కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేటి కోసమే జీవిస్తున్నారా?

నేటి కోసమే జీవిస్తున్నారా?

నేటి కోసమే జీవిస్తున్నారా?

“నే ను రేపటి గురించి ఎప్పుడూ ఆలోచించను. అది రెప్పపాటులో వచ్చేస్తుంది.” తరచూ ఉల్లేఖించబడే ఆ మాటలన్నది ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టైన్‌. చాలామంది అలాంటి అభిప్రాయాలే వ్యక్తపరుస్తారు. “రేపటి గురించి చింతించడం దేనికి?” అని వారనవచ్చు. లేదా “జీవితం ఇప్పటివరకూ ఎలా గడిచిందో అలాగే గడిపేయండి,” “నేటి కోసమే జీవించండి,” “రేపటి గురించి మరిచిపోండి” అని అనడం మీరు వినివుండవచ్చు.

సాధారణంగా ప్రజలు ఇలాంటి వైఖరిని కనపర్చడం కొత్తేమీ కాదు. “తినండి, త్రాగండి జీవితాన్ని ఆనందించండి. అంతకన్నా ప్రాముఖ్యమైంది మరింకేదీ లేదు” అనేది ప్రాచీన ఎపికూరీయుల నినాదం. అపొస్తలుడైన పౌలు సమకాలీనుల్లో కొందరు కూడా, “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అని అనుకునేవారు. (1 కొరింథీయులు 15:32) మనకున్నది ఈ స్వల్ప జీవితమే అని వారు నమ్మేవారు కాబట్టి జీవితాన్ని పూర్తిగా అనుభవించాలనే దృక్పథాన్ని వారు ప్రోత్సహించేవారు.

భూనివాసుల్లోని లక్షలాదిమంది దృష్టిలో, జీవితాన్ని పూర్తిగా అనుభవించడం అంటే సుఖాలే ప్రాముఖ్యమని భావిస్తూ వాటికోసం వెంపర్లాడడం కాదు. దైన్యస్థితిలో జీవిస్తున్న ప్రజలు నేడు బ్రతికుండడానికే నిరంతరం తీవ్రంగా పోరాడుతున్నారు. మరి వారు భవిష్యత్తు గురించి, తరచూ భయానకంగా కనిపించే “రేపటి” గురించి ఎందుకు ఆలోచించాలి?

భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలా?

జీవితం హాయిగా గడుస్తున్న వాళ్లు కూడా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడంలో ప్రయోజనమేమీ లేదని భావిస్తారు. “రేపటి గురించి కంగారుపడడమెందుకు?” అని వారనవచ్చు. అలా ప్రణాళికలు వేసుకున్నవారు చివరకు నిరాశానిస్పృహలకు లోనవుతారని వారు తర్కించవచ్చు. ప్రాచీన కాల పితరుడైన యోబు కూడా తన భవిష్యత్తు, తన కుటుంబ భవిష్యత్తు సంతోషంగా ఉండాలని వేసుకున్న ప్రణాళికలు “నిరర్థకం” అయినప్పుడు ఎంతో వ్యాకులపడ్డాడు.—యోబు 17:11; ప్రసంగి 9:11.

స్కాట్లండ్‌కు చెందిన రాబర్ట్‌ బర్న్స్‌ అనే కవి మన దుర్భర పరిస్థితులను పొలాల్లో ఉండే ఒక చిన్న ఎలుక పరిస్థితులతో పోల్చాడు. బర్న్స్‌ అనుకోకుండా తన నాగటితో ఆ ఎలుక బొరియను నాశనం చేసినప్పుడు తన సర్వస్వాన్నీ కోల్పోయిన అది తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయింది. ‘అవును, మన అదుపులోలేని పరిస్థితుల వల్ల, మనం ఎంతో జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయినప్పుడు మనం తరచూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం’ అని ఆ కవి అనుకున్నాడు.

కాబట్టి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం వ్యర్థమేనా? నిజానికి, తుఫాను లేదా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు, సరిగ్గా ప్రణాళికలు వేసుకోకపోవడం వల్లే విపత్కర పరిణామాలు ఎదురౌతాయి. ఉదాహరణకు కత్రీనా తుఫానునే తీసుకోండి, దానిని ఎవరూ ఆపగలిగేవారు కాదన్న మాట నిజమే. అయితే మంచి ముందుచూపు, ప్రణాళికలు వేసుకోవడం ఆ నగరంపై, ఆ నగర నివాసులపై తుఫాను ప్రభావాన్ని తగ్గించివుండేవి కావా?

మీరేమి అనుకుంటున్నారు? నేటి కోసమే జీవిస్తూ, రేపటిని నిర్లక్ష్యం చేయడం జ్ఞానవంతమైనదేనా? ఈ విషయం గురించి తర్వాతి ఆర్టికల్‌ ఏమి చెబుతుందో చూడండి.

[3వ పేజీలోని చిత్రాలు]

“తినండి, త్రాగండి జీవితాన్ని ఆనందించండి. అంతకన్నా ప్రాముఖ్యమైంది మరింకేదీ లేదు”

[4వ పేజీలోని చిత్రం]

మంచి ముందుచూపు, ప్రణాళికలు వేసుకోవడం కత్రీనా తుఫాను ప్రభావాన్ని తగ్గించి ఉండేవా?

[చిత్రసౌజన్యం]

U.S. Coast Guard Digital