కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మాట ఎన్నటికీ తప్పిపోదు

యెహోవా మాట ఎన్నటికీ తప్పిపోదు

యెహోవా మాట ఎన్నటికీ తప్పిపోదు

“మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు . . . అవి అన్నియు మీకు కలిగెను.”—యెహోషువ 23:14.

యెహోషువ ధైర్యసాహసాలుగల సైన్యాధ్యక్షుడు, విశ్వాసి, యథార్థవంతుడు. మోషేతో సన్నిహితంగా మెలిగాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని భీకరారణ్యం దాటించి పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించేందుకు యెహోవా ఆయనను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎంతో గౌరవనీయుడైన ఈ వ్యక్తి తన జీవితపు చరమాంకంలో ఇశ్రాయేలు పెద్దలకు స్ఫూర్తిదాయకమైన వీడ్కోలు ప్రసంగాన్నిచ్చాడు. అది నిస్సందేహంగా, దానిని విన్నవారి విశ్వాసాన్ని బలపర్చింది. అది మీ విశ్వాసాన్నీ బలపర్చగలదు.

2 బైబిల్లో వర్ణించబడినట్లుగా ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: “చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను. అప్పుడతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను—నేను బహు సంవత్సరములు గడచిన ముసలివాడను.”—యెహోషువ 23:1, 2.

3 యెహోషువ అప్పటికి దాదాపు 110 సంవత్సరాల వృద్ధుడు, ఆయన దేవుని ప్రజల చరిత్రలో అత్యంత ఉత్తేజకరమైన కాలాల్లో నివసించాడు. దేవుని మహాకార్యాలకు ప్రత్యక్షసాక్షిగా ఉండడమే కాక, యెహోవా వాగ్దానాలెన్నో నెరవేరడం కూడా ఆయన చూశాడు. కాబట్టే ఆయన తన వ్యక్తిగత అనుభవాన్నిబట్టి పూర్తి నమ్మకంతో ఇలా చెప్పగలిగాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.”—యెహోషువ 23:14.

4 యెహోవా సెలవిచ్చిన ఏ మాటలు యెహోషువ జీవితకాలంలో నెరవేరాయి? యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన మూడు వాగ్దానాలను మనం పరిశీలిద్దాం. మొదటిది, దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించడం. రెండవది, వారిని కాపాడడం. మూడవది, వారిని పోషించడం. యెహోవా తన ఆధునికదిన ప్రజలకు కూడా అలాంటి హామీలనే ఇచ్చాడు, మన జీవితకాలంలో అవి నెరవేరడం మనం చూశాం. అయితే ఆధునిక కాలాల్లో యెహోవా ఏమిచేశాడో చర్చించడానికి ముందు యెహోషువ కాలంలో ఆయన చేసిన పనులను పరిశీలిద్దాం.

యెహోవా తన ప్రజల్ని విడిపించడం

5 ఐగుప్తులో తమ బానిసత్వం కారణంగా ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన వారి ప్రార్థన ఆలకించాడు. (నిర్గమకాండము 2:23-25) మండుతున్న పొదదగ్గర యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఐగుప్తీయుల చేతిలోనుండి [నా ప్రజల్ని] విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా . . . పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను.” (నిర్గమకాండము 3:8) యెహోవా ఈ కార్యం నెరవేర్చడాన్ని చూడడమెంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా! ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్లేందుకు ఫరో నిరాకరించినప్పుడు, దేవుడు నైలునది నీళ్లను రక్తంగా మారుస్తాడని మోషే అతనికి చెప్పాడు. యెహోవా మాట తప్పిపోలేదు. నైలునది నీళ్లు రక్తంగా మారాయి. చేపలు చచ్చాయి, నదీజలాలు త్రాగడానికి పనికిరాకుండా పోయాయి. (నిర్గమకాండము 7:14-21) అయినా ఫరో తన మొండిపట్టు విడవలేదు, అందువల్ల యెహోవా ముందుగా తెలియజేస్తూ మరో తొమ్మిది తెగుళ్లు రప్పించాడు. (నిర్గమకాండము 8-12 అధ్యాయాలు) పదవ తెగులువల్ల ఐగుప్తీయుల మొదటి సంతానం చనిపోయిన తర్వాతే, ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించాడు, వారు అలాగే వెళ్ళిపోయారు.—నిర్గమకాండము 12:29-32.

6 యెహోవా ఇశ్రాయేలీయులను అలా విడిపించడం, ఆయన వారిని తన జనాంగంగా ఎన్నుకొనేందుకు మార్గాన్ని సుగమం చేసింది. అది, యెహోవా వాగ్దానాలు నెరవేర్చే వ్యక్తి అనీ, ఆయన మాట ఎన్నటికీ తప్పిపోదనీ నిరూపిస్తూ ఆయనను ఘనపర్చింది. అది ఇతర జనాంగాల దేవతలపై యెహోవా దేవుని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ విడుదల గురించి చదవడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆ విడుదలను వ్యక్తిగతంగా అనుభవించడం ఎలావుంటుందో ఊహించుకోండి! నిస్సందేహంగా యెహోవాయే ‘సర్వలోకములో మహోన్నతుడని’ యెహోషువ కళ్లారా చూశాడు.—కీర్తన 83:18.

యెహోవా తన ప్రజల్ని కాపాడడం

7 యెహోవా తన ప్రజల్ని కాపాడడమనే రెండవ హామీ విషయమేమిటి? ఇది తాను వారిని ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానని యెహోవా చేసిన వాగ్దానంలో కనబడుతుంది. ఉగ్రుడైన ఫరో వందలాది రథాలతో సన్నద్ధమైన భీకర సైన్యంతో ఇశ్రాయేలీయులను వెంబడించాడనే విషయం గుర్తుచేసుకోండి. ముఖ్యంగా ఇశ్రాయేలీయులు కొండలకు, సముద్రానికి మధ్య చిక్కుకున్నట్లు కనిపించినప్పుడు ఆ అహంభావి వారిని పట్టుకోగలనని దృఢంగా నమ్మివుంటాడు. ఆ సమయంలో దేవుడు జోక్యం చేసుకొని తన ప్రజలకు, సైన్యానికి మధ్య ఒక మేఘస్తంభం నిలబెట్టాడు. ఐగుప్తీయులవైపు చీకటి, ఇశ్రాయేలీయులవైపు వెలుగు ఏర్పడింది. ఆ మేఘం ఐగుప్తీయులు ముందుకు సాగడాన్ని అడ్డుకుంటున్న సమయంలో మోషే తన కర్ర ఎత్తి ఎర్రసముద్రపు నీటిని పాయలుగాచేసి, ఇశ్రాయేలీయులకు తప్పించుకునే మార్గాన్ని, ఐగుప్తీయులు ఉరిలో చిక్కుకునే పరిస్థితిని కల్పించాడు. యెహోవా తన ప్రజలు పరాజయం పొందకుండా కాపాడి, ఫరో భీకరమైన సైనిక దళాల్ని పూర్తిగా హతమార్చాడు.—నిర్గమకాండము 14:19-28.

8 ఎర్రసముద్రం దాటిన తర్వాత, ఇశ్రాయేలీయులు ‘తాపకరమైన పాములును తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన గొప్ప అరణ్యము’ అని వర్ణించబడిన ప్రాంతంలో సంచరించారు. (ద్వితీయోపదేశకాండము 8:15) అక్కడ కూడా యెహోవా తన ప్రజల్ని కాపాడాడు. మరి వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే మాటేమిటి? కనానీయుల బలమైన సైన్యాలు వారిని అడ్డుకున్నాయి. అయినప్పటికీ యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.” (యెహోషువ 1:2, 5, 6) యెహోవా సెలవిచ్చిన ఆ మాటలు తప్పిపోలేదు. దాదాపు ఆరు సంవత్సరాల్లోపే యెహోషువ 31 మంది రాజులను ఓడించి వాగ్దాన దేశంలోని విస్తారమైన ప్రాంతాలను లోబరచుకున్నాడు. (యెహోషువ 12:7-24) యెహోవా శ్రద్ధాపూర్వక కాపుదల లేకుండా ఆ విజయం అసాధ్యమై ఉండేది.

యెహోవా తన ప్రజల్ని పోషించడం

9 యెహోవా తన ప్రజల్ని పోషిస్తాడనే మూడవ హామీని ఇప్పుడు పరిశీలించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల చేయబడిన కొన్నిరోజుల తర్వాత, దేవుడు వారికిలా వాగ్దానం చేశాడు: “నేను ఆకాశము నుండి మీకొరకు ఆహారమును కురిపించెదను . . . ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.” దేవుడు తాను చెప్పినట్లే వారికి ‘ఆకాశమునుండి ఆహారము’ దయచేశాడు. “ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక—ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.” అది మన్నా, అదే యెహోవా వాగ్దానం చేసిన ఆహారం.—నిర్గమకాండము 16:4, 13-15.

10 ఇశ్రాయేలీయులకు ఆహారం, నీళ్ళు అందిస్తూ ఆ అరణ్యంలో యెహోవా వారిపట్ల 40 సంవత్సరాలపాటు శ్రద్ధవహించాడు. వారి బట్టలు పాతబడిపోకుండా, వారి కాళ్లకు వాపురాకుండా కూడా ఆయన చూశాడు. (ద్వితీయోపదేశకాండము 8:3, 4) యెహోషువ ఇదంతా ప్రత్యక్షంగా చూశాడు. యెహోవా తన ప్రజలకు వాగ్దానం చేసినట్లే వారిని విడిపించాడు, కాపాడాడు, పోషించాడు.

ఆధునిక కాలాల్లో విడిపించడం

11 మన కాలం విషయమేమిటి? అప్పట్లో బైబిలు విద్యార్థులకు సారథ్యం వహించిన ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, 1914 అక్టోబరు 2 శుక్రవారం ఉదయం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌ డైనింగ్‌ హాల్‌లోకి వచ్చాడు. హుషారుగా ఆయన “గుడ్‌మార్నింగ్‌ ఆల్‌” అన్నాడు. ఆ తర్వాత తన కుర్చీలో కూర్చోవడానికి ముందు ఆయన ఆనందంగా ఇలా ప్రకటించాడు: ‘అన్యజనుల కాలాలు సంపూర్ణమయ్యాయి; రాజులకివ్వబడిన కాలం ముగిసింది.’ మళ్లీ ఒకసారి, విశ్వాధిపతియైన యెహోవా తన ప్రజల పక్షాన చర్య తీసుకునే సమయం వచ్చింది. ఆయన ఆ చర్య తీసుకున్నాడు.

12 కేవలం ఐదు సంవత్సరాల తర్వాత, యెహోవా తన ప్రజల్ని బలమైన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” నుండి విడిపించాడు. (ప్రకటన 18:2) మనలో చాలా కొద్దిమందిమి ఆ ఉత్తేజకరమైన విడుదలను ప్రత్యక్షంగా చూడగలిగాం. అయినా మనం దాని ఫలితాలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. యెహోవా సత్యారాధనను పునఃస్థాపించి, ఆయనను ఆరాధించాలని కోరుకునేవారిని ఐక్యపరిచాడు. దీనిని యెషయా ప్రవక్త ఇలా ప్రవచించాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును; ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.”—యెషయా 2:2.

13 యెషయా పలికిన మాటలు తప్పిపోలేదు. అభిషిక్త శేషం 1919లో, సత్యదేవుని ఆరాధనను ఉన్నతపర్చిన ప్రపంచవ్యాప్త సాక్ష్యపు పనిని ధైర్యంగా ఆరంభించింది. “వేరే గొఱ్ఱెల” ప్రజలు సమకూర్చబడుతున్నారని 1930లలో స్పష్టమైంది. (యోహాను 10:16) మొదట వేలమంది, ఆ తర్వాత, వందలవేల మంది, ఇప్పుడు లక్షలాదిమంది సత్యారాధన పక్షాన నిలబడుతున్నారు! అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ఒక దర్శనంలో వారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము[గా]” ఉన్నారని వర్ణించబడ్డారు. (ప్రకటన 7:9) మీ జీవితకాలంలో మీరేమి చూశారు? మీరు మొదట సత్యం తెలుసుకున్నప్పుడు భూమ్మీద ఎంతమంది యెహోవాసాక్షులున్నారు? నేడు, యెహోవాను సేవిస్తున్నవారు 67,00,000 కన్నా ఎక్కువున్నారు. యెహోవా తన ప్రజల్ని మహాబబులోను నుండి విడిపించడం ద్వారా, మనమిప్పుడు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్న ఉత్కంఠభరితమైన పురోభివృద్ధికి మార్గం తెరిచాడు.

14 విడుదలకు సంబంధించి యెహోవా చేయాల్సిన పని మరొకటుంది, అది భూమ్మీద నివసిస్తున్న ప్రతీ ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. అద్భుత రీతిలో యెహోవా తన శక్తిని ప్రదర్శిస్తూ వ్యతిరేకులందరినీ నాశనంచేసి, తన ప్రజల్ని విడిపించి వారిని నీతి నివసించే నూతనలోకంలోకి ప్రవేశపెడతాడు. దుష్టత్వం అంతమై, మానవ చరిత్రలోనే అద్భుతమైన కాలారంభాన్ని చూడడం ఎంత ఆనందదాయకం!—ప్రకటన 21:1-4.

మనకాలంలో యెహోవా కాపుదల

15 మనం చూసినట్లుగా, యెహోషువ కాలంలోని ఇశ్రాయేలీయులకు యెహోవా కాపుదల అవసరమైంది. ఆధునిక కాలాల్లోని యెహోవా ప్రజలు వేరుగా ఉన్నారా? లేరు! యేసు తన అనుచరులనిలా హెచ్చరించాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:9) గడచిన సంవత్సరాల్లో చాలాదేశాల్లో యెహోవాసాక్షులు తీవ్ర వ్యతిరేకతను, క్రూరమైన హింసను అనుభవించారు. అయితే యెహోవా తన ప్రజలకు అండగావున్నాడనేది స్పష్టం. (రోమీయులు 8:31) ‘మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమూ’ మన రాజ్య ప్రకటనాపనిని, బోధనా పనిని ఆపుజేయలేదని ఆయన వాక్యం మనకు హామీ ఇస్తోంది.—యెషయా 54:17.

16 యెహోవా ప్రజల్ని లోకం ద్వేషిస్తున్నా వారు వర్ధిల్లుతూవచ్చారు. యెహోవాసాక్షులు 236 దేశాల్లో వర్ధిల్లుతున్నారు. ఇది, మనల్ని నాశనం చేయాలని లేదా మన నోరు నొక్కాలని చూసేవారి నుండి మనల్ని కాపాడేందుకు యెహోవా మనతోవున్నాడనడానికి తిరుగులేని రుజువునందిస్తోంది. మీ జీవితకాలంలో దేవుని ప్రజల్ని తమ అధికార బలంతో తీవ్రంగా అణచిపెట్టిన రాజకీయనాయకుల లేదా మతనాయకుల పేర్లను మీరు గుర్తుచేసుకోగలరా? వారికేమి సంభవించింది? వారిప్పుడు ఎక్కడున్నారు? వారిలో చాలామంది మోషే, యెహోషువల కాలంలోని ఫరోలాగే అంతరించిపోయారు. మరి నమ్మకంగా చనిపోయిన ఆధునిక కాల దేవుని సేవకుల మాటేమిటి? వారు యెహోవా జ్ఞాపకంలో భద్రంగా ఉన్నారు. వారికి అంతకన్నా సురక్షితమైన స్థలం మరొకటి లేదు. కాపుదల విషయంలో యెహోవా మాటలు సత్యమని స్పష్టంగా నిరూపించబడ్డాయి.

యెహోవా నేడు తన ప్రజల్ని పోషించడం

17 యెహోవా తన ప్రజల్ని అరణ్యంలో పోషించాడు, నేడూ ఆయన వారిని పోషిస్తున్నాడు. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ మనల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తున్నాడు. (మత్తయి 24:45) శతాబ్దాలుగా మర్మంగావుంచబడిన ఆధ్యాత్మిక సత్యాల పరిజ్ఞానాన్ని మనం పొందుతున్నాం. దేవదూత దానియేలుతో ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును.”—దానియేలు 12:4.

18 మనమిప్పుడు అంత్యకాలంలో నివసిస్తున్నాం, దేవుని గురించిన జ్ఞానం నిజంగా సమృద్ధిగావుంది. ప్రపంచవ్యాప్తంగా, సత్యాన్ని ప్రేమించేవారిని సత్యదేవుని గురించిన, ఆయన సంకల్పాల గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం పొందేలా పరిశుద్ధాత్మ నడిపించింది. నేడు భూవ్యాప్తంగా బైబిళ్లు, బైబిలులోవున్న అమూల్యమైన సత్యాలను అర్థం చేసుకునేందుకు ప్రజలకు సహాయంచేసే ప్రచురణలు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే అధ్యయన ప్రచురణలోని విషయసూచికను పరిశీలించండి. * ఆ ప్రచురణలోని కొన్ని అధ్యాయాలు ఇలావున్నాయి: “దేవుని గురించిన సత్యం ఏమిటి?,” “చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?,” “దేవుని రాజ్యం అంటే ఏమిటి?,” “దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?” మానవులు వేలాది సంవత్సరాలుగా అలాంటి ప్రశ్నల గురించి యోచించారు? ఇప్పుడు వాటికి జవాబులు అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు అజ్ఞానంలోవున్నా, క్రైస్తవమత సామ్రాజ్యం మతభ్రష్ట బోధలు చేసినా, దేవుని వాక్యం స్థిరంగా ఉండి యెహోవాను సేవించాలని కోరుకునే వారందరినీ పోషిస్తూవుంది.

19 మనం కళ్లారా చూసిన దానినిబట్టి మనం నిశ్చయంగా ఇలా చెప్పవచ్చు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు . . . అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహోషువ 23:14) యెహోవా తన సేవకులను విడిపిస్తాడు, కాపాడతాడు, పోషిస్తాడు. ఆయన వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా ఆయన నియమిత సమయంలో నెరవేరకపోవడాన్ని మీరు చూపించగలరా? చూపించలేరు. నమ్మకమైన దేవుని వాక్యాన్ని మనం జ్ఞానయుక్తంగా విశ్వసిస్తాం.

20 భవిష్యత్తు మాటేమిటి? మనలో ఎక్కువమంది ఆహ్లాదకరమైన పరదైసుగా మార్చబడిన భూమిపై జీవించేందుకు నిరీక్షించవచ్చని యెహోవా మనకు చెప్పాడు. మనలో కొద్దిమందికి క్రీస్తుతోపాటు పరలోకం నుండి పరిపాలించే నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఏదైనా, యెహోషువలాగే నమ్మకంగా ఉండేందుకు మనకు ప్రతీ కారణముంది. మన నిరీక్షణ నిజమయ్యే రోజు వస్తుంది. అప్పుడు యెహోవా చేసిన వాగ్దానాలన్నింటిని జ్ఞాపకం చేసుకొని, మనమూ ఇలా అంటాం: ‘అవి అన్నియు కలిగెను.’

[అధస్సూచి]

^ పేరా 26 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు వివరించగలరా?

• యెహోవా ఇచ్చిన ఏ హామీల నెరవేర్పును యెహోషువ చూశాడు?

• దేవుడిచ్చిన ఏ హామీల నెరవేర్పును మీరు చూశారు?

• దేవుని మాట విషయంలో దేనిగురించి మనం నిశ్చయతతో ఉండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోషువ ఎవరు, ఆయన తన జీవితపు చరమాంకంలో ఏమిచేశాడు?

2, 3. యెహోషువ ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడే సమయానికి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలావుంది, యెహోషువ ఏమిచెప్పాడు?

4. యెహోవా ఇశ్రాయేలీయులకు ఏ వాగ్దానాలు చేశాడు?

5, 6. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఎలా విడిపించాడు, అది దేనిని ప్రదర్శించింది?

7. యెహోవా ఇశ్రాయేలీయులను ఫరో సైన్యం నుండి ఎలా కాపాడాడు?

8. ఇశ్రాయేలీయులు (ఎ) అరణ్యంలో ఉన్నప్పుడు, (బి) వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు, ఎలాంటి కాపుదలను అనుభవించారు?

9, 10. అరణ్యంలో యెహోవా తన ప్రజల్ని ఎలా పోషించాడు?

11. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌లో 1914లో ఏమి జరిగింది, అప్పుడు దేనికి సమయమొచ్చింది?

12. ఏ విడుదల 1919లో సంభవించింది, దాని ఫలితమేమిటి?

13. యెహోవా ప్రజల్లో ఎలాంటి పురోభివృద్ధిని మీరు చూశారు?

14. ఏ విధమైన విడుదల రానైయుంది?

15. ఆధునిక కాలాల్లో యెహోవా కాపుదల ఎందుకవసరం?

16. యెహోవా తన ప్రజల్ని కాపాడతాడనే ఏ రుజువును మీరు చూశారు?

17. ఆధ్యాత్మిక ఆహారం విషయంలో యెహోవా ఏ హామీ ఇచ్చాడు?

18. దేవుని గురించిన జ్ఞానం నేడు సమృద్ధిగా ఉందని ఎందుకు చెప్పవచ్చు?

19. ఏ వాగ్దానాలు నెరవేరడం మీరు చూశారు, ఏ నిర్ధారణకు వచ్చారు?

20. మనమెందుకు భవిష్యత్తు విషయమై నమ్మకంగా ఉండవచ్చు?

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా జోక్యంచేసుకొని తన ప్రజల్ని విడిపించాడు

[23వ పేజీలోని చిత్రం]

ఎర్రసముద్రం దగ్గర యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడాడు?

[24వ పేజీలోని చిత్రం]

అరణ్యంలో యెహోవా తన ప్రజల్ని ఎలా పోషించాడు?

[25వ పేజీలోని చిత్రాలు]

నేడు యెహోవా తన ప్రజలపట్ల శ్రద్ధ కలిగివున్నాడు