కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించండి

మీ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించండి

మీ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించండి

“పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు.”—తీతు 1:15.

అపొస్తలుడైన పౌలు మూడు మిషనరీ యాత్రలు ముగించిన తర్వాత, బంధించబడి చివరకు రోముకు పంపించబడ్డాడు, ఆయనక్కడే రెండు సంవత్సరాలపాటు చెరసాలలో ఉన్నాడు. విడుదలైన తర్వాత ఆయనేమి చేశాడు? కొద్దికాలానికి ఆయన తీతుతోపాటు క్రేతు ద్వీపాన్ని సందర్శించాడు, ఆయన తీతుకు ఇలా రాశాడు: “నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.” (తీతు 1:5) ఆ నియామకంలో తీతు, అక్కడి మనుష్యుల మనస్సాక్షికి సంబంధించిన విషయాలతో వ్యవహరించాలి.

2 పౌలు సంఘ పెద్దల అర్హతల గురించి తీతుకు తెలియజేసిన తర్వాత, అక్కడ చాలామంది “అవిధేయులును, వదరుబోతులును, మోసపుచ్చువారును” ఉన్నారని చెప్పాడు. వీరు “ఉపదేశింపకూడనివాటిని . . . ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.” కాబట్టి తీతు వారిని ‘గద్దిస్తూవుండాలి.’ (తీతు 1:10-14; 1 తిమోతి 4:7) ఓ అందమైన వస్త్రానికి అద్దకపు రంగు అంటుకుని పాడైనట్లుగానే వారి మనసు, మనస్సాక్షి పాడయ్యాయనే భావంతో పౌలు ఇక్కడ “అపవిత్రపరచబడి యున్నవి” అనే పదాన్ని ఉపయోగించాడు. (తీతు 1:15) ఆ పురుషుల్లో కొందరిది యూదా నేపథ్యమై ఉండవచ్చు, ఎందుకంటే వారు “సున్నతి సంబంధులు.” సున్నతి అవసరమనే దృక్కోణంతోవున్న పురుషులతో నేడు సంఘాలు బలహీనపర్చబడడం లేదు; అయినప్పటికీ మనస్సాక్షి గురించి పౌలు తీతుకు ఇచ్చిన ఉపదేశం నుండి మనమెంతో నేర్చుకోవచ్చు.

అపవిత్రమైన మనస్సాక్షిగలవారు

3 మనస్సాక్షిని గురించి పౌలు ప్రస్తావించిన పరిస్థితిని గమనించండి. “పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని . . . తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.” స్పష్టంగా, వారిలో కొందరు “విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము” మార్పులు చేసుకోవాల్సివుంది. (తీతు 1:13, 15, 16) పవిత్రమైనవేవో, అపవిత్రమైనవేవో వారు గ్రహించలేకపోతున్నారు, తమ మనస్సాక్షి ఆధారంగా వారు నిర్ణయం తీసుకోవాలి.

4 పది సంవత్సరాలకన్నా ఎక్కువకాలం ముందు, ఒక వ్యక్తి సత్యారాధకుడు కావాలంటే సున్నతిపొందాల్సిన అవసరం లేదని క్రైస్తవ పరిపాలక సభ నిర్ధారించింది, వారు ఆ విషయాన్ని సంఘాలకు తెలియజేశారు. (అపొస్తలుల కార్యములు 15:1, 2, 19-29) అయినా క్రేతులో కొందరు ‘సున్నతి సంబంధులుగా’ ఉన్నారు. వారు పరిపాలక సభతో బాహాటంగా విభేదిస్తూ, ‘ఉపదేశింపకూడనివాటిని ఉపదేశిస్తున్నారు.’ (తీతు 1:10, 11) వక్ర ఆలోచనతో వారు ఆహారం, ఆచారబద్ధ పవిత్రత గురించిన ధర్మశాస్త్రపు నియమాలు పాటించాలని ప్రోత్సహిస్తూ ఉండవచ్చు. యేసు కాలంలోని తమ పూర్వికుల్లాగే వారు ధర్మశాస్త్రంలోని విషయాలకు తమ ఆలోచనలను జోడించి మాట్లాడడమే కాక, యూదుల కల్పనా కథలను, మనుష్యుల కట్టడలను పురికొల్పుతూ ఉండవచ్చు.—మార్కు 7:2, 3, 5, 15; 1 తిమోతి 4:3.

5 వారలా ఆలోచించడం, వారి వివేచనపై, నైతిక విచక్షణపై, మనస్సాక్షిపై హానికరమైన ప్రభావం చూపించింది. పౌలు ఇలా రాశాడు: “అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు.” వారి మనస్సాక్షి ఎంతగా వక్రీకరించబడిందంటే, అది వారి క్రియలను, అంచనాలను నిర్దేశించే నమ్మదగిన మనస్సాక్షిగా ఎంతమాత్రం లేదు. అంతేకాక, ఒక క్రైస్తవుడు ఒక విధంగా మరో క్రైస్తవుడు మరో విధంగా నిర్ణయించుకునే వ్యక్తిగత విషయాలనుబట్టి వారు తోటి క్రైస్తవులను విమర్శించారు. ఈ విషయంలో ఆ క్రేతీయులు నిజానికి అపవిత్రం కానివాటిని అపవిత్రమైనవిగా పరిగణించారు. (రోమీయులు 14:17; కొలొస్సయులు 2:16) తాము దేవుని ఎరుగుదుమని చెప్పుకున్నా వారు తమ క్రియల ద్వారా ఆయనను ఎరుగమని నిరూపించారు.—తీతు 1:16.

“పవిత్రులకు అన్నియు పవిత్రములే”

6 పౌలు తీతుకు రాసిన దానినుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఈ మాటల్లో కనబడే భేదాన్ని గమనించండి: “పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.” (తీతు 1:15) నైతిక పవిత్రతగల క్రైస్తవునికి ఖచ్చితంగా అన్నీ పవిత్రమైనవిగా, అంగీకారయోగ్యమైనవిగా ఉంటాయని పౌలు చెప్పడం లేదు. ఈ విషయాన్ని మనం నమ్మవచ్చు, ఎందుకంటే పౌలు తాను రాసిన మరో లేఖలో జారత్వం, విగ్రహారాధన, అభిచారం, తదితర పనులు చేసేవారు “దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని” స్పష్టం చేశాడు. (గలతీయులు 5:19-21) కాబట్టి, పౌలు రెండు రకాల ప్రజల గురించిన అంటే నైతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉన్నవారి గురించిన, అలా లేనివారి గురించిన ఒక సాధారణ సత్యాన్ని చెబుతున్నాడనే నిర్ధారణకు మనం రావచ్చు.

7 యథార్థ క్రైస్తవుడు దూరంగా ఉండవలసింది, బైబిలు ఖచ్చితంగా నిషేధించేవాటికే కాదు. ఉదాహరణకు, సూటిగా చెప్పబడిన ఈ మాటల్నే పరిశీలించండి: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” (హెబ్రీయులు 13:4) క్రైస్తవేతరులు, బైబిలు గురించి ఏ మాత్రం తెలియనివారు సహితం వ్యభిచారం చేయడాన్ని ఈ వచనం నిషేధిస్తోందనే సరైన గ్రహింపుకొస్తారు. ఈ వచనం ప్రకారం, మరితర బైబిలు భాగాల ప్రకారం, వివాహిత పురుషుడు లేదా స్త్రీ తమ చట్టబద్ధమైన భర్త లేదా భార్య కాని వేరొకరితో లైంగిక సంపర్కం పెట్టుకోవడాన్ని దేవుడు ఖండిస్తున్నాడనేది స్పష్టం. అయితే ఇద్దరు అవివాహితులు ముఖరతిలో పాల్గొనడం సరైనదేనా? ఇది లైంగిక సంపర్కం కాదు కాబట్టి, ఇది హానికరం కాదని చాలామంది టీనేజర్లు వాదిస్తారు. ఒక క్రైస్తవుడు ముఖరతి సరైనదని అనుకోవచ్చా?

8 వ్యభిచారాన్ని, జారత్వాన్ని (గ్రీకు, పోర్నియా) దేవుడు ఖండిస్తున్నాడని హెబ్రీయులు 13:4; 1 కొరింథీయులు 6:9 స్పష్టంగా చెబుతున్నాయి. జారత్వం అంటే ఏమిటి? మర్మాంగాలను కామాతురతతో సహజ రీతిలో గానీ విచ్చలవిడిగా గానీ ఉపయోగించడాన్ని ఆ గ్రీకు పదం సూచిస్తోంది. అందులో లేఖనాధారిత వివాహానికి వెలుపల ఏర్పరచుకునే అన్నిరకాల అక్రమ లైంగిక సంబంధాలు ఉన్నాయి. అందులో ముఖరతి కూడా ఉంది, అయితే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది టీనేజర్లకు ముఖరతి ఆమోదయోగ్యమని చెప్పబడడం లేదా వారే ఆ నిర్ధారణకు రావడం జరుగుతోంది. కానీ నిజ క్రైస్తవులు, “వదరబోతులును మోసపుచ్చువారును” వ్యక్తపరిచే అభిప్రాయాల ప్రకారం తమ ఆలోచనను లేదా క్రియలను మార్చుకోరు. (తీతు 1:10) వారు పరిశుద్ధ లేఖనాల ఉన్నత ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉంటారు. ముఖరతి విషయంలో సాకులు చెప్పడానికి బదులు, అది లేఖనాధారంగా జారత్వమని అంటే, పోర్నియా అని అర్థం చేసుకొని తమ మనస్సాక్షికి తదనుగుణంగా శిక్షణనిచ్చుకుంటారు. *అపొస్తలుల కార్యములు 21:25; 1 కొరింథీయులు 6:18; ఎఫెసీయులు 5:3.

వివిధరకాల మనస్సాక్షులు, వివిధరకాల నిర్ణయాలు

9 అయితే “పవిత్రులకు అన్నియు పవిత్రములే” అని పౌలు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమేమిటి? తమ ఆలోచనా సరళిని, నైతికతను దేవుని ప్రేరేపిత వాక్యంలో మనం కనుగొనే ఆయన ప్రమాణాలకు తగినట్లు మలుచుకున్న క్రైస్తవులను పౌలు సూచిస్తున్నాడు. సూటిగా ఖండించబడని అనేక విషయాల్లో తోటివిశ్వాసుల అభిప్రాయాల మధ్య కొద్దిగా తేడావుండే అవకాశముందని అలాంటి క్రైస్తవులు గుర్తిస్తారు. విమర్శించేవారిగా ఉండే బదులు వారు దేవుడు ఖండించని విషయాలను ‘పవిత్రమని’ గుర్తిస్తారు. బైబిలు ప్రత్యేకంగా నిర్దేశాలివ్వని జీవితాంశాల గురించి ఖచ్చితంగా తాము తలంచినట్లే ఇతరులందరూ తలంచాలని వారు అనుకోరు. ఇదెలాగో మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.

10 దంపతుల్లో ఒకరు క్రైస్తవులుగా మారి మరొకరు మారకుండావున్న కుటుంబాలు చాలావున్నాయి. (1 పేతురు 3:1; 4:3) బంధువుల వివాహం లేదా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు దీనివల్ల వివిధ సమస్యలు ఎదురుకావచ్చు. తన భర్త యెహోవాసాక్షి కాని ఒక క్రైస్తవ భార్య విషయం ఊహించుకోండి. ఆయన బంధువుల్లో ఒకరు వివాహం చేసుకుంటున్నారు, వివాహం చర్చీలో జరుగుతుంది. (లేదా ఒక బంధువో, లేక తల్లిదండ్రుల్లో ఒకరో మరణించారు, అంత్యక్రియలు చర్చీలో జరుగుతున్నాయి.) ఆ దంపతులు ఆహ్వానించబడ్డారు, భార్య తనతోకూడా రావాలని ఆయన కోరుతున్నాడు. హాజరవడాన్ని గురించి ఆమె మనస్సాక్షి ఏమి చెబుతోంది? ఆమె ఏమి చేస్తుంది? ఈ రెండు సాధ్యతలను ఊహించుకోండి.

11 మేరీ, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన ‘మహాబబులోనును విడిచి రండి’ అనే బైబిలు ఆజ్ఞను గురించి ఆలోచిస్తోంది. (ప్రకటన 18:2, 4) వివాహం జరిగే చర్చిలో తానొకప్పుడు సభ్యురాలు, వివాహ సమయంలో హాజరైన వారందరూ ప్రార్థనలో, పాడడంలో లేదా మతసంబంధ కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఒత్తిడి ఉంటుందనే విషయం ఆమెకు తెలుసు. దానిలో తాను పాల్గొనకూడదని, అసలక్కడకు వెళ్లి తన యథార్థతను ఉల్లంఘించే ఒత్తిడి క్రింద ఉండకూడదని ఆమె నిర్ణయించుకుంది. మేరీకి తన భర్తంటే గౌరవముంది, లేఖనానుసారంగా తనకు శిరస్సైన ఆయనకు సహకరించాలని కోరుకుంటుంది; అయితే లేఖనాధార సూత్రాల విషయంలో ఆమె రాజీపడాలనుకోవడం లేదు. (అపొస్తలుల కార్యములు 5:29) అందువల్ల ఆయన ఆ వివాహానికి వెళ్లాలనుకున్నా, తాను మాత్రం రాలేనని యుక్తిగా ఆమె తన భర్తకు వివరిస్తుంది. తానొకవేళ హాజరైనా, అక్కడ జరిగేవాటిలో తాను పాలుపంచుకోకపోవడం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చని, అందువల్ల తానక్కడకు రాకపోవడమే ఆయనకు మంచిదని ఆమె వివరించవచ్చు. ఆ నిర్ణయం తీసుకోవడంవల్ల ఆమె మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది.

12 రూతుకు కూడా దాదాపు అలాంటి సందిగ్ధతే ఎదురైంది. ఆమెకు భర్తంటే గౌరవముంది, అయితే దేవునిపట్ల యథార్థంగా ఉండాలని నిర్ణయించుకుని, తన బైబిలు శిక్షిత మనస్సాక్షి చెప్పేదానికి అనుగుణంగా ఆమె స్పందిస్తుంది. మేరీ పరిగణలోకి తీసుకున్నలాంటి అంశాల గురించి ఆలోచించిన తర్వాత, రూతు ప్రార్థనాపూర్వకంగా కావలికోట మే 15, 2002లోని “పాఠకుల ప్రశ్నలు” పరిశీలిస్తుంది. ముగ్గురు హెబ్రీ యువకులు విగ్రహారాధన జరిగేచోట ఉండాలని ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడడాన్ని ఆమె గుర్తు చేసుకుంటుంది, వారలా వెళ్లినా విగ్రహారాధనలో పాల్గొనకుండా వారు తమ యథార్థతను కాపాడుకున్నారు. (దానియేలు 3:15-18) ఆమె తన భర్తతో వెళ్లాలని, అయితే మతసంబంధమైన ఎలాంటి క్రియల్లోనూ పాలుపంచుకోకూడదని నిర్ణయించుకుంటుంది, ఆమె తన మనస్సాక్షి చెప్పేదానికి అనుగుణంగా ప్రవర్తిస్తోంది. ఆమె యుక్తిగా, అయితే స్పష్టంగా తన మనస్సాక్షి వేటిని చేయడానికి అనుమతిస్తుందో, వేటిని చేయడానికి అనుమతించదో తన భర్తకు వివరిస్తుంది. ఆయన సత్యారాధనకు, అబద్ధారాధనకు మధ్య తేడాను చూస్తాడని రూతు ఆశిస్తుంది.—అపొస్తలుల కార్యములు 24:16.

13 ఆ ఇద్దరు క్రైస్తవులు విభిన్న నిర్ణయాలు తీసుకున్నారనే వాస్తవం ఒక వ్యక్తి ఏమి చేసినా పర్వాలేదని లేదా ఆ ఇద్దరిలో ఒకరికి బలహీనమైన మనస్సాక్షి ఉందని సూచిస్తోందా? లేదు. చర్చి ఆచరణల్లో ఇమిడివుండే సంగీతం, ఆడంబరాలు తనకు అనుభవపూర్వకంగా తెలిసిన కారణంగా, అక్కడ ఉండడం తనకు ప్రత్యేకంగా ప్రమాదకరమని మేరీ గ్రహించవచ్చు. మతసంబంధ విషయాల గురించి గతంలో తన భర్తతో మాట్లాడిన సందర్భాలు ఆమె మనస్సాక్షిపై ప్రభావం చూపించవచ్చు. అందువల్ల తాను తీసుకున్న నిర్ణయమే తనకు మంచిదని ఆమె నమ్మింది.

14 రూతు తీసుకున్న నిర్ణయం అవివేకమైనదా? అలా అనే అధికారం ఎవరికీ లేదు. తాను ఆ వివాహానికి హాజరైనా మతసంబంధమైన ఎలాంటి క్రియల్లోనూ పాల్గొనకూడదని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఇతరులు తప్పుపట్టకూడదు లేదా విమర్శించకూడదు. కొన్నిరకాల ఆహార పదార్థాలను తినడం లేదా తినకపోవడం గురించిన వ్యక్తిగత నిర్ణయాలపై పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని గుర్తుంచుకోండి: “తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు . . . అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.” (రోమీయులు 14:3, 4) శిక్షిత మనస్సాక్షి నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పాలని యథార్థ క్రైస్తవులెవరూ కోరుకోరు, ఎందుకంటే అలా చేయడమంటే ప్రాణరక్షణా సందేశాన్నిచ్చే స్వరం వినడాన్ని నిర్లక్ష్యం చేసినట్లే లెక్క.

15 ఇంకా పరిశీలిస్తే, ఈ క్రైస్తవులిద్దరూ అదనపు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఒక అంశం ఏమిటంటే వారి నిర్ణయం ఇతరులపై చూపించగల ప్రభావం. పౌలు మనకిలా ఉపదేశించాడు: “సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.” (రోమీయులు 14:13) అలాంటి పరిస్థితులు సంఘంలో లేదా తన కుటుంబంలో చాలా కలతకు కారణమైనట్లు మేరీకి తెలిసివుండవచ్చు, ఆమె చేసేది ఆమె పిల్లలపై బలమైన ప్రభావం చూపించవచ్చు. దానికి భిన్నంగా, అలాంటి నిర్ణయాలు తన సంఘంలో లేదా తన సమాజంలో కలతకు కారణం కాలేదని రూతు ఎరిగివుండవచ్చు. ఆ ఇద్దరు సహోదరీలు, అలాగే మనమందరం, సరిగా శిక్షణ ఇవ్వబడిన మనస్సాక్షి మన నిర్ణయం ఇతరులపై చూపించగల ప్రభావాన్ని గ్రహిస్తుందని గుర్తించాలి. యేసు ఇలా అన్నాడు: “నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.” (మత్తయి 18:6) తన చర్యలు ఇతరులకు అభ్యంతరం కలిగించగలవనే విషయాన్ని ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే, క్రేతులోని కొంతమంది క్రైస్తవుల్లాగే ఆయనకు అపవిత్రమైన మనస్సాక్షి ఉండే అవకాశముంది.

16 ఒక క్రైస్తవుడు తన మనస్సాక్షి చెప్పేది వింటూ, ప్రతిస్పందించడంలో ప్రగతి సాధిస్తున్నట్లే ఎడతెగక ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూవుండాలి. ఇటీవలే బాప్తిస్మం తీసుకున్న మార్క్‌ను తీసుకుందాం. తాను అంతకు ముందు పాల్గొన్న లేఖనరహిత ఆచారాలను బహుశా విగ్రహాలు, రక్తం చేరివున్న ఆచారాలను విసర్జించమని ఆయన మనస్సాక్షి ఆయనకు చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 21:25) ఆయనిప్పుడు దేవుడు నిషేధిస్తున్న వాటికి రవ్వంత పోలికవున్నవాటిని కూడా ఎంతో జాగ్రత్తగా విసర్జిస్తున్నాడు. అయితే మరోవైపు, తనకు ఆమోదయోగ్యమైనవిగా అనిపించిన కొన్ని టీవీ కార్యక్రమాలను కొంతమంది ఎందుకు తిరస్కరిస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదు.

17 చివరకు మార్క్‌ తన జ్ఞానమందు అభివృద్ధిపొంది దేవునికి సన్నిహితమయ్యాడు. (కొలొస్సయులు 1:9, 10) అదెలాంటి ప్రభావం చూపించింది? ఆయన మనస్సాక్షికి తగినంత శిక్షణ లభించింది. మార్క్‌ ఇప్పుడు తన మనస్సాక్షి చెప్పేది వింటూ, లేఖనాధార సూత్రాలను జాగ్రత్తగా పరిశీలించేందుకు మరింత మొగ్గుచూపిస్తున్నాడు. తాను దూరంగావున్న “రవ్వంత పోలికవున్న” కొన్ని అంశాలు నిజానికి దేవుని ఆలోచనకు విరుద్ధంగా లేవని ఆయనిప్పుడు గ్రహిస్తున్నాడు. అంతేకాక, బైబిలు సూత్రాలకు మరింతగా స్పందిస్తూ, సరైన శిక్షణ ఇవ్వబడిన తన మనస్సాక్షి చెప్పేదానికి స్పందించేందుకు సుముఖంగా ఉండడంవల్ల, తానొకప్పుడు మంచివనుకున్న కార్యక్రమాలను విసర్జించాలని తన మనస్సాక్షి చెప్పినదానికి మార్క్‌ ఇప్పుడు లోబడుతున్నాడు. అవును, ఆయన మనస్సాక్షి శుద్ధిచేయబడింది.—కీర్తన 37:31.

18 చాలా సంఘాల్లో, క్రైస్తవాభివృద్ధికి సంబంధించి వివిధ స్థాయిల్లోవున్న వ్యక్తులున్నారు. కొందరు సత్యంలోకి కొత్తగా వచ్చారు. కొన్ని విషయాల్లో బహుశా వారి మనస్సాక్షి పూర్తిగా మౌనంగా ఉండవచ్చు, అయితే ఇతరుల గురించి వారి మనస్సాక్షి బిగ్గరగా మాట్లాడుతుండవచ్చు. అలాంటివారు యెహోవా నిర్దేశానికి అనుకూలంగా మారేందుకు, శిక్షణపొందిన తమ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించేందుకు వారికి సమయం, సహాయం అవసరం కావచ్చు. (ఎఫెసీయులు 4:14, 15) సంతోషకరమైన విషయమేమిటంటే, ఆ సంఘాల్లోనే లోతైన జ్ఞానం, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో అనుభవం, దేవుని ఆలోచనకు ఎంతో పొందికగల మనస్సాక్షి ఉన్నవారు చాలామంది ఉండవచ్చు. ప్రభువుకు ప్రీతికరమైన విషయాలను నైతికంగా, ఆధ్యాత్మికంగా ‘పవిత్రమైనవి’ అని దృష్టించే అలాంటి “పవిత్రుల” మధ్య ఉండడమెంత ఆనందదాయకమో కదా! (ఎఫెసీయులు 5:10) వారి స్థాయికి ఎదిగి, సత్యవిషయమైన అనుభవజ్ఞానానికి, భక్తికి పొందికగల మనస్సాక్షిని కాపాడుకోవడం మనందరి లక్ష్యమై ఉండునుగాక!—తీతు 1:1.

[అధస్సూచి]

^ పేరా 12 దంపతులు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కావలికోట (ఆంగ్లం) మార్చి 15, 1983వ సంచిక వివరిస్తోంది.

మీరెలా జవాబిస్తారు?

• క్రేతులోని క్రైస్తవుల్లో కొందరికి ఎందుకు అపవిత్రమైన మనస్సాక్షి ఉంది?

• సున్నితమైన మనస్సాక్షిగల ఇద్దరు క్రైస్తవులు ఎలా విభిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు?

• కాలం గడిచేకొద్దీ మన మనస్సాక్షికి ఏమి సంభవించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. క్రేతులోని సంఘాల విషయంలో పౌలు ఏమిచేశాడు?

2. క్రేతు ద్వీపంలో తీతు ఏ సమస్యతో వ్యవహరించాల్సి వచ్చింది?

3. మనస్సాక్షి గురించి పౌలు తీతుకు ఏమి రాశాడు?

4, 5. సంఘాల్లో కొందరికి ఎలాంటి లోపముంది, ఆ లోపం వారిపై ఎలాంటి ప్రభావం చూపించింది?

6. ఏ రెండు రకాల ప్రజల గురించి పౌలు ప్రస్తావించాడు?

7. హెబ్రీయులు 13:4 దేనిని నిషేధిస్తోంది, అయితే ఏ ప్రశ్న ఉత్పన్నం కావచ్చు?

8. ముఖరతి విషయంలో క్రైస్తవుల దృక్కోణం ఏ విధంగా ప్రపంచంలోని అనేకుల దృక్కోణానికి భిన్నంగా ఉంది?

9. “అన్నియు పవిత్రములే” అయితే, మరి మనస్సాక్షి పాత్ర ఏమిటి?

10. వివాహం (లేదా అంత్యక్రియలు) జరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్య ఎదురుకావచ్చు?

11. ఓ క్రైస్తవ భార్య చర్చిలో జరిగే వివాహానికి హాజరవ్వాలో వద్దో తర్కబద్ధంగా ఎలా ఆలోచించవచ్చో వివరించండి, చివరికది ఏ నిర్ణయానికి దారి తీయవచ్చు?

12. చర్చిలో జరిగే వివాహానికి రమ్మనే ఆహ్వానం విషయంలో ఒక వ్యక్తి ఎలా తర్కబద్ధంగా ఆలోచించి, స్పందించవచ్చు?

13. ఇద్దరు క్రైస్తవులు విభిన్న నిర్ణయాలు తీసుకోవడం ఇతరులను ఎందుకు కలతపర్చనవసరం లేదు?

14. వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన అంశాల గురించి క్రైస్తవులు ఏమి గుర్తుంచుకోవాలి?

15. ఇతరుల మనస్సాక్షిని, భావాలను ఎందుకు ప్రాముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి?

16. కాలం గడుస్తున్నకొద్దీ ఒక క్రైస్తవునిలో మనమెలాంటి మార్పులను ఆశించవచ్చు?

17. కాలం, ఆధ్యాత్మిక ప్రగతి ఒక సహోదరుని మనస్సాక్షిని, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేయవచ్చో ఉదాహరించండి.

18. మనం ఆనందించడానికి ఏ కారణాలున్నాయి?

[26వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సిసిలి

గ్రీసు

క్రేతు

ఆసియా మైనరు

కుప్ర

మధ్యధరా సముద్రం

[28వ పేజీలోని చిత్రం]

ఒకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇద్దరు క్రైస్తవులు విభిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు