కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేటగాని ఉరుల నుండి విడుదల

వేటగాని ఉరుల నుండి విడుదల

వేటగాని ఉరుల నుండి విడుదల

“వేటకాని ఉరిలోనుండి ఆయన [యెహోవా] నిన్ను విడిపించును.”—కీర్తన 91:3.

మానవాతీత తెలివి, జిత్తులుగల క్రూరుణ్ణి నిజ క్రైస్తవులందరూ ఎదుర్కొంటున్నారు. అతను కీర్తన 91:3లో ‘వేటగాడు’ అని పేర్కొనబడ్డాడు. ఈ శత్రువు ఎవరు? జూన్‌ 1, 1883 సంచిక నుండి ఈ కావలికోట (ఆంగ్లం) పత్రిక అతడెవరో కాదుగానీ అపవాదియగు సాతానే అని గుర్తించింది. ఉరివేసి పక్షిని పట్టేందుకు ప్రయత్నించే వేటగానిలాగే ఈ బలమైన శత్రువు తన జిత్తులమారితనంతో యెహోవా ప్రజలను మోసగించి, ఉరిలో పడవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

2 ప్రాచీన కాలాల్లో పక్షుల్ని ఆహారం కోసం, వినసొంపైన వాటి పాటలకోసం, వాటి రంగురంగుల ఈకల కోసం, వాటిని బలి ఇవ్వడం కోసం పట్టుకునేవారు. అయితే పక్షులు సహజంగానే అప్రమత్తంగా ఉంటాయి, ప్రమాదాన్ని చప్పున పసిగట్టేస్తాయి, వాటిని పట్టుకోవడం కష్టం. కాబట్టి, బైబిలు కాలాల్లోని వేటగాడు తాను పట్టుకోవాలనుకునే రకరకాల పక్షుల ప్రత్యేక లక్షణాలను, అలవాట్లను మొదట జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఆ తర్వాత, వాటిని పట్టేందుకు వివిధరకాల పద్ధతులు కనిపెట్టేవాడు. సాతానును వేటగానితో పోల్చడం ద్వారా అతని పద్ధతులను అర్థం చేసుకునేందుకు బైబిలు మనకు సహాయం చేస్తుంది. అపవాది మనల్ని ఆయావ్యక్తులుగా పరిశీలిస్తాడు. మన అలవాట్లను, గుణాలను గమనించి మనల్ని పట్టుకునేందుకు కుయుక్తులు పన్నుతాడు. (2 తిమోతి 2:26) సాతాను ఉరిలో పడడమంటే మన ఆధ్యాత్మిక పతనమే, చివరకు అది మనల్ని సర్వనాశనానికి నడిపించగలదు. కాబట్టి, స్వీయభద్రత కోసం ఆ ‘వేటగాని’ వివిధ పద్ధతులను మనం గుర్తించాలి.

3 కీర్తనకర్త స్పష్టమైన పదాలను ఉపయోగిస్తూ, సాతాను యుక్తులను సింహం లేదా నాగుపాము యుక్తులతో కూడా పోల్చాడు. (కీర్తన 91:13) సింహంలాగే సాతాను కొన్నిసార్లు, యెహోవా ప్రజలపై హింస లేదా ప్రభుత్వ చర్య ద్వారా బహిరంగంగానూ, నేరుగానూ దాడులు చేస్తాడు. (కీర్తన 94:20) అలాంటి క్రూరమైన దాడులు కొందరు అభ్యంతరపడేందుకు కారణం కావచ్చు. కానీ చాలా అరుదుగా ఈ బహిరంగ దాడులు విఫలమై, తత్ఫలితంగా దేవుని ప్రజలు సంఘటితమౌతున్నారు. మరింత మోసకరమైన రీతిలో సాతాను నాగుపాములా చేసే దాడుల విషయమేమిటి?

4 చాటునుండి దాడిచేసే విషసర్పంలాగే మోసకరమైన, ప్రాణాంతకమైన దాడులు చేసేందుకు సాతాను తన మానవాతీత తెలివిని ఉపయోగిస్తాడు. ఈ విధంగా అతడు దేవుని ప్రజల్లో కొందరి మనసును విషపూరితం చేయడంలో సఫలుడై, యెహోవా చిత్తానికి బదులు తన చిత్తం చేసేలా వారిని మోసగించాడు, అది వారికి విషాదాన్నే మిగిల్చింది. సంతోషకరమైన విషయమేమిటంటే, మనం సాతాను పన్నాగాలను ఎరుగనివారం కాము. (2 కొరింథీయులు 2:11) వేటగాడు ఉపయోగించినట్లే అతడూ ఉపయోగించే నాలుగు ఉరులను మనమిప్పుడు పరిశీలిద్దాం.

మనుష్యుల భయం

5 ఇతరులచేత అంగీకరించబడాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది మానవుల సాధారణ అభిలాష అని ఆ ‘వేటగానికి’ తెలుసు. క్రైస్తవులు తమ చుట్టూవున్న ప్రజల అలోచనలను, భావాలను ఏ మాత్రం పట్టించుకోనివారిగా ఉండరు. ఇది తెలిసిన అపవాది తమ గురించి ప్రజలు ఏమనుకుంటారోననే వారి ఆందోళనను తన ప్రయోజనానికి ఉపయోగించుకునేందుకు ఇష్టపడతాడు. ఉదాహరణకు, ‘మనుష్యులకు భయపడడం’ అనే ఉరిని ఉపయోగిస్తూ అతడు దేవుని ప్రజల్లో కొందరిని చేజిక్కించుకుంటాడు. (సామెతలు 29:25) మనుష్యుల భయంవల్ల దేవుని సేవకులు యెహోవా నిషేధించిన దానిని చేయడంలో ఇతరులతో చేరితే లేదా వారు చేయాలని దేవుడు ఆజ్ఞాపించినది చేయడానికి వెనుదీస్తే వారు ‘వేటగాని’ ఉరిలో చిక్కుకుంటారు.—యెహెజ్కేలు 33:8; యాకోబు 4:17.

6 ఉదాహరణకు, ఒక యౌవనుడు తోటి విద్యార్థుల ఒత్తిడికి లొంగిపోయి సిగరెట్‌ త్రాగవచ్చు. ఆ రోజు పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరినప్పుడు సిగరెట్‌ త్రాగాలనే విషయమే అతని మదిలో ఉండకపోవచ్చు. అయితే ఎంతో సమయం గడవకముందే, అతను తన ఆరోగ్యానికి హానికరమైన, దేవుణ్ణి అసంతోషపర్చే పనిచేయవచ్చు. (2 కొరింథీయులు 7:1) అతనెలా ఆ ప్రలోభానికి గురయ్యాడు? బహుశా అతను చెడు స్నేహితులతో తిరుగుతూ వారు తనను ఆమోదించరేమో అని భయపడి ఉంటాడు. యౌవనులారా, ‘వేటగాడు’ మిమ్మల్ని ప్రలోభపెట్టి మిమ్మల్ని చేజిక్కించుకోనివ్వకండి! మనం చిక్కుబడకుండా తప్పించుకునేందుకు చిన్నచిన్న విషయాల్లో కూడా రాజీపడకుండా జాగ్రత్తపడండి! దుష్టసాంగత్యానికి దూరంగా ఉండమనే బైబిలు హెచ్చరికను లక్ష్యపెట్టండి.—1 కొరింథీయులు 15:33.

7 కుటుంబాన్ని భౌతికంగా సంరక్షించవలసిన తమ లేఖనాధారిత బాధ్యతను నెరవేర్చాలనే శ్రద్ధగల క్రైస్తవ తల్లిదండ్రులు దానినెన్నడు విస్మరించరు. (1 తిమోతి 5:8) అయితే, ఈ విషయంలో క్రైస్తవులు తమ సమతుల్యాన్ని కోల్పోయేలా చేయాలన్నది సాతాను లక్ష్యం. ఎక్కువ పనిచేయాలనే యజమాని ఒత్తిడికి లొంగిపోయి బహుశా వారు అలవాటుగా కూటాలకు రాకుండా తప్పిపోతుండవచ్చు. తమ సహోదరులతోపాటు యెహోవాను ఆరాధించడానికి ఒక జిల్లా సమావేశపు అన్నిరోజుల కార్యక్రమాలకు హాజరయ్యేలా సెలవు అడిగేందుకు వారు భయపడుతుండవచ్చు. “యెహోవాయందు నమ్మకం” ఈ ఉరి నుండి కాపాడుతుంది. (సామెతలు 3:5, 6) అంతేకాక, మనమందరం యెహోవా కుటుంబ సభ్యులమని, మనపట్ల శ్రద్ధ చూపించే బాధ్యత ఆయన తీసుకున్నాడని గుర్తుంచుకోవడం మన సమతుల్యతను కాపాడుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. తల్లిదండ్రులారా, మీరు యెహోవా చిత్తం చేసినప్పుడు ఏదోక రీతిలో ఆయన మీపట్ల, మీ కుటుంబంపట్ల శ్రద్ధవహిస్తాడనే నమ్మకం మీకుందా? లేక, అపవాది మిమ్మల్ని చేజిక్కించుకొని మనుష్యుల భయాన్నిబట్టి మీచేత తన చిత్తం చేయిస్తాడా? ఈ ప్రశ్నలను ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం.

ఐశ్వర్యాసక్తికి సంబంధించిన ఉరి

8 మనల్ని చేజిక్కించుకునేందుకు సాతాను ఐశ్వర్యాసక్తికి సంబంధించిన ప్రలోభాన్ని కూడా ఉపయోగిస్తాడు. దేవుని ప్రజల్లో కొందరిని సహితం మోసగించేలా ఈ లోక వాణిజ్య విధానం తరచూ సత్వరమే సంపన్నులయ్యే పథకాలను ప్రోత్సహిస్తోంది. కొన్నిసార్లు ఆయావ్యక్తులు, “కష్టపడి పనిచేయండి. మీరు ఆర్థికంగా నిలద్రొక్కుకున్న తర్వాత, హాయిగా జీవితాన్ని అనుభవించవచ్చు. అప్పుడు మీరు పయినీరు సేవకూడా చేయవచ్చు” అని పురికొల్పబడతారు. క్రైస్తవ సంఘంలోవున్న తమ సహవాసుల నుండి ఆర్థిక ప్రయోజనం పొందే కొందరు పలికే అలాంటి మాటలు కుతర్కమైనవిగా ఉండవచ్చు. ఆ ప్రేరణ గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది యేసు ఉపమానంలోని ‘వెర్రివాడైన’ ధనవంతుని ఆలోచనను ప్రతిబింబించడం లేదా?—లూకా 12:16-21.

9 ప్రజలు వస్తుసంపదను కోరుకునేలా వారిని ప్రభావితం చేసే రీతిలో సాతాను తన దుష్టవిధానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ కోరిక చివరకు ఒక క్రైస్తవుని జీవితంలోకి ప్రవేశించి వాక్యాన్ని అణచివేసి దానిని నిష్ఫలం చేస్తుంది. (మార్కు 4:18-19) అన్నవస్త్రములతో తృప్తిపొంది ఉండమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (1 తిమోతి 6:7-8) అయితే చాలామంది ఆ ఉపదేశాన్ని తమకు అన్వయించుకోని కారణంగా ‘వేటగాని’ ఉరిలో చిక్కుకుంటున్నారు. ఫలానీ విధమైన జీవనశైలికి అంటిపెట్టుకొని ఉండాలని భావించేలా వారి స్వీయ ప్రాముఖ్యతే చేస్తోందా? వ్యక్తిగతంగా మన విషయమేమిటి? వస్తుసంపద కొరకైన మన కోరిక, సత్యారాధనా విషయాల్ని రెండవ స్థానంలోకి నెట్టేసేలా చేస్తోందా? (హగ్గయి 1:2-8) ఆర్థిక సంక్షోభ సమయాల్లో కూడా కొందరు తాము అలవాటుపడిన జీవన స్థాయిలో కొనసాగేందుకు తమ ఆధ్యాత్మికతను పణంగా పెట్టారు. అలాంటి ఐశ్వర్యాసక్తిగల దృక్పథం ‘వేటగాణ్ణి’ సంతోషపరుస్తుంది.

అనైతిక వినోదానికి సంబంధించిన ఉరి

10 ‘వేటగాని’ మరో యుక్తి ఏమిటంటే, మంచి చెడులకు సంబంధించిన ప్రజల సహజ గ్రహింపును బలహీనపర్చడమే. సొదొమ గొమొర్రాల్లోని ప్రజల మనస్తత్వాన్ని పోలిన మనస్తత్వమే వినోద పరిశ్రమను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. టీవీ వార్తానివేదికలు, పత్రికలు సహితం హింసను ప్రముఖంగా పేర్కొంటూ, లైంగికతపట్ల జుగుప్సాకరమైన ఆసక్తిని పురికొల్పే సమాచారాన్నే అందిస్తున్నాయి. సమాచార మాధ్యమాల్లో కనిపించే వినోదంలో ఎక్కువభాగం “మేలు కీడులను వివేచించే” ప్రజల సామర్థ్యాన్ని క్షీణింపజేస్తోంది. (హెబ్రీయులు 5:14) అయితే యెషయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన ఈ మాటలను గుర్తుచేసుకోండి: “కీడు మేలనియు మేలు కీడనియు . . . ఎంచుకొనువారికి శ్రమ.” (యెషయా 5:20) అలాంటి అనైతిక వినోదంతో ‘వేటగాడు’ మీ ఆలోచనను రహస్యంగా ప్రభావితం చేశాడా? ఆత్మపరిశీలన ఆవశ్యకం.—2 కొరింథీయులు 13:5.

11 దాదాపు 25 సంవత్సరాల క్రితం కావలికోట (ఆంగ్లం) పత్రిక టీవీ ధారావాహికల గురించి దేవుని సత్యారాధకులను ప్రేమపూర్వకంగా హెచ్చరించింది. * ప్రముఖ టీవీ ధారావాహికల మోసకరమైన ప్రభావాన్ని గురించి అదిలా వ్యాఖ్యానించింది: “ప్రేమాన్వేషణ ఎలాంటి ప్రవర్తననైనా సమర్థించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, గర్భందాల్చిన, వివాహంకాని ఓ అమ్మాయి తన స్నేహితురాలికి ఇలా చెబుతుంది: ‘కానీ నేను విక్టర్‌ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఏం జరిగినా లెక్కచేయను. . . . అతని బిడ్డకు తల్లికావడమే నాకు ముఖ్యం!’ ఈ నేపథ్యంలో మృదువుగావచ్చే సంగీతం, ఆమె లైంగిక దుర్నీతికి పాల్పడిందనే ఆలోచనను మరుగునపడేస్తుంది. మీరూ విక్టర్‌ను ఇష్టపడతారు. ఆ అమ్మాయిపట్ల సానుభూతి చూపిస్తారు. మీరామెను ‘అర్థం చేసుకుంటారు.’ ‘మీ ఆలోచనను ఎంతలా సమర్థించుకోవచ్చనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. లైంగిక దుర్నీతి తప్పని మనకు తెలుసు . . . కానీ నేను మానసికంగా వారితో ఉన్నట్లు గ్రహించాను’ అని ఆ తర్వాత విషయం గ్రహించిన ఓ ప్రేక్షకురాలు అంది.”

12 ఆ ఆర్టికల్స్‌ ప్రచురించబడిన దగ్గరనుండి, ఇలాంటి మనసును పాడుచేసే కార్యక్రమాలు అంతకంతకు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. చాలా ప్రాంతాల్లో అలాంటి కార్యక్రమాలు 24 గంటలూ ప్రసారం చేయబడుతున్నాయి. పురుషులు, స్త్రీలు, టీనేజర్లు తరచుగా అలాంటి వినోదంతో తమ మనసులను, హృదయాలను నింపుకుంటున్నారు. కానీ మనమలాంటి తప్పుడు తర్కంతో మనల్నిమనం మోసగించుకోకూడదు. వాస్తవిక ప్రపంచంలో చూస్తున్న దానికన్నా అలాంటి వినోదం ఏమంత చెడ్డదికాదని తర్కించడం పొరపాటు. కలలో కూడా తన ఇంటికి ఆహ్వానించాలని కోరుకోని ప్రజలందించే వినోదాన్ని ఎంచుకోవడాన్ని ఓ క్రైస్తవుడు నిజంగా సమర్థించుకోగలడా?

13 “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఇచ్చిన ఆ హెచ్చరికను లక్ష్యపెట్టిన చాలామంది ప్రయోజనం పొందారు. (మత్తయి 24:45-47) స్పష్టంగా ఇవ్వబడిన బైబిలు ఆధారిత ఉపదేశాన్ని చదివిన తర్వాత, ఆ ఆర్టికల్స్‌ వ్యక్తిగతంగా తమనెలా ప్రభావితం చేశాయో తెల్పేందుకు కొందరు ఉత్తరాలు రాశారు. * ఒకామె ఇలా ఒప్పుకుంది: “నేను 13 సంవత్సరాలుగా ధారావాహికలు చూసేందుకు అలవాటుపడ్డాను. క్రైస్తవ కూటాలకు హాజరవుతూ, అప్పుడప్పుడు క్షేత్రసేవకు వెళ్తున్నాను కాబట్టి నేను సురక్షితంగానే ఉన్నానని భావించాను. ఒకవేళ భర్త మిమ్మల్ని బాధిస్తే లేదా మీరు ప్రేమించబడనట్లు భావిస్తే వ్యభిచరించడం సమర్థనీయమే, అందుకు ఆయనే బాధ్యుడు అనే ధారావాహికల లౌకిక దృక్పథాన్ని అలవర్చుకున్నాను. కాబట్టి నాకది ‘సమర్థనీయమని’ అనిపించినప్పుడు నేనా చెడుమార్గంలో వెళ్లి యెహోవాకు, నా భర్తకు వ్యతిరేకంగా పాపం చేశాను.” ఈ స్త్రీ సంఘం నుండి బహిష్కరించబడింది. చివరకు ఆమె తన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపపడినప్పుడు తిరిగి చేర్చుకోబడింది. టీవీ ధారావాహికల గురించి హెచ్చరించిన ఆర్టికల్స్‌ యెహోవా అసహ్యించుకునే వినోదాన్ని తిరస్కరించే బలాన్ని ఆమెకిచ్చాయి.—ఆమోసు 5:14, 15.

14 తన జీవితాన్ని ప్రభావితం చేసిన మరో పాఠకురాలు ఇలా చెప్పింది: “నేను ఆ ఆర్టికల్స్‌ చదివినప్పుడు ఏడ్చేశాను, ఎందుకంటే నా హృదయం సంపూర్ణంగా యెహోవావైపు లేదని నేను గ్రహించాను. నేను ఈ ధారావాహికలకు ఇక ఏ మాత్రం దాసురాలిగా ఉండనని నా దేవునికి వాగ్దానం చేశాను.” ఆ ఆర్టికల్స్‌పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసిన తర్వాత, ఓ క్రైస్తవ స్త్రీ తన అలవాటును ఒప్పుకుంటూ ఇలా రాసింది: “యెహోవాతో నా సంబంధం పాడైందేమోనని నేను . . . కలతచెందాను. ‘ధారావాహికల్లోని పాత్రధారులను’ స్నేహితులుగా కలిగివుంటూనే నేనెలా యెహోవాకు స్నేహితురాలిగా ఉండగలను?” అలాంటి టీవీ కార్యక్రమాలు 25 సంవత్సరాల క్రితమే హృదయాలను చెరిపితే, నేడు అవి ఇంకెంత ప్రభావం చూపిస్తాయి? (2 తిమోతి 3:13) అనైతిక వినోదమనేది టీవీ ధారావాహికలు, హింసాత్మక వీడియో గేములు లేదా దుర్నీతికరమైన సంగీతపు వీడియోల వంటి ఏ రూపంలోవున్నా దానికి సంబంధించిన సాతాను ఉరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.

వ్యక్తిగత విభేదాల ఉరి

15 యెహోవా ప్రజలను విభజించడానికి సాతాను వ్యక్తిగత విభేదాలను ఉరిగా ఉపయోగిస్తాడు. మనకే సేవాధిక్యతలున్నా మనమీ విధంగా ఉరిలో చిక్కుబడే అవకాశముంది. యెహోవా ఉనికిలోకి తీసుకొచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక సుసంపన్నతను, సమాధాన ఐక్యతలను పాడుచేసేందుకు వ్యక్తిగత విభేదాలను అనుమతించిన కారణంగా కొందరు అపవాది చేతికి చిక్కారు.—కీర్తన 133:1-3.

16 మొదటి ప్రపంచ యుద్ధకాలంలో నేరుగా దాడిచేసి యెహోవా సంస్థ భూసంబంధ భాగాన్ని నాశనం చేసేందుకు సాతాను ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. (ప్రకటన 11:7-13) అప్పటినుండి, సాతాను మన ఐక్యతను పాడుచేసేందుకు కుయుక్తిగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత విభేదాలు అనైక్యత కలిగించేందుకు అనుమతిస్తే, మనం ‘వేటగానికి’ చోటిచ్చినట్లే. ఆ విధంగా మనం మన వ్యక్తిగత జీవితాల్లో, అలాగే సంఘంలో పరిశుద్ధాత్మ ధారాళంగా ప్రవహించడాన్ని అడ్డుకుంటాం. అదే జరిగితే, సాతాను సంతోషిస్తాడు ఎందుకంటే సంఘంలో సమాధానం, ఐక్యత పాడవడం ప్రకటనాపనికి అడ్డొస్తుంది.—ఎఫెసీయులు 4:27, 30-32.

17 తోటి విశ్వాసితో మీకు వ్యక్తిగత విభేదాలుంటే మీరేమి చేయవచ్చు? నిజమే, ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలున్నా, వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకోకుండా వదిలేయడానికి కారణమేమీ లేదు. (మత్తయి 5:23, 24; 18:15-17) దేవుని వాక్యోపదేశం ప్రేరేపితం, పరిపూర్ణం. బైబిలు సూత్రాలను అన్వయించుకున్నప్పుడు అవెన్నటికీ విఫలం కావు. అవి ఎల్లప్పుడూ సత్ఫలితాలనిస్తాయి!

18 యెహోవా “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు,” అంతేకాక ఆయన దగ్గర “క్షమాపణ దొరుకును.” (కీర్తన 86:5; 130:4) మనం యెహోవాను పోలి నడుచుకున్నప్పుడు మనమాయన ప్రియమైన పిల్లలమని చూపిస్తాం. (ఎఫెసీయులు 5:1) మనమందరం పాపులం, యెహోవా క్షమాపణ మనకు ఎంతో అవసరం. కాబట్టి, ఎవరినైనా క్షమించలేమని మనకు అనిపిస్తే మనం జాగ్రత్తవహించాలి. మనం యేసు ఉపమానంలోని దాసునిలా తయారయ్యే అవకాశముంది. ఆ దాసుడు తన యజమాని అప్పటికే క్షమించిన తన అప్పులో కేవలం కొద్దిమొత్తమే తనకు అచ్చివున్న తోటి దాసుణ్ణి క్షమించడానికి నిరాకరించాడు. ఆ యజమానికి విషయం తెలిసినప్పుడు, క్షమించడానికి నిరాకరించిన ఆ దాసుణ్ణి చెరలో వేయించాడు. యేసు ఇలా చెబుతూ ఆ ఉపమానాన్ని ముగించాడు: “మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయును.” (మత్తయి 18:21-35) ఆ ఉపమానాన్ని ధ్యానిస్తూ యెహోవా మనల్ని ఎన్నిసార్లు ధారాళంగా క్షమించాడో ఆలోచించడం, మన సహోదరునితో వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మనకు నిశ్చయంగా సహాయం చేస్తుంది.—కీర్తన 19:14.

“మహోన్నతుని చాటున” సురక్షితంగా ఉండడం

19 మనం ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాం. యెహోవా ప్రేమపూర్వక సహాయమే లేకుంటే, సాతాను మనల్నందరినీ నిశ్చయంగా నాశనం చేసివుండేవాడే. కాబట్టి ‘వేటగాని’ ఉరిని తప్పించుకోవడానికి మనం అలంకారార్థ సురక్షిత స్థలమైన ‘మహోన్నతుని చాటున’ నివసిస్తూ ‘సర్వశక్తుని నీడను విశ్రమించాలి.’—కీర్తన 91:1.

20 యెహోవా జ్ఞాపికలు, నిర్దేశాలు కట్టడిచేసేవన్నట్లు కాక, మనకు కాపుదలనిచ్చేవిగా ఎల్లప్పుడూ దృష్టిద్దాం. మానవాతీత తెలివిగల క్రూరుణ్ణి మనమందరం ఎదుర్కొంటున్నాం. యెహోవా ప్రేమపూర్వక సహాయం లేకపోతే ఉరిలో చిక్కుకోకుండా ఎవరూ తప్పించుకోలేరు. (కీర్తన 124:7, 8) కాబట్టి ‘వేటగాని’ ఉరుల నుండి యెహోవా మనల్ని తప్పించాలని మనం ప్రార్థిద్దాం!—మత్తయి 6:13.

[అధస్సూచీలు]

^ పేరా 16 కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1982, 3-7 పేజీలు.

^ పేరా 18 కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1983, 23వ పేజీ.

మీకు జ్ఞాపకమున్నాయా?

• ‘మనుష్యులకు భయపడడం’ ఎందుకు ఒక ప్రాణాంతకమైన ఉరి?

• ఐశ్వర్యాసక్తికి సంబంధించిన ఆకర్షణను అపవాది ఎలా ఉపయోగిస్తాడు?

• అనైతిక వినోదమనే ఉరిని ఉపయోగించి సాతాను కొందరినెలా వలలో వేసుకున్నాడు?

• మన ఐక్యతను పాడుచేసేందుకు అపవాది ఏ ఉరిని ఉపయోగిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. ‘వేటగాడు’ ఎవరు, అతనెందుకు ప్రమాదకరమైన వ్యక్తి?

2. సాతాను ఎందుకు వేటగానితో పోల్చబడ్డాడు?

3, 4. సాతాను యుక్తులు ఎప్పుడు, సింహం యుక్తులను పోలివుంటాయి? ఎప్పుడు నాగుపాము యుక్తులను పోలివుంటాయి?

5. ‘మనుష్యులకు భయపడడం’ అనే ఉరి ఎందుకంత శక్తివంతమైనది?

6. ఒక యౌవనుడు ‘వేటగానికి’ ఎలా చిక్కుబడవచ్చో ఏ ఉదాహరణ వివరిస్తోంది?

7. సాతాను ఏ విధంగా కొందరు తల్లిదండ్రులు తమ ఆధ్యాత్మిక సమతుల్యతను కోల్పోయేలా చేయవచ్చు?

8. ఐశ్వర్యాసక్తి ప్రలోభాన్ని సాతాను ఏవిధంగా ఉపయోగిస్తాడు?

9. వస్తుసంపదను కోరుకునే ఉరిలో కొందరు క్రైస్తవులు ఎందుకు చిక్కుకోవచ్చు?

10. ప్రతీ క్రైస్తవుడు ఏ విధమైన ఆత్మపరిశీలన చేసుకోవాలి?

11. టీవీ ధారావాహికల గురించి ఈ పత్రికలో ఏ హెచ్చరిక ఇవ్వబడింది?

12. కొన్ని టీవీ కార్యక్రమాలకు సంబంధించి ఇవ్వబడిన హెచ్చరిక ప్రస్తుతం కూడా తగినదే అని ఏ వాస్తవాలు సూచిస్తున్నాయి?

13, 14. టీవీ గురించిన హెచ్చరికల నుండి తామెలా ప్రయోజనం పొందామని కొందరు చెప్పారు?

15. కొందరు అపవాది చేతికెలా చిక్కారు?

16. మన ఐక్యతను పాడుచేసేందుకు సాతాను ఎలా కుయుక్తిగా పనిచేస్తున్నాడు?

17. వ్యక్తిగత విభేదాలు ఉన్నవారు వాటిని పరిష్కరించుకునేందుకు ఏమిచేయాలి?

18. యెహోవాను పోలి నడుచుకోవడం, వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకునేందుకు ఎందుకు సహాయం చేస్తుంది?

19, 20. ఈ ప్రమాదకర కాలాల్లో యెహోవా ‘చాటును,’ ‘నీడను’ మనమెలా దృష్టించాలి?

[27వ పేజీలోని చిత్రం]

‘మనుష్యలకు భయపడుట’ ద్వారా కొందరు ఉరిలో చిక్కుకున్నారు

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా అసహ్యించుకుంటున్న దానిని మీరు ఆనందిస్తున్నారా?

[29వ పేజీలోని చిత్రం]

తోటి క్రైస్తవునితో మీకు వ్యక్తిగత విభేదాలుంటే మీరేమి చేయవచ్చు?