కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మనస్సాక్షి చెప్పేది వినండి

మీ మనస్సాక్షి చెప్పేది వినండి

మీ మనస్సాక్షి చెప్పేది వినండి

‘[దేవుని] ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేస్తారు.’—రోమీయులు 2:14.

రైలు ప్లాట్‌ఫారమ్‌ మీదున్న ఓ 20 ఏళ్ల కుర్రాడు మూర్ఛవచ్చి పట్టాలపై పడిపోయాడు. అది గమనించిన ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను విడిచిపెట్టి పట్టాలపైకి దూకాడు. ఆయన మూర్ఛపోయిన ఆ కుర్రాడిని పట్టాల మధ్యలోవున్న గొయ్యిలోకి లాగి అతనిపై బోర్లా పడుకుని, ప్లాట్‌ఫారమ్‌ మీదికి వేగంగా దూసుకొస్తున్న రైలు క్రిందపడి నలిగిపోకుండా అతణ్ణి కాపాడాడు. అలా ఆ కుర్రాడిని కాపాడిన వ్యక్తిని కొందరు గొప్ప హీరో అంటారు. కానీ ఆయనిలా అన్నాడు: “ఎవరైనా అదే చేస్తారు, నేనేదో పేరుప్రతిష్టల కోసం కాదుగానీ, దయతోనే ఆ పనిచేశాను.”

2 ఇతరులకు సహాయం చేయడానికి తమ ప్రాణాలకు తెగించి ముందుకువచ్చిన వ్యక్తులు మీకు తెలిసేవుండవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అనేకమంది అపరిచిత వ్యక్తులను దాచిపెట్టడం ద్వారా ఆ పనే చేశారు. సిసిలికి సమీపంలో ఉన్న మెలితే దగ్గర ఓడ బద్దలై బయటపడ్డ అపొస్తలుడైన పౌలు, 275 మంది ఇతరుల అనుభవాన్ని కూడా గుర్తుచేసుకోండి. ఆ అపరిచితులకు సహాయం చేయడానికి స్థానికులు ముందుకువచ్చి “చేసిన ఉపచారమింతంతకాదు.” (అపొస్తలుల కార్యములు 27:27–28:2) అంతేకాదు, తనను చెరగా తీసుకెళ్లిన సిరియా దేశస్థుని సంక్షేమంపట్ల శ్రద్ధ చూపించిన ఇశ్రాయేలు బాలిక విషయమేమిటి? ఆమె తన ప్రాణానికి ముప్పు కలిగే పనేదీ చేయకపోయినా, ఆయనపట్ల శ్రద్ధ చూపించిన విషయం గమనార్హమైనది. (2 రాజులు 5:1-4) యేసు చెప్పిన మంచి సమరయుని, ప్రఖ్యాతిగాంచిన కథ గురించి కూడా ఆలోచించండి. ఒక యాజకుడు, ఒక లేవీయుడు ప్రాణాపాయ స్థితిలోవున్న తోటి యూదుణ్ణి పట్టించుకోకుండా వదిలేసినా, ఒక సమరయుడు మాత్రం సహాయం చేయడానికి తన శక్తికిమించి ప్రయత్నించాడు. ఈ కథ శతాబ్దాలుగా అనేక సంస్కృతుల్లోని ప్రజల మనసులను ఆకట్టుకుంది.—లూకా 10:29-37.

3 నిజమే, మనం “అపాయకరమైన కాలములలో” జీవిస్తున్నాము; అనేకమంది “క్రూరులు”గా “సజ్జనద్వేషులు”గా ఉన్నారు. (2 తిమోతి 3:1-3) అయినా, ప్రజలు దయగా ప్రవర్తించడాన్ని మనం చూడడంలేదా? బహుశా మనమే స్వయంగా అలాంటి వారివల్ల ప్రయోజనం పొందివుండవచ్చు. తమకు నష్టం వాటిల్లినా ఇతరులకు సహాయం చేయాలనే ప్రవృత్తి ఎంత సర్వసాధారణంగా మనకు కనిపిస్తుందంటే, కొందరు దానిని “మానవత్వం” అంటారు.

4 అలా వ్యక్తిగత త్యాగం అవసరమైనా ఇతరులకు సహాయం చేయాలనే సుముఖత అన్ని జాతుల, సంస్కృతుల ప్రజల్లో కనబడుతుంది, అది “పరిణామ సిద్ధాంతాన్ని” ఖండిస్తుంది. అమెరికాకు చెందిన విజ్ఞానశాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌ ఎస్‌. కాలిన్స్‌ ఇలా చెప్పాడు: “నిస్వార్థత అనేది పరిణామవాదికి పెను సవాలుగా ఉంటుంది.” ఆయనింకా ఇలా అన్నాడు: “కొందరు తమకు ఏమాత్రం సంబంధంలేని, తమవారు కానివారికి త్యాగనిరతితో సహాయం చేస్తారు. . . . డార్విన్‌ సిద్ధాంతం ద్వారా దీనిని వివరించడం అసాధ్యమనిపిస్తోంది.”

‘మనస్సాక్షి స్వరం’

5 మనలోని నిస్వార్థతకు సంబంధించిన ఒక అంశాన్ని డాక్టర్‌ కాలిన్స్‌ ఇలా సూచిస్తున్నాడు: “ప్రతిఫలంగా ఏమీ లభించకపోయినా ఇతరులకు సహాయం చేయాలని మనస్సాక్షి స్వరం మనకు చెబుతుంది.” ఆయన “మనస్సాక్షిని” ప్రస్తావించడం అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పిన ఈ అంశాన్ని మనకు గుర్తుచేస్తుంది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల [‘చేసిన ప్రతీసారి,’ NW] వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.”—రోమీయులు 2:14, 15.

6 “జగదుత్పత్తి మొదలుకొని” జరుగుతున్నట్లుగానే, సృష్టించబడిన వాటినిబట్టి దేవుడు ఉనికిలో ఉన్నాడని తెలుస్తోంది, అలాగే ఆయన లక్షణాలూ వెల్లడౌతున్నాయి, కాబట్టి మానవులు దేవునికి జవాబుదారులని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టపర్చాడు. (రోమీయులు 1:18-20; కీర్తన 19:1-4) నిజానికి చాలామంది తమ సృష్టికర్తను నిర్లక్ష్యం చేస్తూ నైతికంగా దిగజారిన జీవనవిధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, మానవులు తన నీతిని అంగీకరించి తమ చెడు అలవాట్ల విషయమై పశ్చాత్తాపం చూపించాలన్నది దేవుని చిత్తం. (రోమీయులు 1:22–2:6) అలా చేసేందుకు యూదులకు బలమైన కారణముంది, ఎందుకంటే వారికి మోషే ద్వారా దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. “దేవోక్తులు” లేని ప్రజలు సహితం దేవుని ఉనికిని గుర్తించి ఉండాల్సింది.—రోమీయులు 2:8-13; 3:2.

7 ప్రతీ ఒక్కరూ దేవుణ్ణి గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే, తప్పొప్పుల విషయంలో వారిలో అంతర్గతంగా ఉన్న గ్రహింపే. న్యాయాన్యాయాల గ్రహింపు మనకు మనస్సాక్షి ఉందని సూచిస్తుంది. ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: కొంతమంది పిల్లలు వంతులవారీగా ఉయ్యాల ఊగాలని వరుసగా నిలబడ్డారు. అంతలో నిలబడ్డవారిని లెక్కచేయకుండా ఓ పిల్లవాడు ముందుకు వెళ్లాడు. చాలామంది “అన్యాయం!” అని అరిచారు. ఇప్పుడు మీరిలా ప్రశ్నించుకోండి, ‘చాలామంది పిల్లలు సహితం తమకు న్యాయాన్యాయాల గ్రహింపు ఉందని వెంటనే ఎలా చూపించగలిగారు?’ వారలా అరవడం, వారికి అంతరంగ నైతిక గ్రహింపు ఉందని చూపిస్తుంది. ‘ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ప్రతీసారి’ అని పౌలు రాశాడు. అలా చేయడం అరుదుగా జరుగుతుందన్నట్లు ఆయన “ఒకవేళ” అని అనలేదు. తరచూ జరిగేదనే భావమిస్తూ ‘ప్రతీసారి’ అని అన్నాడు. ప్రజలు “స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను” చేస్తారు, అంటే దేవుని లిఖితపూర్వక ధర్మశాస్త్రంలో మనం చదివేవాటికి అనుగుణంగా ప్రవర్తించేందుకు వారు తమ అంతరంగ నైతిక గ్రహింపుచేత పురికొల్పబడుతున్నారని అర్థం.

8 ఈ నైతిక లక్షణం అనేక దేశాల్లో కనబడింది. బబులోనీయుల, ఐగుప్తీయుల, గ్రీసుదేశస్థులతోపాటు ఆస్ట్రేలియా ఆదిమవాసుల, అమెరికా రాష్ట్రాల స్థానికవాసుల ప్రమాణాల్లో, “అణచివేతను, హత్యను, ద్రోహాన్ని, అబద్ధాన్ని ఖండించడం వంటివి ఉండడమే కాక, వృద్ధులపట్ల, పిల్లలపట్ల, బలహీనులపట్ల దయచూపించడం గురించిన ప్రమాణాలు కూడా ఉన్నాయి” అని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ఒక ప్రొఫెసర్‌ రాశాడు. డాక్టర్‌ కాలిన్స్‌ ఇలా రాశాడు: “మానవుల్లోని అన్నిజాతుల ప్రజల్లో తప్పొప్పుల గురించిన ఆలోచన సర్వసాధారణంగా ఉన్నట్లు కనిపిస్తోంది.” అది మీకు రోమీయులు 2:14ను గుర్తు చేయడం లేదా?

మీ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది?

9 మీరు మీ చర్యలను పరిశీలించుకుని, వాటిని మదింపు చేసుకునేందుకు అంతర్గతంగా మీలోవున్న సామర్థ్యమే మనస్సాక్షి అని బైబిలు వివరిస్తోంది. అది మీరు తీసుకున్న ఒకానొక చర్య సరైనదనో కాదనో చెప్పే అంతర్గత స్వరంలా ఉంటుంది. పౌలు తన అంతర్గత స్వరాన్ని ఇలా పేర్కొన్నాడు: “పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది.” (రోమీయులు 9:3) ఉదాహరణకు, నైతికత చేరివున్న ఒకానొక చర్య తీసుకోవాలా వద్దా అని మీరు ఆలోచిస్తుండగా ఈ స్వరం ముందుగా మాట్లాడవచ్చు. మీ మనస్సాక్షి మీరు తీసుకోబోయే చర్యను బేరీజువేసి చూసుకునేందుకు సహాయంచేసి, ఆ చర్య తీసుకుంటే మీరెలా భావిస్తారో సూచించవచ్చు.

10 సాధారణంగా, మీరేదైనా చర్య తీసుకున్న తర్వాతే మనస్సాక్షి పనిచేస్తుంది. దావీదు తన ప్రాణాలు కాపాడుకునేందుకు సౌలు రాజునుండి పారిపోతున్న సమయంలో, దేవుడు అభిషేకించిన ఆ రాజుపట్ల అగౌరవంగా ప్రవర్తించే అవకాశం రావడంతో ఆయనలాగే ప్రవర్తించాడు. ఆ తర్వాత, ‘దావీదు మనసులో నొచ్చుకున్నాడు.’ (1 సమూయేలు 24:1-5; కీర్తన 32:3, 5) ఆ కథనంలో “మనస్సాక్షి” అనే పదం ఉపయోగించబడకపోయినా, దావీదు మనస్సాక్షి ప్రతిస్పందన కారణంగానే బాధననుభవించాడు. మనందరం కూడా అలాగే మనస్సాక్షి స్పందన కారణంగా బాధననుభవించాం. మనమేదో చేశాం, ఆ తర్వాత చేసిన దానినిబట్టి కలతచెంది బాధననుభవించాం. పన్నులు చెల్లించని కొందరు తమ మనస్సాక్షినిబట్టి ఎంతగా కలతచెందారంటే, ఆ తర్వాత వారు తమ రుణాలను చెల్లించారు. మరికొందరు తమ వ్యభిచార పాపాన్ని తమ భాగస్వామి ఎదుట ఒప్పుకునేందుకు పురికొల్పబడ్డారు. (హెబ్రీయులు 13:4) అయితే ఒకవ్యక్తి తన మనస్సాక్షి చెప్పేదానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు, తత్ఫలితంగా సంతృప్తికరమైన, సమాధానకరమైన భావన కలుగుతుంది.

11 కాబట్టి మనం ‘మనల్ని నిర్దేశించేందుకు మనస్సాక్షినే పూర్తిగా అనుమతించవచ్చా’? మనస్సాక్షి చెప్పేది వినడం ప్రయోజనకరమైనా, దాని సందేశం మనల్ని ఘోరంగా తప్పుదోవ పట్టించవచ్చు. ‘ఆంతర్యపురుషుని’ స్వరం మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. (2 కొరింథీయులు 4:16) స్తెఫను ఉదాహరణను పరిశీలించండి. ఆయన నిష్ఠతో క్రీస్తును అనుసరించిన వాడని, “కృపతోను బలముతోను నిండిన” వాడని ఆయన గురించి బైబిలు చెబుతోంది. కొందరు యూదులు స్తెఫనును యెరూషలేము వెలుపలికి వెళ్లగొట్టి రాళ్లురువ్వి చంపారు. (ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారిన) సౌలు, దగ్గర్లో నిలబడి స్తెఫను ‘చావునకు సమ్మతించాడు.’ ఆ యూదులు తాముచేసింది సరైనదని ఎంత దృఢంగా నమ్మారంటే వారి మనస్సాక్షి వారిని బాధించలేదు. సౌలు విషయంలో కూడా అలాగే జరిగివుండవచ్చు, ఎందుకంటే ఆయన ఆ తర్వాత కూడా “ప్రభువుయొక్క శిష్యులను బెదిరించుటయును హత్యచేయుటయును” కొనసాగించాడు. ఆ సమయంలో ఆయన మనస్సాక్షి ఖచ్చితమైన స్వరంతో మాట్లాడలేదనేది స్పష్టం.—అపొస్తలుల కార్యములు 6:8; 7:57–8:1; 9:1.

12 సౌలు మనస్సాక్షిని ఏది ప్రభావితం చేసి ఉండవచ్చు? ఒకటేమిటంటే, ఆయన ఇతరులతో సన్నిహితంగా సహవసించడం కావచ్చు. మనలో చాలామందిమి, తన స్వరం అచ్చం తన తండ్రి స్వరంలాగేవున్న వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడివుండవచ్చు. కొంతమేరకు, ఆ కుమారునికి ఆ స్వరం వారసత్వంగా వచ్చివుండవచ్చు, అలాగే ఆయన తన తండ్రి సంభాషణా తీరుచేత ప్రభావితమై కూడా ఉండవచ్చు. అలాగే, యేసును ద్వేషించి ఆయన బోధలను వ్యతిరేకించిన యూదులతో సౌలుకున్న సన్నిహిత సహవాసం ఆయనను ప్రభావితం చేసివుండవచ్చు. (యోహాను 11:47-50; 18:14; అపొస్తలుల కార్యములు 5:27, 28, 33) అవును, సౌలు సహవాసులు, ఆయన తన అంతరంగలో విన్న స్వరాన్ని, అంటే ఆయన మనస్సాక్షిని ప్రభావితం చేసివుండవచ్చు.

13 పరిసరాలు ఎలా ఒకవ్యక్తి స్థానిక యాసతో మాట్లాడేందుకు దారితీస్తాయో అలాగే ఒక వ్యక్తి సాధారణ సంస్కృతి లేదా అతడు నివసించే పరిసరాలు కూడా అతని మనస్సాక్షిపై ప్రభావం చూపించవచ్చు. (మత్తయి 26:73) ప్రాచీనకాల అష్షూరీయులకు అలాగే జరిగివుండవచ్చు. వారు తమ యుద్ధ ప్రవృత్తికి పేరుగాంచారు, వారు చెక్కిన ఉద్భూతిశిల్పాలు వారు తమ బంధీలను హింసించడాన్ని వర్ణిస్తున్నాయి. (నహూము 2:11, 12; 3:1) యోనా కాలంలోని నీనెవె పట్టణస్థులు “కుడియెడమలు ఎరుగని” జనముగా వర్ణించబడ్డారు. అంటే, దేవుని దృష్టికి ఏది సరైనదో, ఏది సరైనది కాదో వివేచించే సరైన ప్రమాణం వారికి లేదు. నీనెవెలో పెరిగిన వ్యక్తి మనస్సాక్షిపై ఆ పరిసరాలు ఎలా ప్రభావం చూపించి ఉండగలవో ఊహించండి. (యోనా 3:4, 5; 4:11) అలాగే నేడు, ఒక వ్యక్తి మనస్సాక్షి తన చుట్టూ ఉన్నవారి దృక్పథం చేత ప్రభావితం కావచ్చు.

మనస్సాక్షిని మెరుగుపర్చుకోవడం

14 యెహోవా ఆదాము హవ్వలకు మనస్సాక్షి అనే వరాన్నిచ్చాడు, వారినుండే మనం కూడా వారసత్వంగా ఆ మనస్సాక్షిని పొందాం. మానవులు దేవుని స్వరూపంలో చేయబడ్డారని ఆదికాండము 1:27 మనకు చెబుతోంది. అంటే భౌతికరూపంలో మనం దేవుని పోలి ఉన్నామని దానర్థం కాదు, ఎందుకంటే దేవుడు ఆత్మ, మనం భౌతిక శరీరులం. మనం ఏ విధంగా దేవుని స్వరూపంలో ఉన్నామంటే, మనలో నైతికగుణం, పనిచేసే మనస్సాక్షితోపాటు ఆయన లక్షణాలున్నాయని అర్థం. ఇది మన మనస్సాక్షిని బలపర్చుకుని, దానిని మరింత నమ్మకమైనదానిగా చేసుకునే ఒక మార్గానికి కీలకాన్ని అందిస్తోంది. ఆ కీలకం సృష్టికర్త గురించి మరింత తెలుసుకొని, ఆయనకు సన్నిహితమవడమే.

15 ఒక విధంగా యెహోవా మనందరికీ తండ్రి అని బైబిలు చెబుతోంది. (యెషయా 64:8) నమ్మకమైన క్రైస్తవులు తమది పరలోక నిరీక్షణైనా లేదా భూ పరదైసుపై జీవించే నిరీక్షణైనా దేవుణ్ణి తండ్రి అని సంబోధించవచ్చు. (మత్తయి 6:9, 10) మనం మన తండ్రికి ఎల్లప్పుడూ సన్నిహితమవాలనే కోరికతో ఆయన దృక్కోణాలను, ప్రమాణాలను తెలుసుకోవాలి. (యాకోబు 4:8) చాలామందికి అలా చేయాలనే ఆసక్తిలేదు. వారు, “మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. . . . మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు” అని యేసు ఎవరి గురించైతే చెప్పాడో ఆ యూదుల్లా ఉన్నారు. (యోహాను 5:37, 38) మనం దేవుని స్వరం వినలేదు, అయినప్పటికీ ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన ఆలోచన ఏమిటో మనం తెలుసుకోవచ్చు, అలా మనం ఆయనలా ఉంటూ ఆయనలాగే ఆలోచించవచ్చు.

16 పోతీఫరు ఇంటిలోవున్న యోసేపు వృత్తాంతం దానిని చూపిస్తోంది. పోతీఫరు భార్య యోసేపును లొంగదీసుకునేందుకు ప్రయత్నించింది. ఏ బైబిలు పుస్తకమూ ఇంకా రాయబడని, పది ఆజ్ఞలు ఇవ్వబడని కాలంలో జీవిస్తున్నా యోసేపు ఇలా స్పందించాడు: “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును.” (ఆదికాండము 39:9) ఆయన కేవలం తన కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు అలా స్పందించలేదు; వారు చాలాదూరంలో నివసిస్తున్నారు. ఆయన ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకున్నాడు. ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే ఉండాలన్నది, వారిద్దరూ “ఏక శరీరమై” ఉండాలన్నది వివాహం విషయంలో దేవుని ప్రమాణమని యోసేపుకు తెలుసు. రిబ్కా వివాహితురాలనీ, ఆమెను పరిగ్రహించడం తప్పనీ, దానివల్ల తన ప్రజలపైకి దోషం వస్తుందనీ తెలుసుకున్నప్పుడు అబీమెలెకు ఎలా భావించాడో ఆయన వినివుండవచ్చు. అబీమెలెకు విషయంలో ఆ తదుపరి పరిస్థితిని యెహోవా ఆశీర్వదించడం వ్యభిచారం విషయంలో ఆయన దృక్కోణమేమిటో చూపించింది. ఈ విషయాలన్నీ యోసేపు తెలుసుకొని ఉండడం, వారసత్వంగా ఆయనకు లభించిన మనస్సాక్షి చెప్పేదానిని బహుశా బలపర్చి, లైంగిక దుర్నీతిని తిరస్కరించేలా ఆయనను పురికొల్పివుంటుంది.—ఆదికాండము 2:24; 12:17-19; 20:1-18; 26:7-14.

17 నిజానికి మనం ఇప్పుడు మరింత మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. మన తండ్రి వేటిని ఆమోదిస్తాడు, వేటిని నిషేధిస్తాడనే వాటితోపాటు ఆయన ఆలోచన, మనోభావన గురించి తెలుసుకునేందుకు మనదగ్గర పూర్తి బైబిలు ఉంది. మనం లేఖనాలను ఎంత బాగా తెలుసుకుంటే అంత ఎక్కువగా దేవునికి సన్నిహితమై, ఆయనలా ఉండగలుగుతాం. మనమలా చేస్తుండగా మన మనస్సాక్షి చెప్పేది మన తండ్రి ఆలోచనకు మరింత పొందికగా ఉండే అవకాశముంది. అది ఆయన చిత్తానికి మరింత అనుగుణంగా ఉంటుంది.—ఎఫెసీయులు 5:1-5.

18 పరిసరాలు మన మనస్సాక్షిని ప్రభావితంచేసే విషయమేమిటి? మన బంధువుల ఆలోచనలు, వారి క్రియలు, మనం పెరిగిన పరిసరాలు మనపై ప్రభావం చూపిస్తుండవచ్చు. అందువల్ల, మన మనస్సాక్షి స్పందన అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు లేదా వక్రీకరించబడి ఉండవచ్చు. అది మన చుట్టూవున్నవారి “యాసలోనే” మాట్లాడవచ్చు. నిజమే, మనం మన గతాన్ని మార్చలేం, కానీ మన మనస్సాక్షిపై మంచి ప్రభావం చూపించగల సహవాసులను, పరిసరాలను ఎంచుకునేందుకు మనం నిర్ణయించుకోవచ్చు. ఒక ప్రాముఖ్యమైన చర్య ఏమిటంటే, తమ తండ్రిలా ఉండేందుకు ఎంతోకాలంగా ప్రయత్నించిన విశ్వాసపాత్రులైన క్రైస్తవులతో క్రమంగా సహవసించడం. అలా సహవసించడానికి సంఘకూటాలు మనకు చక్కని అవకాశమిస్తాయి. కూటాలకు ముందు, ఆ తర్వాత కూడా మనకలాంటి అవకాశం లభిస్తుంది. దేవుని దృక్కోణాన్ని, మార్గాల్ని ప్రతిధ్వనించే తమ మనస్సాక్షి చెప్పేది వినేందుకు ఆ తోటి క్రైస్తవుల సంసిద్ధతతోపాటు, వారి బైబిలు ఆధారిత ఆలోచనను, స్పందనను మనం గమనించవచ్చు. చివరికది బైబిలు సూత్రాలకు అనుగుణంగా మన మనస్సాక్షిని మలచుకునేందుకు సహాయపడి, మనం దేవుని స్వరూపాన్ని సన్నిహితంగా పోలి ఉండేలా చేస్తుంది. మన మనస్సాక్షిని మన తండ్రి సూత్రాలకు అనుగుణంగా మలచుకొని, తోటి క్రైస్తవుల చక్కని ప్రభావానికి తావిచ్చినప్పుడు, మన మనస్సాక్షి మరింత ఆధారపడదగినదిగా ఉండడమే కాక, అది చెప్పేది వినడానికి మనం మరింత మొగ్గు చూపిస్తాం.—యెషయా 30:21.

19 అయినప్పటికీ, కొందరు తదేకంగా తమ మనస్సాక్షి చెప్పేదానికి స్పందించేందుకు కష్టపడుతుంటారు. క్రైస్తవులు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల్ని తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. అలాంటి పరిస్థితులను పరిశీలించడం ద్వారా మనం మనస్సాక్షి పాత్రను, కొందరి మనస్సాక్షి ఎందుకు భిన్నంగా ఉండవచ్చు, అది చెప్పేదానికి మనం మరింత ఎక్కువగా ఎలా స్పందించవచ్చు అనే విషయాలను మరింత స్పష్టంగా చూడవచ్చు.—హెబ్రీయులు 6:11, 12.

మీరేమి తెలుసుకున్నారు?

• తప్పొప్పుల గ్రహింపు లేదా మనస్సాక్షి అన్ని సంస్కృతులలో ఎందుకుంది?

• మన మనస్సాక్షి మాత్రమే మనల్ని నిర్దేశించేందుకు అనుమతించే విషయంలో మనమెందుకు జాగ్రత్తవహించాలి?

• మన మనస్సాక్షిని మెరుగుపర్చుకోగల కొన్ని మార్గాలు ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) అనేకమంది ఇతరులపట్ల శ్రద్ధతో ఎలా ప్రవర్తించారు? (బి) లేఖనాల్లో ప్రస్తావించబడిన ఏ వ్యక్తులు ఇతరులపట్ల శ్రద్ధ కనబరిచారు?

3, 4. చాలామంది నిస్వార్థంగా ప్రవర్తించడం, పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఏమి చెబుతోంది?

5. ప్రజల్లో తరచూ ఏమి గమనించబడింది?

6. ప్రజలందరూ దేవునికి ఎందుకు జవాబుదారులు?

7, 8. (ఎ) న్యాయాన్యాయాల గ్రహింపు సర్వసాధారణంగా కనిపిస్తుందా? వివరించండి. (బి) అది ఏమి చూపిస్తుంది?

9. మనస్సాక్షి అంటే ఏమిటి, మీరు ఏదైనా చర్య తీసుకోకముందే అది మీకెలా సహాయం చేయగలదు?

10. మనస్సాక్షి తరచూ ఎలా పనిచేస్తుంది?

11. ‘మిమ్మల్ని నిర్దేశించేందుకు మనస్సాక్షినే పూర్తిగా అనుమతించడం’ ఎందుకు ప్రమాదకరం కావచ్చు? ఉదాహరించండి.

12. ఒక వ్యక్తి మనస్సాక్షిని ఏది ప్రభావితం చేయవచ్చు?

13. ఒకరి పరిసరాలు వారి మనస్సాక్షిపై ఎలా ప్రభావం చూపించవచ్చు?

14. ఆదికాండము 1:27 చెబుతున్న విషయాన్ని మన మనస్సాక్షి ఎలా ప్రతిబింబిస్తోంది?

15. మన తండ్రిని తెలుసుకోవడం ద్వారా మనం ప్రయోజనం పొందగల ఒక మార్గమేమిటి?

16. మన మనస్సాక్షికి శిక్షణనిస్తూ, అది చెప్పేదానికి స్పందించడం గురించి యోసేపు వృత్తాంతం ఏమి ఉదాహరిస్తోంది?

17. మన తండ్రిలావుండే విషయానికొస్తే, మనమెందుకు యోసేపుకన్నా మరింత మెరుగైన స్థితిలో ఉన్నాం?

18. గతజీవితపు ప్రభావాలుండే అవకాశం ఉన్నా, మన మనస్సాక్షిని మరింత ఆధారపడదగినదిగా చేసుకునేందుకు మనమేమి చేయవచ్చు?

19. మనస్సాక్షికి సంబంధించిన ఏ అంశాలు, ఇప్పటికీ మన పరిశీలనకు అర్హమైనవి?

[23వ పేజీలోని చిత్రాలు]

దావీదు మనస్సాక్షికి సంబంధించిన బాధననుభవించాడు . . .

కానీ తార్సువాడైన సౌలు అలా బాధపడలేదు

[24వ పేజీలోని చిత్రం]

మన మనస్సాక్షికి మనం శిక్షణనివ్వవచ్చు