కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోవేలు, ఆమోసు పుస్తకాల ముఖ్యాంశాలు

యోవేలు, ఆమోసు పుస్తకాల ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యోవేలు, ఆమోసు పుస్తకాల ముఖ్యాంశాలు

తాను “పెతూయేలు కుమారుడైన యోవేలు” అని మాత్రమే ఆయన తన గురించి చెప్పుకున్నాడు. (యోవేలు 1:1) ఆయన పేరుతోవున్న పుస్తకంలో యోవేలు తన సందేశం తప్ప వేరే విషయాల గురించి ఎంత తక్కువగా వివరించాడంటే ఆయన ప్రవచించిన కాలాన్ని కూడా అంచనా వేయాల్సివస్తుంది, ఆయన దాదాపు సా.శ.పూ. 820లో అంటే యూదామీద ఉజ్జియా రాజైన తొమ్మిదేళ్ల తర్వాత ప్రవచించడం ప్రారంభించాడు. యోవేలు తన గురించి చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఆయన సందేశకుణ్ణి కాదుగానీ సందేశాన్నే నొక్కిచెప్పాలనుకోవడం దానికి కారణం కావచ్చు.

ఉజ్జియా దినాల్లోనే, యూదాలో నివసించే ‘పసులకాపరి, మేడిపండ్లు ఏరుకొనే’ ఆమోసు కూడా ప్రవక్తగా నియామించబడ్డాడు. (ఆమోసు 7:14) ఆమోసు యోవేలులా యూదాలో ప్రవచించలేదు, ఆయన ఉత్తరానున్న ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యానికి పంపించబడతాడు. ఆమోసు ప్రవక్త యూదాకు తిరిగివచ్చిన తర్వాత, దాదాపు సా.శ.పూ. 804వ సంవత్సరంలో పూర్తి చేయబడిన ఆమోసు పుస్తకం సరళమైన భాషలో రాయబడినా దానిలోని వివరాలు కళ్లకుకట్టినట్లు స్పష్టంగా ఉన్నాయి.

‘ఆహా, అది భయంకరమైన దినము’—ఎందుకు?

(యోవేలు 1:1-3:21)

యోవేలు తనకు కలిగిన దర్శనంలో గొంగళిపురుగుల, మిడతల, చీడపురుగుల దాడిని చూస్తాడు. దండెత్తి వచ్చే ఆ పురుగులు “బలమైన యొక గొప్ప సమూహము,” “బలాఢ్యులు” అని పేర్కొనబడ్డాయి. (యోవేలు 1:4; 2:2-7) “ఆహా . . . అది ఎంత భయంకరమైన దినము” అని యోవేలు నిట్టూరుస్తాడు, ఎందుకంటే “యెహోవా దినము వచ్చెనే . . . అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును!” (యోవేలు 1:15) సీయోను నివాసులకు యెహోవా ఇలా ఉపదేశించాడు: “మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.” వారు అలా చేస్తే యెహోవా “తన జనులయెడల జాలిచేసికొని” “ఉత్తరదిక్కు నుండి వచ్చు” పురుగుల దాడి నుండి వారిని తప్పిస్తాడు. అయితే, తన మహా దినం రాకముందు యెహోవా ‘సర్వజనులమీద తన ఆత్మను కుమ్మరించి’ “ఆకాశమందును భూమియందును మహాత్కార్యములను” కనబరుస్తాడు.—యోవేలు 2:12, 18-20, 28-31.

జనాంగాలు ఇలా సవాలు చేయబడ్డాయి: “మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేసి” యుద్ధానికి సిద్ధంకండి. “యెహోషాపాతు లోయ” వరకు రమ్మని వారు ఆదేశించబడ్డారు, వారక్కడ తీర్పుతీర్చబడి నాశనంచేయబడతారు. “అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు.”—యోవేలు 3:10, 12, 20, 21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:15; 2:1, 11, 31; 3:14“యెహోవా దినము” అంటే ఏమిటి? తన శత్రువులమీద యెహోవా తన తీర్పులను అమలుచేసే సమయమే యెహోవా దినము, ఆ దినం వచ్చినప్పుడు ఆ శత్రువులు నాశనమౌతారు గానీ సత్యారాధకులు రక్షించబడతారు. ఉదాహరణకు, సా.శ.పూ. 539లో మాదీయులు పారసీకులు ప్రాచీన బబులోనును జయించినప్పుడు దానిమీదకు అలాంటి దినమే వచ్చింది. (యెషయా 13:1, 6) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం అయిన “మహాబబులోను” మీద యెహోవా తన తీర్పులను అమలుచేసే మరో “యోహోవా దినము” సమీపంలో ఉంది.—ప్రకటన 18:1-4, 21.

2:1-10, 28పురుగుల దాడి గురించిన ప్రవచనం ఎలా నెరవేరింది? యోవేలు పుస్తకంలో వర్ణించబడిన స్థాయిలో కనాను దేశంమీద పురుగుల దాడి జరిగిందని బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి, యోవేలు వర్ణించిన దాడి సా.శ. 33వ సంవత్సరానికి సంబంధించిన ప్రవచనం కావచ్చు. ఆ సంవత్సరంలో యెహోవా తన ఆత్మను యేసు తొలి అనుచరులమీద కుమ్మరించడం ఆరంభించినప్పుడు, వారు అబద్ధ మతాధికారులను తీవ్రంగా బాధించిన సందేశాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. (అపొస్తలుల కార్యములు 2:1, 14-21; 5:27-33) ఇప్పుడు అలాంటి పనిలో భాగం వహించడం మన ఆధిక్యత.

2:32‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయడం’ అంటే ఏమిటి? దేవుని నామమునుబట్టి ప్రార్థన చేయడం అంటే ఆయన పేరును తెలుసుకొని, దానిని ప్రగాఢంగా గౌరవించి, ఆ పేరు ధరించిన వ్యక్తిమీద ఆధారపడి, ఆయన మీద నమ్మకముంచడమని అర్థం.—రోమీయులు 10:13, 14.

3:14“తీర్పు తీర్చు లోయ” అంటే ఏమిటి? అది దేవుని తీర్పు అమలుచేయబడే సూచనార్థక స్థలం. “యెహోవాయే న్యాయాధిపతి” అనే అర్థంవచ్చే పేరున్న యూదా రాజైన యెహోషాపాతు కాలంలో, యూదా చుట్టూవున్న జనాంగాల సైనిక దళాలను తికమకపెట్టడం ద్వారా దేవుడు యూదావారిని రక్షించాడు. అందుకే ఆ ప్రాంతం “యెహోషాపాతు లోయ” అని కూడా పిలవబడింది. (యోవేలు 3:2, 12) మన కాలంలో, జనాంగాలు మద్యపుతొట్టిలోని ద్రాక్షల్లా నలగగొట్టబడే సూచనార్థక స్థలాన్ని అది సూచిస్తోంది.—ప్రకటన 19:15.

మనకు పాఠాలు:

1:13, 14. నిజమైన పశ్చాత్తాపం, సత్యదేవునిగా యెహోవాను అంగీకరించడం రక్షణకు అత్యంత ప్రాముఖ్యం.

2:12, 13. నిజమైన పశ్చాత్తాపం హృదయపూర్వకంగా ఉండాలి. దానిలో ‘వస్త్రములను’ చింపుకోవడం కాదుగానీ అంతరంగ ‘హృదయాలను చింపుకోవడం’ ఉంది.

2:28-32. “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినములో” “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయువారు” మాత్రమే “రక్షింపబడుదురు.” యెహోవా తన ఆత్మను అందరిమీద కుమ్మరిస్తున్నందుకు, ప్రవచించే పనిలో అంటే “దేవుని గొప్పకార్యములను” ప్రకటించడంలో యౌవనస్థులకు వృద్ధులకు, స్త్రీపురుషులకు భాగం వహించే ఆధిక్యత ఇచ్చినందుకు ఆయనపట్ల మనమెంత కృతజ్ఞత కనబరచవచ్చో కదా! (అపొస్తలుల కార్యములు 2:11) యెహోవా దినం సమీపించేకొద్దీ, మనం ‘పరిశుద్ధమైన ప్రవర్తనకు, భక్తికి’ సంబంధించిన క్రియల్ని మరింత కనబరచవద్దా?—2 పేతురు 3:10-12.

3:4-8, 19. యూదా చుట్టూవున్న జనాంగాలు దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలను బాధించినందుకు తీర్పుతీర్చబడతాయని యోవేలు ప్రవచించాడు. ఆ ప్రవచనం చెప్పినట్లే, బబులోను రాజైన నెబుకద్నెజరు తూరు పట్టణ ప్రధాన భూభాగాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత ఆ ద్వీపనగరాన్ని అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ జయించినప్పుడు దాని వేలాదిమంది సైనికులు, ప్రముఖులు చంపబడ్డారు, దాని నివాసుల్లో 30,000 మంది బానిసలుగా అమ్మివేయబడ్డారు. ఫిలిష్తీయులు కూడా అలెగ్డాండర్‌ చేతుల్లో, ఆయన తర్వాత వచ్చినవారి చేతుల్లో అలాంటి అనుభవాన్నే చవిచూశారు. సా.శ.పూ. నాల్గవ శతాబ్దానికల్లా ఎదోము నిర్మానుష్యమైంది. (మలాకీ 1:3) నెరవేరిన ఈ ప్రవచనాలు, తన వాగ్దానాలను నెరవేర్చేవానిగా యెహోవాపట్ల మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. నేడు తన ఆరాధకులను హింసించే జనాంగాలతో యెహోవా ఎలా వ్యవహరిస్తాడో కూడా అవి చూపిస్తాయి.

3:16-21. ‘భూమ్యాకాశములు వణకుతాయి,’ యెహోవా ప్రతికూల తీర్పులను జనాంగాలు చవిచూస్తాయి. “అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును,” ఆయన వారికి పరదైసు పరిస్థితుల్లో జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దుష్టలోకంమీద తీర్పును అమలుచేసే ఆయన దినం సమీపించేకొద్దీ ఆయనకు సన్నిహితంగా ఉండాలని మనం దృఢంగా నిశ్చయించుకోవద్దా?

“మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి”

(ఆమోసు 1:1-9:15)

ఆమోసు దగ్గర ఇశ్రాయేలు చుట్టూవున్న శత్రు జనాంగాలతోపాటు యూదా, ఇశ్రాయేలు జనాంగాలకు చెప్పాల్సిన సందేశం కూడా ఉంది. సిరియా, ఫిలిష్తియ, తూరు, ఎదోము, మోయాబు జనాంగాలు దేవుని ప్రజలతో క్రూరంగా వ్యవహరించినందుకు అవి నాశనం చేయబడతాయి. యూదావాసులు కూడా, “యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి[నందుకు]” నాశనం చేయబడతారు. (ఆమోసు 2:4) ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యం విషయమేమిటి? ఆ రాజ్యం పేదవారిని అత్యాశతో అణచివేయడం, అనైతికత, దేవుని ప్రవక్తలను అవమానించడం వంటి పాపాలు చేసింది. యెహోవా ‘బేతేలులోని బలిపీఠములను శిక్షించి’ “చలికాలపు నగరును వేసవికాలపు నగరును . . . పడగొ[డతాడు]” అని ఆమోసు హెచ్చరించాడు.—ఆమోసు 3:14, 15.

వివిధ శిక్షలు అప్పటికే విధించబడినా, విగ్రహారాధకులైన ఇశ్రాయేలీయులు మొండిగానే ప్రవరిస్తారు. వారికి ఆమోసు ఇలా చెబుతున్నాడు: “మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.” (ఆమోసు 4:12) ఇశ్రాయేలీయుల విషయంలో, యెహోవా దినమంటే, వారు ‘దమస్కు పట్టణము అవతలికి చెరగా కొనిపోబడడం’ అని దానర్థం అంటే వారు అష్షూరు దేశానికి కొనిపోబడతారు. (ఆమోసు 5:27) ఆమోసు బేతేలుకు చెందిన యాజకుని నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నా భయపడడు. “నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను” అని యెహోవా ఆమోసుతో అంటాడు. (ఆమోసు 8:2) దేవుని తీర్పుల నుండి పాతాళంగానీ, ఎత్తైన పర్వతాలుగానీ వారిని రక్షించలేవు. (ఆమోసు 9:2, 3) అయినా, పునఃస్థాపనకు సంబంధించిన వాగ్దానం ఇవ్వబడింది. “శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు” అని యెహోవా చెబుతున్నాడు.—ఆమోసు 9:14.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

4:1“బాషాను ఆవులు” ఎవరిని సూచిస్తున్నాయి? గలిలయ సముద్రానికి తూర్పునున్న భాషాను అనే ఎత్తైన పీఠభూమి, ఆవులతోపాటు చక్కని పశుజాతులకు ప్రతీతి. అలా పేరుపొందడానికి ఆ ప్రాంతపు సారవంతమైన పచ్చికబయలు ఒక కారణం. ఆమోసు, విలాసవంతమైన జీవితాన్ని ప్రేమించే షోమ్రోను స్త్రీలను బాషాను ఆవులతో పోల్చాడు. ఆ స్త్రీలు తమ ఐశ్వర్యపిపాసను తీర్చుకోవడానికి దీనులను మోసగించమని ‘తమ యజమానులను’ లేదా భర్తలను ఒత్తిడిచేశారన్నది సుస్పష్టం.

4:6—“దంతశుద్ధి” అనే మాటకున్న అర్థమేమిటి? “ఆహారము లేకుండ” అనే మాటతో పాటు ఉపయోగించబడిన ఆ పదబంధం, ఆహారకొరతవల్ల పళ్లు శుభ్రంగా ఉండే కరవు కాలాన్ని సూచిస్తుండవచ్చు.

5:5ఇశ్రాయేలు ఏ విధంగా ‘బేతేలును ఆశ్రయింపకూడదు’? యరొబాము I బేతేలులో దూడ ఆరాధనను నెలకొల్పాడు. అప్పటినుండి ఆ పట్టణం అబద్ధారాధనకు కేంద్రమైంది. గిల్గాలు, బెయేర్షెబాలు కూడా మతభ్రష్ట ఆరాధనా కేంద్రాలుగా ఉండవచ్చు. ముందుచెప్పబడిన విపత్తును తప్పించుకోవాలంటే, ఇశ్రాయేలీయులు ఈ పట్టణాలకు మతసంబంధ యాత్రలు చేయడం మానేసి, యెహోవాను ఆశ్రయించడం ప్రారంభించాలి.

7:1‘రాజునకు రావలసిన గడ్డి కోత’ దేనిని సూచిస్తుంది? రాజు తన రౌతులను, జంతువులను పోషించుకోవడానికి విధించే పన్నును అది సూచిస్తుండవచ్చు. “కడవరి గడ్డి మొలుచునప్పుడు” ఆ పన్ను చెల్లించాలి. ఆ తర్వాత, ప్రజలు తమ పంటలను కోసుకోవచ్చు. అయితే వారలా చేయకముందే మిడతల దండు దాడిచేసి ఇతర మొక్కలతోపాటు వారి పంటలను నాశనం చేశాయి.

8:1, 2“వేసవి కాలపు పండ్లగంప” దేనిని సూచించింది? యెహోవా దినం సమీపంలో ఉందని అది సూచించింది. కోతకాలం ముగింపులో, అంటే వ్యవసాయ సంవత్సరపు ముగింపులో వేసవికాలపు పండ్లను ఏరేవారు. యెహోవా, ఆమోసుకు “వేసవి కాలపు పండ్లగంపను” చూపించడం ఇశ్రాయేలీయులకు అంతం సమీపించిందని సూచించింది. అందుకే, దేవుడు ఆమోసుకు ఇలా చెప్పాడు: “నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.”

మనకు పాఠాలు:

1:3, 6, 9, 11, 13; 2:1, 4, 6. ఇశ్రాయేలు, యూదాలతోపాటు వాటిచుట్టూవున్న ఆరు జనాంగాలపట్ల కోపంతోనే యెహోవా ఇలా అన్నాడు: “నేను తప్పకుండ దాని శిక్షింతును.” యెహోవా తీర్పులను తప్పించుకోవడం సాధ్యంకాదు.—ఆమోసు 9:2-5.

2:12. సాధారణ జీవిత విధానమని చాలామంది పరిగణించే జీవితాన్ని గడపడానికి తమ పూర్తికాల సేవను వదులుకోమని ప్రోత్సహించడం ద్వారా కష్టించి పనిచేసే పయినీర్లను, ప్రయాణ పైవిచారణకర్తలను, మిషనరీలను లేక బెతెల్‌ కుటుంబ సభ్యులను మనం నిరుత్సాహపరచకూడదు. బదులుగా, తమ మంచి పనిని కొనసాగించమని మనం వారిని ప్రోత్సహించాలి.

3:8. సింహం గర్జించినప్పుడు ఒక వ్యక్తికి ఎలాగైతే భయం కలుగుతుందో అలాగే “నీవు పోయి నా జనుల[కు] . . . ప్రవచనము చెప్పుము” అని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు ప్రకటించాలనే పురికొల్పును ఆమోసు పొందాడు. (ఆమోసు 7:15) రాజ్య సందేశాన్ని ఉత్సాహంగా ప్రకటించేవారిగా ఉండేందుకు దైవభయం మనల్ని ప్రోత్సహించాలి.

3:13-15; 5:12. యెహోవా సహాయంతో దీనమనసుగల పశువులకాపరి అయిన ఆమోసు, తమ ఐశ్వర్యాన్నిబట్టి ఉదాసీనత కనబరచిన ప్రజలకు దేవుని సందేశం గురించి ‘రూఢిగా తెలియజేయగలిగాడు.’ ఒక క్షేత్రంలో పనిచేయడం మనకు ఎంత కష్టమనిపించినా రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి యెహోవా మనల్ని అలాగే సంసిద్ధులను చేయగలడు.

4:6-11; 5:4, 6, 14. యెహోవా ‘తట్టు తిరగడంలో’ ఇశ్రాయేలీయులు పదేపదే విఫలమైనా “యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రదుకుదురు” అని వారు ప్రోత్సహించబడ్డారు. ఈ దుష్ట విధానం కొనసాగేందుకు యెహోవా ఓర్పుతో అనుమతించేంతవరకు దానిలోవున్న వారిని దేవుని తట్టు తిరగమని మనం ప్రోత్సహించాలి.

5:18, 19. “యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొని” దానికోసం నిజంగా సిద్ధంగా లేకపోవడం వెర్రిసాహసమే అవుతుంది. అలాచేసే వ్యక్తి పరిస్థితి, సింహం నుండి తప్పించుకున్న వ్యక్తికి ఎలుగుబంటి ఎదురైనట్టు, దానిని నుండి తప్పించుకున్న తర్వాత పాము అతనిని కాటువేసినట్లు ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా “మెలకువగా ఉంటూ” ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండడం జ్ఞానయుక్తం.—లూకా 21:36.

7:12-17. మనం దేవుని సందేశాన్ని ధైర్యంగా, నమ్మకంగా ప్రకటించాలి.

9:7-10. అవిశ్వాస ఇశ్రాయేలీయులు, నమ్మకమైన పితరుల వంశీయులుగా, ఐగుప్తునుండి విడుదల చేయబడిన దేవుడు ఎంపికచేసుకున్న ప్రజలుగా ఉండడం, వారు కూషీయుల్లాగే దేవుని ఎదుట చెడ్డ పేరును సంపాదించుకోవడాన్ని ఆపలేకపోయింది. నిష్పక్షపాతియైన దేవుని ఆమోదాన్ని సంపాదించుకోవడం నిర్దిష్ట వంశంలో జన్మించడంమీద ఆధారపడదు గానీ ‘ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవడం’ మీదే ఆధారపడుతుంది.—అపొస్తలుల కార్యములు 10:34, 35.

మనమేమి చేయాలి?

సాతాను లోకంమీద దేవుడు తన తీర్పును అమలుచేసే దినం సమీపంలోవుంది. యెహోవా తన ఆరాధకులమీద తన ఆత్మను కుమ్మరించి త్వరలో రాబోయే తన దినం గురించి మానవజాతిని హెచ్చరించడానికి వారిని సంసిద్ధులను చేశాడు. యెహోవాను తెలుసుకొని ‘ఆయన నామాన్నిబట్టి ప్రార్థన చేయడానికి’ ఇతరులకు సహాయం చేయడంలో మనం పూర్తిగా భాగం వహించవద్దా?—యోవేలు 2:31, 32.

“కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి” అని ఆమోసు ప్రోత్సహిస్తున్నాడు. (ఆమోసు 5:15) యెహోవా దినం సమీపించేకొద్దీ, మనం దేవునికి సన్నిహితమౌతూ, దుష్టలోకం నుండి, దాని అనైతిక సహవాసాల నుండి వేరుగా ఉండడం జ్ఞానయుక్తం. ఆ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా బైబిలు పుస్తకాలైన యోవేలు, ఆమోసు నుండి మనమెంత సమయోచితమైన పాఠాలను నేర్చుకోవచ్చో కదా!—హెబ్రీయులు 4:12.

[12వ పేజీలోని చిత్రం]

యోవేలు ఇలా ప్రవచించాడు: “యెహోవా దినము వచ్చెనే!”

[15వ పేజీలోని చిత్రాలు]

ఆమోసులాగే మనం దేవుని సందేశాన్ని ధైర్యంగా, నమ్మకంగా ప్రకటించాలి