కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంపన్నుడైన అధికారి అవివేకమైన నిర్ణయం తీసుకున్నాడు

సంపన్నుడైన అధికారి అవివేకమైన నిర్ణయం తీసుకున్నాడు

సంపన్నుడైన అధికారి అవివేకమైన నిర్ణయం తీసుకున్నాడు

ఆసంపన్నుడైన అధికారి నీతిమంతుడు, ధర్మశాస్త్రానికి లోబడే, మతనిష్ఠగల వ్యక్తి. అతను యేసు దగ్గరికి వచ్చి మొకాళ్లూని ఇలా అడిగాడు: “సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును?”

యేసు దానికి జవాబిస్తూ, ఆయన నిత్యజీవాన్ని సంపాదించుకోవాలంటే దేవుని ఆజ్ఞలకు లోబడాలని తెలియజేశాడు. మరింత నిర్దిష్టంగా చెప్పమని అతను కోరినప్పుడు, యేసు ఇలా చెప్పాడు: “నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.” ఇవి మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాథమిక ఆజ్ఞలు. అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమి?”—మత్తయి 19:16-20.

యేసు ‘అతణ్ణి ప్రేమించి’ ఇలా అన్నాడు: “నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుము.”—మార్కు 10:17-21.

ఊహించని విధంగా ఆ యువ అధికారి ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అతను తన వస్తు సంపదనలను ఇష్టపూర్వకంగా త్యజించి యేసు అనుచరుడౌతాడా లేక తన ఆస్తినే అంటిపెట్టుకొని ఉంటాడా? అతను భూమ్మీద ధనసంపాదనలో పడతాడా లేక పరలోకంలో ధనం సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తాడా? అది అతనికి కష్టమైన నిర్ణయంగా అనిపించివుండవచ్చు. అతను ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, దేవుని అనుగ్రహాన్ని పొందడానికి తానింకా ఏమి చేయాలని అడిగాడు, కాబట్టి అతనికి ఆధ్మాత్మిక విలువల విషయంలో ఆసక్తి ఉందనేది స్పష్టం. అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు? అతను “మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు . . . దుఃఖపడుచు వెళ్లిపోయెను.”—మార్కు 10:22.

ఆ యువ అధికారి జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోలేదు. అతను యేసు నమ్మకమైన సేవకుడై ఉంటే తాను అన్వేషిస్తున్న నిత్యజీవాన్ని పొందగలిగేవాడు. ఆ యువకునికి ఏమైందో మనకు చెప్పబడలేదు. అయితే, దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత రోమా సైన్యాలు యెరూషలేమును, యూదయలోని అధిక భాగాన్ని నాశనం చేశాయని మాత్రం మనకు తెలుసు. అనేకమంది యూదులు తమ సంపదలను, ప్రాణాలను కోల్పోయారు.

ఆ యువ అధికారికి భిన్నంగా, అపొస్తలుడైన పేతురు, మరితర శిష్యులు జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకున్నారు. వారు “సమస్తమును విడిచిపెట్టి” యేసును అనుసరించారు. ఆ నిర్ణయంవల్ల వారు ఎంత ప్రయోజనం పొందారో కదా! తాము విడిచిపెట్టిన వాటికన్నా నూరురెట్లు అధికంగా పొందుతారని యేసు వారికి చెప్పాడు. అంతేకాక, వారు నిత్యజీవాన్ని పొందుతారు. తాము తీసుకున్న నిర్ణయాన్నిబట్టి తర్వాత విచారించాల్సిన అవసరం వారికి లేదు.—మత్తయి 19:27-29.

మనమందరం జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాం, వాటిలో కొన్ని అల్పమైనవి, కొన్ని గంభీరమైనవి ఉంటాయి. అలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో యేసు ఎలాంటి సలహా ఇచ్చాడు? మీరు ఆయన సలహాను స్వీకరిస్తారా? మీరు ఆ సలహాను స్వీకరించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుతారు. మనం యేసును అనుసరించి ఆయన ఇచ్చిన సలహా నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.