కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెలుగు వైపు పయనించండి

వెలుగు వైపు పయనించండి

వెలుగు వైపు పయనించండి

లైట్‌హౌస్‌ల వల్ల ఎంతోమంది తమ ప్రాణాలను దక్కించుకోగలిగారు. అయితే అలసిపోయిన ప్రయాణికునికి అల్లంత దూరాన కనిపించే వెలుగు రాళ్లున్నాయనే హెచ్చరికను మాత్రమే ఇవ్వదు, ఆయన తీరాన్ని సమీపిస్తున్నాడనే సందేశాన్ని కూడా ఇస్తుంది. అదేవిధంగా క్రైస్తవులు నేడు, అంధకారంతో నిండిన ఆధ్యాత్మికంగా ప్రమాదకరమైన లోకంలో ఎప్పటినుండో చేస్తున్న ప్రయాణపు చివరి దశలో ఉన్నారు. దేవుని నుండి దూరమైన మానవజాతిని బైబిలు “కదలుచున్న సముద్రము[తో]” పోలుస్తూ, “అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకివేయును” అని చెబుతోంది. (యెషయా 57:20) దేవుని ప్రజలచుట్టూ అలాంటి వాతావరణమే ఉంది. అయితే వారికి రక్షణకు సంబంధించిన మంచి నిరీక్షణ ఉంది, అదే వారికి సూచనార్థకమైన నమ్మదగిన వెలుగుగా పనిచేస్తుంది. (మీకా 7:8) యెహోవా కారణంగా, ఆయన లిఖిత వాక్యం కారణంగా “నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయుల కొరకు ఆనందమును విత్తబడి యున్నవి.”—కీర్తన 97:11. *

అయితే కొంతమంది క్రైస్తవులు తాము యెహోవా వెలుగు నుండి తొలగిపోయేలా వేరే విషయాలకు ప్రాముఖ్యతనిచ్చారు. తత్ఫలితంగా, వారి విశ్వాసమనే ఓడ ధనవ్యామోహం, అనైతికత, లేదా మతభ్రష్టత్వం అనే సూచనార్థక రాళ్లకు కొట్టుకుని బద్దలైపోయింది. అవును మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా కొందరి “విశ్వాసవిషయమైన ఓడ బద్దలై పోయిం[ది].” (1 తిమోతి 1:19; 2 పేతురు 2:13-15, 20-22) మనమిప్పుడు చేరుకోవాలనుకుంటున్న నౌకాశ్రయం నూతనలోకం అని చెప్పవచ్చు. ఆ గమ్యం ఇప్పుడు ఎంతో దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు యెహోవా ఆమోదాన్ని కోల్పోవడం ఎంత విచారకరమో కదా!

‘విశ్వాసమనే ఓడ బద్దలు’ కాకుండా జాగ్రత్తపడండి

పూర్వం ఓడలు సువిశాలమైన సముద్రాల్లో సురక్షితంగా ప్రయాణించి వచ్చి నౌకాశ్రయానికి దగ్గర్లో బద్దలయ్యేవి. ఓడ ఇక తీరానికి చేరుతుందనగా ప్రయాణపు అత్యంత ప్రమాదకరమైన గడియ ఆసన్నమౌతుంది. అదేవిధంగా అనేకులకు, మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన కాలం ఏమిటంటే, ఈ విధానపు ‘అంత్యదినాలే.’ వాటిని బైబిలు సరిగానే “అపాయకరమైన కాలములు” అని పిలుస్తోంది, అవి సమర్పిత క్రైస్తవులకు మరి ప్రత్యేకంగా అపాయకరమైనవి.—2 తిమోతి 3:1-5.

ఈ అంత్యదినాలు ఎందుకంత అపాయకరమైనవి? దేవుని ప్రజలతో పోరాడడానికి తనకు ఇక “సమయము కొంచెమే” ఉందని సాతానుకు తెలుసు. అందుకే వారి విశ్వాసాన్ని బద్దలుచేయడానికి అతడు మరింత తీవ్రంగా కృషి చేస్తున్నాడు. (ప్రకటన 12:12, 17) అయితే మనకు సహాయం, నిర్దేశం ఉన్నాయి. యెహోవా తన ఉపదేశాన్ని వినేవారికి కేడెముగా లేదా కోటగా ఉన్నాడు. (2 సమూయేలు 22:31) సాతాను కుతంత్రాలను వెల్లడిచేసి మనల్ని హెచ్చరించే ఉదాహరణలను ఆయన మనకు ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశాన్ని సమీపించబోతున్న సమయానికి సంబంధించిన అలాంటి రెండు ఉదాహరణలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.—1 కొరింథీయులు 10:11; 2 కొరింథీయులు 2:11.

వాగ్దాన దేశం సమీపంలో

మోషే నాయకత్వం క్రింద ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తప్పించుకోగలిగారు. కొద్దికాలంలోనే వారు వాగ్దాన దేశపు దక్షిణ సరిహద్దును చేరుకున్నారు. అప్పుడు మోషే, ఆ దేశాన్ని సంచరించి చూడడానికి 12 మందిని పంపాడు. వారిలో పదిమంది విశ్వాసరహితులు, కనానీయులు “బలవంతులు,” శూరులు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని జయించలేరని చెబుతూ నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడారు. ఇశ్రాయేలీయులపై ఆ మాటలు ఎలాంటి ప్రభావం చూపాయి? వారు మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా ఇలా సణగడం మొదలుపెట్టారని ఆ వృత్తాంతం చెబుతోంది: “మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; . . . మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదము.”—సంఖ్యాకాండము 13:1, 2, 28-32; 14:1-4.

కాస్త ఊహించండి! యెహోవా పది తెగుళ్ల ద్వారా, ఎర్ర సముద్రము దగ్గర మహోత్కృష్టమైన అద్భుతాన్ని చేయడం ద్వారా, అప్పట్లో ప్రపంచాధిపత్యంగా ఉన్న ఐగుప్తును హీనస్థితికి దిగజార్చడాన్ని ఈ ప్రజలు కళ్లారా చూశారు. వాగ్దాన దేశం వారి కళ్లెదుటే ఉంది, ఓడ తన గమ్యస్థానాన్ని సూచించే వెలుగు వైపు ప్రయాణించేలా వాళ్లు వాగ్దాన దేశంవైపు పయనించాలి. కానీ అతిసామాన్యమైన కనాను దేశపు రాజ్యాలను జయించే సామర్థ్యం యెహోవాకు లేదని వారనుకున్నారు. వారి విశ్వాసరాహిత్యం దేవుణ్ణే కాక, కనాను దేశం “[ఇశ్రాయేలుకు] ఆహారముగా” ఉన్నట్లు భావించిన ధైర్యస్థులైన యెహోషువ, కాలేబులను కూడా ఎంతగా దుఃఖపరచి ఉండవచ్చో కదా! యెహోషువ, కాలేబులిద్దరూ కనానులో సంచరించి తాము ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. ఆ ప్రజలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయినప్పుడు యెహోషువ కాలేబులు కూడా వారితోపాటు కొన్ని దశాబ్దాల వరకు అరణ్యంలో సంచరించాల్సి వచ్చింది కానీ వారు ఆ అవిశ్వాసులతోపాటు మరణించలేదు. నిజానికి, యెహోషువ, కాలేబులు తర్వాతి తరాన్ని అరణ్యంనుండి వాగ్దాన దేశంలోకి నడిపించడంలో సహాయపడ్డారు. (సంఖ్యాకాండము 14:9, 30) అయితే, రెండవసారి వారు వాగ్దాన దేశం సమీపించినప్పుడు ఇశ్రాయేలీయులకు మరోవిధమైన పరీక్ష ఎదురైంది. వారు దానికెలా స్పందిస్తారు?

మోయాబు దేశపు రాజైన బాలాకు, అబద్ధ ప్రవక్తయైన బిలాము ద్వారా ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నించాడు. అయితే, బిలాము శపించే బదులు దీవించేటట్లు చేయడం ద్వారా యెహోవా ఆ పన్నాగాన్ని త్రిప్పికొట్టాడు. (సంఖ్యాకాండము 22:1-7; 24:10) బిలాము తాను విఫలమైనందుకు వెనుకాడకుండా మరో కుతంత్రానికి ఒడిగట్టాడు, అది సఫలమైతే దేవుని ప్రజలు వాగ్దాన దేశాన్ని పొందే అర్హతను కోల్పోతారు. ఎలా? వారు అనైతికతకు పాల్పడేలా, బయలును ఆరాధించేలా పురికొల్పడం ద్వారా అలా చేయాలనుకున్నాడు. ఆ పన్నాగం అందరినీ ఆ ఊబిలోకి లాగకపోయినా 24,000 మంది లొంగిపోవడానికి కారణమైంది. వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి, బయల్పెయోరుతో కలుసుకున్నారు.—సంఖ్యాకాండము 25:1-9.

ఎంత ఘోరమో కదా! ఆ ఇశ్రాయేలీయుల్లో అనేకులు, యెహోవా తమను “ఘోరమైన మహారణ్యములోనుండి” సురక్షితంగా తీసుకురావడాన్ని చూశారు. (ద్వితీయోపదేశకాండము 1:19) అయినా, వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతుండగా దేవుని ప్రజల్లో 24,000 మంది శారీరక కోరికలకు లొంగిపోయి యెహోవా చేతిలో మరణించారు. ఇది, నేడు దేవుణ్ణి సేవిస్తున్నవారు ఎంతో ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోబోతుండగా వారికి ఓ హెచ్చరికగా పనిచేస్తుంది.

ఆధునిక కాలంలో యెహోవా దేవుని సేవకులు తమ ప్రతిఫలాన్ని పొందకుండా చేయడానికి సాతాను చేసే ఆఖరి ప్రయత్నంలో అతనికి కొత్త కుతంత్రాలేమీ అవసరం లేదు. ఇశ్రాయేలీయులు మొదటిసారి వాగ్దాన దేశంలోకి ప్రవేశించబోతున్న సమయంలో ఉపయోగించిన పథకం లాంటి పథకాన్నే సాతాను మన మీద కూడా ప్రయోగిస్తూ మనలో భయాన్ని, సంశయాన్ని కలిగించవచ్చు. అవి బహుశా బెదిరింపులు, హింస లేదా పరిహాసం వల్ల కలుగవచ్చు. కొందరు క్రైస్తవులు వాటికి లొంగిపోయారు. (మత్తయి 13:20, 21) సాతాను విజయవంతంగా ఉపయోగించే మరో కుతంత్రం అనైతికత. కొన్ని సందర్భాల్లో, తప్పుడు ఉద్దేశాలతో క్రైస్తవ సంఘంలోకి ప్రవేశించినవారు, ఆధ్యాత్మికంగా బలహీనంగావున్న వారిని, దైవిక వెలుగులో ధైర్యంగా నడవకుండా ఉన్నవారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు.—యూదా 8, 12-16.

ఆధ్యాత్మికంగా పరిణతి చెంది, అప్రమత్తంగా ఉన్నవారు ఈ లోకం నైతికంగా దిగజారిపోవడాన్ని సాతాను ఆఖరి ప్రయత్నాలకు శక్తివంతమైన ఆధారంగా గుర్తిస్తారు. అవును త్వరలోనే దేవుని యథార్థ సేవకుల్ని తానిక ఏమీ చేయలేనని సాతానుకు తెలుసు. కాబట్టి ఇది, మనం సాతాను కుతంత్రాలనుండి తప్పించుకుంటూ ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండవలసిన సమయం.

ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు సహాయకాలు

అపొస్తలుడైన పేతురు దేవుని ప్రవచన వాక్యాన్ని “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపము” అని వర్ణించాడు, ఎందుకంటే అది దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుందో అర్థంచేసుకోవడానికి క్రైస్తవులకు సహాయం చేస్తుంది. (2 పేతురు 1:19-21) దేవుని వాక్యంపట్ల మక్కువను పెంపొందించుకుని, దాని నిర్దేశాన్ని అంగీకరించేవారు యెహోవా తమ మార్గాలను సరాళం చేస్తాడని గ్రహిస్తారు. (సామెతలు 3:5, 6) అలాంటి మెప్పుదల ఉన్నవారు నిరీక్షణతో ఉంటూ “హృదయానందముచేత కేకలు వేసెదరు,” కానీ యెహోవాను తెలుసుకోనివారు, ఆయన మార్గాలను విడిచేవారు చివరకు “చింతాక్రాంతులై యేడ్చెదరు, మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.” (యెషయా 65:13, 14) కాబట్టి శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, మనం నేర్చుకున్న విషయాలను అన్వయించుకోవడం ద్వారా మనం ఈ విధానంలోని క్షణికానందాలకు చోటివ్వకుండా మన ఖచ్చితమైన నిరీక్షణను మరచిపోకుండా ఉండవచ్చు.

మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యం. ఈ విధానపు అంతం గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.” (లూకా 21:34-36) యేసు, ‘ఎల్లప్పుడూ ప్రార్థనచేయమని’ చెప్పిన విషయాన్ని గమనించండి. అపాయకరమైన ఈ కాలంలో మన నిత్యజీవితం ప్రమాదంలో పడవచ్చని యేసుకు తెలుసు. మీరు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలని కోరుకుంటున్నారని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయా?

మనం నిత్యజీవం అనే గమ్యానికి చేరుకోవడానికి చేస్తున్న ప్రయాణంలో చివరి దశే అత్యంత ప్రమాదకరమైన దశ కావచ్చనే విషయం మనం మర్చిపోకూడదు. మన రక్షణకు నడిపించే వెలుగు కనబడనంతగా మన చూపు మందగించకుండా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

తప్పుదారి పట్టించే వెలుగుల విషయంలో జాగ్రత్తగా ఉండండి

పూర్వం తెరచాపలు వేసి ఓడలు నడిపే కాలంలో దుష్టుల నుండి ఒక ప్రమాదం ఎదురయ్యేది, వారు అమావాస్య రాత్రుల్లో తీరం సరిగ్గా కనబడనప్పుడు తమ పనికానిచ్చేవారు. ఓడలు నడిపేవారిని తప్పుదారి పట్టించేందుకు, రాళ్లుండి ప్రమాదకరంగా ఉండే తీరాల వెంబడి వెలుగు కనిపించేలా చేసేవారు. మోసపోయినవారి ఓడలు బద్దలైపోయేవి, వాటిలోని సరుకు దోచుకోబడేది, అలా వారు తమ ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చేది.

అదే విధంగా, “వెలుగు దూతగా” ఉన్న మోసకారియైన సాతాను, దేవుని ప్రజలు దేవునితో కలిగివున్న సంబంధాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు. అమాయకులను మోసపుచ్చడానికి అపవాది “దొంగ అపొస్తలులను,” మతభ్రష్ట “నీతి పరిచారకులను” ఉపయోగించవచ్చు. (2 కొరింథీయులు 11:13-15) అప్రమత్తంగా ఉండే అనుభవజ్ఞులైన నావికాధికారి మరియు అతని క్రింద పనిచేసేవారు ఎలాగైతే తప్పుదారి పట్టించే వెలుగులవల్ల మోసపోరో అలాగే, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్న” క్రైస్తవులు కూడా అబద్ధ బోధలను, ప్రమాదకర సిద్ధాంతాలను ప్రచారం చేసేవారివల్ల మోసపోరు.—హెబ్రీయులు 5:14; ప్రకటన 2:2.

నావికులు తాము ప్రయాణించే మార్గంలో ఎక్కడెక్కడ లైట్‌హౌస్‌లు ఎదురౌతాయో వ్రాసిపెట్టుకుని దాన్ని తమవెంట తీసుకువెళ్లేవారు. దానిలో ప్రతీ లైట్‌హౌస్‌ను గుర్తించేందుకు కొన్ని గుర్తులు, దాని ప్రత్యేక గుర్తింపుసూచన కూడా వ్రాసిపెట్టుకునేవారు. “నావికులు తాము వ్రాసుకున్న పట్టికలోనుండి లైట్‌హౌస్‌ల గుర్తులను గమనించడం ద్వారా తాము ఏ లైట్‌హౌస్‌ దగ్గరున్నారో అంటే ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించేవారు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. అలాగే, యెహోవా సత్యారాధనను ఉన్నతపరిచిన ఈ అంత్యదినాల్లో మరి ప్రత్యేకంగా యథార్థహృదయులు సత్యారాధనను, దాన్ని అవలంబిస్తున్న వారిని గుర్తించేందుకు దేవుని వాక్యం సహాయం చేస్తుంది. (యెషయా 2:2, 3; మలాకీ 3:18) సత్యారాధనకు, అబద్ధారాధనకు మధ్యవున్న స్పష్టమైన బేధాన్ని చూపిస్తూ యెషయా 60:2, 3 ఇలా చెబుతోంది: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీమీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీమీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.”

అన్ని జనాంగాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు యెహోవా దేవుని వెలుగుచేత నిర్దేశింపబడుతుండగా, వారు తాము చేస్తున్న ప్రయాణపు చివరి దశలో తమ విశ్వాసాన్ని కోల్పోరు. బదులుగా వారు ఈ విధానపు నాశనానికి మిగిలిన రోజుల్లో సురక్షితంగా ప్రయాణించి, శాంతియుత నూతనలోకానికి చేరుకుంటారు.

[అధస్సూచి]

^ పేరా 2 లేఖనాల్లో “వెలుగు” అనే పదం ఎన్నో సూచనార్థక భావాలతో ఉపయోగించబడింది. ఉదాహరణకు బైబిలు దేవుణ్ణి వెలుగుతో ముడిపెడుతోంది. (కీర్తన 104:1, 2; 1 యోహాను 1:5) దేవుని వాక్యంలోని ఆధ్యాత్మిక సమాచారం వెలుగుతో పోల్చబడింది. (యెషయా 2:3-5; 2 కొరింథీయులు 4:5) యేసు భూమ్మీద తన పరిచర్యా కాలంలో వెలుగులా ఉన్నాడు. (యోహాను 8:12; 9:5; 12:35) తమ వెలుగును ప్రకాశింపజేయాలని యేసు అనుచరులకు ఆజ్ఞాపించబడింది.—మత్తయి 5:14, 16.

[15వ పేజీలోని చిత్రం]

నావికుల్లాగే క్రైస్తవులు తప్పుదారి పట్టించే వెలుగులను చూసి మోసపోకుండా జాగ్రత్తపడతారు