్నాడని అర్థం. ఆ తర్వాత యోనాతాను దావీదును ఆశీర్వదించి, ఆయన భవిష్యత్తులో రాజవుతాడనే విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ ఇలా అన్నాడు: “యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక.” వారిరువురూ ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేసుకున్న తర్వాత, యోనాతాను తన తండ్రిని పరీక్షించినప్పుడు ఏమి జరుగుతుందో దావీదుకు ఎలా తెలియజేయాలో నిర్ణయించుకున్నారు.—1 సమూయేలు 20:5-24.

దావీదు లేడన్న విషయం సౌలు గమనించగానే యోనాతాను, దావీదు తనతో ఇలా వేడుకున్నాడని వివరించాడు: “నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్ము.” తనకు దావీదుపట్ల మక్కువ ఉందనే విషయాన్ని ఒప్పుకోవడానికి యోనాతాను భయపడలేదు. రాజు కోపోద్రిక్తుడయ్యాడు! సౌలు యోనాతానును అవమానించి, ఆయనకు రాజ్యాధికారం రావడానికి దావీదు అడ్డుగా ఉన్నాడని కోప్పడ్డాడు. దావీదు మరణానికి అర్హుడని చెప్పి, ఆయనను తన దగ్గరకు తీసుకురమ్మని సౌలు యోనాతానుకు ఆజ్ఞాపించాడు. దానికి యోనాతాను ఇలా ప్రశ్నించాడు: “అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెను?” అలా అడగడంతో సౌలు కోపం పట్టలేక తన కుమారునిపైకి ఈటె విసిరాడు. యోనాతాను దాని నుండి తప్పించుకున్నాడు కానీ దావీదు గురించి తీవ్ర మనస్తాపం చెందాడు.—1 సమూయేలు 20:25-34.

యోనాతాను ఎంతటి విశ్వసనీయతను ప్రదర్శించాడో కదా! మానవ దృక్కోణం నుండి చూస్తే దావీదుతో స్నేహం చేయడం వల్ల ఆయనకు ఏ లాభం దొరక్కపోగా నష్టమే ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. అయితే, సౌలు తర్వాత దావీదు రాజు కావాలన్నది దేవుని ఏర్పాటు, అది అటు యోనాతానుకు ఇటు ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

కన్నీటి వీడ్కోలు

యోనాతాను సౌలు విషయం తెలియజేయడానికి దావీదును రహస్యంగా కలుసుకున్నాడు. దావీదు ఇక ఎన్నటికీ సౌలు ఆస్థానంలో అడుగుపెట్టలేడనేది స్పష్టం. వారిద్దరూ కంటతడి పెట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత దావీదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.—1 సమూయేలు 20:35-42.

ఆ తర్వాత దావీదు సౌలు దగ్గరనుండి పారిపోతూ “జీఫు అరణ్యములో ఒక వనమున [హోరేషులో]” దాక్కున్నప్పుడు యోనాతాను ఆయనను ఆఖరిసారి కలిశాడు. ఆ సమయంలోనే యోనాతాను దావీదును ఈ మాటలతో ప్రోత్సహించాడు: “నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నది.” (1 సమూయేలు 23:15-18) ఆ తర్వాత కొంతకాలానికే యోనాతాను, సౌలు ఇద్దరూ ఫిలిష్తీయులతో చేసిన యుద్ధంలో చనిపోయారు.—1 సమూయేలు 31:1-4.

దేవుణ్ణి ప్రేమించేవారందరూ యోనాతాను జీవిత విధానాన్ని గురించి ధ్యానించాలి. ఎవరికి విశ్వసనీయంగా ఉండాలనేది మీకొక సవాలుగా ఉందా? అలాంటప్పుడు, సౌలు యోనాతానును తన సంక్షేమం గురించి ఆలోచించుకోమని ప్రోత్సహించాడనే విషయం గుర్తుంచుకోండి. అయితే యోనాతాను యెహోవాకు మనస్ఫూర్తిగా విధేయతను, గౌరవాన్ని చూపిస్తూ ఆయనను ఘనపరచడమేకాక, దేవుడు ఎన్నుకున్న వ్యక్తే ఇశ్రాయేలుకు తర్వాతి రాజు కాబోతున్నాడని సంతోషించాడు. అవును, యోనాతాను దావీదుకు మద్దతునిచ్చాడు అంతేగాక, యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నాడు.

యోనాతానులో శ్రేష్ఠమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని అనుకరించండి! అప్పుడు ప్రజలు మీ విషయంలో కూడా యోనాతాను గురించి అన్నట్లే అంటారు, వారాయన గురించి ఇలా అన్నారు: ఆయన ‘దేవుని సహాయముతో జయించాడు.’—1 సమూయేలు 14:45.

[అధస్సూచి]

^ పేరా 18 సౌలు 40 సంవత్సరాల పరిపాలన ప్రారంభంలో యోనాతాను సైన్యాధిపతిగా మొదటిసారి ప్రస్తావించబడే సమయానికి ఆయనకు కనీసం 20 సంవత్సరాలు ఉండవచ్చు. (సంఖ్యాకాండము 1:3; 1 సమూయేలు 13:2) కాబట్టి సా.శ.పూ. 1078లో ఆయన చనిపోయే సమయానికి ఆయనకు బహుశా 60 ఏళ్లు ఉండవచ్చు. ఆ సమయానికి దావీదు వయసు 30 సంవత్సరాలు కాబట్టి యోనాతాను దావీదుకన్నా దాదాపు 30 ఏళ్లు పెద్దవాడని చెప్పవచ్చు.—1 సమూయేలు 31:2; 2 సమూయేలు 5:4.

[19వ పేజీలోని చిత్రం]

యోనాతాను దావీదు విషయంలో ఈర్ష్యపడలేదు