కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రేపటిని దృష్టిలోపెట్టుకుని జీవించండి

రేపటిని దృష్టిలోపెట్టుకుని జీవించండి

రేపటిని దృష్టిలోపెట్టుకుని జీవించండి

యేసుక్రీస్తు గలిలయలోని ఒక కొండపై ఇచ్చిన ప్రఖ్యాతిగాంచిన ప్రసంగంలో ఇలా అన్నాడు: “రేపటినిగూర్చి చింతింపకుడి.” ఆయన తర్వాతి మాటలు పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితంలో ఇలా అనువదించబడ్డాయి: ‘రేపు, దాని విషయం అదే చూసుకుంటుంది.’—మత్తయి 6:34.

‘రేపు, దాని విషయం అదే చూసుకుంటుంది’ అని ఆయన పలికిన మాటలకు అర్థమేమై ఉంటుందని మీరనుకుంటున్నారు? మీరు నేటి కోసమే జీవిస్తూ రేపటిని నిర్లక్ష్యం చేయాలని అది సూచిస్తోందా? యేసు, ఆయన అనుచరులు నమ్మినదానితో అది నిజంగా పొందికగా ఉందా?

“చింతింపకుడి”

యేసు ఇచ్చిన ప్రసంగం మొతాన్ని మీరే స్వయంగా మత్తయి 6:25-32 వచనాల్లో చదువుకోవచ్చు. ఆ ప్రసంగంలో కొంత భాగం ఈ క్రింది విధంగా ఉంది: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; . . . ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; . . . మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు . . . కాబట్టి—ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.”

యేసు తన ప్రసంగంలోని ఈ భాగాన్ని రెండు సలహాలతో ముగించాడు. మొదటిది: “మీరు [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” రెండవది: “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.”—మత్తయి 6:33, 34.

మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు

యేసు రైతులతో సహా తన శిష్యులకు ‘విత్తవద్దని, కోయవద్దని, కొట్లలో కూర్చుకోవద్దని’ చెబుతున్నాడా? లేదా వారికవసరమైన బట్టలు తయారుచేసుకోవడం కోసం ‘కష్టపడవద్దని, ఒడకవద్దని’ చెబుతున్నాడా? (సామెతలు 21:5; 24:30-34; ప్రసంగి 11:4) ఆయన మాటల భావం అది కానేకాదు. వారు పని చేయడం మానేస్తే, ‘కోతకాలమున పంటనుగూర్చి విచారించునప్పుడు వారికేమియు లేకపోవును’ అంటే వారికి తినడానికిగానీ వేసుకోవడానికిగానీ ఏమీ ఉండవు.—సామెతలు 20:4.

మరి చింత విషయమేమిటి? తన శ్రోతలకు అసలు ఏ చింతా కలుగదని యేసు చెబుతున్నాడా? అది అవాస్తవికంగా ఉంటుంది. యేసు తాను బంధించబడిన రాత్రి తీవ్ర వేదనకు, చింతకు గురయ్యాడు.—లూకా 22:44.

యేసు ఇక్కడ కేవలం ఒక ప్రాథమిక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా, దాని విషయంలో అనవసరంగా చింతించడం వల్ల ఆ సమస్య తీరిపోదు. ఉదాహరణకు, అది మీ ఆయుష్షును పొడిగించదు. అది ‘మీ జీవిత కాలాన్ని మూరెడెక్కువ చేయదు’ అని యేసు చెప్పాడు. (మత్తయి 6:27, NW) నిజానికి దీర్ఘకాలంపాటు చింతించడం వల్ల మీ ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదముంది.

ఆయన ఇచ్చిన సలహా ఎంతో ఆచరణాత్మకమైనది. నిజానికి మనం చింతించే వాటిలో అనేకం ఎన్నడూ జరుగకపోవచ్చు. ప్రపంచ యుద్ధం జరుగుతున్న భయంకరమైన రోజులకు సంబంధించి, బ్రిటన్‌కు చెందిన రాజకీయవేత్త విన్స్‌టన్‌ చర్చిల్‌ ఆ విషయాన్ని గ్రహించాడు. ఆ రోజుల్లో ఆయనను కలవరపరిచిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటూ ఆయనిలా వ్రాశాడు: “నేను ఆందోళనపడ్డ విషయాలన్నీ గుర్తుచేసుకుంటే నాకొక వృద్ధుని కథ గుర్తుకువస్తోంది. ఆ వృద్ధుడు ఆఖరు ఘడియల్లో, తాను తన జీవితంలో చాలా కష్టాలను అనుభవించాననీ, నిజానికి వాటిలో చాలామట్టుకు అసలు రానేలేదనీ అన్నాడట.” అవును, మనకు ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలు సులభంగా తీవ్ర ఆందోళనను కలిగించేవైతే, ఏ రోజు విషయాల గురించి ఆ రోజు ఆలోచించడమే జ్ఞానయుక్తం.

‘దేవుని రాజ్యాన్ని మొదట వెదకండి’

యేసు నిజానికి తన శ్రోతల భౌతిక, శారీరక సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలోపెట్టుకుని మాట్లాడలేదు. జీవితావసరాల కోసం సంపాదించుకోవాలనే చింత, వస్తుసంపదలు సుఖభోగాలు పొందాలనే తీవ్రమైన కోరిక మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్యం చేసేలా చేయగలవని ఆయనకు తెలుసు. (ఫిలిప్పీయులు 1:9) ‘జీవితావసరాలను తీర్చుకోవడంకన్నా ప్రాముఖ్యమైనది ఏముంటుంది?’ అని మీరనుకోవచ్చు. దేవుని ఆరాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు ప్రాముఖ్యమైనవనేదే దానికి జవాబు. ‘దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకడమే’ మన జీవితాల్లో ప్రాముఖ్యమైన విషయమై ఉండాలని యేసు నొక్కిచెప్పాడు.—మత్తయి 6:33.

యేసు జీవించిన కాలంలో అనేకమంది వస్తుసంపదలను సంపాదించుకోవడంలో మునిగిపోయారు. ధనసంపాదనే వారి జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది. అయితే, తన శ్రోతలు తమ ఆలోచనావిధానాన్ని మార్చుకోవాలని యేసు ప్రోత్సహించాడు. దేవునికి సమర్పించుకున్న సేవకులుగా వారి “విధి” లేదా బాధ్యత ఏమిటంటే, వారు “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరిం[చాలి].”—ప్రసంగి 12:13.

“ఐహికవిచారమును ధనమోసమును” అంటే వస్తుసంపదల వ్యామోహంలో పడిపోవడం, వారు దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేసేలా నడిపించివుండేది. (మత్తయి 13:22) “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 తిమోతి 6:9) తన అనుచరులు ఆ “ఉరి” నుండి తప్పించుకునేలా సహాయం చేయడానికి యేసు, వారికి ఆ వస్తువులు అవసరమనే విషయం వారి పరలోక తండ్రికి తెలుసని వారికి గుర్తుచేశాడు. దేవుడు “ఆకాశపక్షులకు” సమకూర్చినట్లే మానవులకు కూడా అవసరమైనవి సమకూరుస్తాడు. (మత్తయి 6:26, 32) చింత తమని ముంచెత్తేందుకు అనుమతించే బదులు వారు తమ భౌతికావసరాలను తీర్చుకోవడానికి తాము చేయగలిగినదంతా చేసి మిగతాది యెహోవా చేతుల్లో వదిలేయాలి.—ఫిలిప్పీయులు 4:6, 7.

‘రేపు, దాని విషయం అదే చూసుకుంటుంది’ అన్న యేసు మాటలకు అర్థం ఏమిటంటే, మనం రేపటి గురించి అనవసరంగా చింతిస్తూ నేటి సమస్యలను ఎక్కువ చేసుకోకూడదు. అవే మాటల్ని మరో బైబిలు ఇలా అనువదించింది: “రేపటి గురించి చింతించకండి; ఏ రోజుకు తగ్గ కష్టాలు ఆ రోజుకు ఉంటాయి. ప్రతీ రోజు వచ్చే కష్టాలకు అదనంగా మరిన్ని కష్టాలను కొనితెచ్చుకోవాల్సిన అవసరం లేదు.”—మత్తయి 6:34, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

“నీ రాజ్యము వచ్చుగాక”

అయితే, రేపటి గురించి అనవసరంగా చింతించడానికి, అసలు ఆలోచించకుండా నిర్లక్ష్యం చేయడానికి మధ్య చాలా తేడావుంది. రేపటిని నిర్లక్ష్యం చేయమని యేసు తన శిష్యులను ఎన్నడూ ప్రోత్సహించలేదు. బదులుగా, భవిష్యత్తు విషయంలో ఎంతో ఆసక్తి కలిగివుండాలని వారిని పురికొల్పాడు. వారు సముచితంగానే, తమ ప్రస్తుత అవసరాల గురించి అంటే అనుదిన ఆహారం గురించి ప్రార్థించాలి. కానీ వారు ముందుగా, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి అంటే దేవుని రాజ్యం రావాలని, దేవుని చిత్తం భూమిపై నెరవేరాలని ప్రార్థించాలి.—మత్తయి 6:9-11.

మనం నోవహు కాలంలోని ప్రజల్లా ఉండకూడదు. వారు ‘తినడంలో త్రాగడంలో పెండ్లి చేసికోవడంలో పెండ్లికిచ్చుకోవడంలో’ ఎంతగా మునిగిపోయారంటే, జరగబోయే దాన్ని గురించి వారు “ఎరుగక పోయిరి.” వారికెలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి? “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపో[యెను].” (మత్తయి 24:36-42) మనం రేపటిని దృష్టిలోపెట్టుకుని జీవించాలనే విషయాన్ని మనకు గుర్తుచేయడానికి అపొస్తలుడైన పేతురు ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉపయోగించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”—2 పేతురు 3:5-7, 11.

పరలోకంలో ధనం కూర్చుకోండి

అవును మనం యెహోవా దినం కోసం ‘కనిపెట్టుకుని’ ఉందాం. అలా కనిపెట్టుకుని ఉండడం, మనం మన సమయాన్ని, శక్తిని, నైపుణ్యాలను, వనరులను, సామర్థ్యాలను ఉపయోగించే విధానాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మనం మన “భక్తిని” ప్రదర్శించే పనులు చేయడానికి సమయం లేకుండా పోయేంతగా జీవితావసరాల కోసం లేదా సుఖభోగాల కోసం వస్తుసంపదలను సంపాదించుకోవడంలో మునిగిపోకూడదు. కేవలం నేటిని మాత్రమే దృష్టిలోపెట్టుకుని ప్రవర్తించడం అప్పటికప్పుడు మంచి ఫలితాలు తెస్తున్నట్లు అనిపించవచ్చు, అయితే అవి తాత్కాలికమైనవై ఉంటాయి. భూమిపై కాక ‘పరలోకంలో మన కొరకు ధనము కూర్చుకోవడం’ మరెంతో జ్ఞానయుక్తమైనదని యేసు చెప్పాడు.—మత్తయి 6:19, 20.

ఆ విషయాన్ని యేసు, భవిష్యత్తు గురించి పెద్దపెద్ద ప్రణాళికలు వేసుకున్న ఒక వ్యక్తి గురించిన ఉపమానంలో నొక్కిచెప్పాడు. ఆ వ్యక్తి ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు దేవునితో తనకుండాల్సిన సంబంధం గురించి ఆలోచించలేదు. అతనికున్న నేల చాలా సారవంతమైనది. అతను తింటూ, త్రాగుతూ, విలాసవంతమైన జీవితాన్ని జీవించగలిగేలా తన ధాన్యపు కొట్లను పడగొట్టి పెద్దవైన కొత్త కొట్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో తప్పేముంది? అతడు తన కష్టార్జితాన్ని అనుభవించకముందే చనిపోయాడు. దానికన్నా విచారకరమైన విషయమేమిటంటే అతడు దేవునితో సంబంధాన్ని ఏర్పర్చుకోలేదు. యేసు ఇలా ముగించాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”—లూకా 12:15-21; సామెతలు 19:21.

మీరు ఏమి చేయవచ్చు?

యేసు వర్ణించిన వ్యక్తి చేసినలాంటి తప్పునే మీరు చేయకండి. దేవుడు భవిష్యత్తు కోసం ఏమి సంకల్పించాడో తెలుసుకుని, దానికి మీ జీవితంలో ప్రథమస్థానమివ్వండి. దేవుడు తానేమి చేయబోతున్నాననే విషయాన్ని గోప్యంగా ఉంచలేదు. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు” అని ప్రాచీనకాల ప్రవక్తయైన ఆమోసు వ్రాశాడు. (ఆమోసు 3:7) యెహోవా తన ప్రవక్తల ద్వారా బయల్పర్చిన విషయాలు ఇప్పుడు మీకు ఆయన ప్రేరేపిత వాక్యమైన బైబిల్లో అందుబాటులో ఉన్నాయి.—2 తిమోతి 3:16, 17.

మానవజాతి అంతటినీ ముందెన్నడూ లేనంతగా ప్రభావితం చేసే ఏ విషయం సమీప భవిష్యత్తులో జరుగబోతుందో బైబిలు వెల్లడిచేస్తోంది. “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అని యేసు అన్నాడు. (మత్తయి 24:21) ఏ మానవుడూ దానిని ఆపలేడు. నిజానికి, సత్యారాధకులు దానిని ఆపాలని కూడా అనుకోరు. ఎందుకు? ఎందుకంటే ఈ సంఘటన భూమిపైనున్న దుష్టత్వాన్నంతటినీ నిర్మూలించి, “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” అంటే క్రొత్త పరలోక ప్రభుత్వాన్ని, క్రొత్త మానవ సమాజాన్ని తీసుకువస్తుంది. ఆ నూతనలోకంలో దేవుడు “[ప్రజల] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:1-4.

కాబట్టి దాని గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి మనం ఇప్పుడే సమయం వెచ్చించడం జ్ఞానయుక్తమైన పని కాదా? అలా చేయడానికి మీకు సహాయం అవసరమా? మీరు యెహోవాసాక్షుల నుండి సహాయం తీసుకోండి. లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి. మీరు నేటి కోసమేకాక ఎంతో అద్భుతంగా ఉండబోతున్న రేపటి కోసం కూడా జీవించండి.

[7వ పేజీలోని చిత్రాలు]

“చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును”