హోషేయ గ్రంథములోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
హోషేయ గ్రంథములోని ముఖ్యాంశాలు
పదిగోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో నుండి సత్యారాధన దాదాపుగా అదృశ్యమైపోయింది. రెండవ యరొబాము పరిపాలన క్రింద, ఇశ్రాయేలులో వస్తుపరమైన సమృద్ధి ఉంది గానీ అది ఆయన మరణం తర్వాత క్షీణించిపోయింది. ఆ తర్వాతి కాలంలో సంక్షోభం, రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఆ తర్వాత వరుసగా వచ్చిన ఆరుగురు రాజుల్లో నలుగురు హత్యచేయబడ్డారు. (2 రాజులు 14:29; 15:8-30; 17:1-6) సా.శ.పూ. 804లో ప్రారంభమైన హోషేయ 59 సంవత్సరాల సుదీర్ఘ ప్రవచనా పని, ఈ సంక్షోభిత కాలంలోకి కూడా కొనసాగుతుంది.
అవిధేయ ఇశ్రాయేలు జనాంగంపట్ల యెహోవాకున్న మనోభావాలను, హోషేయ వైవాహిక జీవితంలో జరిగినది స్పష్టంగా అభివర్ణిస్తుంది. ఇశ్రాయేలు తప్పిదం బహిర్గతం చేయబడడం, దానికి మరియు యూదా రాజ్యానికి వ్యతిరేకంగా ఇవ్వబడే ప్రవచనార్థక తీర్పులు హోషేయ సందేశపు అంశాలు. మృదువైన, సుతిమెత్తని పదాలను, శక్తివంతమైన, భావాలను వ్యక్తం చేసే భాషను ఉపయోగిస్తూ హోషేయ ఇదంతా తన పేరుతోవున్న పుస్తకంలో వ్రాశాడు. దేవుని ప్రేరేపిత వాక్యంలో భాగంగా దానిలోని సందేశం సజీవమైనది, బలముగలది.—హెబ్రీయులు 4:12.
“వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడుము”
యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడుము.” (హోషేయ 1:2) ఆ మాటకు హోషేయ విధేయుడై, గోమెరు ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ తర్వాత ఆమె కనే ఇద్దరు పిల్లలు అక్రమ సంతానమని స్పష్టమౌతోంది. లోరూహామా, లోఅమ్మీ అనే వాళ్ల పేర్ల అర్థాలు, యెహోవా ఇశ్రాయేలుపట్ల జాలిచూపించకపోవడాన్ని, నమ్మకద్రోహులైన తన ప్రజలను ఆయన నిరాకరించడాన్ని సూచిస్తాయి.
యెహోవా తిరుగుబాటుదారులైన తన ప్రజల గురించి నిజానికి ఎలా భావిస్తున్నాడు? ఆయన హోషేయతో ఇలా చెబుతున్నాడు: “ఇశ్రాయేలీయులు . . . యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.”—హోషేయ 3:1.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
1:1—హోషేయ తన పరిచర్య కాలంలో, యూదాను పరిపాలించిన నలుగురు రాజుల గురించి ప్రస్తావించాడు గానీ ఇశ్రాయేలును పరిపాలించిన ఒక్క పరిపాలకుని గురించే ఎందుకు ప్రస్తావించాడు? ఎందుకంటే దావీదు వంశం నుండి వచ్చిన రాజులే దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజల న్యాయమైన పాలకులుగా గుర్తించబడ్డారు. ఉత్తర రాజ్యపు రాజులు దావీదు వంశీయులు కాదు గానీ యూదా రాజులు మాత్రం దావీదు వంశీయులే.
1:2-9—హోషేయ నిజంగానే వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి చేసుకున్నాడా? అవును, హోషేయ ఒక స్త్రీని పెండ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె వ్యభిచారం చేసింది. ప్రవక్త తన వైవాహిక జీవితం గురించి తాను చెప్పినది కలో, దర్శనమో అని సూచించేదేదీ చెప్పలేదు.
1:7—యూదావారిపట్ల ఎప్పుడు జాలి చూపించబడింది, వారు ఎప్పుడు రక్షించబడ్డారు? ఇది సా.శ.పూ. 732లో హిజ్కియా రాజు కాలంలో జరిగింది. ఆ సమయంలో యెహోవా, ఒక్క రాత్రిలో ఒక దేవదూత శత్రుసైన్యంలోని 1,85,000 మందిని నాశనం చేసేలా చేయడం ద్వారా యెరూషలేముకు అష్షూరీయుల మూలంగా ఉన్న ముప్పును తొలగించాడు. (2 రాజులు 19:34, 35) ఆ విధంగా యెహోవా యూదాను “విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతుల” మూలంగా కాదు గానీ ఒక దేవదూత ద్వారా విడిపించాడు.
1:10, 11—ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు సా.శ.పూ. 740లో పడిపోయింది కాబట్టి, ఇశ్రాయేలువారు యూదావారితో ఎలా “ఏకముగా కూడుకొ[న్నారు]”? యూదా నివాసులు సా.శ.పూ. 607లో బబులోనుకు బంధీలుగా తీసుకువెళ్లబడక ముందు, ఉత్తర రాజ్యం నుండి చాలామంది యూదాకు వెళ్ళారు. (2 దినవృత్తాంతములు 11:13-17; 30:6-12, 18-20, 25) యూదా పరవాసులు సా.శ.పూ. 537లో తమ స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు, అలా తిరిగి వచ్చినవారిలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు వంశస్థులున్నారు.—ఎజ్రా 2:70.
2:21-23—“నేను దానిని [యెజ్రెయేలు] భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసికొందును” అనే యెహోవా మాటలు ఏ విషయాన్ని ముందుగా తెలియజేశాయి? గోమెరు హోషేయకు కనిన మొదటి కుమారుడి పేరు యెజ్రెయేలు. (హోషేయ 1:2-4) ఆ పేరుకు “దేవుడు విత్తనం విత్తుతాడు” అని భావం, అది ప్రవచనార్థకంగా, సా.శ.పూ. 537లో యెహోవా నమ్మకమైన శేషమును సమకూర్చి వారిని యూదాలో విత్తనంలా విత్తడాన్ని సూచిస్తుంది. 70 సంవత్సరాలపాటు నిర్జనంగా విడువబడిన నేల ఇప్పుడు ధాన్యం, ద్రాక్షారసం, నూనెలను ఉత్పత్తి చేయాలి. పద్యరూపంలో ఈ మంచి విషయాలు, పోషకాలను విడుదల చేయమని భూమిని మనవి చేస్తాయి, వర్షం కురిపించమని భూమి ఆకాశాన్ని మనవి చేస్తుంది. వర్ష మేఘాలను ఇవ్వమని ఆకాశం దేవుణ్ణి మనవి చేస్తుంది. తిరిగి వస్తున్న శేషము అవసరాల గురించి సమృద్ధిగా శ్రద్ధ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మనవి చేయబడతాయి. హోషేయ 2:23ను, అపొస్తలులైన పౌలు, పేతురు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషము సమకూర్చబడడానికి అన్వయించారు.—రోమీయులు 9:25, 26; 1 పేతురు 2:10.
మనకు పాఠాలు:
1:2-9; 3:1, 2. హోషేయ దేవుని చిత్తానికి విధేయుడై వివాహ బంధానికి కట్టుబడి ఉండడం ద్వారా వ్యక్తిగతంగా తాను ఎంత త్యాగం చేయవలసి వచ్చిందో ఆలోచించండి. దేవుని చిత్తం చేసే విషయంలో, మనం మన వ్యక్తిగత అభీష్టాలను వదులుకునేందుకు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాం?
1:6-9. యెహోవా శారీరక జారత్వాన్ని ద్వేషించినట్లే, ఆధ్యాత్మిక జారత్వాన్ని కూడా ద్వేషిస్తాడు.
1:7, 10, 11; 2:14-23. ఇశ్రాయేలు యూదాల గురించి యెహోవా ప్రవచించినది నెరవేరింది. యెహోవా వాక్యము ఎల్లప్పుడూ నెరవేరుతుంది.
2:16, 19, 21-23; 3:1-4. హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని చూపించేవారిని క్షమించడానికి యెహోవా ఇష్టపడుతున్నాడు. (నెహెమ్యా 9:17) యెహోవాలాగే మనం ఇతరులతో దయగా, కనికరంతో వ్యవహరించాలి.
‘యెహోవా వ్యాజ్యెమాడుచున్నాడు’
“యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.” ఎందుకు? ఎందుకంటే, “సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లే[వు].” (హోషేయ 4:1) మతభ్రష్ట ఇశ్రాయేలు ప్రజలు మోసగించారు, రక్తం చిందించారు, శారీరక ఆధ్యాత్మిక వ్యభిచారానికి పాల్పడ్డారు. సహాయం కోసం దేవుణ్ణి ఆశ్రయించే బదులు, ‘వారు ఐగుప్తీయులను పిలుచుకున్నారు. అష్షూరీయుల యొద్దకు పోయారు.’—హోషేయ 7:11.
యెహోవా తన తీర్పును ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇశ్రాయేలువారు తినివేయబడుదురు.” (హోషేయ 8:8) యూదా రాజ్యమూ నిర్దోషి కాదు. “యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును” అని హోషేయ 12:2 చెబుతోంది. కానీ పునఃస్థాపన మాత్రం జరుగుతుంది, ఎందుకంటే దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును.”—హోషేయ 13:14.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
6:1-3—“మనము యెహోవాయొద్దకు మరలుదము రండి” అని ఎవరంటున్నారు? నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయులు యెహోవా యొద్దకు తిరిగి వెళ్దామని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటుండవచ్చు. అదే నిజమైతే, వారు కేవలం పశ్చాత్తాపపడినట్లు నటిస్తున్నారు. “తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును” వారి భక్తి స్వల్పకాలికమైనది, తాత్కాలికమైనది. (హోషేయ 6:4) మరోవైపున, ఆ మాటలు చెబుతున్నది, యెహోవా యొద్దకు తిరిగిరమ్మని తన ప్రజలను వేడుకుంటున్న హోషేయ కావచ్చు. విషయమేదైనప్పటికీ, పది గోత్రాల రాజ్యమైన ఇశ్రాయేలు భ్రష్ట నివాసులు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించి, నిజంగా యెహోవా యొద్దకు తిరిగి రావలసిన అవసరం ఉంది.
7:4—జారులైన ఇశ్రాయేలీయులు ఏ విధంగా “పొయ్యిని అధికముగా వేడిమిచేసి[నట్లు]” ఉన్నారు? ఈ పోలిక, వాళ్ళ హృదయాల్లోని దుష్ట కోరికల తీవ్రతను సోదాహరణంగా తెలియజేస్తుంది.
మనకు పాఠాలు:
4:1, 6. మనం యెహోవా అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉండాలంటే, మనమాయన గురించిన జ్ఞానం పొందడంలో కొనసాగుతూ నేర్చుకుంటున్న దాని ప్రకారం జీవించాలి.
4:9-13. లైంగిక దుర్నీతికి పాల్పడుతూ అశుద్ధ ఆరాధనలో కొనసాగేవారిని యెహోవా లెక్క అడుగుతాడు.—హోషేయ 1:4.
5:1. దేవుని ప్రజల్లో నాయకత్వం వహిస్తున్నవారు మతభ్రష్టత్వానికి పూర్తిగా దూరంగా ఉండాలి. లేకపోతే, వారు అబద్ధ ఆరాధనలో భాగం వహించేలా కొందరిని పురికొల్పి, వారికి ‘ఉరిగా, వలగా’ తయారవుతారు.
6:1-4; 7:14, 16. కేవలం మాటల్లో పశ్చాత్తాపాన్ని వ్యక్తపర్చడం వేషధారణే అవుతుంది, అది వ్యర్థం. దేవుని దయను పొందాలంటే తప్పిదస్థుడు ‘సర్వోన్నతమైన’ దాని దగ్గరకు, అంటే ఉన్నతమైన ఆరాధనా విధానానికి తిరిగి రావడం ద్వారా వెల్లడయ్యే, హృదయపూర్వక పశ్చాత్తాపాన్ని చూపించాలి. ఆయన చర్యలు దేవుని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.—హోషేయ 7:16.
6:6. పాపం చేస్తూనే ఉండడం, దేవునిపట్ల యథార్థమైన ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఈ కొరతను ఎన్ని ఆధ్యాత్మిక త్యాగాలైనా పూరించలేవు.
8:7, 13; 10:13. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రం విగ్రహారాధకులైన ఇశ్రాయేలీయుల విషయంలో నిజమని నిరూపించబడింది.—గలతీయులు 6:7.
8:8, 9; 9:17; 13:16. ఉత్తర రాజ్యాన్ని గురించిన ప్రవచనాలు, దాని రాజధానియైన షోమ్రోనును అష్షూరు కైవసం చేసుకున్నప్పుడు నెరవేరాయి. (2 రాజులు 17:3-6) దేవుడు తాను చెప్పినదానిని నెరవేరుస్తాడని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు.—సంఖ్యాకాండము 23:19.
8:14. యెహోవా సా.శ.పూ. 607లో బబులోనీయుల ద్వారా “[యూదా] పట్టణములను అగ్నిచే” తగులబెట్టించి, యెరూషలేముపైకి, యూదా దేశంపైకి ముందే చెప్పబడిన నాశనాన్ని రప్పించాడు. (2 దినవృత్తాంతములు 36:19) దేవుని వాక్యం ఎన్నడూ విఫలం కాదు.—యెహోషువ 23:14.
9:10. ఇశ్రాయేలీయులు సత్య దేవునికి సమర్పించబడినా, వారు “బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి.” వారి చెడ్డ ఉదాహరణ నుండి మనం హెచ్చరికను పొంది, యెహోవాకు మనం చేసుకున్న సమర్పణను ఉల్లంఘించకుండా 1 కొరింథీయులు 10:11.
జాగ్రత్త వహించడం జ్ఞానయుక్తం.—10:1, 2, 12. మనం వేషధారణలేని హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ‘నీతి ఫలించునట్లు మనం విత్తనము వేస్తే దేవుని ప్రేమ అనే కోత కోస్తాము.’
10:5. బేతావెను (అంటే “హానిచేసే గృహము” అని అర్థం) అనేది బేతేలుకు (“దేవుని గృహము” అని అర్థం) గౌరవభంగం కలిగించే విధంగా ఇవ్వబడిన పేరు. బేతావెనుకు చెందిన దూడ విగ్రహం చెరగా తీసుకువెళ్ళబడినప్పుడు, షోమ్రోను నివాసులు తమ ఆరాధనా వస్తువు పోయినందుకు విలపించారు. తనను తాను కూడా రక్షించుకోలేని నిర్జీవ ప్రతిమపై నమ్మకం పెట్టుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా!—కీర్తన 135:15-18; యిర్మీయా 10:3-5.
11:1-4. యెహోవా తన ప్రజలతో ఎల్లప్పుడూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాడు. దేవునికి విధేయత చూపించడం ఎన్నడూ భారమైనది కాదు.
11:8-11; 13:14. తన ప్రజలను సత్యారాధనకు పునరుద్ధరిస్తానని యెహోవా చేసిన వాగ్దానం ‘నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలలేదు.’ (యెషయా 55:11) సా.శ.పూ. 537లో బబులోను చెర ముగిసి, ఒక శేషము యెరూషలేముకు తిరిగి వచ్చింది. (ఎజ్రా 2:1; 3:1-3) యెహోవా తన ప్రవక్తల ద్వారా పలికినదంతా ఖచ్చితంగా నెరవేరుతుంది.
12:6. మనం కనికరమును న్యాయమును చూపించాలని, ఎడతెగక యెహోవాయందు నమ్మకముంచాలని దృఢంగా తీర్మానించుకోవాలి.
13:6. ఇశ్రాయేలీయులు “తృప్తిపొంది గర్వించి [యెహోవాను] మరచిరి.” స్వీయోన్నతి దృక్పథం ఏ మాత్రం వృద్ధి కాకుండా మనం జాగ్రత్త వహించాలి.
“యెహోవా మార్గములు చక్కనివి”
హోషేయ ఇలా వేడుకుంటున్నాడు: “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.” యెహోవాతో ఇలా చెప్పమని ఆయన ప్రజలను కోరుతున్నాడు: “మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.”—హోషేయ 14:1, 2.
పశ్చాత్తాపపడుతున్న తప్పిదస్థుడు యెహోవా దగ్గరికి వచ్చి, ఆయన మార్గాలను అంగీకరించి, ఆయనకు స్తుతియాగములు అర్పించాలి. ఎందుకు? ఎందుకంటే “యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు.” (హోషేయ 14:9) ఇంకా చాలామంది ‘దినముల అంతమందు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు’ అనే విషయాన్ని గ్రహించి మనం ఎంతగా ఆనందిస్తున్నామో కదా!—హోషేయ 3:5.
[15వ పేజీలోని చిత్రం]
హోషేయ కుటుంబ జీవితం ఇశ్రాయేలుతో యెహోవా వ్యవహారాలను సోదాహరణంగా తెలియజేసింది
[17వ పేజీలోని చిత్రం]
సా.శ.పూ. 740లో షోమ్రోను పతనమైనప్పుడు, పది గోత్రాల రాజ్యమైన ఇశ్రాయేలు ఉనికిలో లేకుండాపోయింది