కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కిత్తీయుల ఓడలు” సముద్రాలను చుట్టివచ్చేవి

“కిత్తీయుల ఓడలు” సముద్రాలను చుట్టివచ్చేవి

“కిత్తీయుల ఓడలు” సముద్రాలను చుట్టివచ్చేవి

తూర్పు మధ్యధరా సముద్రాల్లో ఎన్నో నావిక యుద్ధాలు జరిగాయి. క్రీస్తు పూర్వం ఐదు శతాబ్దాల క్రితం జరిగిన అలాంటి ఒక యుద్ధాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించండి. ఎంతో సులభంగా నడిపించడం సాధ్యమయ్యే ట్రైరెమ్‌ (తెడ్లువేసేవారు రెండు వైపులా మూడు వరుసల్లో ఉండే ఓడ) అనే ఒక ఓడ వేగంగా దూసుకుపోతోంది. మూడు వరుసల్లో ఉన్న దాదాపు 170 మంది తెడ్లువేసే పురుషులు, నడుము క్రింది భాగానికి తోలు మెత్తలు కట్టుకు కూర్చుని ముందుకు వెనక్కు కదులుతూ తమ శక్తినంతా ఉపయోగించి తెడ్లువేస్తున్నారు.

గంటకు 13-17 కిలోమీటర్ల వేగంతో ఆ ఓడ అలలను చీలుస్తూ శత్రు ఓడవైపు దూసుకుపోతోంది. శత్రు ఓడ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కీలక క్షణంలో అది మరోవైపుకు తిరగడానికి ప్రయత్నిస్తుండగా, దాని పార్శ్వభాగం ట్రైరెమ్‌ వైపుకు వస్తుంది. దానితో ట్రైరెమ్‌ ముందుభాగంలో కంచుపూత పూయబడిన పదునైన భాగం పలుచగావున్న ఓడ పార్శ్వభాగంలోకి దూసుకుపోతుంది. ఓడ కొయ్యలు విరుగుతున్న శబ్దం, తత్ఫలితంగా ఏర్పడిన రంధ్రం గుండా సముద్రపు నీరు ఓడలోకి దూసుకువస్తున్న శబ్దం శత్రు నావికులను భయకంపితుల్ని చేస్తాయి. ట్రైరెమ్‌లో ఉన్న కొద్దిమంది సాయుధ శూరులు రెండు ఓడల మధ్య ఏర్పర్చుకున్న పొడవాటి కొయ్యపైనుండి వెళ్లి శత్రు ఓడపై దాడిచేస్తారు. అవును ప్రాచీనకాలానికి చెందిన కొన్ని ఓడలు ఎంతో దీటైనవి!

“కిత్తీము” గురించి, “కిత్తీయుల ఓడల” గురించి బైబిల్లో మామూలుగానేకాక ప్రవచనాల్లో కూడా ప్రస్తావించబడింది. అందుకే వాటి విషయంలో బైబిలు విద్యార్థులు ఆసక్తి కలిగి ఉన్నారు. (సంఖ్యాకాండము 24:24; దానియేలు 11:30; యెషయా 23:1) కిత్తీము ఎక్కడ ఉండేది? దాని ఓడల గురించి మనకెలాంటి సమాచారం అందుబాటులో ఉంది? వాటి జవాబులపట్ల మీరెందుకు ఆసక్తి చూపించాలి?

యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌, కిత్తీమును “హెతీమోస్‌” అని పేర్కొంటూ, అది కుప్ర ద్వీపానికి చెందినదని చెప్పాడు. కుప్ర ద్వీపంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఒకప్పుడున్న కిటియోన్‌ (లేదా సీషెమ్‌) అనే నగరం, కిత్తీము కుప్రకు చెందినదనే విషయాన్ని మరింత ధృవీకరిస్తోంది. ప్రాచీన వర్తక మార్గాల కూడలిలో నెలకొని ఉన్న కుప్ర, తూర్పు మధ్యధరా ప్రాంతంలోని ఓడరేవులకు సమీపంగా ఉండేది కాబట్టి అది తానున్న స్థలాన్ని బట్టి ప్రయోజనం పొందే స్థితిలో ఉండేది. అంతేకాక అది అక్కడ ఉండడంవల్ల యుద్ధాలు చేసే దేశాల్లో తరచూ ఏదో ఒకదేశానికి మద్దతివ్వాల్సివచ్చేది. అందుకే అది ఇతర దేశాలకు శక్తివంతమైన మిత్రపక్షంగానో చిరాకు కలిగించే అడ్డంకుగానో ఉండేది.

కుప్ర నివాసులు, సముద్రం

కుప్రకు చెందిన ఓడలు ఎలా ఉంటాయో ఊహించడానికి సముద్రంలోను, సమాధుల్లోను జరిపిన త్రవ్వకాల్లో బయటపడిన పురావస్తుశాస్త్ర ఆధారాలేకాక, ప్రాచీన గ్రంథాలు, మట్టిపాత్రలపైన ఉన్న బొమ్మలు కూడా మనకు సహాయం చేస్తాయి. పూర్వం కుప్రలో నివసించేవారు ఓడలు నిర్మించడంలో ఎంతో నిపుణులు. ఆ ద్వీపం దట్టమైన చెట్లతో ఉండేది, రక్షణగావున్న సముద్ర తీరాలు ప్రకృతిసిద్ధమైన ఓడరేవులుగా పనిచేసేవి. వారు అక్కడున్న చెట్లను నరికి ఓడలు నిర్మించడమేకాక వాటితో రాగిని కరిగించేవారు కూడా, ప్రాచీన లోకంలో కుప్ర ద్వీపం రాగికి పేరుగాంచింది.

కుప్ర విరివిగా చేస్తున్న ఎగుమతి వ్యాపారం ఫేనీకేవాసుల దృష్టికి రాకుండా పోలేదు. వీరు తాము వర్తకం చేసేందుకు ప్రయాణించే మార్గాల్లో కొన్ని చోట్ల కాలనీలను స్థాపించారు. అలాంటి ఒక కాలనీని వారు కుప్రలోని కిటియోన్‌లో స్థాపించారు.—యెషయా 23:10-12.

ఫెనీకేకు రాజధానియైన తూరు పట్టణం పతనమైనప్పుడు అక్కడి ప్రజల్లో కొందరు కిత్తీముకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాలనీలలో నివసించే ఫేనీకేవాసులు నౌకాయానంలో ఎంతో అనుభవంగలవారు కాబట్టి కుప్రలో నౌకావిజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడివుండవచ్చు. కిటియోన్‌ నెలకొనివున్న ప్రాంతం కూడా ఫేనీకే ఓడలకు మంచి రక్షణగా ఉండేది.

అంతర్జాతీయ వర్తకంలో చురుగ్గా పాల్గొనడం

అప్పట్లో తూర్పు మధ్యధరా ప్రాంతంలో ప్రాచీన వర్తక వ్యవహారాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. కుప్ర నుండి విలువైన వస్తువులు ఓడల ద్వారా క్రేతుకు, సార్డీనియాకు, సిసిలీకి, ఏజియన్‌ ద్వీపాలకు పంపించబడేవి. కుప్రకు చెందిన కూజాలు, మట్టిపాత్రలు ఆ ప్రాంతాల్లో దొరికాయి. అంతేకాక కుప్రలో చక్కని మైసీనీయన్‌ (గ్రీసుకు చెందిన) మట్టిపాత్రలు కోకొల్లలుగా దొరికాయి. సార్డీనియాలో దొరికిన రాగి కడ్డీలను పరిశీలించిన కొందరు విద్వాంసులు అవి కుప్రకు చెందినవే అని నమ్ముతున్నారు.

సా.శ.పూ. 14వ శతాబ్దంలో బద్దలైపోయిన ఒక ఓడ అవశేషాలు 1982లో దక్షిణ టర్కీ తీరం సమీపంలో బయటపడ్డాయి. నీటిక్రింద త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ పెద్ద నిధి దొరికింది, ఆ నిధిలో కుప్రకు చెందినవని విశ్వసించబడుతున్న రాగి కడ్డీలు, శిలాజపు జిగురు, కనానుకు చెందిన కూజాలు, ఎబనీ కలప, ఏనుగు దంతాలు, కనానుకు చెందిన బంగారు వెండి నగలు, ఐగుప్తీయులు పవిత్రమైనదిగా భావించే పేడపురుగు ఆభరణాలేకాక మరితర వస్తువులు కూడా లభించాయి. ఓడలో ఉన్న మట్టిపాత్రలను పరిశీలించిన తర్వాత, అది బహుశా కుప్రకు చెందిన ఓడ అని కొందరు భావిస్తున్నారు.

ఆసక్తికరంగా, ఆ ఓడ బద్దలైందని భావించబడుతున్న సమయంలోనే బిలాము కిత్తీయుల ఓడల గురించి “ఉపమానరీతిగా” ప్రస్తావించాడు. (సంఖ్యాకాండము 24:15, 24) మధ్యప్రాచ్యంలో కుప్రకు చెందిన ఓడలు చాలా ప్రఖ్యాతిగాంచాయని తెలుస్తోంది. ఆ ఓడలు ఎలా ఉండేవి?

వర్తక ఓడలు

కుప్రలోని అమాథస్‌ అనే నగరంలో ఉన్న సమాధుల్లో ఓడల, పడవల మట్టిబొమ్మలు అనేకం వెలికితీయబడ్డాయి. కుప్రలో ఎన్ని రకాల ఓడలుండేవో తెలుసుకోవడానికి అవి ఎన్నో ప్రాముఖ్యమైన ఆధారాలనిస్తాయి. వాటిలో కొన్ని మ్యూజియమ్‌లలో ఉన్నాయి.

పూర్వం ఓడలు శాంతియుతంగా వర్తకం చేసుకోవడానికే ఉపయోగించబడేవని ఆ మట్టిబొమ్మలు చూపిస్తున్నాయి. చిన్న ఓడల్లో సాధారణంగా 20 మంది తెడ్లువేసేవాళ్లు ఉండేవారు. సరుకునేకాక కొన్నిసార్లు ప్రయాణికుల్ని కుప్ర తీరం వెంబడి కొంత దూరం తీసుకువెళ్లేందుకు వీలుగా ఓడలు విశాలంగా, లోతుగా రూపొందించబడ్డాయి. దాదాపు 90 టన్నుల సరుకు తీసుకువెళ్లగల, తెడ్లతో నడిచే చిన్న ఓడను కుప్ర వాసులు తయారుచేశారని ప్లైనీ అనే విద్వాంసుడు చెప్పాడు.

అంతేకాక టర్కీ తీరంలో బయటపడినటువంటి పెద్దపెద్ద వర్తక ఓడలు కూడా ఉండేవి. వాటిలో కొన్ని సుమారు 450 టన్నులవరకు సరుకును రవాణాచేయగలిగేవి. వాటిలో ఒకొక్కపక్క కనీసం 25 చొప్పున 50 మంది తెడ్లువేసేవాళ్లు ఉండేవారు. అవి 30 మీటర్ల పొడవు, తెరచాపల ఎత్తుతో కలిపి 10 మీటర్లకంటే ఎక్కువ ఎత్తు ఉండేవి.

బైబిలు ప్రవచనాల్లో ప్రస్తావించబడిన “కిత్తీము” యుద్ధ ఓడలు

యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా పలికిన దేవోక్తి ఇది: “కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును . . . బాధించును.” (సంఖ్యాకాండము 24:2, 24) ఆ మాటలు నెరవేరాయా? వాటి నెరవేర్పుకు, కుప్ర ఓడలకు సంబంధమేమిటి? ‘కిత్తీము తీరమునుండి వచ్చిన ఆ ఓడలు’ మధ్యధరా సముద్రంలో శాంతియుతంగా వర్తకం చేసుకునే ఓడలు కావు. అవి బాధను తీసుకొచ్చే యుద్ధ ఓడలు.

యుద్ధ పద్ధతులు మారుతుండడంతో, ఓడలు ముందు ఏ రూపాల్లో ఉండేవో అవే రూపాలతో వేగంగా నడిచేలా, మరింత దృఢంగా ఉండేలా తయారుచేశారు. అమాథస్‌లో దొరికిన ఒక చిత్రంలో బహుశా కుప్రకు చెందిన అత్యంత ప్రాచీన యుద్ధనౌకలనే చిత్రించారనిపిస్తోంది. ఆ చిత్రంలో ఓడ ఫేనీకే యుద్ధనౌకలాగానే పొడవుగాను సన్నగాను ఉండి, ఓడ వెనుకవైపు చివరి భాగం పైన లోపలివైపుకు వంగినట్లుగా ఉంటుంది. దాని ముందుభాగంలో కాస్త క్రిందుగా, శత్రునావల పార్శ్వాలు బద్దలు కొట్టడానికి అనువుగా లోహంతో చేసిన పదునైనభాగం ఉండేది, ఓడ వెనుకభాగంలోనేకాక ముందుభాగంలో కూడా ఇరువైపులా గుండ్రటి కవచాలు ఉండేవి.

సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో మొట్టమొదటిగా గ్రీసులో బైరెమ్‌లు (రెండు వరసల తెడ్లువేసేవాళ్ళుండే ఓడలు) అనబడే ఓడలు కనిపెట్టబడ్డాయి. అవి దాదాపు 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండేవి. మొదట్లో ఆ ఓడలు సైనికులను యుద్ధం జరిగే స్థలానికి తీసుకువెళ్లడానికి ఉపయోగించబడేవి, వాస్తవంగా యుద్ధం నేలపై జరిగేది. కొద్దికాలంలోనే, మూడవ వరుస తెడ్లవారిని కూడా కలిపితే వచ్చే ప్రయోజనమేమిటో వారికి తెలిసింది. అంతేకాక వారు ఆ ఓడ ముందుభాగంలో కాస్త క్రిందుగా కంచు పూత పూయబడిన పదునైన భాగాన్ని అమర్చారు. ఆ కొత్త ఓడకు, ఈ ఆర్టికల్‌ మొదట్లో పేర్కొన్నట్లుగా, ట్రైరెమ్‌ అని పేరు పెట్టారు. గ్రీకులు, పర్షియన్ల నావికాదళాన్ని ఓడించిన సలమిస్‌ యుద్ధంలో (సా.శ.పూ. 480) ఈ ఓడ ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఆ తర్వాత, లోకాధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో అలెగ్జాండర్‌ ద గ్రేట్‌, తన ట్రైరెమ్‌లను తూర్పువైపు నడిపించాడు. ఈ ఓడలు యుద్ధంలో పాల్గొనడానికి రూపొందించబడ్డాయి కానీ లోతైన సముద్రాల్లో సుదూర ప్రయాణాలు చేయడానికి కాదు ఎందుకంటే వాటిలో అవసరమైన సామగ్రి నిల్వచేయడానికి అంతగా చోటుండేది కాదు. అందుకే ఆయన అవసరమైన సామగ్రి కోసం, మరమ్మత్తుల కోసం ఏజియన్‌ ద్వీపాల్లో ఆగాల్సివచ్చేది. పర్షియన్‌ సైన్యాన్ని ఓడించడమే అలెగ్జాండర్‌ లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ముందుగా శక్తివంతమైన తూరు ద్వీపాన్ని జయించాలి. మార్గ మధ్యలో ఆయన కుప్రలో ఆగాల్సివుంటుంది.

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ తూరుపై దాడి చేస్తున్నప్పుడు (సా.శ.పూ. 332) కుప్ర నివాసులు ఆయనకు 120 ఓడలనిచ్చి ఆయన పక్షం వహించారు. ముగ్గురు కుప్ర రాజులు ఆ ఓడలతో వెళ్లి అలెగ్జాండర్‌ సైన్యంతోపాటు తూరుపై ఏడు నెలలు దాడిచేశారు. తూరు పతనం కావడంతో బైబిలు ప్రవచనం నెరవేరింది. (యెహెజ్కేలు 26:3, 4; జెకర్యా 9:3, 4) తన కృతజ్ఞతను చూపించడానికి అలెగ్జాండర్‌ కుప్ర రాజులకు ప్రత్యేక అధికారాన్ని ఇచ్చాడు.

అసాధారణ నెరవేర్పు

అలెగ్జాండర్‌ అరేబియాపై చేయబోతున్న దాడిలో సహాయం కోసం కుప్ర, ఫేనీకేల నుండి ఓడలు తెప్పించే ఏర్పాటు చేశాడని మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు స్ట్రాబో నివేదించాడు. ఈ ఓడలు చాలా తేలికైనవేకాక, వాటిలోని భాగాలను విడదీయడం సులభం, కాబట్టి అవి కేవలం ఏడు రోజుల్లోనే ఉత్తర సిరియాలో ఉన్న తాప్సాకస్‌కు (తిప్సహు) చేరుకున్నాయి. (1 రాజులు 4:24) అక్కడినుండి నది దిగువనున్న బబులోనుకు ప్రయాణించడం సాధ్యమౌతుంది.

అలా బైబిల్లోని, అంత స్పష్టంగా లేనట్లు కనిపించే వాక్యం దాదాపు పది శతాబ్దాల తర్వాత అసాధారణంగా నెరవేరింది. సంఖ్యాకాండము 24:24లోని మాటలకు అనుగుణంగా అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ సైన్యం మాసిదోనియ నుండి నిర్విరామంగా తూర్పువైపుకు ప్రయాణించి అష్షూరు దేశాన్ని జయించి చివరకు శక్తివంతమైన మాదియ పారసీకుల సామ్రాజ్యాన్ని కూలదోసింది.

“కిత్తీయుల ఓడల” గురించి కొద్ది సమాచారం మాత్రమే మనకు తెలిసినా, అది బైబిలు ప్రవచనాల అసాధారణమైన నెరవేర్పుకు సాక్ష్యంగా ఉంది. అలాంటి చారిత్రాత్మక సాక్ష్యం, బైబిల్లోని ప్రవచనాలు విశ్వసనీయమైనవనే మన నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. అలాంటి అనేక ప్రవచనాల్లో మన భవిష్యత్తు గురించి కూడా తెలియజేయబడింది కాబట్టి వాటిని మనం తేలికగా తీసుకోకూడదు.

[16, 17వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఇటలీ

సార్డీనియా

సిసిలీ

ఏజియన్‌ సముద్రము

గ్రీసు

క్రేతు

లిబియా

టర్కీ

కుప్ర

కిటియోన్‌

తూరు

ఐగుప్తు

[16వ పేజీలోని చిత్రం]

గ్రీసు యుద్ధనౌక నమూనా, ట్రైరెమ్‌

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[17వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఫేనీకే యుద్ధనౌక నమూనా, బైరెమ్‌

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[17వ పేజీలోని చిత్రం]

[17వ పేజీలోని చిత్రం]

కుప్రకు చెందిన ఓడ చిత్రమున్న మట్టిపాత్ర

[చిత్రసౌజన్యం]

Director of Antiquities, Cyprus Museum వారి అనుమతితో ప్రచురించబడినది

[18వ పేజీలోని చిత్రం]

యెషయా 60:9లో పేర్కొనబడినలాంటి, సరుకు రవాణాచేసే ప్రాచీన ఓడలు