కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషాన్ని తీసుకొచ్చే నిర్ణయాలు

సంతోషాన్ని తీసుకొచ్చే నిర్ణయాలు

సంతోషాన్ని తీసుకొచ్చే నిర్ణయాలు

“నేనలా చేయకుంటే బాగుండేది!” అలా ఎన్నిసార్లు మీకనిపించింది? మనం విచారించాల్సిన అవసరంరాని విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రాముఖ్యంగా మన జీవిత గమనాన్ని ప్రభావితం చేసే విషయాల్లో అలా నిర్ణయాలు తీసుకోవాలని మనమందరం కోరుకుంటాం. అయితే, సంతోషాన్నిచ్చే నిర్ణయాలను మనమెలా తీసుకోవచ్చు?

మొట్టమొదటిగా, ఎంతో నమ్మదగిన ప్రమాణాలు మనకుండాలి. అలాంటి ప్రమాణాలు ఉన్నాయా? అలాంటివి లేవని చాలామంది అనుకుంటారు. అమెరికాలో జరిపిన ఒక సర్వే ప్రకారం, మంచిచెడుల లాంటివేవీ లేవని, కీడుమేలులకు సంబంధించిన భావాలు “వ్యక్తిగత విలువలు, సాంస్కృతిక వైవిధ్యాలకు” అనుగుణంగా మారుతుంటాయని, 75 శాతంమంది కాలేజీ విద్యార్థులు నమ్ముతున్నారు.

నైతిక ప్రమాణాలు కేవలం వ్యక్తిగత లేక ప్రజాదరణ పొందిన అభిప్రాయాలని అనుకోవడం నిజంగా సహేతుకమా? కాదు, ఆ ప్రమాణాలు అలాంటివి కావు. ప్రజలు తమకు ఇష్టమొచ్చినట్లు చేయడానికి అనుమతించబడితే దానివల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసులు లేని ప్రాంతంలో జీవించడానికి ఎవరు ఇష్టపడతారు? అంతేకాక, వ్యక్తిగత అభిప్రాయంమీద ఎల్లప్పుడూ ఆధారపడలేం. మనకు సరైనదిగా అనిపించింది చేయాలని మనం నిర్ణయించుకోవచ్చు, అయితే అది సరైందికాదని మనం ఆ తర్వాత తెలుసుకోవచ్చు. నిజానికి, మానవజాతి చరిత్రంతా ఈ బైబిలు సూత్రానికి సంబంధించిన సత్యాన్ని ధృవీకరిస్తోంది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:23) అలాంటప్పుడు, జీవితంలోని ప్రాముఖ్యమైన అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం మార్గనిర్దేశం కోసం ఎవరి దగ్గరికి వెళ్లవచ్చు?

ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన యువ అధికారి జ్ఞానయుక్తంగా యేసు దగ్గరికి వెళ్లాడు. మనం గమనించినట్లుగా, ఆ యువకుని ప్రశ్నకు సమాధానమిస్తున్నప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని యేసు ప్రస్తావించాడు. యెహోవా దేవుడు జ్ఞానానికి, వివేకానికి ఉన్నతమైన మూలాధారమని, తాను సృష్టించిన ప్రాణులకు ఏది శ్రేష్ఠమో ఆయనకు తెలుసని యేసు గుర్తించాడు. అందుకే యేసు ఇలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.” (యోహాను 7:16) అవును, మనం జీవితంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే నమ్మదగిన మార్గనిర్దేశం దేవుని వాక్యమే. దేవుని వాక్యంలోని సూత్రాలను అన్వయించుకుంటే అవి మన సంతోషాన్ని అధికం చేస్తాయి, అలాంటి సూత్రాల్లో కొన్నింటిని మనమిప్పుడు పరిశీలిద్దాం.

బంగారు సూత్రం

యేసు, ప్రఖ్యాతిగాంచిన తన కొండమీది ప్రసంగంలో, ఇతరులతో మన సంబంధాల విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయగల ప్రాథమిక సూత్రాన్ని బోధించాడు. ఆయన ఇలా చెప్పాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ప్రవర్తనకు సంబంధించిన ఈ సూత్రం సాధారణంగా బంగారు సూత్రం అని పిలవబడింది.

కొందరు ఆ మాటలనే వ్యతిరేకార్థంలో ఇలా ఉపయోగించారు: “ఇతరులు మీకు ఏమి చేయకూడదని మీరు కోరుకుంటారో అది వారికి చేయకండి.” బంగారు సూత్రానికీ, దాని వ్యతిరేకార్థానికీ మధ్యవున్న వ్యత్యాసాన్ని గ్రహించడానికి స్నేహపూరితుడైన సమరయుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని పరిశీలించండి. ఒక యూదుడు కొట్టబడి, దారిలో కొనప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. యాజకుడు, లేవీయుడు ఆయనను చూసి ప్రక్కగా వెళ్లిపోయారు. ఆ వ్యక్తి బాధ పెరిగేలా వారేమీ చేయలేదు కాబట్టి, వారు బంగారు సూత్రానికి సంబంధించిన వ్యతిరేకార్థానికి అనుగుణంగా ప్రవర్తించారని చెప్పవచ్చు. దానికి భిన్నంగా, ఆ దారిలోనే వెళ్తున్న సమరయుడు సహాయం చేయడానికి ఆగాడు. ఆయన ఆ యూదుని గాయాలకు కట్లు కట్టి పూటకూళ్లవాని దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇతరులు తనకు ఏమి చేయాలని ఆయన కోరుకున్నాడో అదే ఆయన ఆ యూదునికి చేశాడు. ఆయన బంగారు సూత్రాన్ని అన్వయించుకొని సరైన నిర్ణయం తీసుకున్నాడు.—లూకా 10:30-37.

ఈ ప్రవర్తనా నియమాన్ని అనుసరించి సంతోషకరమైన ఫలితాలు సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు నివసిస్తున్న ప్రాంతానికి ఒక క్రొత్త కుటుంబం వచ్చిందని అనుకుందాం. ఆ కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని స్వాగతించడానికి మీరు ఎందుకు చొరవ తీసుకోకూడదు? మీరు నివసిస్తున్న ప్రాంతంతో వారు సుపరిచితులవడానికే కాక, వారి ప్రశ్నలకు జవాబులు చెప్పి, వారి అవసరాల విషయంలో కూడా సహాయం చేయవచ్చు. స్నేహపూరితమైన శ్రద్ధ కనబరచడంలో చొరవ తీసుకోవడం ద్వారా మీరు క్రొత్తగా వచ్చిన పొరుగువారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ప్రవర్తించారని తెలుసుకొని సంతృప్తిని కూడా పొందుతారు. అది జ్ఞానయుక్తమైన నిర్ణయం కాదా?

ఇతరులపట్ల ఉన్న ప్రేమనుబట్టి నిర్ణయాలు

జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేసే బంగారు సూత్రంతోపాటు ఇతర నిర్దేశాలను కూడా యేసు ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని అడిగినప్పుడు, యేసు ఇలా జవాబిచ్చాడు: “‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.’ ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. ‘నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను’ రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.”—మత్తయి 22:36-40.

యేసు, తాను చనిపోయే ముందు రాత్రి, ఒకరినొకరు ప్రేమించాలనే ‘క్రొత్త ఆజ్ఞను’ తన శిష్యులకు ఇచ్చాడు. (యోహాను 13:34) దానిని క్రొత్త ఆజ్ఞ అని ఎందుకు అన్నాడు? వాస్తవానికి, ధర్మశాస్త్రమంతటికీ ఆధారంగా ఉన్న రెండు ఆజ్ఞల్లో పొరుగువారిని ప్రేమించడం ఒకటని ఆయన ముందుగానే వివరించాడు కదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు ఇలా ఆజ్ఞాపించబడ్డారు: “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను.” (లేవీయకాండము 19:18) అయితే, యేసు తన శిష్యులకు దానికన్నా ఎక్కువ చేయమని ఇప్పుడు ఆజ్ఞాపించాడు. అదే రాత్రి, వారి కోసం తన ప్రాణాన్ని అర్పించనున్నానని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆ తర్వాత ఆయన వారికిలా చెప్పాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:12, 13) స్వప్రయోజనాల కన్నా ఇతరుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆ ఆజ్ఞ కోరుతుంది కాబట్టి అది నిజంగా ఒక క్రొత్త ఆజ్ఞ.

స్వప్రయోజనాలకే కాక ఇతరుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థ ప్రేమ చూపించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారని అనుకుందాం, మిమ్మల్ని ఉత్తేజపర్చే వాల్యూమ్‌లో సంగీతం వినాలని మీకనిపిస్తుంది, కానీ అది మీ పొరుగువారికి ఇబ్బంది కలిగిస్తోంది. వారు కాస్త ప్రశాంతంగా ఉండేలా మీరు మీ ఆనందాన్ని తగ్గించుకునేందుకు ఇష్టపడతారా? మరో విధంగా చెప్పాలంటే, మీరు మీ సంతోషంకన్నా మీ పొరుగువారి సంతోషానికే ప్రాధాన్యతనిస్తారా?

మరో పరిస్థితిని పరిశీలించండి. కెనడాలో, శీతాకాలంలోని మంచుకురుస్తున్న ఒక రోజు, ఇద్దరు యెహోవాసాక్షులు ఒక వృద్ధుని ఇంటికి వెళ్లారు. మాటల సందర్భంలో, తనకున్న హృద్రోగం కారణంగా తన ఇంటి ముందున్న మంచును తొలగించలేకపోతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. దాదాపు ఒక గంట తర్వాత, మంచును తొలగిస్తున్న శబ్దాలు ఆయనకు వినిపించాయి. ఆయన ఇంటి గుమ్మానికి దారితీసే తోవలోవున్న మంచును, మెట్లమీద ఉన్న మంచును తొలగించడానికి ఆ ఇద్దరు సాక్షులు తిరిగొచ్చారు. ఆయన యెహోవాసాక్షుల కెనడా బ్రాంచి కార్యాలయానికి రాసిన ఉత్తరంలో ఇలా చెప్పాడు: “నేను నా జీవితంలో నిజమైన క్రైస్తవ ప్రేమంటే ఏమిటో చవిచూశాను. అది నేటి లోకంపట్ల నాకున్న నిరాశావాద దృక్పథాన్ని ఎంతగానే మార్చివేసింది. అంతేకాక దానివల్ల మీ ప్రపంచవ్యాప్త ప్రయత్నాలపట్ల ఇప్పటికే నాకెంతో గౌరవం ఉంది, అది మరింత పెరిగింది.” అవును, మనం చేసేది చిన్నదిగా కనిపించినా ఇతరులకు సహాయం చేయాలనుకోవడం వారిమీద అనుకూలమైన ప్రభావం చూపించగలదు. అలాంటి స్వయంత్యాగ నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ఎంత సంతోషాన్నిస్తుందో కదా!

దేవునిపట్ల ప్రేమ ఆధారంగా నిర్ణయాలు

మనం దేవుణ్ణి ప్రేమించాలన్నది ముఖ్యమైన ఆజ్ఞ అని యేసు వర్ణించాడు, మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పటికే యెహోవా సమర్పిత జనాంగంగావున్న యూదులను సంబోధించి యేసు ఆ మాటలు అన్నాడు. అయినా, ఇశ్రాయేలీయుల్లో ప్రతీ ఒక్కరూ పూర్ణాత్మతో, పూర్ణహృదయ ప్రేమతో తమ దేవుణ్ణి సేవిస్తారో లేదో స్వయంగా నిర్ణయించుకోవాలి.—ద్వితీయోపదేశకాండము 30:15, 16.

అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు దేవునిపట్ల మీకున్న భావాలను వెల్లడిచేస్తాయి. ఉదాహరణకు, మీరు బైబిలు ఆచరణాత్మక విలువ గురించిన మరింత జ్ఞానాన్ని, గౌరవాన్ని పెంచుకునేకొద్దీ మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సివస్తుంది. యేసు అనుచరునిగా మారాలనే ఉద్దేశంతో మీరు క్రమమైన బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఇష్టపడతారా? అలా ప్రారంభించాలనుకోవడంవల్ల మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’—మత్తయి 5:3, NW.

ఆ యువ అధిపతి తాను తీసుకున్న నిర్ణయాన్నిబట్టి చింతించాడో లేదో మనకైతే తెలియదు. అయితే, అనేక సంవత్సరాలపాటు యేసును అనుసరించిన అపొస్తలుడైన పేతురుకు తన నిర్ణయం విషయంలో ఎలా అనిపించిందో మనకు తెలుసు. దాదాపు సా.శ. 64లో తన జీవితపు చరమాంకంలో పేతురు తన తోటి విశ్వాసులను ఇలా ప్రోత్సహించాడు: “శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.” (2 పేతురు 1:13; 3:14) దాదాపు 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయం విషయంలో పేతురు చింతించలేదన్నది స్పష్టం, అంతేకాక, తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడివుండమని ఆయన ఇతరులను ప్రోత్సహించాడు.

పేతురు సలహాను పాటించడమంటే, యేసు శిష్యులుగా ఉండడంవల్ల వచ్చే బాధ్యతలను స్వీకరించి దేవుని ఆజ్ఞలకు లోబడాలని నిర్ణయించుకోవడమని భావం. (లూకా 9:23; 1 యోహాను 5:3) అది కష్టమనిపించినా యేసు ఇచ్చిన ఈ ఓదార్పుకరమైన వాగ్దానం మనకుంది: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.

ఆర్థర్‌ అనుభవాన్ని పరిశీలించండి. పదేళ్ల ప్రాయంలో ఆర్థర్‌, వయొలిన్‌ వాయించడాన్ని వృత్తిగా చేసుకోవాలనే ఉద్దేశంతో వయొలిన్‌ తరగతులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆయనకు పధ్నాలుగేళ్లు వచ్చేసరికి గానసభలో వయొలిన్‌ వాయిద్య బృంద సభ్యునిగా స్థిరపడ్డాడు. అయినా, ఆయనకు సంతోషం కలుగలేదు. ఆయన తండ్రికి ఎప్పుడూ జీవిత పరమార్థం గురించిన ప్రశ్నలుండేవి కాబట్టి, ఆయన తన ఇంటికి మతబోధకులను ఆహ్వానించేవాడు; అయినా ఆ మతబోధకుల జవాబులతో ఆయన ఎన్నడూ సంతృప్తి చెందలేదు. దేవుడు నిజంగా ఉనికిలో ఉన్నాడా, ఆయన కీడును ఎందుకు అనుమతిస్తున్నాడు వంటి ప్రశ్నల గురించి వారు ఒక కుటుంబంగా చర్చించారు. ఆ తర్వాత ఆర్థర్‌ వాళ్లనాన్న యెహోవాసాక్షులతో చర్చ ప్రారంభించాడు. ఆ చర్చ ఆర్థర్‌ వాళ్లనాన్నను ఆకర్షించి కుటుంబమంతా బైబిలు అధ్యయనం చేసేందుకు దారితీసింది.

కొంతకాలానికి, దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో ఆర్థర్‌ లేఖనాల నుండి అర్థం చేసుకొని, జీవిత సంకల్పమేమిటో స్పష్టంగా గ్రహించాడు. ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ తర్వాత ఆయన ఆ నిర్ణయాన్నిబట్టి చింతించలేదు. ఆయన తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నాడు. “సత్యం గురించిన జ్ఞానాన్ని అందించి, సంగీత విద్వాంసుల మధ్య సాధారణంగా ఉండే పోటీ నుండి నన్ను రక్షించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రజలు విజయం సాధించడానికి దేనిని చేయడానికైనా వెనకాడరు.”

ఆర్థర్‌ తన స్నేహితులను ఉల్లాసపరిచేందుకు వయొలిన్‌ వాయించడానికి ఇప్పటికీ ఇష్టపడతాడు గానీ దానిమీదే ఆయన జీవితం కేంద్రీకృతం కాలేదు. బదులుగా ఆయన జీవితం దేవుని సేవమీద కేంద్రీకృతమైంది. ఆయన ఒక యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు. సంపన్నుడైన ఆ యువ అధికారిలా కాక, తన అనుచరునిగా ఉండమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించడం ద్వారా ఆర్థర్‌ మరియు లక్షలాదిమంది ఇతరుల్లాగే మీరు కూడా గొప్ప సంతోషాన్నిచ్చే నిర్ణయాన్ని తీసుకోవచ్చు.

[6వ పేజీలోని చిత్రం]

మీరు తీసుకునే నిర్ణయం ఇతరుల జీవితాలను ప్రభావితం చేయగలదు

[7వ పేజీలోని చిత్రం]

మీరు బైబిలు అధ్యయనం చేసి యేసు అనుచరులౌతారా?