కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వినయంగా ఉండడం ఎందుకు కష్టం?

వినయంగా ఉండడం ఎందుకు కష్టం?

వినయంగా ఉండడం ఎందుకు కష్టం?

నేటి లోకంలో వినయంగా ఉండడంవల్ల ప్రయోజనమేమీ లేదని అనేకులు అనుకోవచ్చు. నాయకత్వం వహించేవారు, ఎంతో విజయాన్ని సాధించినట్లు కనిపించేవారు, ఇతరులను కిందకులాగి తాము పైకెదగడానికి ఏమి చేయడానికైనా వెనుకాడని వారు గర్విష్ఠులు, వారు తాము కోరుకున్నదే జరగాలని పట్టుబడతారు. అనేకులు సంపన్నుల, పేరుప్రఖ్యాతలుగలవారి జీవన శైలిని కోరుకుంటారే తప్ప వినయస్థుల, నమ్రతగలవారి జీవన శైలిని కాదు. విజయం సాధించినవారు స్వయంకృషి వల్లే జీవితంలో పైకొచ్చామని గొప్పలు చెప్పుకుంటారు. వినయంగా ఉండే బదులు వారు తమ విజయానికి తామే కారకులమని గర్వంగా చెప్పుకుంటారు.

కెనడాకు చెందిన ఒక పరిశోధకుడు, తన దేశంలో “‘స్వార్థపూరితమైన, అహంకారపూరితమైన వైఖరి’ వృద్ధిచెందడాన్ని” గురించి మాట్లాడాడు. బాధ్యతాయుతంగా జీవించడంకన్నా సరదాగా గడపడమే ప్రాముఖ్యమని అనుకునే సమాజంలో మనం జీవిస్తున్నామని, ఇప్పుడున్న ప్రజల్లో స్వార్థం పెరుగుతోందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి లోకంలో, వినయం అలవర్చుకోదగిన లక్షణమని అనిపించకపోవచ్చు.

వినయస్థులతో మెలగడం సులువు కాబట్టి, ఆ లక్షణం ఇతరుల్లో ఉంటేనే బాగుంటుందని అనేకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, మనం జీవిస్తున్న ఈ పోటీ ప్రపంచంలో వినయస్థులుగా ఉంటే, ఇతరులు తమను బలహీనులుగా ఎంచుతారని కొంతమంది భయపడతారు.

మనకాలంలోని ప్రజలు ‘బింకములాడువారిగా, అహంకారులుగా’ ఉంటారని దేవుని వాక్యమైన బైబిలు ముందే తెలియజేసింది. (2 తిమోతి 3:1, 2) ఈ ప్రవచనం నెరవేరుతోందని మీరు ఒప్పుకోరా? వినయంగా ఉండడంవల్ల ప్రయోజనముందని మీరనుకుంటున్నారా? లేదా వినయస్థుడు బలహీనుడిగా పరిగణించబడతాడనీ, ఇతరులు తమ స్వార్థంకోసం అతణ్ణి బాగా ఉపయోగించుకుంటారనీ మీరనుకుంటున్నారా?

నిజానికి బైబిలు వినయాన్ని విలువైనదిగా ఎంచేందుకు, దాన్ని అలవర్చుకునేందుకు బలమైన కారణాలను ఇస్తోంది. బైబిలు, ఆ లక్షణాన్ని సమతూకమైన దృక్కోణంలో వివరించడమేకాక, అది ప్రజలు అలవర్చుకోవాల్సిన లక్షణమని చెబుతోంది. నిజమైన వినయం ఒక బలమే గానీ బలహీనత ఎంతమాత్రం కాదని అది చూపిస్తుంది. అది ఎందుకు ఒక బలమో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

[3వ పేజీలోని చిత్రం]

మన విజయాల గురించి మనమెలా భావించాలి?