కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని లోతైన విషయాలను’ పరిశోధించడం

‘దేవుని లోతైన విషయాలను’ పరిశోధించడం

‘దేవుని లోతైన విషయాలను’ పరిశోధించడం

‘ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను [“లోతైన విషయాలను,” NW] కూడా పరిశోధించును.’ —1 కొరింథీయులు 2:10.

క్రైస్తవ సంఘంలోవున్న మనలో చాలామందిమి మొదట సత్యం తెలుసుకున్నప్పుడు పొందిన ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం, యెహోవా పేరు ఎందుకు ప్రాముఖ్యమో, ఆయన బాధనెందుకు అనుమతిస్తున్నాడో, కొందరెందుకు పరలోకానికి వెళ్తారో, మిగిలిన ఇతర నమ్మకస్థులైన మానవులకు ఎలాంటి భవిష్యత్తు ఉందో తెలుసుకున్నాం. అంతకుముందు మనం బైబిలును పరిశీలించేవుంటాం, అయితే మానవుల్లోని చాలామందికి మరుగుపర్చబడినట్లే, అవి మనకూ మరుగుపర్చబడ్డాయి. మనం నీటి అడుగున పగడపు దిబ్బను చూస్తున్న వ్యక్తిలాగే ఉన్నాం. కళ్లకు ఏమీ ధరించని ఆ వ్యక్తి నీటి అడుగునున్న ఆ పగడపు దిబ్బ అందాలను కొద్దిగానే చూస్తాడు. అయితే కళ్లకు ధరించిన ప్రత్యేక అద్దాల్లోంచి లేదా పడవ అడుగుభాగాన బిగించిన అద్దాల్లోంచి మొదటిసారి చూసినప్పుడు, ఆయన మిలమిలా మెరిసే రంగుల పగడాలను, చేపలను, సముద్ర ఎనిమోనీలను, ముచ్చటైన ఇతర ప్రాణులను చూసి పులకించిపోతాడు. అదే విధంగా, లేఖనాలను అర్థం చేసుకునేందుకు ఒకరు మనకు సహాయం చేయడం ఆరంభించినప్పుడు, మనం మొదటిసారిగా ‘దేవుని లోతైన విషయాలను’ తెలుసుకున్నాం.—1 కొరింథీయులు 2:8-10.

2 బైబిలు సత్యానికి సంబంధించిన కొద్దిపాటి జ్ఞానంతోనే మనం సరిపుచ్చుకోవాలా? ‘దేవుని లోతైన విషయాలు’ అంటే దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ మూలంగా క్రైస్తవులకు వెల్లడి చేయబడుతుంది గానీ అది ఇతరులకు మరుగు చేయబడుతుంది. (1 కొరింథీయులు 2:7) దేవుని జ్ఞానం అపారం, ఆయన విధానాలను పరిశోధించడం ద్వారా మనమెంతో ఆనందించవచ్చు! దేవుని విధానాల్లోని జ్ఞానాన్ని మనమెన్నటికీ సంపూర్ణంగా గ్రహించలేం. ‘దేవుని లోతైన విషయాలను’ ఎడతెగక పరిశోధిస్తూవుంటే, ప్రాథమిక బైబిలు సత్యాలను మొదట తెలుసుకున్నప్పుడు మనం పొందిన ఆనందం ఎల్లకాలం ఉంటుంది.

3 ఆ ‘లోతైన విషయాలను’ మనమెందుకు అర్థం చేసుకోవాలి? మనం నమ్ముతున్న విషయాన్నే కాక, దానిని మనమెందుకు నమ్ముతున్నామనేది అర్థం చేసుకోవడం అంటే మన నమ్మకాల వెనుకున్న కారణాలను గ్రహించడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనం మన తర్కశక్తిని ఉపయోగించి, ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికోవాలని’ లేఖనాలు మనకు చెబుతున్నాయి. (రోమీయులు 12:1, 2) మనం ఫలానీ విధంగా జీవించాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడో అర్థం చేసుకోవడం ఆయనకు విధేయత చూపించాలనే మన నిర్ణయాన్ని బలపరుస్తుంది. కాబట్టి, ‘లోతైన విషయాల’ జ్ఞానం దుర్నీతి క్రియలకు పాల్పడాలనే శోధనను ఎదిరించే శక్తినిచ్చి, “సత్‌క్రియలయందాసక్తి” కలిగివుండడాన్ని పురికొల్పుతుంది.—తీతు 2:14.

4 లోతైన విషయాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేయాలి. అయితే అధ్యయనమనేది ఏదో పైపైన చదవడం వంటిది కాదు. మనకప్పటికే తెలిసిన విషయంతో అదెలా ముడిపడివుందో చూసేందుకు సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. (2 తిమోతి 1:13) చెప్పబడిన విషయానికున్న కారణాలను గ్రహించాలి. బైబిలు అధ్యయనం చేసేటప్పుడు, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు, ఇతరులకు సహాయం చేసేందుకు మనం తెలుసుకున్న విషయాల్ని ఎలా ఉపయోగించవచ్చో ధ్యానించాలి. అంతేకాక, ‘దైవావేశమువలన కలిగిన ప్రతీలేఖనము ప్రయోజనకరం’ కాబట్టి, మన అధ్యయనంలో ‘దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటను’ చేర్చాలి. (2 తిమోతి 3:16, 17; మత్తయి 4:4) బైబిలు అధ్యయనం చేసేందుకు పట్టుదలతో కృషిచేయడం అవసరం! అయితే అది ఆనందదాయకంగా కూడా ఉంటుంది, అంతేకాక ‘దేవుని లోతైన విషయాలను’ అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు.

అర్థం చేసుకునేందుకు యెహోవా వినయస్థులకు సహాయం చేస్తాడు

5 మీరు పాఠశాల విద్యలో అత్యుత్తమ విద్యార్థిగా లేకపోయినా, మీకు అధ్యయనంచేసే అలవాటు లేకపోయినా ‘దేవుని లోతైన విషయాలను’ అర్థం చేసుకోవడం మీ శక్తికి మించినదని అనుకోవద్దు. యేసు భూపరిచర్య కాలంలో, యెహోవా తన సంకల్పాల అవగాహనను జ్ఞానులకు, వివేకవంతులకు కాదుగానీ, దేవుని సేవకునిచేత బోధించబడగల వినయస్థులైన విద్యలేని పామరులకు వెల్లడిచేశాడు. పాఠశాలలో చదువుకున్నవారితో పోలిస్తే వారు పసిపిల్లల్లాగే ఉన్నారు. (మత్తయి 11:25; అపొస్తలుల కార్యములు 4:13) ‘దేవుడు తనను ప్రేమించు వారికొరకు సిద్ధపరచిన’ వాటిగురించి అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు ఇలా రాశాడు: ‘మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను [‘లోతైన విషయాలను,’ NW] కూడా పరిశోధించును.’—1 కొరింథీయులు 2:9, 10.

6 దేవుని ఆత్మ ‘అన్నిటినీ, దేవుని లోతైన విషయాలను కూడా’ ఎలా పరిశోధిస్తుంది? యెహోవా ప్రతి క్రైస్తవునికి ప్రత్యేకంగా సత్యాన్ని వెల్లడించడానికి బదులు తన సంస్థను నిర్దేశించేందుకు ఆయన తన ఆత్మను ఉపయోగిస్తాడు. ఆ సంస్థ, ఐకమత్యంతో దేవుణ్ణి సేవిస్తున్నవారు బైబిలును అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 20:28; ఎఫెసీయులు 4:3-6) ప్రపంచవ్యాప్తంగా, సంఘాలన్నీ ఒకే విధమైన బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని ఆనందిస్తాయి. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి, ఆ సంఘాలన్నీ బైబిలు బోధలన్నింటినీ పరిశీలిస్తాయి. ‘దేవుని లోతైన విషయాలను’ అర్థం చేసుకునేందుకు అవసరమైన మనోవైఖరిని అలవర్చుకోవడానికి పరిశుద్ధాత్మ సంఘం ద్వారా ప్రజలకు సహాయం చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 5:32.

‘దేవుని లోతైన విషయాల్లో’ ఏమేమి ఉన్నాయి?

7 ‘లోతైన విషయాలు’ అర్థం చేసుకునేందుకు కష్టంగా ఉంటాయని మనం తలంచకూడదు. దేవుని జ్ఞానాన్ని పొందడం చాలా కష్టమైనందుకు కాదుగానీ, యెహోవా తన సంస్థ ద్వారా అందిస్తున్న సహాయాన్ని నిరాకరించేలా సాతాను ప్రజలను మోసగిస్తున్నందుకే చాలామందికి ‘దేవుని లోతైన విషయాల’ జ్ఞానం మరుగు చేయబడింది.—2 కొరింథీయులు 4:3, 4.

8 ‘దేవుని లోతైన విషయాల్లో’ యెహోవా ప్రజల్లో ఎక్కువమంది చక్కగా అర్థం చేసుకునే అంశాలు అంటే వాగ్దాన సంతానాన్ని గురించిన గుర్తింపు, పరలోక నిరీక్షణగల వ్యక్తులను మానవుల్లోనుండి ఎంచుకోవడం, మెస్సీయ రాజ్యం వంటి అనేక సత్యాలు ఉన్నాయని పౌలు ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలోని మూడవ అధ్యాయం చూపిస్తోంది. పౌలు ఇలా రాశాడు: “ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా—అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే.” పౌలు తాను “దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకు” నియమించబడ్డానని చెప్పాడు.—ఎఫెసీయులు 3:5-9.

9 “పరలోకములో . . . సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని” దేవుడు ఉద్దేశించాడని కూడా పౌలు వివరించాడు. (ఎఫెసీయులు 3:8-10) క్రైస్తవ సంఘంతో యెహోవా వ్యవహారాల్లోని జ్ఞానాన్ని గమనించి అర్థం చేసుకోవడం ద్వారా దేవదూతలు ప్రయోజనం పొందుతారు. దేవదూతలు సహితం ఆసక్తి చూపించే విషయాలను అర్థం చేసుకునే ఎంతటి ఆధిక్యత మనకుందో కదా! (1 పేతురు 1:10-12) ఆ తర్వాత పౌలు, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి “సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు” కృషిచేయాలని చెబుతున్నాడు. (ఎఫెసీయులు 3:8, 15) మన అవగాహనను విస్తృతపర్చగల లోతైన విషయాల ఉదాహరణలను కొన్నింటిని మనమిప్పుడు పరిశీలిద్దాం.

లోతైన విషయాల ఉదాహరణలు

10ఆదికాండము 3:15లో ప్రస్తావించబడిన దేవుని పరలోక ‘స్త్రీ సంతానములో’ యేసు ప్రాథమిక భాగమని మనకు తెలుసు. మన అవగాహనను విస్తృతపర్చుకోవడానికి మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘యేసు ఎప్పుడు వాగ్దత్త సంతానమయ్యాడు? ఆయన మానవపూర్వ ఉనికిలోనా, మానవునిగా జన్మించినప్పుడా, బాప్తిస్మం తీసుకున్నప్పుడా లేక ఆయన పునరుత్థానం చేయబడినప్పుడా?’

11 ఆ ప్రవచనంలో తన “స్త్రీ”గా ప్రస్తావించబడిన సంస్థలోని పరలోక భాగం సర్పం తలను చితకకొట్టే సంతానాన్ని కంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వేల సంవత్సరాలు గడచినా సాతానును, అతని కృత్యాలను నాశనంచేసే శక్తిగల సంతానాన్ని దేవుని స్త్రీ కనలేదు. అందువల్ల యెషయా ప్రవచనం ఆమెను “దుఃఖాక్రాంతురాలు” “గొడ్రాలు” అని పిలుస్తోంది. (యెషయా 54:1, 5, 6) చివరకు యేసు బేత్లెహేములో జన్మించాడు. అయితే ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆత్మమూలంగా జన్మించి దేవుని ఆధ్యాత్మిక కుమారుడైనప్పుడు మాత్రమే యెహోవా ఇలా ప్రకటించాడు: “ఈయనే నా కుమారుడు.” (మత్తయి 3:17; యోహాను 3:3) చివరకు ఆ స్త్రీ ‘సంతానపు’ ప్రాథమిక భాగం తనను బయల్పరచుకున్నాడు. ఆ తర్వాత యేసు అనుచరులు కూడా పరిశుద్ధాత్మచేత అభిషేకించబడి దేవుని కుమారులయ్యారు. చాలాకాలం వరకు ‘పిల్లలు కననిదానిలా’ ఉన్న యెహోవా “స్త్రీ,” చివరకు ‘జయగీతమెత్తి’ ఆనందించింది.—యెషయా 54:1; గలతీయులు 3:29.

12 మనకు వెల్లడిచేయబడిన దేవుని లోతైన విషయాల రెండవ ఉదాహరణ, మానవుల్లోనుండి 1,44,000 మందిని ఎన్నుకోవాలని దేవుడు సంకల్పించిన దానికి సంబంధించినది. (ప్రకటన 14:1, 4) ఏ కాలంలోనైనా సరే భూమ్మీద నివసిస్తున్న అభిషిక్తులందరూ తన ఇంటివారికి తగినవేళ “అన్నము” పెడతాడని యేసు చెప్పిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఏర్పడతారనే బోధను మనం అంగీకరిస్తాం. (మత్తయి 24:45) ఈ అవగాహన సరైనదని ఏ బైబిలు వచనాలు నిరూపిస్తున్నాయి? యేసు సాధారణ భావంలో, ఆధ్యాత్మిక పోషణతో తన సహోదరులను బలపర్చే ఏ క్రైస్తవుణ్ణైనా సూచించాడేమో?

13 దేవుడు ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు.” (యెషయా 43:10) అయితే దేవుడు ఆ జనాంగాన్ని తన సేవకునిగా ఉండకుండా తిరస్కరించాడని సా.శ. 33వ సంవత్సరం నీసాను నెల 11వ తేదీన యేసు ఇశ్రాయేలీయుల నాయకులకు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: ‘దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును.’ జనసమూహాలతో యేసు ఇలా అన్నాడు: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 21:43; 23:38) యెహోవా సేవకునిగా ఇశ్రాయేలీయులు ఇటు నమ్మకంగా లేరు, అటు బుద్ధికలిగి లేరు. (యెషయా 29:13, 14) అదేరోజు ఆ తర్వాత యేసు ఇలా ప్రశ్నించాడు: “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” నిజానికి ఆయన ఇలా అడుగుతున్నాడు, ‘బుద్ధిగల ఏ జనాంగం, దేవుని నమ్మకమైన దాసునిగా ఇశ్రాయేలు స్థానాన్ని ఆక్రమిస్తుంది?’ అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని ఉద్దేశించి ఇలా అన్నప్పుడు అపొస్తలుడైన పేతురు దానికి జవాబిచ్చాడు: “మీరు . . . పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతురు 1:3, 4; 2:9) “దేవుని ఇశ్రాయేలు” అయిన ఆ ఆధ్యాత్మిక జనాంగం యెహోవాకు కొత్త సేవకునిగా తయారైంది. (గలతీయులు 6:16) ప్రాచీన ఇశ్రాయేలీయులందరూ ఒక ‘సేవకునిగా’ ఎలా ఏర్పడ్డారో అలాగే ఏ కాలంలోనైనా సరే భూమ్మీద నివసిస్తున్న అభిషిక్త క్రైస్తవులందరూ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఏర్పడతారు. ఆ దేవుని దాసుని ద్వారా “అన్నము” అందుకోవడం మనకెంతటి ఆధిక్యతో కదా!

వ్యక్తిగత అధ్యయనం ఆహ్లాదకరంగా ఉంటుంది

14 లేఖనాల కొత్త అవగాహన మనకు వెల్లడిచేయబడినప్పుడు, అది మన విశ్వాసాన్ని బలపర్చే తీరునుబట్టి మనం ఆనందించమా? అందుకే, కేవలం చదవడం కాదుగానీ బైబిలును అధ్యయనం చేయడం మనకెంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి, మీరు క్రైస్తవ ప్రచురణలు చదువుతున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ అంశం గురించి నేను ఇంతకుముందు గ్రహించినదానికి ఈ వివరణ ఎలా సరిపోతుంది? ఈ ఆర్టికల్‌లో తేల్చిచెప్పిన అంశాలకు మరింత బలాన్ని చేకూర్చగల ఏ అదనపు వచనాల గురించి లేదా వాదనల గురించి నేను ఆలోచించగలను?’ మరింత పరిశోధన అవసరమైతే మీకు జవాబు కావాలనుకునే ప్రశ్నను రాసిపెట్టుకొని, దానిని భవిష్యత్‌ అధ్యయన ప్రణాళికగా చేసుకోండి.

15 మీకు ఏ అధ్యయన ప్రణాళికలు కొత్త అంతర్దృష్టిని పొందే ఆనందాన్నిస్తాయి? ఉదాహరణకు, మానవుల ప్రయోజనార్థం దేవుడు చేసిన వివిధ నిబంధనలను లోతుగా పరిశోధించడం ద్వారా మన అవగాహనను అధికం చేసుకోవచ్చు. యేసుక్రీస్తును సూచించే ప్రవచనాలను అధ్యయనం చేయడం లేదా బైబిల్లోని ప్రవచనార్థక పుస్తకాల్లో ఒక పుస్తకంలోని ప్రతీవచనాన్ని పరిశీలించడం ద్వారా మీరు మీ విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు. మీ భాషలో యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు అనే పుస్తకం అందుబాటులో ఉంటే, దాన్ని ఉపయోగిస్తూ యెహోవాసాక్షుల అధునిక చరిత్రను పునఃసమీక్షించడం కూడా మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. * గతంలో కావలికోటలో ప్రచురించబడిన “పాఠకుల ప్రశ్నలు” అనే శీర్షికను పునఃసమీక్షించడం కొన్ని వచనాలపై మీకు స్పష్టమైన అవగాహననిస్తుంది. ఓ నిర్ధారణకు వచ్చేందుకు ఉపయోగించబడిన లేఖనాధార తర్కాన్ని ప్రత్యేకంగా గమనించండి. ఇది మీ “జ్ఞానేంద్రియములను” సాధకము చేసుకునేందుకు, మీ వివేచనను వృద్ధిచేసుకునేందుకు సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 5:14) మీరు అధ్యయనం చేస్తుండగా, మీ అధ్యయనం మీకు, మీరు సహాయం చేయగలవారికి దీర్ఘకాల ప్రయోజనాలనిచ్చేలా మీ వ్యక్తిగత బైబిలు ప్రతిలో లేదా ఒక కాగితంపై విషయాలను రాసిపెట్టుకోండి.

బైబిలు అధ్యయనాన్ని ఆనందించేందుకు పిల్లలకు సహాయం చేయండి

16 తల్లిదండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక అభిలాషను వృద్ధిచేసేందుకు ఎంతో చేయవచ్చు. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకుండే సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. కుటుంబ బైబిలు అధ్యయనానికి సిద్ధపడేలా ఒక అంశంపై పరిశోధన చేయమని పిల్లలకు అప్పగించి, వారేమి నేర్చుకున్నారో చెప్పమని వారిని అడగవచ్చు. పిల్లలకు తమ విశ్వాసాన్ని కాపాడుకునేలా ఎలా వాదించాలో, తమకు బోధించబడిన విషయాలు సత్యమని ఎలా నిరూపించాలో నేర్చుకునేందుకు వారికి సహాయం చేసే అభ్యాస కార్యక్రమాల్ని కుటుంబ అధ్యయనంలో చేర్చవచ్చు. వాటికి తోడుగా, బైబిలు ప్రాంతాల గురించి బోధించేందుకు, మీ వారపు బైబిలు పఠనంలోని విషయాలను స్పష్టపర్చేందుకు మీరు “మంచి దేశమును చూడండి” * అనే బ్రోషురును ఉపయోగించవచ్చు.

17 వ్యక్తిగత అధ్యయనా ప్రణాళికలు ఆసక్తికరంగానే కాక విశ్వాసాన్ని బలపర్చేవిగా ఉంటాయి, అయితే మీరు సంఘ కూటాలకు సిద్ధపడే సమయాన్ని అవి దోచుకోకుండా జాగ్రత్తపడండి. కూటాలనేవి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా మనకు ఉపదేశించే మరో మార్గం. అయితే సంఘకూటాల్లో అంటే సంఘపుస్తక అధ్యయనం లేదా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో వారపు బైబిలు పఠన ముఖ్యాంశాల భాగమప్పుడు అర్థవంతంగా వ్యాఖ్యానించేందుకు అదనపు పరిశోధన తోడ్పడవచ్చు.

18 దేవుని వాక్యాన్ని లోతుగా వ్యక్తిగత అధ్యయనం చేయడం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మీకు సహాయం చేస్తుంది. అలాంటి అధ్యయన విలువను చూపిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) కాబట్టి, ఆధ్యాత్మిక విషయాల మీ అవగాహనను ప్రగాఢం చేసుకునేందుకు కృషిచేయడం ఉత్తమం. పరిశోధిస్తూ ఉండేవారికి బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: ‘దేవుని గూర్చిన విజ్ఞానము మీకు లభించును.’—సామెతలు 2:4, 5.

[అధస్సూచీలు]

^ పేరా 21 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 23 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు వివరించగలరా?

• ‘దేవుని లోతైన విషయాలు’ అంటే ఏమిటి?

• లోతైన విషయాల మన అధ్యయనం ఎందుకు నిరంతరం సాగుతుంది?

• ‘దేవుని లోతైన విషయాలు’ అర్థం చేసుకునే ఆనందం ఎందుకు క్రైస్తవులందరికీ లభించే అవకాశముంది?

• ‘దేవుని లోతైన విషయాల’ నుండి మీరెలా పూర్తి ప్రయోజనం పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. కొత్త బైబిలు విద్యార్థులు ఆనందించేందుకు కారణమయ్యే కొన్ని బైబిలు సత్యాలు ఏమిటి?

2. దేవుని వాక్యంలోని విషయాలను తెలుసుకునే ఆనందం ఎందుకు ఎల్లకాలం ఉంటుంది?

3. మన నమ్మకాలకున్న కారణాల సమగ్ర అవగాహన మనకెందుకు అవసరం?

4. బైబిలు అధ్యయనంలో ఏమి ఇమిడివుంది?

5. ‘దేవుని లోతైన విషయాలను’ ఎవరు అర్థం చేసుకోవచ్చు?

6. దేవుని ఆత్మ ఎలా “అన్నిటిని” పరిశోధిస్తుంది?

7. చాలామంది ‘దేవుని లోతైన విషయాలను’ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?

8. ఎఫెసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు ఏ లోతైన విషయాలను పేర్కొన్నాడు?

9. ‘దేవుని లోతైన విషయాలను’ అర్థం చేసుకోవడం ఎందుకు ఒక ఆధిక్యత?

10, 11. లేఖనాల ప్రకారం యేసు ఎప్పుడు దేవుని పరలోక ‘స్త్రీ సంతానపు’ ప్రాథమిక భాగమయ్యాడు?

12, 13. భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులందరూ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఏర్పడతారని ఏ లేఖనాలు చూపిస్తున్నాయి?

14. కేవలం చదవడం కాదుగానీ బైబిలు అధ్యయనం చేయడం ఎందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది?

15. ఎలాంటి అధ్యయన ప్రణాళికలు ఆహ్లాదకరంగా ఉండగలవు, అవెలా దీర్ఘకాల ప్రయోజనమివ్వగలవు?

16. బైబిలు అధ్యయనాన్ని ఆనందించేందుకు పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు?

17. మన వ్యక్తిగత బైబిలు అధ్యయన ప్రణాళికల విషయంలో మనమెందుకు సమతుల్యత కలిగివుండాలి?

18. ‘దేవుని లోతైన విషయాల’ అధ్యయనానికి కృషిచేయడం ఎందుకు ఉత్తమం?

[28వ పేజీలోని చిత్రం]

యేసు ఎప్పుడు వాగ్దత్త సంతానమయ్యాడు?

[31వ పేజీలోని చిత్రం]

కుటుంబ అధ్యయనానికి సిద్ధపడేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు పరిశోధనాంశాలు నియమించవచ్చు