కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సువార్తను చేరవేసేందుకు సవాళ్లను అధిగమించడం

సువార్తను చేరవేసేందుకు సవాళ్లను అధిగమించడం

సువార్తను చేరవేసేందుకు సవాళ్లను అధిగమించడం

మేమున్న ట్రక్కు ఒక చెక్‌పోస్టు దగ్గరకొచ్చి ఆగింది. అక్కడ దాదాపు 60 మంది స్త్రీపురుషులు, యౌవనస్థులు ఆయుధాలు పట్టుకుని నిలబడివున్నారు. వారిలో కొందరు యూనిఫారంలో, మరికొందరు మామూలు బట్టలతో ఉన్నారు. వారిలో చాలామంది దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయి. వారు మా కోసమే కాచుకుని ఉన్నట్లు అనిపించింది. అక్కడి పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.

మేము అప్పటికి నాలుగు రోజులుగా ప్రయాణిస్తున్నాం. మా ట్రక్కులో 10 టన్నుల బైబిలు సాహిత్యం ఉంది. “వారు మమ్మల్ని వెళ్లనిస్తారో లేదో? వారు మమ్మల్ని డబ్బేమన్నా అడుగుతారేమో? మేము చేసే పని శాంతియుతమైనదని వారికి నచ్చచెప్పడానికి ఎంత సమయం పడుతుందో?” లాంటి సందేహాలు మాలో తలెత్తాయి.

తుపాకీ పేల్చాలని ఉబలాటపడుతున్న ఒక వ్యక్తి, అక్కడ అధికారమంతా తనదేనని చూపించడానికి ఒకసారి గాల్లోకి పేల్చాడు. మా చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్‌లను చూసి వాటిని తనకివ్వమని అడిగాడు. మేము తటపటాయించినప్పుడు, మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించడంతో, నిరాకరిస్తే ఏమి జరుగుతుందో మాకర్థమైంది. మేము మా ఫోన్‌లను అతనికి ఇచ్చేశాం.

హఠాత్తుగా, యూనిఫారంలో ఉన్న ఒక స్త్రీ తన తుపాకీ అందుకుని మా దగ్గరకు వచ్చింది. ఆమె అతని “సెక్రటరీ,” ఆమె తనకు కూడా ఏదో ఒకటి ఇవ్వమని అడిగింది. వారికి జీవితం గడవడమే కష్టంగా ఉంది కాబట్టి మా నుండి బలవంతంగా లాక్కునే చిన్న “కానుక” అయినా ఆమెకు ఉపయోగపడుతుంది. మరో సైనికుడు మా పెట్రోలు ట్యాంకు తెరిచి తన డబ్బాలో పెట్రోలు నింపుకుంటుంటే మేము వారించాం. అదేమాత్రం పట్టించుకోకుండా తను కేవలం ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్పాడు. ఇక మేము ఏమీ చేయలేకపోయాం. ఇతరులకు కూడా అలాంటి తలంపే రాకుంటే బాగుండుననిపించింది.

చివరకు వాళ్లు దారి ఇవ్వడంతో మేము బయలుదేరినప్పుడు నేను, నాతో ఉన్న సహోదరుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. మాకు చాలా భయమేసింది కానీ ఇలా తనిఖీ చేయబడడం మాకిప్పుడు అలవాటైపోయింది. మేము 2002 ఏప్రిల్‌ మరియు 2004 జనవరి మధ్యకాలంలో కామెరూన్‌లోని డౌలా నౌకాశ్రయం నుండి మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ రాజధానియైన బాంగుయ్‌కి 18 సార్లు వెళ్లాం. బాంగుయ్‌కి చేరుకోవాలంటే 1,600 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రతీసారి మార్గంలో మాకు ప్రమాదాలు, అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. *

“ఈ ప్రయాణాలు మాకెన్నో పాఠాలు నేర్పాయి. తరచూ మనసులో ప్రార్థించుకోవడం, కంగారుపడకుండా ఉండడం జ్ఞానయుక్తం. ‘నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను. నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?’ అని వ్రాసిన కీర్తనకర్త దృక్పథాన్నే మేము కలిగివుండడానికి ప్రయత్నిస్తాం. ఎంతో అవసరమైన నిరీక్షణా సందేశాన్ని అందించడానికే మేమా ప్రయాణాలు చేస్తున్నామని యెహోవాకు తెలుసనే నమ్మకం మాకుంది” అని తరచూ అలా ప్రయాణించిన జోసెఫ్‌, ఇమ్మానుయల్‌ చెప్పారు.—కీర్తన 56:11.

ఆధ్యాత్మిక ఆహారం చేరవేయడానికి జరుగుతున్న అంతర్జాతీయ కృషి

ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలోవున్న అనేకమందికి దేవుని రాజ్య సువార్త వినడమంటే ఎంతో ఇష్టం. వారిలోని ఆ ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చడానికే మనం సరఫరా చేసే సాహిత్యం రూపొందించబడింది. (మత్తయి 5:3; 24:14) డౌలాలో ఉన్న యెహోవాసాక్షుల కామెరూన్‌ బ్రాంచి కార్యాలయం, కామెరూన్‌లోనేకాక దాని పొరుగునున్న నాలుగు దేశాల్లో నివసిస్తున్న దాదాపు 30,000 మంది ప్రచారకుల కోసం, ఆసక్తిగలవారి కోసం క్రమంగా సాహిత్యం సరఫరా చేస్తోంది.

ఈ సాహిత్యం ఇప్పటికే చాలా దూరం నుండి ఇక్కడకు పంపించబడింది. వాటిలో చాలామట్టుకు ఇంగ్లాండ్‌, ఫిన్‌లాండ్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లలో ముద్రించబడుతున్నాయి. తర్వాత అవి ఫ్రాన్స్‌ నుండి నౌకల్లో పంపించబడతాయి. ప్రతీ రెండు వారాలకొకసారి ఒక పెద్ద పెట్టె నిండా బైబిలు సాహిత్యం డౌలా నౌకాశ్రయానికి చేరుతుంది.

ఆ పెట్టెను ట్రక్కులోకి ఎక్కించి దాన్ని బ్రాంచి కార్యాలయానికి తీసుకువెళ్తారు. బ్రాంచి కార్యాలయంలోని షిప్పింగ్‌ విభాగంలో పనిచేసే సహోదరులు, ఆ సాహిత్యాన్ని పంపించాల్సిన ప్రాంతాలను బట్టి వాటిని వేరుచేస్తారు. ఆ దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు సాహిత్యాన్ని చేరవేయడం అంత సులభమేమీ కాదు. కానీ రాజ్య సువార్తను “భూదిగంతముల వరకు” చేరవేయడంలో అదీ ఒక భాగమే. (అపొస్తలుల కార్యములు 1:8) ట్రక్కులో ప్రమాదకరమైన ప్రయాణాలు చేయడానికి ఇలా ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చే స్వయంత్యాగపూరిత స్వచ్ఛంద సేవకులపై బ్రాంచి కార్యాలయం ఆధారపడుతుంది. వారివల్లే ఆఫ్రికాలోని లక్షలాదిమంది ప్రజలకు క్రమంగా బైబిలు సాహిత్యం చేరవేయబడుతోంది.

ప్రయాణం

ఈక్వటోరియల్‌ గినియా, కామెరూన్‌, గాబన్‌, ఛాడ్‌, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లకు ట్రక్కుల్లో సాహిత్యం సరఫరా చేయబడుతుంది. మనం ఒక ట్రక్కులో ఉన్నవారితో కలిసి ప్రయాణిద్దాం. మీరు కూడా డ్రైవర్లతోపాటు ట్రక్కులో కూర్చున్నట్లు ఊహించుకుని, దాదాపు పది లేదా అంతకన్నా ఎక్కువ రోజులు పట్టే ఉత్కంఠభరితమైన ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి.

ఆరుగురు డ్రైవర్లు వంతులవారీగా నడుపుతారు. వారు ఆరోగ్యంగా, సమర్థులుగా ఉండడమేకాక ఓపికగా నడపాలి, మంచి దుస్తులు వేసుకోవాలి. వారు ఆఫ్రికా సాంప్రదాయ దుస్తులు వేసుకుంటారు లేదా షర్టు, టై ధరిస్తారు. గతంలో కస్ట్‌మ్స్‌ అధికారులు వారిని గురించి ఇలా వ్యాఖ్యానించారు: “శుభ్రంగా ఉన్న ట్రక్కు, హుందాగా కనిపించే డ్రైవర్లను చూడండి, వారి ప్రచురణల్లోని చిత్రాల్లో కనిపించే ప్రజల్లాగే ఉన్నారు.” వారు కనబడే తీరుకన్నా, ఇతరుల సహాయార్థం అవసరమున్న ప్రాంతాలకు వెళ్లేందుకు వారు చూపే సుముఖత మరింత ప్రాముఖ్యమైనది.—కీర్తన 110:3.

కిటకిటలాడే నగరంలో వాహనాల రద్దీని తప్పించుకోవడానికి, సూర్యోదయమైన వెంటనే, అంటే 6 గంటలకే డౌలా నుండి మనం బయలుదేరాలి. బ్రాంచి కార్యాలయం దగ్గరున్న వంతెనను దాటి, రద్దీగా ఉండే నగరం నుండి బయటపడిన తర్వాత మనం ముందుగా, తూర్పు దిశలో ఉన్న కామెరూన్‌ రాజధానియైన యావాండేకు వెళ్తాం.

పది టన్నుల పుస్తకాలున్న ట్రక్కును నడపడం ఎంత కష్టమో ఆరుగురు డ్రైవర్లు మీకు చెబుతారు. మొదటి మూడు రోజుల ప్రయాణం తారు రోడ్లపైనే కాబట్టి పెద్దగా సమస్యలేవీ ఉండవు, కానీ జాగ్రత్తగా నడపాలి. మధ్యలో హఠాత్తుగా పెద్దగా వర్షం కురుస్తుంది. ఆ పై రోడ్డంతా గతుకులతో ఉంటుంది. రోడ్డు సరిగా కనపడదు, చిత్తడిగా ఉంటుంది, అక్కడక్కడా గుంటలు ఉంటాయి కాబట్టి చాలా నెమ్మదిగా నడపాలి. సాయంత్రం అయ్యేసరికి ప్రయాణం నిలిపి, భోజనం చేసి వాహనంలోనే డ్యాష్‌బోర్డుపై కాళ్లు చాపుకుని నిద్రకుపక్రమించాలి. ఈ ప్రయాణాల్లో జీవితం అలావుంటుంది!

మరుసటి రోజు ప్రొద్దున్నే మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాలి. ఒక డ్రైవరు రోడ్డు స్థితిగతులను జాగ్రత్తగా గమనిస్తూవుంటాడు. రోడ్డు ప్రక్కన గుంటలోకి వెళ్తున్నామనిపిస్తే ఆయన వెంటనే హెచ్చరిస్తాడు. గుంటలో పడితే ట్రక్కును బయటకు తీయడానికి కొన్ని రోజులు పడుతుందన్నది డ్రైవర్లందరికీ బాగా తెలిసిన విషయం. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించిన తర్వాత కూడా రోడ్లు అంత మంచిగాయేమీ ఉండవు. తర్వాతి 650 కిలోమీటర్ల ప్రయాణం పచ్చని కొండలున్న ఊళ్ల గుండా సాగుతుంది. ఊరు మధ్యనుండి వెళ్తుండగా పిల్లలు, వృద్ధులు, పిల్లల్ని ఎత్తుకునివున్న తల్లులు, అందరూ స్నేహపూర్వకంగా చేయి ఊపుతారు. పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండడంవల్ల ఈమధ్య రోడ్లపై కార్లు అంతగా నడవడం లేదు, అందుకే ప్రజలందరూ మనవైపు ఆశ్చర్యంగా చూస్తారు.

సంతృప్తినిచ్చే అనుభవాలు

మిగతా పనుల వల్ల అంతగా సమయం లేకపోయినా తరచూ కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం, బైబిలు సాహిత్యాన్ని అందించడం కోసం చిన్న ఊళ్లలో ఆగేవాళ్లం అని ఒక డ్రైవరైన జాన్‌వ్యా మాకు చెప్పాడు. ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “బాబుయాలోని ఒక ఆస్పత్రిలో పనిచేసే ఒక వ్యక్తి రాజ్య సందేశం విషయంలో ఎంతో ఆసక్తి కనపర్చేవాడు. మేము అక్కడికి వెళ్లినప్పుడల్లా ఆయనను కలవడానికి ప్రయత్నించేవాళ్లం, వీలైతే కొద్దిసేపు బైబిలు అధ్యయనం చేసేవాళ్లం. ఒకరోజు మేము ఆయనకు, ఆయన కుటుంబానికి నోవహు గురించిన వీడియోక్యాసెట్టును కూడా చూపించాం. పొరుగువారు, స్నేహితులు కూడా వచ్చేసరికి ఇల్లంతా ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులతో నిండిపోయింది. గతంలో అందరూ నోవహు గురించి విన్నారు కానీ ఇప్పుడు వారికి ఆయన జీవిత కథను చూసే అవకాశం దొరికింది. వారు చూపించిన కృతజ్ఞత మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత వారు కృతజ్ఞతగా మా కోసం భోజనం ఏర్పాటు చేసి, ఆ రాత్రికి మేము అక్కడే వుండాలని బలవంతపెట్టారు. కానీ మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి వెంటనే బయలుదేరాం, ఐతే మేము ఆ వినయస్థులతో రాజ్య సువార్తను పంచుకోగలిగినందుకు ఎంతో సంతోషించాం.”

మరో డ్రైవరు ఇస్రాయేల్‌, మా గమ్యస్థానమైన బాంగుయ్‌కు వెళ్లినప్పటి సంఘటనలు గుర్తుతెచ్చుకున్నాడు. “బాంగుయ్‌ దగ్గరపడుతున్నకొద్దీ ఎక్కువ చెక్‌పోస్టులు ఎదురయ్యేవి. అయితే, చాలామంది సైనికులు మేము ముందు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకుని మాతో స్నేహపూర్వకంగా ఉండేవారు. వాళ్లతో కాసేపు కూర్చోమని అడిగేవారు, బైబిలు సాహిత్యాన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకునేవారు. పుస్తకాలను వారు విలువైనవిగా పరిగణించేవారు కాబట్టి వాటిపై తమ పేరు, తేదీ, దాన్ని ఇచ్చిన వ్యక్తి పేరు వ్రాసుకునేవారు. సైనికులు స్నేహపూర్వకంగా ఉండడానికి మరో కారణం ఏమిటంటే, వారిలో కొందరి బంధువులు సాక్షులు.”

ఆరుగురిలో జోసెఫ్‌కు ఎంతో అనుభవం ఉంది. వారు గమ్యం చేరే సమయమే అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టమని ఆయన భావిస్తాడు. అలాంటి ఒక ప్రయాణం గురించి చెబుతూ ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “మేము బాంగుయ్‌కు చేరుకోవడానికి ఇంకా కొన్ని కిలోమీటర్లు ఉండగా, సహోదరులకు ఫోన్‌ చేసి మేము కొద్దిసేపట్లో వస్తున్నామని చెప్పాం. వారు వచ్చి అవసరమైన పనులు ముగించి మమ్మల్ని నగరం నుండి తీసుకెళ్లారు. మేము బ్రాంచి కార్యాలయం చేరుకున్నప్పుడు అందరూ బయటకు వచ్చి మమ్మల్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దగ్గరలో ఉన్న సంఘాల నుండి సహాయం చేయడానికి ఇతరులు రావడంతో కొన్ని గంటల్లోనే పుస్తకాలు, బుక్లెట్లు, పత్రికలు ఉన్న వందలాది బాక్సులు ట్రక్కులోనుండి తీయబడి, డిపోలోకి చేర్చబడ్డాయి.”

“కొన్నిసార్లు మేము పొరుగు దేశమైన డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని సహోదరుల కోసం ఇవ్వబడిన బట్టలు, బూట్లు, పిల్లల ఆటవస్తువులు, పుస్తకాలు లాంటివెన్నో ట్రక్కులో తెచ్చేవాళ్లం. కృతజ్ఞతతో నిండిన వారి చిరునవ్వుల్ని చూడడం మాకు నిజంగా ఎంతటి ఆనందాన్నిచ్చేదో!”

ఒక రోజు విశ్రమించిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. మళ్లీ దారిలో సమస్యలు ఎదురౌతాయి కానీ మేము చవిచూసిన సంతృప్తికరమైన అనుభవాలు ఆ సమస్యలను మరిపిస్తాయి.

సుదూర ప్రయాణాలు, ఏకధాటిగా వర్షాలు కురవడం, గతుకుల రోడ్లు, టైర్లు పంక్చర్లవడం, బండి ఆగిపోవడం వంటివి చాలా నిరుత్సాహపరిచేవి. న్యాయానికి విలువివ్వని సైనికులు తీరని సవాలుగా ఉండేవారు. కానీ ఆఫ్రికాలోని సుదూర ప్రాంతాలకు రాజ్య సువార్తను అందజేయడంలోనూ, దాన్ని స్వీకరించే ప్రజల జీవితాలను అది ప్రభావితం చేయడాన్ని చూడడంలోనూ ఉన్న సంతృప్తి ఈ డ్రైవర్లకు ఇంక దేనిలోనూ లభించదు.

ఉదాహరణకు, వారు అలా సాహిత్యం చేరవేయడం వల్లే, సుడాన్‌ సరిహద్దు దగ్గరున్న మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లోని మారుమూల గ్రామస్థుడు బైబిలు యొక్క ఆధునిక అనువాదమును చదవగలుగుతున్నాడు. ఆయన భార్య కావలికోట యొక్క తాజా సంచికలను అధ్యయనం చేస్తుంది, ఆయన పిల్లలు గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం నుండి ప్రయోజనం పొందగలుగుతున్నారు. * పట్టణాల్లో ఉండే తమ క్రైస్తవ సహోదరుల్లాగే ఊళ్లలో ఉండే వీళ్లేకాక మరెందరో ఆధ్యాత్మిక ఆహారాన్ని అందుకుంటున్నారు. అది నిజంగానే ఎంతో సంతృప్తినిస్తుంది!

[అధస్సూచీలు]

^ పేరా 6 అప్పటినుండి, డౌలా నుండి బాంగుయ్‌కి వెళ్లే మార్గంపై భద్రతను మెరుగుచేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోబడ్డాయి.

^ పేరా 25 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[9వ పేజీలోని మ్యాపులు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

కామెరూన్‌

డౌలా

మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌

బాంగుయ్‌

[9వ పేజీలోని చిత్రం]

జోసెఫ్‌

[9వ పేజీలోని చిత్రం]

ఇమ్మానుయల్‌

[10వ పేజీలోని చిత్రం]

బాంగుయ్‌లో ఉన్న, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ బ్రాంచి కార్యాలయం

[10వ పేజీలోని చిత్రం]

బాంగుయ్‌లో ట్రక్కులోని సామాను దింపడం