కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వెండి నాది, బంగారు నాది”

“వెండి నాది, బంగారు నాది”

“వెండి నాది, బంగారు నాది”

పర్షియా రాజైన కోరెషు, సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో దేవుని ప్రజలను బబులోను చెర నుండి విడిపించాడు. శిథిలావస్థలో ఉన్న యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించడానికి వేలాదిమంది యెరూషలేముకు తిరిగివచ్చారు. అలా తిరిగి వచ్చినవారి ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉండడమే కాక వైరీభావంగల పొరుగువారి నుండి పునర్నిర్మాణ పనికి వ్యతిరేకత కూడా ఎదురైంది. అందుకే నిర్మాణపనిలో భాగం వహించిన కొందరు ఆ బృహత్కార్యం ఎప్పటికైనా ముగుస్తుందా అని అనుకున్నారు.

యెహోవా తన ప్రవక్తైన హగ్గయి ద్వారా నిర్మాణపనిలో పాల్గొంటున్నవారికి తాను వారి పక్షాన ఉన్నాననే అభయమిచ్చాడు. “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును” అని దేవుడు చెప్పాడు. నిర్మాణ పనిలో పాల్గొంటున్నవారి ఆర్థిక చింతల విషయంలో హగ్గయి ఈ సందేశాన్ని అందించాడు: “‘వెండి నాది, బంగారు నాది;’ ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” (హగ్గయి 2:7-9) హగ్గయి ఈ ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడిన తర్వాత ఐదు సంవత్సరాల్లోనే ఆలయ నిర్మాణం పూర్తైంది.—ఎజ్రా 6:13-15.

ఇటీవలి కాలాల్లో యెహోవా ఆరాధనకు సంబంధించిన పెద్ద పథకాల్లో పాల్గొంటున్నప్పుడు హగ్గయి మాటలు దేవుని సేవకులను కూడా ప్రోత్సహించాయి. 1879లో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి, అప్పట్లో జాయన్స్‌ వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెజెన్స్‌ అని పిలవబడిన ఈ కావలికోట పత్రికను ప్రచురించడం ప్రారంభించినప్పుడు దానిలో ఈ వాక్యం ఉంది: “‘జాయన్స్‌ వాచ్‌టవర్‌’కు యెహోవా మద్దతు ఉందని మేము నమ్ముతున్నాం, అదే నిజమైతే ఈ పత్రిక ఎన్నడూ మద్దతు కోసం వ్యక్తులను యాచించదు, అర్థించదు. ‘పర్వతాల వెండి, బంగారాలన్నీ నావేగదా’ అని చెప్పినవాడు అవసరమైన నిధులను అందించకపోతే, పత్రికను నిలిపేయాల్సిన సమయం వచ్చిందని మేము అనుకుంటాం.”

ఈ పత్రిక ఎన్నడూ నిలిపివేయబడలేదు. మొదటి సంచిక, కేవలం ఆంగ్లంలోనే 6,000 కాపీలు ముద్రించబడ్డాయి. నేడు, ప్రతీ సంచిక, 161 భాషల్లో సగటున 2,85,78,000 కాపీలు ముద్రించబడుతోంది. * దాని జత పత్రికైన తేజరిల్లు! 81 భాషల్లో సగటున 3,42,67,000 కాపీలు ముద్రించబడుతోంది.

విశ్వసర్వాధిపతిగా యెహోవాను ఘనపరచి, ఆయన రాజ్యం గురించిన సువార్తను ప్రకటించాలన్నది కావలికోట పత్రిక లక్ష్యం. అదే లక్ష్యమున్న అనేక పథకాలను యెహోవాసాక్షులు చేపడుతున్నారు. (మత్తయి 24:14; ప్రకటన 4:10) 1879లో ఈ పత్రిక వ్యక్తంచేసిన దృఢవిశ్వాసాన్నే నేటి సాక్షులు కూడా కనబరుస్తున్నారు. దేవుడు తమ పనికి మద్దతునిస్తున్నాడనీ, ఆయన ఆశీర్వాదమున్న పథకాలకు నిధులు అందుబాటులో ఉంటాయనీ వారు నమ్ముతున్నారు. అయితే వాస్తవానికి, యెహోవాసాక్షుల పనులకు ఆర్థిక సహాయం ఎలా లభిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి వారు ఎలాంటి పథకాలను చేపడుతున్నారు?

వారి పనికి ఆర్థిక సహాయం ఎలా లభిస్తుంది?

యెహోవాసాక్షులు ప్రకటనాపనిలో పాల్గొంటున్నప్పుడు, వారు సాధారణంగా ఈ ప్రశ్న వింటుంటారు: “ఈ పనికి మీకు జీతం ఇస్తారా?” లేదనేదే దానికి జవాబు. వారు తమ సమయాన్ని ఉచితంగా వెచ్చిస్తారు. ఈ సువార్తికులు కృతజ్ఞతతో పురికొల్పబడతారు కాబట్టి వారు యెహోవా గురించి, మెరుగైన భవిష్యత్తుకు సంబంధించిన బైబిలు వాగ్దానం గురించి ఇతరులతో అనేక గంటలు మాట్లాడతారు. దేవుడు తమకు చేసిన మేలుల విషయంలో, సువార్త సందేశం తమ సొంత జీవితాలను, దృక్పథాలను ఎంతగా మెరుగుపర్చిందనే విషయంలో కృతజ్ఞత కనబరుస్తారు. అందుకే, వారు ఆ మంచి విషయాలను ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. అలా చేయడం ద్వారా వారు యేసు చెప్పిన ఈ సూత్రాన్ని అనుసరిస్తారు: “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (మత్తయి 10:8) యెహోవాకు, యేసుకు సాక్షులుగా ఉండాలనే వారి కోరిక, తాముండే ప్రాంతాలకు దూరంగా నివసిస్తున్నవారితోసహా ప్రజలతో తమ నమ్మకాలను పంచుకోవడానికి తమ సొంత డబ్బు ఖర్చు చేయడానికి వారిని ప్రోత్సహిస్తుంది.—యెషయా 43:10; అపొస్తలుల కార్యములు 1:8.

ఈ ప్రకటనా పని విస్తృతంగా చేయబడుతుంది కాబట్టి దానిని నిర్వర్తించడానికి కావాల్సిన ముద్రణాలయాలు, కార్యాలయాలు, అసెంబ్లీ హాళ్లు, మిషనరీ గృహాలు మొదలైనవాటిని నిర్వహించడానికి ఎంతో ఖర్చౌతుంది. వాటన్నిటికీ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? వాటన్నిటికీ ఆర్థిక సహాయం స్వచ్ఛంద విరాళాల నుండి వస్తుంది. యెహోవాసాక్షులు, సంస్థాగత కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి డబ్బు ఇవ్వమని సంఘ సభ్యులను కోరరు, అలాగే తాము పంచిపట్టే ప్రచురణలకు డబ్బులు వసూలు చేయరు. తమ విద్యాసంబంధ కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి ఎవరైన విరాళాలు ఇవ్వదలిస్తే సాక్షులు దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి చేయబడుతున్న ప్రయత్నాలకు సంబంధించిన కేవలం ఒక అంశమైన అనువాదంలో ఏమి ఇమిడివుందో మనం పరిశీలిద్దాం.

437 భాషల్లో ప్రచురణలు

అనేక దశాబ్దాలుగా, ప్రపంచంలో అత్యంత విస్తృతంగా అనువదించబడుతున్న ప్రచురణల్లో యెహోవాసాక్షుల ప్రచురణలు ఉన్నాయి. కరపత్రాలు, బ్రోషుర్లు, పత్రికలు, పుస్తకాలు 437 భాషల్లోకి అనువదించబడ్డాయి. సువార్త ప్రకటనా పనిలో ఇమిడివున్న ఇతర కార్యకలాపాల్లాగే అనువాదపు పనికి కూడా ఎన్నో వనరులు కావాలి. అసలు అనువాదపు పని ఎలా జరుగుతుంది?

యెహోవాసాక్షుల ప్రచురణల సంపాదకులు ఒక ఆంగ్ల ఆర్టికల్‌లో ఏ అంశాలను ప్రచురించాలనేది నిర్ణయించిన తర్వాత, మూలపాఠం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిక్షిత అనువాదకుల బృందాలకు ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా అందిస్తారు. ప్రతీ అనువాద బృందం తమ భాషలో ముద్రించబడుతున్న ప్రచురణల విషయంలో బాధ్యత వహిస్తుంది. వారు చేస్తున్న ప్రాజెక్టుల సంఖ్యనుబట్టి, తాము అనువదిస్తున్న భాష సంక్లిష్టతనుబట్టి అంటే లక్ష్యభాష సంక్లిష్టతనుబట్టి ఈ బృందాల్లో ఒక్కోదానిలో దాదాపు 5 నుండి 25 మంది వరకు అనువాదకులు ఉండొచ్చు.

అనువదించబడిన సమాచారాన్ని మూలభాషతో పోల్చిచూసి, తప్పులు దిద్దుతారు. మూలభాషలో ఉన్న తలంపులను సాధ్యమైనంత ఖచ్చితంగా, స్పష్టంగా తెలియజేయడమే దాని లక్ష్యం. వివిధ కారణాలనుబట్టి ఇది కష్టమైన పనే. ప్రత్యేక పదాలున్న మూలపాఠాన్ని అనువదిస్తున్నప్పుడు, అనువాదకులు, ప్రూఫ్‌రీడర్లు సమాచారం ఖచ్చితంగా అందజేయబడేలా చూడడానికి మూలభాషలో (ఆంగ్లంలో, లేక ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌ వంటి ద్వితీయ మూలభాషల్లో) మాత్రమే కాక, లక్ష్యభాషలో కూడా ఎంతో పరిశోధన చేయాల్సివస్తుంది. ఉదాహరణకు, తేజరిల్లు!లోని ఒక ఆర్టికల్‌ ఒక సాంకేతిక లేక చారిత్రక విషయం గురించి చర్చిస్తుంటే, అనువాదకులు ఎంతో పరిశోధన చేయల్సివస్తుంది.

యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో అనేకమంది పూర్తికాల లేక పార్ట్‌టైం అనువాదకులుగా పనిచేస్తారు. ఇతరులు లక్ష్యభాష మాట్లాడబడే ప్రాంతంలో పనిచేస్తారు. అనువాదకులు తాము చేస్తున్న పనికి జీతం తీసుకోరు. పూర్తికాల అనువాదకులకు గృహ, భోజన వసతులతోపాటు వారి కనీస అవసరాలకు కొంత అలవెన్సు మాత్రమే లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,800 మంది సాక్షులు అనువాదకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యెహోవాసాక్షుల 98 బ్రాంచి కార్యాలయాల్లో అనువాద బృందాలు ఉన్నాయి లేదా ఆ బ్రాంచి కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లోవున్న అనువాద బృందాలను పర్యవేక్షిస్తున్నాయి. ఉదాహరణకు, రష్యా బ్రాంచి 30 కన్నా ఎక్కువ భాషల్లో అనువదించే 230 కన్నా ఎక్కువమంది పూర్తికాల లేక పార్ట్‌టైం అనువాదకులను పర్యవేక్షిస్తోంది, ఆ భాషల్లో రష్యా వెలుపల అంతగా తెలియని చువాశ్‌, ఒస్సెటియన్‌, వీగుర్‌ వంటి కొన్ని భాషలు కూడా ఉన్నాయి.

అనువాద నాణ్యతను మెరుగుపర్చడం

సంక్లిష్టమైన భావాలను ఖచ్చితంగా అనువదించడం తేలికైన పనేమీ కాదని, ఎప్పుడైనా మరో భాషను నేర్చుకునే ప్రయత్నం చేసినవారికి తెలుస్తుంది. మూలభాషలో ఉన్న వాస్తవాలను, భావాలను లక్ష్యభాషలోకి ఖచ్చితంగా అనువదించడమే కాక అది మొదట లక్ష్యభాషలోనే రాయబడిందన్నట్లుగా సహజంగా ఉండేలా అనువదించడమే అనువాద లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం ఒక కళ. క్రొత్త అనువాదకులు అనువాదంమీద పట్టుసాధించడానికి అనేక ఏళ్లు పడుతుంది, యెహోవాసాక్షులు వారికి నిరంతరం కొనసాగే శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అనువాద నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ఉపయోగించడంలో చేయూతనివ్వడానికి కొన్నిసార్లు అనువాద బృందాలను ఉపదేశకులు సందర్శిస్తారు.

ఈ శిక్షణ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఉదాహరణకు, యెహోవాసాక్షుల నికరాగ్వా బ్రాంచి ఇలా నివేదిస్తోంది: “మొదటిసారిగా, మా మిస్కిటో అనువాదకులు మెక్సికో బ్రాంచి నుండి వచ్చిన ఉపదేశకుడి నుండి అనువాద విధానాలు, నైపుణ్యాల విషయంలో శిక్షణ పొందారు. మా అనువాదకులు పనిచేసే తీరును అది ఎంతగానో ప్రభావితం చేసింది. అనువాద నాణ్యత ఎంతో మెరుగుపడింది.”

హృదయాన్ని స్పృశించే పదాలు

ప్రజల హృదయాలను స్పృశించడానికే వారి మాతృభాషలో బైబిలు, బైబిలు ఆధారిత సాహిత్యాలు అనువదించబడతాయి, ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతోంది. 2006లో క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదము బల్గేరియన్‌ భాషలో విడుదల చేయబడడం చూసి బల్గేరియాలోని యెహోవాసాక్షులు పులకించిపోయారు. ఆ బైబిలును అనువదించినందుకు అనేకమంది తమ కృతజ్ఞతను తెలియజేశారని బల్గేరియా బ్రాంచి నివేదిస్తోంది. “ఇప్పుడు బైబిలు కేవలం తమ మనసులనే కాక హృదయాలను కూడా స్పృశిస్తోంది” అని సంఘ సభ్యులు చెబుతున్నారు. సోఫియా నగరవాసి అయిన ఒక వృద్ధుడు ఇలా చెప్పాడు: “నేను అనేక సంవత్సరాలుగా బైబిలును చదువుతున్నాను, అయితే ఇంత సులభంగా అర్థం చేసుకోగల, హృదయాన్ని ఇంతగా స్పృశించగల అనువాదాన్ని ఇప్పటివరకు చదవలేదు.” అలాగే, అల్బేనియాలో, ఒక స్థానిక సాక్షి పూర్తి నూతనలోక అనువాదము బైబిలు ప్రతిని అల్బేనియన్‌భాషలో అందుకున్న తర్వాత ఇలా అంది: “అల్బేనియన్‌భాషలో దేవుని వాక్యం ఎంతో అద్భుతంగా ఉంది! మా మాతృభాషలో యెహోవా మాతో మాట్లాడడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా!”

ఒక అనువాద బృందం పూర్తి బైబిలును అనువదించడానికి ఎన్నో ఏళ్లు పట్టవచ్చు. అయితే, మొదటిసారిగా లక్షలాదిమంది దేవుని వాక్యాన్ని నిజంగా అవగాహన చేసుకోగలిగినప్పుడు వారు చేసిన కృషికి తగిన ఫలితం లభించిందని చెప్పవచ్చు కదా!

‘మనం దేవుని జతపనివారం’

సువార్తను సమర్థంగా ప్రకటించడానికి అవసరమైన అనేక కార్యకలాపాల్లో అనువాదం కేవలం ఒకటి. బైబిలు ఆధారిత ప్రచురణలను రాయడం, ముద్రించడం, షిప్పింగు చేయడంతోపాటు యెహోవాసాక్షుల బ్రాంచీలకు, సర్క్యూట్‌లకు, సంఘాలకు సంబంధించిన అనేక కార్యకలాపాలను నిర్వర్తించడానికి ఎంతో కృషి, డబ్బు అవసరం. అయినా దేవుని ప్రజలు ఈ పనులను చేయడానికి “ఇష్టపూర్వకముగా” ముందుకు వస్తున్నారు. (కీర్తన 110:3) తమ వంతు కృషి చేయగలగడాన్ని వారు ఒక ఆధిక్యతగా భావిస్తున్నారు. వారు చేస్తున్న కృషిని బట్టి యెహోవా వారిని తన “జతపనివారిగా” పరిగణిస్తున్నాడు, దీన్ని వారు ఒక గౌరవంగా దృష్టిస్తున్నారు.—1 కొరింథీయులు 3:5-9.

నిజమే, “వెండి నాది, బంగారు నాది” అని చెప్పే వ్యక్తి తన పనిని నెరవేర్చడానికి మన ఆర్థిక సహాయంమీద ఆధారపడడు. ప్రాణరక్షక సత్యాలను “సకల జనములకు” ప్రకటించే పనికి డబ్బు రూపేణా విరాళాలు ఇవ్వడం ద్వారా తన నామాన్ని పరిశుద్ధపరచడంలో భాగం వహించే ఆధిక్యత యెహోవా తన సేవకులకు ఇచ్చి వారిని ఘనపర్చాడు. (మత్తయి 24:14; 28:19, 20) మళ్లీ ఎన్నడూ పునరావృతంకాని ఈ పనికి మద్దతునిచ్చేందుకు శాయశక్తులా కృషి చేయడానికి మీరు ప్రోత్సహించబడడంలేదా?

[అధస్సూచి]

^ పేరా 5 ప్రచురించబడుతున్న భాషల కోసం, ఈ పత్రికలోని 2వ పేజీ చూడండి.

[18వ పేజీలోని బాక్సు]

“అవి తీవ్రంగా ఆలోచింపజేస్తాయి”

యెహోవాసాక్షుల కామెరూన్‌ బ్రాంచికి 14 ఏళ్ల యువతి ఇలా రాసింది: “పాఠశాలలో సంవత్సరానికి సరిపడా పుస్తకాలు కొన్న తర్వాత, గత ఏడాదిలో ఉపయోగించిన రెండు పాఠ్యపుస్తకాలను 2,500 ఫ్రాంకులకు [5 యు.ఎస్‌. డాలర్లు] అమ్మగలిగాను. నేను ఈ మొత్తాన్ని, నేను దాచిపెట్టుకున్న మరో 910 ఫ్రాంకులను [1.82 యు.ఎస్‌. డాలర్లు] విరాళంగా పంపిస్తున్నాను. మీరు చేస్తున్న మంచిపనిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రచురిస్తున్నందుకు కృతజ్ఞతలు. అవి తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.”

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒక ప్రత్యేక విరాళం

చియాపాస్‌ రాష్ట్రంలో నివసిస్తున్న, కృతజ్ఞతగల ఆరేళ్ల అబ్బాయి మ్యాన్వెల్‌ నుండి యెహోవాసాక్షుల మెక్సికో బ్రాంచికి కింది ఉత్తరం అందింది. ఆయనకు రాయడం ఇంకా రాదు కాబట్టి ఆ అబ్బాయి స్నేహితుడు అతనికోసం ఉత్తరం రాసిపెట్టాడు. మ్యాన్వెల్‌ ఇలా అంటున్నాడు: “మా అమ్మమ్మ నాకు ఒక ఆడపందిని ఇచ్చింది. అది పిల్లలు పెట్టినప్పుడు నేను వాటిలో చక్కగా ఉన్న ఒక పందిపిల్లను ఎంపికచేసుకుని సంఘంలోని సహోదరుల సహాయంతో పెంచాను. ఆ తర్వాత ఆ పందిని అమ్మినప్పుడు అది 220 పౌండ్లు [100 కిలోలు] తూగింది, దానికి నాకు 1,250 పెసోలు [110 యు.ఎస్‌. డాలర్లు] దొరికాయి. ఆ డబ్బును ఎంతో ప్రేమతో విరాళంగా పంపిస్తున్నాను. దయచేసి ఈ డబ్బును యెహోవా సేవ కోసం ఉపయోగించండి.”

[19వ పేజీలోని బాక్సు]

‘బైబిలు అనువదించడానికి దీనిని ఉపయోగించండి’

యుక్రెయిన్‌లో జరిగిన యెహోవాసాక్షుల 2005 జిల్లా సమావేశాల్లో, క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదము యుక్రేనియన్‌ భాషలో విడుదల చేయబడింది. ఆ తర్వాతి రోజు సమావేశపు చందాపెట్టెలో ఈ చీటీ కనిపించింది: “నాకు తొమ్మిదేళ్లు. గ్రీకు లేఖనములు ప్రచురించినందుకు కృతజ్ఞతలు. పాఠశాలకు బస్సులో వెళ్ళమని మా అమ్మ నాకూ మా తమ్ముడికీ ఈ డబ్బు ఇచ్చింది. అయితే వర్షం కురవనప్పుడు మేము పాఠశాలకు నడుచుకుంటూవెళ్లి ఈ 50 గ్రివిన్యాలను [10 యు.ఎస్‌. డాలర్లను] దాచిపెట్టాం. పూర్తి బైబిలును యుక్రేనియన్‌ భాషలోకి అనువదించడానికి ఈ డబ్బును ఉపయోగించమని నేనూ, మా తమ్ముడూ కోరుతున్నాం.”

[20, 21వ పేజీలోని బాక్సు]

కొందరు ఇవ్వడానికి ఎంచుకునే పద్ధతులు

ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు

అనేకులు దానికోసం నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించి, “ప్రపంచవ్యాప్తపని కోసం విరాళాలు—మత్తయి 24:14” అని రాయబడిన బాక్సుల్లో వేస్తారు.

ప్రతీనెలా సంఘాలు ఆ విరాళాల్ని ఆయా దేశాల్లోని పని చేస్తున్న యెహోవాసాక్షుల కార్యాలయాలకు పంపిస్తాయి. స్వచ్ఛందంగా డబ్బు రూపంలో పంపించే విరాళాలు కూడా నేరుగా అక్కడికే పంపించవచ్చు. బ్రాంచి కార్యాలయాల చిరునామాలను మీరు ఈ పత్రికలోని 2వ పేజీలో కనుగొనవచ్చు. పై చిరుమానాలకు పంపించే చెక్కులను “Watch Tower” పేరున రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను సహితం విరాళంగా పంపించవచ్చు. వాటితోపాటు మీరే వాటిని పూర్తిగా ఇస్తున్నట్లు సంక్షిప్తంగా ఉత్తరంలో రాసి పంపించాలి.

షరతుపై విరాళ ట్రస్టు ఏర్పాటు  *

ప్రపంచవ్యాప్త పని కోసం ఉపయోగించడానికి వాచ్‌టవర్‌ ట్రస్టులో జమచేయవచ్చు. అయితే కోరుకున్నప్పుడు జమచేయబడిన డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. మరింత సమాచారం కోసం, మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

దానధర్మ ప్రణాళిక  *

ప్రపంచవ్యాప్తంగా రాజ్యసేవ ప్రయోజనార్థం డబ్బు రూపేణ మాత్రమే కాక ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ ఖాతాలకు లబ్ధిదారుగా Watch Towerను సూచించవచ్చు లేదా మరణానంతరం నగదును Watch Towerకు చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు పూర్తి కానుకగా ఇవ్వవచ్చు.

స్థలాలు: అమ్మదగిన స్థలాలను పూర్తి కానుకగా ఇవ్వవచ్చు లేదా అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించే ఏర్పాటుతో విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన దస్తావేజులను రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటులో ఒక వ్యక్తి డబ్బును లేదా డబ్బు హామీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న నిర్దిష్ట కార్పోరేషన్‌కు బదిలీ చేస్తాడు. దానికి బదులుగా ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యం పొందుతాడు. దాత వార్షికభత్య విరాళ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్ట్‌లు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా రాయవచ్చు, లేక ఒక ట్రస్ట్‌ అగ్రిమెంట్‌ ప్రకారం Watch Tower లబ్ధిదారుగా సూచించవచ్చు. కొన్ని దేశాల్లో, ఒక మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల కొన్ని పన్ను చెల్లింపు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, భారతదేశంలో మాత్రం అలాంటి ప్రయోజనాలు ఉండవు.

“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వడానికి దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళిక వేసుకున్న తర్వాత, ఇవ్వడానికి సంబంధించిన పద్ధతుల్లో ఏదోక దానిని ఉపయోగించి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక * అనే బ్రోషుర్‌ ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషుర్‌ తెలియజేస్తుంది. ఆ బ్రోషుర్‌ను చదివి, తమ స్వంత న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా జరిగే యెహోవాసాక్షుల పనికి మద్దతునివ్వగలిగారు, అదే సమయంలో అలా చేయడం ద్వారా పన్ను చెల్లింపు మినహాయింపును అధికం చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన చిరునామాకు ఫోన్‌ చేయడం లేక ఉత్తరం రాయడం ద్వారానో యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు లేదా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Jehovah’s Witnesses,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[అధస్సూచీలు]

^ పేరా 40 ఇది ఇండియాకు వర్తించదు

^ పేరా 42 గమనిక: పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పన్ను నియమం, ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి మీ అకౌంటెంట్‌ను లేక వకీలును సంప్రదించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని కూడా సంప్రదించండి.

^ పేరా 50 ఇండియాలో లభ్యంకాదు

[19వ పేజీలోని చిత్రాలు]

మిస్కిటో అనువాదకులు, నికరాగ్వా బ్రాంచి